ప్రకృతి వైపరీత్యాలు దాడిచేసినప్పుడు
అక్రా, ఘానా, జూలై 4, 1995: ఇంచుమించు 60 సంవత్సరాలలో మొదటిసారిగా కురిసిన అత్యంత భారీ వర్షాలు గొప్ప వరదలను కలుగజేశాయి. దాదాపు 2,00,000 మంది అంతా పోగొట్టుకున్నారు, 5,00,000 మంది తమ ఇండ్లలోకి ప్రవేశించలేకపోయారు, 22 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
శాన్ ఆంజిలో, టెక్సాస్, అమెరికా, మే 28, 1995: 90,000 మంది నివాసులుగల ఈ నగరాన్ని తుపానులు, వడగళ్లు ధ్వంసం చేశాయి. 12 కోట్ల (అమెరికా) డాలర్ల నష్టం సంభవించిందని అంచనా.
కోబీ, జపాన్, జనవరి 17, 1995: కేవలం 20 సెకండ్లపాటు వచ్చిన ఒక భూకంపం వేలాదిమంది మరణించడానికి, వేలాదిమంది గాయపడడానికి, మరి వేలాదిమంది నిరాశ్రయులవ్వడానికి కారణమైంది.
వైపరీత్యాల శకం అని పిలువబడగల కాలంలో మనం జీవిస్తున్నాము. 1963 నుండి 92 వరకు గల 30 సంవత్సరాల కాలంలో, వైపరీత్యాల వలన చనిపోయిన, గాయపడ్డ, లేక స్థానభ్రంశం చెందిన వ్యక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం సగటున 6 శాతం పెరిగిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడిస్తుంది. విషాదకరమైన ఈ పరిస్థితి, ఐక్యరాజ్య సమితి 1990లను “ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు కొరకైన అంతర్జాతీయ దశకం” అని పేరు పెట్టేలా చేసింది.
నిజమే, తుపాను, అగ్ని పర్వతం బ్రద్దలవ్వడం, లేక భూకంపం వంటి ఒక ప్రకృతి శక్తి ఎల్లప్పుడూ వైపరీత్యాన్నే తీసుకురాదు. మానవులకు ఏమాత్రం హాని కలిగించకుండా వందలకొలది ప్రతి సంవత్సరం సంభవిస్తుంటాయి. కానీ విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినప్పుడే అది సరియైన విధంగా వైపరీత్యం అని పిలువబడుతుంది.
ప్రకృతి వైపరీత్యాలలో పెరుగుదల అనివార్యం అనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు—దైవిక చర్యలా లేక మానవుని చర్యలా? అనే పుస్తకం ఇలా అంటుంది: “తమ పర్యావరణం కొన్ని వైపరీత్యాలకు మరింత ఆస్పదమయ్యేలా చేయడానికి ప్రజలు దానిని మారుస్తున్నారు, తమనుతాము ఆ విపత్తులకు మరింత భేద్యమైన వారిగా చేసుకునేలా ప్రవర్తిస్తున్నారు.” ఆ పుస్తకం ఒక ఊహాత్మక ఉదాహరణను అందిస్తుంది: “నిట్రమైన లోయ ప్రక్కన బరువైన మట్టి-ఇటుకల ఇండ్లున్న ఒక కుగ్రామంలో ఒక స్వల్పమైన భూకంపం సంభవిస్తే మానవ మరణాలు, బాధల సంబంధంగా వైపరీత్యంగానే రుజువవ్వవచ్చు. కానీ వైపరీత్యం ఎక్కువగా భూమి కంపించడం ఫలితంగానా లేక ప్రజలు అటువంటి ప్రమాదకరమైన ఇండ్లలో అటువంటి ప్రమాదకరమైన భూమిపైన జీవిస్తున్నారన్న వాస్తవం ఫలితంగానా?”
బైబిలు విద్యార్థులకైతే, ప్రకృతి వైపరీత్యాల పెరుగుదల ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించదనే దానికి వేరొక కారణం ఉంది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ఇతర విషయాలతోపాటు ‘అక్కడక్కడ కరవులు, భూకంపములు’ సంభవించడంతో “యుగసమాప్తి” గుర్తించబడుతుందని యేసుక్రీస్తు ముందే చెప్పాడు. (మత్తయి 24:3, 6-8) “అంత్యదినములలో” మనుష్యులు స్వార్థపరులుగా, ధనాపేక్షులుగా, అనురాగరహితులుగా, మంచితనం ఎడల ప్రేమ లేనివారుగా ఉంటారని కూడా బైబిలు ముందే చెప్పింది.a (2 తిమోతి 3:1-5) ఈ లక్షణాలు తరచూ మానవుడు తన పర్యావరణానికి విరుద్ధంగా పనిచేసేలా చేస్తుంది, ఇది మానవులను ప్రకృతి శక్తులకు మరింత భేద్యమైనవారిగా చేస్తుంది. మానవునిచే సృష్టించబడిన వైపరీత్యాలు అనేకమంది నివసించవలసి వచ్చే ప్రేమరహిత సమాజం నుండి ఉత్పన్నమైనవి కూడాను.
మన గ్రహంపై జన సాంద్రత పెరిగే కొలది, మానవ ప్రవర్తన ప్రజలను హెచ్చైన ప్రమాదంలో పెట్టే కొలది, మరియు భూమి వనరులు మరింతగా దుర్నిర్వహణ గావించబడే కొలది వైపరీత్యాలు మానవున్ని పట్టి పీడిస్తునే ఉంటాయి. తరువాతి శీర్షిక చూపిస్తున్నట్లుగా, సహాయం అందించడం సవాళ్లను ముందుంచుతుంది.
[అధస్సూచీలు]
a అంత్యదినాల సూచన గురించి మరింత సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారిచే ప్రచురించబడిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 98-107 పేజీలను చూడండి.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Top: Information Services Department, Ghana; right: San Angelo Standard-Times
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Maxie Roberts/Courtesy of THE STATE