విమోచన సమీపిస్తుండగా ధైర్యంగా ఉండండి
‘నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.’—యిర్మీయా 1:19.
1, 2. మానవ కుటుంబానికి విమోచన ఎందుకవసరము?
విమోచన! ఎంత ఓదార్పుకరమైన మాట! విమోచించబడడం అంటే విడిపించబడడం, అననుకూలమైన అసంతోషకరమైన పరిస్థితి నుండి స్వతంత్రులు గావించబడడం. దీనిలో మరింత శ్రేష్ఠమైన, సంతోషకరమైన స్థితికి తీసుకురాబడడమనే తలంపు చేరివుంది.
2 ఈ సమయంలో మానవ కుటుంబానికి అలాంటి విమోచన ఎంత ఆవశ్యకమో కదా! ఆర్థిక, సామాజిక, శారీరక, మానసిక మరియు భావోద్రేక సమస్యల వంటి క్లిష్టమైన సమస్యల మూలంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలూ అణచివేయబడి, నిరుత్సాహపడుతూ ఉన్నారు. ప్రపంచం నడుస్తున్న విధానాన్నిబట్టి అత్యధికులు అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారు, మంచి మార్పు రావాలని వారు ఇష్టపడుతున్నారు.—యెషయా 60:2; మత్తయి 9:36.
“అపాయకరమైన కాలములు”
3, 4. ఇప్పుడు విమోచన కొరకు గొప్ప అవసరత ఎందుకుంది?
3 ఈ ఇరవయ్యవ శతాబ్దం ఏ ఇతర శతాబ్దంకంటే కూడా ఎక్కువ వేదనను అనుభవించింది గనుక, మునుపెన్నటికంటే కూడా ఇప్పుడు విమోచన కొరకైన అవసరత ఎంతో ఉంది. నేడు, నూరుకోట్లకంటే ఎక్కువమంది ప్రజలు కడు బీదరికంలో జీవిస్తున్నారు, ఆ సంఖ్య సంవత్సరానికి దాదాపు 2 కోట్ల 50 లక్షల చొప్పున పెరుగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి 30 లక్షలమంది పిల్లలు అంటే ఒకరోజుకు 35,000 కన్నా ఎక్కువమంది కుపోషణ మూలంగానూ లేక పేదరికానికి సంబంధించిన ఇతర కారణాల మూలంగానూ మరణిస్తున్నారు! లక్షలాదిమంది పెద్దవయస్కులు వివిధ రోగాల మూలంగా అకాల మరణానికి గురౌతున్నారు.—లూకా 21:11; ప్రకటన 6:8.
4 యుద్ధాలు, పౌర సంబంధ అస్తవ్యస్థతలు చెప్పనలవికాని బాధకు కారణమయ్యాయి. యుద్ధాలూ, జాతి పోరాటాలూ మతసంబంధమైన పోరాటాలూ, ప్రభుత్వాలు తమ స్వంత పౌరులను సామూహికంగా హత్య చేయడమూ వంటివి, “ఈ శతాబ్దంలో 20 కోట్ల 30 లక్షలకంటే ఎక్కువమంది ప్రజలను చంపాయని” డెత్ బై గవర్నమెంట్ అనే పుస్తకం చెబుతుంది. అదింకా ఇలా తెలియజేస్తుంది: “నిజంగా చంపబడినవారు దాదాపు 36 కోట్ల ప్రజలై ఉండవచ్చు. ఇది మన యావత్ మానవజాతీ ఒక ఆధునిక నల్ల మహామారితో నాశనం చేయబడినట్లుగా ఉంది. నిజంగానే నాశనం చేయబడింది, కాని సూక్ష్మజీవుల మహామారి వల్ల కాదుగాని అధికార మహామారి వల్లే అది జరిగింది.” రచయిత రిచర్డ్ హార్‌వుడ్ ఇలా తెలియజేశాడు: “పోల్చి చూస్తే, గత శతాబ్దాల్లో జరిగిన క్రూరమైన యుద్ధాలు వీధి పోరాటాల్లాంటివి మాత్రమే.”—మత్తయి 24:6, 7; ప్రకటన 6:4.
5, 6. మన కాలాన్ని అంత వేదనకరమైనదిగా చేస్తున్నదేమిటి?
5 ఇటీవలి సంవత్సరాల్లో నెలకొన్న కల్లోల పరిస్థితులకు తోడుగా దౌర్జన్యపూరితమైన నేరం, లైంగిక దుర్నీతి, కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడం వంటివి విస్తృతంగా పెరిగాయి. 30 సంవత్సరాలలో అమెరికా జనాభా 41 శాతం పెరిగింది కానీ హింసాత్మక నేరం 560 శాతం, అక్రమ జననాలు 400 శాతం, విడాకులు 300 శాతం, యౌవనస్థుల ఆత్మహత్యా రేటు 200 శాతం పెరిగాయని మాజీ అమెరికా విద్యాశాఖ సెక్రటరీ విలియం బెనెట్ తెలియజేశాడు. “ఘోరమైన దోపిడీదారులు” అయినటువంటి యౌవనస్థుల శ్రేణిలోని పెరుగుదల గురించి, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన జాన్ డీయూల్యొ జూనియర్ హెచ్చరించాడు. వారు “హత్యలు, దాడులు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తూ సమాజంలో గంభీరమైన అస్తవ్యస్థతలు సృష్టిస్తూ, అరెస్టు చేయబడతామనే అవమానానికిగానీ, జైలులో అనుభవించే శిక్షలకుగానీ, లేక మనస్సాక్షి పెట్టే బాధలకుగానీ భయపడడం లేదు.” ఆ దేశంలో, ఇప్పుడు 15 నుండి 19 సంవత్సరాల వయస్సున్నవారి మరణానికి దారితీస్తున్న ప్రముఖమైన రెండవ కారణం హత్యలే. నాలుగేళ్లలోపు పిల్లల్లో ఎక్కువమంది రోగాల మూలంగా మరణించడం కన్నా దుర్వ్యవహారం మూలంగా మరణిస్తున్నారు.
6 అలాంటి నేరాలూ దౌర్జన్యాలూ ఏదో ఒక్క దేశానికే పరిమితమై లేవు. అనేక దేశాలు అలాంటి ధోరణినే నివేదిస్తున్నాయి. లక్షలాదిమందిని కలుషితపరుస్తున్న చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల ఉపయోగం పెరగడం వీటికి దోహదపడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఇలా తెలియజేసింది: “ఆయుధ వ్యాపారం తర్వాత అంతర్జాతీయ మాదకద్రవ్యాల ఎగుమతీ దిగుమతుల వ్యాపారం, ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారాల్లో రెండవదిగా తయారైంది.” దీనికి దోహదపడుతున్న మరో అంశం ఏమిటంటే, ఇప్పుడు టీవీని ముంచెత్తుతున్న హింసా లైంగిక దుర్నీతీ. అనేక దేశాల్లో, ఒక పిల్లవానికి 18 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి, అతడు వేలాది హింసాత్మక కార్యాలనూ, లెక్కలేనన్ని లైంగిక దుర్నీతితో కూడిన సన్నివేశాలను టీవీలో చూస్తాడు. అది కలుషితం చేస్తున్న ఒక ప్రముఖమైన ప్రభావం, ఎందుకంటే మనం మన మనస్సులను దేనితో క్రమంగా నింపుకుంటామో అదే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.—రోమీయులు 12:2; ఎఫెసీయులు 5:3, 4.
7. ప్రస్తుత చెడు పరిస్థితుల గురించి బైబిలు ఎలా ప్రవచించింది?
7 మన శతాబ్దంలో ఈ సంఘటనల భీతిగొల్పే ధోరణిని గురించి బైబిలు ప్రవచనం కచ్చితంగా తెలియజేసింది. ప్రపంచవ్యాప్త యుద్ధాలు, వ్యాధులు, ఆహార కొరతలు, అవినీతి పెరుగుదల ఉంటాయని అది చెప్పింది. (మత్తయి 24:7-12; లూకా 21:10, 11) 2 తిమోతి 3:1-5 నందు వ్రాయబడివున్న ప్రవచనాన్ని మనం పరిశీలించినప్పుడు, అది అనుదిన వార్తా నివేదికల్ని వింటున్నట్లు ఉంటుంది. అది మన శకాన్ని “అంత్యదినముల”ని గుర్తిస్తూ, ప్రజలు ‘స్వార్థప్రియులు, ధనాపేక్షులు, తలిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అజితేంద్రియులు, క్రూరులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు’ అని వివరించింది. నేడు ప్రపంచం సరిగ్గా అలాగే ఉంది. విలియం బెనెట్ అంగీకరించినట్లుగా: “నాగరికత పతనమయ్యిందనడానికి . . . మరీ ఎక్కువ సూచనలున్నాయి.” మొదటి ప్రపంచ యుద్ధంతో నాగరికత అంతమయ్యిందని కూడా చెప్పబడుతుంది.
8. దేవుడు నోవహు కాలంలో జలప్రళయాన్ని ఎందుకు తీసుకువచ్చాడు, అది మన కాలంతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంది?
8 “భూలోకము బలాత్కారముతో నిండి” ఉండిన, నోవహు కాలంనాటి జలప్రళయానికి మునుపటి పరిస్థితికంటే ఇప్పటి పరిస్థితి మరింత హీనంగా ఉంది. పూర్వం, సామాన్య ప్రజలు తమ చెడు మార్గాల గురించి పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు. అందుకే దేవుడిలా చెప్పాడు: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది.” జలప్రళయం ఆ దౌర్జన్యపూరిత ప్రపంచాన్ని అంతమొందించింది.—ఆదికాండము 6:11, 13; 7:17-24.
మానవుల ద్వారా విమోచన సాధ్యంకాదు
9, 10. విమోచన కొరకు మనం మానవుల వైపు ఎందుకు చూడకూడదు?
9 ఈ చెడు పరిస్థితుల నుండి మానవ ప్రయత్నాలు మనల్ని విమోచించగలవా? దేవుని వాక్యమిలా సమాధానమిస్తుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.” ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.’ (కీర్తన 146:3; యిర్మీయా 10:23) వేలాది సంవత్సరాల చరిత్ర, ఆ సత్యాలను ధృవీకరించింది. ఊహించడానికి వీలైన ప్రతివిధమైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక విధానాల్ని మానవులు ప్రయత్నించారు, కానీ పరిస్థితులు దిగజారిపోయాయి. ఏదైనా మానవ పరిష్కారమంటూ ఉండి ఉంటే, అది ఈపాటికి స్పష్టమై ఉండేది. కానీ దానికి బదులుగా, ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకోవడమే’ వాస్తవిక విషయమైంది.’—ప్రసంగి 8:9; సామెతలు 29:2; యిర్మీయా 17:5, 6.
10 కొన్ని సంవత్సరాల క్రితం, అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారుడైన బిగ్నీవ్ బ్రేజిన్‌స్కి ఇలా చెప్పాడు: “భూగోళ వ్యాప్త ధోరణులకు సంబంధించిన నిష్పక్షపాతమైన ఏ విశ్లేషణల యొక్క అనివార్యమైన ముగింపైనా ఏమిటంటే సాంఘిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఆర్థిక విపత్తు, అంతర్జాతీయ సంఘర్షణ మరింత విస్తృతమవ్వడమే.” ఆయనింకా ఇలా తెలియజేశాడు: “మానవజాతి ఎదుర్కొంటున్న అపాయం ఏమిటంటే భూగోళవ్యాప్త అరాచకత్వమే.” ప్రపంచ పరిస్థితులను గూర్చి అలా మదింపు చేయడం, నేడు మరింత విలువైనదిగా ఉంది. కనెక్టికట్ నందలి న్యూ హవెన్‌కు చెందిన రెజిస్టర్ వార్తాపత్రిక సంపాదకీయం, దౌర్జన్యం విస్తరిస్తున్న ఈ శకం గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా ప్రకటించింది: “పరిస్థితి మనం అదుపు చేయలేనంత దూరం వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది.” నిజమే, ఈ ప్రపంచ పతనానికి ఒక అడ్డూ ఆపూ ఉండదు, ఎందుకంటే ఈ “అంత్యదినముల”ను గూర్చిన ప్రవచనం కూడా ఇలా తెలియజేస్తోంది: “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.”—2 తిమోతి 3:13.
11. క్షీణిస్తున్న పరిస్థితులను మానవ ప్రయత్నాలు ఎందుకు మార్చలేవు?
11 సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” గనుక మానవులు ఈ ధోరణులను మార్చలేరు. (2 కొరింథీయులు 4:4) అవును, ‘లోకమంతయు దుష్టుని యందున్నది.’ (1 యోహాను 5:19; యోహాను 14:30 కూడా చూడండి.) బైబిలు మన కాలాన్ని గురించి సరిగ్గానే ఇలా తెలియజేస్తుంది: ‘భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.’ (ప్రకటన 12:12) తన పరిపాలనా, తన ప్రపంచమూ అంతం కాబోతున్నాయని సాతానుకు తెలుసు, అందుకే అతడు “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.
విమోచన సమీపించింది—ఎవరికి?
12. ఎవరికి విమోచన సమీపిస్తోంది?
12 భూమిపై అధికమౌతున్న క్లిష్టమైన పరిస్థితులు ఒక పెద్ద మార్పు—వాస్తవానికి ఒక మహిమాన్విత విమోచన—సమీపించిందనడానికి కచ్చితమైన నిదర్శనంగా ఉన్నాయి! ఎవరికి విమోచన? హెచ్చరికా సంకేతాలపై అవధానముంచి, తగిన చర్యలు తీసుకునేవారికి విమోచన సమీపిస్తోంది. దాని కొరకు చేయాల్సిన దానిని గురించి 1 యోహాను 2:17 ఇలా చూపిస్తుంది: “లోకమును [సాతాను విధానం] దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (ఇటాలిక్కులు మావి.)—2 పేతురు 3:10-13 కూడా చూడండి.
13, 14. మెలకువ కలిగివుండవలసిన అవసరతను యేసు ఎలా నొక్కి తెలియజేశాడు?
13 “లోకారంభము నుండి ఇప్పటివరకు” సంభవించనటువంటి, “ఇక ఎప్పుడును కలుగబో”నటువంటి శ్రమ కాలంలో నేటి కలుషిత సమాజం నాశనమౌతుందని యేసు ప్రవచించాడు. (మత్తయి 24:21) అందుకే, “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని . . . శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని” ఆయన హెచ్చరించాడు.—లూకా 21:34-36.
14 ‘జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండే’ వారు దేవుని చిత్తాన్ని కనుగొని దాన్ని చేస్తారు. (సామెతలు 2:1-5; రోమీయులు 12:2) సాతాను విధానంపైకి త్వరలో రానైయున్న నాశనాన్ని ‘తప్పించుకొనే’ వారు వీరే. తాము విమోచించబడతామనే సంపూర్ణ నమ్మకాన్ని వాళ్లు కలిగివుండవచ్చు.—కీర్తన 34:15; సామెతలు 10:28-30.
ముఖ్య విమోచకుడు
15, 16. ముఖ్య విమోచకుడెవరు, ఆయన తీర్పులు న్యాయమైనవై ఉంటాయని మనమెందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?
15 దేవుని సేవకులు విమోచించబడాలంటే, సాతానూ అతని ప్రపంచవ్యాప్త విధానమంతా నిర్మూలించబడాలి. దీనికి మానవుల కన్నా ఎంతో ఎక్కువ శక్తివంతమైన విమోచనా మూలం అవసరం. సర్వోన్నత సర్వాధిపతీ, అద్భుతమైన విశ్వాన్ని నిర్మించిన సర్వ శక్తిమంతుడైన సృష్టికర్తా అయిన యెహోవా దేవుడే ఆ మూలం. ఆయనే ముఖ్య విమోచకుడు: “నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.”—యెషయా 43:11; సామెతలు 18:10.
16 యెహోవానందు శక్తి, జ్ఞానము, న్యాయము, ప్రేమల స్థాయి సంపూర్ణమైన మోతాదులో ఉంది. (కీర్తన 147:5; సామెతలు 2:6; యెషయా 61:8; 1 యోహాను 4:8) కాబట్టి ఆయన తన తీర్పులను అమలు పర్చినప్పుడు, ఆయన చర్యలు నీతియుక్తమైనవై ఉంటాయని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. అబ్రాహాము ఇలా అడిగాడు: “సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” (ఆదికాండము 18:24-33) పౌలు ఇలా అన్నాడు: “దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.” (రోమీయులు 9:14) “అవును ప్రభువా, [“యెహోవా,” NW] దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని” యోహాను వ్రాశాడు.—ప్రకటన 16:7.
17. యెహోవా సేవకులు గతంలో ఆయన వాగ్దానాలందు తమ నమ్మకాన్ని ఎలా వ్యక్తపర్చారు?
17 యెహోవా విమోచనను వాగ్దానం చేసినప్పుడు, ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. యెహోషువ ఇలా చెప్పాడు: “యెహోవా . . . సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు.” (యెహోషువ 21:44) “ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు” అని సొలొమోను తెలియజేశాడు. (1 రాజులు 8:56) అబ్రాహాము “అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక . . . [దేవుడు] వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసిం”చాడని అపొస్తలుడైన పౌలు తెలియజేశాడు. అలాగే శారా “వాగ్దానము చేసినవాడు [దేవుడు] నమ్మదగినవాడని యెంచుకొనెను.”—రోమీయులు 4:20, 21; హెబ్రీయులు 11:11.
18. యెహోవా సేవకులు నేడు తాము విమోచించబడగలమని ఎందుకు నమ్మకం కలిగివుండవచ్చు?
18 మానవుల్లా కాక, యెహోవా సంపూర్ణంగా విశ్వసనీయుడు, తన మాటకు కట్టుబడివుంటాడు. “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును.” (యెషయా 14:24) “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు [“యెహోవా,” NW] సమర్థుడు” అని బైబిలు చెబుతుంది గనుక, అది జరుగుతుందని మనం పూర్తి నమ్మకం కలిగివుండవచ్చు. (2 పేతురు 2:9, 10) నాశనం చేస్తామని శక్తిమంతులైన శత్రువులు భయపెట్టినప్పుడు కూడా యెహోవా సేవకులు ధైర్యం వహిస్తారు, “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు” అని తన ప్రవక్తలలో ఒకరికి ఆయన చేసిన వాగ్దానమందు వ్యక్తపర్చబడిన ఆయన మనోభావాన్నిబట్టి ధైర్యం వహిస్తారు.—యిర్మీయా 1:19; కీర్తన 33:18, 19; తీతు 1:2.
గతంలో చేసిన విమోచనలు
19. యెహోవా లోతును ఎలా విమోచించాడు, అది మన కాలంతో ఏ సారూప్యం కల్గివుంది?
19 గత కాలాల్లో యెహోవా చేసిన రక్షణ కార్యాల్లోని కొన్నింటిని గుర్తు చేసుకోవడం ద్వారా మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱాల్లో జరిగిన దుష్టత్వాన్నిబట్టి లోతు ‘బహు బాధ’ పడ్డాడు. అయితే ఆ నగరాలకు వ్యతిరేకంగా వచ్చిన “మొర”ను యెహోవా విన్నాడు. తగిన సమయంలో, ఆ ప్రాంతంలో నుండి లోతును అతని కుటుంబాన్ని వెంటనే వెలుపలికి రమ్మని తొందరచేయడానికి ఆయన సందేశకులను పంపాడు. దాని ఫలితం? యెహోవా “సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, . . . నీతిమంతుడగు లోతును తప్పించెను.” (2 పేతురు 2:6, 7; ఆదికాండము 18:20, 21) నేడు కూడా ఈ లోకం యొక్క విపరీతమైన దుష్టత్వాన్ని గూర్చిన మొరలను యెహోవా వింటాడు. ఆయన కోరుకున్నంత మేరకు అత్యంతావశ్యకంగా సాక్ష్యమిచ్చే తమ పనిని, ఆయన ఆధునిక దిన సందేశకులు పూర్తి చేసినప్పుడు, ఈ లోకంపై ఆయన చర్య తీసుకుంటాడు, లోతును విమోచించినట్లుగానే తన సేవకులనూ విమోచిస్తాడు.—మత్తయి 24:14.
20. ప్రాచీన ఇశ్రాయేలును యెహోవా ఐగుప్తు నుండి విమోచించడాన్ని వివరించండి.
20 ప్రాచీన ఐగుప్తులో లక్షలాదిమంది దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. వారి గురించి యెహోవా ఇలా చెప్పాడు: “వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి . . . వారిని విడిపించుటకు . . . దిగివచ్చి యున్నాను.” (నిర్గమకాండము 3:7, 8) అయితే, దేవుని ప్రజలను వెళ్లనిచ్చిన తర్వాత ఫరో తన మనస్సు మార్చుకుని, తన బలమైన సైన్యంతో వారిని వెంటాడాడు. ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం వద్ద చిక్కుబడిపోయినట్లయ్యింది. అయినప్పటికీ మోషే ఇలా చెప్పాడు: “భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి.” (నిర్గమకాండము 14:8-14) యెహోవా ఎఱ్ఱ సముద్రమును పాయలుగా చేశాడు, ఇశ్రాయేలీయులు తప్పించుకున్నారు. ఫరో సైన్యం వారిని వెంబడించింది, కాని ‘సముద్రము వారిని కప్పేలా, వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగి పోయేలా’ యెహోవా తన శక్తిని ఉపయోగించాడు. ఆ తర్వాత మోషే పాటలో యెహోవాను ఇలా ఘనపర్చాడు: “పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు. స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీవంటివాడెవడు?”—నిర్గమకాండము 15:4-12, 19.
21. యెహోవా ప్రజలు అమ్మోను, మోయాబు, శేయీరు జనాంగాల నుండి ఎలా రక్షించబడ్డారు?
21 మరో సందర్భంలో శత్రు దేశాలైన అమ్మోను, మోయాబు, శేయీరులు (ఏదోము) యెహోవా ప్రజలను నాశనం చేస్తామని బెదిరించాయి. యెహోవా ఇలా చెప్పాడు: “ఈ గొప్ప [శత్రు] సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. . . . మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు . . . నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు.” శత్రువులు ఒకరినొకరు చంపుకునేలా వారిమధ్య గందరగోళాన్ని సృష్టించడం ద్వారా యెహోవా తన ప్రజలను విమోచించాడు.—2 దినవృత్తాంతములు 20:15-23.
22. అష్షూరీయుల నుండి ఇశ్రాయేలీయులకు యెహోవా ఏ అద్భుత విమోచనను అనుగ్రహించాడు?
22 అష్షూరీయుల ప్రపంచ ఆధిపత్యం యెరూషలేముకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, రాజైన సన్హెరీబు ప్రాకారము మీదున్న ప్రజలతో ఇలా చెప్పడం ద్వారా యెహోవాను శోధించాడు: “యెహోవా నా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా?” దేవుని సేవకులతో అతడిలా చెప్పాడు: “యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు.” అప్పుడు హిజ్కియా “యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొన”వలెనని విమోచన కొరకు ఎడతెగక ప్రార్థించాడు. యెహోవా 1,85,000 మంది అష్షూరు సైనికులను పడగొట్టాడు, దేవుని సేవకులు విమోచించబడ్డారు. ఆ తర్వాత, సన్హెరీబు తన అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తుండగా అతని కుమారులు అతన్ని హత్య చేశారు.—యెషయా 36, 37 అధ్యాయాలు.
23. నేడు విమోచన గురించి ఏ ప్రశ్నలకు సమాధానం అవసరం?
23 యెహోవా గతంలో తన ప్రజలను అద్భుతంగా ఎలా విమోచించాడో చూసినప్పుడు మనం తప్పక ధైర్యం తెచ్చుకోవచ్చు. నేటి విషయమేమిటి? ఆయన నమ్మకమైన సేవకులు, ఆయన అద్భుతమైన విమోచన అవసరమయ్యే ఏ ప్రమాదకరమైన స్థితిలోకి త్వరలోనే వస్తారు? వారిని విమోచించడానికి ఆయన ఇప్పటి వరకు ఎందుకు ఆగాడు? “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నద”ని యేసు చెప్పిన మాటలు ఎలా నెరవేరుతాయి? (లూకా 21:28) ఇప్పటికే మరణించిన దేవుని సేవకులు ఎలా విమోచించబడతారు? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.
పునఃసమీక్షా ప్రశ్నలు
◻ విమోచన కొరకు గొప్ప అవసరత ఎందుకుంది?
◻ విమోచన కొరకు మనం మానవులవైపు ఎందుకు చూడకూడదు?
◻ ఎవరికి విమోచన సమీపిస్తోంది?
◻ యెహోవా అనుగ్రహించే విమోచనయందు మనం ఎందుకు నమ్మకం కలిగివుండవచ్చు?
◻ గతంలో జరిగిన విమోచనలకు సంబంధించిన ఏ ఉదాహరణలు మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి?
[10వ పేజీలోని చిత్రం]
యెహోవా యందు పూర్తి నమ్మకాన్ని ఉంచినవారిలో అబ్రాహాము ఉన్నాడు