కుటుంబములారా, దేవుని సంఘంలో భాగంగా ఆయనను స్తుతించండి
“సమాజములలో యెహోవాను స్తుతించెదను.”—కీర్తన 26:12.
1. ఇంట్లో పఠనమూ, ప్రార్థనా చేయడానికితోడు సత్యారాధనలో ఒక ప్రముఖమైన భాగం ఏమిటి?
యెహోవా ఆరాధన అంటే ప్రార్థన చేయడము, ఇంట్లో బైబిలును పఠించడమూ మాత్రమే కాదు, అందులో దేవుని సంఘ సభ్యులుగా దాని కార్యకలాపాల్లో భాగం వహించడం కూడా ఇమిడి ఉంది. దేవుని మార్గంలో నడవగలిగేలా ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేందుకు ‘పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి అందరిని పోగుచేయవలెను’ అని ప్రాచీన ఇశ్రాయేలు జనాంగమునకు ఆజ్ఞాపించబడింది. (ద్వితీయోపదేశకాండము 31:12; యెహోషువ 8:35) వృద్ధులూ, ‘యౌవనులు కన్యకలూ’ యెహోవా నామాన్ని స్తుతించమని ప్రోత్సహించబడ్డారు. (కీర్తన 148:12, 13) క్రైస్తవ సంఘానికి కూడా అటువంటి ఏర్పాట్లే వర్తిస్తాయి. భూవ్యాప్తంగా ఉన్న రాజ్యమందిరాల్లో పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి, ప్రేక్షకులు కూడా భాగం వహించే కూటాల్లో స్వేచ్ఛగా పాల్గొంటారు. చాలామంది అలా భాగం వహించి గొప్ప సంతృప్తిని పొందుతారు.—హెబ్రీయులు 10:23-25.
2. (ఎ) పిల్లలకు కూటాల్లో ఆనందించేలా సహాయపడటానికి సిద్ధపాటు ఎందుకు ఒక కీలకమైన అంశం? (బి) ఎవరి మాదిరి ప్రాముఖ్యం?
2 నిజమే, సంఘ కార్యకలాపాల క్షేమకరమైన రొటీన్లో యౌవనులు నిమగ్నమయ్యేలా సహాయపడటం సవాలుదాయకంగా ఉండగలదు. తమ తల్లిదండ్రులతో కలిసి కూటాలకు హాజరయ్యే కొందరు పిల్లలు కూటాల్లో ఆనందాన్ని పొందలేక పోతుంటే, సమస్య ఏమైవుంటుంది? పిల్లల్లో అత్యధికులు తక్కువసేపు మాత్రమే అవధానాన్ని నిలుపగలరు, వారికి సులభంగా బోరు కొడుతుంది. ఈ సమస్యను సరిదిద్దడానికి సిద్ధపాటు సహాయపడవచ్చు. సిద్ధపాటు లేకుండా, పిల్లలు కూటాల్లో అర్థవంతమైన రీతిలో భాగం వహించలేరు. (సామెతలు 15:23) సిద్ధపాటు లేకుండా, వారికి సంతృప్తినిచ్చే ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడం కష్టం. (1 తిమోతి 4:12, 15) ఏమి చేయవచ్చు? మొట్టమొదటిగా, తల్లిదండ్రులు తాము కూటాలకు సిద్ధపడుతున్నామా అని తమను తాము ప్రశ్నించుకోవాలి? వారి మాదిరి ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. (లూకా 6:40) కుటుంబ పఠనాన్ని జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుని నిర్వహించడం కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం కాగలదు.
హృదయానికి క్షేమాభివృద్ధిని కలుగజేయడం
3. కుటుంబ పఠనంలో హృదయాలకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి ఎందుకు ప్రత్యేక ప్రయత్నం చేయాలి, ఇందుకు ఏమి అవసరమౌతుంది?
3 కుటుంబ పఠన సమయం, విషయాల్ని కేవలం తలలోకి ఎక్కించుకోవడానికి చేసే ప్రయత్నంగా మాత్రమే ఉండకూడదు, హృదయాలకు క్షేమాభివృద్ధి కూడా కలుగజేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులకు ఎదురయ్యే సమస్యలు ఎరిగివుండటం, వారిలో ప్రతి ఒక్కరిపట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ కలిగివుండటం అవసరం. యెహోవా ‘హృదయములను పరిశోధన చేయువాడు.’—1 దినవృత్తాంతములు 29:17.
4. (ఎ) ‘తెలివి లేకపోవడం’ అంటే ఏమిటి? (బి) ‘బుద్ధి సంపాదించుకోవడం’లో ఏమి ఇమిడివుంది?
4 యెహోవా మన పిల్లల హృదయాలను పరిశోధించినప్పుడు ఆయన ఏమి కనుగొంటాడు? వారిలో అత్యధికులు తాము యెహోవాను ప్రేమిస్తున్నామని చెబుతారు, అది మెచ్చుకోదగినదే. అయినా, యౌవనునికి లేదా యెహోవా గురించి అప్పుడే నేర్చుకుంటున్న వ్యక్తికి యెహోవా మార్గాల విషయంలో అనుభవం తక్కువగా ఉంటుంది. అతడు అనుభవరహితుడు గనుక, బైబిలు చెబుతున్నట్లుగా ఆయనకు ‘తెలివి లేకపోయి’ ఉండవచ్చు. ఆయన ఉద్దేశాలన్నీ చెడ్డవి కాకపోవచ్చు, కానీ దేవుణ్ని నిజంగా ప్రీతిపర్చే స్థితికి ఒకరి హృదయాన్ని తీసుకురావడానికి సమయం పడుతుంది. ఇందులో ఒకరి తలంపులను, కోరికలను, అనురాగాలను, భావావేశాలను, జీవితంలోని లక్ష్యాలను వీటన్నింటినీ, అపరిపూర్ణ మానవులకు సాధ్యం కాగల స్థాయిలో, దేవుడు అంగీకరించే దానికి అనుగుణ్యంగా తీసుకురావడం ఇమిడివుంది. ఎవరైనా తన అంతర్గత వ్యక్తిని ఆ విధంగా మలుచుకున్నప్పుడు ఆయన ‘బుద్ధి సంపాదించుకుంటున్నాడు.’—సామెతలు 9:4; 19:8.
5, 6. తమ పిల్లలు ‘బుద్ధి సంపాదించుకోవడానికి’ తల్లిదండ్రులు ఎలా సహాయం చేయగలరు?
5 తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బుద్ధిని సంపాదించుకోవడానికి’ సహాయం చేయగలరా? నిజమే, ఏ మానవుడూ మరో వ్యక్తిలో ఒక మంచి హృదయస్థితిని పెట్టలేడు. మనలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛాచిత్తం ఇవ్వబడింది, అధికశాతం మనం ఏమి ఆలోచించేందుకు మనల్ని మనం అనుమతించుకుంటామన్న దానిపైనే ఆధారపడుతుంది. అయితే, తల్లిదండ్రులు వివేచనతో తరచు తమ పిల్లల మనస్సుల్లో ఉన్నదాన్ని బయటికి లాగగలరు, తద్వారా హృదయంలో ఏముందో ఎటువంటి సహాయం అవసరమో తెలుసుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడగండి, ‘దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? నీవు నిజంగా ఏమి చేయాలనుకుంటున్నావు?’ అడిగిన తర్వాత, ఓర్పుగా వినండి. అతిగా ప్రతిస్పందించకండి. (సామెతలు 20:5) మీరు వారి హృదయాల్ని చేరాలంటే దయగల, అర్థంచేసుకునే, ప్రేమపూర్వకమైన వాతావరణం అవసరం.
6 క్షేమకరమైన అభీష్టాల్ని బలపర్చడానికి ఆత్మఫలాల్ని తరచు చర్చించండి—వాటిలోని ప్రతి ఒక్కదాన్ని చర్చిస్తూ, దాన్ని పెంపొందించుకోవడానికి ఒక కుటుంబముగా కృషిచేయండి. (గలతీయులు 5:22, 23) యెహోవాపట్ల, యేసుక్రీస్తుపట్ల ప్రేమను పెంపొందింపజేయండి, అంటే వారిని ప్రేమించాలని కేవలం నోటితో చెప్పడం ద్వారా కాదుగాని, మనం వారిని ప్రేమించడానికిగల కారణాలనూ, ఆ ప్రేమను మనం ఎలా వ్యక్తం చేయవచ్చుననేదాన్నీ చర్చించడం ద్వారా అలా చేయండి. (2 కొరింథీయులు 5:14, 15) సరియైనదేదో దాన్ని చేయాలన్న కోరికను, అలా చేయడంవల్ల వచ్చే ప్రయోజనాలను గూర్చి తర్కించడం ద్వారా బలపర్చండి. తప్పుడు తలంపులను, మాటలను, ప్రవర్తనను విసర్జించాలన్న కోరికను, వాటిద్వారా రాగల చెడు ప్రభావాలను గూర్చి చర్చించడం ద్వారా పెంపొందించండి. (ఆమోసు 5:15; 3 యోహాను 11) తలంపులు, మాటలు, ప్రవర్తన అనేవి మంచివైనా చెడ్డవైనా యెహోవాతో ఒకరికిగల అనుబంధాన్ని ఎలా ప్రభావితం చేయగలవో చూపించండి.
7. పిల్లలు సమస్యలతో వ్యవహరించడంలోనూ, వారు యెహోవాకు సన్నిహితంగా ఉండేలా చేసే నిర్ణయాలు తీసుకునేలా చేయడంలోనూ సహాయం చేయడానికి ఏమి చెయ్యవచ్చు?
7 ఒక పిల్లవానికి ఏదైనా సమస్య ఉన్నట్లైతే లేదా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవల్సిన అవసరం వస్తే మనం అతడ్ని ఇలా అడుగవచ్చు: ‘ఈ విషయం గురించి యెహోవా ఎలా దృష్టిస్తాడనుకుంటున్నావు? యెహోవా గురించి నీకు ఏమి తెలిసినందున నీవు ఇలా జవాబిచ్చావు? నీవు దాని గురించి ఆయనకు ప్రార్థించావా?’ దేవుని చిత్తమేమిటో నిర్ధారించుకోవడానికీ, దాన్ని చేయడానికీ ఎల్లప్పుడు పూర్ణ శక్తితో కూడిన ప్రయత్నం జరిగే జీవిత విధానాన్ని నిర్మించుకునేందుకు మీ పిల్లలకు సహాయపడండి, అది సాధ్యమైనంత చిన్న వయస్సులోనే ప్రారంభించండి. వారు యెహోవాతో సన్నిహితమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పర్చుకున్న తర్వాత, వారాయన మార్గాల్లో నడవటంలో ఆహ్లాదాన్ని పొందుతారు. (కీర్తన 119:34, 35) ఇది వారిలో సత్య దేవుని సంఘంతో సహవసించడంలోని ఆధిక్యతపట్ల మెప్పుదలను పెంపొందిస్తుంది.
సంఘ కూటాలకు సిద్ధపడటం
8. (ఎ) అవధానం అవసరమయ్యే విషయాలన్నింటినీ మన కుటుంబ పఠనంలో ఇమడ్చటానికి ఏమి సహాయం చేయగలదు? (బి) ఈ పఠనం ఎంత ప్రాముఖ్యమైనది?
8 కుటుంబ పఠనం సమయాల్లో అవధానం అవసరమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. మీరు వాటన్నింటినీ ఎలా ఇమడ్చగలరు? ఒకేసారి అన్ని విషయాలూ చర్చించడం అసాధ్యం. కానీ ఒక పట్టిక వేసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. (సామెతలు 21:5) అప్పుడప్పుడు, దాన్ని పరిశీలించి దేనికి ప్రత్యేక అవధానం అవసరమో చూడండి. ప్రతి కుటుంబ సభ్యుని పురోగతిలోనూ సంపూర్ణ ఆసక్తిని కనపర్చండి. కుటుంబ పఠనం అనే ఈ ఏర్పాటు క్రైస్తవ విద్యా కార్యక్రమంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. ఇది మనల్ని ప్రస్తుత జీవితానికి సరిపడేట్లుగా చేస్తుంది, రాబోయే నిరంతర జీవితానికి సంసిద్ధుల్ని చేస్తుంది.—1 తిమోతి 4:8.
9. మన కుటుంబ పఠనాల్లో కూటాలకు సిద్ధపడే విషయంలో మనం పురోభివృద్ధికరంగా ఏ లక్ష్యాలపై పనిచేయవచ్చు?
9 మీ కుటుంబ పఠనంలో సంఘ కూటాలకైన సిద్ధపాటు ఉంటుందా? మీరు కలిసి పఠిస్తుండగా పురోభివృద్ధికరంగా కృషి చేయగల అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్నింటిని సాధించడానికి కొన్ని వారాలు, నెలలు, చివరికి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ లక్ష్యాలను పరిశీలించండి: (1) కుటుంబంలో ప్రతి ఒక్కరు సంఘ కూటాల్లో వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండటం; (2) వ్యాఖ్యానాలను తమ సొంత మాటల్లో ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కృషిచేయటం; (3) వ్యాఖ్యానాల్లో లేఖనాలను చేర్చటం; (4) వ్యక్తిగత అన్వయింపును చేసుకునే దృష్టితో సమాచారాన్ని విశ్లేషించటం. ఇవన్నీ ఒక వ్యక్తి సత్యాన్ని తన స్వంతం చేసుకోవడానికి సహాయం చేయగలవు.—కీర్తన 25:4, 5.
10. (ఎ) మన సంఘ కూటాల్లో ఒక్కొక్కదానిపట్ల మనం ఎలా అవధానాన్నివ్వగలము? (బి) ఇదెందుకు శ్రమకు తగిన ప్రతిఫలమైయుంది?
10 మీ కుటుంబ పఠనం సాధారణంగా ఆ వారంలో జరగబోయే కావలికోట పఠనానికి సిద్ధపడే సమయమే అయినప్పటికీ సంఘ పుస్తక పఠనం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటములకు వ్యక్తిగతంగాను లేదా కుటుంబముగాను సిద్ధపడటంలోని ప్రాముఖ్యతను అలక్ష్యం చేయకండి. ఇవి కూడా మనం యెహోవా మార్గంలో నడవటానికి బోధించే కార్యక్రమంలో ప్రాముఖ్యమైన భాగాలు. మీరు అప్పుడప్పుడు కుటుంబముగా కూటాలకు సిద్ధపడటం సాధ్యం కావచ్చు. మీరు కలిసి పనిచేయడం ద్వారా పఠన నైపుణ్యాలు మెరుగౌతాయి. తత్ఫలితంగా, కూటాల నుండే చక్కని ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర విషయాలకు తోడు, ఈ కూటాలకు క్రమంగా సిద్ధపడటం ద్వారా వచ్చే ప్రయోజనాలను, అందుకోసం కచ్చితమైన సమయాన్ని ప్రక్కకు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను కూడా చర్చించండి.—ఎఫెసీయులు 5:15-17.
11, 12. సంఘంలో పాడటానికి ముందు సిద్ధపడటం మనకు ఎలా ప్రయోజనం చేకూర్చగలదు, ఇదెలా చేయవచ్చు?
11 “దైవిక జీవిత మార్గము” సమావేశాల్లో మన కూటాల్లోని మరో అంశం కోసం సిద్ధపడమని మనకు ప్రోత్సాహం ఇవ్వబడింది—ఆ అంశం పాటలు పాడటం. మీరు దానికి అనుగుణ్యంగా పనిచేశారా? ఆ విధంగా చేయడం బైబిలు సత్యాల్ని మన మనస్సులపైనా మన హృదయాలపైనా ముద్రించుకునేందుకు సహాయం చేయగలదు, అదే సమయంలో సంఘ కూటాల్లో మన ఆనందాన్ని పెంపొందిస్తుంది.
12 పట్టిక వేయబడిన పాటల్లో కొన్నింటిని చదవడము, అందులోని పదాల అర్థాన్ని చర్చించడము వంటివి చేరివున్న సిద్ధపాటు, మన హృదయ లోతుల్లోనుండి పాడటానికి మనకు సహాయం చేయగలదు. ప్రాచీన ఇశ్రాయేలులో, ఆరాధనలో సంగీత వాయిద్యాలు ప్రాముఖ్యంగా ఉపయోగించబడ్డాయి. (1 దినవృత్తాంతములు 25:1; కీర్తన 28:7) మీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించగలరా? ఆ వాయిద్యాన్ని ఉపయోగించి ఆ వారంలో పాడబోయే రాజ్య గీతాల్ని ప్రాక్టీసు చేసి, అటుతర్వాత కుటుంబమంతా పాడకూడదూ. పాటల రికార్డింగును ఉపయోగించడం సాధ్యం కాగల మరొక విషయం. కొన్ని దేశాల్లో మన సహోదరులు సంగీత వాయిద్యాలు లేకుండానే అద్భుతంగా పాడతారు. వారు రోడ్డు మీద నడుస్తుండగా లేదా పొలాల్లో పనులు చేసుకుంటుండగా ఆ వారంలో కూటాల్లో పాడాల్సిన పాటలను పాడుతూ ఆనందిస్తారు.—ఎఫెసీయులు 5:19.
క్షేత్ర సేవకై కుటుంబ సిద్ధపాటు
13, 14. క్షేత్ర పరిచర్య నిమిత్తం మన హృదయాల్ని సిద్ధం చేసే కుటుంబ చర్చలు ఎందుకు అమూల్యమైనవి?
13 యెహోవా గురించీ, ఆయన సంకల్పాల గురించీ ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన భాగం. (యెషయా 43:10-12; మత్తయి 24:14) మనం యౌవనులమైనా లేదా వృద్ధులమైనా మనం సిద్ధపడినట్లైతే ఈ కార్యకలాపంలో మనం ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాము, ఎక్కువ సాధిస్తాము. దీన్ని కుటుంబంలో ఎలా చేయగలము?
14 మన ఆరాధనలోని అన్ని విషయాల్లోలాగే, మన హృదయాలను సిద్ధపర్చుకోవడం ప్రాముఖ్యం. మనం ఏమి చేయబోతున్నామో మాత్రమే కాక, మనం అదెందుకు చేయబోతున్నామో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. రాజైన యెహోషాపాతు దినాల్లో దేవుని ధర్మశాస్త్రంలో ప్రజలకు ఉపదేశం ఇవ్వబడింది, కానీ వారు “తమ హృదయములను సిద్ధపరచుకొనలేదు” అని బైబిలు చెబుతుంది. దీని మూలంగా వారు సత్యారాధన నుండి వారిని దూరంగా తీసుకుపోగల ఆకర్షణలకు లోబడిపోయారు. (2 దినవృత్తాంతములు 20:33; 21:11) మన లక్ష్యం కేవలం క్షేత్ర సేవలో గడిపిన గంటల్ని రిపోర్టులో వేయగల్గడం మాత్రమే కాదు, కేవలం సాహిత్యాన్ని అందించడమూ కాదు. మన పరిచర్య యెహోవా పట్ల మనకుగల ప్రేమకు, జీవాన్ని కోరుకునే అవకాశం అవసరమున్న ప్రజలపట్ల మనకుగల ప్రేమకు ఒక వ్యక్తీకరణయై ఉండాలి. (హెబ్రీయులు 13:15) మనము “దేవుని జతపనివారమై”యున్న కార్యకలాపం అది. (1 కొరింథీయులు 3:9) ఎంతటి ఆధిక్యత ! మనం పరిచర్యలో భాగం వహిస్తుండటం పరిశుద్ధ దేవదూతల సహకారంతో చేస్తున్నాము. (ప్రకటన 14:6, 7) దీనిపట్ల మెప్పుదలను పెంపొందింపజేయడానికి కుటుంబ చర్చలకన్నా శ్రేష్ఠమైన సమయం ఎక్కడుంటుంది ! దాన్ని మనం వారపు పఠన సమయంలోనైనా లేదా లేఖనములను ప్రతిదినము పరిశీలించుటలోని సముచితమైన వచనాన్ని చర్చిస్తున్నప్పుడైనా చేయవచ్చు.
15. కుటుంబముగా మనం క్షేత్ర సేవకు ఎప్పుడు సిద్ధపడవచ్చు?
15 మీ కుటుంబ పఠనంలోని సమయాన్ని అప్పుడప్పుడు మీ కుటుంబంలోని ఇతర సభ్యులు ఆ వారంలో చేసే క్షేత్ర సేవకు సిద్ధపడటానికి సహాయం చేయటానికి ఉపయోగిస్తారా? అలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉండగలదు? (2 తిమోతి 2:15) అది వారి సేవను మరింత అర్థవంతంగాను ఫలవంతంగాను ఉండేలా చేసుకునేందుకు సహాయపడగలదు. అప్పుడప్పుడు అటువంటి సిద్ధపాటుకు పూర్తి కుటుంబ పఠన సమయాన్నే కేటాయించవచ్చు. దానికన్నా తరచుగా, మీరు కుటుంబ పఠనం చివర్లో లేదా వారంలో మరేదైనా సమయంలో క్లుప్తమైన చర్చల్లో క్షేత్ర పరిచర్యలోని కొన్ని అంశాలకు అవధానం ఇవ్వవచ్చు.
16. పేరాలో ఉన్న ఒక్కొక్క చర్య యొక్క విలువను గురించి చర్చించండి.
16 అటువంటి కుటుంబ సమావేశాలు ఈ క్రింది విధంగా వేర్వేరు చర్యల్లో నిర్వహించవచ్చు: (1) చక్కగా అభ్యాసం చేసిన ఒక అందింపును సిద్ధపడండి, అవకాశముంటే బైబిలులోని లేఖనాన్ని చదవడాన్ని అందింపులో ఇమడ్చండి. (2) సాధ్యమైతే ప్రతి ఒక్కరి దగ్గర మంచి కండీషన్లో ఉన్న సొంత క్షేత్ర సేవా బ్యాగు, బైబిలు, నోటు పుస్తకం, పెన్ను లేదా పెన్సిలు, కరపత్రాలు, మరితర సాహిత్యం ఉండేలా చూడండి. సేవా బ్యాగు చాలా ఖరీదైనది కానవసరం లేదు, కానీ అది నీటుగా ఉండాలి. (3) అనియత సాక్ష్యం ఎక్కడ ఎలా ఇవ్వాలో చర్చించండి. ఈ సూచనలోని ప్రతి చర్యనూ క్షేత్ర సేవలో మీరు పని చేసే సమయాల్లో అభ్యాసంలో పెట్టండి. సహాయం చేయగల సూచనలను చేయండి, కానీ మరీ ఎక్కువ విషయాలపై సలహాలు ఇవ్వకండి.
17, 18. (ఎ) కుటుంబముగా ఎటువంటి సిద్ధపాటు మన క్షేత్ర పరిచర్యను మరింత ఫలవంతం చేసుకోవడంలో సహాయపడగలదు? (బి) ఈ సిద్ధపాటులో ఏ అంశం ప్రతివారం చేయవచ్చు?
17 యేసుక్రీస్తు తన అనుచరులకు ఇచ్చిన నియామకంలో అత్యధిక భాగం శిష్యుల్ని చేసే పనే. (మత్తయి 28:19, 20) శిష్యుల్ని చేయడంలో కేవలం ప్రకటనా పనిచేయడమే కాదు ఉన్నది. అందుకు బోధించడం కూడా అవసరం. దాన్ని ప్రభావవంతంగా చేయటానికి మీ కుటుంబ పఠనం మీకు ఎలా సహాయం చేయగలదు?
18 కుటుంబముగా, ఎవరిని పునర్దర్శించడం బాగుంటుందో చర్చించండి. వారిలో కొందరు సాహిత్యాన్ని తీసుకుని ఉండవచ్చు; ఇంకొందరు కేవలం వినివుంటారు. వారిని మీరు ఇంటింటి పరిచర్యలో కలిసివుంటారు లేదా బజారులోనో స్కూల్లోనో అనియత సాక్ష్యం ఇవ్వడం మూలంగా కలిసివుంటారు. దేవుని వాక్యం మిమ్మల్ని నిర్దేశించనివ్వండి. (కీర్తన 25:9; యెహెజ్కేలు 9:4) ఆ వారంలో, మీలో ప్రతి ఒక్కరూ ఎవరిని సందర్శిస్తారో నిర్ణయించుకోండి. దేని గురించి మాట్లాడతారు? ప్రతి సభ్యుడు సిద్ధపడటానికి కుటుంబ చర్చ సహాయం చేయగలదు. ఆసక్తిగలవారితో పంచుకోవడానికి నిర్దిష్టమైన లేఖనాలను నోట్ చేసుకోండి, అలాగే దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు నుండి లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోనుండి యుక్తమైన అంశాల్ని కూడా నోట్ చేసుకోండి. ఒక సందర్శనంలో మరీ ఎక్కువ సమాచారాన్ని చెప్పడానికి ప్రయత్నించకండి. తర్వాత సందర్శనంలో జవాబు చెప్పగలిగే ఒక ప్రశ్నను ఇంటి యజమానికి వేసి తిరిగిరండి. కుటుంబంలో ఒక్కొక్కరు ఏ పునర్దర్శనాన్ని చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చేస్తారు, ఏమి సాధించాలని అనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోవడాన్ని ప్రతివారం కుటంబ పఠనంలో ఎందుకు చేర్చుకోకూడదు. ఇలా చేయడం పూర్తి కుటుంబం చేసే క్షేత్ర పరిచర్య మరింత ఫలవంతంగా ఉండేందుకు దోహదపడుతుంది.
వారికి యెహోవా మార్గాన్ని బోధిస్తూవుండండి
19. కుటుంబ సభ్యులు యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండాలంటే వారు ఏమి అనుభవించాలి, ఇందుకు ఏమి దోహదపడుతుంది?
19 ఈ దుష్ట లోకంలో కుటుంబ శిరస్సుగా ఉండటం ఒక సవాలే. సాతాను వాని దయ్యాలు యెహోవా సేవకుల ఆధ్యాత్మికతను నాశనం చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తాయి. (1 పేతురు 5:8) అంతేగాక, నేడు తల్లిదండ్రులైన మీపై ఎంతో ఒత్తిడి ఉంది, ప్రాముఖ్యంగా తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఇది వాస్తవం. మీరు చేయాలనుకున్న వాటన్నింటినీ చేయడానికి సమయం కనుగొనడం కష్టం. అయితే, కేవలం ఒక సమయంలో ఒక్క సూచనను అన్వయించుకోగల్గినప్పటికీ, ఇది ప్రయత్నానికి తగ్గ ఫలితాలను తీసుకువస్తుంది. తర్వాత మీరు కుటుంబ పఠన కార్యక్రమాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తూ వెళ్లండి. మీకు ఎంతో సన్నిహితంగా ఉన్నవారు యెహోవా మార్గంలో యథార్థతతో నడుస్తుండటాన్ని చూడటం హృదయాన్ని ఉప్పొంగజేసే వరం. యెహోవా మార్గంలో విజయవంతంగా నడవడానికి, కుటుంబ సభ్యులు సంఘ కూటాలకు హాజరు కావడంలోను, క్షేత్ర పరిచర్యలో భాగం వహించడంలోను ఆనందాన్ని అనుభవించగల్గాలి. అది వాస్తవం అవ్వాలంటే సిద్ధపాటు అవసరం అంటే, హృదయానికి క్షేమాభివృద్ధిని కలుగజేసే, ప్రతి ఒక్కరు అర్థవంతమైన భాగాన్ని కలిగివుండేలా చేసే సిద్ధపాటు అవసరం.
20. అనేకమంది తల్లిదండ్రులకు 3 యోహాను 4లో వ్యక్తం చేయబడిన సంతోషాన్ని తామూ అనుభవించడానికి ఏది సహాయపడగలదు?
20 తాను ఆధ్యాత్మికంగా సహాయం చేసినవారి గురించి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 4) స్పష్టమైన లక్ష్యాలను మనస్సులో ఉంచుకుని నిర్వహించబడే కుటుంబ పఠనాలు కుటుంబమంతా అటువంటి సంతోషాన్ని పొందడానికి ఎంతో చేయగలవు. అలాగే ఒక్కొక్క కుటుంబ సభ్యుని వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి దయతో సహాయం చేయాలనే స్ఫూర్తితో వ్యవహరించే కుటుంబ శిరస్సులు కూడా కుటుంబమంతా అటువంటి సంతోషాన్ని పొందడానికి ఎంతో చేయగలరు. దైవిక జీవిత మార్గంపట్ల మెప్పుదలను పెంపొందించుకోవడం ద్వారా, అత్యంత శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని అనుభవించేందుకు తమ కుటుంబాలకు తల్లిదండ్రులు సహాయపడుతున్నారు.—కీర్తన 19:7-11.
మీరు వివరించగలరా?
◻ కూటాలకు సిద్ధపడటం మన పిల్లలకు ఎందుకు అంత ప్రాముఖ్యం?
◻ తమ పిల్లలు ‘బుద్ధిని సంపాదించుకోవడానికి’ తల్లిదండ్రులు వారికి ఎలా సహాయపడగలరు?
◻ మన కుటుంబ పఠనం కూటాలన్నింటికీ సిద్ధపడటానికి ఎలా సహాయం చేయగలదు?
◻ కుటుంబముగా క్షేత్ర సేవకు సిద్ధపడటం మనం మరింత ప్రభావవంతంగా ఉండటానికి ఎలా సహాయం చేస్తుంది?
[20వ పేజీలోని చిత్రం]
మీ కుటుంబ పఠనంలో సంఘ కూటాలకు సిద్ధపడటం ఒక భాగంగా ఉండవచ్చు
[21వ పేజీలోని చిత్రం]
కూటాల్లో పాడటానికి ముందు ప్రాక్టీసు చేయటం ప్రయోజనకరం