కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/15 పేజీలు 17-22
  • దీవెనలు లేక శాపములు—నేడు మన కొరకు ఉదాహరణలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దీవెనలు లేక శాపములు—నేడు మన కొరకు ఉదాహరణలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విగ్రహారాధనను గూర్చిన హెచ్చరిక
  • వ్యభిచారం గురించి హెచ్చరిక
  • తిరుగుబాటుతో కూడిన ఫిర్యాదుల గురించి హెచ్చరిక
  • సణగడం గురించి హెచ్చరిక
  • నేర్చుకుని, ఆశీర్వాదాలను పొందండి
  • విని మరచిపోయేవారిగా తయారుకావద్దు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ‘సణగడం మానండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “ప్రతిదినము” మన సమర్పణకు తగినట్లు జీవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దీవెనలు లేక శాపములు—మీరు ఎంపిక చేసుకోవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/15 పేజీలు 17-22

దీవెనలు లేక శాపములు—నేడు మన కొరకు ఉదాహరణలు

“ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.”—1 కొరింథీయులు 10:11.

1. ఒకరు ఒక ఉపకరణాన్ని పరిశీలించినట్లు, మనం ఏ పరిశీలన చేసుకోవాలి?

ఇనుముతో చేయబడిన ఒక ఉపకరణాన్ని పెయింటు పొర క్రింద అదృశ్యంగా ఉన్న తుప్పు తినివేయడం మొదలు పెట్టగలదు. ఆ తుప్పు పైకి కనిపించడానికి కొంతకాలం ముందే అలా జరుగవచ్చు. అలాగే, గంభీరమైన పర్యవసానాలకు దారితీయక ముందే లేక ఇతరులు గమనించక ముందే ఒకరి హృదయంలోని దృక్పథాలు, కోరికలు క్షీణించడం ప్రారంభం కావచ్చు. ఒక ఉపకరణం తుప్పు పడుతుందేమో తెలుసుకోడానికి మనం దాన్ని జ్ఞానయుక్తంగా పరిశీలించేలానే, మన హృదయాలను లోతుగా పరీక్షించుకోవడం, సమయానుసారంగా దాని బాగోగులు చూడడం మన క్రైస్తవ యథార్థతను కాపాడగలదు. వేరే మాటల్లో చెప్పాలంటే, మనం దేవుని దీవెనలను పొంది, దైవిక శాపములను తప్పించుకోవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలుపై ప్రకటించబడిన ఆశీర్వాదాలు మరియు శాపములు ఈ విధానాంతాన్ని ఎదుర్కొంటున్న వారికి ఏ భావాన్నీ కలిగి లేవని కొందరు భావించవచ్చు. (యెహోషువ 8:34, 35; మత్తయి 13:49, 50; 24:3) అయితే, అది నిజం కాదు. 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, ఇశ్రాయేలీయులు ఇమిడివున్న హెచ్చరికా ఉదాహరణల నుండి మనం గొప్పగా ప్రయోజనం పొందవచ్చు.

2. అరణ్యంలో ఇశ్రాయేలీయుల అనుభవాల గురించి 1 కొరింథీయులు 10:5, 6 ఏమి చెబుతుంది?

2 క్రీస్తు క్రిందనున్న క్రైస్తవులను మోషే క్రిందనున్న ఇశ్రాయేలీయులతో అపొస్తలుడైన పౌలు సరిపోలుస్తున్నాడు. (1 కొరింథీయులు 10:1-4) ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగినప్పటికీ, “వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.” అందుకే పౌలు తోటి క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.” (ఇటాలిక్కులు మావి, 1 కొరింథీయులు 10:5, 6) కోరికలు హృదయంలో పెంపొందుతాయి గనుక మనం పౌలు ఉదాహరిస్తున్న హెచ్చరికా దృష్టాంతములను వినాలి.

విగ్రహారాధనను గూర్చిన హెచ్చరిక

3. బంగారు దూడకు సంబంధించి ఇశ్రాయేలీయులు ఎలా పాపం చేశారు?

3 పౌలు ఇచ్చిన మొదటి హెచ్చరిక ఇలా ఉంది: “జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.” (ఇటాలిక్కులు మావి, 1 కొరింథీయులు 10:7) ఈ హెచ్చరికా ఉదాహరణ ఇశ్రాయేలీయులు ఐగుప్తు మార్గాలకు మరలి, బంగారు దూడ విగ్రహాన్ని చేసుకోవడానికి సంబంధించినది. (నిర్గమకాండము 32వ అధ్యాయము) శిష్యుడైన స్తెఫెను ఇలా చెప్పినప్పుడు అంతర్లీనంగా ఉన్న సమస్యను సూచించాడు: “[దేవుని ప్రతినిధియైన మోషేకు] మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరినవారై—మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.” (అపొస్తలుల కార్యములు 7:39-41) దారితప్పిన ఆ ఇశ్రాయేలీయులు విగ్రహారాధనకు దారితీసిన చెడు కోరికలను “తమ హృదయములలో” ఉంచుకున్నారన్నది గమనించండి. ‘వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించారు.’ అంతేగాక వారు, ‘తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.’ అక్కడ సంగీతం, పాడడం, నాట్యమాడడం, తినడం, త్రాగడం జరిగాయి. స్పష్టంగా, విగ్రహారాధన ప్రలోభ పెట్టేదిగా, వినోదాన్ని అందించేదిగా ఉండింది.

4, 5. మనం ఏ విగ్రహారాధన సంబంధ ఆచారాలను విసర్జించాలి?

4 సూచనార్థక ఐగుప్తు అంటే సాతాను ప్రపంచం నిజంగా వినోదాన్ని ఆరాధిస్తుంది. (1 యోహాను 5:19; ప్రకటన 11:8) అది నటులను, గాయకులను, క్రీడాకారులను, అలాగే వారి నాట్యాన్ని, వారి సంగీతాన్ని, వారి సరదా భావాలను మరియు సంతోషసమయాలను ఆరాధిస్తుంది. అనేకులు యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ కూడా వినోదంలో పూర్తిగా నిమగ్నమైపోయేలా శోధించబడ్డారు. ఒక క్రైస్తవుడు ఏదైనా తప్పు గురించి సరిదిద్దబడవలసి వచ్చినప్పుడు, తరచూ బలహీనమైన ఆయన ఆత్మీయ స్థితి మత్తు పానీయాలను త్రాగడం, నృత్యం మరియు విగ్రహారాధనకు దగ్గరగా ఉన్న ఏ విధమైన సంతోష సమయాన్నైనా కలిగివుండడం వంటివై ఉండవచ్చు. (నిర్గమకాండము 32:5, 6, 17, 18) కొంతమేరకు వినోదం ఆరోగ్యదాయకమైనది, ఆనందించదగినది. అయినప్పటికీ, నేటి ప్రాపంచిక సంగీతం, నృత్యం, చలన చిత్రాలు, వీడియోలు కలుషితమైన శారీరక కోరికలను వృద్ధి చేస్తాయి.

5 నిజ క్రైస్తవులు విగ్రహారాధనకు లొంగిపోరు. (2 కొరింథీయులు 6:16; 1 యోహాను 5:21) విగ్రహారాధన సంబంధ వినోదానికి బానిసలం కాకుండా, లోకరీతిలో మంచి సమయాలను గడపడంలో మునిగిపోయి ఉండడం ద్వారా వచ్చే హానికరమైన ప్రభావాలకు గురికాకుండా ఉండేందుకు మనలో ప్రతి ఒక్కరం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రాపంచిక ప్రభావాలకు లొంగిపోతే హానికరమైన కోరికలు, దృక్పథాలు మనస్సులోను హృదయంలోను తెలియని రీతిగా బసచేస్తాయి. వీటిని సరిచేయకపోతే, చివరికి సాతాను విధానపు ‘అరణ్యంలో సంహరింపబడడానికి’ దారితీస్తాయి.

6. వినోదానికి సంబంధించి మనం ఏ అనుకూలమైన చర్య తీసుకోవలసిన అవసరం ఉంది?

6 బంగారు దూడ సంఘటన సమయంలో మోషేలా, ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ ఇలా చెబుతున్నాడు: “యెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి.” మనం సత్యారాధన కొరకు స్థిరంగా నిలబడతామని చూపించుకోవడానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడం జీవాన్ని రక్షించేది కాగలదు. మోషే గోత్రమైన లేవీ గోత్రపు వారు హీనమైన ప్రభావాలను తీసివేసుకోవడానికి వెంటనే చర్య గైకొన్నారు. (మత్తయి 24:45-47; నిర్గమకాండము 32:26-28) కాబట్టి మీరు వినోదం, సంగీతం, వీడియోలు మరియు అటువంటి వాటికి సంబంధించిన మీ ఎంపికను జాగ్రత్తగా పరీక్షించుకోండి. అది ఏ విధంగానైనా కలుషితమై ఉంటే, మీరు యెహోవా పక్షం వహించండి. ప్రార్థనాపూర్వకంగా దేవునిపై ఆధారపడడం ద్వారా, మీరు వినోదాన్ని మరియు సంగీతాన్ని ఎంపిక చేసుకోవడం విషయంలో మార్పులు చేసుకోండి, మోషే బంగారు దూడను నాశనం చేసినట్లు ఆత్మీయంగా హానికరమైన దాన్ని నాశనం చేయండి.—నిర్గమకాండము 32:20; ద్వితీయోపదేశకాండము 9:21.

7. మనం అలంకారార్థక హృదయాన్ని ఎలా కాపాడుకోగలం?

7 హృదయానికి పట్టే తుప్పును మనం ఎలా ఎదుర్కొనవచ్చు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించడం ద్వారా, దాని సత్యాలు మన మనస్సుల్లోకి, హృదయాల్లోకి ఇంకిపోవడానికి అనుమతించడం ద్వారా మనమలా చేయవచ్చు. (రోమీయులు 12:1, 2) అయితే, మనం క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవ్వాలి. (హెబ్రీయులు 10:24, 25) స్తబ్ధంగా కూటాలకు హాజరు కావడాన్ని తుప్పు పట్టిన దాని మీద పెయింటు వేయడంతో పోల్చవచ్చు. ఇది మనం కొంతసేపు మెరిసేలా చేయవచ్చు, కాని ఇది అంతర్లీనంగా ఉన్న సమస్యను పరిష్కరించదు. బదులుగా, ముందుగా సిద్ధపడడం, ధ్యానించడం, కూటాలలో చురుకుగా పాల్గొనడం వంటి వాటి ద్వారా, మన సూచనార్థక హృదయపు అంతర్గత భాగాలలో తుప్పు కలిగించేవాటిని మనం పూర్తిగా నిర్మూలించగలం. ఇది మనం దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండడానికి సహాయం చేస్తుంది మరియు విశ్వాస పరీక్షలను సహించి “అనూనాంగులు” కావడానికి మనల్ని బలపరుస్తుంది.—యాకోబు 1:3, 4; సామెతలు 15:28.

వ్యభిచారం గురించి హెచ్చరిక

8-10. (ఎ) 1 కొరింథీయులు 10:8 నందు ఏ హెచ్చరికా ఉదాహరణ సూచింపబడింది? (బి) మత్తయి 5:27, 28 నందు కనుగొనబడే యేసు మాటలను ప్రయోజనకరంగా ఎలా అన్వయించుకోవచ్చు?

8 పౌలు తర్వాతి ఉదాహరణలో, మనకిలా ఉపదేశించబడింది: “వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.”a (1 కొరింథీయులు 10:8) ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుళ్లకు మ్రొక్కి “మోయాబురాండ్రతో వ్యభిచారము” చేసిన కాలం గురించి అపొస్తలుడు సూచిస్తున్నాడు. (సంఖ్యాకాండము 25:1-9) లైంగిక దుర్నీతి మరణశిక్ష పొందదగినది! దుర్నీతితో కూడిన తలంపులు మరియు కోరికలు అత్యధికమయ్యేందుకు అవకాశమివ్వడం, హృదయానికి “తుప్పు పట్టడాన్ని” అనుమతించడం వంటిదే. యేసు ఇలా చెప్పాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”—మత్తయి 5:27, 28.

9 నోవహు దినాల్లోని జలప్రళయానికి పూర్వం అవిధేయులైన దేవదూతల నీచమైన ఆలోచనా విధానపు ఫలితం, ‘ఒక స్త్రీని మోహపు చూపు చూడడం’ వంటివాటి పర్యవసానాలకు నిదర్శనంగా ఉంది. (ఆదికాండము 6:1, 2) రాజైన దావీదు జీవితంలోని అత్యంత దుఃఖకరమైన సంఘటనలలో ఒకటి, ఒక స్త్రీని అసభ్యంగా చూడడాన్ని కొనసాగించడంవల్ల ప్రారంభమైనదేనని జ్ఞాపకముంచుకోండి. (2 సమూయేలు 11:1-4) దానికి విరుద్ధంగా, నీతిమంతుడు వివాహితుడునైన యోబు ‘కన్యకను చూడకుండా తన కన్నులతో నిబంధన చేసుకొన్నాడు,’ తద్వారా దుర్నీతిని విసర్జించి, యథార్థత గలవానిగా తనను తాను నిరూపించుకున్నాడు. (యోబు 31:1-3, 6-11) కళ్లను మన హృదయపు కిటికీలతో పోల్చవచ్చు. కలుషిత హృదయం నుండే అనేక దుష్ట సంగతులు వెలువడుతాయి.—మార్కు 7:20-23.

10 మనం యేసు మాటలను అన్వయించుకుంటే, అశ్లీల చిత్రాలను చూడడం ద్వారా లేక తోటి క్రైస్తవులు, ఉద్యోగస్థులు, లేక మరెవరి గురించైనా దుర్నీతితో కూడిన తలంపులను మనస్సులో ఉంచుకోవడం ద్వారా చెడు తలంపులు స్వైరవిహారం చేయడానికి మనం అనుమతించము. కేవలం తుప్పును తుడిచి వేసినంత మాత్రాన లోహానికున్న తుప్పు వదిలిపోదు. కాబట్టి, దుర్నీతితో కూడిన ఉద్దేశాలు మరియు దృక్పథాలు ఏమంత ప్రాముఖ్యమైనవి కావన్నట్లు మెల్లిగా తీసివేయకండి. దుర్నీతితో కూడిన కోరికల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తీవ్రమైన చర్యలు తీసుకోండి. (మత్తయి 5:29, 30 పోల్చండి.) పౌలు తోటి విశ్వాసులను ఇలా పురికొల్పుతున్నాడు: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.” అవును, లైంగిక దుర్నీతి వంటివాటి వలన, దేవుని శాపం యొక్క వ్యక్తీకరణగా ‘ఆయన ఉగ్రత వస్తుంది.’ కాబట్టి మనం ఈ విషయాల్లో మన అవయవములను “చంపివేయ” వలసి ఉంది.—కొలొస్సయులు 3:5, 6.

తిరుగుబాటుతో కూడిన ఫిర్యాదుల గురించి హెచ్చరిక

11, 12. (ఎ) 1 కొరింథీయులు 10:9 నందు ఏ హెచ్చరిక ఇవ్వబడింది, ఏ సంఘటన సూచింపబడింది? (బి) పౌలు హెచ్చరిక మనపై ఎలా ప్రభావం చూపాలి?

11 పౌలు తర్వాతిలా హెచ్చరిస్తున్నాడు: “మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.” (1 కొరింథీయులు 10:9) ఇశ్రాయేలీయులు ఎదోము సరిహద్దు దగ్గర అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, “ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి—ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు” అని అంటూ, అద్భుతరీతిగా అందజేయబడిన మన్నాను “చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.” (సంఖ్యాకాండము 21:4, 5) ఒకసారి ఆలోచించండి! ఆ ఇశ్రాయేలీయులు దేవుని ఏర్పాట్లు హేయమైనవని అంటూ ‘ఆయనకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు.’

12 ఇశ్రాయేలీయులు తమ ఫిర్యాదుల ద్వారా యెహోవా సహనాన్ని పరీక్షించారు. యెహోవా శిక్షించకుండా విడిచి పెట్టలేదు ఎందుకంటే ఆయన విషపూరితమైన సర్పాలను వారిపైకి పంపించాడు, ఆ సర్పాలు కరవడంతో అనేకులు మరణించారు. ప్రజలు పశ్చాత్తాపపడిన తర్వాత, మోషే వారి తరఫున వేడుకున్నప్పుడు, ఆ తెగులు అంతమయ్యింది. (సంఖ్యాకాండము 21:6-9) ప్రాముఖ్యంగా దేవునికి ఆయన దైవపరిపాలనా ఏర్పాట్లకు వ్యతిరేకంగా తిరుగుబాటుతో కూడిన, ఫిర్యాదు చేసే దృక్పథాన్ని చూపించకుండా ఈ సంఘటన కచ్చితంగా మనకు హెచ్చరికగా ఉండాలి.

సణగడం గురించి హెచ్చరిక

13. 1 కొరింథీయులు 10:10 దేని గురించి మనల్ని హెచ్చరిస్తుంది, పౌలు మనస్సులో ఏ తిరుగుబాటు ఉండినది?

13 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పటి కాలానికి సంబంధించిన తన చివరి ఉదాహరణను తెలియజేస్తూ, పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.” (1 కొరింథీయులు 10:10) కోరహు, దాతాను, అబిరాము మరియు వారి సహచరులు దైవపరిపాలనకు వ్యతిరేకంగా ప్రవర్తించి మోషే అహరోనుల అధికారాన్ని సవాలు చేసినప్పుడు తిరుగుబాటు ప్రారంభమయ్యింది. (సంఖ్యాకాండము 16:1-3) తిరుగుబాటుదారుల నాశనం తర్వాత, ఇశ్రాయేలీయులు సణగడం ప్రారంభించారు. వారలా ఎందుకు చేశారంటే, తిరుగుబాటుదారుల నాశనం అన్యాయమైనదని వారు తర్కించడం ప్రారంభించారు. సంఖ్యాకాండము 16:41 ఇలా తెలియజేస్తుంది: ‘మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు—మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పిరి.’ ఆ సందర్భంలో న్యాయం తీర్చబడిన విధానంలో వారు తప్పు ఎన్నడం మూలంగా, దైవికంగా పంపబడిన తెగులువల్ల 14,700 మంది ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు.—సంఖ్యాకాండము 16:49.

14, 15. (ఎ) సంఘంలోకి ప్రవేశించిన ‘భక్తిహీనులు’ చేసిన పాపాలలో ఒకటి ఏమిటి? (బి) కోరహుకు సంబంధించిన ఉదంతం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

14 సా.శ. మొదటి శతాబ్దంలో, క్రైస్తవ సంఘంలోకి మెల్లిగా ప్రవేశించిన ‘భక్తిహీనులు’ అబద్ధ బోధకులుగా అలాగే సణిగేవారిగా నిరూపించబడ్డారు. ఈ పురుషులు “ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను” అంటే అప్పట్లో సంఘాన్ని ఆత్మీయంగా పర్యవేక్షించే బాధ్యత అప్పగింపబడిన పరిశుద్ధులను “దూషించుచు ఉన్నారు.” దైవభక్తిలేని ఆ మతభ్రష్టుల గురించి శిష్యుడైన యూదా కూడా ఇలా చెప్పాడు: “వారు తమ దురాశలచొప్పున నడుచుచు, . . . సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునైయున్నారు.” (యూదా 3, 4, 8, 16) నేడు, కొంతమంది వ్యక్తులు తమ హృదయాల్లో ఆత్మీయ తుప్పును కలుగుజేసే దృక్పథం వృద్ధి చెందడానికి అనుమతించారు గనుక వారు సణిగేవారయ్యారు. సంఘంలో అధ్యక్ష స్థానంలో ఉన్నవారి అపరిపూర్ణతలపై వారు తరచూ తమ శ్రద్ధనుంచి, వారికి వ్యతిరేకంగా సణగడం ప్రారంభిస్తారు. వారి సణుగుడు మరియు ఫిర్యాదు చేయడం ‘నమ్మకమైన దాసుని’ ప్రచురణలను విమర్శించేంత వరకు వెళుతుంది.

15 లేఖనాధార అంశం గురించి యథార్థమైన ప్రశ్నలు అడగడం సరైనదే. సన్నిహిత స్నేహితుల వర్గంలో క్లిష్టమైన చర్చలలో వెల్లడయ్యే ప్రతికూల దృక్పథాన్ని మనం వృద్ధి చేసుకుంటే అప్పుడేమిటి? మనల్ని మనమిలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘ఇది చివరకు దేనికి దారితీస్తుంది? సణగడం మానుకుని జ్ఞానం కొరకు వినయంగా ప్రార్థించడం మంచిదికాదా?’ (యాకోబు 1:5-8; యూదా 17-21) మోషే అహరోనుల అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కోరహు ఆయన మద్దతుదారులు తమ దృక్కోణం ఎంత న్యాయబద్ధమైనదని ఒప్పించబడ్డారంటే, వారు తమ ఉద్దేశాలను పరీక్షించుకోలేదు. ఏదైనప్పటికీ, వారు పూర్తిగా దోషులే. కోరహు, ఇతర తిరుగుబాటుదారుల నాశనం గురించి సణిగిన ఇశ్రాయేలీయుల విషయం కూడా అంతే. మన ఉద్దేశాలను పరీక్షించుకోవడానికి, సణుగుడు లేక ఫిర్యాదు చేయడం వంటివాటిని విసర్జించడానికి, యెహోవా మనల్ని శుద్ధీకరించేందుకు అలాంటి ఉదాహరణలు మనల్ని పురికొల్పే అవకాశాన్నివ్వడం ఎంత జ్ఞానయుక్తమోకదా!—కీర్తన 17:1-3.

నేర్చుకుని, ఆశీర్వాదాలను పొందండి

16. 1 కొరింథీయులు 10:11, 12 నందివ్వబడిన ప్రోత్సాహం యొక్క సారాంశమేమిటి?

16 దైవ ప్రేరేపణతో, పౌలు హెచ్చరికా సందేశాల పట్టికను ఈ పురికొల్పుతో ముగించాడు: “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:11, 12) క్రైస్తవ సంఘంలో మన స్థానాన్ని మనం తక్కువగా తీసుకోకుండా ఉందాము.

17. మనం మన హృదయంలో ఏదైనా తప్పుడు దృక్పథాన్ని కనుగొంటే మనం ఏమి చేయాలి?

17 ఇనుముకు తుప్పు పట్టే గుణం ఎలా ఉంటుందో అలాగే, పాపియైన ఆదాము వారసులమైన మనం చెడును ఇష్టపడే వారసత్వాన్ని పొందాము. (ఆదికాండము 8:21; రోమీయులు 5:12) గనుక, మన హృదయంలో ఏదైనా తప్పుడు దృక్పథం ఉన్నట్లు కనుగొంటే మనం నిరుత్సాహపడకూడదు. బదులుగా, మనం నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి. ఇనుము తేమకు లేక చిలుముపట్టే పర్యావరణానికి గురైతే, దాని తుప్పుపట్టే గుణం అధికమౌతుంది. మనం చెడు వినోదం, విస్తృత దుర్నీతి, ప్రతికూల దృక్పథంగల సాతాను ప్రపంచపు “గాలికి” గురికాకుండా చూసుకోవలసిన అవసరత ఉంది.—ఎఫెసీయులు 2:1, 2.

18. మానవజాతి యొక్క తప్పుడు దృక్పథాలకు సంబంధించి యెహోవా ఏమి చేశాడు?

18 మనం వారసత్వంగా పొందిన తప్పుడు దృక్పథాలను ఎదుర్కొనేందుకు యెహోవా మానవజాతి కొరకు ఒక ఏర్పాటు చేశాడు. తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచే వారు నిత్యజీవాన్ని పొందగలిగేలా ఆయన అనుగ్రహించాడు. (యోహాను 3:16) మనం యేసు అడుగుజాడలను సన్నిహితంగా అనుసరిస్తూ క్రీస్తువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే, మనం ఇతరులకు దీవెనగా ఉండగలం. (1 పేతురు 2:21) మనం కూడా శాపములను కాదు గాని దైవిక దీవెనలను పొందుతాము.

19. లేఖనాధార ఉదాహరణలను పరిశీలించడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందగలము?

19 నేడు మనం ప్రాచీన కాలం నాటి ఇశ్రాయేలీయులవలెనే తప్పు చేసే అవకాశమున్నప్పటికీ, మనల్ని నడిపించేందుకు మనకు దేవుని పూర్తి లిఖిత వాక్యం ఉంది. దాని పుటల నుండి మనం మానవజాతితో యెహోవా వ్యవహారాల గురించి, ‘దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయున్న’ యేసునందు ఉదాహరింపబడిన ఆయన లక్షణాల గురించి తెలుసుకుంటాము. (హెబ్రీయులు 1:1-3; యోహాను 14:9, 10) ప్రార్థన మరియు లేఖనాల శ్రద్ధతో కూడిన పఠనం ద్వారా, మనం “క్రీస్తు మనస్సు” కలిగివుండవచ్చు. (1 కొరింథీయులు 2:16) శోధనలను, మన విశ్వాసానికి సంబంధించిన ఇతర పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, ప్రాచీన లేఖనాధార ఉదాహరణలను ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క విశిష్టమైన ఉదాహరణను పరిశీలించడం నుండి మనం ప్రయోజనం పొందగలము. మనమలా చేస్తే, మనం దైవికంగా వచ్చే శాపములను అనుభవించనక్కరలేదు. బదులుగా, మనం నేడు యెహోవా అనుగ్రహాన్ని, నిరంతరం ఆయన ఆశీర్వాదాలను పొందుతాము.

[అధస్సూచీలు]

a జూలై 15, 1992 కావలికోట (ఆంగ్లం) పేజీ 4 చూడండి.

మీరెలా సమాధానమిస్తారు?

◻ విగ్రహారాధికులు కాకుండుడి అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు?

◻ జారత్వానికి వ్యతిరేకంగా అపొస్తలుడిచ్చిన హెచ్చరికను లక్ష్యపెట్టడానికి మనం ఏమి చేయవచ్చు?

◻ మనం సణగడాన్ని, ఫిర్యాదు చేయడాన్ని ఎందుకు మానుకోవాలి?

◻ శాపములను కాకుండా మనం దైవిక ఆశీర్వాదాలను ఎలా పొందవచ్చు?

[18వ పేజీలోని చిత్రం]

మనకు దైవిక ఆశీర్వాదాలు కావాలంటే, మనం విగ్రహారాధనను విసర్జించాలి

[20వ పేజీలోని చిత్రం]

తుప్పు ఎలా తీసివేయబడాలో అలాగే మన హృదయాల్లో నుండి తప్పుడు కోరికలను తీసివేసుకోవడానికి మనం అనుకూల చర్యలు గైకొందాము

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి