ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
“ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.
1. కుటుంబాన్ని గురించిన దేవుని సంకల్పం ఏమిటి, కానీ దానికి విరుద్ధంగా ఏమి జరిగింది?
“మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం[చుడి].” (ఆదికాండము 1:28) యెహోవా దేవుడు ఆదాము హవ్వలకు, ఈ మాటలను చెబుతూ కుటుంబ ఏర్పాటును స్థాపించాడు. (ఎఫెసీయులు 3:14, 15) ఆ మొదటి దంపతులు, భవిష్యత్తును గురించి ఆలోచిస్తే, భూమి తమ సంతానంతో నిండడాన్ని తమ మనోనేత్రాలతో చూడగలిగేవారు, పరిపూర్ణ మానవుల విస్తృత కుటుంబం పరదైసు భూమిపై ఆనందంగా జీవిస్తూ, తమ గొప్ప సృష్టికర్తను ఐకమత్యంగా ఆరాధించడాన్ని చూడగల్గేవారు. కానీ, ఆదాము హవ్వలు పాపంలో పడిపోయారు కనుక, భూమి నీతిమంతులైన దైవభయంగల ప్రజలతో నిండలేదు. (రోమీయులు 5:12) దానికి బదులు, కుటుంబ జీవితం చాలా త్వరగా క్షీణించిపోయింది, ద్వేషం, హింస, ‘అనురాగరాహిత్యం’ అనేవి ముఖ్యంగా ఈ ‘అంత్యదినాల్లో’ ప్రబలంగా ఉన్నాయి.—2 తిమోతి 3:1-5; ఆదికాండము 4:8, 23; 6:5, 11, 12.
2. ఆదాము సంతతికి ఎలాంటి సామర్థ్యాలున్నాయి, అయితే, ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకునేందుకు ఏమి అవసరం?
2 ఆదాము హవ్వలు దేవుని పోలికగా సృష్టించబడ్డారు. ఆదాము పాపిగా మారినప్పటికీ, అతనికి పిల్లలు కలిగేందుకు యెహోవా అనుమతించాడు. (ఆదికాండము 1:27; 5:1-4) ఆదాము సంతానానికి వాళ్ళ తండ్రికున్నట్లే, నైతిక బలముంది, కాబట్టి వాళ్ళు తప్పొప్పులను గుర్తించడం నేర్చుకోగలరు. తమ సృష్టికర్తను ఎలా ఆరాధించాలన్న విషయంలోను, తమ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను ఆయనను ప్రేమించవలసిన ప్రాముఖ్యతను గురించీ నిర్దేశాన్ని పొందగలరు. (మార్కు 12:30; యోహాను 4:24; యాకోబు 1:27) అంతేకాక, ‘న్యాయముగా నడుచుకోవడానికీ, కనికరాన్ని ప్రేమించడానికీ, దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించడానికీ’ తర్ఫీదును పొందగలరు. (మీకా 6:8) అయితే, పాపులుగా వాళ్ళు ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి చాలా శ్రద్ధచూపవలసి ఉంది.
ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోండి
3. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విషయంలో ఎలా ‘సమయాన్ని సద్వినియోగం’ చేసుకోగలుగుతారు?
3 క్లిష్టమైన ఈ కాలాల్లో, పిల్లలు ‘యెహోవాను ప్రేమించేవారిగా’ నిజంగా ‘చెడుతనాన్ని అసహ్యించుకునేవారిగా’ కావాలంటే చాలా కృషి చేయాల్సిన అవసరముంది. (కీర్తన 97:10) జ్ఞానవంతులైన తల్లిదండ్రులు, ఈ సవాలును ఎదుర్కునేందుకు ‘సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.’ (ఎఫెసీయులు 5:15-17) మీరొక తల్లిగానీ తండ్రిగానీ అయితే, మీరు దీనినెలా చేయగలరు? మొదటిగా, ప్రాముఖ్యతనివ్వవలసిన విషయాలేవన్నది నిర్ణయించుకుని, మీ పిల్లలకు బోధించడం, తర్ఫీదునివ్వడం అనే కార్యాలతో సహా, ‘శ్రేష్ఠమైన కార్యములకు’ అవధానమివ్వండి. (ఫిలిప్పీయులు 1:9) రెండవదిగా, మీ జీవన శైలిని నిరాడంబరంగా చేసుకోండి. నిజంగా అంత అవసరం కాని కార్యకలాపాలను ప్రక్కకు పెట్టవలసి ఉండవచ్చు. లేదా మీ దగ్గరున్న వస్తువులు ఏవైనా అవసరం లేనివీ వాటిని పాడుకాకుండా చూసుకునేందుకు చాలా సమయం పట్టేవీ అయితే వాటిని మీరు వదులుకోవలసి ఉండవచ్చు. ఒక క్రైస్తవ తల్లిగా లేక తండ్రిగా, మీరు మీ పిల్లలను దైవభయంగలవారిగా పెంచేందుకు కృషి చేస్తే, మీరు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి ఎన్నడూ రాదు.—సామెతలు 29:15, 17.
4. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుకోవడం ఎలా?
4 తల్లిదండ్రులు, తమ పిల్లలతో సమయాన్ని వెచ్చించడం వల్ల, ముఖ్యంగా, ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు కేంద్రీకరించేందుకు సమయాన్ని వెచ్చించడానికి కృషి చేయడం వల్ల తగ్గ ప్రయోజనముంటుంది. కుటుంబాలను ఐక్యంగా ఉంచే శ్రేష్ఠమైన మార్గాల్లో అలా సమయాన్ని వెచ్చించడం ఒకటి. సమయమున్నప్పుడు పిల్లలతో గడపవచ్చులే అని నిర్లక్ష్యం చేయకండి. మీరు కలిసి గడిపేందుకు ఖచ్చితమైన సమయాల పట్టికను తయారు చేసుకోండి. దీనర్థం, అందరూ ఒకే ఇంట్లో ఉంటూ ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవడం కాదు. పిల్లలపై ప్రతిరోజూ వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే, వాళ్ళు వర్ధిల్లుతారు. వాళ్ళ మీద మీకున్న ప్రేమనూ శ్రద్ధనూ ధారాళంగా వ్యక్తం చేయవలసిన అవసరముంది. దంపతులు, పిల్లలు కావాలని నిర్ణయించుకోక ముందే, ఈ ప్రాముఖ్యమైన బాధ్యతను తప్పనిసరిగా గంభీరంగా ఆలోచించాలి. (లూకా 14:28) అలా ఆలోచించినప్పుడు, పిల్లల్ని పెంచడం ఒక పని అన్నట్లుగా వాళ్ళు భావించరు. బదులుగా, వాళ్ళు దాన్ని ఆశీర్వాదకరమైన ఆధిక్యతగా దృష్టిస్తారు.—ఆదికాండము 33:5; కీర్తన 127:3.
మాట ద్వారా మాదిరి ద్వారా బోధించండి
5. (ఎ) మీరు మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పడమనేది దేనితో మొదలౌతుంది? (బి) ద్వితీయోపదేశకాండము 6:5-7 వచనాల్లో తల్లిదండ్రులకు ఏమని ఉపదేశించబడింది?
5 మీరు మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పడమనేది, మీకు ఆయన మీద ప్రేమ ఉండడంతో మొదలౌతుంది. దేవుని మీద మీకున్న బలమైన ప్రేమ మీరు ఆయన నిర్దేశాలనన్నింటినీ నమ్మకంగా అనుసరించేందుకు మిమ్మల్ని కదిలిస్తుంది. ఆయన నిర్దేశాలను అనుసరించడంలో, పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడం కూడా ఇమిడి ఉంది. (ఎఫెసీయులు 6:4) తల్లిదండ్రులు తమ పిల్లలకు మాదిరినుంచాలని, వాళ్ళతో సంభాషించాలని, వాళ్ళకు బోధించాలని దేవుడు ఉపదేశిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 6:5-7 వచనాలు ఇలా అంటున్నాయి: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” తరచూ బోధించడం ద్వారా, మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా, మీరు మీ పిల్లల మనస్సుల్లో దేవుని ఆజ్ఞలను నాటగలరు. ఆ విధంగా, మీ పిల్లలు మీకు యెహోవా మీద ఉన్న ప్రేమను గ్రహించగల్గుతారు, ఆ విధంగా వాళ్ళు కూడా, ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుకునేలా ప్రభావితులౌతారు.—సామెతలు 20:7.
