కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w06 1/15 పేజీలు 4-7
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవదూతలు బలపర్చి, కాపాడతారు
  • దేవదూతలు దేవుని సందేశాలను చేరవేస్తారు
  • దేవదూతలు దేవుని తీర్పులను అమలుచేస్తారు
  • దయ్యాలు​—ఎవరు?
  • మీరేమి చేయాలి?
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవదూతలు అంటే ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుని దూతలు సహాయం చేస్తారు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
w06 1/15 పేజీలు 4-7

దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?

దేవుని దూతల కుటుంబానికి సంబంధించి తనకు వచ్చిన దర్శనాన్ని వర్ణిస్తూ ప్రవక్తయైన దానియేలు ఇలా వ్రాశాడు: ‘దేవదూతలు వేవేలకొలది దేవునికి పరిచారకులుగా ఉండిరి; కోట్లకొలది ఆయన ఎదుట నిలిచిరి.’ (దానియేలు 7:10) దేవదూతలను సృష్టించడంలో దేవుని సంకల్పమేమిటో ఈ వచనం వెల్లడిచేస్తోంది. వారు ఆయనకు పరిచారం చేస్తూ, ఆయన ఉపదేశాలను నెరవేర్చడానికి సిద్ధంగా నిలబడి ఉండాలి.

దేవుడు మానవుల సంబంధంగా కొన్ని పనులు చేయడానికి దేవదూతలను ఉపయోగించుకుంటాడు. తన ప్రజలను బలపర్చడానికి, వారిని కాపాడడానికి, మానవులకు సందేశాలు పంపించడానికి, దుష్టులపై తన తీర్పును అమలు చేయడానికి దేవుడు వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడో మనం పరిశీలిద్దాం.

దేవదూతలు బలపర్చి, కాపాడతారు

ఆత్మప్రాణులు భూమి, మొదటి మానవులు సృష్టించబడడం చూసినప్పటి నుండి వాళ్లు మానవజాతి విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచారు. యేసుక్రీస్తు తన మానవపూర్వ ఉనికిలో జ్ఞానస్వరూపిగా మాట్లాడుతూ ఇలా అన్నాడు: “నరులను చూచి ఆనందించుచునుంటిని.” (సామెతలు 8:31) “దేవదూతలు” క్రీస్తును గురించిన వాస్తవాల్లోకి, దేవుని ప్రవక్తలకు వెల్లడి చేయబడిన భవిష్యత్తులోకి “తొంగిచూడ గోరుచున్నారు” అని బైబిలు మనకు తెలియజేస్తోంది.​—1 పేతురు 1:11, 12.

కాలం గడుస్తుండగా, మానవ కుటుంబంలో అనేకులు తమ ప్రేమగల సృష్టికర్తను సేవించడం లేదని దేవదూతలు గమనించారు. నమ్మకమైన దేవదూతలను ఇది ఎంతగా నొప్పించివుంటుందో కదా! మరోవైపున, ఒక పాపి పశ్చాత్తాపపడి యెహోవాను వేడుకున్నప్పుడు, “దేవుని దూతలయెదుట సంతోషము కలుగును.” (లూకా 15:10) దేవుని సేవకుల సంక్షేమం విషయంలో దేవదూతలకు ప్రగాఢమైన శ్రద్ధ ఉంది, పైగా భూమ్మీదున్న తన నమ్మకమైన సేవకులను బలపర్చి, వారిని కాపాడడానికి యెహోవా అనేకసార్లు దేవదూతలను ఉపయోగించుకున్నాడు. (హెబ్రీయులు 1:14) కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

ఇద్దరు దేవదూతలు నీతిమంతుడైన లోతు, ఆయన కుమార్తెలు దుష్ట నగరాలైన సొదొమ గొమొఱ్ఱాల నాశనాన్ని తప్పించుకోవడానికి వారి చెయ్యిపట్టుకుని వారిని ఆ ప్రాంతంలో నుండి బయటికి తీసుకురావడం ద్వారా వారు తప్పించుకోవడానికి సహాయం చేశారు.a (ఆదికాండము 19:1, 15-26) శతాబ్దాల తర్వాత, ప్రవక్తయైన దానియేలు సింహాల గుహలో వేయబడినప్పటికీ ఆయనకు ఏ హానీ జరగలేదు. ఎందుకు? ఆయనిలా చెప్పాడు: ‘నా దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు.’ (దానియేలు 6:22) దేవదూతలు యేసు భూపరిచర్య ఆరంభంలో ఆయనకు సహాయం చేశారు. (మార్కు 1:13) యేసు మరణానికి కొంచెం ముందు, ఒక దేవదూత ఆయనకు కనిపించి, “ఆయనను బలపరచెను.” (లూకా 22:43) జీవితంలోని ఆ విషమ ఘడియల్లో దేవదూతల సహాయం యేసుకు ఎంతటి ఆశీర్వాదంగా ఉండి ఉండవచ్చో కదా! అంతేగాక, ఒక దేవదూత అపొస్తలుడైన పేతురును చెరసాల నుండి తప్పించాడు.​—అపొస్తలుల కార్యములు 12:6-11.

దేవదూతలు నేడు మనల్ని కాపాడతారా? యెహోవాను మనం ఆయన వాక్య ప్రకారం ఆరాధిస్తే, ఆయన శక్తిమంతమైన, అదృశ్య దేవదూతలు మనల్ని కాపాడతారని మనకు హామీ ఇవ్వబడింది. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును.”​—కీర్తన 34:7.

అయితే, దేవదూతలు ప్రాముఖ్యంగా దేవుని సేవలో ఉన్నారే గానీ మానవుల సేవలో కాదని మనం గుర్తించాలి. (కీర్తన 103:20, 21) వారు దేవుని నిర్దేశానికే ప్రతిస్పందిస్తారు గానీ మానవుల ఆజ్ఞలకు, విన్నపాలకు కాదు. కాబట్టి, మనం సహాయం అర్థించాల్సింది యెహోవా దేవుణ్ణే గానీ దేవదూతలను కాదు. (మత్తయి 26:53) అయితే మనం దేవదూతలను చూడము కాబట్టి ప్రజలకు వివిధ విషయాల్లో సహాయం చేయడానికి దేవుడు వారిని ఎంతమేరకు ఉపయోగించుకుంటున్నాడనేది మనం నిశ్చయించలేం. కానీ యెహోవా “తనయెడల యథార్థహృదయము గలవారిని బలప[రుస్తాడని]” మనకు తెలుసు. (2 దినవృత్తాంతములు 16:9; కీర్తన 91:11) అలాగే “[దేవుని] చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను” హామీ మనకు ఉంది.​—1 యోహాను 5:14.

మనం దేవునికి మాత్రమే ప్రార్థించాలని, ఆయనను మాత్రమే ఆరాధించాలని కూడా లేఖనాలు చెబుతున్నాయి. (నిర్గమకాండము 20:3-5; కీర్తన 5:1, 2; మత్తయి 6:9) మనమలా చేయాలని నమ్మకమైన దేవదూతలు ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను ఒక దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ ఆత్మప్రాణి ఆయనను మందలిస్తూ ఇలా అన్నాడు: “వద్దు సుమీ. . . . దేవునికే నమస్కారము చేయుము.”​—ప్రకటన 19:10.

దేవదూతలు దేవుని సందేశాలను చేరవేస్తారు

“దూత” అనే పదానికి “సందేశకుడు” అనే భావం ఉంది, దేవదూతలు దేవుని సేవ చేసే మరో మార్గం అదే, వారు మానవులకు ఆయన సందేశకులుగా ఉన్నారు. ఉదాహరణకు, ‘గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరికి దేవుని చేత పంపబడెను.’ ఎందుకు? మరియ అనే ఒక యౌవనస్థురాలు తాను కన్యకగానే ఉన్నప్పటికీ గర్భం ధరించి యేసు అనే కుమారుని కంటుందని ఆమెకు చెప్పడానికి పంపబడ్డాడు. (లూకా 1:26-31) పొలాల్లో ఉన్న గొఱ్ఱెలకాపరులకు “ప్రభువైన క్రీస్తు” జన్మించాడని తెలియజేయడానికి కూడా ఒక దేవదూత పంపించబడ్డాడు. (లూకా 2:8-11) అలాగే, దేవదూతలు దేవుని సందేశాలను అబ్రాహాముకు, మోషేకు, యేసుకు, బైబిల్లోని ఇతరులకు అందజేశారు.​—ఆదికాండము 18:1-5, 10; నిర్గమకాండము 3:1, 2; లూకా 22:39-43.

