దైవికశాంతి సందేశకులు ధన్యులుగా ప్రకటించబడ్డారు
“యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును.”—యెషయా 35:9.
1. లోకానికి ఏది ఎంతో అవసరం?
మునుపెన్నటికన్నా నేడు, మానవజాతికి సువార్త సందేశకుడు అవసరం. దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి చెప్పేవారి అవసరత అవశ్యంగా ఉంది, రాబోయే నాశనం గురించి దుష్టులను హెచ్చరించి, దేవుని శాంతి గురించి తెలుసుకోవడానికి సరైన హృదయం గలవారికి సహాయం చేసే నిర్భయుడైన సాక్షి కావాలి.
2, 3. ఇశ్రాయేలీయుల విషయంలో, ఆమోసు 3:7 నందు వ్రాయబడివున్న తన వాగ్దానాన్ని యెహోవా ఎలా నెరవేర్చాడు?
2 ఇశ్రాయేలీయుల కాలంలో, ఆ విధమైన సందేశకులను పంపిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దాంతంలో, ప్రవక్తయైన ఆమోసు ఇలా చెప్పాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” (ఆమోసు 3:7) ఈ ప్రకటన జరిగిన తరువాతి శతాబ్దాలలో, యెహోవా ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేశాడు. ఉదాహరణకు, సా.శ.పూ. 607లో, తాను ఎంపిక చేసుకున్న ప్రజలు తిరుగుబాటుదారులుగా తయారై, రక్తాపరాధులయ్యారు గనుక వారికి తీవ్రంగా క్రమశిక్షణనిచ్చాడు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధలు చూసి ఆనందించిన చుట్టుప్రక్కలలోని జనాంగాలను కూడా ఆయన శిక్షించాడు. (యిర్మీయా 46-49 అధ్యాయాలు) తర్వాత, సా.శ.పూ. 539లో బబులోను యొక్క శక్తివంతమైన ప్రపంచాధిపత్యాన్ని యెహోవా పతనం చేశాడు, తత్ఫలితంగా సా.శ.పూ. 537లో ఇశ్రాయేలు యొక్క శేషం ఆలయాన్ని పునర్నిర్మించడానికి తమ దేశానికి తిరిగివచ్చింది.—2 దినవృత్తాంతములు 36:22, 23.
3 ఇవి ఎంతో ప్రాముఖ్యమైన సంఘటనలు, ఆమోసు మాటలతో పొందికగా, జరుగనైవున్న వాటి గురించి ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ, సందేశకులుగా పని చేసిన ప్రవక్తలకు యెహోవా వాటిని ముందుగానే బయల్పరిచాడు. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్ద మధ్య భాగంలో, ఆయన యెషయాను పంపించాడు. సా.శ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో ఆయన యిర్మీయాను పంపించాడు. ఆ తర్వాత, ఆ శతాబ్దాంతంలో ఆయన యెహెజ్కేలును పంపించాడు. వీరు మరితర నమ్మకమైన ప్రవక్తలు యెహోవా సంకల్పాల గురించి సుస్పష్టమైన సాక్ష్యమిచ్చారు.
నేడు దేవుని సందేశకులను గుర్తించడం
4. శాంతి సందేశకుల కొరకు మానవజాతికున్న అవసరతను ఏది చూపిస్తుంది?
4 నేటి విషయమేమిటి? మానవ సమాజం పతనమైపోవడం గమనించినప్పుడు లోకంలోని అనేకులు భీతి చెందుతారు. క్రైస్తవమత సామ్రాజ్య వేషధారణను, దాని విపరీతమైన దుష్టత్వాన్ని చూసినప్పుడు నీతి ఎడల ప్రేమగలవాళ్లు హృదయంలో నొచ్చుకుంటారు. యెహెజ్కేలు ద్వారా యెహోవా ప్రవచింపజేసినట్లుగా, వారు “దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గు లిడుచు ప్రలాపించు”చున్నారు. (యెహెజ్కేలు 9:4) అయితే, యెహోవా సంకల్పాలేమిటో అనేకులు అర్థం చేసుకోరు. వారికి చెప్పవలసిన అవసరం ఉంది.
5. మన కాలంలో సందేశకులు ఉంటారని యేసు ఎలా చూపించాడు?
5 నేడు ఎవరైనా యెషయా, యిర్మీయా, యెహెజ్కేలులకు ఉండినటువంటి నిర్భీతితో కూడిన స్ఫూర్తితో మాట్లాడుతున్నారా? ఎవరో అలా చేస్తారని యేసు సూచించాడు. మన కాలంలోని సంఘటనల గురించి ప్రవచిస్తూ ఆయనిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) సందేశకునిగా, సువార్త ప్రచారకునిగా పనిచేస్తూ నేడు ఎవరు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు? మన కాలానికి, ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలానికి ఉన్న సారూప్యాలు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనకు సహాయం చేస్తాయి.
6. (ఎ) మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో “దేవుని ఇశ్రాయేలు” యొక్క అనుభవాలను వివరించండి. (బి) ప్రాచీన ఇశ్రాయేలీయులపై యెహెజ్కేలు 11:17 ఎలా నెరవేరింది?
6 మొదటి ప్రపంచ యుద్ధంనాటి భయంకరమైన కాలాల్లో, యెహోవా ఆధునిక దిన ప్రజలు, అభిషిక్త “దేవుని ఇశ్రాయేలు” యొక్క శేషము బబులోనులో ఇశ్రాయేలీయులు ఉండినటువంటి చెరలోకి వెళ్లారు. (గలతీయులు 6:16) అబద్ధమతాల ప్రపంచ శక్తి సమ్మేళనమైన మహాబబులోనులో వారు ఆత్మీయ చెరను అనుభవించారు, దానిలో క్రైస్తవమత సామ్రాజ్యం అత్యంత ప్రాముఖ్యమైనదీ, రక్తాపరాధీ. అయినప్పటికీ, యెహోవా యెహెజ్కేలుతో చెప్పిన మాటలు వారు విడిచిపెట్టబడలేదని చూపించాయి. ఆయనిలా చెప్పాడు: “ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను.” (యెహెజ్కేలు 11:17) ప్రాచీన ఇశ్రాయేలు కొరకైన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, యెహోవా పారసీక దేశపువాడైన కోరెషును పంపించాడు, అతడు బబులోను ప్రపంచ ఆధిపత్యాన్ని పడద్రోసి, ఇశ్రాయేలీయుల శేషము తమ దేశానికి తిరిగి రావడానికి మార్గాన్ని తెరిచాడు. కాని నేటి విషయమేమిటి?
7. యేసు మహాబబులోనుకు వ్యతిరేకంగా చర్య తీసుకున్నాడని 1919లో ఏ సంఘటన చూపించింది? వివరించండి.
7 మునుపు ఈ శతాబ్దంలో, మరింత గొప్ప కోరెషు పని చేస్తున్నాడని చెప్పడానికి శక్తివంతమైన సాక్ష్యాధారం ఉంది. ఆయనెవరు? మరెవరో కాదు, 1914 నుండి పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైయున్న యేసుక్రీస్తే. ఈ గొప్ప రాజు భూమిపైనున్న తన అభిషిక్త సహోదరుల ఎడల ఆదరాన్ని చూపించాడు, 1919వ సంవత్సరంలో అభిషిక్త క్రైస్తవులు ఆత్మీయ చెర నుండి విడిపించబడి తమ “దేశానికి,” అంటే తమ ఆత్మీయ ఎస్టేటుకు తిరిగి తీసుకురాబడ్డారు. (యెషయా 66:8, NW; ప్రకటన 18:4) అలా యెహెజ్కేలు 11:17 ఆధునిక దిన నెరవేర్పును కలిగివుంది. ఇశ్రాయేలీయులు తమ దేశానికి తిరిగి రావడానికి మార్గం తెరిచేందుకు ప్రాచీన కాలాల్లో బబులోను కూలిపోవడం అవసరమయ్యింది. ఆధునిక కాలాల్లో దేవుని ఇశ్రాయేలు పునఃస్థాపించబడడం గొప్ప కోరెషు చేతుల్లో మహాబబులోను పతనమయ్యిందనడానికి సాక్ష్యాధారంగా ఉంది. ఈ కూలిపోవడం ప్రకటన 14వ అధ్యాయంలోని రెండవ దూత ద్వారా ప్రకటించబడింది, ఆయనిలా ప్రకటించాడు: “మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను.” (ప్రకటన 14:8) మహా బబులోనుకు, ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యానికి ఎంతటి దుఃస్థితి! మరియు నిజక్రైస్తవులకు ఎంతటి ఆశీర్వాదం!
8. దేవుని ప్రజలు 1919లో విడుదల చేయబడిన తర్వాత వారి ఆనందం గురించి యెహెజ్కేలు గ్రంథం ఎలా వర్ణించింది?
8 దేవుని ప్రజలు పునఃస్థాపించబడిన తర్వాత వారు అనుభవించిన ఆనందాన్ని ప్రవక్త వర్ణించడం గురించి మనం యెహెజ్కేలు 11:18-20 నందు చదువుతాము. ఆయన మాటల మొదటి నెరవేర్పు ఎజ్రా మరియు నెహెమ్యాల కాలంలో ఇశ్రాయేలును శుభ్రపరచడాన్ని సూచించింది. ఆధునిక-దిన నెరవేర్పు అలాంటి భావాన్నే కలిగివుంది. ఎలాగో మనం చూద్దాము. యెహోవా ఇలా చెబుతున్నాడు: “వారు అక్కడికి [తమ దేశానికి] వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.” ప్రవచించబడినట్లుగానే, 1919 మొదలుకొని, యెహోవా తన ప్రజలను శుభ్రపరిచి, ఆయన సేవ చేయడానికి వారికి నూతనోత్తేజాన్నిచ్చాడు. వారు తమ ఆత్మీయ పర్యావరణంలో నుండి, ఆయన దృష్టిలో తాము కలుషితమయ్యేలా చేసిన బబులోను సంబంధ అన్ని ఆచారాలను, సిద్ధాంతాలను తీసివేయడం ప్రారంభించారు.
9. యెహోవా తన ప్రజలకు 1919 నుండి మొదలుకొని ఏ విశేషమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు?
9 ఆ తర్వాత, 19వ వచనం ప్రకారం, యెహోవా ఇలా కొనసాగించాడు: “నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.” ఈ మాటలతో పొందికగా, 1919లో, యెహోవా తన అభిషిక్త సేవకులను ఐక్యపరిచి, సూచనార్థకంగా చెప్పాలంటే వారు “భుజములు కలిపి” ఆయన సేవ చేయగలిగేలా వారికి “ఏకమనస్సు” ఇచ్చాడు. (జెఫన్యా 3:9, NW) అంతేగాక, తన ప్రజలు సాక్ష్యమిచ్చే పనిలో నూతనోత్తేజాన్ని పొంది గలతీయులు 5:22, 23 నందు వర్ణించబడిన చక్కని ఆత్మఫలాలను ఫలించడానికి యెహోవా వారికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ప్రతిస్పందన లేని రాతి గుండెకు బదులు యెహోవా వారికి మెత్తని, సరళమైన, వినయమైన, ఆయన చిత్తానికి ప్రతిస్పందించే హృదయాన్ని ఇచ్చాడు.
10. పునరుద్ధరించబడిన తన ప్రజలను యెహోవా 1919 నుండి ఎందుకు ఆశీర్వదించాడు?
10 ఆయనెందుకిలా చేశాడు? యెహోవాయే వివరిస్తున్నాడు. యెహెజ్కేలు 11:19, 20 నందు మనమిలా చదువుతాము: “వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు, . . . అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.” దేవుని ఇశ్రాయేలీయులు తమ స్వంత తలంపులను అనుసరించే బదులు యెహోవా ధర్మశాస్త్రానికి విధేయత చూపడం నేర్చుకున్నారు. వారు మనుష్యుల భయం లేకుండా, దేవుని చిత్తాన్ని చేయడం నేర్చుకున్నారు. అందుకే, వారు క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనుకరణ క్రైస్తవుల నుండి భిన్నంగా ఉండగలిగారు. వారే యెహోవా ప్రజలు. అందుకే, యెహోవా వారిని తన సందేశకులుగా, తన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.—మత్తయి 24:45-47.
దేవుని సందేశకుల ఆనందం
11. యెహోవా ప్రజల ఆనందాన్ని యెషయా గ్రంథం ఎలా వర్ణిస్తుంది?
11 తాము ఎంతటి ఆధిక్యతతో కూడిన స్థానాన్ని ఆనందిస్తున్నారో వారు గుర్తించినప్పుడు వారు పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరా? సామూహికంగా, వారు యెషయా 61:10 నందలి ఈ మాటలను ప్రతిధ్వనింపజేశారు: “యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.” యెషయా 35:9 నందలి ఈ వాగ్దానం వారియందు నెరవేరింది: “యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు; వారి తలలమీద నిత్యానందముండును. వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.” పూర్వం 1919లో యెహోవా యొక్క దైవిక శాంతి సందేశకులు మానవజాతికంతటికీ సువార్తను ప్రకటించడానికి ఉద్యుక్తులైనప్పుడు వారి ఆనందం అలాగే ఉండినది. అప్పటి నుండి నేటి వరకు, వారు ఈ కార్యాన్ని నిర్వర్తించడం మానుకోలేదు, వారి ఆనందం అధికమయ్యింది. యేసు తాను కొండమీద చేసిన ప్రసంగంలో ఇలా చెప్పాడు: “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.” (మత్తయి 5:9) 1919 నుండి నేటి వరకు “దేవుని కుమారుల” అభిషిక్త శేషము ఆ ప్రకటన యొక్క నిజత్వాన్ని అనుభవిస్తోంది.
12, 13. (ఎ) యెహోవా సేవచేయడంలో దేవుని ఇశ్రాయేలుతో ఎవరు కలిశారు, వారు ఏ పని చేశారు? (బి) యెహోవా అభిషిక్త సేవకులు ఏ గొప్ప ఆనందాన్ని అనుభవించారు?
12 సంవత్సరాలు గడుస్తుండగా, అభిషిక్తులలోని మిగిలినవారిని సమకూర్చడం 1930లలో ముగింపుకు సమీపించే వరకు దేవుని ఇశ్రాయేలీయుల సంఖ్య పెరిగింది. అప్పుడు సువార్త ప్రకటించేవారి సంఖ్యలో పెరుగుదల నిలిచిపోయిందా? ఎంతమాత్రం నిలిచిపోలేదు. భూ నిరీక్షణగల క్రైస్తవుల గొప్ప సమూహము అప్పటికే వారితో సహవసించడం ప్రారంభించింది, వీరు ప్రకటనపనిలో తమ అభిషిక్త సహోదరులతో జతకలుస్తున్నారు. అపొస్తలుడైన యోహాను ఈ గొప్ప సమూహాన్ని దర్శనములో చూశాడు, ఆయన వారిని వర్ణించే విధానం విశేషంగా ఉంది: “వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.” (ప్రకటన 7:15) అవును, గొప్ప సమూహము వారు దేవుని సేవ చేయడంలో నిమగ్నమయ్యారు. ఫలితంగా, 1935వ సంవత్సరం తర్వాత అభిషిక్తుల సంఖ్య తగ్గనారంభించినప్పుడు, ఈ నమ్మకమైన సహచరులు సాక్ష్యమిచ్చే పనిని అత్యంతోత్సాహంతో కొనసాగించారు.
13 ఈ విధంగా యెషయా 60:3, 4 నెరవేరింది: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు. నీ కుమార్తైలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.” ఈ మార్పులు దేవుని ఇశ్రాయేలుకు కలిగించిన ఆనందం గురించి యెషయ 60:5 నందు ఇలా రమ్యంగా వర్ణించబడింది: “నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.”
యెహోవాసంస్థ ముందుకు పయనిస్తోంది
14. (ఎ) ఏ పరలోక దర్శనాన్ని యెహెజ్కేలు చూశాడు, ఆయన ఏ ఆజ్ఞను పొందాడు? (బి) ఆధునిక కాలంలోని యెహోవా ప్రజలు ఏమి గ్రహిస్తారు, వారు తమకు ఏ బాధ్యత ఉందని భావిస్తారు?
14 యెహోవా పరలోక, రథంవంటి సంస్థ ముందుకు పయనిస్తుండడాన్ని సా.శ.పూ. 613లో యెహెజ్కేలు దర్శనంలో చూశాడు. (యెహెజ్కేలు 1:4-28) ఆ తర్వాత యెహోవా ఆయనకిలా చెప్పాడు: “నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.” (యెహెజ్కేలు 3:4) ఈ 1997వ సంవత్సరంలో, దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి యెహోవా పరలోక సంస్థ ఇప్పటికీ ఆపనశక్యంగా ముందుకు కొనసాగుతోందని మనం గ్రహిస్తాము. కాబట్టి ఆ సంకల్పాల గురించి ఇతరులకు చెప్పాలని మనం ఇప్పటికీ పురికొల్పబడతాము. యెహెజ్కేలు తన కాలంలో, సూటిగా యెహోవాచే పురికొల్పబడిన మాటలను మాట్లాడాడు. నేడు, మనం యెహోవా ప్రేరేపిత వాక్యమైన బైబిలు నుండి మాట్లాడతాము. ఆ గ్రంథంలో మానవజాతి కొరకు ఎంత అద్భుతమైన సందేశం ఉందో కదా! అనేకులు భవిష్యత్తు గురించి చింతిస్తుండగా, పరిస్థితులు వారు ఊహిస్తున్నదానికన్నా ఎంతో హీనంగా ఉన్నాయని, అదే సమయంలో, వారు ఊహిస్తున్నదానికన్నా ఎంతో శ్రేష్ఠంగా ఉన్నాయని బైబిలు చూపిస్తుంది.
15. నేడు పరిస్థితులు అనేకులు అనుకుంటున్నదాని కంటే ఎందుకు దుర్భరంగా ఉన్నాయి?
15 పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే, మనం గత శీర్షికల నుండి తెలుసుకున్నట్లుగా, క్రైస్తవమత సామ్రాజ్యమూ ఇతర అబద్ధమతాలన్నీ త్వరలోనే నాశనం చేయబడతాయి, సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడినంత సంపూర్ణంగా అవి నాశనం చేయబడతాయి. అంతేగాక, ప్రకటన గ్రంథమందు ఏడు తలలు పది కొమ్ములుగల క్రూరమృగంగా వర్ణించబడిన మొత్తం విశ్వ రాజకీయ అస్తిత్వం త్వరలోనే, యెరూషలేము యొక్క అనేక అన్యులైన పొరుగువారిలా నిర్మూలించబడుతుంది. (ప్రకటన 13:1, 2; 19:19-21) యెహెజ్కేలు కాలంలో, యెరూషలేము నాశనం సమీపించడం మూలంగా ఏర్పడిన భీతిని యెహోవా స్పష్టంగా వర్ణించాడు. కాని ఈ ప్రపంచ సత్వర నాశనాన్ని ప్రజలు గ్రహించినప్పుడు ఆయన మాటలకు మరింకెంతో భావం ఉంటుంది. యెహోవా యెహెజ్కేలుతో ఇలా చెప్పాడు: “కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము—నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవు—శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు 21:6, 7; మత్తయి 24:30) భయంకరమైన సంఘటనలు త్వరలోనే జరుగనైవున్నాయి. తోటి మానవుల ఎడల మనకున్న అత్యధిక శ్రద్ధ మనం హెచ్చరికనివ్వడానికి, రాబోయే యెహోవా ఉగ్రత గురించిన “దుర్వార్త” చెప్పడానికి మనల్ని పురికొల్పుతుంది.
16. దీనులకు, అనేకులు అనుకుంటున్నదాని కంటే పరిస్థితులు శ్రేష్ఠంగా ఎందుకున్నాయి?
16 అదే సమయంలో, దీనులకు పరిస్థితి అనేకులు ఊహించగలిగినదానికంటే ఎంతో శ్రేష్ఠంగా ఉంటుంది. ఏ విధంగా? ఏ విధంగానంటే, యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు, ఇప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నాడు. (1 తిమోతి 1:15; ప్రకటన 11:15) పరిష్కరించనసాధ్యంగా కనిపిస్తున్న మానవజాతి సమస్యలు త్వరలోనే ఆ పరలోక రాజ్యం ద్వారా పరిష్కరించబడతాయి. మరణం, అనారోగ్యం, అవినీతి, ఆకలి, నేరం గతించిన విషయాలౌతాయి, పరదైసు భూమిపై దేవుని రాజ్యం వ్యతిరేకతలేకుండా పరిపాలిస్తుంది. (ప్రకటన 21:3, 4) మానవజాతి దైవిక శాంతిని పొందుతుంది—యెహోవా దేవునితో మరియు ఒకరితో ఒకరు శాంతియుతమైన సంబంధాన్ని కలిగివుంటారు.—కీర్తన 72:7.
17. దైవిక శాంతి సందేశకుల హృదయాలకు ఏ అభివృద్ధి ఆనందాన్ని తీసుకువస్తుంది?
17 ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, దైవిక శాంతికి సంబంధించిన ఈ సందేశానికి దీనులైనవారి అత్యంత గొప్ప సమూహాలు ప్రతిస్పందిస్తున్నాయి. కేవలం కొన్ని ఉదాహరణలను చెప్పాలంటే, గత సంవత్సరం యుక్రేయిన్ ప్రచారకులలో 17 శాతం అభివృద్ధిని నివేదించింది. మొజాంబిక్ 17 శాతం అభివృద్ధిని, లిథూవేనియా 29 శాతం అభివృద్ధిని నివేదించింది. ప్రచారకులలో, రష్యాలో 31 శాతం అభివృద్ధి జరుగగా, అల్బేనియా 52 శాతం అభివృద్ధిని సాధించింది. ఈ అభివృద్ధి దైవిక శాంతిని ఆనందించాలని కోరుకుంటూ, నీతి పక్షం వహించిన యథార్థ హృదయంగల లక్షలాదిమందిని సూచిస్తుంది. అలాంటి సత్వర పెరుగుదల మొత్తం క్రైస్తవ సహోదరత్వానికి ఆనందాన్ని తీసుకువస్తుంది.
18. ప్రజలు విన్నా వినకపోయినా, మన దృక్పథం ఏమైవుంటుంది?
18 మీరు నివసించే ప్రాంతంలో ప్రజలు అలా వెంటనే ప్రతిస్పందిస్తారా? అలాగైతే, మేమూ మీతో ఆనందిస్తాము. అయితే కొన్ని క్షేత్రాల్లో, ఆసక్తిగల ఒక్క వ్యక్తిని కనుగొనడానికే అనేకానేక గంటలు కష్టపడవలసి వస్తుంది. అలాంటి క్షేత్రాల్లో సేవచేస్తున్నవారు సోమరులుగా తయారౌతారా లేక నిరుత్సాహపడతారా? లేదు. తన తోటి యూదులకు ప్రకటించమని యౌవన ప్రవక్తయైన యెహెజ్కేలుకు మొట్టమొదట చెప్పినప్పుడు దేవుడు పలికిన ఈ మాటలను యెహోవా సేవకులు గుర్తుంచుకుంటారు: “ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము; వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము.” (యెహెజ్కేలు 2:5, 6) వారు ప్రతిస్పందించినా లేకపోయినా యెహెజ్కేలులా, మనం ప్రజలకు దైవిక శాంతి గురించి చెబుతూనే ఉంటాము. వాళ్లు వింటే మనం ఉత్తేజం పొందుతాము. వాళ్లు మనల్ని నిరాకరిస్తే, మనల్ని అపహసిస్తే, చివరికి హింసిస్తే కూడా మనం పట్టువిడువము. మనం యెహోవాను ప్రేమిస్తాము, బైబిలు ఇలా చెబుతుంది: “ప్రేమ . . . అన్నిటిని ఓర్చును.” (1 కొరింథీయులు 13:4, 7) మనం సహనంతో ప్రకటిస్తాము గనుక, యెహోవాసాక్షులెవరో ప్రజలకు తెలుసు. వాళ్లకు మన సందేశం తెలుసు. అంతం వచ్చినప్పుడు, దైవిక శాంతిని ఆనందించడానికి తమకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు ప్రయత్నించారని వాళ్లు తెలుసుకుంటారు.
19. సత్యదేవుని సేవకులుగా, మనం ఏ గొప్ప ఆధిక్యతను విలువైనదిగా ఎంచుతాము?
19 యెహోవా సేవచేయడంకంటే గొప్ప ఆధిక్యత ఏదైనా ఉందా? లేదు! దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి, మనం ఆయన చిత్తాన్ని చేస్తున్నామని తెలుసుకోవడాన్నిబట్టి మనకు ఎంతో గొప్ప ఆనందం లభిస్తుంది. “శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు.” (కీర్తన 89:15) మానవజాతికి దేవుని శాంతి సందేశకులుగా ఉండే ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ విలువైనదిగా ఎంచుదాము. చాలని యెహోవా చెప్పేవరకు మనం ఈ పనిలో మన వంతును మనం పట్టుదలతో నిర్వర్తిద్దాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ నేడు దేవుని శాంతి సందేశకులు ఎవరు?
◻ మహాబబులోను 1919లో కూలిపోయిందని మనకెలా తెలుసు?
◻ “గొప్ప సమూహము” యొక్క ముఖ్య ఆసక్తి ఏమిటి?
◻ అనేకులు అనుకుంటున్నదాని కంటే నేడు భవిష్యత్తు ఎందుకు మసకబారి ఉంది?
◻ నీతిమంతులకు వారు ఊహించినదాని కంటే శ్రేష్ఠమైన భవిష్యత్తు ఎందుకు ఉంటుంది?
[21వ పేజీలోని చిత్రం]
మానవ సమాజం పతనమైపోవడం గమనించినప్పుడు అనేకులు భీతి చెందుతారు
[23వ పేజీలోని చిత్రం]
దైవిక శాంతి సందేశకులు నేడు భూమిపైనున్న అత్యంత ఆనందభరితులైన ప్రజలు