కుటుంబ పరిరక్షణా బాధ్యతను నిర్వహించడం
“తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) ఆ ప్రేరేపిత మాటలతో, అపొస్తలుడైన పౌలు కుటుంబ పరిరక్షణా బాధ్యతను అది ఎవరికి చెందుతుందో ఆయన భుజాలపైనే అంటే తండ్రి భుజాలపైన స్పష్టంగా నిలిపాడు.
చాలామట్టుకు కుటుంబాల్లో, తన పిల్లల ఎడల శ్రద్ధ వహించడంలో తండ్రి ఒంటరివాడు కాడు. ఆయన పిల్లల తల్లి అంటే ఆయన భార్య ఆయనతోపాటు ఆ బాధ్యతను సంతోషంగా పంచుకుంటుంది. అందుకే, రాజైన సొలొమోను ఇలా ప్రకటించాడు: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.”—సామెతలు 1:8.
వస్తుపరమైన మరియు ఆధ్యాత్మికమైన పరిరక్షణ
తమ పిల్లలను ప్రేమించే తలిదండ్రులు వారిని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించరు. వాస్తవానికి, క్రైస్తవులు అలా చేయడం తమ విశ్వాసాన్ని త్యజించడంతో సరిసమానంగా ఉంటుంది. “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని తిమోతికి పౌలు వ్రాసిన మాటలనుండి మనం ఆ విషయాన్ని గ్రహిస్తున్నాము. (1 తిమోతి 5:8) పిల్లలను “ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” పెంచడం అంటే వారికి వస్తుపరమైన రీతిలో సమకూర్చడం మాత్రమే కాదని క్రైస్తవులు గుర్తిస్తారు.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు కొంత ముందు, వారు మోయాబు మైదానంలో బసచేసి ఉన్నప్పుడు వారిని మోషే పురికొల్పిన విధానాన్ని పరిశీలించండి. అక్కడ దేవుడు వారికి ఇచ్చిన న్యాయవిధులను ఆయన మళ్లీ జ్ఞాపకం చేసి, వారికిలా బోధించాడు: “కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొ[నవలెను].” (ద్వితీయోపదేశకాండము 11:18) ఇంతకు మునుపు, వారు యెహోవాను తమ పూర్ణహృదయంతోనూ పూర్ణప్రాణముతోనూ, తమ పూర్ణశక్తితోనూ ప్రేమించాలని ఆయన వారికి జ్ఞాపకం చేశాడు, తర్వాత “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను” అని జత చేశాడు. (ద్వితీయోపదేశకాండము 6:5, 6) దేవుని ధర్మశాస్త్రంలోని మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయేలా చేయడం ఇశ్రాయేలు తలిదండ్రులకు ఎంతో ప్రాముఖ్యమై ఉంది. ఆధ్యాత్మిక మెప్పుదలతో నిండిన హృదయాలతో, ఇశ్రాయేలు తలిదండ్రులు మోషే యొక్క తర్వాతి మాటలకు ఎంతో సమర్థవంతంగా విధేయులవ్వగలిగే వారు: “నీవు నీ కుమారులకు వాటిని [దేవుని ధర్మశాస్త్రంలోని మాటలను] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”—ద్వితీయోపదేశకాండము 6:7; 11:19; పోల్చండి మత్తయి 12:34, 35.
తండ్రులు తమ పిల్లలకు ఆ మాటలను “అభ్యసింపజేసి,” ‘వాటినిగూర్చి మాటలాడవలసి’ ఉండిరనే విషయాన్ని గమనించండి. ‘అభ్యసింపజేయు’ అనే పదాన్ని మిరియమ్స్-వెబ్‌స్టర్స్ కాలేజియేట్ డిక్షనరీ “తరచుగా పునరుక్తి చేయడం లేక హెచ్చరించడం ద్వారా బోధించడం మరియు ముద్రవేయడం” అని నిర్వచిస్తుంది. తలిదండ్రులు దేవుని న్యాయవిధులను గురించి అనుదినమూ—ఉదయం, మధ్యాహ్నం, రాత్రి—మాట్లాడినప్పుడు, ఇది వారి పిల్లలకు ఎన్నో విషయాలను తెలియజేసింది. దేవుని ధర్మశాస్త్రంపట్ల తమ తలిదండ్రులకుగల ప్రేమను యౌవనస్థులు గమనించినప్పుడు, దానికి ప్రతిస్పందనగా వారు యెహోవా ఎడల సన్నిహితత్వాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రభావితం చేయబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 6:24, 25) ఆసక్తికరంగా, ‘వారు తమ ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు’ తమ పిల్లలకు బోధించాలని మోషే తండ్రులకు ప్రత్యేకంగా ఉపదేశించాడు. అలాంటి బోధ కుటుంబ పరిరక్షణలో ఒక భాగం. అయితే నేటి సంగతేమిటి?
“నీ యింట కూర్చుండునప్పుడు”
“అది అంత సులభం కాదు” అని నలుగురు పిల్లల తల్లియైన జానెట్ అనే క్రైస్తవురాలు వివరిస్తోంది.a “మనకు ఎంతో పట్టుదల ఉండాలి” అని ఆమె భర్త పాల్ అంగీకరిస్తున్నాడు. అనేకమంది సాక్షులైన ఇతర తలిదండ్రుల వలెనే, పాల్ జానెట్‌లు తమ పిల్లలతో వారానికి కనీసం ఒక్కసారైనా బైబిలును అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తారు. “మేము ప్రతి సోమవారం సాయంత్రం కుటుంబ బైబిలు చర్చను, ఒక నిర్ణీత సమయంలో చేయడానికి ప్రయత్నిస్తాం” అని పాల్ వివరిస్తున్నాడు, “అయితే అది అన్నిసార్లూ సఫలమవ్వదని” ఆయన అంగీకరిస్తున్నాడు. తన సంఘంలోని నియమిత పెద్దగా, అత్యవసరమైన విషయాలతో వ్యవహరించేందుకు ఆయన కొన్నిసార్లు పిలువబడ్డాడు. ఆయన పెద్ద పిల్లలు ఇద్దరు పూర్తికాల పరిచారకులుగా సేవ చేస్తున్నారు. పరిచర్యలో ప్రజలను కలుసుకునేందుకు సాయంత్రాలు చాలా అనువైనవిగా ఉన్నాయని వారు కనుగొన్నారు. అలా, ఒక కుటుంబంగా వారు తమ కుటుంబ పఠనం కొరకైన తమ సమయాన్ని సవరించుకున్నారు. “మేము కొన్నిసార్లు, సాయంత్రం భోజనం చేసిన వెంటనే మా పఠనాన్ని చేస్తాము” అని పాల్ వివరిస్తున్నాడు.
తలిదండ్రులు తమ కుటుంబ పఠన సమయం విషయంలో జ్ఞానయుక్తంగా పట్టువిడుపులను ప్రదర్శించినప్పటికీ, వారు దాన్ని క్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. “మా పఠనం సమయాన్ని మార్చవలసి వస్తే, పఠనం ఎప్పుడు జరుగుతుందో మేమందరమూ తెలుసుకోగలిగేలా ఆ కొత్త సమయాన్ని నాన్నగారు ఫ్రిజ్ డోర్‌పై పెట్టేవారు” అని వాళ్ల అమ్మాయి క్లార్ చెబుతోంది.
క్రమ కుటుంబ బైబిలు పఠనం కొరకు సమకూడటం, కుటుంబంలోని చిన్నవారు తమ చింతలనూ సమస్యలనూ తమ తలిదండ్రుల ఎదుట వెలిబుచ్చేందుకు చక్కని అవకాశాన్ని కలిగిస్తుంది. బైబిలు పాఠ్యపుస్తకం నుండి ప్రశ్నలను అడిగినప్పుడు పిల్లలు వాటికి జవాబులను పుస్తకం నుండి కేవలం చదవకపోవడం మంచిది, అలాంటి కుటుంబ పఠనం ఎంతో మంచి ఫలితాలను తెస్తుంది. ఇద్దరు కొడుకులున్న మార్టిన్ ఇలా వివరిస్తున్నాడు, “మా కుటుంబ పఠనం చర్చలకు ఫోరమ్. లేఖనాంశాలను చర్చించేందుకు మీరు వారానికి ఒకసారి సమావేశమైనప్పుడు, మీ కుటుంబం ఆధ్యాత్మికంగా ఎలా ఉందనే విషయం మీకు తెలుస్తుంది. చర్చలో అన్ని విషయాలూ బయటికి వస్తాయి. స్కూల్లో ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోగలుగుతారు, మరింత ప్రాముఖ్యంగా, మీ పిల్లలు ఎలాంటి దృక్పథాలను అలవర్చుకుంటున్నారో మీరు తెలుసుకోగల్గుతారు.” ఆయన భార్య సాండ్రా దానితో ఏకీభవిస్తుంది; మరియు కుటుంబ పఠనం నుండి తాను కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నానని భావిస్తుంది. “నా భర్త పఠనాన్ని నిర్వహిస్తున్నప్పుడు, ఆయన ప్రశ్నలకు నా కుమారులు చెప్పే జవాబులను వినడం ద్వారా నేను కూడా ఎంతో నేర్చుకోగలుగుతాను” అని ఆమె చెబుతోంది. తన పిల్లలకు సహాయం చేసేందుకు తర్వాత సాండ్రా తన వ్యాఖ్యానాలను మలచుతుంది. ఆమె చురుకుగా పాల్గొంటుంది గనుక ఆమె పఠనాన్ని మరింత ఎక్కువ ఆనందించగలుగుతుంది. అవును, కుటుంబ పఠన సమయాలు తలిదండ్రులకు తమ పిల్లల ఆలోచనావిధానాన్ని గురించిన ఒక అవగాహనను ఇస్తాయి.—సామెతలు 16:23; 20:5.
అనుగుణ్యంగానూ పట్టుదలగల వారిగానూ ఉండండి
మీ కుటుంబ పఠన సమయం వచ్చినప్పుడు, ఒక పిల్లవాడు చురుకుగా, ఆసక్తితో ఉండగా, మరి ఇతరులు ధ్యాస నిలిపేందుకూ పఠనం ద్వారా ప్రయోజనం పొందేందుకూ వారికి మందలింపు అవసరమనీ మీరు కనుగొనవచ్చు. ఒక క్రైస్తవ తల్లి ఇలా వ్యాఖ్యానిస్తోంది: “కుటుంబ జీవితం అలాగే ఉంటుంది ! తలిదండ్రులుగా మీరేమి చేయాలో మీకు తెలుసు. కాబట్టి మీరు అది చేసినప్పుడు, యెహోవా సహాయం చేస్తాడు మరియు మంచి ఫలితాలను కలిగిస్తాడు.”
చిన్న పిల్లలు అవధానం నిలుపగలిగే సామర్థ్యం, వారి వయస్సును బట్టి ఎంతో వేరుగా ఉంటుంది. వివేచనగల తల్లి /తండ్రి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు, ఆ పిల్లల వయస్సులు 6 నుండి 20 ఏళ్ల మధ్యలో ఉన్నాయి. వారి తండ్రి మైకేల్ ఇలా చెబుతున్నాడు: “ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు అందరికంటే ముందు చిన్నపిల్లలకు అవకాశాన్ని ఇవ్వండి. తర్వాత పెద్దపిల్లలు వివరాలను జత చేయడానికీ, వారు సిద్ధం చేసిన అంశాలను చెప్పడానికి అనుమతించవచ్చు.” తమ పిల్లలతో వివేచనాయుక్తంగా ప్రవర్తించే ఈ విధానం, ఇతరులను పరిగణించడం యొక్క విలువను తమ పిల్లలకు బోధించేందుకు తలిదండ్రులకు వీలు కలిగిస్తుంది. “మా పిల్లల్లో ఒకరికి త్వరగా అర్థం కావచ్చు, అయితే అర్థం చేసుకునేందుకు మరొకరికి చాలా సహాయం అవసరం కావచ్చు” అని మార్టిన్ పేర్కొంటున్నాడు. “క్రైస్తవ సహనాన్నీ, పరిశుద్ధాత్మ యొక్క ఇతర ఫలాలనూ ప్రదర్శించేందుకు పఠన సమయం మాకు తర్ఫీదునిచ్చే సమయమౌతుందని నేను కనుగొన్నాను.”—గలతీయులు 5:22, 23; ఫిలిప్పీయులు 2:4.
మీ పిల్లల వేర్వేరు సామర్థ్యాలకూ పెరుగుదలా స్థాయిలకూ తగిన విధంగా సర్దుకుపోయేందుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు యౌవనస్థులైన సైమన్ మార్క్‌లు తాము చిన్నగా ఉన్నప్పుడు, తమ తల్లిదండ్రులతో జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి పుస్తకాన్ని పఠించడాన్ని తాము ఎంతో ఆనందించామని కనుగొన్నారు. “మేము కథలోని వేర్వేరు పాత్రలను ఒక నాటకం వలే నటించేలా మా నాన్నగారు ఏర్పాటు చేసేవారు” అని వాళ్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మంచి పొరుగువాడైన సమరయుని గురించిన ఉపమానాన్ని తన కుమారులతో నటించేందుకు ఆయన తన మోకాళ్లపై కూర్చుని ఉండటాన్ని వాళ్ల నాన్న జ్ఞాపకం చేసుకుంటున్నాడు. (లూకా 10:30-35) “అది ఎంతో వాస్తవికంగాను సరదాగాను ఉండేది.”
క్రమంగా కుటుంబ పఠనాన్ని నిర్వహించడానికి అనేకమంది పిల్లలు సుముఖంగా ఉండకపోవచ్చు. నియమిత సమయంలో పఠనాన్ని నిర్వహించకుండా ఇది తలిదండ్రులను ఆపేయాలా? ఎంత మాత్రం కాదు. “బాలుని [లేక, బాలిక] హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని సామెతలు 22:15 అంగీకరిస్తోంది. అనేక సందర్భాల్లో, అవాంతరాల మూలంగా తమ పఠనానికి ఆటంకాలు కలుగుతున్నట్లు అనిపించినప్పుడు, తాను కుటుంబ పఠన నిర్వాహకురాలిగా విఫలం అవుతున్నానని ఒక ఒంటరి తల్లి భావించింది. అయితే ఆమె పట్టువిడువకుండా కొనసాగింది. ఇప్పుడు ఆమె పిల్లలకు ఆమెపట్ల ప్రగాఢమైన గౌరవం ఉంది, మరియు క్రమమైన కుటుంబ పఠనాన్ని నిర్వహించేందుకు ఆమె పట్టువిడువకుండా ఉండటం ద్వారా ఆమె చూపిన ప్రేమనూ శ్రద్ధనూ వారు అమూల్యమైనవిగా ఎంచుతున్నారు.
“తండ్రిలేనివారికి” సహాయం చేయడం
క్రైస్తవ పెద్దలు “దేవుని మందను పైవిచారణ” చేయవలసి ఉన్నారు. (1 పేతురు 5:2, 3) తమ సంఘాల్లోని కుటుంబాలను అప్పుడప్పుడూ సందర్శిస్తూ ఉండటం, తమ క్రైస్తవ బాధ్యతలను నిర్వహించే తలిదండ్రులను మెచ్చుకునేందుకు వారికి అవకాశమిస్తుంది. అయితే తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు బోధించే బాధ్యత ఎవరిది? పిల్లలకు ఉపదేశమిచ్చే బాధ్యత తల్లి /తండ్రిదనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు.
అక్కడ లేని తల్లి /తండ్రి యొక్క బాధ్యతలు తాము చేపట్టడం ద్వారా తలెత్తగల పరిస్థితులను నివారించేందుకు, అంటే తమ క్రైస్తవ సూత్రాలను అపాయంలో పడవేయగల పరిస్థితులను నివారించేందుకు క్రైస్తవ వివేకం పెద్దలకు సహాయం చేస్తుంది. ఒక ఒంటరి తల్లియైన క్రైస్తవ సహోదరిని దర్శించేందుకు ఇద్దరు సహోదరులు వెళ్లగలిగినప్పటికీ, కుటుంబ పఠన ఏర్పాటుకు మద్దతు నివ్వడానికి ఏది ఏర్పాటు చేయాలన్న విషయంలో కూడా వారు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడప్పుడూ, పెద్ద తన కుటుంబ పఠనంలో ఆ పిల్లలు (నిజానికి, ఒంటరి తల్లి /తండ్రి కూడా) భాగంవహించగలగడం ప్రోత్సాహకరంగానూ, ఆచరణాత్మకంగానూ ఉండవచ్చు. అయితే, యెహోవా మన గొప్ప పరలోక తండ్రి అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకండి. తల్లి తన పిల్లలతో పఠనాన్ని నిర్వహించేందుకు ఒంటరిగా ప్రయత్నిస్తున్నా, ఆమెకు నడిపింపునూ సహాయాన్నీ ఇచ్చేందుకు, యెహోవా తప్పకుండా అక్కడ ఉంటాడు.
ఒక వ్యక్తి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పటికీ, అతని తలిదండ్రులు తమ ఆధ్యాత్మిక బాధ్యతల ఎడల ఎలాంటి శ్రద్ధనూ కనపర్చకపోతే లేక నామమాత్రపు శ్రద్ధ చూపుతున్నట్లయితే అప్పుడేమిటి? యెహోవా యొక్క నమ్మకమైన సేవకులు ఎప్పుడూ నిరుత్సాహపడనవసరం లేదు. “నిరాధారులు తమ్మును నీకు [యెహోవా దేవునికి] అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు” అని కీర్తనల గ్రంథకర్త పాడాడు. (కీర్తన 10:14) దాని ఫలితంగా, తలిదండ్రులు తమ పిల్లలపట్ల శ్రద్ధ వహిస్తుండగా సంఘంలోని ప్రేమగల పెద్దలు వారిని ప్రోత్సహించేందుకు తమకు వీలైనదంతా చేస్తారు. కుటుంబమంతా కలిసి చర్చించాలని వారు సలహా ఇవ్వవచ్చు, మరియు ఎలా కలిసి పఠించాలనే విషయంపై కొన్ని ఆచరణాత్మక సలహాలను ఇచ్చేందుకు వారు కూడా పఠనానికి హాజరు కావచ్చు. అయితే, తలిదండ్రులకు ఉన్న ఆ బాధ్యతను తాము తీసుకునేందుకు ప్రయత్నించరు, అది తలిదండ్రుల లేఖనాధార బాధ్యత.
తమ తలిదండ్రులు విశ్వాసాన్ని హత్తుకోనప్పుడు పిల్లలకు మరింత మద్దతు అవసరం అవుతుంది. వారిని మీ కుటుంబ పఠనంలో చేర్చుకోవడం, అది వారి తలిదండ్రులకు సమ్మతమైతే ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉండగలదు. ఇప్పుడు, తన స్వంత కుటుంబాన్ని కలిగి ఉన్న మధ్య వయస్కుడైన రాబర్ట్, తనకు మూడేళ్లు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి క్రైస్తవ కూటాలకు హాజరయ్యాడు. తన తలిదండ్రులు క్రైస్తవ సంఘంతో సహవసించడం మానేసిన తర్వాత కూడా అతనికి ఆ కూటాల మధుర స్మృతులు ఉన్నాయి. అతనికి పదేళ్లు ఉన్నప్పుడు, అతడు ఒక సాక్షి అబ్బాయిని కలిశాడు, ఆ అబ్బాయి అతన్ని కూటాలకు తీసుకువెళ్లాడు. ఆ సాక్షి అబ్బాయి తలిదండ్రులు రాబర్ట్‌ను ఆధ్యాత్మిక అనాథగా పరిగణించి తమ వద్దకు సంతోషంగా చేర్చుకున్నారు, తర్వాత అతనితో పఠనం చేశారు. ఈ ప్రేమపూర్వకమైన శ్రద్ధ మూలంగా, ఆయన త్వరగా అభివృద్ధి సాధించాడు, ఇప్పుడు ఒక సంఘంలో పెద్దగా సేవ చేస్తూ ఆనందిస్తున్నాడు.
తమ పిల్లల పురోభివృద్ధిని తలిదండ్రులు వ్యతిరేకించినప్పుడు కూడా, పిల్లలు ఒంటరి వారు కారు. యెహోవా నమ్మకస్థుడైన పరలోక తండ్రిగా ఉంటాడు. “తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రి” అని కీర్తన 68:5 ప్రకటిస్తోంది. ఆధ్యాత్మికంగా తలిదండ్రులను కలిగిలేని వారు, ప్రార్థనలో ఆయనవైపు తిరుగవచ్చనీ ఆయన వారిని కాపాడతాడనీ వారికి తెలుసు. (కీర్తన 55:22; 146:9) తన ప్రచురణల ద్వారానూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 85,000 కంటే ఎక్కువ క్రైస్తవ సంఘాల కూటాల్లోనూ, వడ్డించబడుతున్న చక్కని ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేయవలసిన తన బాధ్యతను తల్లి వంటి యెహోవా సంస్థ చక్కగా నెరవేరుస్తూ ఉంది. అలా, తండ్రియైన యెహోవా నుండీ తల్లివంటి ఆయన సంస్థ నుండీ వచ్చే ఆధ్యాత్మిక సహాయంతో, ‘తండ్రిలేని వారు’ కూడా బైబిలు పఠనాన్ని కొంతమేరకు ఆనందించగలరు.
తమ పిల్లలతో క్రమ కుటుంబ బైబిలు పఠనాలను నిర్వహించే క్రైస్తవ తలిదండ్రులను తప్పకుండా మెచ్చుకోవలసిందే. తమ చిన్నపిల్లలకు యెహోవా మార్గాల్లో తర్ఫీదునివ్వడంలో పట్టు విడువకుండా ప్రయత్నించే ఒంటరి తల్లి /తండ్రికి వారి ప్రయత్నాల విషయమై ప్రత్యేక అవధానం అవసరం. వారు ప్రత్యేక ప్రశంసకు పాత్రులు. (సామెతలు 22:6) ఆధ్యాత్మికంగా తండ్రిలేని వారిపట్ల శ్రద్ధ వహించే వారందరికీ, ఇది మన పరలోక తండ్రియైన యెహోవాను ప్రీతిపరుస్తుందని తెలుసు. ఒక కుటుంబం యొక్క ఆధ్యాత్మిక అవసరతల ఎడల శ్రద్ధ వహించడం ఎంతో బరువైన బాధ్యత. అయితే ‘మేలుచేయడంలో విసుగక ఉండండి. అలయక మేలు చేస్తే తగినకాలమందు పంటకోస్తారు.’—గలతీయులు 6:9.
[అధస్సూచి]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[23వ పేజీలోని చిత్రం]
ఒక కుటుంబ బైబిలు పఠనం, చిన్నవారు తమ చింతలను తమ తలిదండ్రుల ఎదుట వెలిబుచ్చేందుకు చక్కని అవకాశాన్ని కలిగిస్తుంది
[20వ పేజీలోని చిత్రసౌజన్యం]
Harper’s