దేవదూతలు నేడు దేవుని సందేశకులుగా ఎలా సేవ చేస్తున్నారు? ఈ విధానాంతం రాకముందు తన అనుచరులు చేస్తారని యేసు ముందే చెప్పిన పనిని పరిశీలించండి. ఆయనిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:3, 14) ప్రతీ సంవత్సరం, యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్త ప్రకటించడంలో వంద కోట్లకంటే ఎక్కువ గంటలు గడుపుతున్నారు. ఈ పనిలో దేవదూతలు కూడా పాల్గొంటున్నారని మీకు తెలుసా? అపొస్తలుడైన యోహాను తనకు కలిగిన దర్శనం గురించి ఇలా తెలియజేశాడు: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” (ప్రకటన 14:6, 7) దేవదూతలు మానవుల పక్షాన నేడు చేస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన పనిని ఈ లేఖనం నొక్కిచెబుతోంది.

యెహోవాసాక్షులు తమ ఇంటింటి ప్రకటనా పనిని నిర్వర్తిస్తుండగా దేవదూతల నిర్దేశం తమకు ఉందనే నిదర్శనాన్ని చూస్తున్నారు. తరచూ వీరు, దేవుని సంకల్పాలను అర్థం చేసుకోవడానికి తమకు ఎవరైనా సహాయం చేయాలని ప్రార్థిస్తున్న వ్యక్తులను కలుసుకుంటారు. దేవదూతల నిర్దేశం, సాక్షుల చొరవ కారణంగా ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది యెహోవా గురించి తెలుసుకోగలుగుతున్నారు. దేవదూతల నిర్దేశం క్రింద జరుగుతున్న ఈ జీవదాయక పని నుండి మీరు ప్రయోజనం పొందుదురు గాక.

దేవదూతలు దేవుని తీర్పులను అమలుచేస్తారు

మానవులకు తీర్పుతీర్చే అధికారం దేవదూతలకు ఇవ్వబడకపోయినప్పటికీ, వారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు. (యోహాను 5:22; హెబ్రీయులు 12:22, 23) గత కాలాల్లో వారు దేవుని తీర్పులను అమలుచేశారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులను బంధీలుగా ఉంచిన ప్రాచీన ఐగుప్తీయులకు వ్యతిరేకంగా దేవుడు తాను చేస్తున్న పోరాటంలో దేవదూతలను ఉపయోగించుకున్నాడు. (కీర్తన 78:49) “యెహోవా దూత” ఒకే రాత్రిలో, దేవుని ప్రజల శత్రువుల శిబిరంలోని ఒక లక్ష ఎనభై ఐదు వేలమంది సైనికులను హతమార్చాడు.​—2 రాజులు 19:35.

భవిష్యత్తులోనూ దేవదూతలు దేవుని ప్రతికూల తీర్పును అమలుచేస్తారు. యేసు ‘తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికి, సువార్తకు లోబడనివారికి ప్రతిదండన చేయడానికి’ వస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6) అయితే ఆ నాశనం, ఇప్పుడు దేవదూతల మద్దతుతో భూ వ్యాప్తంగా ప్రకటించబడుతున్న సందేశానికి ప్రతిస్పందించని వారిమీదికి మాత్రమే తీసుకురాబడుతుంది. దేవుణ్ణి వెదకుతూ, లేఖన బోధల అనుసారంగా జీవించేవారికి ఏ హానీ జరుగదు.​—జెఫన్యా 2:3.

ఎల్లప్పుడూ దేవుని నిర్దేశాలను నెరవేర్చే నమ్మకమైన దేవదూతలనుబట్టి మనమెంత కృతజ్ఞతతో ఉండాలో కదా! యెహోవా భూమిపైనున్న తన నమ్మకమైన సేవకులకు సహాయం చేయడానికీ వారిని కాపాడడానికీ దేవదూతలను ఉపయోగించుకుంటాడు. ఇది మనకు ప్రాముఖ్యంగా ఓదార్పుకరమైనది, ఎందుకంటే మనకు హాని చేయాలని చూసే, దయ్యాలని పిలువబడే ప్రమాదకరమైన ఆత్మప్రాణులు ఉన్నారు.

దయ్యాలు​—ఎవరు?

ఏదెనులో సాతాను హవ్వను మోసగించిన తర్వాతి 15 శతాబ్దాల్లో, హేబెలు, హనోకు, నోవహు వంటి కొద్దిమంది నమ్మకమైనవారు మినహాయించి మానవులందరినీ దేవుని నుండి దూరం చేయడంలో అపవాదియగు సాతాను విజయం సాధించినట్లు దేవుని దూతల కుటుంబం గమనించింది. (ఆదికాండము 3:1-7; హెబ్రీయులు 11:4, 5, 7) కొంతమంది దేవదూతలు కూడా సాతానుకు లొంగిపోయారు. బైబిలు వారిని, “నోవహు దినములలో” అవిధేయులైన ఆత్మలని పేర్కొంటోంది. (1 పేతురు 3:19, 20) వారి అవిధేయత ఎలా స్పష్టమయ్యింది?

నోవహు కాలంలో తిరుగుబాటుదారులైన దేవదూతలు అనిర్దిష్ట సంఖ్యలో, దేవుని పరలోక కుటుంబంలోని తమ స్థానాన్ని వదిలి మానవ శరీరాలను దాల్చి భూమిపైకి వచ్చారు. ఎందుకు? వారు స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలనే కోరికను వృద్ధి చేసుకున్నారు. దానితో వారు, దౌర్జన్యపూరిత బలాత్కారులుగా తయారైన, నెఫీలులని పిలువబడిన వారికి తండ్రులయ్యారు. అంతేగాక ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పదిగా, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదిగా’ తయారైంది. అయితే, మానవుల భ్రష్టత్వం అలాగే కొనసాగడానికి యెహోవా దేవుడు అనుమతించలేదు. ఆయన భూ వ్యాప్త జలప్రళయం రప్పించడంతో, అది నెఫీలులతో సహా దుష్ట మానవులందరినీ తుడిచివేసింది. అయితే దేవుని నమ్మకమైన సేవకులు మాత్రమే సజీవంగా మిగిలిన మానవులు.​—ఆదికాండము 6:1-7, 17; 7:23.

తిరుగుబాటుదారులైన ఆ దూతలు జలప్రళయం సమయంలో నాశనాన్ని తప్పించుకున్నారు. వారు తమ మానవ శరీరాలను విడిచిపెట్టి, ఆత్మప్రాణులుగా ఆత్మ సామ్రాజ్యానికి తిరిగివెళ్లారు. ఆ తర్వాత, వారు దయ్యాలుగా పేర్కొనబడ్డారు. వారు, “దయ్యములకు అధిపతి” అని పిలువబడిన అపవాదియైన సాతాను పక్షం వహించారు. (మత్తయి 12:24-27) దయ్యాలు తమ పాలకుడిలాగే మానవుల ఆరాధనను కాంక్షిస్తారు.

దయ్యాలు ప్రమాదకరమైనవారు, అయినా మనం వారికి భయపడనవసరం లేదు. వారి శక్తి పరిమితమైనది. అవిధేయులైన దూతలు పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడు, వారు దేవుని నమ్మకమైన దేవదూతల కుటుంబంలోకి తిరిగి అనుమతించబడలేదు. బదులుగా, దేవుని నుండి ఎలాంటి ఆధ్యాత్మిక వెలుగు, భవిష్యత్తు కోసం ఎలాంటి నిరీక్షణా లేకుండా చేయబడ్డారు. నిజానికి వారు చీకటిగల బిలము అని పిలువబడే అధ్యాత్మిక అంధకార స్థితికి పరిమితం చేయబడ్డారు. (2 పేతురు 2:4) వారు ఆధ్యాత్మిక అంధకారంలోనే ఉండిపోయే విధంగా యెహోవా వారిని “నిత్యపాశములతో” నిర్బంధించాడు. అంతేగాక, వారిప్పుడు మానవ శరీరాలను దాల్చలేని స్థితిలో ఉన్నారు.​—యూదా 6.

మీరేమి చేయాలి?

దయ్యాలు ఇప్పటికీ మానవులపై ప్రభావం చూపిస్తున్నారా? చూపిస్తున్నారు, వారి పాలకుడైన అపవాదియగు సాతాను ఉపయోగించేలాంటి “తంత్రములను” ఆశ్రయించడం ద్వారా వారు అలా చేస్తున్నారు. (ఎఫెసీయులు 6:11, 12) అయితే దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా, మనం దయ్యాలకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడవచ్చు. అంతేగాక, దేవుణ్ణి ప్రేమించేవారు శక్తిమంతమైన దేవదూతల కాపుదల క్రిందకు వస్తారు.

మీరు లేఖనాల్లో తెలియజేయబడిన దేవుని నియమాల గురించి తెలుసుకుని, వాటి ప్రకారం చర్య తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా! మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించడం ద్వారా లేక ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయడం ద్వారా బైబిలు బోధల గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు. మీకు అనుకూలమైన సమయంలో, ఉచితంగా మీతో బైబిలు అధ్యయనం చేయడానికి యెహోవాసాక్షులు ఎంతో సంతోషిస్తారు.

[అధస్సూచి]

a బైబిలులో, దేవదూతలు పురుషులుగా వర్ణించబడ్డారు. మానవులకు కనిపించినప్పుడల్లా వాళ్ళు పురుషుల్లానే కనిపించారు.

[6వ పేజీలోని బాక్సు]

దేవదూతలు​—వారెలా సంస్థీకరించబడ్డారు?

యెహోవా తన దేవదూతల కుటుంబాన్ని క్రింది విధంగా సంస్థీకరించాడు:

అత్యధిక శక్తి, అధికారంగల దేవదూత ప్రధానదూతయైన మిఖాయేలు లేక యేసుక్రీస్తు. (1 థెస్సలొనీకయులు 4:16; యూదా 9) సెరాపులు, కెరూబులు, ఇతర దేవదూతలు ఆయన క్రింద ఉన్నారు.

సెరాపులు దేవుని ఏర్పాటులో చాలా ఉన్నతస్థానంలో ఉన్నారు. వారు దేవుని సింహాసనం వద్ద సహాయకులుగా సేవచేస్తున్నారు. దేవుని పరిశుద్ధతను ప్రకటించడం, ఆయన ప్రజలను ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచడం వారి పనిలో భాగం.​—యెషయా 6:1-3, 6, 7.

కెరూబులు యెహోవా దేవుని సింహాసనం వద్ద ఉండి, ఆయన సర్వాధికారాన్ని సమర్థిస్తారు.​—కీర్తన 80:1; 99:1; యెహెజ్కేలు 10:1, 2.

ఇతర దేవదూతలు యెహోవాకు ప్రతినిధులు, వారు దైవిక చిత్తాన్ని నెరవేరుస్తారు.

[4వ పేజీలోని చిత్రం]

దేవదూతలు లోతును, ఆయన కుమార్తెలను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళారు

[5వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన యోహాను దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నించినప్పుడు, “వద్దు సుమీ” అని ఆయనకు చెప్పబడింది

[6వ పేజీలోని చిత్రం]

దేవదూతలు దేవుని తీర్పును అమలుచేస్తారు

[7వ పేజీలోని చిత్రం]

దేవదూతల మార్గనిర్దేశం క్రింద జరుగుతున్న ప్రకటనా పని నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి