దేవుని రాజ్యం—మీరు దాన్ని గ్రహిస్తున్నారా?
“మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు.”—మత్తయి 13:23.
1. ‘పరలోక రాజ్యాన్ని’ గూర్చిన కొన్ని సామాన్యమైన నమ్మకాలు ఏవి?
దేవుని రాజ్యం అంటే ఏమిటో మీరు ‘గ్రహించారా’? ‘పరలోక రాజ్యాన్ని’ గూర్చిన సిద్ధాంతాలు శతాబ్దాలుగా పూర్తిగా పొంతన లేకుండా ఉన్నాయి. మతమార్పిడి సమయంలో, ఒకవ్యక్తి హృదయమందు దేవుడు ఉంచబోయేదే రాజ్యం అని నేడు కొంతమంది చర్చి సభ్యుల సామాన్యమైన నమ్మకం. ఇతరులు దానిని, మరణించిన తర్వాత నిత్య ఆశీర్వాదాల్ని అనుభవించడానికి మంచి ప్రజలు వెళ్లే స్థలమని భావిస్తారు. క్రైస్తవ బోధల్ని మరియు ఆచారాల్ని సామాజిక, ప్రభుత్వపరమైన వ్యవహారాల్లోకి ప్రవేశపెట్టడాన్కి మానవులు పాటుపడడం ద్వారా భూమిపై రాజ్యాన్ని తీసుకురావడాన్ని దేవుడు వారికి విడిచిపెట్టాడని మరి కొంతమంది చెబుతారు.
2. దేవుని రాజ్యాన్ని బైబిలు ఏవిధంగా వివరిస్తోంది, అది దేనిని నెరవేరుస్తుంది?
2 అయితే, దేవుని రాజ్యం భూమిపైనున్న ఓ సంస్థ కాదని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది. అది ఓ హృదయ పరిస్థితీ కాదు లేక మానవ సమాజం యొక్క క్రైస్తవత్వీకరణా కాదు. నిజమే, ఈ రాజ్యం ఏమిటి అనే దానిని గూర్చిన సరియైన అవగాహన, దానియందు విశ్వాసముంచే వారి జీవితాల్లో గొప్ప మార్పుల్ని చేసుకోవడానికి నడిపిస్తుంది. కానీ పాప మరణాల ప్రభావాల్ని నిర్మూలించి భూమిపై నీతియుక్తమైన పరిస్థితుల్ని పునఃస్థాపించడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చే, దైవికంగా స్థాపించబడిన పరలోక ప్రభుత్వమే ఆ రాజ్యం. ఇప్పటికే ఈ రాజ్యం పరలోకంలో అధికారాన్ని పొందింది మరి త్వరలోనే “అది ముందు చెప్పిన [మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44; ప్రకటన 11:15; 12:10.
3. యేసు తన పరిచర్యను ఆరంభించినప్పుడు, మానవుల కొరకు ఏది తెరవబడింది?
3 చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్ ఇలా వ్రాశాడు: “యేసు బోధలలో ప్రధానమైనది, క్రైస్తవ మత సిద్ధాంతాల్లో అతి చిన్న పాత్రను నిర్వహిస్తున్నదీ అయిన ఈ పరలోక రాజ్య సిద్ధాంతం, మానవ ఆలోచనను రేకెత్తించి, మార్చివేసిన అత్యంత విప్లవాత్మకమైన సిద్ధాంతాల్లో నిశ్చయంగా ఒకటి.” “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందం”డి, అనేదే ప్రారంభం నుండీ యేసు పరిచర్య యొక్క మూలాంశం. (మత్తయి 4:17) ఆయన భూమిపై ఉన్నప్పుడు, అభిషేకింపబడిన రాజుగా ఉన్నాడు, ఆ రాజ్య ఆశీర్వాదాల్ని పంచుకోవడానికే గాక ఆ రాజ్యమందు యేసుతోపాటు సహపరిపాలకులుగా, యాజకులుగా ఉండేందుకు కూడా మానవులకు ఇప్పుడు మార్గం తెరవబడి ఉండడం ఆనందాల్లోకెల్లా ఆనందమైవుంది.—లూకా 22:28-30; ప్రకటన 1:6; 5:10.
4. మొదటి శతాబ్దంలో, “రాజ్య సువార్త”కు అనేకులు ఎలా ప్రతిస్పందించారు, అది ఏ తీర్పుకి నడిపించింది?
4 పులకరింపజేసే “రాజ్యమును గూర్చిన సువార్త”ను అనేకులు విన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే విశ్వసించారు. మత నాయకులు “మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూ”సి వేయడమే పాక్షికంగా దీనికి కారణం. వారు తమ అబద్ధ బోధలచే “జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని”పోయారు. అనేకమంది ప్రజలు యేసును మెస్సీయగానూ దేవుని రాజ్యానికి అభిషేకింపబడిన రాజుగానూ తిరస్కరించినందున, ఆయన వారితో “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని” చెప్పాడు.—మత్తయి 4:23; 21:43; 23:13, 14; లూకా 11:52.
5. యేసు ఉపమానాల్ని వినిన అనేకులు తాము అవగాహనతో వినలేదని ఎలా చూపించారు?
5 యేసు ఒక సందర్భంలో ఓ పెద్ద గుంపుకి బోధిస్తున్నప్పుడు, గుంపుల్ని పరీక్షించేందుకు మరియు రాజ్యం విషయంలో పైపై ఆసక్తి మాత్రమే కల్గివున్నవారిని వేరుచేసేందుకు తన వాడుక చొప్పున ఉపమానాల పరంపరను ఉపయోగించాడు. మొదటి ఉపమానం, నాలుగు రకాలైన నేలల్లో విత్తనాల్ని విత్తిన విత్తువానిని గూర్చినది. మొదటి మూడు రకాల నేలలు మొక్కలు ఎదగడానికి అనుకూలమైనవి కావు కాని చివరి నేల మంచి ఫలాల్ని ఫలింపజేసిన “మంచి నేల.” ఆ చిన్న ఉపమానం ఈ ఉద్బోధతో ముగిసింది: ‘చెవులుగలవాడు ఆలకించునుగాక.’ (మత్తయి 13:1-9) అక్కడ హాజరైనవారిలో అనేకులు ఆయన చెప్పిన దానిని విన్నారు గాని ‘ఆలకించ’లేదు. మారుతున్న పరిస్థితుల్లో నాటబడిన విత్తనం, పరలోక రాజ్యాన్ని ఎలా పోలి ఉంటుందో తెల్సుకోవాలనే ఉద్దేశంగాని నిజమైన ఆసక్తిగాని వారికి లేవు. యేసు ఉపమానాలు, నైతిక మూలాంశాలతో కూడిన మంచి కథలు మాత్రమేనని బహుశా అనుకుంటూ వారు తమ అనుదిన జీవితాల్ని గడపడానికి ఇంటికి వెళ్లిపోయారు. వారి హృదయాలు ప్రతిస్పందనలేనివిగా ఉన్నందున ఎంత గొప్ప అవగాహనను మరెంత దివ్యమైన ఆధిక్యతల్ని అవకాశాల్ని వారు పొందలేక పోయారో కదా!
6. “రాజ్య పవిత్ర మర్మముల” అవగాహన యేసు శిష్యులకు మాత్రమే ఎందుకు అనుగ్రహింపబడింది?
6 యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు [“పరలోక రాజ్య పవిత్ర మర్మముల అవగాహన,” NW] అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.” యెషయా గ్రంథం నుండి ఎత్తి చెబుతూ ఆయన ఇంకా ఇలా అన్నాడు: “‘ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు’ . . . అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.”—(ఇటాలిక్కులు మావి.) మత్తయి 13:10-16; మార్కు 4:11-13.
రాజ్యాన్ని ‘గ్రహించడం’
7. రాజ్యాన్ని ‘గ్రహించడం’ ఎందుకు ప్రాముఖ్యం?
7 యేసు సమస్యని ఎత్తి చూపించాడు. అది రాజ్య వర్తమానాన్ని ‘గ్రహించడానికి’ సంబంధించినది. ఆయన తన శిష్యులకు ఆంతరంగికంగా ఇలా తెలియజేశాడు: “విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును.” నాలుగు రకాలైన నేలలు “రాజ్యమునుగూర్చిన వాక్యము” విత్తబడబోయే వేర్వేరు హృదయ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆయన వివరించసాగాడు.—(ఇటాలిక్కులు మావి.) మత్తయి 13:18-23; లూకా 8:9-15.
8. మొదటి మూడు రకాలైన నేలల్లో విత్తబడిన ‘విత్తనం’ ఫలాన్ని ఫలించకుండా ఆటంకపర్చినదేమిటి?
8 ప్రతి సందర్భంలోనూ విత్తనం మంచిదే అయితే ఫలించడం మట్టుకు నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. హృదయం యొక్క నేల ఆత్మీయ చింతలేని అనేకమైన కార్యక్రమాలచే గట్టిగా తయారైన, రద్దీగానున్న క్రిక్కిరిసిపోయిన రహదారివలె ఉంటే, రాజ్య వర్తమానాన్ని వింటున్న వ్యక్తి, రాజ్యం కొరకు ఏవిధమైన సమయం లేదని చెబుతూ తనను తాను సరిపెట్టుకోవడం సులభమౌతుంది. అలక్ష్యం చేయబడిన విత్తనం వేళ్లూనక మునుపే సులభంగా ఎత్తుకొని పోబడవచ్చు. అయితే రాతి నేలను పోలిన హృదయంలో విత్తనం విత్తబడితే అప్పటి విషయం ఏమిటి? విత్తనం మొలకెత్తవచ్చు గాని పోషణ మరియు దృఢత్వం కోసం లోతుగా వేళ్లూనుకోవడం కష్టమౌతుంది. ప్రాముఖ్యంగా తీవ్రమైన హింసల్లో దేవుని విధేయుడైన సేవకునిగా ఉండడమనే ఉత్తరాపేక్ష, గొప్ప సవాలును తీసుకు రాగలదు మరి ఆ వ్యక్తి అభ్యంతరపడవచ్చు. అలాగే హృదయం యొక్క నేల ముండ్లపొదల వంటి చింతలు లేక ఐశ్వర్యం కొరకైన వస్తు సంబంధమైన కోరికలతో నింపబడినట్లైతే బలహీనమైన రాజ్య మొక్క అణచి వేయబడుతుంది. జీవితంలోని ఈ మూడు విలక్షణమైన పరిస్థితుల్లో, రాజ్య ఫలమేదీ ఫలించదు.
9. మంచి నేలలో విత్తబడిన విత్తనం ఎందుకు మంచి ఫలాన్ని ఫలింపచేయగల్గింది?
9 అయితే, మంచినేలను విత్తబడిన రాజ్య విత్తనం విషయం ఏమిటి? యేసు ఇలా జవాబిస్తున్నాడు: “మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.” (ఇటాలిక్కులు మావి, మత్తయి 13:23.) వారు రాజ్యాన్ని ‘గ్రహిస్తుండగా,’ తమ వ్యక్తిగత పరిస్థితుల్నిబట్టి మంచి ఫలాల్ని ఫలిస్తారు.
