కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/1 పేజీలు 9-14
  • ‘క్రీస్తునందు ఐక్యత కలిగి నడుచుకోండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘క్రీస్తునందు ఐక్యత కలిగి నడుచుకోండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ‘క్రీస్తునందు వేరుపారినవారై’ ఉన్నారా?
  • మీరు ‘క్రీస్తునందు కట్టబడుచున్నారా?’
  • మీరు ‘విశ్వాసమందు స్థిరపరచబడుతున్నారా?’
  • ‘కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విశ్వాసంతో ఉప్పొంగిపోవడం’
  • గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • దేవునితో నడవడం—తొలి అడుగులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీరు ‘వేరుపారి స్థిరపడ్డారా’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/1 పేజీలు 9-14

‘క్రీస్తునందు ఐక్యత కలిగి నడుచుకోండి’

“కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా . . . ఆయనయందుండి [“ఆయనయందు ఐక్యత కలిగి,” NW] నడుచుకొనుడి.”—కొలొస్సయులు 2:6.

1, 2. (ఎ) యెహోవా దేవునికి నమ్మకంగా సేవచేసిన హనోకు జీవితాన్ని గురించి బైబిలు ఎలా వర్ణిస్తోంది? (బి) కొలొస్సయులు 2:6, 7 వచనాల్లో సూచిస్తున్నట్లుగా, తనతో నడిచేందుకు యెహోవా మనకెలా సహాయపడ్డాడు?

తన తండ్రితోపాటూ నడుస్తున్న ఓ చిన్నారిని మీరెప్పుడైనా గమనించారా? ఆ చిన్నారి తన తండ్రి ప్రతి కదలికనూ అనుకరిస్తాడు, వాడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది; ఆ తండ్రి వాడికి సహాయం చేస్తుంటే, వాడి ముఖం ప్రేమా మెప్పుదలలతో వెలిగిపోతుంది. తనకు నమ్మకంగా సేవ చేసేవారి జీవితాన్ని వర్ణించేందుకు యెహోవా సరిగ్గా అలాంటి వర్ణననే ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు, విశ్వాసియైన హనోకు ‘[సత్య] దేవునితో నడిచాడు’ అని దేవుని వాక్యం చెబుతోంది.—ఆదికాండము 5:24; 6:9.

2 దయగల తండ్రి తనతోపాటు నడవడానికి తన చిన్నారి కొడుక్కి సహాయపడినట్లుగానే యెహోవా మనకు సర్వోత్తమమైన సహాయాన్ని ఇచ్చాడు. ఆయన తన జనితైక కుమారుణ్ణి భూమిపైకి పంపించాడు. ఇక్కడ భూమిపై తను జీవించిన కాలమంతటిలో తాను నడిచిన ప్రతీ అడుగులో, తన పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 14:9, 10; హెబ్రీయులు 1:3) కాబట్టి దేవునితో నడవాలంటే, మనం యేసుతో నడవడం అవసరం. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు [“విశ్వాసంతో ఉప్పొంగిపోతూ,” NW] ఆయనయందుండి [“ఆయనయందు ఐక్యత కలిగి,” NW] నడుచుకొనుడి.”—కొలొస్సయులు 2:6.

3. కొలొస్సయులు 2:6, 7 వచనాల ప్రకారంగా, క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో కేవలం బాప్తిస్మం తీసుకోవడంకన్నా ఇంకా ఎక్కువే ఇమిడివుందని మనమెందుకు చెప్పగలం?

3 యేసుక్రీస్తు పరిపూర్ణమైన అడుగుజాడలను అనుసరించడానికి కృషిచేస్తూ, ఆయనయందుండి నడుచుకోవాలని యథార్థహృదయులైన బైబిలు విద్యార్థులు అనుకొంటారు గనుకనే, వాళ్లు బాప్తిస్మం తీసుకుంటారు. (లూకా 3:21; హెబ్రీయులు 10:7-9) ఒక్క 1997వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 3,75,000 మందికిపైగా అంటే సగటున ప్రతీరోజూ 1,000కన్నా ఎక్కువమంది ఈ ప్రాముఖ్యమైన చర్యను తీసుకొన్నారు. ఈ పెరుగుదల పులకరింప జేసేలా ఉంది  ! అయితే, కొలొస్సయులు 2:6, 7వ వచనాల్లో రాయబడిన పౌలు మాటలు, క్రీస్తునందుండి ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో బాప్తిస్మం తీసుకోవడంకన్నా ఇంకా ఎక్కువే ఇమిడివుందని చూపిస్తున్నాయి. ‘నడుస్తూ ఉండండి’ అని అనువదించబడిన గ్రీకు క్రియ నిర్విరామంగాసాగే, ఎడతెగకుండాసాగే చర్యను వర్ణిస్తోంది. అంతేగాక, క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో నాలుగు విషయాలు అంటే క్రీస్తునందు వేరుపారినవారై ఉండడం, ఆయనయందు ఇంటివలె కట్టబడినవారై ఉండడం, విశ్వాసమందు స్థిరపరచబడినవారై ఉండడం, కృతజ్ఞతాస్తుతులతో ఉప్పొంగిపోతున్నవారై ఉండడం అనే నాలుగు విషయాలు చేరివున్నాయని పౌలు తెలియజేస్తున్నాడు. మనం ఒక్కొక్క పదబంధాన్నీ పరిశీలించి, అవి క్రీస్తునందు ఐక్యత కలిగి క్రమంగా నడుస్తూ ఉండేందుకు మనకు ఎలా సహాయపడతాయో చూద్దాం.

మీరు ‘క్రీస్తునందు వేరుపారినవారై’ ఉన్నారా?

4. ‘క్రీస్తునందు వేరుపారడం’ అంటే అర్థమేమిటి?

4 మొదటిగా, పౌలు మనం ‘క్రీస్తునందు వేరుపారి’ ఉండాల్సిన అవసరముందని రాస్తున్నాడు. (మత్తయి 13:20, 21 పోల్చండి.) ‘క్రీస్తునందు వేరుపారినవారిగా’ ఉండేందుకు ఒకరు ఎలా కృషి చేయగలరు? చెట్టు వేర్లు పైకి కన్పించకపోయినా, అవి చెట్టు మనుగడకు ఎంతో ముఖ్యం. అవి చెట్టును దృఢంగా ఉంచి, పోషక పదార్థాల్ని సరఫరా చేస్తాయి. అదే విధంగా, క్రీస్తు చూపించిన మాదిరీ, ఆయన చేసిన బోధా మన మనస్సుల్లోనూ, హృదయాల్లోనూ పాతుకుపోతూ, మొదట అదృశ్యంగా (పైకి కన్పించకుండా) మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అక్కడ అవి మనకు పోషకాహారాన్నిచ్చి బలపరుస్తాయి. మన ఆలోచనల్నీ చర్యల్నీ, మన నిర్ణయాల్నీ నియంత్రించేలా వాటిని మనం అనుమతించినప్పుడు, యెహోవాకు మన జీవితాల్ని సమర్పించుకొనేందుకు మనం కదిలించబడతాం.—1 పేతురు 2:21.

5. ఆధ్యాత్మికాహారం ఎడల మనమెలా ‘అపేక్షను పెంపొందించు’కొనగలం?

5 యేసు, దేవుడ్నుండి వచ్చిన జ్ఞానాన్ని ప్రేమించాడు. ఆయన దాన్ని ఆహారంతో పోల్చాడు కూడా. (మత్తయి 4:4) కొండమీద తాను చేసిన ప్రసంగంలో, ఆయన హెబ్రీ లేఖనాల యొక్క ఎనిమిది వేర్వేరు గ్రంథాలనుండి 21 ఉదాహృతభాగాల్ని ఎత్తి చెప్పాడు. ఆయన మాదిరిని అనుసరించేందుకు, “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి” ఆధ్యాత్మికాహారం కోసం ‘అపేక్షించమని’ అపొస్తలుడైన పేతురు ఉద్బోధిస్తున్నట్లుగానే మనమూ అపేక్షించాలి. (1 పేతురు 2:1) నవజాత శిశువు పాలకోసం అపేక్షించినప్పుడు, వాడు పాలకోసం పడే ఆరాటం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆధ్యాత్మికాహారం విషయంలో మనకిప్పుడు అలాంటి అపేక్షాభావం లేకపోతే గనుక, అలాంటి అపేక్షను ‘అలవర్చుకోమని’ పేతురు మాటలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎలా? కీర్తన 34:8లో ఉన్న సూత్రం సహాయపడవచ్చు: “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి.” యెహోవా వాక్యమైన బైబిల్ని మనం క్రమంగా “రుచి”చూస్తుంటే, బహుశా ప్రతీరోజూ దానిలో కొంతభాగాన్ని చదువుతూ ఉండడంద్వారా రుచిచూస్తున్నట్లైతే, అది ఆధ్యాత్మికంగా పోషణకరంగానూ, ఉత్తమమైనదిగానూ ఉన్నట్టు మనం చూస్తాం. క్రమేణా, దాని కొరకైన మన అపేక్ష పెరుగుతుంది.

6. మనం చదివినవాటిని ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?

6 అయితే, ఆహారాన్ని తిన్న తర్వాత, దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడం ప్రాముఖ్యం. కాబట్టి మనం చదివినదాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. (కీర్తన 77:11, 12) ఉదాహరణకు, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని మనం చదువుతుండగా, ప్రతీ అధ్యాయం దగ్గరా ఆగి, ‘క్రీస్తు వ్యక్తిత్వంలోని ఏ లక్షణాన్ని నేను ఈ వృత్తాంతంలో చూస్తాను, మరి ఆ లక్షణాన్ని నేను నా జీవితంలో ఎలా అనుకరించగలను?’ అని మనల్ని మనం ప్రశ్నించుకొన్నట్లైతే, ఆ అధ్యాయం మనకెంతో ప్రయోజనకరమైనదౌతుంది. అలా ధ్యానించడం, మనం నేర్చుకొన్నదాన్ని మనం అన్వయించుకోవడాన్ని సాధ్యంచేస్తుంది. అప్పుడు మనం నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, యేసైతే ఏమి చేసి ఉండేవాడని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. యేసు తీసుకొనే విధంగానే మనమూ నిర్ణయాన్ని తీసుకొంటే, క్రీస్తునందు నిజంగా వేరుపారినవారమై ఉన్నామనే రుజువును మనం ఇస్తాం.

7. బలమైన ఆధ్యాత్మికాహారం విషయంలో మన దృక్పథం ఏమైవుండాలి?

7 “బలమైన ఆహారము”ను అంటే దేవుని వాక్యపు లోతైన సత్యాలను తీసుకోమని పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు. (హెబ్రీయులు 5:14) ఈ విషయంలో మన మొట్టమొదటి గమ్యం బైబిల్ని పూర్తిగా చదవడమే అయివుండవచ్చు. ఆ తర్వాత, క్రీస్తు విమోచన క్రయధనమూ, యెహోవా తన ప్రజలతో చేసిన వివిధ నిబంధనలూ, లేక బైబిల్లోని కొన్ని ప్రవచనాత్మక సందేశాలూ వంటి మరింత నిర్దిష్టమైన అధ్యయనాంశాలు ఉన్నాయి. అలాంటి బలమైన ఆధ్యాత్మికాహారాన్ని తీసుకొని, జీర్ణింపచేసుకోవడానికి మనకు సహాయపడే సమృద్ధికరమైన సమాచారం ఉంది. అలాంటి జ్ఞానాన్ని తీసుకోవడంలోగల లక్ష్యం ఏమిటి? అది మనం గొప్పలు చెప్పుకోవడానికి కారణం కాకూడదు గానీ యెహోవా ఎడలగల మనకు గల ప్రేమను పెంపొందించి, ఆయనకు మనం మరింత సన్నిహితులమయ్యేలా చేయాలి. (1 కొరింథీయులు 8:1; యాకోబు 4:8) ఈ జ్ఞానాన్ని మనం అపేక్షగా తీసుకొని, దాన్ని మనకుగా మనం అన్వయించుకొని, ఇతరులకు సహాయపడేందుకు దాన్ని ఉపయోగిస్తే, మనం నిజంగా క్రీస్తును అనుకరించినవారమౌతాం. ఇది, ఆయనయందు సరిగ్గా వేరుపారినవారిగా ఉండేందుకు మనకు సహాయపడుతుంది.

మీరు ‘క్రీస్తునందు కట్టబడుచున్నారా?’

8. ‘క్రీస్తునందు కట్టబడడం’ అంటే అర్థం ఏమిటి?

8 క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలోగల తర్వాతి అంశం కోసం, పౌలు ఒక దృశ్యం నుండి మరొక దృశ్యానికి అంటే చెట్టు నుండి కట్టడానికి (యింటికి) మార్చుతున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓ కట్టడాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, మనం కేవలం పునాది గురించి మాత్రమేగాక దానిపై ఎంతో కష్టపడి నిర్మించే కట్టడాన్ని గురించి కూడా ఆలోచిస్తాం. అదే విధంగా, క్రీస్తులాంటి లక్షణాల్నీ, అలవాట్లనూ పెంపొందింపచేసుకోవడానికి మనం ఎంతో కృషిచేయాల్సి ఉంది. పౌలు తిమోతికి రాసినట్లుగానే అలాంటి కృషి గుర్తింపులేకుండా పోదు: ‘నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబ[డనివ్వు].” (1 తిమోతి 4:15; మత్తయి 5:16) మనల్ని ఇంటివలే కట్టే కొన్ని క్రైస్తవ కార్యకలాపాలు ఏవి?

9. (ఎ) మన పరిచర్యలో క్రీస్తును అనుకరించేందుకు, మనం పెట్టుకోవాల్సిన కొన్ని అభ్యాససిద్ధమైన లక్ష్యాలు ఏవి? (బి) మనం మన పరిచర్యను ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నట్టు మనకెలా తెలుసు?

9 సువార్తను ప్రకటించి బోధించే నియామకాన్ని యేసు మనకిచ్చాడు. (మత్తయి 24:14; 28:19, 20) ఆయన ధైర్యంగానూ, ప్రభావవంతంగానూ సాక్ష్యమిస్తూ, పరిపూర్ణ మాదిరిని ఉంచాడు. ఆయన చేసినంతగా మనమెన్నటికీ చేయలేమన్నది నిజమే. అయినా, అపొస్తలుడైన పేతురు ఈ లక్ష్యాన్ని మన ఎదుట ఉంచాడు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:15) ‘సమాధానము చెప్పుటకు మీరు ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నట్టు’ భావించకపోతే, నిస్పృహకు లోనుకాకండి. అలాంటి స్థాయికి క్రమేణా పురోభివృద్ధిచెందేలా సహాయపడే సహేతుకమైన లక్ష్యాల్ని పెట్టుకోండి. ముందుగా సిద్ధపడడమనేది మీ అందింపును భిన్నమైందిగా చేయవచ్చు లేక మీ అందింపుకు ఒకటో రెండో లేఖనాల్ని అదనంగా చేర్చవచ్చు. బైబిలు సాహిత్యాల్ని ఎక్కువగా అందించాలనే, పునర్దర్శనాల్ని ఎక్కువగా చేయాలనే లేక బైబిలు పఠనాన్నొకదాన్ని ప్రారంభించాలనే లక్ష్యాల్ని మీరు పెట్టుకోవచ్చు. ప్రాముఖ్యతను కచ్చితంగా పరిమాణానికే ఇవ్వక అంటే సేవలో గడిపే గంటల సంఖ్యకో, అందింపుల సంఖ్యకో లేక పఠనాల సంఖ్యకో ఇవ్వక నాణ్యతకే ఇవ్వాలి. సహేతుకమైన లక్ష్యాల్ని పెట్టుకొని, వాటిని సాధించడానికి కృషిచేయడం అనేది పరిచర్యలో మనల్ని మనం అర్పించుకోవడంలోని ఆనందాన్ని అనుభవించేందుకు మనకు సహాయపడగలదు. యెహోవా దేవుడు కోరేదదే—“సంతోషముతో” ఆయన్ని మనం సేవించాలి.—కీర్తన 100:2; పోల్చండి 2 కొరింథీయులు 9:7.

10. మనం చేయాల్సిన కొన్ని ఇతర క్రైస్తవ కార్యకలాపాలు ఏవి, మరి ఇవి మనకెలా సహాయపడతాయి?

10 క్రీస్తునందు మనల్ని ఇంటివలే కట్టే కార్యకలాపాలు అంటే క్రైస్తవ సంఘంలో మనం చేసే కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ఒకరి ఎడల మరొకరు ప్రేమను చూపించుకోవడమనేది నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమై ఉన్నందున అలా ప్రేమ చూపించుకోవడమనేది అతి ప్రాముఖ్యమైన కార్యకలాపమైవుంది. (యోహాను 13:34, 35) మనమింకా పఠనం చేస్తుండగానే, మనలో అనేకులం మనతో బైబిలు పఠనం చేస్తున్నవారికి సన్నిహితులమయ్యాం, అది సహజమే. అయినా, సంఘంలోని ఇతరులను తెలుసుకోవడం ద్వారా ‘విశాలపరచుకొనమని’ అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనమిప్పుడు అనుసరించగలమా? (2 కొరింథీయులు 6:13) మన ప్రేమా ప్రశంసలు పెద్దలకు కూడా అవసరమే. వారి లేఖనాధార సలహాను కోరుతూ, దాన్ని అంగీకరిస్తూ, వారితో సహకరించడం ద్వారా, వారి కష్టతరమైన పనిని మరింత సులభతరం చేస్తాం. (హెబ్రీయులు 13:17) అదే సమయంలో, క్రీస్తునందు మనం ఇంటివలే కట్టబడేందుకు అది దోహదపడుతుంది.

11. బాప్తిస్మాన్ని గూర్చిన ఏ వాస్తవిక దృక్పథాన్ని మనం తీసుకోవాలి?

11 బాప్తిస్మమనేదొక ఉత్తేజపరిచే సందర్భం  ! అయినా, అటు తర్వాత జీవితంలోని ప్రతీ క్షణమూ అలాగే ఉత్తేజంగా ఉంటుందని మనం ఎదురు చూడకూడదు. క్రీస్తునందు కట్టబడినవారిగా ఉండడంలో ఎక్కువ శాతం, ‘ఇప్పటివరకు లభించిన దానినిబట్టి క్రమముగా నడుచుకోవడం’ చేరివుంది. (ఫిలిప్పీయులు 3:16) నిస్సారమైన, విసుగ్గెత్తించే జీవిత విధానమని దాని అర్థంకాదు. సరళంగా చెప్పాలంటే దాని అర్థం తిన్నగా ముందుకు సాగిపోవడమనే. మరో మాటలో చెప్పాలంటే, మంచి ఆధ్యాత్మిక అలవాట్లను పెంపొందించుకొని, వాటిని రోజులూ సంవత్సరాలు గడుస్తుండగా కాపాడుకుంటూ ఉండాలని అర్థం. గుర్తుంచుకోండి, “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:13.

మీరు ‘విశ్వాసమందు స్థిరపరచబడుతున్నారా?’

12. ‘విశ్వాసమందు స్థిరపరచబడడం’ అంటే అర్థం ఏమిటి?

12 క్రీస్తునందు ఐక్యత కలిగి నడవడాన్ని గూర్చి వర్ణిస్తున్న తన మూడవ పదబంధంలో, ‘విశ్వాసమందు స్థిరపర్చబడాలని’ పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు. పౌలు ఉపయోగించిన గ్రీకు పదానికి “దృఢపరచడం, హామీ ఇవ్వడం, చట్టపరంగా మార్చలేనిదిగా చేయడం” అని అర్థం కాబట్టి, ఒక అనువాదం “విశ్వాసం విషయమై దృఢపర్చబడడం” అని చదువబడుతోంది. మనం జ్ఞానమందు ఎదుగుతుండగా, యెహోవా దేవునియందు మనకున్న విశ్వాసం బాగా నాటుకుని ఉందనీ, నిజానికి న్యాయపరంగా స్థిరపర్చబడిందనీ గ్రహించేందుకు మనకు మరిన్ని కారణాలు లభిస్తాయి. తత్ఫలితంగా మన స్థిరత్వం పెరుగుతుంది. మనల్ని కదిలించడం సాతాను లోకానికి మరింత కష్టతరమౌతుంది. ‘పరిణతి చెందేలా ముందుకు సాగిపోవాలని’ పౌలు ఇచ్చిన ఉద్బోధనను అది మనకు గుర్తుచేస్తోంది. (హెబ్రీయులు 6:1, NW) పరిణతీ, స్థిరత్వమూ చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగుతాయి.

13, 14. (ఎ) మొదటి శతాబ్దమందలి కొలొస్సయి క్రైస్తవులు తమ సుస్థిరతను దెబ్బతీసే ఏ ప్రమాదాల్ని ఎదుర్కొన్నారు? (బి) అపొస్తలుడైన పౌలు బహుశా దేన్ని గురించి కలవరపడి ఉంటాడు?

13 కొలొస్సయలో ఉన్న మొదటి శతాబ్దంనాటి క్రైస్తవులు తమ స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదాల్ని ఎదుర్కొన్నారు. పౌలు ఇలా హెచ్చరించాడు: “ఎవ్వడూ తన మోసకరమైన వట్టి తత్త్వ వాదాలతో మిమ్మల్ని చెరపట్టకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ తత్త్వ వాదాలు క్రీస్తును అనుసరించేవికావు కాని మనుషుల సాంప్రదాయాల్ని ఈ లోకంలోని ప్రాథమిక నియమాల్నీ అనుసరించేవే.” (కొలొస్సయి 2:8, పరిశుద్ధ బైబిల్‌) “[దేవుడు] ప్రేమించిన . . . కుమారుని రాజ్యనివాసు”లుగా మారిన కొలొస్సయులు తమ ఆశీర్వాదపూర్వక ఆధ్యాత్మిక స్థితినుండి కొట్టుకుపోయి, తొలగించబడడం పౌలుకి ఇష్టంలేదు. (కొలొస్సయులు 1:13) దేనిచే మోసగించబడడం? “తత్త్వ వాదాలు” అని పౌలు సూచించాడు, బైబిల్లో ఈ పదం కన్పించేది ఇక్కడ మాత్రమే. ప్లేటో, సోక్రటీస్‌ వంటి గ్రీకు తత్త్వవేత్తల్ని గురించి ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడా? వీళ్లు ఆ కాలంలో ఉన్న నిజ క్రైస్తవులకు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, “తత్త్వ వాదాలు” అనే పదం విస్తృతమైన భావంలో ఉపయోగించబడేది. అది సాధారణంగా, విభిన్నాభిప్రాయాల్ని కల్గివున్న గుంపుల్నీ, వర్గాల్నీ—మతపరమైన గుంపుల్నీ, వర్గాల్నీ కూడా సూచించింది. ఉదాహరణకు, జోసిఫస్‌, ఫిలో వంటి మొదటి శతాబ్దపు యూదులు తమ సొంత మతాన్ని తత్త్వవాదమని పిలిచేవారు.—బహుశా దాని ఆకర్షణను పెంచడానికే అలా పిలిచి ఉండవచ్చు.

14 బహుశా పౌలును కలవరపర్చిన కొన్ని తత్త్వ వాదాలు, మతపరమైన స్వభావాన్ని కల్గివున్నవై ఉండవచ్చు. “చేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు” అని బోధిస్తూ, క్రీస్తు మరణం ద్వారా తొలగించబడిన మోషే ధర్మశాస్త్రపు విశిష్టతలను పరోక్షంగా ప్రస్తావించే వారిని గురించి తాను కొలొస్సయులకు రాసిన పత్రికలోని అదే అధ్యాయమందు పౌలు చర్చించాడు. (రోమీయులు 10:4) క్రైస్తవ సంఘ ఆధ్యాత్మికతకు ముప్పును కల్గించే రీతిలో అన్య తత్త్వ వాదాలతో పాటూ కొన్ని ఇతర ప్రభావాలు కూడా పనిచేశాయి. (కొలొస్సయులు 2:20-22) “లోకసంబంధమైన మూలపాఠముల”లో భాగమైన తత్త్వవాదానికి వ్యతిరేకంగా పౌలు హెచ్చరించాడు. అలాంటి అబద్ధ ఉపదేశం మానవుల నుండి వచ్చింది.

15. తరచుగా మనమెదుర్కొనే లేఖనరహిత ఆలోచనా సరళిచే కొట్టుకుపోకుండా మనమెలా జాగ్రత్తపడగలం?

15 దేవుని వాక్యంపై బలంగా ఆధారపడని మానవాభిప్రాయాలనూ, ఆలోచనలనూ ప్రచారం చేయడం, క్రైస్తవ స్థిరత్వానికొక ముప్పును తేగలదు. అలాంటి ముప్పుల విషయంలో నేడు మనం అప్రమత్తంగా ఉండాలి. అపొస్తలుడైన యోహాను ఇలా ఉద్బోధిస్తున్నాడు: “ప్రియులారా,. . . ప్రతి ఆత్మను [“ప్రేరేపిత వ్యక్తీకరణను,” NW] నమ్మక, ఆ యా ఆత్మలు [“ప్రేరేపిత వ్యక్తీకరణలు,” NW] దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” (1 యోహాను 4:1) కాబట్టి ఒకవేళ, బైబిలు ప్రమాణాల ప్రకారంగా జీవించడం పాతకాలపు పద్ధతని మీ తోటి విద్యార్థి ఒకరు మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, లేదా వస్తుదాయక దృక్పథాన్ని అలవర్చుకొనేలా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మీ పొరుగువారొకరు ప్రయత్నిస్తే, లేదా బైబిలు సుశిక్షితమైన మనస్సాక్షిని ఉల్లంఘించమని తోటి పనివాడొకరు మోసపూరితంగా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే, లేదా చివరికి మీ తోటి విశ్వాసి తన సొంత అభిప్రాయాలపై ఆధారపడి సంఘంలో ఇతరులపై విమర్శనా వ్యాఖ్యానాల్నీ, ప్రతికూలమైన వ్యాఖ్యానాల్నీ వెల్లడిస్తే వాటితో ఏకీభవించకండి. దేవుని వాక్యంతో పొందిక లేనివాటిని విడనాడండి. మనమంతా అలా చేస్తూ, క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తున్నప్పుడు మన సుస్థిరతను కాపాడుకుంటాం.

‘కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విశ్వాసంతో ఉప్పొంగిపోవడం’

16. క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో గల నాల్గవ అంశం ఏమిటి, మనమే ప్రశ్నను వేసుకోవాలి?

16 పౌలు ప్రస్తావించినట్లు క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో గల నాల్గవ అంశం ఏమిటంటే మనం ‘కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు విశ్వాసంతో ఉప్పొంగిపోవడమే.’ (కొలొస్సయులు 2:7) ‘ఉప్పొంగిపోవడం’ అనే పదం, పొంగిపొర్లుతున్న నదిని మనకు గుర్తుచేస్తుంది. క్రైస్తవులముగా మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు నిరంతరమూ చెల్లించేవిగా లేక అలవాటుగా చెల్లించేవిగా ఉండాలని మనకిది సూచిస్తోంది. ‘నాలో ఆ కృతజ్ఞతా భావం ఉందా?’ అని మనలో ప్రతీ ఒక్కరూ యుక్తమైనరీతిలో ప్రశ్నించుకోవచ్చు.

17. (ఎ) కృతజ్ఞులముగా ఉండేందుకు, క్లిష్టమైన సమయాల్లో కూడా కృతజ్ఞులమై ఉండేందుకు మనకెన్నో కారణాలు ఉన్నాయని ఎందుకు చెప్పవచ్చు? (బి) మీలో కృతజ్ఞతా భావాన్ని విశేషంగా కలిగించగల బహుమానాలు అంటే యెహోవా నుండి వచ్చిన బహుమానాలు కొన్ని ఏవి?

17 నిజంగా, అనుదినమూ యెహోవా ఎడల కృతజ్ఞతా భావం మనలో ఉప్పొంగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన సమయాల్లో సహితం, చిన్న చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు ఉపశమనాన్ని కల్గించవచ్చు. స్నేహితుడు సానుభూతిని చూపిస్తాడు, మనమీద ప్రేమ ఉన్న వ్యక్తి అభయమిస్తున్నట్లు స్పర్శిస్తాడు. రాత్రివేళల్లో తగినంతగా నిద్రపోవడం, కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకునేలా చేస్తుంది. కమ్మని భోజనం ఆకలిని తీరుస్తుంది. పక్షుల కిలకిల రావాలూ, పసిపాపల బోసినవ్వూ, నీలాకాశపు తళుకుబెళుకులూ, సేదదీర్చే పిల్లగాలులూ—ఇవన్నీ, బహుశా వీటికన్నా మరెక్కువ విషయాలూ ఒకేరోజు మన అనుభవంలోకి వచ్చి ఉంటాయి. అలాంటి బహుమానాల్ని తేలిగ్గా తీసుకోవడం ఎంతో సులభం. కృతజ్ఞతలను వ్యక్తపర్చదగినవి కావంటారా? ‘శ్రేష్ఠమైన ప్రతి యీవికీ [బహుమానానికీ], సంపూర్ణమైన ప్రతి వరానికీ’ మూలమైన యెహోవా నుండే అవన్నీ వస్తాయి. (యాకోబు 1:17) ఉదాహరణకు, పైన ప్రస్తావించబడిన బహుమానాలకన్నా గొప్ప బహుమానమైన జీవాన్ని ఆయన మనకిచ్చాడు. (కీర్తన 36:9) అంతేగాక, ఆయన మనకు నిరంతరం జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ బహుమానాన్ని ఇచ్చేందుకు, యెహోవా “తనకెంతో ఇష్టుడైన” తన అద్వితీయ కుమారుణ్ణి పంపించడం ద్వారా మహోన్నతమైన త్యాగాన్ని చేశాడు.—సామెతలు 8:30, NW; యోహాను 3:16.

18. యెహోవాకు మనం కృతజ్ఞులమై ఉన్నామనే విషయాన్ని మనమెలా చూపించవచ్చు?

18 అందుకని, “యెహోవాను స్తుతించుట [“కృతజ్ఞతలు చెల్లించుట,” NW] మంచిది” అన్న కీర్తనల గ్రంథకర్త మాటలు ఎంత వాస్తవమోకదా. (కీర్తన 92:1) అదే విధంగా, “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” అని థెస్సలొనీకయలో ఉన్న క్రైస్తవులకు పౌలు జ్ఞాపకం చేశాడు. (1 థెస్సలొనీకయులు 5:18; ఎఫెసీయులు 5:20; కొలొస్సయులు 3:15) మనలో ప్రతి ఒక్కరమూ మరింత కృతజ్ఞులమై ఉండాలని తీర్మానించుకోవాలి. మన ప్రార్థనల్లో మన అవసరాల నిమిత్తం దేవునికి చేసే విజ్ఞాపనలు మాత్రమే ఇమిడి ఉండాల్సిన అవసరం లేదు. అవి వాటి స్థానంలో ఉంటే మంచిది. అయితే మీ నుండి ఏమైనా కావల్సినప్పుడు మాత్రమే మాట్లాడే స్నేహితుణ్ణి కల్గివుండడం గురించి ఆలోచించండి  ! కాబట్టి యెహోవాకు కృతజ్ఞతలూ, స్తుతులూ చెల్లించేందుకు మీరాయనకు ఎందుకు ప్రార్థించకూడదు? ఆయన కృతఘ్నురాలైన ఈలోకంవైపు చూసినప్పుడు అలాంటి ప్రార్థనలు ఆయన్నెంతగా ప్రీతిపరుస్తాయో కదా! అలాంటి ప్రార్థనలు మనం నిజంగా ఎంతో ఆశీర్వదించబడినవారమనే విషయాన్ని గుర్తుచేస్తూ, జీవితపు అనుకూల కోణాలపై దృష్టిని కేంద్రీకరించేందుకు బహుశా మనకు సహాయపడడమే రెండవ ప్రయోజనమైవుంది.

19. కొలొస్సయులు 2:6, 7 వచనాల్లో పౌలు ఉపయోగించిన పదజాలం, క్రీస్తునందు నడుస్తూ ఉండడంలో మెరుగుపర్చుకొనేందుకు మనమంతా ఎల్లప్పుడూ కొనసాగాలని ఏ విధంగా సూచిస్తోంది?

19 దేవుని వాక్యంలోని ఒక్క వచనం నుండే ఇంత జ్ఞానయుక్తమైన నడిపింపును పొందడం విశేషమైన విషయం కాదంటారా? క్రీస్తుతోపాటు నడుస్తూ ఉండడంలో కొనసాగమని పౌలు ఇచ్చిన సలహా మనలో ప్రతీ ఒక్కరూ లక్ష్యపెట్టాల్సిన సలహాయైవుంది. క్రీస్తునందు ‘వేరుపారినవారమై,’ ఆయనయందు ‘కట్టబడి,’ ‘విశ్వాసమందు స్థిరపరచబడి,’ ‘కృతజ్ఞతలు చెల్లించుటయందు ఉప్పొంగిపోతూ’ ఉందామని మనం తీర్మానించుకుందాం. అలాంటి సలహా క్రొత్తగా బాప్తిస్మం తీసుకొన్నవారికి విశేషంగా ప్రాముఖ్యం. కానీ అది మనందరికీ అన్వయిస్తుంది. తల్లివేరు భూమిలోకి అంతకంతకూ లోతుగా ఎలా పాతుకుపోతుందో, నిర్మాణంలో ఉన్న ఓ కట్టడం పైపైకి ఎలా కట్టబడుతూనే ఉంటుందో ఆలోచించండి. అలాగే క్రీస్తునందలి మన నడకకూడా ఎప్పటికీ ముగిసిపోదు. మనమంతా అంతకంతకూ ఎదగాల్సిన అవసరముంది. మనం ఆయనతోనూ, ఆయన ప్రియకుమారునితోనూ నిరంతరమూ నడుస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక యెహోవా మనకు సహాయంచేసి, ఆశీర్వదిస్తాడు.

మీరెలా జవాబిస్తారు?

◻ క్రీస్తునందు ఐక్యత కలిగి నడుస్తూ ఉండడంలో ఏమి ఇమిడివుంది?

◻ ‘క్రీస్తునందు వేరుపారడం’ అంటే అర్థమేమిటి?

◻ మనం ఎలా ‘క్రీస్తునందు కట్టబడవచ్చు’?

◻ ‘విశ్వాసమందు స్థిరులై’ ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం?

◻ ‘కృతజ్ఞతలతో ఉప్పొంగిపోవడానికి’ మనకే కారణాలు ఉన్నాయి?

[10వ పేజీలోని చిత్రం]

చెట్టు వేర్లు పైకి కన్పించకపోవచ్చు, కానీ అవి చెట్టుకు ఆహారాన్నీ, స్థిరంగా నిలబడడానికి దృఢత్వాన్ని ఇస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి