నిజమైన నమ్రతను మీరెలా కనబరచగలరు?
నిజమైన నమ్రత దేవుని దృష్టిలో అత్యంత అమూల్యమైనది. యాకోబు ఇలా వ్రాశాడు: “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (యాకోబు 4:6) ఇక్కడ యాకోబు హెబ్రీ లేఖనాలలో వ్యక్తపరచబడిన అనేక తలంపులను సూచిస్తూ ఉండవచ్చు. “యెహోవా మహాన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.” “నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.” “అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన [దేవుడు] దయ చూపును.”—కీర్తనలు 138:6; యెషయా 2:11; సామెతలు 3:34.
నమ్రతను గూర్చి అపొస్తలుడైన పేతురు కూడా సూచించాడు. ఆయనిలా వ్రాశాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”—1 పేతురు 5:5.
నమ్రత విషయంలో క్రీస్తు మాదిరి
మీరిలా అడగవచ్చు, నమ్రత కల్గి ఉండడం వల్ల కలిగే మేలు లేదా ప్రయోజనం ఏమిటి? నిజ క్రైస్తవునిగా ఉండేందుకు కృషి చేసే వ్యక్తికి సమాధానం సరళమైనది—నమ్రతను కల్గివుండడం అంటే క్రీస్తును పోలి ఉండడమే. పరలోకాన్ని వదలి భూమి మీదకు రావడమనే తనకు నిర్దేశించబడిన నిరుపమానమైన పనిని స్వీకరించడం ద్వారా, దేవదూతల కంటే తక్కువ వానిగా, ఒక సాధారణ మానవునిగా తన్ను తాను తగ్గించుకోవడం ద్వారా యేసు తన నమ్రతను ప్రదర్శించాడు. (హెబ్రీయులు 2:7) ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, విరోధులైన మతనాయకుల ద్వారా వచ్చిన అనేక అవమానాలను సహించాడు. సహాయం కోసం దూతల సేనావ్యూహాన్ని పిలువగల సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ తన శ్రమల కాలంలో స్థిరచిత్తాన్ని చూపాడు.—మత్తయి 26:53.
చివరికి, యేసు హింసాకొయ్యపై అవమానకరంగా వ్రేలాడదీయబడినప్పుడు సహితం తన తండ్రికి విశ్వసనీయంగా ఉన్నాడు. అందుకే, పౌలు ఆయనను గూర్చి ఇలా వ్రాయగల్గాడు: “క్రీస్తుయేసునకు కలిగిన యూ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.”—ఫిలిప్పీయులు 2:5-8.
కనుక, నిజమైన నమ్రతను మనమెలా ప్రదర్శించగలం? దైనందిన కార్యకలాపాల్లో గర్వానికి బదులు నమ్రతగా మనమెలా ప్రతిస్పందిస్తాము?
నమ్రత గల వ్యక్తి ప్రతిస్పందించే విధానం
పని స్థలంలో లేదా క్రైస్తవ సేవలో నమ్రతను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. పనులు విజయవంతంగా నెరవేర్చబడాలంటే, పైవిచారణ కర్తలు, మేనేజర్లు, సూపర్‌వైజర్లు అవసరం కావచ్చు. ఎవరో ఒకరు నిర్ణయాలు చేయాలి. దానికి మీరెలా ప్రతిస్పందిస్తారు? “నేనేం చేయాలో నాకు చెప్పడానికి తనెవరనుకుంటున్నాడు? అతని కంటే నేనెక్కువ సంవత్సరాలు ఈ పనిలో ఉన్నాను” అని మీరు తర్కిస్తారా? అవును, మీరు గర్విష్ఠి అయితే, లోబడడానికి చిరాకుపడతారు. మరొక వైపు, నమ్రతగల వ్యక్తి ‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవాడై ఇతరులు తనకంటె యోగ్యులని యెంచేందుకు’ కృషి చేస్తాడు.—ఫిలిప్పీయులు 2:3.
మీ కంటే తక్కువ వయస్సు వారు లేదా ఒక స్త్రీ మీకు ఒక సలహా ఇస్తే దానికి మీరెలా ప్రతిస్పందిస్తారు? మీరు నమ్రత గలవారైతే, దాని గురించి కనీసం ఆలోచిస్తారు. మీరు గర్విష్ఠి అయితే, మీరు ఉక్రోషపడతారు లేదా దానిని వెంటనే నిరాకరిస్తారు. మిమ్మల్ని నాశనానికి నడిపే పొగడ్తలు, స్తుతివాక్యాలు మీరు కోరుకుంటారా? లేదా మీ క్షేమాభివృద్ధికై సమయోచితమైన సలహా ఇవ్వబడితే దానిని అంగీకరిస్తారా?—సామెతలు 27:9; 29:5.
మీరు ప్రతికూల పరిస్థితియనే సవాలుతో వ్యవహరించగలరా? క్లిష్టపరిస్థితులు తటస్థించినప్పుడు నమ్రత మీరు వాటిని సహించేలా చేస్తుంది, యోబు కూడా అలాగే సహించాడు. మీరు గర్విష్ఠి అయితే, చిర్రుబుర్రులాడే ధోరణిని కనబరుస్తారు, ఏవైనా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు సహించలేకపోవచ్చు, లేదా ఇతరులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకపోయినా, నిర్లక్ష్యం చేశారని మీరనుకోవచ్చు.—యోబు 1:22; 2:10; 27:2-5.
నమ్రత క్షమిస్తుంది, ప్రేమిస్తుంది
“నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. మీదే సరియైనది.” అని చెప్పడం కొందరికి చాలా కష్టం. ఎందుకని? మహాగర్వం! చాలా తరుచుగా యథార్థతతో కూడిన క్షమాపణ వివాహసంబంధంలో వచ్చే వివాదాలను ఎంత సులభంగా ఆపగలదు!
ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించగల మనస్సు మీకుందా? లేదా, తప్పు చేసిన వ్యక్తితో బహుశా రోజులు లేదా నెలలు మీరు మాట్లాడడానికి నిరాకరించేందుకు, మీ కోపాన్ని అలాగే పట్టి ఉంచుకొనేందుకు మీ గర్వం మిమ్మల్ని చేస్తుందా? మీరు కక్ష తీర్చుకొనేలా ప్రయత్నించేందుకు మీ గర్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా? కొన్ని కక్షల్లో హత్యలు జరిగాయి. ఇతరుల విషయంలోనైతే, ఒకరి పేరుప్రతిష్ఠలను నాశనం చేయడం జరిగింది. ఇందుకు భిన్నంగా, నమ్రత గల వ్యక్తి ప్రేమపూర్వకంగా ఉంటాడు, క్షమిస్తాడు. ఎందుకని? ఎందుకంటే, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఇశ్రాయేలీయులు తమ గర్వాన్ని విడనాడినప్పుడు యెహోవా క్షమించేందుకు సిద్ధమైన మనస్సును కల్గి ఉన్నాడు. యేసును అనుసరించే నమ్రత గల అనుచరుడు కూడా పదేపదే క్షమించవలసి వచ్చినప్పటికీ కూడా క్షమించగల సిద్ధమైన మనస్సును కల్గి ఉంటాడు.—యోవేలు 2:12-14; మత్తయి 18:21, 22; 1 కొరింథీయులు 13:5.
నమ్రత గల వ్యక్తి ‘ఘనత విషయంలో ఇతరులను గొప్పగా ఎంచుతాడు.’ (రోమీయులు 12:10) న్యూ ఇంటర్‌నేషనల్ వర్షన్ ఇలా అంటుంది: “ఇతరులను మీకంటే గొప్పవారిగా ఘనపర్చండి.” మీరు ఇతరులను ప్రశంసించడం, వారి సామర్థ్యాలను, ప్రతిభను మెచ్చుకోవడం చేస్తారా? లేదా, వారికి గల మంచిపేరుకు మచ్చ తెచ్చేలా ఎప్పుడూ వారిలో లోపాలను కనుక్కుంటారా? అవును, ఇతరులను యథార్థంగా ప్రశంసించగల నమ్రత మీకుందా? మీకిలా చేయడం ఒకవేళ కష్టంగా ఉన్నట్లైతే, బహుశా వ్యక్తిగత అభద్రత, గర్వం మీ సమస్యలు కావచ్చు.
ఒక గర్విష్ఠి సహనం లేనివాడుగా ఉంటాడు. నమ్రత గల వ్యక్తి సహనం గలవానిగాను, దీర్ఘశాంతము గలవానిగాను ఉంటాడు. మరి మీ సంగతేమిటి? ఎవరైనా మీతో స్నేహపూర్వకంగా వ్యవహరించలేదని మీరు భావించినప్పుడు అది మిమ్మల్ని గుచ్చినట్లుగా అన్పిస్తుందా? మీ మనస్సును గాయపరుస్తుందా? అటువంటి ప్రతిస్పందన దీర్ఘశాంతానికి వ్యతిరేకం. మీరు నమ్రత గలవారైతే, మిమ్మల్ని గూర్చి మీరు అధికంగా తలంచరు. యేసు శిష్యులు తమను తాము అధికంగా తలంచినప్పుడు ఏమి జరిగిందో జ్ఞప్తికి తెచ్చుకోండి—వారిలో ఎవరు ప్రముఖులన్న విషయమై ఉద్రేకపూరితమైన వివాదం చెలరేగింది. మేము “నిష్‌ప్రయోజకులమైన దాసులము” అన్న విషయాన్నే వారంతా మరచిపోయారు!—లూకా 17:10; 22:24; మార్కు 10:35-37, 41.
ఫ్రెంచ్ రచయితయైన వాల్‌టైర్ నమ్రతను “ఒక వ్యక్తి సాత్వికము . . . గర్వానికి విరుగుడు” అని వర్ణించాడు. అవును, నమ్రత అంటే దీనమనస్సును కల్గి ఉండడమే. నమ్రత గల వ్యక్తి గర్వాన్ని కాదుగానీ, సాత్వికముతో కూడిన ప్రవర్తనను కల్గి ఉంటాడు. అతడు ప్రగాఢమైన గౌరవాన్ని, మర్యాదను చూపుతాడు.
కాబట్టి, నమ్రత కల్గి ఉండడానికి ఎందుకు ప్రయత్నించాలి? ఎందుకంటే, నమ్రత దేవునికి అంగీకృతము, అది దైవిక నడపింపును పొందడానికి సహాయపడుతుంది. యెహోవా దానియేలును ‘బహు ప్రియుడు’గా యెంచి, ఒక దర్శనాన్నివ్వడానికి ఆయన దగ్గరికి తన దేవదూతను పంపించడానికి కొంత కారణం ఆయన నమ్రత కల్గివున్న వ్యక్తి కావడమే! (దానియేలు 9:23; 10:11, 19) నమ్రత అనేక ప్రతిఫలాలను తెస్తుంది. ఇది మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించే నిజమైన స్నేహితులను తెస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, యెహోవా ఆశీర్వాదాన్ని తెస్తుంది. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.”—సామెతలు 22:4.
[7వ పేజీలోని చిత్రం]
నమ్రతగా క్షమాపణలు చెప్పడం జీవితాన్ని మరింత సాఫీగా చేయగలదు