ఇతరులు మీ ఉపదేశాన్ని అంగీకరిస్తారా?
మంచి ఉపదేశం సరైన విధంగా ఇస్తే ఎల్లప్పుడూ చక్కని ఫలితాలు వస్తాయి. అది నిజమా? కాదు! సమర్థులైన ఉపదేశకులు ఇచ్చిన శ్రేష్ఠమైన ఉపదేశాన్ని కూడా అలక్ష్యం చేయడమో లేక నిరాకరించడమో తరచూ జరుగుతూ ఉంటుంది.—సామెతలు 29:19.
తన తమ్ముడైన హేబెలుపై ద్వేషాన్ని పెంచుకున్న కయీనుకు యెహోవా ఉపదేశం ఇచ్చినప్పుడు అదే జరిగింది. (ఆదికాండము 4:3-5) అది కయీనును ప్రమాదంలో పడవేయగలదని దేవుడికి తెలుసు కనుకనే, “నీవెందుకు కోపంగా ఉన్నావు? మీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకుంటుంది. కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి.”—ఆదికాండము 4:6, 7, పరిశుద్ధ బైబల్.
కయీను తన తమ్ముడిపై కోపాన్ని అలాగే పెంచుకుంటే, పాపం కయీనుపై పడడానికి పొంచి ఉందని చెబుతూ పాపాన్ని, మాంసాహారి జంతువుతో యెహోవా పోల్చాడు. (పోల్చండి యాకోబు 1:14, 15.) కయీను తన దృక్పథాన్ని మార్చుకునేందుకు, వినాశనాన్ని తీసుకువచ్చే పనిని చేసే బదులు, ‘మంచి పనులు చేయడానికి’ అప్పటికీ సమయం ఉండింది. విచారకరమైన విషయమేమిటంటే, కయీను ఆ ఉపదేశాన్ని అనుసరించలేదు. ఆయన యెహోవా ఉపదేశాన్ని నిరాకరించి, ఘోరమైన పర్యవసానాలను అనుభవించాడు.
కొందరు ఎలాంటి ఉపదేశానికైనా కోపపడతారు, నిరాకరిస్తారు. (సామెతలు 1:22-30) ఉపదేశం నిరాకరించబడిందంటే, అది ఉపదేశమిచ్చిన వ్యక్తి లోపమే అయ్యుంటుందా? (యోబు 38:2) ఉపదేశమిచ్చే మీరు ఇతరులు మీ ఉపదేశాన్ని అంగీకరించడం కష్టమయ్యేలా చేస్తున్నారా? మానవ అపరిపూర్ణత దానిని నిజంగా ప్రమాదకరం చేస్తుంది. బైబిలు సూత్రాలను జాగ్రత్తగా అనుసరించడం ద్వారా అలాంటిది జరిగే అవకాశాన్ని మీరు తగ్గించగల్గుతారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
‘మృదువుగా పూర్వస్థితికి తీసుకురండి’
“సహోదరులారా, ఒకరు తనకు తెలియక ముందు ఏదైనా తప్పుటడుగు వేసినప్పటికీ, ఆధ్యాత్మిక యోగ్యతగలవారైన మీరు మీలో ప్రతి ఒక్కరు తాము కూడా ప్రలోభంలో పడకుండా మీ విషయాన్ని మీరు చూసుకుంటూ, మృదువుగా అలాంటి వ్యక్తిని పూర్వస్థితికి తీసుకురండి.” (గలతీయులు 6:1, NW) “ఆధ్యాత్మిక యోగ్యతలు”గల వాళ్ళు, “తనకు తెలియక ముందు ఒక తప్పుటడుగు వేసిన” క్రైస్తవుడిని పూర్వస్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఏ మాత్రం యోగ్యతలేని వ్యక్తులే ఉపదేశం ఇవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు కొన్నిసార్లు కనిపిస్తుంది. కనుక, ఇతరులకు ఉపదేశమివ్వడానికి తొందరపడకండి. (సామెతలు 10:19; యాకోబు 1:19; 3:1) ఈ పని చేయడానికి ఆధ్యాత్మికంగా యోగ్యులైనవారు ముఖ్యంగా సంఘపెద్దలే. నిజమే, ఒక సహోదరుడు ప్రమాదకరమైన మార్గంలో నడవడాన్ని చూసినప్పుడు పరిపక్వతగల ఏ సహోదరుడైనా అతడికి హెచ్చరికను ఇవ్వాలి.
మీరు సలహాను గానీ, ఉపదేశాన్ని గానీ ఇస్తున్నట్లయితే, మీరు చెప్పేది దైవిక బుద్ధిపై ఆధారపడినదేకానీ, మానవ సిద్ధాంతాలపైనా, తత్త్వశాస్త్రాలపైనా ఆధారపడినది కాదని నిశ్చయపరచుకోండి. (కొలొస్సయులు 2:8) తను వంటలో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవేననీ, ఏదీ విషపూరితంగా మారలేదనీ నిశ్చయపరచుకుని శ్రద్ధగా వంట చేసే వ్యక్తిలా ఉండండి. మీ ఉపదేశం వ్యక్తిగత అభిప్రాయంపైన కాక, దేవుడివాక్యంపైనే దృఢంగా ఆధారపడినదై ఉండేలా చూసుకోండి. (2 తిమోతి 3:16, 17) ఈ విధంగా చేయడం ద్వారా, మీ ఉపదేశం ఎవరినీ గాయపరచదనే నిశ్చయతతో ఉండగలుగుతారు.
తప్పు చేస్తున్న వ్యక్తికి ఇష్టంలేకున్నా బలవంతంగా అతడిని మార్చాలని కాక, అతడిని “పూర్వస్థితికి తీసుకురావాలి” అన్నదే ఉపదేశపు లక్ష్యమై ఉండాలి. గ్రీక్ భాషలో “పూర్వస్థితికి తీసుకురావాలి” అనేందుకు ఉపయోగించబడిన పదం, ఒక ఎముక స్థానం తప్పినప్పుడు, మరింకా ఎక్కువ హాని కలుగకుండా ఉండేందుకు, దానిని దాని స్థానంలో తిరిగి అమర్చి పెట్టే ప్రక్రియను తెలిపే పదానికి సంబంధించినది. ఒక నిఘంటుకారుడైన డబ్ల్యు. ఇ. వైన్ అభిప్రాయం ప్రకారం, ఆ పదం “ఆ ప్రక్రియలో ఓపికా, దీక్షా అవసరం” అని కూడా సూచిస్తుంది. రోగి అనవసరంగా శారీరక వేదనలను అనుభవించవలసివచ్చే పరిస్థితిని నివారించేందుకు డాక్టర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరతను గురించీ, ఆయనకుండవలసిన నిపుణతను గురించీ ఆలోచించండి. అలాగే, ఎవరికైతే ఉపదేశమిస్తున్నారో ఆ వ్యక్తిని నొప్పించకుండా ఉండేందుకు ఉపదేశకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఉపదేశమివ్వమని అడిగినప్పుడు కూడా అది చాలా కష్టమే. ఉపదేశమివ్వమని అడగకపోయినా ఇవ్వవలసి ఉన్నప్పుడు ఇంకా గొప్ప నిపుణతా, నేర్పూ అవసరమౌతాయి.
మీరు ఎవరినైనా దూరం చేసుకుంటే మీరు వారిని “పూర్వస్థితికి తీసుకురాలేరన్నది” ఖచ్చితం. దానిని నివారించేందుకు, “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును [“మృదు స్వభావమును,” NW], దీర్ఘశాంతమును” చూపించవలసిన అవసరముందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. (కొలొస్సయులు 3:12) డాక్టర్ ఓర్పును చూపించకుండా, అనవసరంగా కఠినంగా వ్యవహరిస్తే, రోగి ఆయన సలహాను లక్ష్యపెట్టడు, అవసరమైన చికిత్స కోసం ఆయన దగ్గరికి మళ్ళీ ఎప్పుడూ వెళ్ళడు కూడా.
దానర్థం ఉపదేశం ఖచ్చితమైనదిగా ఉండకూడదని కాదు. ఆసియాలోని ఏడు సంఘాలకు తాను ఉపదేశమిచ్చినప్పుడు యేసు ఖచ్చితంగానే ఉన్నాడు. (ప్రకటన 1:4; 3:1-22) వాళ్ళు విని, ఆచరణలో పెట్టవలసిన చాలా సూటైన ఉపదేశాన్ని ఆయన వాళ్ళకు ఇచ్చాడు. తన తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన స్వభావాన్నే ప్రతిబింబిస్తూ, యేసు తన ఖచ్చితత్వాన్ని ఎల్లప్పుడూ, సానుభూతి, దయ వంటి గుణాలతో సమతుల్యంగా ఉంచేవాడు.—కీర్తన 23:1-6; యోహాను 10:7-15.
కృపాసహితంగా ఉపదేశించండి
“ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (ఇటాలిక్కులు మావి.) (కొలొస్సయులు 4:6) ఉప్పు ఆహారపదార్థాల రుచిని పెంచి, మరింత తినాలనిపించేలా చేస్తుంది. మీ ఉపదేశం రుచికరమైనదిగా ఉండాలంటే, ఉపదేశాన్ని “ఉప్పువేసినట్టు . . . రుచిగలదిగాను కృపాసహితముగాను” ఇవ్వడం తప్పనిసరి. ఎంతో మంచి పదార్థాలను ఉపయోగించి వండినప్పటికీ, ఆ భోజనం నోట్లో పెట్టుకోలేనట్లుగా వండవచ్చు, లేదా ప్లేట్‌లో అందం చందం లేకుండా వడ్డించి ఉండవచ్చు. అది ఎవరి ఆకలినీ పెంచదు. వాస్తవానికి, రుచిలేకపోతే ఒక ముద్ద తినడమైనా కష్టంగా ఉండవచ్చు.
ఉపదేశం ఇచ్చేటప్పుడు, సరైన పదాలను ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది” అని బుద్ధిశాలియైన సొలొమోను చెప్పాడు. (సామెతలు 25:11) అందంగా చిత్రించబడిన వెండి పళ్ళెములో ఎంతో రమ్యంగా చెక్కబడిన బంగారు ఆపిల్ పండ్లు ఆయన మదిలో మెదిలి ఉండవచ్చు. అది ఎంత నయనానందకరంగా ఉంటుంది, దానిని మీకు బహుమానంగా ఇస్తే మీరెంత ప్రశంసిస్తారు! అదే విధంగా, సరైన విధంగా ఎంపిక చేసుకున్న దయాపూరితమైన మాటలు మీరు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి హృదయాన్ని బాగా ఆకట్టుకుంటాయి.—ప్రసంగి 12:9, 10.
దానికి విరుద్ధంగా, “నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) తగని మాటలు కృతజ్ఞతాభావాన్ని కాక వేదననూ, కోపాన్ని కలిగిస్తాయి. వాస్తవానికి, తగని మాటలు మాత్రమే కాక, అనుచితమైన స్వరంతో చెప్పడం కూడా ఒక వ్యక్తి అత్యవసరమైన మంచి ఉపదేశాన్ని నిరాకరించేందుకు కారణం కాగలదు. ఆయుధంతో ఒకరిపై దాడి చేస్తే ఎంత ప్రమాదకరమో, నేర్పులేకుండా, ఇతరుల భావాలకు విలువివ్వకుండా ఉపదేశమివ్వడం కూడా అంతే ప్రమాదకరం. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని సామెతలు 12:18 చెబుతుంది. ఆలోచనరహితంగా మాట్లాడి, ఉపదేశాన్ని ఆలకించడం ఇతరులకు కష్టమయ్యేలా చేయడమెందుకు?—సామెతలు 12:15.
సొలొమోను చెప్పినట్లు, ఉపదేశం ‘సమయోచితముగా పలికిన’ మాటగా ఉండాలి. ఉపదేశం చాలా ఫలవంతమైనదిగా కావాలంటే సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం! ఆకలి లేని మనిషికి భోజనం పెడ్తే అతడు మెచ్చడన్నది స్పష్టమే. బహుశా, ఆయన భోంచేసి కొంచెం సేపే అయ్యుండవచ్చు, లేదా ఆయన అనారోగ్యంగా ఉన్నాడేమో. భోజనం చేయాలనుకోని వ్యక్తికి బలవంతంగా భోజనం పెట్టడం తెలివైన పనీ కాదు అంగీకారయోగ్యమైనదీ కాదు.
వినయమైన మనస్సుతో ఉపదేశించండి
“నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యతరుల కార్యములను కూడ చూడవలెను.” (ఇటాలిక్కులు మావి.) (ఫిలిప్పీయులు 2:2-4) మీరు మంచి ఉపదేశకుడైతే, ఇతరుల క్షేమం విషయమై వారి “కార్యములను కూడ చూడ”డానికి మీరు ప్రేరేపించబడతారు. మీరు ఇతరులను మీకంటే గొప్పవారిగా ఎంచుతూ, ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో వ్యవహరించేటప్పుడు, మీరు కూడా “వినయమైన మనస్సును” చూపిస్తారు. దానర్థం ఏమిటి?
వినయమైన మనస్సు అధికులమన్న దృక్పథాన్ని అలవరచుకోవడాన్ని గానీ, మీ స్వరంలో అలాంటి భావం స్ఫురించడాన్ని గానీ నివారిస్తుంది. తోటి విశ్వాసులకన్నా మనమే అధికులమని తలంచేందుకు మనకెవరికీ ఏ ఆధారమూ లేదు. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మీరు హృదయాన్ని చదవలేరు గనుక, మీరు ఎవరికి ఉపదేశిస్తున్నారో వారి ఉద్దేశాలను గురించి తీర్పు తీర్చకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. అసలు ఆయనకు అలాంటి దురుద్దేశాలేమీ ఉండకపోవచ్చు, తన దృక్పథం తప్పనీ, లేదా తను చేస్తున్నది తప్పనీ ఆయనకు తెలియకపోవచ్చు. దేవుడు కోరేదానికి పొందికలేనిది తను చేస్తున్నట్లు తనకేదో చూచాయగా తెలిస్తే, తన ఆధ్యాత్మిక క్షేమం విషయమై ఎవరైనా నిజమైన ఆసక్తితో వినయంగా ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు దానిని అంగీకరించడం ఆయనకు నిస్సందేహంగా చాలా సులభంగా ఉంటుంది.
మీ ఆతిధేయుడు మిమ్మల్ని భోజనానికి పిలిచి, మీకు ప్రేమాభిమానాలను కనబరచకుండా, మీరంటే ఇష్టంలేదన్నట్లు మీతో వ్యవహరిస్తే మీకేమనిపిస్తుందో ఊహించండి! మీరు ఆ భోజనాన్ని అస్సలు ఆస్వాదించలేరు. నిజానికి, “పగవాని యంట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.” (సామెతలు 15:17) అలాగే, ఉపదేశకుడు ఎవరికైతే ఉపదేశమిస్తున్నారో ఆ వ్యక్తంటే అయిష్టాన్ని చూపించడం గానీ, ఆయనను చిన్నబుచ్చడంగానీ, ఆయనను కలవరపరచడంగానీ చేస్తే, అది యెంత మేలైన సలహా అయినా సరే దానిని అంగీకరించడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం ఉపదేశం ఇవ్వడాన్నైనా, తీసుకోవడాన్నైనా సులభతరం చేస్తాయి.—కొలొస్సయులు 3:14.
అంగీకరించబడిన ఉపదేశం
ప్రవక్తయైన నాతాను రాజైన దావీదుకు ఉపదేశమిచ్చినప్పుడు వినయమైన మనస్సును చూపించాడు. దావీదు మీద తనకున్న ప్రేమా గౌరవాలు నాతాను చెప్పినదానిలోను, చేసినదానిలోనూ ప్రస్ఫుటమయ్యాయి. ఆ ఉపదేశాన్ని ఆలకించడంలో దావీదుకు కలగగల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటూ, నాతాను ఒక ఉదాహరణతో మాట్లాడడం మొదలుపెట్టాడు. (2 సమూయేలు 12:1-4) బత్షెబ విషయంలో దావీదు చేసిన కార్యాల్లో నీతి న్యాయాలు కనిపించనప్పటికీ, వాటిపై ఆయనకున్న మక్కువను ప్రవక్త రేకెత్తించాడు. (2 సమూయేలు 11:2-27) ఆ ఉదాహరణలోని అసలు విషయం నొక్కిచెప్పబడినప్పుడు, దావీదు హృదయపూర్వకంగా ప్రతిస్పందిస్తూ, “నేను [యెహోవాకు వ్యతిరేకంగా] పాపము చేసితినని” అన్నాడు. (2 సమూయేలు 12:7-13) యెహోవా చెప్పినదానిని ఆలకించని కయీనులా కాక, దావీదు ఆ దిద్దుబాటును వినయంగా అంగీకరించాడు.
యెహోవా దావీదు అపరిపూర్ణతను, ఆయన ప్రతికూలంగా ప్రతిస్పందించగల పరిస్థితినీ లెక్కలోకి తీసుకుంటూ, నాతానును దావీదు దగ్గరికి పంపాడు. నాతాను చాలా నేర్పుగా మాట్లాడడానికి ఉపక్రమించాడు. యెహోవా అభిషిక్త రాజుగా దావీదుకున్న స్థానాన్ని బట్టి నాతాను ఆయనను తనకన్నా అధికుడిగా ఎంచాడన్నది స్పష్టమే. మీరు ఒక అధికార స్థానంలో ఉంటే, మీరు సరైన సలహాను ఇవ్వగలుగుతారు, కానీ మీరు వినయ మనస్సును చూపించడంలో పరాజితులైతే, మీ ఉపదేశాన్ని స్వీకరించడం ఇతరులకు చాలా కష్టంగా ఉంటుంది.
నాతాను దావీదును మృదువుగా పూర్వపుస్థితికి తెచ్చాడు. దావీదు తన మంచి కోసం సరైన విధంగా ప్రవర్తించేలా కృపాసహితమైనా, జాగ్రత్తగా సిద్ధపడిన మాటలను ఆ ప్రవక్త ఉపయోగించాడు. నాతాను తన సొంత క్షేమార్థమై ప్రేరేపించబడలేదు. తాను దావీదు కన్నా నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ అధికుడనని భావించడానికీ ప్రయత్నించలేదు. సరైన మాటలను సముచితమైన విధంగా పలకడంలో ఎంత శ్రేష్ఠమైన మాదిరి! మీరు కూడా అలాంటి స్ఫూర్తినే కనబరిస్తే, ఇతరులు మీ సలహాలను అంగీకరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
[22వ పేజీలోని చిత్రం]
పోషకాహారం లాగే, మీ ఉపదేశం కూడా ఆరోగ్యకరమైనదిగా ఉండాలి
[23వ పేజీలోని చిత్రం]
చిత్రమైన వెండి పళ్లెములలో ఉంచబడిన బంగారు ఆపిల్ పండ్లలా ఆకర్షణీయమైన విధంగా మీరు ఉపదేశం ఇస్తారా?
[24వ పేజీలోని చిత్రం]
ప్రవక్తయైన నాతాను నీతిన్యాయాలపై దావీదుకున్న మక్కువను వినయపూర్వకంగా రేకెత్తించాడు