మౌఖిక ధర్మశాస్త్రం—వ్రాతలో ఎందుకు పెట్టబడింది?
అనేక మంది మొదటి శతాబ్దపు యూదులు యేసును మెస్సీయగా ఎందుకు అంగీకరించలేకపోయారు? “[యేసు] దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి—ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని” అడిగారని ఒక ప్రత్యక్షసాక్షి నివేదించారు. (మత్తయి 21:23) సర్వశక్తిమంతుడు యూదా జనాంగానికి తోరహ్ను (ధర్మశాస్త్రాన్ని) ఇచ్చాడు, అయితే, అది కొందరికి దైవదత్తమైన అధికారాన్ని ఇచ్చింది అని వాళ్ళ ఉద్దేశం. యేసుకు అలాంటి అధికారం ఉందా?
తోరహ్ అన్నా, అది ఎవరికైతే నిజమైన అధికారాన్నిచ్చిందో వాళ్ళన్నా యేసు ఎంతో గౌరవం చూపించాడు. (మత్తయి 5:17-20; లూకా 5:14; 17:14) కానీ, దేవుడి ఆజ్ఞలను మీరిన వాళ్ళను ఆయన తరచూ బహిరంగంగా గద్దించాడు. (మత్తయి 15:3-9; 23:2-28) అలాంటి మనుష్యులు సంప్రదాయాలను అనుసరించారు. ఆ సంప్రదాయాలే తర్వాత మౌఖిక ధర్మశాస్త్రం అని పిలువబడ్డాయి. యేసు దాని అధికారాన్ని తిరస్కరించాడు. దాని ఫలితంగా అనేకులు ఆయనను మెస్సీయగా అంగీకరించలేదు. తమ మధ్య అధికారులుగా ఉన్నవారు ఆచరించే సంప్రదాయాలకు మద్దతునిచ్చేవాళ్ళకు మాత్రమే దేవుడి తోడ్పాటు ఉంటుందని వాళ్ళు నమ్మేవారు.
ఆ మౌఖిక ధర్మశాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? యూదులు దానిని లేఖనాల్లో వ్రాయబడిన లిఖిత ధర్మశాస్త్రానికి సమానమైన అధికారం కలదిగా ఎలా దృష్టించగలిగారు? అది మౌఖికంగా తెలియజేయబడవలసిన సంప్రదాయంగా ఉండాలని ఉద్దేశించినదైతే, చివరికి దానిని వ్రాతలో ఎందుకు పెట్టడం జరిగింది?
ఈ సంప్రదాయాలు ఎక్కడి నుండి ఉద్భవించాయి?
ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 1513లో సీనాయి పర్వతం దగ్గర యెహోవా దేవుడితో ఒక నిబంధన సంబంధంలోకి వచ్చారు. మోషే ద్వారా, వాళ్ళు ఆ నిబంధన నియమాలను పొందారు. (నిర్గమకాండము 24:3) ఈ నియమాలను అనుసరిస్తే, వాళ్ళు ‘తమ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక తామును పరిశుద్ధులేనని నిరూపించుకోగల్గుతారు.’ (లేవీయకాండము 11:44) ధర్మశాస్త్రపు నిబంధన క్రింద, నియుక్త యాజకులు అర్పించే బలులు యెహోవా ఆరాధనలో భాగమై ఉండేవి. ఆరాధనకు కేంద్ర స్థానం ఉండవలసి ఉండింది—చివరికి, యెరూషలేములోని ఆలయమే ఆ కేంద్ర స్థానమయ్యింది.—ద్వితీయోపదేశకాండము 12:5-7; 2 దినవృత్తాంతములు 6:4-6.
ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా యెహోవాను ఆరాధించవలసిన పద్ధతిని మోషే ధర్మశాస్త్రం విశదంగా తెలిపింది. అయినప్పటికీ, కొన్ని వివరాలు పూర్తిగా పేర్కొనబడలేదు. ఉదాహరణకు, ధర్మశాస్త్రం సబ్బాతు రోజున పనిచేయడాన్ని నిషేధించింది. అయినప్పటికీ, పనికీ, మరితర కార్యకలాపాలకూ మధ్య తేడాను అది స్పష్టంగా నిర్వచించలేదు.—నిర్గమకాండము 20:10.
