దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
దేవుడి వాక్యం దేవదూతలు ఉనికిలో ఉన్నారనే విషయాన్ని రూఢిపరుస్తుంది. ఈ ఆత్మ ప్రాణులు పెద్ద సంఖ్యలో ఉన్నారని అది మనకు చెబుతుంది. యెహోవా దేవుడి సేవకుడైన దానియేలుకు పరలోకంలోని విషయాలను గురించిన దర్శనం కలిగింది. “వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి లక్షలకొలది సేవకులు అతని యెదుట నిలిచియుండిరి” అని తాను దర్శనంలో చూసిన దానిని గురించి ఆయన వ్రాశాడు.—దానియేలు 7:10, క్యాతలిక్ అనువాదము.
దానియేలు మాటలు చాలా మంది దూతలు ఉన్నారు అనేదాని కన్నా ఎక్కువే చెబుతున్నాయని గమనించండి. దేవదూతలు దేవుడికి పరిచారం చేస్తున్నారని కూడా ఆయన మాటలు సూచిస్తున్నాయి. వాళ్ళు ఆయన సేవకులు. దీనికి అనుగుణ్యంగా, “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి” అని కీర్తన రచయిత పాడాడు.—కీర్తన 103:20, 21.
దేవదూతలు తమ జీవితాలను భూమిమీది మానవులుగా ఆరంభించలేదు అని కూడా బైబిలు వివరిస్తుంది. యెహోవా భూమిని కూడా సృష్టించకమునుపే పరలోకంలో దూతలను సృష్టించాడు. దేవుడు ‘భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు.’—యోబు 38:4-7.
దేవదూతలు ఆత్మ ప్రాణులు—అదృశ్యులు, శక్తిమంతులు, మేధావులు. బైబిలులో ఆత్మ ప్రాణిని సూచించేటప్పుడు ఉపయోగించబడిన మాలక్ అనే హెబ్రీ పదమూ, అజ్జ్‌లొస్ అనే గ్రీక్ పదమూ “దేవదూత” అని అనువదించబడ్డాయి. ఈ పదాలు బైబిలులో దాదాపు 400 సార్లు కనిపిస్తున్నాయి. రెండింటికీ అర్థం ఒకటే, “సందేశకుడు.”
దేవదూతలు కలవడం
దేవదూతలు నిశ్చయంగా సందేశకులే. గబ్రియేలు దూత మరియకు కనిపించిన సమయాన్ని గురించిన వివరణ మీకు తెలిసే ఉండవచ్చు. ఆమె కన్యకే అయినప్పటికీ, ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడనీ, ఆయనకు యేసు అని పేరు పెట్టాలనీ ఆయన ఆమెకు చెప్పాడు. (లూకా 1:26-33) పొలంలో ఉన్న గొర్రెల కాపరులకు కూడా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. “నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు” అని ఆయన ప్రకటించాడు. (లూకా 2:8-11) అలాగే, హాగరుకు, అబ్రాహాముకు, లోతుకు, యాకోబుకు, మోషేకు, గిద్యోనుకు, యేసుకు, బైబిలులో చెప్పబడిన మరితరులకు దేవదూతలు సందేశాలను చేరవేశారు.—ఆదికాండము 16:7-12; 18:1-5, 10; 19:1-3; 32:24-30; నిర్గమకాండము 3:1, 2; న్యాయాధిపతులు 6:11-22; లూకా 22:39-43; హెబ్రీయులు 13:1.
దూతలు చేరవేసిన ఈ సందేశాలన్నీ దేవుడి ఉద్దేశాలను నెరవేర్చడంతో పొందికగా ఉన్నాయే గానీ, వాటిని అందుకున్న మానవుల ఉద్దేశాలకు సంబంధించినవి కానవసరం లేదన్నది, గమనార్హమైన విషయం. దేవదూతలు దేవుడి చిత్తం ప్రకారం, ఆయన కాలపట్టిక ప్రకారమే దేవుడి ప్రతినిధులుగా మానవులకు ప్రత్యక్షమయ్యారు. అంతేకాని మానవులు పిలువగా వచ్చినవాళ్ళు కాదు.
