యెహోవా కుటుంబం అమూల్యమైన ఐక్యతను అనుభవిస్తుంది
“సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”—కీర్తన 133:1.
1. నేడు అనేక కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది?
కుటుంబం నేడు సంక్షోభంలో ఉంది. అనేక కుటుంబాల్లో, వివాహ బంధాలు తెగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. విడాకులివ్వడం సర్వసాధారణమైపోతుంది, విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలనేకమంది ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కోటానుకోట్ల కుటుంబాలు అసంతోషంగా, అనైక్యంగా ఉన్నాయి. అయితే నిజమైన ఆనందం, అసలైన ఐక్యత తెలిసిన కుటుంబం ఒకటుంది. అది యెహోవా దేవుని విశ్వ కుటుంబం. దానిలో, వేలాదిమంది అదృశ్య దేవదూతలు దైవిక చిత్తానికి అనుగుణంగా, తమకు కేటాయించిన పనులను నిర్వర్తిస్తారు. (కీర్తన 103:20, 21) కాని అలాంటి ఐక్యతను అనుభవించే కుటుంబమేదైనా భూమ్మీద ఉందా?
2, 3. (ఎ) దేవుని విశ్వ కుటుంబంలో ఇప్పుడు ఎవరు ఒక భాగంగా ఉన్నారు, నేటి యెహోవాసాక్షులందరిని మనం దేనితో పోల్చవచ్చు? (బి) మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాము?
2 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూనుచున్నాను.’ (ఎఫెసీయులు 3:14, 15) భూమిపైనున్న ప్రతి కుటుంబ వంశావళి దేవునినిబట్టి కుటుంబమని పిలువబడుతుంది, ఎందుకంటే ఆయనే సృష్టికర్త. పరలోకంలో మానవ కుటుంబాలు లేకపోయినప్పటికీ, సూచనార్థకంగా చెప్పాలంటే దేవునికి తన పరలోక సంస్థతో వివాహమయ్యింది, పరలోకంలో యేసు తన ఆత్మీయ పెండ్లి కుమార్తెతో ఐక్యమౌతాడు. (యెషయా 54:5; లూకా 20:34, 35; 1 కొరింథీయులు 15:50; 2 కొరింథీయులు 11:2) భూమిపైనున్న నమ్మకమైన అభిషిక్తులు దేవుని విశ్వ కుటుంబంలో ఇప్పుడు భాగమైయున్నారు మరియు భూ నిరీక్షణగల యేసు యొక్క “వేరే గొఱ్ఱెలు” దాని భవిష్యత్ సభ్యులు. (యోహాను 10:16; రోమీయులు 8:14-17; కావలికోట 1996 జనవరి 15, పేజీ 31) అయితే, నేటి యెహోవాసాక్షులందరినీ ప్రపంచవ్యాప్త ఐక్యకుటుంబంతో పోల్చవచ్చు.
3 దేవుని సేవకుల అద్భుతమైన అంతర్జాతీయ కుటుంబంలో మీరొక భాగమా? మీరొక భాగమైతే, ఒకరు పొందగల మహాగొప్ప ఆశీర్వాదాలలో ఒకదాన్ని మీరు ఆనందించవచ్చు. కలహం మరియు అనైక్యతగల ప్రపంచపు ఎడారిలో యెహోవా యొక్క విశ్వకుటుంబం, అంటే ఆయన దృశ్య సంస్థ ఒక పచ్చనిప్రదేశంలా ఉందని లక్షలాదిమంది అంగీకరిస్తారు. యెహోవా ప్రపంచవ్యాప్త కుటుంబం యొక్క ఐక్యతను ఎలా వర్ణించవచ్చు? అలాంటి ఐక్యతకు ఏ అంశాలు దోహదపడతాయి?
ఎంత మేలు! ఎంత మనోహరము!
4. సహోదర ఐక్యత గురించి కీర్తన 133 చెబుతున్నదాన్ని మీరు మీ స్వంత మాటల్లో ఎలా వ్యక్తపరుస్తారు?
