కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 8/1 పేజీలు 4-8
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హెబ్రీ లేఖనాల్లో ప్రాణము
  • గ్రీక్‌ ప్రభావం
  • ప్రాణమును గూర్చి తొలి క్రైస్తవుల దృక్పథం
  • సిద్ధాంతాల నిజమైన ఆరంభాలు
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఆత్మ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 8/1 పేజీలు 4-8

ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ

రోమా సైనికులు అలా జరుగుతుందని అపేక్షించనేలేదు. యూదా తిరుగుబాటు దళాల చివరి దుర్గమైన మసాడ పర్వత కోటను ముట్టడిస్తూ వెళుతూ శత్రువులపై తాము చేయబోయే దాడికి తమ్మును తాము సిద్ధపర్చుకున్నారు, యుద్ధయోధుల అరుపులను స్త్రీలూ పిల్లల కేకలను వినేందుకు తమ్మును తాము సిద్ధపర్చుకున్నారు. కానీ, చిఱుచిఱుమనే జ్వాలల చప్పుడు మాత్రమే వారికి వినిపించింది. మండుతున్న ఆ దుర్గాన్ని రోమీయులు పరిశీలిస్తుండగా వారు భయంకరమైన సత్యాన్ని తెలుసుకున్నారు: తమ శత్రువులు అంటే సుమారు 960 మంది ప్రజలు అప్పటికే చనిపోయారు! క్రమంగా, యూదా యుద్ధయోధులు తమ స్వంత కుటుంబాలను ఆ తర్వాత ఒకరినొకరు చంపుకున్నారు. చివరి వ్యక్తి తన్నుతాను చంపుకున్నాడు.a భయానకమైన ఈ సామూహిక హత్యలూ ఆత్మహత్యలు చేసుకునేందుకు వారిని ఏది నడిపింది?

సమకాలీన చరిత్రకారుడైన జోసీఫస్‌ ప్రకారంగా, ఇలా జరగడానికి ముఖ్య కారణం అమర్త్యమైన ప్రాణములో విశ్వాసమే. రోమీయుల చేతుల్లో మరణించడం లేక దాసత్వం కన్నా ఆత్మహత్యే గౌరవనీయమని తన మనుష్యులను ఒప్పించేందుకు మసాడలోని జీలట్ల నాయకుడైన ఎలియాజర్‌ బెన్‌ జయీర్‌ మొదట ప్రయత్నించాడు. వారు వెనుకాడడం చూసి, ప్రాణమును గూర్చి ఆయన భావుకంగా ఓ ప్రసంగాన్నిచ్చాడు. శరీరం కేవలం ఒక ప్రతిబంధకమని, ప్రాణమునకు ఒక చెరసాలని చెప్పాడు. “అయితే, భూమ్మీదికి లాగి ఖైదు చేసే ఆ భారంనుండి దాన్ని విమోచించినప్పుడు ఆ ప్రాణము తన స్వస్థలానికి చేరుకుంటుంది, అప్పుడు వాస్తవికంగా అది ఆశీర్వాదకరమైన శక్తిలో భాగంవహించి అపారమైన బలాన్నిపొంది దేవుని వలెనే మానవకంటికి కనిపించకుండా ఉంటుంది” అని చెప్పాడు.

దాని ప్రతిస్పందనేమిటి? ఎలియాజర్‌ ఈ ధోరణిలో విపులంగా వివరించిన తర్వాత, “వింటున్న వారందరూ అతన్ని చెప్పనివ్వకుండా ఆపి, అంతులేని ఉత్సాహంతో ఆ పనిని చేసేందుకు పరుగులు తీశారు” అని జోసీఫస్‌ నివేదిక చెబుతోంది. జోసీఫస్‌ ఇంకా ఇలా చెబుతున్నాడు: “దయ్యం పట్టినవాళ్లలా వాళ్లు పరుగులుతీసి, ప్రక్కవాడికంటే తానే ముందు చేయాలన్న ఆతురతతో, . . . అదుపులేని కోరిక వారిని ఎంతగా ఆవరించిందంటే వాళ్లు తమ భార్యలనూ తమ పిల్లలను తమ్మును తామే చంపుకున్నారు.”

ఈ భీకరమైన ఉదాహరణ, మరణాన్ని గూర్చిన సాధారణ మానవ దృక్పథాన్ని అమర్త్యమైన ప్రాణమును గూర్చిన సిద్ధాంతం ఎంతగా మార్చివేయగలదో దృష్టాంతపరుస్తోంది. విశ్వాసులు మరణాన్ని మానవుని బద్ద శత్రువుగా కాక ఉన్నతమైన జీవితాన్ని అనుభవించేందుకుగాను ప్రాణమును స్వతంత్రపర్చే ఓ ద్వారంగా దృష్టించేలా బోధింపబడ్డారు. కానీ ఆ యూదా జీలట్లు ఇలా ఎందుకు నమ్మారు? వారి పరిశుద్ధ వ్రాతలైన హెబ్రీ లేఖనాలు, మరణించిన తర్వాత తప్పించుకుపోయే ఓ ప్రాణము, అంటే చేతనమైన ఓ ఆత్మ మానవునిలో ఉందని బోధిస్తున్నాయని అనేకులు అనుకుంటారు. అది నిజమేనా?

హెబ్రీ లేఖనాల్లో ప్రాణము

ఒక్క మాటలో చెప్పాలంటే, లేదు. మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము ప్రాణము అన్నది మీలో ఉన్నది కాదు కానీ, మీరే అని చెబుతుంది. మొదటి మానవుడైన ఆదామును గూర్చి మనం ఇలా చదువుతాము: “మానవుడు ఒక జీవించు ప్రాణము ఆయెను.” (ఆదికాండము 2:7 NW) ఇక్కడ ప్రాణమునకు ఉపయోగించబడిన నెఫేష్‌ అన్న హెబ్రీ పదం హెబ్రీలేఖనాల్లో 700ల కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది, మరి అది ఒక్కసారి కూడా మానవుని నుండి వేరుగా, లౌకికేతర, ఆత్మీయ భాగమనే ఆలోచనను ఇవ్వడంలేదు. దానికి విరుద్ధంగా, ప్రాణము స్పర్శనీయమైనది, గట్టిది, భౌతికమైనది.

మీ స్వంత బైబిలులో ఈ క్రింద ఇవ్వబడిన లేఖన భాగాలను చూడండి, ఎందుకంటే హెబ్రీ పదమైన నెఫేష్‌ ప్రతిదానిలోనూ ఉంది. ప్రాణము అపాయాన్ని, ప్రమాదాన్ని ఎదుర్కొనగలదని, అపహరించబడగలదని (ద్వితీయోపదేశకాండము 24:7, NW; న్యాయాధిపతులు 9:16; 1 సమూయేలు 19:11); వస్తువులను ముట్టుకోగలదని (యోబు 6:7, NW) సంకెళ్లలో బంధించబడగలదని (కీర్తన 105:18); తినాలని వాంఛించగలదు, పస్తుండడంవల్ల బాధపడగలదు, ఆకలి దప్పికలవల్ల మూర్ఛిల్ల గలదని; మరియు క్షీణింపజేసే రోగంవల్ల బాధపడగలదు లేక వేదనవల్ల నిద్రలేమిని అనుభవించగలదని అవి స్పష్టంగా చూపుతున్నాయి. (ద్వితీయోపదేశకాండము 12:20, NW; కీర్తన 35:13; 69:10, IBL; 106:15; 107:9; 119:28) మరో మాటలో, మీ ప్రాణము మీరే కనుక, స్వయంగా మీరే గనుక మీరు దేన్ని అనుభవిస్తారో దాన్ని మీ ప్రాణము అనుభవిస్తుందన్నమాట.b

అంటే, ప్రాణము నిజంగా మరణించగలదని దాని భావమా? అవును. అమర్త్యమైనదిగా ఉండకుండా, మానవ ప్రాణములు తప్పుచేసినందుకు “కొట్టివేయబడును” లేక మరణదండన వేయబడతాయి, చావగొట్ట బడతాయి, హత్య చేయబడతాయి, నాశనం చేయబడతాయి, చీల్చివేయ బడతాయి అని హెబ్రీ లేఖనాలు చెబుతున్నాయి. (నిర్గమకాండము 31:14, NW; ద్వితీయోపదేశకాండము 19:6, NW; 22:26; కీర్తన 7:2, NW) “పాపము చేయు ప్రాణము ఏదో అదే మరణించును” అని యెహెజ్కేలు 18:4 NW, చెబుతోంది. మనమందరం పాపం చేస్తాము కనుక మానవ ప్రాణములకు మరణం సాధారణ అంతమన్న విషయం స్పష్టం. (కీర్తన 51:5) పాపానికి జరిమానా ఆత్మలలోకంలోకి మరియు అమరత్వంలోకి మారడం కాదు కానీ, మరణమేనని మొదటి మానవుడైన ఆదాముకు చెప్పబడింది. (ఆదికాండము 2:17) మరి అతను పాపము చేసినప్పుడు, అతనికి శిక్ష ఇలా తీర్పు తీర్చబడింది: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:19) ఆదాము హవ్వలు మరణించినప్పుడు, బైబిలు తరచూ సూచించే ‘చనిపోయిన ప్రాణములు’ లేక ‘మరణించిన ప్రాణములు’గా వారు అయ్యారు.—సంఖ్యాకాండము 5:2; 6:6, NW.

“పాత నిబంధనలో మానవుని గూర్చిన సిద్ధాంతం ప్రాణము మరియు శరీరాల సంయోగం కాదు కానీ ఏకతే” అని హెబ్రీ లేఖనాల్లోని ప్రాణమును గూర్చి ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. “నెఫేష్‌ . . . ఎన్నడూ శరీరం నుండి వేరుగా పనిచేస్తున్నట్లు భావించబడలేదు” అని కూడా అది చెప్పింది.

కనుక, నమ్మకమైన యూదులు మరణాన్ని గూర్చి ఏమని విశ్వసిస్తున్నారు? మామూలుగా చెప్పాలంటే, జీవానికి వ్యతిరేకమే మరణం అని వారు నమ్మేవారు. ఆత్మ లేక జీవ శక్తి ఓ మానవుని విడిచినప్పుడు ఏమౌతుందో కీర్తన 146:4, NW ఇలా చెబుతోంది: “అతని ఆత్మ వెడలిపోవును, అతను మంటిపాలగును; ఆనాడే అతని ఆలోచనలు నశించును.”c అదే విధంగా, మరణించినవారు “ఏమియు ఎరుగరు” అని రాజైన సొలొమోను వ్రాశాడు.—ప్రసంగి 9:5.

మరి మసాడ వద్ద ఉన్న జీలట్ల వంటి అనేకమంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు అమర్త్యమైన ప్రాణమును అంతగా ఎందుకు నమ్మారు?

గ్రీక్‌ ప్రభావం

యూదులకు ఈ ఆలోచన బైబిలు నుండి కాదుకానీ గ్రీకులనుండే వచ్చింది. సా.శ.పూ. ఏడు మరియు ఐదు శతాబ్దాల మధ్య, గుర్తు తెలియని గ్రీకు మత విభాగాలనుండి గ్రీకు తత్వశాస్త్రంలోకి ఈ సిద్ధాంతం ప్రవేశించినట్లుగా ఉంది. చనిపోయిన తర్వాత చెడ్డ ప్రాణములు వేదనకరమైన శిక్షను పొందుతాయన్న ఆలోచన చాలా కాలం వరకూ ఎంతో మెప్పును పొందింది, అంతేకాకుండా ఆ ఆలోచనావిధానం రూపుదిద్దుకుని వ్యాపించింది. సిద్ధాంతులు, ప్రాణము యొక్క నిర్దిష్ట లక్షణాన్ని గూర్చి అంతులేకుండా వాదించుకున్నారు. మరణించే సమయంలో ప్రాణము ఝుమ్మంటూ, కిచకిచమంటూ లేక మర్మర ధ్యని చేస్తూ వేగంగా వెళ్లిపోతుందని హోమర్‌ అన్నాడు. ప్రాణమునకు వాస్తవంగా బరువుంటుంది కనుక అది అత్యంత సూక్ష్మమైన విలువకలదని ఎపిక్యూరస్‌ చెప్పాడు.d

అయితే అమర్త్యమైన ప్రాణము గురించి ప్రబోధించిన వారిలో గొప్పవాడు సా.శ.పూ. నాలుగవ శతాబ్దపు గ్రీకు తాత్వికుడైన ప్లాటో అయ్యుండవచ్చు. తన బోధకుడైన సొక్రటిస్‌ మరణాన్ని గూర్చిన అతని వర్ణన, శతాబ్దాల తర్వాత మసాడలోని జీలట్ల విశ్వాసాలకు ఎంతో పోలివున్నట్లు బయల్పర్చింది. సిద్ధాంతియైన ఆస్కర్‌ కల్మాన్‌ దాన్ని ఈ విధంగా చెబుతున్నాడు, “సొక్రటిస్‌ సంపూర్ణ శాంతి స్థైర్యాలతో ఎలా మరణిస్తున్నాడో ప్లాటో మనకు చూపిస్తున్నాడు. సొక్రటిస్‌ మరణం చక్కని మరణం. మరణాన్ని గూర్చిన భయమేమీ ఇక్కడ కనిపించడంలేదు. వాస్తవానికి మరణం మనలను శరీరంనుండి విడిపిస్తుంది కనుక సొక్రటిస్‌ మరణానికి భయపడడు. . . . మరణం ప్రాణమునకుగల గొప్ప నేస్తం. అతను ఇలాగే బోధించాడు; మరి బోధించినదానికి తగినట్లుగానే అతను మరణించాడు.”

క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోని మక్కెబియన్‌ కాలంలో యూదులు ఈ బోధను గ్రీకులనుండి సేకరించడం ప్రారంభించి ఉండవచ్చన్నది స్పష్టం. మొదటి శతాబ్ద కాలంలో పరిసయ్యులు, ఎస్సినీయుల వంటి శక్తివంతమైన యూదా మత గుంపులు ఈ సిద్ధాంతాన్ని పెంచి పోషించారని జోసీఫస్‌ మనకు చెబుతున్నాడు. ఆ శకంలో కూర్చబడిన కొన్ని కావ్యాలు అదే విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

మరి యేసుక్రీస్తు విషయమేంటి? ఆయన, ఆయన అనుచరులు గ్రీకు మతంలోని ఈ ఆలోచనను బోధించారా?

ప్రాణమును గూర్చి తొలి క్రైస్తవుల దృక్పథం

ప్రాణమును గ్రీకులు ఎలా దృష్టించారో, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలా దృష్టించలేదు. ఉదాహరణకు యేసు స్నేహితుడైన లాజరు మరణాన్ని పరిశీలించండి. లాజరు మరణించిన సమయంలో స్వేచ్ఛగానూ ఆనందంగానూ వేగంగా వెళ్లిపోయిన అమర్త్యమైన ప్రాణమును అతను కల్గివున్నట్లయితే యోహాను 11వ అధ్యాయంలోని వృత్తాంతం వేరుగా ఉండేది కాదా? ఒకవేళ లాజరు పరలోకంలో సజీవంగా మంచిగా చేతనంతో ఉంటే యేసు తన శిష్యులతో తప్పక చెప్పివుండేవాడు; బదులుగా హెబ్రీ లేఖనాలకు అనుగుణంగా మాట్లాడుతూ లాజరు అచేతనంగా నిద్రిస్తున్నాడని ఆయన చెప్పాడు. (11వ వచనం) తన స్నేహితుడు అద్భుతమైన నూతన ఉనికిని అనుభవిస్తున్నట్లయితే యేసు నిశ్చయంగా ఆనందించివుండేవాడు; అలా కాక అతని మరణం విషయమై ఆయన బహిరంగంగా ఏడవడం మనం చూస్తాము. (35వ వచనం) లాజరు ప్రాణము పరలోకంలో ఆనందమయమైన అమర్త్యతలో సంతృప్తిగా ఉంటే, రోగపీడితమైన, మృతినొందుతున్న మానవజాతి నడుమ అపరిపూర్ణ భౌతిక శరీరపు “ఖైదు”లో అతన్ని మరలా కొన్ని సంవత్సరాలకొరకు తీసుకువచ్చేంత క్రూరమైన వ్యక్తి కాదు యేసు.

లాజరు స్వేచ్ఛాయుత అశరీర ఆత్మీయ వ్యక్తిగా తన అద్భుతమైన నాలుగు దినాల వృత్తాంతాలతో మరణం నుండి లేచాడా? లేదు, అలా రాలేదు. ఆ అనుభవం, మానవుని మాటలకందనంత మహాద్భుతంగా ఉండటమే అందుకు కారణమని, అమర్త్య ప్రాణము ఉందని నమ్మేవారు చెబుతారు. అయితే అలాంటి తర్కన ఒప్పించేందుకు విఫలమౌతుంది; తాను వర్ణించలేనంత మరీ అద్భుతమైన అనుభవాన్ని పొందానని లాజరు తన ప్రియమైనవారికి చెప్పివుంటాడు కదా? అలా కాక, మరణించినప్పుడు తాను పొందిన ఏ అనుభవాన్ని గూర్చి లాజరు చెప్పలేదు. దాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి—మరణం ఎలాంటిది అన్న ప్రశ్నపై అంటే అత్యంత మానవ జిజ్ఞాసకు కేంద్రమైన విషయంపై అది మౌనంగా ఉంది! ఆ మౌనం కేవలం ఒక్క విధంగా మాత్రమే వర్ణించబడగలదు. చెప్పేందుకేమీ లేదు, అంతే. మరణించిన వారు నిద్రిస్తున్నారు, అచేతనంగా ఉన్నారు.

కనుక, మరణం అంటే వివిధ జీవిత స్థాయిల మధ్య ఉన్న దారి, అనగా అది ప్రాణమునకు నేస్తమన్నట్లుగా బైబిలు చూపుతోందా? లేదు! అపొస్తలుడైన పౌలు వంటి నిజమైన క్రైస్తవులకు మరణం నేస్తం కాదు; అది ‘కడపటి . . . శత్రువు.’ (1 కొరింథీయులు 15:26) క్రైస్తవులు మరణాన్ని ఘోరమైన, అసహజమైన దానిగానే చూస్తారుకానీ సహజమైన దానిగా చూడరు, ఎందుకంటే అది దేవునికి విరుద్ధంగా చేసిన పాపమూ మరియు తిరుగుబాటు వల్లనే నేరుగా కలిగిందని దృష్టిస్తారు. (రోమీయులు 5:12; 6:23) మానవజాతి కొరకు దేవుని ప్రధమ సంకల్పంలో అది ఎన్నడూ భాగం కాదు.

అయితే, ప్రాణము మరణించడం విషయం వచ్చేసరికి నిజమైన క్రైస్తవులు నిరీక్షణ లేకుండా లేరు. లాజరు పునరుత్థానం, మరణించిన ప్రాణములకు నిజమైన, లేఖనాధార నిరీక్షణను అంటే పునరుత్థానాన్ని మనకు స్పష్టంగా చూపించే అనేక బైబిలు వృత్తాంతాల్లో ఒకటి. బైబిలు రెండు విధాలైన పునరుత్థానాలను గురించి బోధిస్తోంది. నీతిమంతులైనా అనీతిమంతులైనా సమాధులలో నిద్రిస్తున్న వారికి అంటే మానవజాతిలో విస్తారమైన భాగానికి ఈ భూమ్మీద పరదైసులో నిత్యజీవానికి పునరుత్థానమయ్యే నిరీక్షణ ఉంది. (లూకా 23:43; యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) ‘చిన్న మంద’ అని యేసు సూచించిన చిన్న గుంపుకు చెందిన వారు పరలోకంలో ఆత్మీయ వ్యక్తులుగా అమర్త్యమైన జీవితం పొందేందుకు పునరుత్థానం చేయబడతారు. వీరిలో క్రీస్తు అపొస్తలులు కూడా ఇమిడి ఉన్నారు. వీరు క్రీస్తు యేసుతో మానవజాతిపై పరిపాలించి వారిని పరిపూర్ణతకు పునఃస్థాపితం చేస్తారు.—లూకా 12:32; 1 కొరింథీయులు 15:53, 54; ప్రకటన 20:6.

మరైతే, క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీల బోధలు పునరుత్థానాన్ని కాక మానవ ప్రాణము యొక్క అమర్త్యతను బోధిస్తున్నట్లుగా మనం ఎందుకు కనుగొంటాము? 1959లో ద హర్వర్డ్‌ థియోలాజికల్‌ రివ్వూ నందు వర్నర్‌ యేగర్‌ అనే సిద్ధాంతి ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించండి: “క్రైస్తవ సిద్ధాంతం యొక్క చరిత్రలోని అత్యంత ప్రాముఖ్యమైన వాస్తవమేమిటంటే, క్రైస్తవ సిద్ధాంతానికి తండ్రియైన ఆరిగెన్‌ అలెగ్జాండ్రియా పాఠశాల నందు ప్లాటో సంబంధిత తత్వశాస్త్రవేత్త కావడమే. ప్లాటో నుండి అతను తీసుకున్న ప్రాణమును గూర్చిన విస్తృత వివరణనంతా అతను క్రైస్తవ సిద్ధాంతంలో చేర్చాడు.” కనుక శతాబ్దాలకు పూర్వం యూదులు ఏమి చేశారో దాన్నే చర్చి చేసింది! వారు గ్రీకు తత్వశాస్త్రాన్ని హత్తుకుని బైబిలు బోధలను విడనాడారు.

సిద్ధాంతాల నిజమైన ఆరంభాలు

అమర్త్యమైన ప్రాణము యొక్క సిద్ధాంతం పక్షం వహించే కొందరు ఇప్పుడు ఇలా అడుగవచ్చు, ఒక విధంగా కాకపోతే మరో విధంగా ఒకే సిద్ధాంతం ప్రపంచంలోని అనేక మతాలవారి వల్ల ఎందుకు బోధించబడుతోంది? ఈ ప్రపంచం యొక్క మతాల్లో ఈ బోధ ప్రబలంగా ఉండడానికి గల మంచి కారణాన్ని లేఖనాలు అందిస్తున్నాయి.

“లోకమంతయు దుష్టునియందున్నదని” బైబిలు మనకు చెబుతోంది మరియు నిర్దిష్టంగా సాతానును “ఈ లోకాధికారి” అని గుర్తిస్తుంది. (1 యోహాను 5:19; యోహాను 12:31) స్పష్టంగా, ప్రపంచ మతాలు సాతాను వలన ప్రభావితం కాకుండాలేవు. దానికి విరుద్ధంగా, నేటి ప్రపంచ శ్రమకు ద్వేషానికి అవెంతో దోహదపడ్డాయి. మరి ప్రాణము విషయంపై అవి సాతాను దృక్పథాన్ని ఎంతో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. అదెలా?

మొట్టమొదటి అబద్ధాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకు వ్యతిరేకంగా పాపము చేసినట్లయితే మరణం ప్రాప్తిస్తుందని దేవుడు ఆదాము హవ్వలతో చెప్పాడు. అయితే సాతాను హవ్వకు ఇలా అభయమిచ్చాడు: “మీరు చావనే చావరు.” (ఆదికాండము 3:4) నిస్సందేహంగా, ఆదాము హవ్వలు మరణించారు; దేవుడు చెప్పినట్లుగా వారు మన్నైపోయారు. “అబద్ధమునకు జనకుడు” అయిన సాతాను తన మొదటి అబద్ధాన్ని ఎన్నడూ విడనాడలేదు. (యోహాను 8:44) బైబిలు సిద్ధాంతం నుండి వైదొలగిన లేక దాన్ని నిక్కచ్చిగా అలక్ష్యం చేసిన అనేక మతాల్లో, ‘నీవు చావనే చావవు. నీ శరీరము నాశనమవ్వవచ్చు కానీ నీ ప్రాణము నిత్యం జీవిస్తుంది—దేవునిలా జీవిస్తుంది!’ అనే ఆలోచన ఇంకా ఉంది. ఆసక్తికరంగా, ఆమె “దేవునివలె” అవుతుందని కూడా సాతాను హవ్వతో చెప్పాడు.—ఆదికాండము 3:5, NW.

అబద్ధాలపై లేక మానవ తత్వశాస్త్రంపై ఆధారపడిన నిరీక్షణనుకాక సత్యంపై ఆధారపడిన నిరీక్షణను కల్గివుండడం ఎంత శ్రేష్ఠం. ఏదో అమర్త్యమైన ప్రాణము ఎక్కడ ఉందా అని ఆలోచించి కలత చెందే బదులు, మరణించిన మన ప్రియమైనవారు సమాధిలో అచేతనంగా ఉన్నారనే నమ్మకం కల్గివుండడం ఎంత శ్రేష్ఠం! మరణించినవారి ఈ నిద్ర మనలను భయపెట్టనవసరంలేదు లేక బాధపెట్టనవసరంలేదు. ఒక విధంగా మరణించినవారు భద్రమైన విశ్రాంతి స్థలంలో ఉన్నట్లుగా మనం దృష్టించవచ్చు. ఎందుకు భద్రమైన స్థలం? ఎందుకంటే యెహోవాను ప్రేమించే మరణించినవారు ఒక ప్రత్యేకమైన భావంలో జీవిస్తున్నారని బైబిలు మనకు అభయమిస్తుంది. (లూకా 20:38) వారు ఆయన జ్ఞాపకంలో జీవిస్తున్నారు. ఆయన జ్ఞాపకానికి పరిమితులు లేవు కనుక ఆ ఆలోచన ఎంతో ఓదార్పుకరంగా ఉంటుంది. తన ప్రియమైన లెక్కలేనన్ని కోట్లకొలది మానవులకు జీవాన్నిచ్చేందుకు మరియు వారు నిరంతరం భూపరదైసులో జీవించే అవకాశాన్నిచ్చేందుకు ఆయన ఆతురత కల్గివున్నాడు.—యోబు 14:14, 15 పోల్చండి.

యెహోవా వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి గనుక పునరుత్థాన మహిమాన్విత దినం తప్పక వస్తుంది. (యెషయా 55:10, 11) “అయితే నీ మృతులు జీవించెదరు, వారి శరీరములు తిరిగి లేచును. భూమిలో నిద్రించువారు మేలుకొని ఆనందముతో కేకలు వేసెదరు; ఎందుకంటే నీ మంచు ప్రకాశమానమైన మంచు మరియు భూమి తనలోని మృతులను మరల జన్మింపజేస్తుంది.” (యెషయా 26:19 ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) కనుక సమాధిలో నిద్రిస్తున్న మృతినొందినవారు, తల్లి గర్భంలోని బిడ్డ ఎలా భద్రంగా ఉంటుందో అలా ఉంటారు. వారు త్వరలోనే “జన్మించాలి” అంటే పరదైసు భూమిలోకి తిరిగి జీవానికి వస్తారు!

దానికంటే శ్రేష్ఠమైన నిరీక్షణ ఇంకేముంది?

[అధస్సూచీలు]

a ఇద్దరు స్త్రీలూ ఐదుగురు పిల్లలూ దాక్కోవడం ద్వారా బ్రతికారని నివేదించబడింది. ఆ స్త్రీలు దాని వివరాలను రోమా ఆక్రమణదారులకు తర్వాత చెప్పారు.

b అనేక పదాలు విస్తృతమైన పరిధిలో ఉపయోగింపబడే విధంగానే, నెఫేష్‌ అనే పదం కూడా స్వల్ప తేడాలతో అనేక భావాలను కల్గివుందన్నది వాస్తవమే. ఉదాహరణకు ప్రత్యేకంగా లోతైన భావాల సందర్భంలో అది అంతరంగ వ్యక్తిని సూచిస్తుంది. (1 సమూయేలు 18:1, IBL) ఒకరు ప్రాణముగా ఆనందించే జీవాన్ని కూడా అది సూచించవచ్చు.—1 రాజులు 17:21-23.

c “ఆత్మ”కు హెబ్రీ పదమైన రూఆహ్‌ అర్థం “ఊపిరి” లేక “గాలి.” మానవుల సంబంధంగా ఉపయోగించినప్పుడు, అది చేతనమైన ఆత్మ యొక్క ఉనికిని కాకుండా, ది న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ థియోలజీ చెబుతున్నట్లుగా, “ఓ వ్యక్తి యొక్క జీవ శక్తి”ని సూచించింది.

d ఇలాంటి విపరీత ధోరణిలో ఆలోచించినవారిలో ఇతను చివరివాడుకాడు. ప్రజలు మరణించడానికి కాస్తముందు వారు కల్గివున్న బరువులోనుండి మరణించిన వెంటనే వారు కలిగివున్న బరువును వ్యవకలనం చేయడం ద్వారా అనేకమంది ప్రాణముల బరువును నిజంగా తూచానని ఈ శతాబ్దంలోని తొలి భాగంలో ఓ శాస్త్రజ్ఞుడు చెప్పుకున్నాడు.

[7వ పేజీలోని చిత్రం]

మరణం వారి ప్రాణములకు స్వేచ్ఛనిస్తుందని మసాడలోని యూదా జీలట్లు నమ్మారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి