నీతియుక్తమైన నూతన లోకములోకి విమోచన
“బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
1, 2. (ఎ) ప్రాచీన కాలాల్లో యెహోవా చేసిన విమోచనల నుండి మన కాలంలో ఆయన అనుగ్రహించబోయే విమోచన ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? (బి) యెహోవా తన ప్రజలను ఏ విధమైన లోకంలోకి తీసుకువస్తాడు?
యెహోవా విమోచించే దేవుడు. ప్రాచీన కాలాల్లో ఆయన తన ప్రజలను ఎన్నో సందర్భాల్లో విమోచించాడు. ఆ విమోచనలు తాత్కాలికమైనవి, ఎందుకంటే ఆ సందర్భాల్లో వేటిలోనూ యెహోవా సాతాను ప్రపంచమంతటిపైకీ తన తీర్పులను శాశ్వతంగా అమలు చేయలేదు. కాని మన కాలంలో, యెహోవా తన సేవకులకు అన్ని విమోచనలకంటే ఘనమైన విమోచనలను త్వరలోనే దయచేస్తాడు. ఈసారి ఆయన సాతాను భూవ్యాప్త విధానానికి సంబంధించిన ప్రతి విధమైన జాడనూ నిర్మూలిస్తాడు, ఆయన తన సేవకులను శాశ్వతమైన, నీతియుక్తమైన నూతన లోకంలోకి తీసుకువస్తాడు.—2 పేతురు 2:9; 3:10-13.
2 యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11) ఎంత కాలం వరకు? “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29; మత్తయి 5:5) అయితే, అది జరుగక ముందు, మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప శ్రమ కాలాన్ని ఈ లోకం ఎదుర్కుంటుంది.
“మహా శ్రమ”
3. “మహా శ్రమ”ను యేసు ఎలా వర్ణించాడు?
3 ఈ ప్రపంచం 1914లో దాని “అంత్యదినములలో”కి ప్రవేశించింది. (2 తిమోతి 3:1-5, 13) మనం 83 సంవత్సరాలుగా ఆ కాలంలో ఉన్నాము. దాని అంతము సమీపిస్తోంది. అప్పుడు యేసు ప్రవచించినట్లుగా ఇది సంభవిస్తుంది: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:21) అవును, దాదాపు ఐదు కోట్లమంది మరణించిన రెండవ ప్రపంచ యుద్ధంకంటే ఘోరమైనది. ప్రపంచాన్ని కుదిపివేసే ఎలాంటి సమయం త్వరగా సమీపిస్తోందో కదా!
4. “మహా బబులోను” పైకి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది?
4 “మహా శ్రమ” నమ్మశక్యంకానంత హఠాత్తుగా, “ఒక్క గడియలోనే” వస్తుంది. (ప్రకటన 18:10) దీని ప్రారంభం, దేవుని వాక్యం “మహా బబులోను” అని పిలుస్తున్న అబద్ధ మతాలన్నిటికీ దేవుడు తీర్పును అమలు చేయడం ద్వారా ఇది సూచించబడుతుంది. (ప్రకటన 17:1-6, 15) ప్రాచీన బబులోనులోని ప్రధానాంశం అబద్ధమతమే. ఆధునిక బబులోను ప్రాచీన బబులోనును పోలి ఉండి, ప్రపంచ అబద్ధ మతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజకీయ శక్తులతో రాజీపడడం ద్వారా అది వ్యభిచరించింది. అది వారి యుద్ధాలకు మద్దతునిచ్చి, వ్యతిరేక వర్గాల్లోవున్న సైన్యాలను ఆశీర్వదించింది, ఫలితంగా ఒకే మతానికి చెందిన ప్రజలు ఒకరినొకరు చంపుకున్నారు. (మత్తయి 26:51, 52; 1 యోహాను 4:20, 21) అది తన అనుచరుల కలుషిత ఆచారాలను చూసీచూడనట్లు విడిచిపెట్టి, నిజ క్రైస్తవులను హింసించింది.—ప్రకటన 18:5, 24.
5. “మహా శ్రమ” ఎలా ప్రారంభమౌతుంది?
5 రాజకీయ శక్తులు “మహా బబులోను”పై హఠాత్తుగా దాడి చేసినప్పుడు “మహా శ్రమ” ప్రారంభమౌతుంది. వాళ్లు “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:16) ఆ తర్వాత, దాని మునుపటి మద్దతుదారులు “దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చు”దురు. (ప్రకటన 18:9-19) అయితే యెహోవా సేవకులు దీనిని గురించి ఎంతో కాలంనుండి ఎదురుచూస్తున్నారు, వారిలా ప్రకటిస్తారు: “ప్రభువును స్తుతించుడి, . . . తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను.”—ప్రకటన 19:1, 2.
దేవుని సేవకులపై దాడి చేయబడుతుంది
6, 7. “మహా శ్రమ” సమయంలో దాడి చేయబడినప్పుడు యెహోవా సేవకులు ఎందుకు నిశ్చయత కలిగివుండవచ్చు?
6 రాజకీయ శక్తులు అబద్ధ మతాన్ని నాశనం చేసి యెహోవా సేవకులవైపు తిరుగుతాయి. “మాగోగు దేశపువాడగు గోగు” అయిన సాతాను, ప్రవచనంలో ఇలా అంటున్నాడు: “నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.” వారు సుళువుగా దొరుకుతారని భావిస్తూ అతడు “బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు” వారిపై దాడి చేస్తాడు. (యెహెజ్కేలు 38:2, 10-16) ఈ దాడి విఫలమౌతుందని యెహోవా ప్రజలకు తెలుసు ఎందుకంటే వారు యెహోవాయందు నమ్మకముంచుతారు.
7 ఫరో మరియు అతని సైన్యాలు తాము దేవుని సేవకులను ఎఱ్ఱ సముద్రం దగ్గర చుట్టుముట్టామని భావించినప్పుడు, యెహోవా అద్భుతరీతిగా తన ప్రజలను విమోచించి, ఐగుప్తు సైన్యాలను నాశనం చేశాడు. (నిర్గమకాండము 14:26-28) “మహా శ్రమ” సమయంలో, యెహోవా ప్రజలను తాము చుట్టుముట్టామని జనాంగాలు భావించినప్పుడు, మళ్లీ ఆయన అద్భుతరీతిగా వారిని కాపాడడానికి వస్తాడు: “ఆ దినమున . . . నా కోపము బహుగా రగులుకొనును. . . . నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని.” (యెహెజ్కేలు 38:18, 19) అప్పుడు “మహా శ్రమ” యొక్క ముగింపు సమీపిస్తుంది!
8. యెహోవా దుష్టులకు తీర్పు తీర్చకముందు ఎటువంటి సహజాతీత సంఘటనలు సంభవిస్తాయి, ఏ ప్రభావంతో?
8 ఈ ప్రపంచం యొక్క మిగిలిన భాగంపై యెహోవా తన తీర్పును అమలు జరుపక ముందే, కానీ “మహా శ్రమ” ప్రారంభమయ్యాక ఒక స్థాయిలో, సహజాతీత సంఘటనలు సంభవిస్తాయి. అవి చూపించే ప్రభావాన్ని గమనించండి. “అప్పుడు మనుష్యకుమారుని [క్రీస్తు] సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.” (మత్తయి 24:29, 30) “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు . . . కలుగును. . . . లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.”—లూకా 21:25, 26.
‘మీ విడుదల సమీపించుచున్నది’
9. సహజాతీత సంఘటనలు సంభవించినప్పుడు, యెహోవా సేవకులు ఎందుకు తమ ‘తలలు ఎత్తుకొనవచ్చు’?
9 ఆ ప్రత్యేకమైన సమయంలో, లూకా 21:28 నందలి ప్రవచనం అన్వయింపబడుతుంది. యేసు ఇలా చెప్పాడు: ‘ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.’ జరుగుతున్న సహజాతీతమైన సంఘటనలు యెహోవా నుండే సంభవిస్తున్నాయని దేవుని శత్రువులు గ్రహిస్తారు గనుక వారు భయంతో వణికిపోతుంటారు. కాని తమ విడుదల సమీపిస్తోందని యెహోవా సేవకులకు తెలుస్తుంది గనుక వారు ఆనందిస్తారు.
10. “మహా శ్రమ” ముగింపును గురించి దేవుని వాక్యం ఎలా వర్ణిస్తుంది?
10 అప్పుడు యెహోవా సాతాను విధానంపై చావు దెబ్బ కొడతాడు: “తెగులు పంపి హత్య కలుగజేసి [గోగు] మీదను అతని సైన్యపు వారి మీదను అతనితోకూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు” చేయుదును. (యెహెజ్కేలు 38:22, 23) సాతాను విధానపు జాడలన్నీ నాశనం చేయబడతాయి. దేవున్ని నిర్లక్ష్యం చేసే ప్రజలతో కూడిన మానవ సమాజమంతా నిర్మూలించబడుతుంది. అది “మహా శ్రమ” యొక్క అర్మగిద్దోను ముగింపై ఉంటుంది.—యిర్మీయా 25:31-33; 2 థెస్సలొనీకయులు 1:6-8; ప్రకటన 16:14, 16; 19:11-21.
11. యెహోవా సేవకులు “మహా శ్రమ” నుండి ఎందుకు విమోచించబడతారు?
11 భూవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది యెహోవా ఆరాధికులు “మహా శ్రమ” నుండి తప్పించబడతారు. వీరు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు” వచ్చిన “గొప్ప సమూహము”గా రూపొందుతారు. భయం గొల్పేరీతిలో ఆ విధంగా వారు ఎందుకు విమోచించబడ్డారు? ఎందుకంటే వారు యెహోవాను “రాత్రింబగళ్లు . . . సేవించుచున్నారు.” కాబట్టి వారు ఈ లోకాంతాన్ని తప్పించుకొని, నీతియుక్తమైన నూతన లోకంలోకి ప్రవేశిస్తారు. (ప్రకటన 7:9-15) అలా, వారు యెహోవా చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును చూస్తారు: “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.”—కీర్తన 37:34.
నూతన లోకము
12. అర్మగిద్దోనును తప్పించుకునేవారు దేని కొరకు ఎదురు చూడవచ్చు?
12 దుష్టత్వం నిర్మూలించబడే సమయమూ, మానవ చరిత్రంతటిలోని అత్యంత మహిమకరమైన శకం ప్రారంభమయ్యే సమయమూ ఎంతటి ఉత్తేజకరమైన సమయమై ఉంటుందో కదా! (ప్రకటన 20:1-4) అర్మగిద్దోనును తప్పించుకొనేవారు పరదైసుగా మార్చబడే భూమిపై దేవుడు తయారు చేసే ప్రకాశవంతమైన, పరిశుభ్రమైన నాగరికతయైన నూతన లోకంలోకి ప్రవేశించడాన్నిబట్టి వారు యెహోవా ఎడల ఎంత కృతజ్ఞత కలిగివుంటారో కదా! (లూకా 23:43) వారు మరెన్నడూ మరణించవలసిన అవసరం ఉండదు! (యోహాను 11:26) వాస్తవానికి, అప్పటి నుండీ యెహోవా ఎంత కాలం జీవిస్తే అంత కాలం జీవించే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఉత్తరాపేక్ష వారికి ఉంటుంది!
13. యేసు తాను భూమిపై ప్రారంభించిన స్వస్థత పనిని ఎలా పునఃప్రారంభిస్తాడు?
13 యెహోవా పరలోక రాజుగా నియమించిన యేసు, విమోచింపబడిన వారు పొందే అద్భుతమైన ఆశీర్వాదాలను పర్యవేక్షిస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు, ఆయన గ్రుడ్డివారి కన్నులను, చెవిటివారి చెవులను తెరిచి, “ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థ”పరిచాడు. (మత్తయి 9:35; 15:30, 31) నూతన లోకంలో ఆయన ఆ గొప్ప స్వస్థపరిచే పనిని పునఃప్రారంభిస్తాడు, కాని దాన్ని భూగోళ వ్యాప్తంగా చేస్తాడు. దేవుని ప్రతినిధిగా, ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి”పోయాయి. (ప్రకటన 21:4) ఇక మరెన్నడూ వైద్యుల అవసరతా లేక కాటికాపరుల అవసరతా ఉండదు!—యెషయా 25:8; 33:24.
14. ఇప్పటికే మరణించిన యెహోవా సేవకులకు ఏ విమోచన లభిస్తుంది?