4 సహోదర ఐక్యతను కీర్తనల గ్రంథకర్త లోతుగా గుణగ్రహించాడు. దాని గురించి ఆలపించేలా కూడా ఆయన ప్రేరేపించబడ్డాడు. ఆయన తన బూర చేతపట్టుకుని ఇలా పాడడాన్ని ఊహించండి: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును. సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచువలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.”—కీర్తన 133:1-3.
5. కీర్తన 133:1, 2 ఆధారంగా, ఇశ్రాయేలీయులకు దేవుని ప్రస్తుతదిన సేవకులకు ఏ పోలిక ఉంది?
5 దేవుని ప్రాచీన ప్రజలైన ఇశ్రాయేలీయులు అనుభవించిన సహోదర ఐక్యతకు ఆ మాటలు అన్వయింపబడ్డాయి. వారు తమ మూడు సాంవత్సరిక పండుగల కొరకు యెరూషలేములో ఉన్నప్పుడు ఐక్యతతో కలిసివుండేవారు. వారు వివిధ గోత్రాల నుండి వచ్చినప్పటికీ వారు ఒకే కుటుంబంవారే. ఆహ్లాదం కలిగించే సువాసనగల, ఉత్తేజవంతమైన అభిషేక తైలంలా, కలిసి ఉండడం వారిపై చక్కని ప్రభావాన్ని చూపేది. అలాంటి తైలం అహరోను తలమీద పోయబడినప్పుడు, అది ఆయన గడ్డముమీదుగా కారి అతని అంగీ అంచువరకు దిగజారేది. ఇశ్రాయేలీయుల విషయంలో కలిసి ఉండడమన్నది, సమకూడిన వారందరిపై మంచి ప్రభావాన్ని చూపింది. అపార్థాలు తొలగిపోయేవి, ఐక్యత పెంపొందేది. నేడు యెహోవా విశ్వ కుటుంబంలో అలాంటి ఐక్యతే ఉంది. క్రమంగా సమకూడడం దాని సభ్యులపై మంచి ఆత్మీయ ప్రభావాన్ని చూపుతుంది. దేవుని వాక్య ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు ఏవైనా అపార్థాలు లేక కష్టాలు ఉంటే అవి తొలగింపబడుతాయి. (మత్తయి 5:23, 24; 18:15-17) తమ సహోదర ఐక్యత ఫలితంగా వచ్చే పరస్పర ప్రోత్సాహాన్ని యెహోవా ప్రజలు గొప్పగా మెచ్చుకుంటారు.
6, 7. ఇశ్రాయేలీయుల ఐక్యత ఎలా హెర్మోను పర్వతం మీది మంచులా ఉంది, నేడు దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?
6 ఇశ్రాయేలీయుల ఐక్య సహజీవనం హెర్మోను పర్వతంపైని మంచువలె ఎలా ఉండేది? ఈ పర్వతం యొక్క శిఖరాగ్రం సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తున ఉంది గనుక అది దాదాపు సంవత్సరమంతా మంచుతో కప్పబడివుండేది. మంచుతో కప్పబడిన హెర్మోను శిఖరం రాత్రి ఆవిరిని గడ్డకట్టేలా చేసి, సుదీర్ఘమైన ఎండాకాలంలో చెట్లు చేమలను కాపాడే పుష్కలమైన మంచును ఉత్పన్నం చేస్తుంది. హెర్మోను పర్వత శ్రేణి మీది చల్లని మేఘాలు అలాంటి ఆవిరులను దక్షిణంగా యెరూషలేమంత దూరం తీసుకువెళ్లగలవు, అక్కడ అవి మంచుగా గడ్డకడతాయి. కాబట్టి కీర్తనల గ్రంథకర్త ‘సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు’ గురించి సరిగ్గానే చెప్పాడు. యెహోవా ఆరాధికుల కుటుంబ ఐక్యతను పెంపొందింపజేసే ఆహ్లాదకరమైన ప్రభావం యొక్క ఎంత చక్కని జ్ఞాపికనో కదా!