అలా చేయడం సముచితమని యెహోవా అనుకుని ఉన్నట్లయితే, తలెత్తగల ప్రతి ప్రశ్నకూ, జవాబిచ్చేటువంటి విశదమైన నిబంధనావళిని ఆయన ఇచ్చి ఉండేవాడు. కానీ, ఆయన మానవులను సృష్టించినప్పుడు వాళ్ళకు మనస్సాక్షిని ఇచ్చాడు. తన నియమాల చట్రం యొక్క పరిమితుల్లో ఉంటూనే, అవసరమైన పట్టువిడుపులకు తావిస్తూ, తనను సేవించేందుకు చొరవ తీసుకునేందుకు ఆయన అనుమతించాడు. న్యాయనిర్ణయ వివాదాలను పరిష్కరించేందుకు యాజకులను, లేవీయులను, న్యాయాధిపతులను ధర్మశాస్త్రం ప్రదానం చేసింది. (ద్వితీయోపదేశకాండము 17:8-11) వివాదాలు అధికం కావడంతో, కొన్ని పూర్వ దృష్టాంతాలను నమూనాగా నిర్ణయించారు. నిస్సందేహంగా, వీటిలో కొన్ని ఒక తరం నుండి మరో తరానికి అందజేయబడి ఉంటాయి. యెహోవా ఆలయంలో యాజక విధులను నిర్వర్తించే పద్ధతులు కూడా తండ్రి నుండి కుమారునికి తెలియజేయబడేవి. అలా ఒక జనాంగంగా ఇశ్రాయేలు యొక్క ఉమ్మడి అనుభవం పెరగడంతోపాటు, దాని సంప్రదాయాలు కూడా పెరిగిపోయాయి.
అయినప్పటికీ, మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమే ఇశ్రాయేలీయులు చేసే ఆరాధనకు ముఖ్య భాగంగా నిలిచింది. “మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు—యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి” ఉంచెనని నిర్గమకాండము 24:3, 4 చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) ఈ లిఖితపూర్వక ఆజ్ఞలకు అనుగుణ్యంగా దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాడు. (నిర్గమకాండము 34:27) వాస్తవానికి, మౌఖిక ధర్మశాస్త్రాన్ని గురించి లేఖనాల్లో ఎక్కడా చెప్పబడలేదు.
“ఈ అధికారమెవడు నీకిచ్చెను?”
మోషే ధర్మశాస్త్రం ప్రాథమిక మత సంబంధ అధికారాన్నీ, నిర్దేశాలను, అహరోను సంతతివారైన యాజకుల చేతికి అప్పగించింది. (లేవీయకాండము 10:8-11; ద్వితీయోపదేశకాండము 24:8; 2 దినవృత్తాంతములు 26:16-20; మలాకీ 2:7) అయితే, కొన్ని శతాబ్దాల కాలంలో, కొందరు యాజకులు అపనమ్మకస్థులుగా, భ్రష్టులుగా మారిపోయారు. (1 సమూయేలు 2:12-17, 22-29; యిర్మీయా 5:31; మలాకీ 2:8, 9) గ్రీకుల ఏలుబడి కాలంలో, అనేక మంది యాజకులు మత సంబంధ విషయాల్లో రాజీపడిపోయారు. సా.శ.పూ. రెండవ శతాబ్దంలో, పరిసయ్యులు—యూదులే అయినా యాజకత్వంపై నమ్మకం ఉంచని క్రొత్త గుంపు—సామాన్య మానవుడు తనను తాను యాజకుడిలాగానే పవిత్రుడిగా పరిగణించుకోవచ్చని చెప్పే సంప్రదాయాలను సృష్టించారు. ఈ సంప్రదాయాలు అనేకులకు నచ్చాయి. కాని ఆ సంప్రదాయాలను ధర్మశాస్త్రానికి చేర్చడం అంగీకారయోగ్యమైన పని కాదు.—ద్వితీయోపదేశకాండము 4:2; 12:32 (యూదుల సంపుటుల్లో 13:1).
యాజకులు చెయ్యడంలేదని తామనుకున్న పనిని చేస్తూ, పరిసయ్యులు ధర్మశాస్త్రపు క్రొత్త పండితులుగా తయారయ్యారు. మోషే ధర్మశాస్త్రం తాము అధికారం చేయడానికి అనుమతించనందువల్ల, అర్థం కాని ఉదాహరణల ద్వారా, తమ దృక్కోణాలకు మద్దతునిచ్చేవిగా అనిపించే మరితర పద్ధతుల్లో లేఖనాల అర్థాన్ని వ్యాఖ్యానించే క్రొత్త పద్ధతులను వాళ్ళు పెంపొందించుకున్నారు.a ఈ సంప్రదాయాలను పదిలపరచి, పెంపొందించే ప్రముఖులుగా ఇశ్రాయేలులో అధికారం చెలాయించడానికి వాళ్ళు క్రొత్త ఆధారాన్ని సృష్టించుకున్నారు. సా.శ. మొదటి శతాబ్దానికెల్లా, పరిసయ్యులు యూదా జనాంగం మధ్యన ఆధిపత్యంగల సమూహంగా మారారు.
అప్పుడు అస్తిత్వంలో ఉన్న మౌఖిక సంప్రదాయాలను సేకరించి, తాము సొంతంగా చెప్పే సంప్రదాయాలను మరెక్కువగా స్థాపించుకునేందుకు ఉపయోగించగల లేఖనాధార అన్వయింపు కోసం పరిసయ్యులు పరిశోధించారు. వాళ్ళు, తమ కార్యకలాపాలకు అదనపు అధికారాన్ని ఇచ్చుకోవలసిన అవసరాన్ని గ్రహించారు. అలా, ఈ సంప్రదాయాల ఆవిర్భావానికి సంబంధించిన క్రొత్త తలంపు పుట్టింది. “మోషే సీనాయి పర్వతం దగ్గర తోరహ్ను పొందాడు. ఆయన దానిని యెహోషువకు ఇచ్చాడు. యెహోషువ పెద్దలకు, పెద్దలు ప్రవక్తలకు, ప్రవక్తలు దానిని మహా సమాజంలోని ఈ పురుషులకు ఇవ్వడం జరిగింది” అని రబ్బీలు బోధించడం మొదలుపెట్టారు.—ఆవోత్ 1:1, మిష్నా.
“మోషే తోరహ్ను పొందాడు” అన్నప్పుడు, వ్రాతపూర్వక నియమాలను మాత్రమే కాక, తమ మౌఖిక సంప్రదాయాలన్నింటినీ కూడా ఉద్దేశించేవారు. వాళ్ళు మనుష్యులు కనిపెట్టి, పెంపొందించిన ఈ ఆచారాలు సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ఇచ్చాడని వాళ్ళు చెప్పేవాళ్ళు. దేవుడు ధర్మశాస్త్రంలో లేని విషయాలను నిర్ణయించుకునే పనిని వ్యక్తులకు వదిలేయలేదనీ, దానిలో వ్రాయని విషయాలను దేవుడు మౌఖికంగా నిర్వచించాడనీ వాళ్ళు బోధించారు. మోషే ద్వారా ఈ మౌఖిక నియమాలు తరతరాలుగా యాజకులకు కాదు గానీ, అనేక ఇతర నాయకులకే అందజేయబడిందన్నది వాళ్ళ అభిప్రాయం. అధికార సంబంధమైన ఈ “వీడని” శృంఖలలో సహజ వారసులు తామేనని పరిసయ్యులు చెప్పుకున్నారు.
ధర్మశాస్త్రపు గడ్డుపరిస్థితి—ఓ సరిక్రొత్త పరిష్కారం
యూదా మత నాయకులు ఎవరి దైవదత్త అధికారాన్ని ప్రశ్నించారో ఆ యేసు, ఆలయ నాశనాన్ని గురించి ముందుగానే చెప్పాడు. (మత్తయి 23:37–24:2) సా.శ. 70లో, రోమన్లు ఆ ఆలయాన్ని నాశనం చేసిన తర్వాత, మోషే ధర్మశాస్త్రం కోరిన విషయాలను, బలులు, యాజక సేవ ఇమిడివున్న విషయాలను నిర్వర్తించడం అసాధ్యమైపోయింది. యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా, దేవుడు ఒక క్రొత్త నిబంధనను స్థాపించాడు. (లూకా 22:20) మోషే ధర్మశాస్త్రం దాని ముగింపుకు తేబడింది.—హెబ్రీయులు 8:7-13.
ఈ సంఘటనలను యేసే మెస్సీయయని రుజువునిచ్చేవిగా వీక్షించే బదులు, పరిసయ్యులు మరో పరిష్కారాన్ని కనుగొన్నారు. వాళ్ళు యాజకత్వపు అధికారాన్ని అప్పటికే, చాలా మట్టుకు అక్రమంగా చేజిక్కించుకున్నారు. ఆలయం నాశనమవ్వడంతో, వాళ్ళు మరో అడుగు ముందుకు వేయగల్గారు. పునఃసంస్థీకరించబడిన సన్నెద్రీన్కు—యూదుల హై కోర్ట్—జాబ్నెహ్లోని రబ్బీల అకాడమీ కేంద్రంగా తయారైంది. యావ్నేలో, యోహానాన్ బెన్ జాకై, గమాలియేల్ II ల నాయకత్వం క్రింద యూదా మతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆలయంలో, యాజకుల పర్యవేక్షణలో జరిగే ఆరాధనకు బదులు సమాజ మందిరంలో రబ్బీల పరిచర్య మొదలయ్యింది. ప్రార్థనలు, ముఖ్యంగా పాపపరిహారార్థ దినంనాటి ప్రార్థనలకు బదులు బలులు అర్పించడం మొదలయ్యింది. సీనాయి పర్వతం దగ్గర మోషేకు ఇవ్వబడిన మౌఖిక ధర్మశాస్త్రం అప్పటికే ఈ అవసరతను గ్రహించి, దాని కోసమైన ఏర్పాటును ముందే చేసిందని వాళ్ళు తర్కించారు.
రబ్బీల అకాడమీలు అదనపు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వాళ్ళ ముఖ్య పాఠ్యకార్యక్రమంలో ముఖ్యంగా తీవ్రమైన చర్చలూ, కంఠతాపట్టడమూ, మౌఖిక ధర్మశాస్త్రపు అన్వయింపూ జరిగేవి. మునుపు, ఈ మౌఖిక ధర్మశాస్త్రానికి ఆధారం లేఖనాల అన్వయింపుతో—మిద్రాష్తో ముడిపెట్టబడివుండేది. అంతకంతకు పోగైపోతూ పెరిగిపోతున్న సంప్రదాయాలను బోధించడమూ, వాటిని ప్రత్యేకంగా సంస్థీకరించడమూ ప్రారంభమైంది. మౌఖిక ధర్మశాస్త్రంలోని ప్రతి నియమాన్ని సరళమైన, సులభంగా గుర్తుంచుకోగల పదబంధాలుగా కూర్చి, తరచూ వాటికి సంగీతాన్ని కూర్చేవారు.
మౌఖిక ధర్మశాస్త్రాన్ని వ్రాతలో పెట్టడం ఎందుకు?
రబ్బీల అకాడమీలు బహుళంగా ఉండడమూ, రబ్బీల నియమాలు అధికం కావడమూ క్రొత్త సమస్యను సృష్టించాయి. “ప్రతి బోధకుడికీ తనదైన పద్ధతి ఉండేది, తాను రూపొందించిన మౌఖిక నియమాలను తనదైన శైలిలో పదబంధాలుగా పొందుపర్చేవాడు. . . . కనుక విద్యార్థికి తన బోధకుడు నేర్పించిన బోధలు మాత్రమే తెలిస్తే సరిపోయేది కాదు. ఇతర పండితులు పొందుపరచినవాటిని కూడా తెలుసుకోవడానికి అతడు బద్ధుడుగా చేయబడ్డాడు. . . . ‘జ్ఞానం అధికంగా వెలువడుతున్న’ కొలది విద్యార్థులు మరెక్కువ నియమాలను కంఠతాపట్టాలని బలవంతపెట్టబడ్డారు” అని రబ్బీల పండితుడైన ఎడన్ స్టైన్సాల్ట్స్ వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న సమాచార సాగరంలో విద్యార్థి జ్ఞాపకశక్తికి ఒత్తిడి కలిగేంతగా అమిత శ్రమపెట్టబడేది.
సా.శ. రెండవ శతాబ్దంలో, యూదులు బార్ కోక్బా నేతృత్వంలో రోమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, రబ్బీ పండితులు విపరీతమైన హింసకు గురయ్యారు. బార్ కోక్బాకు మద్దతునిచ్చిన ఆకివా అనే ప్రముఖ రబ్బీ, అలాగే ఇతర అనేక ప్రముఖ పండితులూ చంపబడ్డారు. మళ్ళీ మొదలైన హింస తమ మౌఖిక ధర్మశాస్త్రానికే ముప్పు వాటిల్ల జేయగలదని రబ్బీలు భయపడ్డారు. పారంపర్యాలు నోటి మాట ద్వారా గురువు నుండి శిష్యునికి చక్కగా అలవడతాయని వాళ్ళు నమ్మేవారు. కానీ అప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల, జ్ఞానుల బోధలను కాపాడేందుకు మౌఖిక ధర్మశాస్త్రపు సంస్థీకృత నియమ నిర్మాణాన్ని చేసేందుకు చాలా తీవ్రమైన కృషి సల్పవల్సివచ్చింది. లేకపోతే, అవి శాశ్వతంగా మరవబడేవే.
తర్వాత రోమ్తో సాపేక్షికంగా కాస్త సమాధానంగా ఉన్న కాలంలో, రెండవ శతాబ్దపు చివరి భాగంలోను, మూడవ శతాబ్దపు మొదటి భాగంలోను ప్రముఖ రబ్బీయైన జూడా హనసీ అనేక మంది పండితులను సమావేశపరచి, అనేకానేక మౌఖిక సంప్రదాయాలను సంస్థీకృత పద్ధతిలో క్రోడీకరించాడు. అందులో ఆరు భాగాలుండేటట్లూ, ఒక్కొక్క భాగంలో చిన్న చిన్న ఉపవిభాగాలు ఉండేటట్లూ చేశాడు. అలా అందులో మొత్తం 63 ఉపవిభాగాలు ఉన్నాయి. ఈ పుస్తకమే తర్వాత మిష్నా అని పిలువబడింది. “మిష్నాకు . . . తోరహ్ తప్పించి, మరే పుస్తకానికి ఇవ్వబడనంత ఆమోదమూ అధికారమూ లభించాయి” అని మౌఖిక ధర్మశాస్త్ర పండితుడైన ఎఫ్రాయీమ్ యూర్బాక్ వ్యాఖ్యానించాడు. మెస్సీయ నిరాకరించబడ్డాడు. ఆలయం శిథిలావస్థలో ఉంది. కానీ, మౌఖిక ధర్మశాస్త్రం మిష్నా రూపంలో వ్రాతల్లో పెట్టబడడంతో, జూడాయిజంలో క్రొత్త యుగం ఆరంభమైంది.
[అధస్సూచీలు]
a లేఖనాల అర్థాన్ని వ్యాఖ్యానించే ఈ పద్ధతిని మిద్రష్ అని పిలుస్తారు.
[26వ పేజీలోని చిత్రం]
చాలా మంది యూదులు యేసు అధికారాన్ని ఎందుకు నిరాకరించారు?