అవగాహనతోపాటు బాధ్యత వస్తుంది
10. (ఎ) రాజ్యాన్ని ‘గ్రహించడం’ ఆశీర్వాదాల్ని బాధ్యతల్ని రెండింటినీ తీసుకొస్తుందని యేసు ఎలా చూపించాడు? (బి) మీరు వెళ్లి సమస్త జనుల్ని శిష్యుల్నిగా చేయండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞ మొదటి శతాబ్దమందలి శిష్యులకు మాత్రమే అన్వయిస్తుందా?
10 రాజ్యాన్ని గూర్చిన వేర్వేరు దృక్కోణాలను వివరించేందుకు మరో ఆరు ఉపమానాల్ని చెప్పిన తర్వాత యేసు తన శిష్యుల్ని “వీటినన్నింటిని మీరు గ్రహించితిరా?” అని అడిగాడు. (ఇటాలిక్కులు మావి.) వారు “గ్రహించితిమని” జవాబిచ్చినప్పుడు ఆయన ఇలా తెలియజేశాడు: ‘అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు.’ యేసు చేసిన బోధలు, ఇచ్చిన తర్ఫీదు ఆయన శిష్యుల్ని, తమ ‘ధన నిధిలో’ నుండి నిరంతరమూ సరఫరా చేయగలిగే గొప్ప ఆత్మీయాహారాన్ని తేగలిగే, పరిపక్వతకు ఎదిగిన క్రైస్తవులుగా పెంపొందింపచేస్తాయి. దీనిలో అనేకం దేవుని రాజ్యానికి సంబంధించినదే. రాజ్యాన్ని ‘గ్రహించడం’ ఆశీర్వాదాలను మాత్రమే కాదుగాని బాధ్యతల్ని కూడా తెస్తుందని యేసు విశదపర్చాడు. ఆయన ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.”—మత్తయి 13:51, 52; 28:19, 20.
11. 1914వ సంవత్సరం సమీపించినప్పుడు, రాజ్యానికి సంబంధించిన ఏ సంఘటనలు జరిగాయి?
11 వాగ్దానం చేసినట్లుగానే, శతాబ్దాల క్రిందటి నుండి ఈ రోజు వరకూ యేసు తన నిజమైన శిష్యులతో ఉన్నాడు. ఈ అంత్యదినాల్లో, ఆయన వారికి పురోభివృద్ధిదాయకంగా అవగాహనను ఇచ్చాడు, పెరుగుతున్న సత్యపు వెలుగు యొక్క ఉపయోగం విషయంలో వారిని బాధ్యుల్ని కూడా చేశాడు. (లూకా 19:11-15, 26) 1914లో, రాజ్య సంఘటనలు త్వరితంగానూ ఆకస్మికంగానూ బయల్పర్చబడడం ఆరంభమయ్యింది. ఆ సంవత్సరంలో, దీర్ఘకాలంగా నిరీక్షించబడిన రాజ్య ‘ఆవిర్భావం’ (కనడం) మాత్రమే జరగలేదు కానీ “ఈ విధాన ముగింపు” కూడా ఆరంభమైంది. (ప్రకటన 11:15; 12:5, 10; దానియేలు 7:13, 14, 27) తాజా సంఘటనల భావాన్ని వివేచిస్తున్న నిజ క్రైస్తవులు, చరిత్రలో అత్యంత గొప్ప రాజ్య ప్రకటనా మరియు బోధనా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా చెబుతూ, యేసు దీనిని ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
12. (ఎ) విస్తృతమైన ఆధునిక-దిన రాజ్య సాక్ష్యం యొక్క ఫలితం ఏమైవుంది? (బి) ఈ సంశయాత్మకమైన ప్రపంచంలో క్రైస్తవులకు ఏ అపాయంవుంది?
12 ఈ విస్తారమైన రాజ్య సాక్ష్యం 230 కన్నా ఎక్కువ దేశాల్ని చేరింది. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా నిజ శిష్యులు ఈ పనిలో భాగం వహిస్తున్నారు, ఇంకా ఇతరులు సమకూర్చబడ్తున్నారు. కాని భూమిపై నివసిస్తున్న 560 కోట్లమందితో శిష్యుల సంఖ్యను మనం పోల్చి చూస్తే యేసు కాలంలో వలెనే మానవజాతిలో అత్యధికులు రాజ్యాన్ని “గ్రహించ” లేదని స్పష్టమౌతుంది. ప్రవచింపబడినట్లుగానే, అనేకమంది అపహాసిస్తూ ఇలా చెబుతారు: “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను?” (2 పేతురు 3:3, 4) క్రైస్తవులుగా మనకున్న అపాయం ఏమిటంటే, మన రాజ్యాధిక్యతలను మనమెలా దృష్టిస్తామనే దానిపై, స్వయం తృప్తికరమైన సందేహాస్పదమైన వస్తుదాయకమైన వారి దృక్పథం క్రమంగా ప్రభావాన్ని చూపించగల్గడమే. ఈ ప్రపంచ ప్రజల మధ్యనున్న మనం, వారి దృక్పథాల్లో మరియు ఆచారాల్లో కొన్నింటిని మనం సులభంగా అవలంబించడం ఆరంభించగలం. మనం దేవుని రాజ్యాన్ని ‘గ్రహించి,’ దానిని అంటిపెట్టుకోవడమనేది ఎంత ప్రాముఖ్యమో కదా!
రాజ్యానికి సంబంధించి మనల్ని మనం పరిశీలించుకోవడం
13. రాజ్య సువార్తను ప్రకటించమనే ఆజ్ఞకు సంబంధించినంత వరకూ మనం వివేచనతో ‘వినడంలో’ కొనసాగుతున్నామా అని మనం ఎలా పరీక్షించుకోగలం?
13 మనం జీవిస్తున్న కోత కాలాన్ని గురించి యేసు ఇలా తెలియజేశాడు: “మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. . . . అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.” (మత్తయి 13:41, 43) రాజ్యాన్ని ప్రకటించి, శిష్యుల్ని చెయ్యమనే ఆజ్ఞను మీరు విధేయతా ప్రతిస్పందనతో ‘వింటు’న్నారా? “మంచి నేలను విత్తబడినవాడు” ‘వాక్యాన్ని విని, దానిని గ్రహించి,’ మంచి ఫలాల్ని ఫలించాడు.—మత్తయి 13:23.
14. ఉపదేశం ఇవ్వబడినప్పుడు, ఇవ్వబడిన సలహాను ‘గ్రహించామని’ మనమెలా చూపించగలం?
14 వ్యక్తిగత పఠనం చేస్తున్నప్పుడు, క్రైస్తవ కూటాలకు హాజరౌతున్నప్పుడు, మనం ‘హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి.’ (సామెతలు 2:1-4) ప్రవర్తన, దుస్తులు, సంగీతం మరియు వినోదం విషయంలో సలహా ఇవ్వబడినప్పుడు అది మన హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి అవసరమైన మార్పుల్ని చేసుకోవడానికి మనల్ని పురికొల్పేందుకు మనం అనుమతించాలి. ఎన్నడూ సమర్థించుకోవద్దు, సాకులు చెప్పవద్దు లేదా ప్రతిస్పందించకుండా ఉండొద్దు. మన జీవితాల్లో రాజ్యం వాస్తవమైనదైతే, మనం దాని ప్రమాణాల ప్రకారం జీవిస్తాం, దానిని గురించి ఇతరులకు ఆసక్తిదాయకంగా ప్రకటిస్తాం. యేసు ఇలా తెలియజేశాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”—మత్తయి 7:21-23.
15. ‘రాజ్యాన్ని దేవుని నీతిని మొదట వెదకడం’ ఎందుకు ప్రాముఖ్యం?
15 అవసరమైన ఆహారం, వస్త్రాలు, వసతులను గూర్చి చింత కల్గివుండడమనేది మానవ నైజమే, కాని యేసు ఇలా తెలియజేశాడు: “మీరు . . . రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33, 34) ప్రాధాన్యతనిచ్చే విషయాల్లో, మీ జీవితమందు రాజ్యాన్ని మొదటిదిగా ఉంచండి. అవసరమైన వాటితో తృప్తి కల్గివుంటూ మీ జీవితాన్ని నిరాడంబరమైనదిగా చేసుకోండి. అనవసరమైన కార్యకలాపాలు, సంపాదనలు వంటివి వాటంతటవే చెడ్డవేమీ కానవసరం లేదు, గనుక ఇలా చేయడం అంగీకృతమైనదేమోననే సమర్థింపులతో మన జీవితాల్ని నింపుకోవడం మూఢత్వమే అవుతుంది. అది నిజమే అయివుండొచ్చు కాని అటువంటి అనవసరమైన వాటిని సంపాదించడం మరియు ఉపయోగించడం అనేది మన వ్యక్తిగత పఠనానికి పట్టికను వేసుకోవడానికి, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడానికి, ప్రకటనా పనిలో భాగం వహించడానికి ఏమి చేస్తాయి? రాజ్యం “అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొ”నిన ఒక వర్తకుని పోలి ఉన్నదని యేసు తెలియజేశాడు. (మత్తయి 13:45, 46) దేవుని రాజ్యం గురించి మనం అలాగే భావించాలి. “యిహలోకమును స్నేహించి” పరిచర్యను విడనాడిన దేమాను కాదుగాని పౌలును మనం అనుసరించాలి.—2 తిమోతి 4:10, 18; మత్తయి 19:23, 24; ఫిలిప్పీయులు 3:7, 8, 13, 14; 1 తిమోతి 6:9, 10, 17-19.
‘అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు’
16. దేవుని రాజ్యాన్ని ‘గ్రహించడం’ చెడు ప్రవర్తనను విడనాడడానికి మనకు ఎలా సహాయపడ్తుంది?
16 కొరింథీయుల సంఘం దుర్నీతిని సహించినప్పుడు, పౌలు నిర్మొహమాటంగా ఇలా చెప్పాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:9, 10) మనం దేవుని రాజ్యాన్ని ‘గ్రహించినట్లైతే,’ క్రైస్తవ సేవలో మనం నిమగ్నమైవున్నట్లు ఆయన చూస్తున్నంత వరకూ దుర్నీతికి సంబంధించిన ఏదోక రూపాన్ని యెహోవా సహిస్తాడని తలంచడం ద్వారా మనల్ని మనం మోసపర్చుకోము. మన మధ్య అపవిత్రతను గూర్చిన ప్రస్తావనే ఉండకూడదు. (ఎఫెసీయులు 5:3-5) ఈ లోకపు అసహ్యమైన ఆలోచనా విధానాల్లో లేక ఆచారాల్లో కొన్ని, మీ జీవితంలోనికి జొరబడనారంభించడాన్ని మీరు పసిగట్టారా? వెంటనే వాటిని మీ జీవితంలో నుండి తీసివేయండి! రాజ్యం ఎంతో అమూల్యమైంది కాబట్టి అటువంటి విషయాల కొరకు దానిని వదులుకోకూడదు.—మార్కు 9:47.
17. దేవుని రాజ్యం ఎడలగల ప్రశంస ఏయే రీతుల్లో వినయాన్ని పెంపొందింపజేసి, అభ్యంతరానికి కారణమైనవాటిని తీసివేస్తుంది?
17 యేసు శిష్యులు “పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని” అడిగారు. ఓ చిన్న బిడ్డను వారి మధ్య ఉంచి ఇలా చెప్పడం ద్వారా యేసు జవాబిచ్చాడు: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:1-6) గర్వం, దబాయింపు, నిర్లక్ష్యం, అక్రమం దేవుని రాజ్యంలో ఉండవు లేక అలాంటి వాటిని చేయు వారు రాజ్య పౌరులుగానైనా ఉండరు. మీ సహోదరుల ఎడల మీకుగల మీ ప్రేమ, మీ వినయం, మీ దైవిక భయం, మీ ప్రవర్తన, ఇతరులకు అభ్యంతరం కల్గించకుండా ఉండేందుకు మిమ్మల్ని ప్రేరేపించదా? లేక ఈ దృక్పథం మరియు ప్రవర్తన ఇతరులను ఎలా ప్రభావితం చేయగలిగినా సరే మీ “హక్కుల” గురించి మీరు పట్టినపట్టు విడువకుండా ఉంటారా?—రోమీయులు 14:13, 17.
18. దేవుని రాజ్యం, ఆయన చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరేలా చేసినప్పుడు విధేయతగల మానవజాతికి వచ్చే ప్రతిఫలమేమిటి?
18 మన పరలోక తండ్రియైన యెహోవా, పట్టుదలతో చేసే ఈ ప్రార్థనకు త్వరలోనే పూర్తిగా జవాబిస్తాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” పరిపాలిస్తున్న రాజైన యేసుక్రీస్తు అతి త్వరలోనే తీర్పు తీర్చడానికి అంటే “మేకలలో” నుండి “గొఱ్ఱెలను” వేరుపర్చేందుకు తన సింహాసనంపై కూర్చోవడమనే భావంలో వస్తాడు. ఆ నియమిత కాలంలో “రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి—నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొను(డని) . . . చెప్పును.” మేకలు “నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.” (మత్తయి 6:9,10; 25:31-34, 46) పాత విధానాన్ని మరియు రాజ్యాన్ని ‘గ్రహించడానికి’ తిరస్కరించే వారందరిని “మహాశ్రమ” తుడిచి వేస్తాది. కాని “మహాశ్రమ”ను తప్పించుకున్న లక్షలాది మంది మరియు పునరుత్థానం కాబోయే కోట్లాదిమందీ పునఃస్థాపించబడిన భూ పరదైసులో అంతంలేని రాజ్య ఆశీర్వాదాల్ని పొందుతారు. (ప్రకటన 7:14) రాజ్యం అంటే పరలోకం నుండి పరిపాలించే భూమియొక్క ఓ క్రొత్త ప్రభుత్వమే. తన అత్యంత పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపర్చే నిమిత్తం, భూమి ఎడల మరియు మానవజాతి ఎడలగల యెహోవా సంకల్పాన్ని అది నెరవేరుస్తుంది. అలాంటి వారసత్వం కొరకు పాటుపడడం, త్యాగం చేయడం, వేచివుండడం యోగ్యమైనది కాదంటారా? రాజ్యాన్ని ‘గ్రహించడం’ అంటే మన విషయంలో భావమిదేయై ఉండాలి!
మీరెలా జవాబిస్తారు?
◻ దేవుని రాజ్యం అంటే ఏమిటి?
◻ యేసు చెప్పిన దానిని వినిన అనేకులు రాజ్యాన్ని ఎందుకు ‘గ్రహించ’లేక పోయారు?
◻ రాజ్యాన్ని ‘గ్రహించడం’ ఆశీర్వాదాల్ని, బాధ్యతను రెండింటినీ ఎలా తీసుకొస్తుంది?
◻ ప్రకటనా పనికి సంబంధించి, రాజ్యాన్ని మనం ‘గ్రహించామని’ ఏది తెలియజేస్తుంది?
◻ ఇవ్వబడిన సలహా యొక్క ‘గ్రహింపును’ మనం పొందామని మన ప్రవర్తన ద్వారా మనమెలా చూపిస్తాము?
[17వ పేజీలోని చిత్రం]
యేసు శిష్యులు రాజ్యాన్ని ‘గ్రహించి,’ మంచి ఫలాన్ని ఫలించారు