7 క్రైస్తవ సంఘం స్థాపించబడక మునుపు, సీయోను లేక యెరూషలేము సత్యారాధనకు కేంద్రంగా ఉండేది. గనుక, అక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదాలన్నిటి మూలం యెరూషలేములోని పరిశుద్ధ స్థలంలో సాదృశ్యంగా ఉండేది గనుక, ఆశీర్వాదాలు అక్కడి నుండి ప్రసరించేవి. అయితే, సత్యారాధన ఇక ఏ ఒక్క స్థలంపై ఆధారపడిలేదు గనుక దేవుని సేవకుల ఆశీర్వాదం, ప్రేమ, ఐక్యత నేడు భూమియందంతటా కనుగొనబడుతుంది. (యోహాను 13:34, 35) ఈ ఐక్యతను పెంపొందింపజేసే కొన్ని అంశాలు ఏవి?
ఐక్యతను పెంపొందింపజేసే అంశాలు
8. యోహాను 17:20, 21 నందు ఐక్యత గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
8 యెహోవా ఆరాధికుల ఐక్యత, యేసుక్రీస్తు బోధలతో సహా సరిగ్గా అర్థం చేసుకొనబడిన దేవుని వాక్యంతోగల పొందికపై ఆధారపడివుంది. సత్యానికి సాక్ష్యమిచ్చేందుకు, బలిగా మరణించేందుకు యెహోవా తన కుమారున్ని ఈ లోకంలోకి పంపించడం ద్వారా ఐక్య క్రైస్తవ సంఘం ఏర్పడడానికి మార్గం సుగమమయ్యింది. (యోహాను 3:16; 18:37) “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను” అని యేసు ప్రార్థించినప్పుడు దాని సభ్యుల మధ్య నిజమైన ఐక్యత ఉండాలన్నది స్పష్టమైంది. (యోహాను 17:20, 21) యేసు అనుచరులు దేవునికి, ఆయన కుమారునికి మధ్య ఉన్నటువంటి ఐక్యతనే సంపాదించుకున్నారు. దేవుని వాక్యాన్ని, బోధలను వారు సమ్మతించారు గనుక ఇది జరిగింది. నేడు యెహోవా యొక్క ప్రపంచవ్యాప్త కుటుంబంలోని ఐక్యత విషయంలో కూడా ఇదే దృక్పథం ముఖ్యాంశంగా ఉంది.
9. యెహోవా ప్రజల ఐక్యతలో పరిశుద్ధాత్మ ఏ పాత్ర వహిస్తుంది?
9 యెహోవా ప్రజలను ఐక్యపరిచే మరో అంశం ఏమిటంటే దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి మనకు లభించడమే. యెహోవా వాక్యం యొక్క బయల్పర్చబడిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఐక్యంగా ఆయన సేవ చేయడానికి అది మనకు సహాయం చేస్తుంది. (యోహాను 16:12, 13) కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలవంటి అనైక్యత కలిగించే శరీర కార్యాలను విసర్జించడానికి ఆత్మ మనకు సహాయం చేస్తుంది. బదులుగా, దేవుని ఆత్మ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి ఐక్యత కలిగించే ఫలాలను వృద్ధి చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.—గలతీయులు 5:19-23.
10. (ఎ) ఐక్య మానవ కుటుంబంలో ఉండే ప్రేమకు, యెహోవాకు సమర్పించుకున్నవారి మధ్యనున్న ప్రేమకు ఏ సమాంతరం ఉంది? (బి) తన ఆత్మీయ సహోదరులను కలవడాన్ని గూర్చిన తన భావాలను పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఎలా వ్యక్తపర్చాడు?
10 ఐక్య కుటుంబంలోని సభ్యులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, కలిసి ఉండడానికి సంతోషిస్తారు. అలాగే, యెహోవా ఆరాధికుల ఐక్య కుటుంబంలోనివారు ఆయనను ఆయన కుమారున్ని తోటి విశ్వాసులను ప్రేమిస్తారు. (మార్కు 12:30; యోహాను 21:15-17; 1 యోహాను 4:21) ప్రేమగల భౌతిక కుటుంబం కలిసి భోజనం చేయడాన్ని ఆనందించినట్లే, దేవునికి సమర్పించుకున్నవారు చక్కని సహవాసం నుండి, శ్రేష్ఠమైన ఆత్మీయాహారం నుండి ప్రయోజనం పొందడానికి క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరు కావడానికి ఎంతో ఇష్టపడతారు. (మత్తయి 24:45-47; హెబ్రీయులు 10:24, 25) యెహోవాసాక్షుల పరిపాలక సభలోని ఒక సభ్యుడు విషయాన్ని ఈ విధంగా చెప్పాడు: “సహోదరులను కలవడం నాకు జీవితంలో అత్యంత గొప్ప ఆనందానికి, ప్రోత్సాహానికి మూలం. వీలైతే, రాజ్యమందిరానికి మొదట వచ్చి చివరికి వెళ్లిపోయేవారిలో ఉండడానికి నేను ఇష్టపడతాను. దేవుని ప్రజలతో మాట్లాడేటప్పుడు నేను అంతర్గత ఆనందాన్ని పొందుతాను. నేను వారి మధ్య ఉన్నప్పుడు సేదతీరినట్లు, నా కుటుంబంతో ఉన్నట్లు భావిస్తాను.” మీరు కూడా అలాగే భావిస్తారా?—కీర్తన 27:4.
11. యెహోవాసాక్షులు ప్రాముఖ్యంగా ఏ పనిలో ఆనందాన్ని కనుగొంటారు, మన జీవితాల్లో దేవుని సేవను ముఖ్య ధ్యేయంగా చేసుకోవడంలోని ఫలితాలేమిటి?
11 ఒక ఐక్య కుటుంబం కలిసి పనిచేయడంలో ఆనందాన్ని కనుగొంటుంది. అలాగే, యెహోవా ఆరాధికుల కుటుంబంలోని వారు తమ రాజ్యప్రకటన పనిని, శిష్యుల్ని చేసే పనిని ఐక్యంగా చేయడంలో ఆనందాన్ని కనుగొంటారు. (మత్తయి 24:14; 28:19, 20) క్రమంగా అందులో పాల్గొనడం మనల్ని మిగతా యెహోవాసాక్షులకు సన్నిహితం చేస్తుంది. మన జీవితాల్లో దేవుని సేవను ముఖ్య ధ్యేయంగా పెట్టుకోవడం మరియు ఆయన ప్రజల కార్యాలన్నిటికీ మద్దతునివ్వడం కూడా మనలో కుటుంబ స్ఫూర్తి పెంపొందేలా చేస్తుంది.
దైవపరిపాలనా క్రమం ప్రాముఖ్యం
12. సంతోషభరిత, ఐక్య కుటుంబం యొక్క లక్షణాలేవి, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాల్లో ఏ ఏర్పాటు ఐక్యతను పెంపొందింపజేసింది?
12 పటిష్ఠమైన, ప్రేమపూర్వకమైన నాయకత్వం, క్రమంగల కుటుంబం తప్పకుండా ఐక్యంగా, సంతోషంగా ఉంటుంది. (ఎఫెసీయులు 5:22, 33; 6:1) యెహోవా సమాధానకరమైన క్రమంగల దేవుడు, ఆయన కుటుంబంలో ఉండేవారందరూ ఆయనను ‘మహోన్నతునిగా’ పరిగణిస్తారు. (దానియేలు 7:18, 22, 25, 27; 1 కొరింథీయులు 14:33) ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును అన్నిటికీ వారసునిగా నియమించి, ఆయనకు పరలోకంలోను భూమిపైనా అధికారమంతా అప్పగించాడని కూడా వారు గుర్తిస్తారు. (మత్తయి 28:18; హెబ్రీయులు 1:1, 2) క్రీస్తు శిరస్సుగాగల క్రైస్తవ సంఘం క్రమం మరియు ఐక్యతగల సంస్థ. (ఎఫెసీయులు 5:23) మొదటి శతాబ్దపు సంఘాల కార్యాలను పర్యవేక్షించేందుకు, అపొస్తలులతోనూ ఆత్మీయంగా పరిపక్వతకెదిగిన ఇతర ‘పెద్దలతోనూ’ కూడిన ఒక పరిపాలక సభ ఉండేది. ఒక్కో సంఘానికి నియమిత అధ్యక్షులు లేక పెద్దలు మరియు పరిచర్య సేవకులు ఉండేవారు. (అపొస్తలుల కార్యములు 15:6; ఫిలిప్పీయులు 1:1) నాయకత్వం వహించేవారికి విధేయత చూపడం ఐక్యతను పెంపొందింపజేసేది.—హెబ్రీయులు 13:17.
13. యెహోవా ప్రజలను ఎలా ఆకర్షిస్తున్నాడు, దాని ఫలితమేమిటి?
13 కాని, యెహోవా ఆరాధికుల ఐక్యతకు సమర్థవంతమైన, కఠినమైన నాయకత్వం కారణమని ఈ క్రమమంతా సూచిస్తుందా? ఎంతమాత్రం కాదు! దేవునికి లేక ఆయన సంస్థకు సంబంధించినంత వరకు ప్రేమరాహిత్యమైనదేది లేదు. ప్రేమ చూపించడం ద్వారా యెహోవా ప్రజలను ఆకర్షిస్తున్నాడు, దేవునికి తమ హృదయపూర్వక సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది స్వచ్ఛందంగా, ఆనందంగా యెహోవా సంస్థలో భాగమౌతున్నారు. వారి మానసిక దృక్పథం, తోటి ఇశ్రాయేలీయులను ఇలా పురికొల్పిన యెహోషువవలె ఉంది: “మీరు ఎవని సేవించెదరో . . . నేడు మీరు కోరుకొనుడి; . . . నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహోషువ 24:15.
14. యెహోవా సంస్థ దైవపరిపాలనా సంబంధమైనదని మనమెందుకు చెప్పవచ్చు?
14 యెహోవా కుటుంబంలో ఒక భాగంగా, మనం ఆనందంగానే కాదు సురక్షితంగా కూడా ఉన్నాము. ఎందుకంటే, ఆయన సంస్థ దైవపరిపాలన సంబంధమైనది. దేవుని రాజ్యం అంటే దైవపరిపాలన (గ్రీకులో థియోస్ అంటే దేవుడు, క్రాతోస్ అంటే పరిపాలన). అది దేవుడు చేసే పరిపాలన, అది ఆయన నెలకొల్పినది, స్థాపించినది. యెహోవా యొక్క అభిషిక్త “పరిశుద్ధ జనము” ఆయన పరిపాలనకు లోబడుతుంది గనుక అది కూడా దైవపరిపాలనకు సంబంధించినదే. (1 పేతురు 2:9) గొప్ప దైవపరిపాలకుడైన యెహోవా మన న్యాయాధిపతిగా శాసనకర్తగా రాజుగా ఉన్నందున మనం సురక్షితంగా ఉన్నట్లు భావించడానికి ప్రతి కారణం ఉంది. (యెషయా 33:22) అయినప్పటికీ, ఏదైనా వివాదం రేకెత్తి మన ఆనందానికి భద్రతకు ఐక్యతకు ప్రమాదం కలుగజేస్తే అప్పుడేమిటి?
పరిపాలక సభ చర్య తీసుకుంటుంది
15, 16. మొదటి శతాబ్దంలో ఏ వివాదం తలెత్తింది, ఎందుకు?
15 ఒక కుటుంబ ఐక్యతను కాపాడడానికి, అప్పుడప్పడు ఏదైనా వివాదాన్ని పరిష్కరించవలసి రావచ్చు. అయితే, సా.శ. మొదటి శతాబ్దంలోని దేవుని ఆరాధికుల కుటుంబ ఐక్యతను కాపాడడానికి ఒక ఆత్మీయ సమస్యను పరిష్కరించవలసి వచ్చిందనుకోండి. అప్పుడేమి చేయాలి? నేడు ఆత్మీయ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ, పరిపాలక సభ చర్య తీసుకుంది. అలాంటి చర్యను గూర్చిన లేఖనాధార వృత్తాంతం మనకుంది.
16 సుమారు సా.శ. 49 ఆ ప్రాంతంలో ఒక గంభీరమైన సమస్యను పరిష్కరించి, తద్వారా “దేవుని యింటి” ఐక్యతను కాపాడేందుకు పరిపాలక సభ యెరూషలేములో సమావేశమైంది. (ఎఫెసీయులు 2:19) సుమారు 13 సంవత్సరాలకు మునుపు, అపొస్తలుడైన పేతురు కొర్నేలికి ప్రకటించాడు, మొదటి అన్యులు లేక అన్యజనాంగాలు బాప్తిస్మం పొందిన విశ్వాసులయ్యారు. (అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము) పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్ర సమయంలో, అనేకమంది అన్యులు క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. (అపొస్తలుల కార్యములు 13:1–14:28) వాస్తవానికి, అంతియొకయ, సిరియలలో అన్యులైన క్రైస్తవులతో కూడిన ఒక సంఘం స్థాపించబడింది. మతమార్పిడి చేసుకున్న అన్యులు సున్నతి పొందాలని, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని కొంతమంది యూదా క్రైస్తవులు విశ్వసించారు, కాని ఇతరులు సమ్మతించలేదు. (అపొస్తలుల కార్యములు 15:1-5) ఈ వివాదం పూర్తి అనైక్యతకు, ప్రత్యేక యూదా మరియు అన్యుల సంఘాలు ఏర్పడడానికి కూడా దారి తీసివుండేది. కాబట్టి క్రైస్తవ ఐక్యతను కాపాడేందుకు పరిపాలక సభ సత్వర చర్యలు గైకొన్నది.
17. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఏ సమన్వయపూరితమైన దైవపరిపాలనా విధానం వివరించబడింది?
17 అపొస్తలుల కార్యములు 15:6-22 ప్రకారం, “అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి.” అంతియొకయ నుండి వచ్చిన బృందంతోపాటు ఇతరులు కూడా అక్కడ ఉన్నారు. ‘అన్యజనులు తన నోట సువార్త వాక్యము విని విశ్వసించారని’ మొదట పేతురు వివరించాడు. ఆ తర్వాత బర్నబా, పౌలు “తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను” వివరించగా “ఆ సమూహమంతయు” విన్నది. ఆ ప్రశ్నను ఎలా పరిష్కరించవచ్చో యాకోబు తదుపరి సూచించాడు. పరిపాలక సభ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, మనకిలా చెప్పబడుతుంది: ‘తమలో ముఖ్యులైన వారిని ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచింది.’ అలా ‘ఏర్పరచుకొనబడిన’ యూదా మరియు సీల తోటివిశ్వాసులకు ప్రోత్సాహకరమైన లేఖను తీసుకువెళ్లారు.
18. ధర్మశాస్త్రానికి సంబంధించి పరిపాలక సభ ఏ నిర్ణయం తీసుకుంది, ఇది యూదా మరియు అన్య క్రైస్తవులను ఎలా ప్రభావితం చేసింది?
18 పరిపాలక సభ యొక్క నిర్ణయాన్ని ప్రకటించిన ఆ లేఖ ఈ మాటలతో ప్రారంభమయ్యింది: “అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము.” ఇతరులు ఈ చారిత్రాత్మక సమావేశానికి హాజరయ్యారు, కాని పరిపాలక సభలో ‘అపొస్తలులు, పెద్దలు’ ఉండేవారన్నది స్పష్టం. దేవుని ఆత్మ వారికి నడిపింపునిచ్చింది, ఎందుకంటే లేఖ ఇలా తెలియజేసింది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను.” (అపొస్తలుల కార్యములు 15:23-29, ఇటాలిక్కులు మావి.) క్రైస్తవులు సున్నతి పొంది మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకుండెను. యూదా మరియు అన్య క్రైస్తవులు ఐక్యతతో మెలగడానికి, మాట్లాడడానికి ఈ నిర్ణయం వారికి సహాయం చేసింది. సంఘాలు ఆనందించాయి, అమూల్యమైన ఐక్యత కొనసాగింది, యెహోవాసాక్షుల పరిపాలక సభ యొక్క ఆత్మీయ నడిపింపు క్రింద నేడు దేవుని ప్రపంచ వ్యాప్త కుటుంబంలో కూడా అలాగే జరుగుతుంది.—అపొస్తలుల కార్యములు 15:30-35.
దైవపరిపాలనా ఐక్యతతో సేవచేయండి
19. యెహోవా ఆరాధికుల కుటుంబంలో ఐక్యత ఎందుకు వృద్ధిచెందింది?
19 కుటుంబంలోని సభ్యులు ఒకరితో ఒకరు సహకరించుకుంటే ఐక్యత వర్ధిల్లుతుంది. యెహోవా ఆరాధికుల కుటుంబం విషయంలో కూడా అది వాస్తవం. మొదటి శతాబ్ద సంఘంలోని పెద్దలు మరితరులు దైవపరిపాలనకు కట్టుబడి ఉండడం ద్వారా, పరిపాలక సభతో పూర్తిగా సహకరించి దేవుని సేవ చేస్తూ, దాని నిర్ణయాలను అంగీకరించారు. పరిపాలక సభ సహాయంతో పెద్దలు ‘వాక్యాన్ని ప్రకటించారు’ మరియు సంఘాల్లోని సభ్యులు ‘ఏకభావంతో మాట్లాడారు.’ (2 తిమోతి 4:1, 2; 1 కొరింథీయులు 1:10) కాబట్టి పరిచర్యలోను, క్రైస్తవ కూటాల్లోను, యెరూషలేము అంతియొకయ రోమ్ కొరింథులలోనైనా లేక మరెక్కడైనా అవే లేఖనాధార సత్యాలు అందజేయబడేవి. నేడు అలాంటి దైవపరిపాలనా ఐక్యతే ఉంది.
20. మన క్రైస్తవ ఐక్యతను కాపాడుకునేందుకు, మనం ఏమి చేయాలి?
20 మన ఐక్యతను కాపాడుకోవడానికి, యెహోవా విశ్వ కుటుంబంలో భాగమైన మనమందరమూ దైవపరిపాలనా ప్రేమను చూపించడానికి ప్రయాసపడాలి. (1 యోహాను 4:16) మనం దేవుని చిత్తానికి లోబడి, ‘నమ్మకమైన దాసుని’ ఎడల మరియు పరిపాలక సభ ఎడల ప్రగాఢ గౌరవం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవునికి మన సమర్పణ వలెనే, మన విధేయత కూడా స్వచ్ఛందమైనది, ఆనందభరితమైనది. (1 యోహాను 5:3) కీర్తనల గ్రంథకర్త ఆనందాన్ని విధేయతను ఎంత చక్కగా కలిపాడోకదా! ఆయనిలా ఆలపించాడు: “యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.”—కీర్తన 112:1.
21. దైవపరిపాలనకు కట్టుబడి ఉండేవారిగా మనల్ని మనం ఎలా నిరూపించుకోగలము?
21 సంఘ శిరస్సయిన యేసు పూర్తిగా దైవపరిపాలనకు కట్టుబడి ఉండేవాడు, ఆయన ఎల్లప్పుడు తన తండ్రి చిత్తాన్ని చేశాడు. (యోహాను 5:30) కాబట్టి మనం, యెహోవా సంస్థతో సంపూర్ణంగా సహకరిస్తూ ఆయన చిత్తాన్ని దైవపరిపాలన సంబంధంగా, ఐక్యంగా చేయడంలో మన మాదిరికర్తను అనుసరిద్దాము. అప్పుడు హృదయపూర్వక ఆనందంతోను, కృతజ్ఞతతోనూ మనం కీర్తనల గ్రంథకర్త యొక్క ఈ గీతాన్ని ప్రతిధ్వనింపజేయవచ్చు: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”
మీరెలా సమాధానమిస్తారు?
◻ మన క్రైస్తవ ఐక్యతను కీర్తన 133తో ఎలా పొందుపర్చవచ్చు?
◻ ఐక్యతను పెంపొందింపజేసే కొన్ని అంశాలు ఏవి?
◻ దేవుని ప్రజల ఐక్యత కొరకు దైవపరిపాలనా క్రమం ఎందుకు ప్రాముఖ్యం?
◻ ఐక్యతను కాపాడేందుకు మొదటి శతాబ్దపు పరిపాలక సభ ఎలా చర్యగైకొన్నది?
◻ మీ విషయంలో, దైవపరిపాలనా ఐక్యతతో సేవ చేయడమంటే ఏమిటి?
[13వ పేజీలోని చిత్రం]
ఐక్యతను కాపాడడానికి పరిపాలక సభ చర్యతీసుకుంది