దీవెనలు లేక శాపములు—మీరు ఎంపిక చేసుకోవచ్చు!
‘జీవమును మరణమును, దీవెనను శాపమును నేను నీ ఎదుట ఉంచియున్నాను; నీవు బ్రదుకునట్లు నీవు జీవమును కోరుకొనవలెను.’—ద్వితీయోపదేశకాండము 30:19.
1. మానవులకు ఏ సామర్థ్యం ఇవ్వబడింది?
యెహోవా దేవుడు మనల్ని, అంటే జ్ఞానవంతులైన తన మానవ సృష్టిని స్వేచ్ఛా చిత్తంగల నైతిక ప్రతినిధులుగా రూపొందించాడు. మనం కేవలం స్వయంప్రవర్తక యంత్రాల్లా లేక మరమనుష్యుల్లా సృష్టించబడలేదు గాని, ఎంపిక చేసుకొనే ఆధిక్యత, బాధ్యత మనకివ్వబడ్డాయి. (కీర్తన 100:3) మొదటి మానవులైన ఆదాము హవ్వలు తాము తీసుకొనే చర్యను ఎంపిక చేసుకోగల స్వాతంత్ర్యం కలిగివుండిరి, అంతేగాక వారు తాము చేసుకొనే ఎంపికనుబట్టి దేవునికి జవాబుదారులైయుండిరి.
2. ఆదాము ఏ ఎంపిక చేసుకున్నాడు, దాని ఫలితమేమిటి?
2 పరదైసు భూమిపై నిత్యాశీర్వాదంతో కూడిన మానవ జీవితాన్ని గడపడానికి సృష్టికర్త విస్తారంగా అనుగ్రహించాడు. ఆ సంకల్పం ఇంకా ఎందుకు నెరవేరలేదు? ఎందుకంటే ఆదాము తప్పు ఎంపిక చేసుకున్నాడు. “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” యెహోవా నరునికాజ్ఞాపించాడు. (ఆదికాండము 2:16, 17) ఆదాము విధేయత చూపడానికి ఎంపిక చేసుకొని ఉంటే, మన ఆది తలిదండ్రులు ఆశీర్వదించబడి ఉండేవారు. అవిధేయత మరణాన్ని తెచ్చింది. (ఆదికాండము 3:6, 18, 19) కాబట్టి పాప మరణాలు ఆదాము సంతానమంతటికీ వారసత్వంగా వచ్చాయి.—రోమీయులు 5:12.
దీవెనలు సాధ్యం చేయబడ్డాయి
3. మానవజాతి ఎడల తనకున్న సంకల్పం నెరవేర్చబడుతుందని దేవుడు ఎలా అభయమిచ్చాడు?
3 మానవజాతిని దీవించాలనే తన సంకల్పం చివరికి నెరవేరేలా యెహోవా దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. ఏదెనులో ప్రవచిస్తూ, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని” చెబుతూ ఆయన తానే ఒక సంతానం గురించి తెలియజేశాడు. (ఆదికాండము 3:15) అబ్రాహాము వంశీకుడైన ఈ సంతానం ద్వారా, విధేయులైన మానవజాతికి దీవెనలు లభిస్తాయని దేవుడు ఆ తర్వాత వాగ్దానం చేశాడు.—ఆదికాండము 22:15-18.
4. మానవజాతిని దీవించడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?
4 దీవెన తెచ్చే ఆ వాగ్దత్త సంతానం యేసు క్రీస్తని నిరూపించబడింది. మానవజాతిని దీవించాలనే యెహోవా ఏర్పాటులో యేసు పాత్రకు సంబంధించి క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:8) దేవునికి విధేయులై, యేసు క్రీస్తు విమోచన క్రయధన బలి విలువను తమకు తాము అన్వయింపజేసుకొనే పాపులైన మానవజాతికి దీవెనలు లభిస్తాయి. (అపొస్తలుల కార్యములు 4:12) మీరు విధేయతను, దీవెనలను ఎంపిక చేసుకుంటారా? అవిధేయత ఎంతో భిన్నమైన ఫలితాన్ని తీసుకువస్తుంది.
శాపముల విషయమేమిటి?
5. “శాపము” అనే పదం యొక్క భావమేమిటి?
5 దీవెనకు వ్యతిరేకమైనది శాపము. “శాపము” అనే పదం యొక్క భావం, ఎవరి గురించైనా హానికరంగా మాట్లాడడం లేక అతనికి కీడు కలగాలని మాట్లాడడం. కెల·లాʹ అనే హెబ్రీ పదం కల·ల్ʹ అనే మూల క్రియా పదం నుండి తీసుకొనబడింది, “తేలికవ్వడం” అన్నది అక్షరార్థంగా దాని భావం. అయితే అలంకారార్థకభావంలో ఉపయోగించినప్పుడు, దాని భావం ‘దూషించడం’ లేదా ‘నిర్లక్ష్యం’ చేయడం.—లేవీయకాండము 20:9; 2 సమూయేలు 19:43.
6. ప్రాచీన బేతేలు వద్ద ఎలీషాకు సంబంధించిన ఏ సంఘటన జరిగింది?
6 శాపానికి సంబంధించిన సత్వర చర్య ఇమిడివున్న ఒక విశేషమైన ఉదాహరణను పరిశీలించండి. దేవుని ప్రవక్తయైన ఎలీషా యెరికో నుండి బేతేలునకు నడిచి వెళుతుండగా ఇది సంభవించింది. ఆ వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి—బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.” (2 రాజులు 2:23, 24) అపహాస్యం చేస్తున్న ఆ పిల్లలను శపించినప్పుడు కచ్చితంగా ఎలీషా ఏమి చెప్పాడో బయల్పర్చబడలేదు. అయినప్పటికీ ఆ మాటలు, దైవిక చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటున్న దేవుని ప్రవక్త యెహోవా నామమున పలికినందున ప్రభావాన్ని చూపాయి.
7. ఎలీషాను అపహాస్యం చేసిన పిల్లలకు ఏమి జరిగింది, ఎందుకు?
7 అపహాస్యం చేయడానికి ముఖ్య కారణం, ఏలీయాదని బహుగా తెలిసిన అధికారిక వస్త్రాన్ని ఎలీషా ధరించడమై ఉండవచ్చుననిపిస్తుంది, ఆ ప్రవక్త యొక్క ఉత్తరాధికారులెవరు ఆ చుట్టుప్రక్కలలో ఉండడం పిల్లలకు ఇష్టంలేదు. (2 రాజులు 2:13) అతడు ఏలీయా ఉత్తరాధికారిగా ఉండడాన్ని గురించి చేయబడిన సవాలుకు జవాబిచ్చేందుకు, ఆ చిన్నపిల్లలకు అలాగే వారి తలిదండ్రులకు యెహోవా ప్రవక్త ఎడల సరైన గౌరవం కలిగివుండడాన్ని నేర్పించడానికి ఎలీషా, అపహాస్యం చేస్తున్న గుంపును ఏలీయా యొక్క దేవుని నామమున శపించాడు. అడవిలో నుండి రెండు ఆడు ఎలుగుబంట్లు వచ్చి అపహసిస్తున్న వారిలో 42 మందిని చీల్చివేసేలా చేయడం ద్వారా యెహోవా తాను ఎలీషాను తన ప్రవక్తగా అంగీకరిస్తున్నట్లు తెలియజేశాడు. ఆ కాలంలో తాను ఉపయోగిస్తున్న సంభాషణా మాధ్యమం ఎడల వారు స్పష్టమైన గౌరవ లోపాన్ని చూపినందున యెహోవా నిర్ణయాత్మక చర్య గైకొన్నాడు.
8. ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయడానికి అంగీకరించారు, ఏ ఉత్తరాపేక్షతో?
8 సంవత్సరాల పూర్వం, ఇశ్రాయేలీయులు దేవుని ఏర్పాట్ల ఎడల అలాంటి గౌరవ లోపాన్నే చూపించారు. అది ఇలా వృద్ధి చెందింది: సా.శ.పూ. 1513లో, “గద్ద రెక్కలమీద” మోసుకువెళ్లినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయడం ద్వారా యెహోవా వారి ఎడల అనుగ్రహం కనపర్చాడు. దాని తర్వాత వెంటనే, వారు దేవునికి విధేయత చూపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేవుని అంగీకారాన్ని పొందడానికి, విధేయత చూపించడానికి ఎలా అవినాభావ సంబంధం ఉందో గమనించండి. యెహోవా మోషే ద్వారా ఇలా తెలియజేశాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా.” ఆ తర్వాత, ప్రజలు “యెహోవా చెప్పినదంతయు చేసెదమని” చెబుతూ, దృఢంగా సమాధానమిచ్చారు. (నిర్గమకాండము 19:4, 5, 8; 24:3) ఇశ్రాయేలీయులు యెహోవాను ప్రేమిస్తామని చెప్పారు, ఆయనకు సమర్పించుకున్నారు, ఆయన మాట వింటామని ప్రమాణం చేశారు. అలా విధేయత చూపించడం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది.
9, 10. మోషే సీనాయి పర్వతంపైనున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఏమి చేశారు, దాని పర్యవసానాలేమిటి?
9 అయితే, ఆ ఒప్పందం యొక్క ప్రాథమిక సూత్రాలు “దేవుని వ్రేలితో” రాతిపై చెక్కబడక మునుపే, దైవిక శాపాలు అవసరమయ్యాయి. (నిర్గమకాండము 31:18) అలాంటి దుఃఖకరమైన పర్యవసానాలు ఎందుకు తగినవి? యెహోవా చెప్పినదంతా చేస్తామనే కోరికను ఇశ్రాయేలీయులు సూచించలేదా? అవును, వాక్య రూపంగా వాళ్లు ఆశీర్వాదాలను వెదికారు కాని, వారు తమ చర్యల ద్వారా శాపానికి తగిన విధానాన్ని ఎంపిక చేసుకున్నారు.
10 మోషే పది ఆజ్ఞలు తీసుకుంటూ, సీనాయి పర్వతంపైనున్న 40 దినాల కాలంలో, తాము యథార్థంగా ఉంటామని ఇశ్రాయేలీయులు మునుపు చేసిన వాగ్దానాన్ని మీరారు. వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది, “మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి—లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.” (నిర్గమకాండము 32:1) ఇది, యెహోవా తన ప్రజలను నడిపించడానికి, వారికి నిర్దేశకత్వాన్ని ఇవ్వడానికి ఆ సమయంలో ఉపయోగించుకుంటున్న మానవ ప్రతినిధి ఎడల అగౌరవ భావాన్ని చూపడం యొక్క మరో ఉదాహరణ. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల విగ్రహారాధనను అనుకరించేందుకు శోధింపబడ్డారు, ఒకే రోజున 3,000 మంది ఖడ్గముచేత కూలడం ద్వారా వాళ్లు ఘోరమైన ఫలితాలను అనుభవించారు.—నిర్గమకాండము 32:2-6, 25-29.
దీవెనలను శాపములను ప్రకటించడం
11. యెహోషువ దీవెనలు మరియు శాపములకు సంబంధించి ఏ ఉపదేశాలు ఇచ్చాడు?
11 అరణ్యంలో ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణాంతంలో, దేవునికి విధేయత చూపించడాన్ని ఎన్నుకోవడం ద్వారా పొందగల ఆశీర్వాదాలను మోషే వివరంగా తెలియజేశాడు. ఒకవేళ ఇశ్రాయేలీయులు యెహోవాకు అవిధేయత చూపడాన్ని ఎన్నుకుంటే, వారిపైకి రాగల శాపముల గురించి కూడా ఆయన వివరించాడు. (ద్వితీయోపదేశకాండము 27:11–28:10) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన కొంతకాలానికే, ఈ దీవెనలు మరియు శాపములు ఇమిడివున్న మోషే ఇచ్చిన ఉపదేశాలను యెహోషువ నెరవేర్చాడు. ఇశ్రాయేలీయుల ఆరు తెగలవారు ఈబాలు పర్వతం దిగువన నిలబడ్డారు, మిగతా ఆరు తెగలవారు గెరీజీము పర్వతం ఎదుట నిలబడ్డారు. లేవీయులు ఆ మధ్యన లోయలో నిలబడ్డారు. ఈబాలు పర్వతం ఎదుట నిలబడివున్న తెగలవారు ఆ వైపుగా శాపములు లేక దూషణలు చదువబడినప్పుడు “ఆమేన్!” అని చెప్పారు. గెరీజీము పర్వతం ఎదుట నిలబడివున్న వారివైపుగా లేవీయులు దీవెనలను చదివి వినిపించినప్పుడు వారు ప్రతిస్పందించారు.—యెహోషువ 8:30-35.
12. లేవీయులు చెప్పిన కొన్ని శాపములు ఏమిటి?
12 లేవీయులు ఇలా చెప్పడాన్ని మీరు వినడం ఊహించుకోండి: ‘యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసిచాటున నుంచువాడు శాపగ్రస్తుడు . . . తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు . . . తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడు . . . గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడు . . . పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు . . . తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడు . . . ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడు . . . తన సహోదరితో, అనగా తన తండ్రి కుమార్తెతోగాని తన తల్లి కుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడు . . . తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడు . . . చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడు . . . నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడు . . . ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడు.’ ప్రతి శాపము తర్వాత, ఈబాలు పర్వతం ఎదుటవున్న తెగలవారు “ఆమేన్!” అని అంటారు.—ద్వితీయోపదేశకాండము 27:15-26.
13. లేవీయులు చెప్పిన కొన్ని దీవెనలను మీరు మీ స్వంత మాటల్లో ఎలా వ్యక్తపరుస్తారు?
13 లేవీయులు ఒక్కొక్క దీవెనను చెబుతుండగా గెరీజీము పర్వతం ఎదుటనున్నవారు ఇలా సమాధానం చెప్పడాన్ని మీరు ఊహించుకోండి: “నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు; నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.”—ద్వితీయోపదేశకాండము 28:3-6.
14. ఇశ్రాయేలీయులు దేని ఆధారంగా దీవెనలను పొందగలరు?
14 ఈ దీవెనలను పొందడానికి ఆధారమేమిటి? వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.” (ద్వితీయోపదేశకాండము 28:1, 2) అవును, దైవిక దీవెనలను పొందడానికి కీలకం దేవునికి విధేయత చూపడమే. కాని నేడు మన విషయమేమిటి? ‘యెహోవా వాక్యమును వినడంలో’ కొనసాగడం ద్వారా మనం వ్యక్తిగతంగా దీవెనలను జీవాన్ని ఎంపిక చేసుకుంటామా?—ద్వితీయోపదేశకాండము 30:19, 20.
నిశితంగా పరిశీలించడం
15. ద్వితీయోపదేశకాండము 28:3 నందు వ్రాయబడివున్న దీవెనలో ఏ విషయం తెలియజేయబడింది, దాని నుండి మనమెలా ప్రయోజనం పొందగలము?
15 యెహోవాకు విధేయత చూపడం ద్వారా ఒక ఇశ్రాయేలీయుడు పొందగల కొన్ని దీవెనలను మనం పరిశీలిద్దాము. ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 28:3 ఇలా చెబుతుంది: “నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు.” దేవునిచే దీవింపబడడం స్థలం లేక పనిపై ఆధారపడిలేదు. బహుశా కొందరు వస్తుదాయకంగా నాశనం చేయబడిన ప్రాంతంలో లేక యుద్ధంచే బీభత్సమైన దేశంలో నివసిస్తున్నందున తాము తమ పరిస్థితులలో చిక్కుకుపోయినట్లు భావించవచ్చు. ఇతరులు వేరే ప్రాంతంలో యెహోవా సేవ చేయాలని కోరుకుంటుండవచ్చు. కొందరు క్రైస్తవ పురుషులు సంఘంలో తాము పరిచర్య సేవకులుగా లేక పెద్దలుగా నియమింపబడలేదని నిరుత్సాహపడుతుండవచ్చు. కొన్నిసార్లు, క్రైస్తవ స్త్రీలు తాము పయినీర్లుగా లేక మిషనరీలుగా పూర్తికాల సేవలో భాగం వహించగల స్థితిలో లేనందున నిరాశ చెందుతారు. అయినప్పటికీ, ‘యెహోవా చెప్పేది విని ఆయన కోరేవాటన్నిటిని జాగ్రత్తగా చేసే’ ప్రతి ఒక్కరు ఇప్పుడు అలాగే నిరంతరం దీవింపబడతారు.
16. ద్వితీయోపదేశకాండము 28:4 నందలి సూత్రాన్ని యెహోవా సంస్థ నేడు ఎలా అనుభవిస్తోంది?
16 ద్వితీయోపదేశకాండము 28:4 ఇలా చెబుతుంది: “నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును.” “నీ” అని చెప్పబడిన హెబ్రీ సర్వనామం యొక్క ఏకవచన ఉపయోగం, ఇది విధేయుడైన ఇశ్రాయేలీయుని వ్యక్తిగత అనుభవమై ఉండగలదని సూచిస్తుంది. నేడు యెహోవాకు విధేయులైయున్న సేవకుల మాటేమిటి? యెహోవాసాక్షుల సంస్థలో జరుగుతున్న ప్రపంచవ్యాప్త అభివృద్ధి మరియు విస్తృతి, 50,00,000 కంటే ఎక్కువమంది రాజ్య సువార్త ప్రచారకుల యథార్థ ప్రయత్నాలపై దేవుని దీవెన యొక్క ఫలితమే. (మార్కు 13:10) 1995 ప్రభురాత్రి భోజన ఆచరణకు 1,30,00,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు గనుక ఇంకా అత్యధిక అభివృద్ధి జరిగే అవకాశమున్నదని స్పష్టమౌతుంది. మీరు రాజ్యాశీర్వాదాలను అనుభవిస్తున్నారా?
ఇశ్రాయేలీయుల ఎంపిక భేదమేమిటో చూపింది
17. దీవెనలు ‘ప్రాప్తించడం’ లేక శాపములు ‘సంభవించడం’ దేనిపై ఆధారపడివుంది?
17 విధేయతగల ఇశ్రాయేలీయులకు ప్రతిఫలంగా దీవెనలు లభించేవి. ఇలా వాగ్దానం చేయబడింది: “ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును.” (ద్వితీయోపదేశకాండము 28:2) అలాగే, శాపముల గురించి ఇలా చెప్పబడింది: “ఈ శాపములన్నియు నీకు సంభవించును.” (ద్వితీయోపదేశకాండము 28:15) మీరు ప్రాచీన కాలంనాటి ఇశ్రాయేలీయులలో ఒకరై ఉంటే, మీకు దీవెనలు ‘ప్రాప్తించి’ ఉండేవా లేక శాపములు ‘సంభవించి’ ఉండేవా? మీరు దేవునికి విధేయులౌతారా లేక అవిధేయులౌతారా అనే దానిపై అది ఆధారపడి ఉండేది.
18. ఇశ్రాయేలీయులు శాపములను ఎలా తప్పించుకొని ఉండగలిగేవారు?
18 ద్వితీయోపదేశకాండము 28:15-68 నందు, అవిధేయత యొక్క బాధాకరమైన పర్యవసానాలు శాపములుగా చెప్పబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 28:3-14 నందు చెప్పబడిన విధేయతా దీవెనలకు కొన్ని పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు అబద్ధ ఆరాధన చేయడానికి ఎంపిక చేసుకున్నందున తరచూ వారు శాపముల బాధాకరమైన ఫలితాలను అనుభవించారు. (ఎజ్రా 9:7; యిర్మీయా 6:6-8; 44:2-6) ఎంత దుఃఖకరం! మంచేదో చెడేదో స్పష్టంగా నిర్వచించే యెహోవా యొక్క హితకరమైన నియమాలకు, కట్టడలకు విధేయత చూపడమనే సరైన ఎంపిక చేసుకోవడం ద్వారా అలాంటి పర్యవసానాలను తప్పించుకోవడం సాధ్యమయ్యేది. అబద్ధమతాన్ని ఆచరించడం, లైంగిక దుర్నీతిలో పాల్గొనడం, చట్టవ్యతిరేకమైన మాదక ద్రవ్యాల్ని ఉపయోగించడం, మత్తు పానీయాలను విపరీతంగా తీసుకోవడం మొదలైనవి చేయడం ద్వారా బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఎంపిక చేసుకున్నందున నేడు అనేకులు బాధను, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ప్రాచీన ఇశ్రాయేలు మరియు యూదాలో వలెనే, అలాంటి చెడు ఎంపికలను చేసుకోవడం దైవిక అనంగీకారానికి, అనవసరమైన హృదయవేదనకు దారితీస్తాయి.—యెషయా 65:12-14.
19. యూదా మరియు ఇశ్రాయేలు యెహోవాకు విధేయత చూపించడాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అనుభవించిన పరిస్థితులను వివరించండి.
19 ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయత చూపించినప్పుడు మాత్రమే దీవెనలు మెండుగా లభించాయి, శాంతి నెలకొన్నది. ఉదాహరణకు, రాజైన సొలొమోను కాలం గురించి మనమిలా చదువుతాము: “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. . . . సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:20-25) దేవుని శత్రువుల నుండి ఎంతో వ్యతిరేకత ఉన్న కాలంగా గుర్తించబడిన రాజైన దావీదు కాలంలో సహితం, ఆ జనాంగం సత్య దేవునికి విధేయత చూపించడానికి ఎంపిక చేసుకున్నప్పుడు వారు యెహోవా సహాయాన్ని, దీవెనను పొందారు.—2 సమూయేలు 7:28, 29; 8:1-15.
20. మానవులకు సంబంధించి దేవుడు దేని గురించి నిశ్చయత కలిగివున్నాడు?
20 మీరు దేవునికి విధేయత చూపిస్తారా, లేక ఆయనకు అవిధేయత చూపిస్తారా? ఇశ్రాయేలీయులకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మనమందరం ఆదాము నుండి పాపపు దృక్పథాన్ని వారసత్వంగా పొందినప్పటికీ, మనం స్వేచ్ఛాచిత్తమనే బహుమతిని కూడా పొందాము. సాతానే కాకుండా ఈ దుష్ట ప్రపంచం మరియు మన అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ, మనం సరైన ఎంపిక చేసుకోవచ్చు. అంతేగాక, ప్రతి విధమైన కష్టం మరియు శోధన సమయంలోను మాటలోనే కాక చర్యలోను సరైన ఎంపిక చేసుకునే వారుంటారని మన సృష్టికర్త నిశ్చయత కల్గివున్నాడు. (1 పేతురు 5:8-10) మీరు వారిలో ఒకరై ఉంటారా?
21. తర్వాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?
21 తర్వాతి శీర్షికలో, మనం గత ఉదాహరణల వెలుగులో మన దృక్పథాలను, చర్యలను తూచిచూసుకోగలము. ‘జీవమును మరణమును, దీవెనను శాపమును నేను నీ ఎదుట ఉంచియున్నాను; నీవు బ్రదుకునట్లు నీవు జీవమును కోరుకొనవలెను’ అని మోషే ద్వారా దేవుడు చెప్పిన మాటలకు మనలో ప్రతి ఒక్కరము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందిద్దాము.—ద్వితీయోపదేశకాండము 30:19.
మీరెలా సమాధానమిస్తారు?
◻ పాపులైన మానవజాతికి యెహోవా దీవెనలను ఎలా సాధ్యం చేశాడు?
◻ శాపములు అంటే ఏమిటి?
◻ ఇశ్రాయేలీయులు శాపములకు బదులు దీవెనలను ఎలా పొందగలిగి ఉండేవారు?
◻ దేవునికి విధేయత చూపడాన్నిబట్టి ఇశ్రాయేలీయులు ఏ దీవెనలను పొందారు?
[15వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలీయులు గెరీజీము పర్వతం ఎదుట, ఈబాలు పర్వతం ఎదుట సమావేశమయ్యారు
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.