నిజమైన క్రైస్తవ ఐక్యత—ఎలా సాధ్యమవుతుంది?
1 దాదాపు 380 భాషా గుంపులకు చెందిన, 234 దేశాల నుండి వచ్చిన అరవై లక్షలకంటే ఎక్కువమందిని ఏది ఐక్యపరచగలదు? కేవలం యెహోవా దేవుని ఆరాధన మాత్రమే. (మీకా 2:12; 4:1-3) నిజమైన క్రైస్తవ ఐక్యత నేడొక వాస్తవమని యెహోవాసాక్షులు వ్యక్తిగత అనుభవం నుండి తెలుసుకొన్నారు. ‘ఒకే గొఱ్ఱెల కాపరి’ క్రిందగల ‘ఒకే మందగా’ మనం ఈ లోక విభాగిత స్వభావాన్ని ఎదిరించడానికి తీర్మానించుకున్నాం.—యోహా. 10:16; ఎఫె. 2:2.
2 బుద్ధిసూక్ష్మతగల తన సృష్టి ప్రాణులందరూ సత్యారాధనలో ఐక్యంగా ఉండలనేదే దేవుని శాశ్వత సంకల్పం. (ప్రక. 5:13) యేసుకు దీని ప్రాముఖ్యత తెలుసు గనుకనే ఆయన తన అనుచరుల ఐక్యత కోసం నిండు మనస్సుతో ప్రార్థన చేశాడు. (యోహా. 17:20, 21) క్రైస్తవ సంఘ ఐక్యతకు మనలో ప్రతీ ఒక్కరం ఎలా దోహదపడవచ్చు?
3 ఐక్యత సాధించబడుతున్న విధానం: దేవుని వాక్యం, దేవుని ఆత్మ లేకుండా క్రైస్తవ ఐక్యత అసాధ్యం. బైబిల్లో మనం చదివేది అన్వయించుకోవడం, మన జీవితాల్లో దేవుని ఆత్మ నిరాటంకంగా ప్రవహించేలా చేస్తుంది. అది ‘సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి’ మనకు సహాయం చేస్తుంది. (ఎఫె. 4:1) అలాగే ప్రేమతో పరస్పరం సహించుకోవడానికి మనలను ప్రేరేపిస్తుంది. (కొలొ. 3:13, 14; 1 పేతు. 4:8) ప్రతీ రోజు దేవుని వాక్యం గురించి ధ్యానించడం ద్వారా మీరు ఐక్యతను ప్రోత్సహిస్తారా?
4 ప్రకటించి, శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞ సైతం మనలను ఐక్యపరుస్తుంది. “సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు” క్రైస్తవ పరిచర్యలో మనం ఇతరులతో కలిసి పనిచేసినప్పుడు, మనం ‘సత్యానికి సహాయకులముగా’ తయారవుతాము. (ఫిలి. 1:27; 3 యోహా. 8, అధస్సూచి) మనమలా చేస్తుండగా, సంఘంలో ఐక్యపరిచే ప్రేమ బంధాలు బలోపేతమవుతాయి. ఇటీవల మీరు కలిసిపనిచేయని ఎవరినైనా ఈ వారం మీతో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడానికి రమ్మని ఎందుకు ఆహ్వానించకూడదు?
5 నేడు భూమ్మీది ఏకైక, నిజమైన, అంతర్జాతీయ సహోదరత్వంలో మనం భాగమై ఉండడం ఎంత దీవెనకరం! (1 పేతు. 5:9) ఇటీవల జరిగిన “దేవుణ్ణి మహిమపరచండి” అంతర్జాతీయ సమావేశాల్లో ఈ భౌగోళిక ఐక్యతను వేలాదిమంది ప్రత్యక్షంగా చవిచూశారు. ప్రతీరోజు దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రేమతో విభేదాలు పరిష్కరించుకోవడం ద్వారా, ‘ఏకభావముతో’ సువార్త ప్రకటించడం ద్వారా మనలో ప్రతీ ఒక్కరం ఈ ప్రశస్త ఐక్యతకు దోహదపడుదుము గాక.—రోమా. 15:5