14 గతంలో మరణించిన నమ్మకమైన దేవుని సేవకులు కూడా విమోచించబడతారు. నూతన లోకంలో, వారు మరణ పాశముల నుండి విడిపించబడతారు. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” యెహోవా హామీ ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 24:14) బహుశా ‘నీతిమంతులు’ ముందుగా పునరుత్థానం చేయబడి, పరదైసును విస్తృతపరిచే పనికి దోహదపడతారు. అర్మగిద్దోనును తప్పించుకునే వారికి, ఎంతో కాలం క్రితం మరణించి ఇప్పుడు పునరుజ్జీవులైన, విశ్వసనీయులైన వారి అనుభవాలను వినడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా!—యోహాను 5:28, 29.
15. నూతన లోకంలో అనుభవించబోయే కొన్ని పరిస్థితులను వివరించండి.
15 అప్పుడు జీవిస్తున్న వారందరూ, యెహోవా గురించి కీర్తనల గ్రంథకర్త చెప్పిన దీనిని అనుభవిస్తారు: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:16) ఇక ఆకలి ఉండదు: భూమి మరలా పర్యావరణ సమతౌల్యానికి తీసుకురాబడి సమృద్ధిగా ఉత్పత్తినిస్తుంది. (కీర్తన 72:16) నిరాశ్రయులు ఇక ఉండరు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు,” ప్రతి ఒక్కరూ “ఎవరి భయములేకుండ . . . తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజారపు చెట్టు క్రిందను” కూర్చుంటారు. (యెషయా 65:21, 22; మీకా 4:4) ఇక భయముండదు: యుద్ధం, దౌర్జన్యం లేక నేరం ఇక ఉండవు. (కీర్తన 46:8, 9; సామెతలు 2:22) “భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు.”—యెషయా 14:7.
16. నూతన లోకంలో నీతి ఎందుకు వ్యాపిస్తుంది?
16 నూతన లోకంలో, సాతాను ప్రచార మాధ్యమం నిర్మూలించబడుతుంది. బదులుగా, “లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.” (యెషయా 26:9; 54:13) “సముద్రము జలముతో నిండియున్నట్టు,” ప్రతి సంవత్సరమూ ఆరోగ్యదాయకమైన ఆత్మీయ ఉపదేశంతో, “లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:9) ప్రోత్సాహకరమైన తలంపులూ చర్యలూ మానవజాతిలో వ్యాపిస్తాయి. (ఫిలిప్పీయులు 4:8) నేరం, అహంకారం, అసూయ వంటివి ఉండని ప్రపంచవ్యాప్త ప్రజల సమాజాన్ని అంటే అందరూ దేవుని ఆత్మ ఫలాలను ఫలించే అంతర్జాతీయ సహోదరత్వాన్ని గురించి ఊహించండి. వాస్తవానికి, ఇప్పుడు కూడా గొప్ప సమూహానికి చెందిన వారు అలాంటి లక్షణాలను అలవర్చుకుంటున్నారు.—గలతీయులు 5:22, 23.
ఎందుకింత కాలం?
17. దుష్టత్వాన్ని అంతమొందించే ముందు యెహోవా ఎందుకు ఇంతకాలం వేచివున్నాడు?
17 అయితే, దుష్టత్వాన్ని తీసివేసి, తన ప్రజలను నూతన లోకంలోకి విమోచించబడడానికి యెహోవా ఎందుకింత కాలం వేచివున్నాడు? ఏమి సాధించబడవలసి ఉందో పరిశీలించండి. అత్యంత ప్రాముఖ్యమైనది యెహోవా సర్వాధిపత్యంపై అంటే ఆయన పరిపాలనా హక్కుపై ఉన్న నిందను తొలగించడం. తగినంత సమయం గడిచేందుకు అనుమతించడం ద్వారా, ఆయన తన సర్వాధిపత్యం క్రింద లేని మానవ పరిపాలన ఘోర వైఫల్యంగా మారిందని నిస్సంశయంగా నిరూపించబడేందుకు అనుమతించాడు. (యిర్మీయా 10:23) కాబట్టి మానవ పరిపాలన స్థానంలో క్రీస్తు రాజుగా ఉండే తన పరలోక రాజ్య పరిపాలనను ఉంచడం ఇప్పుడు యెహోవాకు పూర్తిగా న్యాయమే.—దానియేలు 2:44; మత్తయి 6:9, 10.
18. అబ్రాహాము సంతానం కనాను దేశాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటుంది?
18 ఈ శతాబ్దాలన్నింటిలో జరిగినది అబ్రాహాము కాలంలో జరిగినదానికి సారూప్యంగా ఉంది. అబ్రాహాము సంతానం కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటుందని, కాని “అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక” వారు నాలుగు వందల సంవత్సరాలు ఆగవలసి ఉంటుందని యెహోవా అతనితో చెప్పాడు. (ఆదికాండము 12:1-5; 15:13-16) ఇక్కడ ‘అమోరీయులు’ (ఒక ఆధిపత్యంగల తెగ) అనే పదం బహుశా మొత్తంగా కనాను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి యెహోవా తన ప్రజలు కనానును ఆక్రమించేలా చేసే లోపల దాదాపు నాలుగు శతాబ్దాలు గడుస్తాయి. ఆ మధ్య కాలంలో యెహోవా కనాను జనాంగాలు తమ సమాజాలను వృద్ధి చేసుకునేందుకు అనుమతించాడు. దాని ఫలితమేమిటి?
19, 20. కనానీయులు ఎలాంటి సమాజాలను వృద్ధి చేసుకున్నారు?
19 బయలు యొక్క దేవతా భార్యయైన అష్టారోతు ఆలయ శిధిలాలను పురావస్తు శాస్త్రజ్ఞులు మెగిద్దో వద్ద కనుగొన్నారని హెన్రీ హెచ్. హేలీ వ్రాసిన బైబిల్ హాండ్‌బుక్ తెలియజేస్తుంది. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఈ ఆలయం నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఒక శ్మశానం ఉంది, అక్కడ ఈ ఆలయం వద్ద బలి ఇవ్వబడిన శిశువుల అవశేషాలున్న అనేక పాత్రలు కనుగొనబడ్డాయి . . . బయలు మరియు అష్టారోతుల ప్రవక్తలు పసిపిల్లల అధికారిక హంతకులుగా ఉండేవారు.” “మరో ఘోరమైన ఆచారమేమిటంటే వాళ్లు ‘పునాది బలులు’ అని పిలిచేదే. ఒక ఇల్లు కడుతున్నప్పుడు, ఒక బిడ్డను బలి ఇచ్చి ఆ బిడ్డ శరీరాన్ని గోడలో పాతిపెట్టి గోడను కట్టేవారు.
20 హేలీ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “బయలు, అష్టారోతు, ఇతర కనాను దేవుళ్ల ఆరాధనలో ఎంతో మితిమీరిన కర్మకాండ ఉండేది; వారి ఆలయాలు నీచత్వానికి కేంద్రాలుగా ఉండేవి. . . . లైంగిక దుర్నీతిలో నిమగ్నమవ్వడం ద్వారా, . . . ఆ తర్వాత, ఈ దేవుళ్లకు బలిగా తమ మొదటి సంతానాన్ని చంపడం ద్వారా కనానీయులు ఆరాధించేవారు. కనాను దేశం ఒక విధంగా చాలా మేరకు జాతీయ స్థాయిలో సొదొమ గొమొఱ్ఱాలలా తయారైనట్లు కనిపిస్తుంది. . . . అలాంటి అసహ్యకరమైన నీచత్వం మరియు క్రూరత్వం గల నాగరికతకు ఇంకా ఉనికిలో ఉండే హక్కు ఉందా? . . . కనాను నగరాల శిథిలాలను త్రవ్వే పురావస్తు శాస్త్రజ్ఞులు, దేవుడు వారిని నాశనం చేసినదాని కంటే ఇంకా ముందే ఎందుకు నాశనం చేయలేదా అని ఆశ్చర్యపోతున్నారు.”—1 రాజులు 21:25, 26 పోల్చండి.
21. కనానీయుల కాలంనాటి పరిస్థితికీ మన కాలంలోని పరిస్థితికీ ఏ సారూప్యం ఉంది?
21 అమోరీయుల అక్రమము “సంపూర్ణము” అయ్యింది. కాబట్టి వారిని నిర్మూలించడం ఇప్పుడు యెహోవాకు పూర్తిగా న్యాయమైనదే. నేడు కూడా అదే నిజమై ఉంది. ఈ ప్రపంచం దౌర్జన్యంతోనూ లైంగిక దుర్నీతితోనూ దేవుని సూత్రాల ఎడల అగౌరవంతోనూ నిండివుంది. ప్రాచీన కనానులోని పసిపిల్లల అసహ్యకరమైన బలులను బట్టి మనం సరిగ్గానే భయం కలిగివున్నాము గనుక, కనానులో జరిగిన దేనికంటే కూడా హీనమైన విధంగా ప్రపంచంలోని ఈ యుద్ధాల్లో కోట్లాదిమంది యౌవనులు బలి కావడం విషయమేమిటి? కచ్చితంగా, ఈ దుష్ట విధానానికి అంతం తేవడం యెహోవాకు ఇప్పుడు పూర్తిగా న్యాయమే.
మరొకటి సాధించడం
22. మన కాలంలో యెహోవా చూపించిన సహనం మూలంగా ఏమి సాధించబడింది?
22 ఈ అంత్యదినాల్లో యెహోవా యొక్క సహనం మరొకటి సాధిస్తోంది. ఇప్పటికే యాభై లక్షలకంటే ఎక్కువమందివున్న గొప్ప సమూహాన్ని సమకూర్చి వారికి బోధించడానికి ఆయన సమయాన్ని అనుమతిస్తున్నాడు. యెహోవా నడిపింపు క్రింద వారు అభివృద్ధికరమైన సంస్థగా ఏర్పడ్డారు. పురుషులు, స్త్రీలు, యౌవనులు ఇతరులకు బైబిలు సత్యాలను బోధించేందుకు తర్ఫీదు పొందుతున్నారు. వారు తమ కూటాలు మరియు బైబిలు ప్రచురణల ద్వారా దేవుని ప్రేమపూర్వక విధానాలను నేర్చుకుంటున్నారు. (యోహాను 13:34, 35; కొలొస్సయులు 3:14; హెబ్రీయులు 10:24, 25) అంతేగాక, వారు “సువార్త” ప్రకటనకు మద్దతునిచ్చేందుకుగానూ నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, ముద్రణ మరియు ఇతర క్షేత్రాల్లో నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటున్నారు. (మత్తయి 24:14) అలాంటి బోధనా మరియు నిర్మాణ నైపుణ్యాలు బహుశా నూతన లోకంలో విస్తృతంగా ఉపయోగించబడవచ్చు.
23. ఈ కాలంలో జీవించివుండడం, ఎందుకు ఒక ఆధిక్యతయై ఉంది?
23 అవును, తన సేవకులు “మహా శ్రమ” తప్పించుకొని నీతియుక్తమైన నూతన లోకంలోకి ప్రవేశించేలా యెహోవా వారిని నేడు సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు మనం ఎదుర్కోవడానికి సాతానూ అతని దుష్ట ప్రపంచమూ ఉండవు, రోగం, దుఃఖం మరియు మరణం ఇక ఉండవు. ప్రతిరోజు ‘బహు క్షేమము కలిగి సుఖించే’ పరదైసును నిర్మించే ఆనందభరితమైన పనియందు దేవుని ప్రజలు గొప్ప ఉత్సాహంతోనూ, సంతోషంతోనూ ముందుకు కొనసాగుతారు. యుగాలు ముగింపుకు చేరుకున్న ఈ తరుణంలో జీవించేందుకూ, యెహోవాను తెలుసుకుని ఆయన సేవచేసేందుకూ, త్వరలోనే ‘మన విడుదల సమీపించుచున్నందున మనం మన తలలు ఎత్తుకుంటాము’ అని గుర్తించడానికీ మనమెంతటి ఆధిక్యత గలవారమో కదా!—లూకా 21:28; కీర్తన 146:5.
పునఃపరిశీలన ప్రశ్నలు
◻ “మహా శ్రమ” అంటే ఏమిటి మరియు అదెలా ప్రారంభమౌతుంది?
◻ యెహోవా సేవకులపై గోగు దాడి ఎందుకు విఫలమౌతుంది?
◻ “మహా శ్రమ” ఎలా ముగుస్తుంది?
◻ నూతన లోకం ఏ అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది?
◻ ఈ విధానానికి అంతం తీసుకురావడానికి ముందు యెహోవా ఎందుకు ఇంతకాలం వేచివున్నాడు?
[16వ పేజీలోని చిత్రం]
యావత్ భూమీ పరదైసుగా మార్చబడుతుంది