కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/1 పేజీలు 14-19
  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ప్రకారం నెఫెష్‌, ప్సీకీ
  • మృతులు స్పృహలో ఉండరు
  • రూ-ఆహ్‌, న్యూమా విషయమేమిటి?
  • ‘మరల లేచును’
  • నిరుపమానమైన ఉత్తరాపేక్ష!
  • మరణంలేని జీవితం
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ఆత్మ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మానవుల్లో అదృశ్యమైన, అమర్త్యమైన భాగం ఏదైనా నిజంగా ఉందా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/1 పేజీలు 14-19

మరణానంతర జీవితం—బైబిలేమి చెప్తుంది?

‘నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’—ఆదికాండము 3:19.

1, 2. (ఎ) మరణానంతర జీవితాన్ని గురించి ఏ విభిన్నమైన తలంపులు ఉన్నాయి? (బి) మనిషి నిజంగా ఏమైవున్నాడనే దాని గురించి బైబిలు ఏమి బోధిస్తుందో దృవపర్చుకోవడానికి మనం ఏమి పరిశీలించవలసి ఉంది?

“సృష్టిప్రాణుల పట్ల దేవునికున్న ప్రేమ సిద్ధాంతానికీ, నిత్యశిక్ష సిద్ధాంతానికీ పొందిక లేదు. . . . కేవలం కొన్ని సంవత్సరాలపాటు చేసిన తప్పులకు ఆత్మను నిత్యం శిక్షించడం, అదీ సరిచేసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా అలా శిక్షించడం ఎంతమాత్రం సహేతుకం కాజాలదు” అని హిందూ తత్త్వవేత్తయైన నిఖిలానంద పేర్కొన్నాడు.

2 నిఖిలానందవలే, నేడు అనేకులు నిత్యశిక్షను గురించిన సిద్ధాంతంతో ఏకీభవించలేకపోతున్నారు. అదే కారణాన్నిబట్టి ఇతరులకు, నిర్వాణం పొందడం మరియు ప్రకృతిలో మమైక్యమవ్వడం వంటి సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటోంది. తమ నమ్మకాలకు బైబిలు ఆధారమని చెప్పేవారు కూడా, మనిషి అంటే ఏమిటి, మరణించినప్పుడు అతనికేమౌతుంది అనే విషయాల గురించి భిన్నమైన తలంపులను కలిగివున్నారు. అయితే మనిషి ఎలా నిర్మించబడ్డాడనే దాని గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుంది? దాన్ని కనుగొనడానికి, మనం హెబ్రీ పదమైన నెఫెష్‌ మరియు గ్రీకు పదమైన ప్సీకీ యొక్క అర్థాలను పరిశీలించవలసిన అవసరం ఉంది.

బైబిలు ప్రకారం నెఫెష్‌, ప్సీకీ

3. (ఎ) హెబ్రీ పదమైన నెఫెష్‌ భావమేమిటి? (బి) “జీవాత్మ” అనే పదం సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుందని ఆదికాండము 2:7 ఎలా ధృవీకరిస్తుంది?

3 హెబ్రీ పదమైన నెఫెష్‌ హెబ్రీ లేఖనాల్లో 754 సార్లు కనిపిస్తుంది. ఆ పదం తెలుగు బైబిళ్లలో ఆత్మ, ప్రాణి, ప్రాణము, జీవము, జీవాత్మ, దేహము, వ్యక్తి అని అనువదించబడింది. నెఫెష్‌ అంటే అర్థమేమిటి? ది డిక్షనరి ఆఫ్‌ బైబిల్‌ అండ్‌ రిలీజియన్‌ ప్రకారం, అది “సాధారణంగా పూర్తి ప్రాణిని, సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది.” మనిషి ఎలా నిర్మించబడ్డాడనే దాన్ని గురించి బైబిలు ఇచ్చే సరళమైన వివరణ దాన్ని ధృవీకరిస్తుంది. బైబిల్లోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము 2:7 నందు ఇలా చెప్పబడుతుంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ [నెఫెష్‌] ఆయెను.” కాబట్టి ఆదాము “జీవాత్మ ఆయెను” అని బైబిలు చెప్తున్నప్పుడు అతనిలో అమర్త్యమైన భాగమేదో ప్రవేశపెట్టబడిందన్న భావాన్నిగాక అతడు జీవించే వ్యక్తి అయ్యాడన్న భావాన్నే అది సూచిస్తుంది. అందుకే ఇతర తెలుగు బైబిలు అనువాదాలు అదే పదబంధాన్ని, “సజీవుడయ్యాడు” (LBI,a WBTC,b IBLc), “జీవముగలవాడయ్యాడు” (ACBSd) అని అనువదించాయి. కాబట్టి, “జీవాత్మ” అని అనువదించబడిన నెఫెష్‌ అనే పదం ఇక్కడ సంపూర్ణ వ్యక్తిని వర్ణిస్తుంది.

4. గ్రీకు పదమైన ప్సీకీ భావమేమిటి?

4 నెఫెష్‌ వలెనే, గ్రీకు పదమైన ప్సీకీ కూడా తెలుగు బైబిళ్లలో వివిధ రకాలుగా అనువదించబడింది. ఈ పదం కూడా తరచూ సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది. దాని భావాన్ని అర్థం చేసుకునేందుకుగానూ దయచేసి ఈ క్రింది లేఖనాలను పరిశీలించండి: “ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి [ప్సీకీ] ఆయె[ను].” (1 కొరింథీయులు 15:45) “నా ప్రాణము [ప్సీకీ] కలవరపడుచున్నది.” (యోహాను 12:27) “నా ప్రాణము [ప్సీకీ] ప్రభువును ఘనపరచుచున్నది.” (లూకా 1:46) “అప్పుడు ప్రతివానికిని [ప్రతి ప్సీకీకును] భయము కలిగెను.” (అపొస్తలుల కార్యములు 2:43) “ప్రతివాడును [ప్రతి ప్సీకీ] పైఅధికారులకు లోబడియుండవలెను.” (రోమీయులు 13:1) కాబట్టి నెఫెష్‌ వలెనే ప్సీకీ కూడా సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుందని స్పష్టమౌతుంది. పండితుడైన నైజేల్‌ టర్నర్‌ ఉద్దేశం ప్రకారం ఈ పదం, “ప్రత్యేకంగా మానవుడ్ని, వ్యక్తిని, దేవుని రూ-ఆహ్‌ [చురుకైన శక్తి] ప్రవేశపెట్టబడిన భౌతిక శరీరాన్ని సూచిస్తుంది . . . పూర్తి వ్యక్తినే నొక్కిచూపిస్తుంది.”

5. హెబ్రీ పదమైన నెఫెష్‌, గ్రీకు పదమైన ప్సీకీ ఇంకా వేటిని కూడా సూచిస్తాయి?

5 ఆసక్తికరంగా, బైబిల్లో నెఫెష్‌, ప్సీకీ అనే పదాలు మానవులను ఉద్దేశించి మాత్రమే గాక జంతువులను ఉద్దేశించి కూడా ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు, జలచరాల సృష్టి గురించి చెప్తూ, “నీళ్లు అనేక ప్రాణులతో [నెఫెష్‌లతో] నిండిపోవును గాక” అని దేవుడు ఆజ్ఞాపించాడని ఆదికాండము 1:20 [WBTC] తెలియజేస్తుంది. మరుసటి సృష్టి దినాన, దేవుడిలా చెప్పాడు: “భూమి అనేక ప్రాణులను [నెఫెష్‌లను] చేయును గాక, అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు చిన్న జంతువులు ఉండును గాక !”—ఆదికాండము 1:24, WBTC; పోల్చండి సంఖ్యాకాండము 31:28, అక్కడ నెఫెష్‌ అనే పదం మానవులు, పశువులు అని అనువదించబడింది. అలాగే ప్రకటన 16:3 కూడా చూడండి, అక్కడ ప్సీకీ అనే పదం జీవజంతువులు అని అనువదించబడింది.

6. నెఫెష్‌, ప్సీకీ అనే పదాలు బైబిల్లో ఉపయోగించబడిన విధానాన్ని గురించి ఏమి చెప్పవచ్చు?

6 కాబట్టి బైబిలు మనిషిని నెఫెష్‌ అనీ, ప్సీకీ అనీ వర్ణిస్తుంది, అంతేగాక సరిగ్గా అవే పదాలు వ్యక్తినీ లేక జంతువునూ లేదా వ్యక్తి కలిగివుండే జీవాన్నీ లేక జంతువు కలిగివుండే జీవాన్నీ సూచించడానికి కూడా ఉపయోగించబడ్డాయి. (బాక్సు చూడండి.) మనిషి ఏమైవున్నాడనే దాన్ని గురించి బైబిలు ఇస్తున్న నిర్వచనం సరళమైనది, సంగతమైనది, అది మనుష్యులు కల్పించిన సంక్లిష్టమైన తత్త్వాలతోనూ మూఢనమ్మకాలతోనూ కలుషితం కాలేదు. విషయమదైనందున, అత్యవసరమైన ప్రశ్నేమిటంటే, బైబిలు ఉద్దేశం ప్రకారం, మనిషి మరణించినప్పుడు అతనికేమౌతుంది?

మృతులు స్పృహలో ఉండరు

7, 8. (ఎ) మృతుల స్థితి గురించి లేఖనాలు ఏమి వెల్లడి చేస్తున్నాయి? (బి) మరణానంతరం వ్యక్తి యొక్క అంటే నెఫెష్‌ యొక్క లేక ప్సీకీ యొక్క ఏదైనా భాగం ఉనికిలో కొనసాగుతుందని బైబిలు సూచిస్తుందా?

7 ప్రసంగి 9:5, 10లో మృతుల స్థితి స్పష్టం చేయబడింది. అక్కడ మనమిలా చదువుతాము: “చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” కాబట్టి మరణమంటే, ఉనికిలో లేకుండా పోయేస్థితి. మనుష్యులు మరణించినప్పుడు, “వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును” అని కీర్తనల గ్రంథకర్త వ్రాశాడు. (కీర్తన 146:4) మృతులు స్పృహలో ఉండరు, వారు అచేతనులు.

8 దేవుడు ఆదాముకు శిక్ష విధించేటప్పుడు, “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని” అన్నాడు. (ఆదికాండము 3:19) దేవుడు ఆదామును నేల నుండి నిర్మించక ముందు అతడు ఉనికిలో లేడు. అతడు మరణించినప్పుడు అదే స్థితికి చేరుకున్నాడు. అతనికి విధించబడిన శిక్ష మరణమే గానీ మరో లోకానికి బదిలీ చేయబడడం కాదు. అటు తర్వాత ఉనికి కొనసాగించిన అమర్త్యమైన భాగమేదైనా అతనిలో ఉందా? లేదు, ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు సంపూర్ణంగా మరణిస్తాడని బైబిలు చెప్తుంది. మరణానంతరం ఉనికిలో కొనసాగే అమర్త్యమైనదేదో ప్రతి వ్యక్తిలోనూ అంటే ప్రతీ నెఫెష్‌లోనూ లేదా ప్రతీ ప్సీకీలోనూ ఉందని బైబిలు బోధించడం లేదు. ఆత్మ అమర్త్యమైనదని నమ్మే వ్యక్తికి ఇది అసాధారణమైనదిగా అనిపించవచ్చు, కాని మరణమప్పుడు ఉనికిలో లేకుండా పోయేది పూర్తి వ్యక్తే అంటే నెఫెషే లేక ప్సీకీనే. మరణానంతరం ఇంకా ఏదో ఉనికిలో కొనసాగుతుందని చెప్పబడటం లేదు.

9. రాహేలు “ప్రాణము [నెఫెష్‌] పోవుచుండగా” అని బైబిలు చెప్తున్నప్పుడు దాని అర్థమేమిటి?

9 అయితే రాహేలు తన రెండవ కుమారుడ్ని ప్రసవిస్తూ చనిపోతున్నప్పుడు దాని గురించి ఆదికాండము 35:18లో చేయబడిన వ్యాఖ్యానం మాటేమిటి? అక్కడ మనమిలా చదువుతాము: “ఆమె మృతిబొందెను; ప్రాణము [నెఫెష్‌] పోవుచుండగా ఆమె—అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.” రాహేలు మరణించినప్పుడు ఆమెలో నుండి ఏదైనా అంతర్గత భాగం ఆమెను విడిచిపోయిందని ఈ వృత్తాంతం సూచిస్తుందా? ఎంతమాత్రం సూచించడం లేదు. “ప్రాణము [నెఫెష్‌]” అనే పదం ఒక వ్యక్తి కలిగివుండే జీవమును కూడా సూచిస్తుందని జ్ఞాపకముంచుకోండి. కాబట్టి ఈ సందర్భంలో, రాహేలు “ప్రాణము [నెఫెష్‌]” అంటే కేవలం ఆమె “జీవము” మాత్రమే. అందుకే ఇతర బైబిలు అనువాదాలు “ప్రాణము [నెఫెష్‌] పోవుచుండగా” అనే పదబంధాన్ని “ఆమె జీవం కొడగడుతుండగా” అని (క్నాక్స్‌), “చివరి ఊర్పు విడుచుచు” అని (ACBS), “ఆమెలో నుం1డి ఆమె జీవం పోయింది” అని (బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌) అనువదించాయి. మరణానంతరం రాహేలులోంచి అమర్త్యమైన భాగమేదో బయటకుపోయి ఉనికిలో కొనసాగుతుందన్న సూచనేమీ లేదు.

10. పునరుత్థానం చేయబడిన విధవరాలి కుమారుని ప్రాణము [నెఫెష్‌] ఏ విధంగా ‘మరల వచ్చింది’?

10 మొదటి రాజులు 17వ అధ్యాయంలో వ్రాయబడివున్న, విధవరాలి కుమారుని పునరుత్థానం విషయంలో కూడా సంగతదే అయివుంది. 22వ వచనంలో, ఏలీయా ఆ బాలుని కోసం ప్రార్థన చేసినప్పుడు, “యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము [నెఫెష్‌] మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను” అని మనం చదువుతాము. ఇక్కడ కూడా, “ప్రాణము [నెఫెష్‌]” అనే పదం యొక్క భావం “జీవము.” అందుకే, న్యూ అమెరికన్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ నందు ఇలా చదువుతాము: “ఆ బాలుని జీవం తిరిగి రాగ అతడు మరల జీవించాడు.” అవును ఆ బాలునిలోకి తిరిగి వచ్చినది జీవమేగానీ ఏదో ఛాయవంటి రూపం కాదు. ఇది, ఏలీయా ఆ బాలుని తల్లితో, “ఇదిగో నీ కుమారుడు; వాడు [అంటే సంపూర్ణ వ్యక్తి] బ్రదుకుచున్నాడని” అన్న మాటలతో పొందిక కల్గివుంది.—1 రాజులు 17:23.

రూ-ఆహ్‌, న్యూమా విషయమేమిటి?

11. తెలుగు బైబిళ్లలో అనేకసార్లు “ఆత్మ” అని అనువదించబడిన రూ-ఆహ్‌, న్యూమా అనే మూల భాషా పదాలు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఉనికిలో కొనసాగే అశరీర భాగాన్ని ఎందుకు సూచించవు?

11 రూ-ఆహ్‌ అనే హెబ్రీ పదము, న్యూమా అనే గ్రీకు పదము తెలుగు బైబిళ్లలో అనేకసార్లు “ఆత్మ” అని అనువదించబడినా వాటికున్న ప్రాథమిక అర్థం “ఊపిరి.” అందుకే కొన్నిసార్లు ఆ పదాలు “ఊపిరి” అని కూడా అనువదించబడ్డాయి. కాబట్టి ఒక వ్యక్తి మరణించినప్పుడు అతడు “ఊపిరి విడిచి మట్టిలో కలసిపోవును” అని కీర్తన 146:4 [IBL] చెప్తుంది. “ఊపిరి విడిచి మట్టిలో కలసిపోవును” అని ఆ లేఖనము చెబుతున్నపుడు దాని అర్థం, అదృశ్యమైన మరో లోకంలో జీవించడానికి చైతన్యవంతంగా ఉండే అమర్త్యమైన భాగమేదో శరీరాన్ని విడిచి పోతుందనే భావంలో “ఆత్మ” నరుని “విడిచి” పోతుందని కాదు. ఆ లేఖన భావం అది కాదు, ఎందుకంటే కీర్తనల గ్రంథకర్త అదే లేఖనంలో అటు తర్వాత, “దానితో అతని యత్నములెల్ల వమ్మగును” అని అంటున్నాడు.

12. బైబిల్లో “ఊపిరి” లేక “ఆత్మ” అని అనువదించబడిన హెబ్రీ, గ్రీకు పదాలు దేన్ని కూడా సూచిస్తున్నాయి?

12 ఈ హెబ్రీ, గ్రీకు పదాలు ఆత్మ, ఊపిరి అని మాత్రమే అనువదించబడ లేదు ఎందుకంటే అవి ఊపిరి తీసుకునే ప్రక్రియ కంటే ఎక్కువనే సూచిస్తాయి. ఉదాహరణకు, భూగోళవ్యాప్త జలప్రళయం సమయంలో మానవ మరియు జంతు జీవాల నాశనాన్ని వర్ణిస్తూ, ఆదికాండము 7:22 ఇలా చెప్తుంది: “పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ [రూ-ఆహ్‌] సంబంధమైన ఊపిరి గలవన్నియు చనిపోయెను.” కాబట్టి “జీవాత్మ” అని కొన్నిసార్లు అనువదించబడిన హెబ్రీ పదమైన రూ-ఆహ్‌ మానవులూ జంతువులతో సహా సర్వప్రాణికోటిలో చలిస్తున్న జీవశక్తిని సూచిస్తుంది. అందుకే న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చర్స్‌ దాన్ని “జీవశక్తి [రూ-ఆహ్‌] సంబంధమైన ఊపిరి” అని అనువదించింది. ఆ జీవశక్తి ఉఛ్వాసనిశ్వాసల ద్వారా నిలబడుతుంది.

13. ఒక వ్యక్తి మరణించినప్పుడు రూ-ఆహ్‌ లేక ఆత్మ దేవునియొద్దకు మరలిపోతుందని బైబిలు చెబుతున్న దాని భావమేమిటి?

13 మరైతే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని “ఆత్మ [రూ-ఆహ్‌] దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును” అని ప్రసంగి 12:7 చెప్తున్న దాని భావమేమిటి? ఆత్మ అక్షరార్థంగా అంతరిక్షంలో ప్రయాణించి దేవుని సన్నిధికి చేరుతుందని దీని భావమా? అలాంటిదేమీ సూచించబడడం లేదు. బైబిలు నందు చెప్పబడిన ఆత్మ [రూ-ఆహ్‌], జీవశక్తిని సూచిస్తుంది గనుక, అది “దేవుని యొద్దకు మరల పోవును” అంటే దానర్థం ఆ వ్యక్తికి సంబంధించిన భవిష్యద్‌ జీవిత ఉత్తరాపేక్ష ఏదైనా ఇప్పుడిక పూర్తిగా దేవుని చేతుల్లో ఉందని భావం. కేవలం దేవుడు మాత్రమే ఆ వ్యక్తి తిరిగి జీవానికి వచ్చేలా చేస్తూ అతని రూ-ఆహ్‌ను లేక ఆత్మను లేక జీవశక్తిని పునరుద్ధరించగలడు. (కీర్తన 104:30) కాని అలా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడా?

‘మరల లేచును’

14. లాజరు సహోదరీలు తమ సహోదరుడ్ని మరణమందు కోల్పోయి దుఃఖిస్తున్నప్పుడు వారికి ఉపశమనం కలుగజేయడానికి, వారిని ఓదార్చడానికి యేసు ఏం చెప్పాడు, ఏం చేశాడు?

14 యెరూషలేముకు తూర్పువైపున దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోవున్న బేతనియ అనే చిన్న పట్టణంలో, తమ సహోదరుడైన లాజరు అకాల మరణానికి గురవ్వడంతో మార్తా మరియలు దుఃఖిస్తున్నారు. యేసుకు లాజరంటే, ఆయన సహోదరీలంటే అభిమానం గనుక యేసు కూడా వాళ్లతోపాటు దుఃఖించాడు. యేసు ఆ సహోదరీలను ఎలా ఓదార్చాడు? వాళ్లకేదో కట్టుకథలు చెప్పడం ద్వారా కాదు గానీ వాళ్లకు సత్యాన్ని చెప్పడం ద్వారా ఆయన వాళ్లను ఓదార్చాడు. యేసు, “నీ సహోదరుడు మరల లేచునని” మాత్రం అన్నాడు. ఆ తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్లి, అప్పటికి నాలుగు రోజుల క్రిందట మరణించిన లాజరును తిరిగి జీవానికి తీసుకురావడం ద్వారా అతడిని పునరుత్థానం చేశాడు!—యోహాను 11:18-23, 38-44.

15. యేసు చెప్పిన దానికి, చేసిన దానికి మార్త ఎలా ప్రతిస్పందించింది?

15 లాజరు తిరిగి “లేచునని” యేసు చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి మార్త ఆశ్చర్యపోయిందా? ఆశ్చర్యపోలేదని స్పష్టమౌతుంది, ఎందుకంటే ఆమె ఇలా సమాధానమిచ్చింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదు[ను].” ఆమెకు పునరుత్థానమందు అప్పటికే విశ్వాసం ఉంది. అప్పుడు యేసు ఆమెకిలా చెప్పాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయనను బ్రదుకును.” (యోహాను 11:23-25) లాజరును తిరిగి జీవానికి తీసుకురావడమనే అద్భుతం ఆమె విశ్వాసాన్ని బలపర్చడానికీ, ఇతరులకు విశ్వాసం కలిగించడానికీ దోహదపడింది. (యోహాను 11:45) అయితే “పునరుత్థానము” అనే పదం యొక్క కచ్చితమైన భావమేమిటి?

16. “పునరుత్థానము” అనే పదం యొక్క భావమేమిటి?

16 “పునరుత్థానము” అనే పదం అనాస్తాసిస్‌ అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది, దానికి అక్షరార్థంగా “మరల లేచి నిలబడడం” అని భావం. గ్రీకు భాషలో నుండి హెబ్రీ భాషలోకి అనువదించే అనువాదకులు అనాస్తాసిస్‌ అనే పదాన్ని “మృతుల పునరాగమనం” (హెబ్రీ భాషలో, టెకియాత్‌ హమ్మెతిమ్‌) అనే భావంగల పదబంధంగా అనువదించారు.e కాబట్టి పునరుత్థానంలో, ఒక వ్యక్తిని జీవంలేని మృత స్థితి నుండి జీవానికి తిరిగి తీసుకురావడం ఇమిడివుంది.

17. (ఎ) ఆయావ్యక్తులను పునరుత్థానం చేయడం యెహోవా దేవునికీ, యేసుక్రీస్తుకూ ఎందుకు ఒక సమస్య కాబోదు? (బి) జ్ఞాపకార్థ సమాధుల్లో ఉన్నవారి గురించి యేసు ఏమి వాగ్దానం చేశాడు?

17 అపారమైన జ్ఞానమూ, పరిపూర్ణమైన జ్ఞాపకశక్తీ గల యెహోవా దేవుడు ఒక వ్యక్తిని సులభంగా పునరుత్థానం చేయగలడు. మృతుల జీవన శైలిని అంటే వారి వ్యక్తిత్వంలోని లక్షణాలనూ, వారి వ్యక్తిగత చరిత్రనూ, వారి గుర్తింపుకు సంబంధించిన వివరాలన్నింటినీ జ్ఞాపకముంచుకోవడం ఆయనకు సమస్యేమీ కాదు. (యోబు 12:13; పోల్చండి యెషయా 40:26.) అంతేగాక, లాజరు అనుభవం సూచిస్తున్నట్లుగా, యేసుక్రీస్తు మృతులను పునరుత్థానం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన చేయగలడు కూడా. (పోల్చండి లూకా 7:11-17; 8:40-56.) వాస్తవానికి, యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున [“జ్ఞాపకార్థ,” NW] సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) అవును, యెహోవా జ్ఞాపకంలో ఉన్న వారందరూ పునరుత్థానం చేయబడతారని యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. బైబిలు చెప్తున్నదాని ప్రకారం, మరణానంతరం అమర్త్యమైన భాగమేదీ ఉనికిలో కొనసాగదు గానీ మరణానికి చికిత్స పునరుత్థానమేనని స్పష్టమౌతుంది. అయితే కోట్లాదిమంది ప్రజలు జీవించారు, మరణించారు. వారిలో ఎవరు, పునరుత్థానం కోసం నిరీక్షిస్తూ దేవుని జ్ఞాపకంలో ఉన్నారు?

18. ఎవరు పునరుత్థానం చేయబడతారు?

18 యెహోవా సేవకులుగా నీతి మార్గాన్ని అనుసరించినవారు పునరుత్థానం చేయబడతారు. అయితే దేవుని నీతియుక్తమైన కట్టడలకు తాము కట్టుబడి ఉంటామా లేదా అనేది చూపించకుండానే కోట్లాదిమంది ఇతర ప్రజలు మరణించారు. వాళ్లకు యెహోవా కోరేవాటి గురించి తెలియకపోయి ఉండవచ్చు లేక అవసరమైన మార్పులు చేసుకోవడానికి తగినంత సమయం లభించి ఉండకపోవచ్చు. ఈ ఇతరులు కూడా దేవుని జ్ఞాపకంలో ఉన్నారు, కాబట్టి వాళ్లు పునరుత్థానం చేయబడతారు, అందుకే “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” బైబిలు వాగ్దానం చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 24:14.

19. (ఎ) పునరుత్థానం గురించి అపొస్తలుడైన యోహాను ఏ దర్శనాన్ని పొందాడు? (బి) ఏవి “అగ్నిగుండములో పడవేయ”బడతాయి, ఆ పదబంధం యొక్క భావమేమిటి?

19 పునరుత్థానం చేయబడినవారు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉండడాన్ని గురించిన అద్భుతమైన దర్శనం అపొస్తలుడైన యోహాను పొందాడు. దాన్ని వర్ణిస్తూ ఆయనిలా వ్రాశాడు: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [గ్రీకు: హేడిస్‌] వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును [గ్రీకు: హేడిస్‌] అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.” (ప్రకటన 20:12-14) దాని భావమేమిటో ఆలోచించండి ! దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులందరూ మానవజాతి యొక్క సాధారణ సమాధియైన షియోల్‌ లేక హేడిస్‌ నుండి విడుదల చేయబడతారు. (కీర్తన 16:10, NW; అపొస్తలుల కార్యములు 2:31, NW) అప్పుడు “మరణమును మృతుల లోకమును [హేడిస్‌] అగ్నిగుండములో” పడవేయబడతాయి. అది పూర్తి నాశనాన్ని సూచిస్తుంది. మానవజాతి యొక్క సాధారణ సమాధి ఇక ఉనికిలో ఉండకుండా పోతుంది.

నిరుపమానమైన ఉత్తరాపేక్ష!

20. ఇప్పుడు మరణించిన కోట్లాదిమంది ఎలాంటి పరిసరాల్లోకి పునరుత్థానం చేయబడతారు?

20 పునరుత్థాన సమయంలో కోట్లాదిమంది తిరిగిలేపబడినప్పుడు, వాళ్లు ఖాళీగా ఉండే భూమి మీదికేమీ తీసుకురాబడరు. (యెషయా 45:18) చక్కగా తీర్చిదిద్దబడిన పరిసరాల్లోకి వాళ్లు తీసుకురాబడతారు, వాళ్లు తమ కోసం నివాస స్థలాలు, వస్త్రాలు, పుష్కలమైన ఆహారం సిద్ధం చేయబడి ఉండడాన్ని చూస్తారు. (కీర్తన 67:6; 72:16; యెషయా 65:21, 22) ఈ సిద్ధపాట్లన్నీ ఎవరు చేస్తారు? భూ పునరుత్థానం ప్రారంభం కాకముందే నూతన లోకంలో జీవిస్తున్న ప్రజలే ఆ ఏర్పాట్లు చేస్తారని స్పష్టమౌతుంది. కాని ఎవరు?

21, 22. “అంత్య దినములలో” నివసిస్తున్న వారికి ఏ నిరుపమానమైన ఉత్తరాపేక్ష లభించనైయుంది?

21 మనం ఈ విధాన “అంత్యదినములలో” జీవిస్తున్నామని బైబిలు ప్రవచన నెరవేర్పు చూపిస్తుంది.f (2 తిమోతి 3:1) ఇప్పుడు త్వరలోనే, యెహోవా దేవుడు మానవ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని భూమి మీది నుండి దుష్టత్వాన్ని నిర్మూలించబోతున్నాడు. (కీర్తన 37:10, 11; సామెతలు 2:21, 22) ఆ సమయంలో, నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నవారికి ఏమి జరుగుతుంది?

22 యెహోవా దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేయడు. (కీర్తన 145:20) ఆయన ఎన్నడూ అలాంటి పని చేయలేదు, ఇప్పుడు భూమి మీది నుండి చెడుతనాన్నంతటినీ తీసివేసేటప్పుడు కూడా ఆయనలా చేయడు. (పోల్చండి ఆదికాండము 18:22, 23, 26.) వాస్తవానికి, బైబిల్లోని చివరి పుస్తకం, “మహాశ్రమలను” తట్టుకుని యథార్థంగా నిలిచే, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” గురించి మాట్లాడుతుంది. (ప్రకటన 7:9-14) అవును, ఏ మహా శ్రమలలోనైతే ప్రస్తుత దుష్టలోకం అంతం కాబోతుందో ఆ మహా శ్రమలను తట్టుకుని యథార్థంగా నిలిచే ఒక పెద్ద జనాంగం దేవుని నూతన లోకంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ, మానవజాతిని పాపమరణాల నుండి విముక్తి చేయడానికి దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు నుండి విధేయులైన మానవజాతి పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది. (ప్రకటన 22:1, 2) అలా, “గొప్ప సమూహము” ఎన్నడూ మరణాన్ని చవిచూడవలసిన అవసరం ఉండదు. ఎంత నిరుపమానమైన ఉత్తరాపేక్షో గదా!

మరణంలేని జీవితం

23, 24. భూమి మీద పరదైసులో మరణం లేకుండా నిరంతరం జీవించాలని మీరు ఇష్టపడితే మీరు ఏమి చేయవలసి ఉంటుంది?

23 ఈ అత్యద్భుతమైన నిరీక్షణయందు మనం నమ్మకం ఉంచవచ్చా? తప్పకుండా! ప్రజలు ఇక ఎన్నడూ మరణించవలసిన అవసరం ఉండని సమయం వస్తుందని యేసుక్రీస్తు తానే సూచించాడు. తన స్నేహితుడైన లాజరును పునరుత్థానం చేయడానికి ముందు యేసు మార్తతో ఇలా అన్నాడు: “బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.”—యోహాను 11:26.

24 మీరు భూమి మీద పరదైసులో నిరంతరం జీవించాలని ఇష్టపడుతున్నారా? మరణించిన మీ ఆప్తులను మళ్లీ చూడాలని మీరు ఆకాంక్షిస్తున్నారా? “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని అపొస్తలుడైన యోహాను చెప్తున్నాడు. (1 యోహాను 2:17) దేవుని చిత్తమేమిటో తెలుసుకుని, దానికి అనుగుణంగా జీవించడానికి దృఢనిశ్చయం చేసుకోవలసిన సమయం ఇదే. అలా చేస్తే మీరు, ఇప్పటికే దేవుని చిత్తాన్ని చేస్తున్న లక్షలాదిమందితో పాటు భూమి మీద పరదైసులో నిరంతరం జీవించగల్గుతారు.

[అధస్సూచీలు]

a లివింగ్‌ బైబిల్స్‌ ఇండియా వారు ప్రచురించిన పరిశుద్ధ బైబిల్‌.

b వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ సెంటర్‌ వారు ప్రచురించిన పరిశుద్ధ బల్‌.

c ఇండియా బైబిల్‌ లిటరేచర్‌ వారు ప్రచురించిన పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం.

d ఆంధ్ర క్యాతలిక్‌ బైబులు సంఘము వారు ప్రచురించిన పవిత్ర గ్రంథము—క్యాతలిక్‌ అనువాదము.

e “పునరుత్థానము” అనే పదం హెబ్రీ లేఖనాల్లో కనిపించకపోయినప్పటికీ, యోబు 14:13, దానియేలు 12:13, హొషేయ 13:14 నందు పునరుత్థాన నిరీక్షణ స్పష్టంగా వ్యక్తపర్చబడింది.

f వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 98-107 పేజీలను చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ నెఫెష్‌, ప్సీకీ అనే పదాల ప్రాథమిక అర్థమేమిటి?

◻ ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికేమౌతుంది?

◻ బైబిలు ప్రకారం, మరణానికి చికిత్స ఏమిటి?

◻ నేడు నమ్మకమైన వారికోసం ఏ నిరుపమానమైన ఉత్తరాపేక్ష వేచివుంది?

[15వ పేజీలోని బాక్సు]

జీవముగా నెఫెష్‌ మరియు ప్సీకీ

కొన్నిసార్లు, “నెఫెష్‌” లేక “ప్సీకీ” అనే పదాలు ఒక వ్యక్తి లేక జంతువు కలిగివుండే జీవాన్ని సూచిస్తాయి. తెలుగు బైబిళ్లలో అనేక రకాలుగా అనువదించబడిన ఒకే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు బైబిలు రచయితల మనస్సులో ఉన్నదాన్ని ఇది ఎంతమాత్రం మార్చదు. పూర్తి వ్యక్తిని సూచించడానికి బైబిలు రచయితలు నెఫెష్‌, ప్సీకీ అనే పదాలను ఉపయోగించినప్పుడు అది ప్రాణి అని అనువదించబడింది, వాళ్లు ఆ వ్యక్తిని ఒక ప్రాణి అన్నట్లుగా ప్రస్తావించారు. అయినప్పటికీ, ఆ వ్యక్తి సజీవంగా ఉన్నప్పుడు, నెఫెష్‌ మరియు ప్సీకీ అనే అవే పదాలు ఆ వ్యక్తి కలిగివుండే జీవాన్ని సూచించడానికి ఉపయోగించబడవచ్చు, విషయం ఇదైనప్పుడు ఆ పదాలు సాధారణంగా ప్రాణము అనే అనువదించబడ్డాయి.

ఉదాహరణకు, దేవుడు మోషేకిలా చెప్పాడు: “నీ ప్రాణమును [నెఫెష్‌] వెదకిన మనుష్యులందరు చనిపోయిరి.” ఇక్కడ నెఫెష్‌ మోషేకున్న జీవమును సూచిస్తుంది, కాబట్టి ఆయన శత్రువులు ఆయనను చంపడానికి ప్రయత్నించారని స్పష్టమౌతుంది. (నిర్గమకాండము 4:19; పోల్చండి యెహోషువ 9:24; సామెతలు 12:10.) “మనుష్యకుమారుడు . . . అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము [ప్సీకీ] నిచ్చుటకును వచ్చెనని” యేసు చెప్పినప్పుడు, ఆయన ఆ పదాన్ని అదే విధంగా ఉపయోగించాడు. (మత్తయి 20:28) ఇలాంటి సందర్భాల్లో, “ప్రాణము” అంటే “జీవము” అనే భావం.

[15వ పేజీలోని చిత్రాలు]

అన్నీ నెఫెష్‌లే లేక ప్సీకీలే

[క్రెడిట్‌ లైను]

Hummingbird: U.S. Fish and Wildlife Service, Washington, D.C./Dean Biggins

[17వ పేజీలోని చిత్రం]

మరణానికి చికిత్స పునరుత్థానమని యేసు ప్రదర్శించి చూపించాడు

[18వ పేజీలోని చిత్రం]

“బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.”—యోహాను 11:26

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి