సరైన సందేశకుడిని గుర్తించడం
“నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను.”—యెషయా 44:26.
1. సరైన సందేశకులను యెహోవా ఎలా గుర్తిస్తాడు, అబద్ధ ప్రవక్తలను ఆయన ఎలా బయల్పరుస్తాడు?
తన నిజ సందేశకులను గుర్తించేవాడు యెహోవా దేవుడే. వారి ద్వారా తాను పంపించే సందేశాలు నిజమయ్యేలా చేయడం ద్వారా ఆయన వారిని గుర్తిస్తాడు. యెహోవా అబద్ధ సందేశకులను బయల్పరుస్తాడు కూడా. ఆయన వారినెలా బయల్పరుస్తాడు? ఆయన వారి సూచనలను, ప్రవచనాలను వ్యర్థం చేస్తాడు. ఈ విధంగా ఆయన, వారు స్వయం నియమిత ప్రవక్తలని, వారి సందేశాలు నిజంగా తమ స్వంత అబద్ధ తర్కం నుండి—అవును, వారి మూర్ఖపు శరీరసంబంధమైన ఆలోచనావిధానం నుండి వచ్చినవని చూపిస్తాడు!
2. ఇశ్రాయేలీయుల కాలంలో సందేశకుల మధ్య ఏ వివాదం ఏర్పడింది?
2 యెషయా మరియు యెహెజ్కేలు యెహోవా దేవుని సందేశకులమని చెప్పుకున్నారు. వారు ఆయన సందేశకులేనా? మనం చూద్దాము. యెషయా దాదాపు సా.శ.పూ. 778 నుండి దాదాపు సా.శ.పూ. 732 తర్వాతి వరకు యెరూషలేములో ప్రవచించాడు. సా.శ.పూ. 617లో యెహెజ్కేలు బబులోనుకు చెరగా కొనిపోబడ్డాడు. అక్కడ ఆయన తన యూదా సహోదరులకు ప్రవచించాడు. యెరూషలేము నాశనం చేయబడుతుందని ప్రవక్తలిద్దరూ కూడా ధైర్యంగా ప్రకటించారు. దేవుడు ఇలా జరుగనివ్వడని ఇతర ప్రవక్తలు చెప్పారు. ఎవరు సరైన సందేశకులుగా నిరూపించబడ్డారు?
యెహోవా అబద్ధ ప్రవక్తలను బయల్పరుస్తాడు
3, 4. (ఎ) బబులోనులో ఇశ్రాయేలీయులకు ఏ రెండు పరస్పర వ్యతిరేక సందేశాలు ఇవ్వబడ్డాయి, యెహోవా ఒక అబద్ధ సందేశకున్ని ఎలా బయల్పరిచాడు? (బి) అబద్ధ ప్రవక్తలకు ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడు?
3 యెహెజ్కేలు బబులోనులో ఉన్నప్పుడు, యెరూషలేము ఆలయంలో జరుగుతున్న దాని గురించి ఆయనకు ఒక దర్శనం ఇవ్వబడింది. దాని తూర్పు గుమ్మంవద్ద 25 మంది పురుషులున్నారు. వారిలో యజన్యా, పెలట్యా అనే ఇద్దరు ప్రధానులున్నారు. యెహోవా వారినెలా దృష్టించాడు? యెహెజ్కేలు 11:2, 3, అధఃస్సూచి ఇలా సమాధానమిస్తుంది: ‘నరపుత్రుడా, ఇండ్లు కట్టుకొన అవసరములేదా? అని చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే.’ దురహంకారులైన ఈ శాంతి సందేశకులు, ‘యెరూషలేముకు ఏ ప్రమాదం లేదు. అంతెందుకు, మనం త్వరలోనే దానిలో మరిన్ని ఇళ్లు కట్టుకుంటాము’ అని చెబుతున్నారు. కాబట్టి అబద్ధాలు చెబుతున్న ఈ ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించమని దేవుడు యెహెజ్కేలుకు చెప్పాడు. వారిలో ఒకరికి ఏమి జరిగిందో, 11వ అధ్యాయం 13వ వచనంలో యెహెజ్కేలు మనకిలా చెబుతున్నాడు: “నేను ఆ ప్రకారము ప్రవచింపుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను.” పెలట్యా అత్యంత ప్రముఖుడూ, పలుకుబడిగల ప్రధానీ, ముఖ్య విగ్రహారాధికుడూ గనుక బహుశా ఇది జరిగివుండవచ్చు. అతని హఠాన్మరణం అతడు అబద్ధ ప్రవక్త అని నిరూపించింది!
4 యెహోవా పెలట్యాను హతమార్చడం, ఇతర అబద్ధ ప్రవక్తలు దేవుని నామమున అబద్ధాలు చెప్పడాన్ని ఆపలేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవచించడంలో ఈ వంచకులు తమ మూర్ఖపు విధానంలో కొనసాగారు. కాబట్టి యెహోవా దేవుడు యెహెజ్కేలుతో ఇలా చెప్పాడు: “దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.” యెరూషలేముకు “సమాధానము లేకపోయినను . . . సమాధానార్థమైన దర్శనము” గురించి ధిక్కారంగా కలలు కన్నందుకు పెలట్యాలా, వారి ‘పని తీరుతుంది.’—యెహెజ్కేలు 13:3, 15, 16.
5, 6. అబద్ధ సందేశకులు అనేకులు ఉన్నప్పటికీ, యెషయా ఎలా ఒక నిజమైన ప్రవక్తగా మహిమపర్చబడ్డాడు?
5 యెషయా విషయంలోనైతే, యెరూషలేమును గూర్చిన ఆయన దైవిక సందేశాలన్నీ నిజమయ్యాయి. సా.శ.పూ. 607 వేసవి కాలంలో, బబులోనీయులు నగరాన్ని నాశనం చేసి యూదా శేషాన్ని వెనక్కి బబులోనుకు చెరగా పట్టుకువెళ్లారు. (2 దినవృత్తాంతములు 36:15-21; యెహెజ్కేలు 22:28; దానియేలు 9:2) అబద్ధ ప్రవక్తలు దేవుని ప్రజలను తమ వ్యర్థ వాచాలతతో ముంచెత్తకుండా ఈ విపత్తులు వారిని ఆపాయా? లేదు, ఆ అబద్ధ సందేశకులు అలాగే కొనసాగారు!
6 ఇది చాలదన్నట్లు, చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులు బబులోనుకు చెందిన ప్రగల్భాలుపలికే సోదెచెప్పేవారిని, భవిష్యత్‌వక్తలను, జ్యోతిష్కులను సహించవలసి వచ్చింది. అయితే, జరుగబోయేదానికి విరుద్ధంగా ప్రవచిస్తున్న ఈ అబద్ధ సందేశకులందరూ విఫల మూర్ఖులని యెహోవా నిరూపించాడు. తగిన కాలంలో ఆయన, యెషయాలానే యెహెజ్కేలూ తన నిజమైన సందేశకుడని చూపించాడు. యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగానే, తాను వారి ద్వారా పలికిన మాటలన్నిటినీ నెరవేర్చాడు: “నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను; జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను.”—యెషయా 44:25, 26.
బబులోనూ యెరూషలేమును గురించిన జడిపించే సందేశాలు
7, 8. బబులోను కొరకు యెషయా వద్ద ఏ ప్రేరేపిత సందేశం ఉంది, ఆయన మాటల భావమేమిటి?
7 యూదా యెరూషలేములు మానవ నివాసం లేకుండా 70 సంవత్సరాలపాటు నిర్జనమైపోవలసి ఉంది. అయితే, ఆ నగరం పునర్నిర్మించబడుతుందని, తాను ప్రవచించిన కచ్చితమైన సమయంలో ఆ దేశం జనంతో నిండిపోతుందని యెహోవా యెషయా, యెహెజ్కేలుల ద్వారా ప్రకటించాడు! ఇది అద్భుతమైన ప్రవచనం. ఎందుకు? ఎందుకంటే తన ఖైదీలను ఎన్నడూ విడుదల చేయదనే పేరు బబులోనుకు ఉంది. (యెషయా 14:4, 15-17) కాబట్టి చెరగా కొనిపోబడిన వీరికి ఎవరు విడుదల అనుగ్రహించే సాధ్యత ఉంది? బ్రహ్మాండమైన గోడలూ, పెట్టని కోటగావున్న నదీ విధానమూ గల శక్తివంతమైన బబులోనును ఎవరు పడగొట్టగలరు? సర్వశక్తిమంతుడైన యెహోవా పడగొట్టగలడు! తాను అలా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు: “ఎండిపొమ్మని ప్రవాహముతో [అంటే, నగరానికి పెట్టనికోటగావున్న నీటిసరఫరా] నేనే చెప్పుచున్నాను; కోరెషుతో—నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే; యెరూషలేముతో—నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.”—యెషయా 44:27, 28.
8 దాని గురించి ఆలోచించండి! ప్రజలకు నిజంగా ఛేదించనశక్యమైన అడ్డంకుగావున్న యూఫ్రటీసు నది యెహోవా దృష్టికి వేడెక్కివున్న ప్రదేశంపై నీటిబొట్టులా ఉంది. అయ్యో, అడ్డంకు ఆవిరైపోతుంది! బబులోను కూలిపోతుంది. పారసీక దేశపువాడైన కోరెషు జననానికి దాదాపు 150 సంవత్సరాల ముందే అయినప్పటికీ, ఈ రాజు బబులోనును స్వాధీనం చేసుకోవడం గురించీ, యెరూషలేమును దాని ఆలయాన్ని పునర్నిర్మించడానికి తిరిగివెళ్లేందుకు చెరలోనున్న యూదులకు అధికారం ఇవ్వడం ద్వారా వారిని స్వతంత్రులను చేయడం గురించీ, యెహోవాను యెషయా ప్రవచించేలా చేశాడు.
9. బబులోనును శిక్షించడానికి యెహోవా ఎవరిని తన ప్రతినిధిగా నియమించి, పేరుపెట్టి పిలిచాడు?
9 మనం ఈ ప్రవచనాన్ని యెషయా 45:1-3 నందు కనుగొంటాము: “అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను. . . . ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు—నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను.”
10. కోరెషు ఏ విధంగా ‘అభిషేకించబడ్డాడు,’ అతడు జన్మించడానికి నూరుకంటే ఎక్కువ సంవత్సరాల ముందే యెహోవా అతనితో ఎలా మాట్లాడగలిగాడు?
10 కోరెషు అప్పటికే సజీవంగా ఉన్నట్లు యెహోవా అతనితో మాట్లాడడాన్ని గమనించండి. ఇది, యెహోవా ‘లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడని’ పౌలు చేసిన వ్యాఖ్యానంతో పొందిక కల్గివుంది. (రోమీయులు 4:17) అంతేగాక, దేవుడు కోరెషును “తాను అభిషేకించిన” వానిగా గుర్తిస్తున్నాడు. ఆయనెందుకలా చేశాడు? ఏదేమైనా, యెహోవా ప్రధాన యాజకుడు పరిశుద్ధ అభిషేక తైలాన్ని కోరెషు తలపై ఎన్నడూ పోయలేదు. నిజమే, కాని ఇదొక ప్రవచనార్థక అభిషేకం. అది ఒక ప్రత్యేకమైన కార్యంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. కాబట్టి కోరెషు ముందుగా నియమించబడడాన్ని అభిషేకించబడడంగా దేవుడు చెప్పవచ్చు.—1 రాజులు 19:15-17; 2 రాజులు 8:13 పోల్చండి.
దేవుడు తన సందేశకుల మాటల్ని నెరవేరుస్తాడు
11. బబులోను నివాసులు సురక్షితంగా ఉన్నట్లు ఎందుకు భావించారు?
11 కోరెషు బబులోనుకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, దాని పౌరులు సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావించారు. వారి నగరం చుట్టూ యూఫ్రటీసు నది ద్వారా ఏర్పడిన లోతైన విశాలమైన, రక్షణ చేకూర్చే అగడ్త ఉంది. నగరంలో ఆ నది ప్రవహించిన చోటంతా, నది యొక్క తూర్పు తీరం వెంబడి కట్టడం కట్టబడి ఉంది. దాన్ని నగరం నుండి వేరు చేయడానికి నెబుకద్నెజరు తాను “పర్వతం వలె కదల్చబడలేని గొప్ప గోడ” అని పిలిచిన దానిని నిర్మించాడు. “. . . [ఆయన] దాని తలను పర్వతమంత ఎత్తుకు ఎత్తాడు.”a ఈ గోడకు పెద్ద ఇత్తడి తలుపులున్న ద్వారాలున్నాయి. వాటిలోకి ప్రవేశించాలంటే, ఒకరు నది చివరన ఉన్న లోతుపైనుండి ఎక్కాలి. బబులోనులోని ఖైదీలు ఎన్నడూ విడుదల చేయబడమనే భయానికి గురయ్యారంటే అందులో ఆశ్చర్యం లేదు!
12, 13. బబులోను కోరెషు చేతికి చిక్కినప్పుడు యెహోవా తన సందేశకుని ద్వారా తెలియజేసిన మాటలు ఎలా నెరవేరాయి?
12 కాని యెహోవాయందు విశ్వాసముంచిన చెరగొనిపోబడిన యూదులు అలాంటి భయానికి గురికాలేదు! వారికి ఉజ్వలమైన నిరీక్షణ ఉంది. వారిని స్వతంత్రులను చేస్తానని దేవుడు తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడు? యూఫ్రటీసు నదిని బబులోనుకు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో దారి మళ్లించమని కోరెషు తన సైన్యాలకు ఆజ్ఞాపించాడు. అలా, నగరం యొక్క ముఖ్య రక్షణ సాపేక్షంగా ఎండిపోయిన నదీ ప్రాంతంగా మారింది. విషమమైన ఆ రాత్రి, త్రాగి మత్తులైవున్న బబులోనువాసులు యూఫ్రటీసు నీటి వెంబడివున్న రెండు తలుపులున్న ద్వారాలను నిర్లక్ష్యంగా తెరిచివుంచారు. యెహోవా ఆ ఇత్తడి తలుపులను అక్షరార్థంగా బ్రద్దలు కొట్టలేదు; వాటిని మూసి ఉంచిన ఇనుప చువ్వలను ఆయన విరగ్గొట్టనూలేదు, కాని అవి తెరుచుకొని ఉండి, గడియలు లేకుండా ఉండేలా చేయడానికి ఆయన అద్భుతంగా వేసిన పథకం అదే ప్రభావాన్ని చూపింది. బబులోను గోడలు నిష్ప్రయోజనమైపోయాయి. కోరెషు సైన్యాలు లోపలికి ప్రవేశించడానికి వాటిపైకి నిచ్చెనలతో ఎక్కవలసిన అవసరం ఏర్పడలేదు. యెహోవా అన్ని “మెట్టగానున్న స్థలములను” అవును, అన్ని అడ్డంకులను తీసివేస్తూ కోరెషుకు ముందుగా వెళ్లాడు. యెషయా దేవుని నిజమైన సందేశకుడని నిరూపించబడ్డాడు.
13 కోరెషు నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నప్పుడు, అంధకారమయమైన, రహస్య గదుల్లోని వాటితో సహా దాని సంపదలన్నీ ఆయన చేతుల్లోపడ్డాయి. యెహోవా దేవుడు కోరెషుకు ఎందుకిలా చేశాడు? ‘తనను పేరు పెట్టి పిలుస్తున్నవాడైన’ యెహోవా నిజమైన ప్రవచనాలు చేసే దేవుడని, విశ్వసర్వాధిపతియని అతడు తెలుసుకుంటాడని అలా చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడుదల చేసేందుకు దేవుడు తాను అధికారంలోకి వచ్చేలా చేశాడని అతడు తెలుసుకుంటాడు.
14, 15. బబులోనుపై కోరెషు సాధించిన విజయానికి ఘనత యెహోవాకు చెందాలని మనకెలా తెలుసు?
14 యెహోవా కోరెషుకు చెప్పిన ఈ మాటలను వినండి: “నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను [అంటే, చెరగొనిపోబడిన తన ప్రజలకు], [బబులోనుకు] కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.”—యెషయా 45:4-7.
15 ఆ దుష్ట నగరానికి వ్యతిరేకంగా తనకు ఇష్టమైనదాన్ని నెరవేర్చి, చెరలోవున్న తన ప్రజలను విడుదల చేసేలా కోరెషును బలపర్చింది యెహోవాయే కాబట్టి అతడు బబులోనును జయించిన ఘనత వాస్తవానికి యెహోవాకే చెందాలి. ఇది చేయడంలో, నీతియుక్తమైన ప్రభావాలను లేక శక్తులను కుమ్మరించమని దేవుడు తన ఆకాశమండలాలకు ఆదేశించాడు. నీతియుక్తమైన సంఘటనలను జరిగించడానికి, చెరలోవున్న తన ప్రజలకు రక్షణ కలిగించడానికి నెరలు విడువమని ఆయన తన భూమికి ఆదేశించాడు. ఆయన సూచనార్థక ఆకాశమండలాలు మరియు భూమి ఈ ఆజ్ఞకు ప్రతిస్పందించాయి. (యెషయా 45:8) యెషయా మరణించిన వందకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత, ఆయన యెహోవా యొక్క నిజమైన సందేశకునిగా నిరూపించబడ్డాడు!
సీయోను కొరకు సందేశకుని సువార్త!
16. బబులోను ఓడిపోయినప్పుడు నిర్జనమైన యెరూషలేము నగరములో ఏ సువార్తను ప్రకటించవచ్చు?
16 కానీ ఇంకా రానైయుంది. యెరూషలేము కొరకైన సువార్త గురించి యెషయా 52:7 ఇలా తెలియజేస్తుంది: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.” పర్వతాల నుండి ఒక సందేశకుడు యెరూషలేమును సమీపించడాన్ని చూడడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో ఊహించండి! ఆయన వద్ద వార్త ఉండవచ్చు. అదేమిటి? అది సీయోనుకు ఉత్తేజకరమైన వార్త. సమాధానాన్ని గూర్చిన వార్త, అవును దేవుని దయను గూర్చిన వార్త. యెరూషలేము, దాని ఆలయం పునర్నిర్మించబడాలి! “నీ దేవుడు ఏలుచున్నాడని” సందేశకుడు విజయోత్సాహంతో ప్రకటిస్తున్నాడు!
17, 18. కోరెషు బబులోనుపై విజయం సాధించడం యెహోవా స్వంత నామాన్ని ఎలా ప్రభావితం చేసింది?
17 దావీదు రాజవంశస్థులు కూర్చున్న తన విశేషమైన సింహాసనాన్ని పడద్రోసేందుకు యెహోవా బబులోనీయులను అనుమతించినప్పుడు, ఇక ఆయన రాజుగా ఉండడని అనిపించి ఉండవచ్చు. బదులుగా బబులోను యొక్క ప్రముఖ దేవుడైన మార్దూక్ రాజులా కనిపించివుండవచ్చు. అయితే, సీయోను దేవుడు బబులోనును పడద్రోసినప్పుడు, ఆయన తాను అత్యంత గొప్ప రాజునని, తన విశ్వ సర్వాధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఈ వాస్తవాన్ని నొక్కి తెలియజేయడానికి “మహారాజు పట్టణము” అయిన యెరూషలేము దాని ఆలయంతోపాటు పునఃస్థాపించబడాలి. (మత్తయి 5:35) అలాంటి సువార్తను తెచ్చిన సందేశకుడు, అతని పాదాలు దుమ్ము కొట్టుకుపోయి, మురికిగా ఉన్నప్పటికీ, గాయాలై ఉన్నప్పటికీ, సీయోనును దాని దేవున్ని ప్రేమించేవారి దృష్టికి అవి ఎంతో సుందరమైనవిగా కనిపించాయి!
18 ఒక ప్రవచనార్థక భావంలో, బబులోను పడిపోవడం దేవుని రాజ్యం స్థాపించబడిందని, సువార్తను తెచ్చే వ్యక్తి ఆ వాస్తవాన్ని ప్రకటించేవాడని సూచించింది. అంతేగాక, యెషయా ద్వారా ప్రవచించబడిన ఈ ప్రాచీన వార్తాహరుడు మరింత గొప్ప సువార్తను తెచ్చే సందేశకునికి ముంగుర్తుగా ఉన్నాడు, ఆ సువార్త మరింత గొప్పది ఎందుకంటే, దాని ఉన్నతమైన అంశాన్నిబట్టి మరియు దాని రాజ్య మూలాంశాన్నిబట్టి, విశ్వాసంగల అన్నిరకాలైన ప్రజలకూ అద్భుతమైన సూచనలతో అది గొప్పదై ఉంది.
19. యెహోవా యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు దేశం గురించి ఏ సందేశాన్ని ఇచ్చాడు?
19 యెహెజ్కేలుకు కూడా పునఃస్థాపించబడడానికి సంబంధించిన తేజోవంతమైన ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ఆయనిలా ప్రవచించాడు: “ఇదే ప్రభువైన యెహోవా వాక్కు . . . మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును. పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు.”—యెహెజ్కేలు 36:32, 33, 35.
20. యెషయా ఏ ఉత్సాహభరితమైన ఉద్బోధను యెరూషలేముకు ప్రవచనార్థకంగా ఇచ్చాడు?
20 బబులోనునందు చెరలో ఉన్నప్పుడు, దేవుని ప్రజలు సీయోను గురించి దుఃఖిస్తున్నారు. (కీర్తన 137:1) ఇప్పుడు, వారు ఆనందించవచ్చు. యెషయా ఇలా ఉద్బోధించాడు: “యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను. యెరూషలేమును విమోచించెను. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.”—యెషయా 52:9, 10.
21. బబులోను ఓడిపోయిన తర్వాత యెషయా 52:9, 10 నందలి మాటలు ఎలా నెరవేరాయి?
21 అవును, యెహోవా ఎన్నుకున్న ప్రజలకు ఆనందించడానికి గొప్ప కారణం ఉంది. వారు ఇప్పుడు, ఒకప్పుడు నిర్జన ప్రదేశాలుగా ఉన్న స్థలాలలో తిరిగి నివసిస్తూ వాటిని ఏదెను వనములా చేయబోతున్నారు. యెహోవా వారి కొరకు ‘తన పరిశుద్ధ బాహువును బయల్పరిచాడు.’ సూచనార్థకంగా చెప్పాలంటే, ఆయన వారిని తమ ప్రియమైన స్వదేశానికి తీసుకు వచ్చేందుకు పని చేయడానికి నడుం బిగించాడు. ఇది చరిత్రలో ఏదో అల్ప, అస్పష్టమైన సంఘటన కాదు. ఒక జనాంగానికి విశేషమైన రక్షణ తీసుకువచ్చేందుకుగానూ మానవ వ్యవహారాల్లో దేవుని ‘బయల్పర్చబడిన బాహువు’ శక్తిని ప్రదర్శించడాన్ని, అప్పుడు నివసిస్తున్న ప్రజలందరూ చూశారు. యెషయా మరియు యెహెజ్కేలు యెహోవా యొక్క నిజ సందేశకులనడానికి వారికి తిరుగులేని సాక్ష్యాధారం ఇవ్వబడింది. యావత్ భూమిపై సీయోను దేవుడే సజీవమైన, నిజమైన దేవుడనడాన్ని ఎవ్వరూ సందేహించలేరు. యెషయా 35:2 నందు మనమిలా చదువుతాము: “అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెహోవా దైవత్వపు ఈ సాక్ష్యాధారాన్ని అంగీకరించిన వారు ఆయనను ఆరాధించనారంభించారు.
22. (ఎ) దేని గురించి మనం నేడు కృతజ్ఞత కలిగివుండవచ్చు? (బి) యెహోవా అబద్ధ సందేశకులను బయల్పరుస్తాడని మనం ప్రత్యేకంగా ఎందుకు కృతజ్ఞత కలిగివుండాలి?
22 యెహోవా తన నిజ సందేశకులను గుర్తిస్తుండడాన్నిబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగివుండాలో కదా! వాస్తవానికి ఆయనే ‘తన సేవకుని మాట రూఢిపరచువాడు. తన దూతల ఆలోచన నెరవేర్చువాడు.’ (యెషయా 44:26) యెషయా మరియు యెహెజ్కేలులకు ఆయన ఇచ్చిన పునఃస్థాపనా ప్రవచనాలు తన సేవకుల ఎడల ఆయనకు గల గొప్ప ప్రేమను, కృపాబాహుళ్యాన్ని, దయను ప్రశంసిస్తాయి. నిజంగా, యెహోవా దీని కొరకు మన స్తుతులన్నిటినీ పొందనర్హుడు! ఆయన అబద్ధ సందేశకులను బయల్పరుస్తాడని మనం నేడు ప్రత్యేకంగా కృతజ్ఞత కలిగివుండాలి. ఎందుకంటే అలాంటి వారు ఇప్పుడు ప్రపంచంలో అనేకులున్నారు. ఆర్భాటంతో కూడిన వారి సందేశాలు యెహోవా యొక్క ప్రకటిత సంకల్పాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ అబద్ధ ప్రవక్తలను గుర్తించడానికి తరువాతి శీర్షిక మనకు సహాయం చేస్తుంది.
[అధస్సూచీలు]
a ఇరా మూరైస్ ప్రైస్ వ్రాసిన ది మోన్యుమెంట్స్ అండ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్, 1925.
మీరు వివరించగలరా?
◻ యెహోవా తన నిజ సందేశకులను ఎలా గుర్తిస్తాడు?
◻ బబులోనును నాశనం చేయడానికి యెహోవా యెషయా ద్వారా ఎవరిని తన ప్రతినిధిగా ఎన్నుకున్నాడు?
◻ బబులోను ఓడిపోవడాన్ని వివరిస్తున్న యెషయా ప్రవచనాలు ఎలా నెరవేరాయి?
◻ బబులోను ఓడించబడడం యెహోవా నామంపై ఏ మంచి ప్రభావాన్ని చూపించింది?
[9వ పేజీలోని చిత్రం]
యెహెజ్కేలు కాలంనాటి జనాంగాలకు బబులోను ఓడించలేనిదిగా అనిపించింది