6. పిల్లలు, మాదిరిని చూసి నేర్చుకుంటారు కనుక తల్లిదండ్రులు ఎలాంటి మాదిరినుంచాలి?
6 పిల్లలు ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సుకతతో ఉంటారు, జాగ్రత్తగా వింటారు, పరిశీలిస్తారు, మీ మాదిరిని త్వరగా అనుకరిస్తారు. మీరు వస్తు సంపదలకు ప్రాముఖ్యతనివ్వడంలేదని వాళ్ళు చూసినప్పుడు, యేసు ఉపదేశాన్నెలా అనుసరించవచ్చో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అలా మీరు, వస్తు సంపదల గురించి ఎక్కువ చింతించక, ‘దేవుని రాజ్యాన్ని మొదట వెదకమని’ వాళ్ళకు బోధిస్తున్న వారౌతారు. (మత్తయి 6:25-33) బైబిలు సత్యం గురించీ, దేవుని సంఘం గురించీ, నియమించబడిన పెద్దల గురించీ నిర్మాణాత్మకమైన విధంగా ఆధ్యాత్మికంగా బలపరచే విధంగా మాట్లాడడం ద్వారా, మీరు మీ పిల్లలకు యెహోవాను గౌరవించడమూ ఆయన చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లను మెప్పుదలా భావంతో చూడడమూ నేర్పిస్తున్నవారౌతారు. మన మాటలకు చేతలకు తేడా ఉంటే పిల్లలు వెంటనే పసిగడతారు కనుక, మీరు మౌఖికంగా బోధించే దానిని మీ ప్రవర్తనా, మీ వైఖరీ దృఢపర్చే విధంగా ఉండాలి, మీ ప్రవర్తనా మీ మానసిక వైఖరీ ఆధ్యాత్మిక విషయాలపై మీకున్న ప్రగాఢమైన మెప్పుదలను వెల్లడి చేయాలి. తమ మంచి మాదిరి, తమ పిల్లల్లో యెహోవా పట్ల హృదయపూర్వకమైన ప్రేమను కలిగించడాన్ని తల్లిదండ్రులు చూడగల్గడం ఎంత ఆశీర్వాదకరం!—సామెతలు 23:24, 25.
7, 8. పిల్లలకు శైశవదశలో నుండే తర్ఫీదివ్వడంలోని విలువను ఏ ఉదాహరణ చూపిస్తుంది, ఆ విజయానికి ఘనత ఎవరికి చెందాలి?
7 పిల్లలకు శైశవదశ నుండే తర్ఫీదివ్వడంలోని విలువను వెనిజులాలోని ఒక ఉదాహరణలో చూడవచ్చు. (2 తిమోతి 3:14, 15) ఫెలీక్స్, మైర్లీన్ అనే యువ దంపతులు పయినీరు పరిచారకులు. వాళ్ళ కుమారుడు ఫెలీటో పుట్టినప్పుడు, ఆయనను యెహోవా సత్యారాధకుడిగా పెంచేందుకు తమ శాయశక్తులా కృషి చేయాలన్న ఆతురతతో వాళ్ళుండేవారు. యెహోవాసాక్షులు ప్రచురించిన నా బైబిలు కథల పుస్తకమును మైర్లీన్ బిగ్గరగా చదవనారంభించింది. ఆ పుస్తకంలో ఇవ్వబడిన మోషే చిత్రాన్నీ, మరితరుల చిత్రాలనూ చాలా చిన్న వయస్సులోనే ఫెలీటో గుర్తించేవాడు.
8 ఫెలిటో తన చిన్నతనంలోనే తనంతట తానే సాక్ష్యమివ్వనారంభించాడు. తాను రాజ్యప్రచారకుడవ్వాలన్న కోరికను నెరవేర్చుకున్నాడు, తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. కొన్నాళ్ళకు క్రమ పయినీర్ అయ్యాడు. ఆయన తల్లిదండ్రులు ఆయన గురించి చెబుతూ, “మా కొడుకు సాధిస్తున్న ప్రగతిని మేము చూస్తున్నప్పుడు, మేము యెహోవాకు ఆయన నిర్దేశానికి ఎంతో ఋణపడి ఉన్నామని గుర్తిస్తాము” అని అంటున్నారు.
పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయపడండి
9. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా పొందుతున్న ఆధ్యాత్మిక నిర్దేశాలకు మనమెందుకు కృతజ్ఞులమై ఉండాలి?
9 పిల్లలను ఎలా పెంచాలనే విషయంలో సలహాలనిచ్చే డజన్ల కొలది పత్రికలూ, వందలాది పుస్తకాలూ, వేలాది ఇంటర్నెట్ వెబ్ సైట్లూ ఉన్నాయి. తరచూ “వాటిలో ఇవ్వబడే సమాచారాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి” అని న్యూస్వీక్ పత్రిక ప్రత్యేకంగా పిల్లల గురించి చర్చించిన సంచికలో చెప్పింది. “మీరు నమ్మదగినదనుకున్న సమాచారమే పూర్తిగా తప్పయినప్పుడు మీరు మరింత అయోమయంలో పడతారు” అని కూడా అంటుందా పత్రిక. కుటుంబాలు అవసరమైన నిర్దేశాలను పొందడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి యెహోవా చేసిన అనేక ఏర్పాట్లను బట్టి మనమెంత కృతజ్ఞులం! నమ్మకమైనవాడును బద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా చేయబడుతున్న ఏర్పాట్లన్నింటినీ మీరు సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారా?—మత్తయి 24:45-47.
10. ప్రభావవంతమైన కుటుంబ బైబిలు అధ్యయనం తల్లిదండ్రులకూ పిల్లలకూ ఎలా ప్రయోజనాన్ని చేకూర్చుతుంది?
10 కుటుంబం ప్రశాంతమైన వాతావరణంలో బైబిలును క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం చాలా అవసరం. బైబిలు అధ్యయనాన్ని మరిన్ని నిర్దేశాలనిచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా, ప్రోత్సాహాన్నిచ్చేదిగా చేయాలంటే మంచి సిద్ధపాటు అవసరం. పిల్లలు తమ భావాలను నిర్భయంగా వ్యక్తపరచేలా చేయడం ద్వారా, వాళ్ళ హృదయాల్లోనూ మనస్సుల్లోనూ ఏముందో తల్లిదండ్రులు తెలుసుకోగల్గుతారు. కుటుంబ అధ్యయనం ఎంత ప్రభావవంతంగా ఉందన్నది నిర్ణయించుకునే ఒక మార్గం, ఇంట్లో అందరూ దాని కోసం ఎదురు చూస్తున్నారా అని గమనించడమే.
11. (ఎ) తమ పిల్లలు ఏ లక్ష్యాలను పెట్టుకోవడానికి తల్లిదండ్రులు సహాయపడగలరు? (బి) జపాన్ దేశానికి చెందిన ఒక అమ్మాయి తన లక్ష్యసాధన కోసం ప్రయత్నించినప్పుడు ఏ ఫలితాలు లభించాయి?
11 అలాగే, కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపడేందుకు లేఖనాధారిత లక్ష్యాలు కూడా దోహదపడతాయి, తమ పిల్లలు అలాంటి లక్ష్యాలను పెట్టుకునేందుకు తల్లిదండ్రులు సహాయపడాలి. అలా పెట్టుకోగల సముచితమైన లక్ష్యాల్లో, బైబిలును ప్రతిరోజూ చదవడమూ, క్రమమైన సువార్త ప్రచారకులుగా మారడమూ, సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతిని సాధించడమూ ఉన్నాయి. పయినీరుగా పూర్తికాల సేవ చేయడం, బేతేలులో సేవచేయడం, మిషనరీ సేవ చేయడం అనే ఇతర లక్ష్యాలను కూడా పెట్టుకోవచ్చు. జపాన్ దేశానికి చెందిన ఆయూమీ అనే ఒక అమ్మాయి, ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు, తన తరగతిలోని ప్రతి ఒక్కరికీ సాక్ష్యమివ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ అమ్మాయి తన ఉపాధ్యాయురాలి ఆసక్తినీ, తోటి విద్యార్థుల ఆసక్తినీ రేకెత్తించేందుకు గానూ, వాళ్ళ గ్రంథాలయంలో బైబిలు ప్రచురణలను కొన్నింటిని ఉంచేందుకు అనుమతిని సంపాదించుకుంది. దాని ఫలితంగా, ప్రాథమిక పాఠశాలలో తాను చదువుకున్న ఆరు సంవత్సరాల్లో, ఆమె 13 బైబిలు అధ్యయనాలను నిర్వహించగలిగింది. ఆమె బైబిలు విద్యార్థినుల్లో ఒక విద్యార్థినీ, ఆమె కుటుంబంలోని మరితరులూ బాప్తిస్మం పొందిన క్రైస్తవులయ్యారు.
12. క్రైస్తవ కూటాల నుండి పిల్లలు ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా పొందగల్గుతారు?
12 ఆధ్యాత్మికంగా బలంగా ఆరోగ్యంగా ఉండడానికి కూటాలకు క్రమంగా హాజరు కావడం కూడా అవసరమే. ‘కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానవద్దని’ అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు ఉద్బోధించాడు. పెద్దలైనా పిన్నలైనా క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా చాలా ప్రయోజనాన్ని పొందగల్గుతారు కనుక, కూటాలను మానుకోవడాన్ని మనం ఒక అలవాటుగా చేసుకోకూడదు. (హెబ్రీయులు 10:24, 25; ద్వితీయోపదేశకాండము 31:12) పిల్లలకు శ్రద్ధగా ఆలకించడం నేర్పించాలి. కూటాలకు సిద్ధం కావడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే, వ్యాఖ్యానాలు చేస్తూ చురుగ్గా పాల్గొన్నప్పుడు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. పిల్లలు కొన్ని మాటలు చెప్పడం ద్వారా, లేదా ఒక పేరాలోని కొంత భాగాన్ని చదవడం ద్వారా వ్యాఖ్యానించడం మొదలుపెట్టవచ్చు. అయితే, వాళ్ళే జవాబులను కనుక్కొని సొంత మాటల్లో చెప్పేలా వాళ్ళకు తర్ఫీదునివ్వడం వల్ల చాలా ప్రయోజనముంటుంది. తల్లిదండ్రులారా, మీరు క్రమంగా అర్థవంతంగా వ్యాఖ్యానించడం ద్వారా మాదిరినుంచుతున్నారా? కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సొంతంగా బైబిలూ, పాటల పుస్తకమూ, లేఖనాధార చర్చ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రచురణ ప్రతీ ఉంటే మంచిది.
13, 14. (ఎ) తల్లిదండ్రులు తమ పిల్లలతో పరిచర్యలో ఎందుకు కలిసి పనిచేయాలి? (బి) క్షేత్రసేవ పిల్లలకు ప్రయోజనాన్నిచ్చేదిగా ఆనందాన్నిచ్చేదిగా చేసేదేమిటి?
13 పిల్లలు తమ యౌవన శక్తిని యెహోవా సేవకు ఉపయోగించేలా జ్ఞానవంతులైన తల్లిదండ్రులు వాళ్ళకు మార్గనిర్దేశాన్నిస్తూ, వాళ్ళు ప్రకటనా పనిని తమ జీవితాల్లో ప్రాముఖ్యమైన భాగంగా చేసుకునేందుకు సహాయపడతారు. (హెబ్రీయులు 13:15) తమ పిల్లలు ‘సిగ్గుపడనక్కరలేని పనివాళ్ళుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారిగాను’ అయ్యేందుకు తాము కావలసిన తర్ఫీదు ఇస్తున్నామా లేదా అన్నది పరిచర్యలో వాళ్ళతోపాటు సేవ చేయడం ద్వారా మాత్రమే తల్లిదండ్రులు తెలుసుకోగలరు. (2 తిమోతి 2:15) అయితే, మరి మీ విషయమేమిటి? మీరు ఒక తల్లి లేక తండ్రి అయితే, క్షేత్ర సేవ కోసం సిద్ధపడేందుకు మీ పిల్లలకు సహాయపడుతున్నారా? అలా సహాయపడడం, వాళ్ళకు పరిచర్య ఆనందకరమైనదిగా అర్థవంతమైనదిగా ఫలవంతమైనదిగా ఉండేందుకు సహాయపడుతుంది.
14 పరిచర్యలో తల్లిదండ్రులూ పిల్లలూ కలిసి పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకని? ఎందుకంటే, ఆ విధంగా, పిల్లలు తమ తల్లిదండ్రుల మంచి మాదిరులను గమనించి అనుకరించగల్గుతారు. అదే సమయంలో, తల్లిదండ్రులు పిల్లల వైఖరినీ, ప్రవర్తననూ, సామర్థ్యాన్నీ గమనించగల్గుతారు. పరిచర్య యొక్క వివిధ రంగాల్లోను మీ పిల్లలను మీతో పాటు తప్పకుండా తీసుకువెళ్ళండి. సాధ్యమైతే, ప్రతి బిడ్డకూ సాక్ష్యపు పనికి వెళ్ళేందుకు సొంత బ్యాగు ఉండేలా చూడండి, దానిని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం నేర్పండి. క్రమంగా తర్ఫీదునివ్వడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళకు పరిచర్య మీద నిజమైన మెప్పుదల కలిగించవచ్చు. ప్రకటనా పని దేవుని మీదా పొరుగువాళ్ళ మీదా ఉన్న ప్రేమను చూపించే మాధ్యమమని పిల్లలు గ్రహిస్తారు.—మత్తయి 22:37-39; 28:19, 20.
ఆధ్యాత్మికతను కాపాడుకోండి
15. కుటుంబ ఆధ్యాత్మికతను కాపాడుకోవడం ఎంతో ప్రాముఖ్యం కనుక, అలా చేయడానికి కొన్ని మార్గాలు ఏవి?
15 కుటుంబ ఆధ్యాత్మికతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. (కీర్తన 119:93) అందుకు ఒక మార్గమేమిటంటే, అవకాశమున్నప్పుడల్లా మీ కుటుంబంతో ఆధ్యాత్మిక విషయాలను చర్చించడమే. మీరు వారితో దిన వచనాన్ని చర్చిస్తారా? మీరు ‘త్రోవలో నడుస్తున్నప్పుడు’ క్షేత్ర సేవా అనుభవాలను గురించి లేదా క్రొత్త కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని విషయాలను గురించి అలవాటుగా మాట్లాడుకుంటుంటారా? జీవితంలోని ప్రతి రోజు కోసమూ, ఆయన మనకు ఇచ్చిన అనేక విషయాల కోసమూ “పండుకొనునప్పుడును లేచునప్పుడును” ప్రార్థనలో కృతజ్ఞతలు తెలపాలని మీరు గుర్తుంచుకుంటారా? (ద్వితీయోపదేశకాండము 6:6-9) మీరు చేసే ప్రతిదానిలోను దేవుని ప్రేమను ప్రతిబింబించడాన్ని మీ పిల్లలు చూసినప్పుడు, సత్యాన్ని తమ సొంతం చేసుకునేందుకు అది వాళ్ళకు సహాయపడుతుంది.
16. స్వయంగా పరిశోధనలు చేయమని పిల్లలను ప్రోత్సహించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి?
16 కొన్నిసార్లు, సమస్యలు లేదా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు విజయవంతంగా వ్యవహరించేందుకు పిల్లలకు మార్గనిర్దేశం అవసరమవుతుంది. సమస్యలు వచ్చిన ప్రతిసారీ ఏమి చెయ్యాలన్నది మీరే చెప్పే బదులు, పిల్లలు తమంతట తాము పరిశోధన చేయడానికి ప్రోత్సహించడం ద్వారా దేవుని దృక్కోణాన్ని తెలుసుకోవడమెలాగో ఎందుకు చూపించకూడదు? ‘నమ్మకమైన దాసుని’ ద్వారా ఇవ్వబడిన అన్ని ఉపకరణాలనూ ప్రచురణలనూ సద్వినియోగం చేసుకోవడమెలాగో పిల్లలకు నేర్పడం, వాళ్ళు యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది. (1 సమూయేలు 2:21బి) వాళ్ళు, పరిశోధన చేయడం ద్వారా కలిగిన ప్రయోజనాలను కుటుంబంలోని మిగతా సభ్యులతో పంచుకుంటే, కుటుంబ ఆధ్యాత్మికత మరింత పెరుగుతుంది.
యెహోవా మీద పూర్తిగా ఆధారపడండి
17. తమ పిల్లలను క్రైస్తవులుగా పెంచే విషయంలో, ఒంటరి తల్లులూ తండ్రులూ ఎందుకు నిరాశపడకూడదు?
17 తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల విషయమేమిటి? పిల్లలను పెంచే విషయంలో వాళ్ళు అదనపు సవాళ్ళను ఎదుర్కుంటారు. కానీ ఒంటరి తల్లులారా, తండ్రులారా నిరుత్సాహపడకండి! విజయం సాధించడం సాధ్యమే. దేవునిమీద నమ్మకముంచిన అనేకమంది ఒంటరి తల్లులూ తండ్రులూ ఆయన ఉపదేశాన్ని విధేయతాపూర్వకంగా అనుసరిస్తూ, పిల్లలను చక్కగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా పెంచారు. (సామెతలు 22:6) అవును, ఒంటరి తల్లులైన/తండ్రులైన క్రైస్తవులు యెహోవా మీద పూర్తిగా ఆధారపడవలసిన అవసరం ఉంది. ఆయన సహాయం అందిస్తాడన్న విశ్వాసం వాళ్ళకు తప్పకుండా ఉండాలి.—కీర్తన 121:1-3.
18. తల్లిదండ్రులు పిల్లల మానసికమైన శారీరకమైన ఏ అవసరాలకు శ్రద్ధనివ్వాలి, అయితే, దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి?
18 ‘నవ్వడానికీ, నాట్యమాడడానికీ సమయముంది’ అని జ్ఞానవంతులైన తల్లిదండ్రులు గ్రహిస్తారు. (ప్రసంగి 3:1, 4) బిడ్డ మనస్సూ శరీరమూ ఎదిగేందుకు విశ్రాంతీ, సమతుల్యతగల ఆరోగ్యకరమైన వినోద కార్యకలాపాలూ అవసరం. ఆరోగ్యకరమైన సంగీతం, ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించే పాటలను పాడడం బిడ్డ ఆరోగ్యకరమైన మనోవైఖరిని పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన మనోవైఖరి, యెహోవాతో తనకున్న సంబంధాన్ని బలపరచుకోవడంలో ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది. (కొలొస్సయులు 3:16) యౌవనం, దైవభయంగల వయోజనులుగా తయారయ్యేందుకు సిద్ధపడే సమయం కూడా. యౌవనులు అలా సంసిద్ధులై, పరదైసు భూమిపై జీవితాన్ని సదాకాలం ఆనందించవచ్చు.—గలతీయులు 6:8.
19. తమ పిల్లలను పెంచేందుకు తాము చేసే కృషిని యెహోవా ఆశీర్వదిస్తాడన్న నమ్మకాన్ని తల్లిదండ్రులు ఎందుకు కలిగివుండగలరు?
19 క్రైస్తవ కుటుంబాలన్నీ ఆధ్యాత్మికంగా బలంగా ఐక్యంగా ఉంటూ విజయవంతం కావాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఆయన వాక్యానికి విధేయత చూపేందుకు మన శాయశక్తులా ప్రయత్నిస్తే, మన ప్రయత్నాలను ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు, ఆయన ప్రేరేపణతో వచ్చిన నిర్దేశాన్ని అనుసరించడానికి అవసరమైన బలాన్ని ఆయన మనకిస్తాడు. (యెషయా 48:17; ఫిలిప్పీయులు 4:13) మీ పిల్లలకు బోధించి, తర్ఫీదునిచ్చే అవకాశం మీకిప్పుడు మాత్రమే ఉంటుందని, అది మళ్ళీ రాదని గుర్తుంచుకోండి. దేవుని వాక్యపు ఉపదేశాన్ని అనుసరించేందుకు మీ శాయశక్తులా ప్రయత్నించండి, అలాగైతే, ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాలను నిర్మించుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు.
మనమేమి నేర్చుకున్నాం?
• పిల్లలకు తర్ఫీదిచ్చేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?
• తల్లిదండ్రుల మంచి మాదిరి ఎందుకంత అవసరం?
• పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయపడే ప్రాముఖ్యమైన మార్గాలు కొన్ని ఏవి?
• కుటుంబ ఆధ్యాత్మికతను ఎలా కాపాడుకోవచ్చు?
[24, 25వ పేజీలోని చిత్రాలు]
ఆధ్యాత్మికంగా బలంగా ఉండే కుటుంబంలోని సభ్యులందరూ దేవుని వాక్యాన్ని క్రమంగా కలిసి అధ్యయనం చేస్తారు, క్రైస్తవ కూటాలకు కలిసి హాజరౌతారు, పరిచర్యలో కలిసి పాల్గొంటారు