మనం సహాయం కోసం దేవదూతలకు మొఱ్ఱపెట్టుకోవాలా?
కష్టకాలాల్లో మనం దేవదూతలకు మొఱ్ఱపెట్టుకోవడం సమంజసమేనా? అలాగైతే, మనకు బాగా సహాయం చేయగల దూత పేరును తెలుసుకోవాలనుకుంటాం. అందువల్లే, కొన్ని వాణిజ్య పుస్తకాలు అనేక దూతల పేర్లతో సహా వాళ్ళ హోదాలను, బిరుదులను, కర్తవ్యాలను ఊహించి వ్రాసిన లిస్టును తయారు చేశాయి. “పరలోకంలోని పదిమంది అగ్రశ్రేణి దేవదూతలు” అని, “పాశ్చాత్య ప్రపంచంలో బాగా ప్రసిద్ధిగాంచిన దేవదూతలు” అని తను పిలిచే దేవదూతల ఒక లిస్టును ఒక పుస్తకం ఇస్తుంది. ఆ లిస్టు చేతికి వచ్చినప్పుడు, మీరు కళ్లు మూసుకుని, నిర్దిష్ట దేవదూత పేరును నెమ్మదిగా అనేక సార్లు పునరుచ్చరించాలనీ, గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని, ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలనీ, తర్వాత, “వాళ్ళను సంప్రదించేందుకు సిద్ధంకమ్మని” అని సలహా ఇవ్వబడుతుంది.
దానికి విరుద్ధంగా, బైబిలు నమ్మకమైన దేవదూతల్లో ఇద్దరి పేర్లను మాత్రమే ఇచ్చింది. మిఖాయేలు, గబ్రియేలు. (దానియేలు 12:1; లూకా 1:26) బైబిలులో బహుశా ఈ ఇద్దరి పేర్లు ఇవ్వబడింది, ప్రతి ఒక్క దూతకూ పేరు ఉందనీ, ప్రతి దూతా అనుపమాన ఆత్మ వ్యక్తి అనీ, వ్యక్తిత్వంలేని కేవలం బలం లేక శక్తి కాదని చూపించేందుకే కావచ్చు.
కొందరు దేవదూతలు మానవులకు తమ పేర్లను వెల్లడిచేయడానికి నిరాకరించారన్నది గమనించదగిన విషయం. యాకోబు దూతను పేరు అడిగినప్పుడు ఆ దూత చెప్పలేదు. (ఆదికాండము 32:29) దూత తనను సమీపించినప్పుడు, తను ఎవరో తెలియజేయమని యెహోషువ కోరినప్పుడు తను “యెహోవా సేనాధిపతి” అని మాత్రమే ఆ దూత చెప్పాడు. (యెహోషువ 5:14) సమ్సోను తల్లితండ్రులు దూత పేరు అడిగినప్పుడు, “నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.” (న్యాయాధిపతులు 13:17, 18) బైబిలు దూతల పేర్ల లిస్టును ఇవ్వకుండా ఉండడం ద్వారా, మనం దేవదూతలకు ఇవ్వకూడని గౌరవాన్ని, ఆరాధననూ ఇవ్వకుండా మనలను కాపాడుతుంది. మనం చూడబోతున్న ప్రకారం, మనం వాళ్ళకు విజ్ఞాపనలు చేసుకోవాలని అది మనకు నిర్దేశించడం కూడా లేదు.
దేవుడికి మొఱ్ఱపెట్టుకోండి
ఆత్మ మండలం గురించి మనం తెలుసుకోవలసిన విషయాలనన్నింటినీ బైబిలు మనకు చెబుతుంది. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకు . . . ప్రయోజనకరమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:16, 17) మనం అనేక దేవదూతల పేర్లను తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నట్లయితే, తన వాక్యమైన బైబిలులో ఆయన వాళ్ళ పేర్లను బయలుపరచేవాడే. మనం దేవదూతలను ఎలా సంప్రదించాలి, ప్రార్థనలో వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే విషయంలో మనకు నిర్దేశాలు ఇవ్వాలని దేవుడు కోరుకున్నట్లయితే, ఆయన తన లేఖనాల్లో వాటిని ఇచ్చి ఉండేవాడే.
బదులుగా, “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; . . . మీరీలాగు ప్రార్థనచేయుడి,—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని యేసు నేర్పించాడు. (మత్తయి 6:6, 9) లేఖనాధార దృష్టి ఇదే: మనం మొఱ్ఱపెట్టుకోవలసింది లేదా ప్రార్థన చేయవలసింది దేవదూతలకు కాదు. మనం ప్రార్థనాపూర్వకంగా సమీపించవలసింది దూతల సృష్టికర్తయైన దేవుడ్నే. ఆయన నామము మర్మం కాదు. అది వెల్లడయ్యేందుకు దార్శనికుడి అవసరం లేదు. దైవిక నామాన్ని మరుగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ, అది బైబిలులో 7,000 కన్నా ఎక్కువ సార్లే కనిపిస్తుంది. “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక” అని కీర్తన రచయిత పరలోక తండ్రిని గురించి పాడిన పాట అందుకు ఉదాహరణ.—కీర్తన 83:18.
మనం యెహోవా దేవుడ్ని ప్రార్థనలో సముచితమైన విధంగా సమీపిస్తే, మన ప్రార్థనను వినలేనంత బిజీగా ఆయన ఎన్నడూ ఉండడు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని బైబిలు మనకు అభయమిస్తోంది.—2 దినవృత్తాంతములు 16:9.
దేవదూతలు, వాళ్ళ నైతిక విలువలు
మాధ్యమాల్లో తరచూ చిత్రించబడేదానికి విరుద్ధమైన విషయమేమిటంటే, దేవదూతలు ప్రజలకు తీర్పు విధించరన్నదే. అది సముచితమైనది. ఎందుకంటే, మానవులను తీర్పు తీర్చే అధికారం దేవదూతలకు ఇవ్వబడలేదు. యెహోవా “తీర్పుతీర్చుటకు సర్వాధికారము”ను తన ‘కుమారుడైన’ యేసుక్రీస్తుకు “అప్పగించి”నప్పటికీ, యెహోవాయే “అందరి న్యాయాధిపతి.” (హెబ్రీయులు 12:23; యోహాను 5:23) అయినప్పటికీ, మనమెలా జీవిస్తున్నామనే విషయాన్ని దేవదూతలు అస్సలు పట్టించుకోరనుకోవడం పొరపాటు. “అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని” యేసు చెప్పాడు.—లూకా 15:10.
అయితే, దేవదూతలు కేవలం వీక్షకులు మాత్రమే కాదు. గత కాలాల్లో, వాళ్ళు దేవుడి తీర్పులను అమలు చేస్తూ, శిక్ష వేసేవారిగా కూడా పనిచేశారు. ఉదాహరణకు, ప్రాచీన ఐగుప్తీయులకు వ్యతిరేకంగా దేవుడు దేవదూతలను ఉపయోగించాడు. కీర్తన 78:49, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం ప్రకారం, “వాళ్ళ మీదకి ఆయన తన కోపాగ్నీ, ఆగ్రహం, చిరాకు, బాధ పంపాడు. విపత్తు కలిగించే దేవదూతల గుంపును పంపాడు.” అలాగే, ఒక్కరాత్రిలోనే ఒక్క దేవదూత 1,85,000 అష్షూరు సైనికులను నాశనం చేశాడని బైబిలు నివేదిస్తుంది.—2 రాజులు 19:35.
అలాగే, భవిష్యత్తులో కూడా, దేవుడి నీతియుక్తమైన ప్రమాణాలకు అనుగుణ్యంగా ఉండడానికి నిరాకరిస్తూ, ఇతరుల క్షేమానికి ఒక బెదిరింపుగా ఉండేవారిని దేవదూతలు నిర్మూలం చేస్తారు. యేసు, “తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేస్తాడు.—2 థెస్సలొనీకయులు 1:6.
ఆ విధంగా, దేవుడి నమ్మకమైన దేవదూతలు దేవుడి నిర్దేశాలను అనుసరిస్తూ, ఆయన నీతియుక్తమైన ప్రమాణాలను పాటిస్తూ ఆయన చిత్తాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారని లేఖనాలు చూపిస్తున్నాయి. దేవుడి దూతలు మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటున్నట్లయితే, మనం దేవుడి చిత్తమేమిటో తెలుసుకుని, దానిని చేయడానికి ఎంతో ఆతురతతో ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది.
సంరక్షక దేవదూతలు
దేవదూతలు ప్రజలపై శ్రద్ధ చూపిస్తారా, వాళ్ళకు రక్షణనిస్తారా? “వీరందరు [దేవదూతలందరూ] రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?” అని అపొస్తలుడైన పౌలు ప్రశ్నించాడు. (హెబ్రీయులు 1:14) పౌలు ప్రశ్నకు జవాబు అవును అన్నది స్పష్టం.
బబులోను రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమ ఎదుట మోకరించడానికి నిరాకరించినందువల్ల, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీయులు అత్యంత తీవ్రమైన వేడిగల అగ్నిగుండంలోకి విసిరివేయబడ్డారు. అయినప్పటికి, దేవుడి నమ్మకస్థులైన ఆ సేవకులకు నిప్పు అంటుకోనే లేదు. రాజు అగ్నిగుండంలోకి చూసినప్పుడు, ఆయన ‘నలుగురు మనుష్యులను’ చూశాడు, “నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని” చెప్పాడు. (దానియేలు 3:25) కొన్ని సంవత్సరాల తర్వాత, దానియేలు తన విశ్వాస్యత మూలంగా సింహాల గుహలో పడవేయబడ్డాడు. ఆయన కూడా ఏ హానీ కలగకుండా తప్పించుకుని, ‘నా దేవుడు తన దూతనంపించి, సింహములు నాకు ఏ హానియు చేయకుండ వాటి నోళ్లు మూయంచాడు’ అని ప్రకటించాడు.—దానియేలు 6:22.
సా.శ. మొదటి శతాబ్దంలో క్రీస్తు అనుచరుల సంఘం స్థాపించబడినప్పుడు దేవదూతలు మళ్ళీ ప్రత్యక్షమై, అపొస్తలులను చెరసాల నుండి విముక్తులను చేశారు. (అపొస్తలుల కార్యములు 5:17-24; 12:6-12) పౌలు సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో పడినప్పుడు, అతడు రోమ్‌కు సురక్షితంగా చేరుకుంటాడని ఒక దూత ఆయనకు అభయమిచ్చాడు.—అపొస్తలుల కార్యములు 27:13-24.
నిజంగానే దేవుడి అదృశ్య దూత గణాలు ఉన్నాయని, అవి ఎలీషాకూ, ఆయన సహాయకుడికీ చేసినట్లుగానే నేడు కూడా భద్రతనివ్వగలవని యెహోవా దేవుడి ప్రస్తుత దిన సేవకులు పూర్తిగా నమ్ముతున్నారు. (2 రాజులు 6:15-17) నిజానికి, “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును.”—కీర్తన 34:7; 91:11.
దేవదూతలు మోసుకొచ్చే సందేశం
యెహోవా దేవుడ్ని సేవించేవారి క్షేమం విషయమై దేవదూతలు చాలా శ్రద్ధ చూపిస్తారు గనుక, ప్రజలు దేవుడ్ని గురించీ, ఆయన ఉద్దేశాన్ని గురించీ పఠించేలా చూడడంలో కూడా వాళ్ళు ఇమిడి ఉన్నారు. “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు—మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి . . . అని గొప్ప స్వరముతో చెప్పెను” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు.—ప్రకటన 14:6, 7.
ఈ “నిత్య సువార్త” ఏమిటో తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే, యెహోవాసాక్షులను అడగండి. వాళ్ళు దానిని మీతో పంచుకోవడానికి సంతోషిస్తారు.
[7వ పేజీలోని చిత్రాలు]
ఒక దూత నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుతున్నాడు. దానిని గురించి తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారా?