అవివాహిత స్థితి—పరధ్యానంలేని కార్యకలాపానికి మార్గం
“తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని [దాని భావము].”—1 కొరింథీయులు 7:35.
1. కొరింథులోని క్రైస్తవులను గూర్చిన ఏ కలవరపరిచే వార్త పౌలుకు అందింది?
గ్రీసు నందలి కొరింథులోని తన క్రైస్తవ సహోదరుల గురించి అపొస్తలుడైన పౌలు శ్రద్ధ కలిగివున్నాడు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, అవినీతికి పేరు పొందిన ఆ సంపన్న నగరంలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు, దాదాపు సా.శ. 55లో, ఆసియా మైనరు నందలి ఎఫెసులో ఉండగా, ఆయన కొరింథు నుండి గుంపుల విభేదాల గురించి, లైంగిక అవినీతికి సంబంధించిన తీవ్రమైన సంఘటనను సహించడం గురించి కలవరపర్చే నివేదికలను అందుకున్నాడు. అంతేగాక, లైంగిక సంబంధాలు, సన్యాసం, వివాహం, విడిపోవడం మరియు పునర్వివాహం అనే అంశాలపై నడిపింపునివ్వమని కొరింథులోని క్రైస్తవులు వ్రాసిన లేఖను పౌలు అందుకున్నాడు.
2. కొరింథులో ప్రబలివున్న అవినీతి ఆ నగరంలోని క్రైస్తవులను ఎలా ప్రభావితం చేసిందని స్పష్టమౌతుంది?
2 కొరింథులో ప్రబలివున్న ఘోరమైన అవినీతి స్థానిక సంఘాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుంది. కొంతమంది క్రైస్తవులు నైతిక విశృంఖలతా వాతావరణానికి లొంగిపోతూ, అవినీతిని సహిస్తున్నారు. (1 కొరింథీయులు 5:1; 6:15-17) ఇతరులైతే నగరమంతటా వ్యాపించివున్న లైంగిక విలాసాలకు ప్రతిస్పందిస్తూ వివాహిత దంపతుల మధ్య కూడా ఏవిధమైన లైంగిక సంబంధం ఉండకూడదన్నంత విపరీతానికి వెళ్లినట్లు స్పష్టమౌతుంది.—1 కొరింథీయులు 7:5.
3. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో పౌలు ముందుగా ఏ విషయాలను ప్రస్తావించాడు?
3 పౌలు కొరింథీయులకు వ్రాసిన సుదీర్ఘమైన లేఖలో, ఆయన మొదట అనైక్యతా సమస్య గురించి ప్రస్తావించాడు. (1 కొరింథీయులు 1-4 అధ్యాయాలు) మనుష్యులను అనుసరించడం హానికరమైన విభేదాలకే దారితీస్తుంది గనుక వాటిని మానుకొమ్మని ఆయన వారికి ఉద్బోధించాడు. వారు దేవుని ‘జతపనివారిగా’ ఐక్యంగా ఉండాలి. ఆ తర్వాత, సంఘాన్ని నైతికంగా పరిశుభ్రంగా ఉంచడాన్ని గూర్చి ఆయన ప్రత్యేకమైన ఉపదేశాలను వారికిచ్చాడు. (5, 6 అధ్యాయాలు) ఆ తర్వాత అపొస్తలుడు వారి లేఖతో వ్యవహరించాడు.
అవివాహిత స్థితి సిఫారసు చేయబడింది
4. “స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు” అని చెప్పినప్పుడు పౌలు ఉద్దేశం ఏమిటి?
4 ఆయనిలా ప్రారంభించాడు: “మీరు వ్రాసినవాటి విషయము—స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.” (1 కొరింథీయులు 7:1) ఇక్కడ “స్త్రీని ముట్టకుండుట” అంటే లైంగికానందం కొరకు ఒక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకోకుండా ఉండడమని భావం. పౌలు అప్పటికే వ్యభిచారాన్ని ఖండించాడు గనుక, ఆయనిప్పుడు వివాహ ఏర్పాటులోని లైంగిక సంబంధాల గురించి చెబుతున్నాడు. కాబట్టి పౌలు ఇప్పుడు అవివాహిత స్థితిని సిఫారసు చేస్తున్నాడు. (1 కొరింథీయులు 6:9, 16, 18; ఆదికాండము 20:6; సామెతలు 6:29 పోల్చండి.) ఇంకా చెబుతూ ఆయనిలా వ్రాశాడు: “నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.” (1 కొరింథీయులు 7:8) పౌలు అవివాహితుడు లేక బహుశా భార్య మరణించిన వ్యక్తి అయ్యుండవచ్చు.—1 కొరింథీయులు 9:5.
5, 6. (ఎ) పౌలు సన్యాసి జీవన విధానాన్ని సిఫారసు చేయడం లేదన్నది ఎందుకు స్పష్టమౌతుంది? (బి) పౌలు ఎందుకు అవివాహిత స్థితిని సిఫారసు చేశాడు?
5 కొరింథులోని క్రైస్తవులు గ్రీకు తత్వం గురించి తెలుసుకొని ఉండవచ్చు, ఆ తత్వానికి సంబంధించిన కొందరు విపరీతమైన సన్యాసత్వాన్ని, వైరాగ్యాన్ని కొనియాడారు. క్రైస్తవులు లైంగిక సంబంధాలన్నింటిని విసర్జించడం ‘మేలా’ అని కొరింథీయులు పౌలును అడగడానికి అది కారణమై ఉండవచ్చా? పౌలిచ్చిన సమాధానం గ్రీకు తత్వాన్ని ప్రతిబింబించలేదు. (కొలొస్సయులు 2:8) కాథోలిక్ వేదాంతులవలె కాక, అవివాహితులు ప్రాముఖ్యంగా పవిత్రులని, వారు తమ జీవన విధానం ద్వారాను ప్రార్థనల ద్వారాను తమ సొంత రక్షణకు దోహదపడగలరని చెప్పి సన్యాసుల మఠంలో లేక క్రైస్తవ సన్యాసినుల మఠంలో అవివాహిత సన్యాస జీవితం గడపడాన్ని గూర్చి ఆయన ఎక్కడా సిఫారసు చేయలేదు.
6 “ఇప్పటి ఇబ్బందిని బట్టి” పౌలు అవివాహిత స్థితిని సిఫారసు చేశాడు. (1 కొరింథీయులు 7:26) క్రైస్తవులు అనుభవిస్తున్న కష్టతరమైన పరిస్థితుల గురించి వివాహం మూలంగా అవి ఝటిలం కావచ్చునని ఆయన సూచిస్తుండవచ్చు. (1 కొరింథీయులు 7:28) అవివాహిత క్రైస్తవులకు ఆయనిచ్చిన సలహా ఏమంటే: ‘నావలెనుండుట వారికి మేలు.’ భార్య మరణించిన వారితో ఆయనిలా చెప్పాడు: “భార్యలేక విడిగానుంటివా వివాహము కోరవద్దు” క్రైస్తవ విధవరాలి గురించి ఆయనిలా వ్రాశాడు: “ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 7:8, 27, 40.
అవివాహిత స్థితిలోనే ఉండాలన్న నిర్బంధం లేదు
7, 8. అవివాహితునిగా ఉండమని పౌలు ఏ క్రైస్తవున్ని బలవంతం చేయడం లేదని ఏది చూపిస్తుంది?
7 పౌలు ఈ సలహా ఇచ్చినప్పుడు నిస్సందేహంగా యెహోవా పరిశుద్ధాత్మ అతనికి నడిపింపునిస్తోంది. ఆయన అవివాహిత స్థితి గురించి, వివాహం గురించి చెప్పినదంతా సమతూకాన్ని, నిగ్రహాన్ని చూపిస్తుంది. ఆయన దాన్ని విశ్వాస్యతకు లేక అవిశ్వాస్యతకు సంబంధించిన విషయంగా చేయలేదు. బదులుగా, అది అవివాహిత స్థితిలో పవిత్రంగా ఉండగల్గే వారు దాని విషయంలో సమతూకమైన మొగ్గును చూపి, స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవలసిన విషయం.
8 “స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు” అని చెప్పిన తర్వాత పౌలు వెంటనే ఇలా జత చేశాడు: “అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.” (1 కొరింథీయులు 7:1, 2) ‘నావలెనుండమని’ అవివాహితులకు, విధవరాండ్రకు ఉపదేశించిన తర్వాత, ఆయన వెంటనే ఇలా జత చేశాడు: “అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.” (1 కొరింథీయులు 7:8, 9) మరలా, భార్య చనిపోయిన వారికి ఆయన ఇలా ఉపదేశించాడు: “వివాహము కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు.” (1 కొరింథీయులు 7:27, 28) సమతూకం గల ఈ ఉపదేశం ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది.
9. యేసు మరియు పౌలు చెప్పినదాని ప్రకారం, వివాహం మరియు అవివాహిత స్థితి రెండూ ఎలా దేవుని నుండి వచ్చిన బహుమానాలైవున్నాయి?
9 వివాహం మరియు అవివాహిత స్థితి రెండూ దేవుని బహుమానాలేనని పౌలు చూపించాడు. “మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.” (1 కొరింథీయులు 7:7) నిస్సందేహంగా ఆయన మనస్సులో యేసు చెప్పిన విషయమే ఉండవచ్చు. వివాహం దేవుని నుండి వచ్చిందని నిరూపించిన తర్వాత, రాజ్యాసక్తుల కొరకు సేవచేయడానికి ఇష్టపూర్వకంగా అవివాహిత స్థితిలో ఉండడం ప్రత్యేకంగా ఒక బహుమానమని యేసు చూపించాడు: “ఆ మాటకు అందరూ తావివ్వలేరు గాని కేవలం ఆ బహుమానాన్ని పొందినవారు మాత్రమే తావివ్వగలుగుతారు. ఎందుకంటే తల్లి గర్భం నుండే అలా జన్మించిన నపుంసకులు ఉన్నారు, మనుష్యులచే నపుంసకులుగా చేయబడ్డ నంపుసకులూ ఉన్నారు, పరలోక రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నవాళ్లూ ఉన్నారు. దానికి తావిచ్చే వారే దానికి తావిచ్చెదరు గాక!”—మత్తయి 19:4-6, 11, 12, NW.
అవివాహిత స్థితి అనే బహుమానానికి తావివ్వడం
10. అవివాహిత స్థితి అనే బహుమానానికి ఒక వ్యక్తి ఎలా ‘తావివ్వవచ్చు’?
10 అవివాహిత స్థితి ఒక “బహుమానం” అన్నట్లుగానే యేసు మరియు పౌలు ఇద్దరూ మాట్లాడినప్పటికీ, అది కేవలం కొందరికి మాత్రమే లభించే అద్భుతమైన బహుమానమని ఏ ఒక్కరూ చెప్పలేదు. ఆ బహుమానానికి అందరూ “తావివ్వలేరు” అని యేసు చెప్పాడు, యేసు మరియు పౌలు చేసినట్లుగా “తావిచ్చే” వారు అలా తావివ్వవచ్చునని ఆయన ఉద్బోధించాడు. నిజమే, “కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు” అని పౌలు వ్రాశాడు, కాని అయన “మనస్సు నిలుపలేని” వారి గురించి మాట్లాడుతుండెను. (1 కొరింథీయులు 7:9) అంతకు ముందు వ్రాసినవాటిల్లో, క్రైస్తవులు కామతప్తులవ్వడాన్ని విసర్జించవచ్చునని పౌలు చూపించాడు. (గలతీయులు 5:16, 22-24) ఆత్మానుసారముగా నడుచుకోవడమంటే మన ప్రతి అడుగును యెహోవా ఆత్మ నడిపించేందుకు అనుమతించడమే. యౌవన క్రైస్తవులు దీన్ని చేయగలరా? అవును, వారు యెహోవా వాక్యాన్ని సన్నిహితంగా అనుసరించినట్లయితే వారలా చేయగలరు. కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా!”—కీర్తన 119:9.
11. ‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ అంటే ఏమిటి?
11 అనేక దూరదర్శిని కార్యక్రమాలు, చలనచిత్రాలు, పత్రికా శీర్షికలు, పుస్తకాలు, పాటల ద్వారా వ్యాప్తి చేయబడే విచ్చలవిడి ఉద్దేశాల నుండి కాపాడుకోవడం దీనిలో ఇమిడి ఉంది. అలాంటి ఉద్దేశాలు శరీర సంబంధమైనవి. అవివాహిత స్థితిని అంగీకరించాలనుకునే యౌవన క్రైస్తవుడైనా లేక యౌవన క్రైస్తవురాలైనా “శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొన” వలెను. “శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సు నుంతురు.” (రోమీయులు 8:3, 4, 5, ఇటాలిక్కులు మావి.) ఆత్మ విషయములు పవిత్రమైనవి, న్యాయమైనవి, రమ్యమైనవి, ఖ్యాతిగలవి. క్రైస్తవులు యౌవనులైనా, వృద్ధులైనా “వాటిమీద ధ్యానముంచ”డం మంచిది.—ఫిలిప్పీయులు 4:8, 9.
12. అవివాహిత స్థితి అనే బహుమానాన్ని అంగీకరించడంలో ఎక్కువగా ఏమి ఇమిడి ఉంది?
12 అవివాహిత స్థితి అనే బహుమానాన్ని అంగీకరించడమనేది ఎక్కువగా ఆ లక్ష్యంపై మనస్సు నిలిపి దాన్ని స్వీకరించడంలో సహాయం నిమిత్తం యెహోవాకు ప్రార్థించాల్సిన విషయమే. (ఫిలిప్పీయులు 4:6, 7) పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను పెండ్లిచేసుకొననవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, వివాహము లేకుండ ఉండవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి పెండ్లిచేసుకొనువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లిచేసుకొననివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.”—1 కొరింథీయులు 7:37, 38, NW.
ఒక సంకల్పంతో అవివాహిత స్థితి
13, 14. (ఎ) అవివాహితులకు వివాహితులకు మధ్య తేడాను అపొస్తలుడైన పౌలు ఎలా చూపాడు? (బి) వివాహితుల కంటే అవివాహిత క్రైస్తవుడు ఎలా మాత్రమే “మేలు” చేయగలడు?
13 అవివాహిత స్థితి దానంతటదే బహుమానం వంటిది కాదు. మరి అది ఏవిధంగా “మేలు”? అది తెచ్చే స్వేచ్ఛను ఒక వ్యక్తి ఎలా ఉపయోగించుకుంటాడనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.”—1 కొరింథీయులు 7:32-35.
14 తన అవివాహిత స్థితిని స్వార్థపూరిత లక్ష్యాల కొరకు పాటుపడేందుకు ఉపయోగించుకొనే ఒక అవివాహిత క్రైస్తవుడు వివాహితులైన క్రైస్తవుల కంటె “మేలు” ఏమీ చేయడం లేదు. అతడు “రాజ్యము నిమిత్తము” కాదుగాని వ్యక్తిగత కారణాలను బట్టి ఒంటరివానిగా ఉంటున్నాడు. (మత్తయి 19:12) అవివాహిత పురుషుడు లేక స్త్రీ ‘ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింత కలిగివుండాలి,’ “ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని” ఆతురత కలిగివుండాలి మరియు “తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై” ఉండాలి. అంటే యెహోవాకును యేసుక్రీస్తుకును సేవచేయడంలో అవిభాగిత అవధానాన్ని కలిగివుండడమని భావం. అలా చేయడం ద్వారా మాత్రమే అవివాహితులైన క్రైస్తవ స్త్రీ పురుషులు వివాహిత క్రైస్తవుల కంటె “మేలు” చేయగలవారై ఉండగలరు.
పరధ్యానంలేని కార్యకలాపం
15. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలోని పౌలు వాదన యొక్క ముఖ్యాంశమేమిటి?
15 ఈ అధ్యాయంలో పౌలు చేసిన మొత్తం వాదన ఇలా ఉంది: వివాహం న్యాయబద్ధమైనది, కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి సిఫారసు చేయదగినది అయినప్పటికీ, ఎక్కువ పరధ్యానం లేకుండా యెహోవా సేవచేయాలని కోరుకునే క్రైస్తవ పురుషునికి లేక స్త్రీకి అవివాహిత స్థితి నిర్వివాదంగా ప్రయోజనకరమైనది. వివాహితుడు ‘విభాగింపబడి’ ఉంటాడు, అయితే అవివాహిత క్రైస్తవుడు “ప్రభువు విషయమైన కార్యముల” మీద శ్రద్ధ నిలపడానికి స్వతంత్రుడై ఉంటాడు.
16, 17. అవివాహిత క్రైస్తవుడు ‘ప్రభువు విషయమైన కార్యములలో’ ఎక్కువ శ్రద్ధను ఎలా నిలుపగలడు?
16 వివాహితులకంటే ఒక అవివాహిత క్రైస్తవుడు మరింత స్వేచ్ఛగా శ్రద్ధనివ్వగల ప్రభువు విషయాలు ఏవి? మరో సందర్భంలో, యేసు ‘దేవుని విషయాల’ గురించి అంటే ఒక క్రైస్తవుడు కైసరుకు ఇవ్వలేని విషయాల గురించి మాట్లాడాడు. (మత్తయి 22:21) ప్రాముఖ్యంగా ఈ విషయాలు ఒక క్రైస్తవుని జీవితం, ఆరాధన, పరిచర్యకు సంబంధించినవి.—మత్తయి 4:10; రోమీయులు 14:8; 2 కొరింథీయులు 2:17; 3:5, 6; 4:1.
17 సాధారణంగా అవివాహితులు యెహోవా సేవ కొరకు సమయాన్ని కేటాయించడానికి స్వతంత్రులై ఉంటారు, అది వారి ఆత్మీయతకు, వారి పరిచర్య పరిధికి ప్రయోజనకరమైనదై ఉంటుంది. వారు వ్యక్తిగత పఠనం మరియు ధ్యానం కొరకు ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. వివాహితులకంటే అవివాహిత క్రైస్తవులు తరచూ తమ బైబిలు పఠనాన్ని తమ పట్టికలో ఎంతో సుళువుగా ఇమడ్చగల్గుతారు. వారు కూటాల కొరకు, ప్రాంతీయ సేవ కొరకు ఎంతో చక్కగా సిద్ధపడవచ్చు. ఇదంతా వారి “ప్రయోజనము నిమిత్తమే.”—1 కొరింథీయులు 7:35.
18. “తొందరేమియు లేక” యెహోవా సేవ చేయాలని ఉందని అనేకమంది అవివాహిత సహోదరులు ఎలా చూపించవచ్చు?
18 ఇప్పటికే పరిచర్య సేవకులుగా సేవచేస్తున్న అనేకమంది అవివాహిత సహోదరులు, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు”మని యెహోవాతో చెప్పడానికి స్వతంత్రులై ఉన్నారు. (యెషయా 6:8) అవివాహిత పరిచర్య సేవకుల కొరకు మరియు అవసరత ఎక్కువగా ఉన్న చోట సేవచేసేందుకు స్వతంత్రులై ఉన్న పెద్దల కొరకు కేటాయింపబడిన పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యేందుకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ సంఘాన్ని విడిచి వెళ్లే అవకాశం లేని సహోదరులు కూడా పరిచారక సేవకులుగా లేక పెద్దలుగా తమ సహోదరులకు సేవ చేసేందుకు తమను తాము అందుబాటులో ఉంచుకోవచ్చు.—ఫిలిప్పీయులు 2:20-23.
19. అనేకమంది అవివాహిత సహోదరీలు ఎలా ఆశీర్వదించబడ్డారు, వారు సంఘాలకు ఒక ఆశీర్వాదంగా ఉండగల ఒక మార్గం ఏమిటి?
19 అవివాహిత సహోదరీలు సంప్రదించడానికి, నమ్మకం పెట్టుకోవడానికి తమకు మానవ శిరస్సులేనందున ‘తమ భారము యెహోవామీద మోపడానికి’ మరింత సంసిద్ధులై ఉండవచ్చు. (కీర్తన 55:22; 1 కొరింథీయులు 11:3) యెహోవా ఎడల ప్రేమనుబట్టి అవివాహిత స్థితిలో ఉండిపోయిన సహోదరీలకు ప్రాముఖ్యంగా ఇది ఆవశ్యకము. కొంతకాలానికి వారు వివాహం చేసుకున్నా, అది “ప్రభువునందు మాత్రమే,” అంటే యెహోవాకు సమర్పించుకున్న వారినే వివాహమాడతారు. (1 కొరింథీయులు 7:39) తమ సంఘాల్లో అవివాహిత సహోదరీలు ఉన్నందున పెద్దలు కృతజ్ఞత కల్గివుంటారు; వీరు తరచూ రోగులను, వృద్ధులను దర్శించి సహాయం చేస్తారు. ఇది సంబంధితులందరికీ ఆనందాన్ని తీసుకువస్తుంది.—అపొస్తలుల కార్యములు 20:35.
20. తాము “తొందరేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై” ఉన్నట్లు అనేకమంది క్రైస్తవులు ఎలా చూపిస్తున్నారు?
20 అనేకమంది యౌవన క్రైస్తవులు “తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై” ఉండేలా తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకున్నారు. (1 కొరింథీయులు 7:35) వారు పూర్తికాల పయినీరు పరిచారకులుగా, మిషనరీలుగా, లేక వాచ్‌టవర్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానియందు యెహోవా సేవచేస్తున్నారు. వారు ఎంతటి ఆనందభరితమైన గుంపో కదా! వారి సాన్నిధ్యం ఎంత ఉత్తేజకరమైనదిగా ఉంటుందో కదా! అంతెందుకు, యెహోవా దృష్టిలోను యేసు దృష్టిలోను వారు ‘మంచు బిందువులవలె’ ఉన్నారు.—కీర్తన 110:3.
ఎప్పటికీ అవివాహితగా ఉండే ప్రమాణం అవసరంలేదు
21. (ఎ) అవివాహిత ప్రమాణం చేయమని పౌలు ప్రోత్సహించలేదని ఎందుకు స్పష్టమౌతుంది? (బి) “ఈడు మించి” పోవడం గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన దేన్ని సూచించాడు?
21 క్రైస్తవులు తమ జీవితాలను అవివాహిత స్థితిలో గడపడానికి అంగీకరించడం “మేలు” అన్నది పౌలు ఉపదేశంలోని ఒక కీలకాంశం. (1 కొరింథీయులు 7:1, 8, 26, 37) అయితే అవివాహితగానే ఉండే ప్రమాణం చేయమని ఆయన వారిని ఎంతమాత్రం కోరలేదు. దానికి భిన్నంగా ఆయనిలా వ్రాశాడు: “అయితే ఒకడు తన ఈడు మించిపోయినందున, అది ఇలా జరుగవలసియున్నది గనుక తన పడుచుదనం విషయంలో తాను సరిగా వ్యవహరించడం లేదని తలస్తే అతడు తన ఇష్టం చొప్పున చేయవచ్చును; అతడు పాపము చేయడం లేదు. వారిని పెండ్లి చేసుకొననివ్వండి.” (1 కొరింథీయులు 7:36, NW) “ఈడు మించిపోయిన” అని అనువదించబడిన ఒకే గ్రీకు పదానికి (హై·పెʹరా·క్మోస్) “అత్యధిక స్థాయిని మించి” అనే అక్షరార్థ భావం ఉంది, లైంగిక కోరిక అధికంగా ఉండే స్థితిని దాటడాన్ని అది సూచిస్తుంది. కాబట్టి అవివాహిత స్థితిలో అనేక సంవత్సరాలు గడిపిన వారు చివరికి వివాహం చేసుకోవాలని భావిస్తే, వారు తమ తోటి విశ్వాసిని వివాహం చేసుకోవడానికి పూర్తిగా స్వతంత్రులే.—2 కొరింథీయులు 6:14.
22. ఒక క్రైస్తవుడు మరీ చిన్న వయస్సులో వివాహం చేసుకోకుండా ఉండడం అన్ని విధాల ఎందుకు ప్రయోజనకరమైనది?
22 తొందరేమి లేకుండా యెహోవా సేవచేయడంలో ఒక యౌవన క్రైస్తవుడు గడిపే సంవత్సరాలు జ్ఞానవంతమైన పెట్టుబడి వంటివే. ఆ సంవత్సరాలు అతడు లేక ఆమె ఆచరణాత్మకమైన వివేచనను, అనుభవాన్ని, అంతర్దృష్టిని పొందడానికి అనుమతిస్తాయి. (సామెతలు 1:3, 4) రాజ్యం నిమిత్తం అవివాహితునిగా ఉండిపోయిన ఒక వ్యక్తి ఆ తర్వాత, వివాహజీవితం యొక్క మరియు బహుశా పితృత్వం యొక్క బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకుంటే, అతడు అలా చేయడానికి ఎంతో శ్రేష్ఠమైన స్థితిలో ఉంటాడు.
23. వివాహం చేసుకోవాలనుకునే కొందరు మనస్సులో ఏమి కలిగివుండవచ్చు, అయితే తరువాతి శీర్షికల్లో ఏ ప్రశ్న పరిశీలించబడుతుంది?
23 అవివాహిత స్థితిలో అనేక సంవత్సరాల పాటు పూర్తికాలం యెహోవా సేవ చేయడంలో గడిపిన కొంతమంది క్రైస్తవులు ఏదో విధమైన పూర్తికాల సేవలో కొనసాగాలనే ఉద్దేశంతో తమ భవిష్యత్ జతను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. ఇది కచ్చితంగా ఎంతో మెచ్చుకొనదగినది. తమ వివాహం ఏ విధంగానైనా తమ సేవను ఆటంకపరచడానికి అనుమతించ కూడదనే ఉద్దేశంతో కొందరు వివాహం చేసుకోవడాన్ని గురించి ముందుగా తలంచుచుండవచ్చు. కాని వివాహిత క్రైస్తవులు తాము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే యెహోవాకు తాము చేసే సేవ ఎడల శ్రద్ధ నిలపడానికి స్వతంత్రంగా ఉన్నట్లు అతడు లేక ఆమె భావించవచ్చునా? ఈ ప్రశ్న తరువాతి శీర్షికల్లో పరిశీలించబడుతుంది.
పునఃపరిశీలనగా
◻ కొరింథులోని సంఘానికి వ్రాయవలసిన అవసరత ఉన్నట్లు అపొస్తలుడైన పౌలు ఎందుకు భావించాడు?
◻ పౌలు సన్యాసి జీవన విధానాన్ని సిఫారసు చేయడం లేదని మనకెందుకు తెలుసు?
◻ ఒక వ్యక్తి అవివాహిత స్థితిని ఎలా ‘అంగీకరించవచ్చు’?
◻ అవివాహిత సహోదరీలు తమ అవివాహిత స్థితి నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
◻ అవివాహిత సహోదరులు “తొందరేమియు లేక” యెహోవా సేవ చేయడానికి తమకున్న స్వేచ్ఛ నుండి ఏ యే విధాలుగా ప్రయోజనం పొందవచ్చు?