కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 9/15 పేజీలు 29-31
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు ఎన్నిక చేసుకున్నాడు
  • తిమోతి రాజ్యాసక్తులను అభివృద్ధి చేశాడు
  • తిమోతి వ్యక్తిత్వంపై వెలుగు
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి!
  • తిమోతి—సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పౌలు, తిమోతి
    నా బైబిలు పుస్తకం
  • ప్రజలకు సహాయపడాలనుకున్న తిమోతి
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 9/15 పేజీలు 29-31

తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’

క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తిమోతిని తన ప్రయాణ సహచరునిగా ఎంపిక చేసుకున్నప్పుడు తిమోతి చాలా చిన్నవాడే. దాదాపు 15 ఏండ్లపాటు కొనసాగనైయున్న భాగస్వామ్యానికి అది నాంది. ఈ ఇద్దరు పురుషుల మధ్య అభివృద్ధి చెందిన అనుబంధం ఎలాంటిదంటే, పౌలు తిమోతిని “ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు”ను అనీ, “విశ్వాసమునుబట్టి నా నిజమైన కుమారుడ”నీ పిలువగలిగాడు.—1 కొరింథీయులు 4:17; 1 తిమోతి 1:2.

తిమోతి పౌలుకు అంత ప్రీతిపాత్రుడు కావడానికి దోహదపడిన, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? తిమోతి అంత అమూల్యమైన సహవాసిగా ఎలా అయ్యాడు? తిమోతి కార్యకలాపాలను గూర్చిన ప్రేరేపిత రికార్డు నుండి మనం ప్రయోజనకరమైన ఏ పాఠాల్ని నేర్చుకోగలము?

పౌలు ఎన్నిక చేసుకున్నాడు

అపొస్తలుడైన పౌలు దాదాపు సా.శ. 50లో చేసిన తన రెండవ మిషనరీ ప్రయాణంలో [నేటి టర్కీలో ఉన్న] లుస్త్రను సందర్శించినప్పుడు యౌవనస్థుడైన తిమోతి అనే శిష్యుణ్ని కనుగొన్నాడు. లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న క్రైస్తవుల మధ్య, బహుశ ఇరవై దరిదాపుల్లో ఉన్న లేదా అప్పుడే ఇరవైల్లోకి ప్రవేశించిన తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 16:1-3) ఆయన పేరుకు అర్థం “దేవుణ్ని ఘనపర్చేవాడు”—ఆయన సార్థకనామధేయుడే. చిన్నప్పటి నుండే తిమోతికి అతని అవ్వ అయిన లోయి, తల్లి అయిన యునీకేలు పరిశుద్ధ లేఖనాలను బోధించారు. (2 తిమోతి 1:3-5; 3:14, 15) వారు అప్పటికి రెండు సంవత్సరాల క్రితం, పౌలు మొదటిసారిగా వారి నగరాన్ని సందర్శించినప్పుడు బహుశ క్రైస్తవత్వాన్ని స్వీకరించివుండవచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పనిచేయడం మూలంగా, ఒకానొక ప్రవచనం తిమోతి భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది సూచించింది. (1 తిమోతి 1:18) ఆ నిర్దేశానికి అనుగుణ్యంగా పౌలు మరితర సంఘ పెద్దలు ఈ యౌవనస్థునిపై చేతులుంచారు, తద్వారా ఒక నిర్దిష్టమైన సేవ నిమిత్తం ఆయన్ను వేర్పరిచారు, తర్వాత అపొస్తలుడు ఆయన్ను తన మిషనరీ సహవాసిగా ఎంపిక చేసుకున్నాడు.—1 తిమోతి 4:14; 2 తిమోతి 1:6.

తిమోతి తండ్రి అవిశ్వాసి అయిన గ్రీకు దేశస్థుడు గనుక ఆయనకు సున్నతి కాలేదు. అయితే ఇది క్రైస్తవులకు వర్తించదు. కానీ, తాము సందర్శించబోయే యూదులకు అభ్యంతరం కలగకుండా ఉండాలని తిమోతి బాధాకరమైన ఈ ప్రక్రియకు ఒప్పుకున్నాడు.—అపొస్తలుల కార్యములు 16:3.

తిమోతి అంతకు ముందు యూదునిగా పరిగణించబడ్డాడా? కొందరు విద్వాంసులు వాదించేదేమంటే, రబ్బీ అధికారుల ప్రకారం “అంతర్వివాహం జరిగినప్పుడు పుట్టిన సంతానం మతం తల్లి ఆధారంగా నిర్ణయించబడుతుంది, తండ్రి ఆధారంగా కాదు.” అంటే, “యూదురాలైన తల్లికి పుట్టిన పిల్లలు యూదులే అవుతారు.” అయితే, రచయిత అయిన షే కోహెన్‌, అటువంటి “రబ్బీ సంబంధిత నియమం సా.శ. మొదటి శతాబ్దంలో ఉందన్న” విషయమూ, అది ఆసియా మైనరులోని యూదులు పాటించేవారన్న విషయమూ సందేహాస్పదం అంటున్నాడు. చరిత్ర సాక్ష్యాన్ని పరిశీలించిన పిమ్మట ఆయన, అన్యులైన మగవారు ఇశ్రాయేలీయుల స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు, “ఆ కుటుంబం అంతా ఇశ్రాయేలీయుల మధ్య నివసించినప్పుడు మాత్రమే ఈ వివాహంలో జన్మించిన పిల్లలు ఇశ్రాయేలీయులుగా పరిగణించబడతారు. తల్లి తన మాతృభూమిలో ఉన్నప్పుడు మాత్రమే వంశావళి ఆమె మీద ఆధారపడివుండేది. ఇశ్రాయేలీయురాలైన స్త్రీ అన్యుడైన తన భర్తతో ఉండటానికి పరాయి దేశానికి వెళ్లినప్పుడు ఆమె పిల్లలు అన్యులుగా పరిగణించబడేవారు.” ఏదేమైనా, తిమోతికి అన్యుడైన తండ్రి యూదురాలైన తల్లి ఉండటం ప్రకటనా పనికి చక్కగా ఉపకరించి ఉండవచ్చు. ఆయనకు అటు యూదులకు సంబంధించి, ఇటు అన్యులకు సంబంధించి ఏ విధమైన సమస్యలూ ఉండి ఉండకపోవచ్చు, అది బహుశ ఆయన వారి మధ్యనున్న విభేదాలను తీసివేయగల్గడంలో ఆయనకు సహాయపడి ఉండవచ్చు.

పౌలు లుస్త్రకు చేసిన సందర్శనం తిమోతి జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుందని సూచించింది. పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించడంలోను, క్రైస్తవ పెద్దలతో నమ్రతగా సహకరించటంలోను ఈ యౌవనస్థుని సుముఖత గొప్ప ఆశీర్వాదాలను సేవాధిక్యతలను తీసుకువచ్చింది. అప్పట్లో ఆయన గ్రహించాడో లేదోగాని, పౌలు నిర్దేశంలో తిమోతి ప్రాముఖ్యమైన దైవపరిపాలన నియామకాల్లో ఉపయోగపడనైయున్నాడు, తన స్వగృహాన్ని విడిచి అప్పటి సామ్రాజ్య రాజధాని అయిన రోమ్‌ వరకు కూడా వెళ్లనైయున్నాడు.

తిమోతి రాజ్యాసక్తులను అభివృద్ధి చేశాడు

తిమోతి కార్యకలాపాల గురించి మనకు పాక్షికమైన రికార్డు మాత్రమే ఉంది, కానీ ఆయన రాజ్యాసక్తులను అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ప్రయాణించాడు. సా.శ. 50వ సంవత్సరంలో పౌలు సీలలతో తిమోతి చేసిన మొదటి ప్రయాణంలో ఆయన ఆసియా మైనరు గుండా యూరప్‌ లోనికి వెళ్లాడు. ఆయన అక్కడ ఫిలిప్పీ, థెస్సలొనీక, బెరయల్లో ప్రకటనా కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. వ్యతిరేకత మూలంగా పౌలు ఏథెన్సుకు తరలివెళ్లిన తర్వాత, తిమోతి సీలలు బెరయలో ఏర్పడిన శిష్యుల సమూహాన్ని చూసుకోవడానికి అక్కడే ఉండిపోయారు. (అపొస్తలుల కార్యములు 16:6–అపొస్తలుల కార్యములు 7:14) తర్వాత పౌలు తిమోతిని థెస్సలొనీకలోని క్రొత్త సంఘాన్ని బలపర్చడానికి అక్కడికి పంపించాడు. తిమోతి పౌలును కొరింథులో కలిసేటప్పటికి ఆయన సువార్తను బాగానే వ్యాప్తి చేశాడు.—అపొస్తలుల కార్యములు 18:5; 1 థెస్సలొనీకయులు 3:1-7.

తిమోతి కొరింథీయులతో ఎంతకాలం ఉన్నాడన్నది లేఖనాలు తెలియజేయడం లేదు. (2 కొరింథీయులు 1:19) అయితే, బహుశ సా.శ. 55లో పౌలు ఆయన్ను తిరిగి వారి దగ్గరికి పంపించాలని అనుకున్నాడు, ఎందుకంటే వారి పరిస్థితిని గురించిన కలతపర్చే వార్త ఆయనకు చేరింది. (1 కొరింథీయులు 4:17; 16:10) అటు తర్వాత, ఎరస్తుతోపాటు తిమోతి ఎఫెసు నుండి మాసిదోనియకు పంపించబడ్డాడు. పౌలు కొరింథు నుండి రోమీయులకు వ్రాసినప్పుడు తిమోతి మళ్లీ ఆయనతో ఉన్నాడు.—అపొస్తలుల కార్యములు 19:22; రోమీయులు 16:21.

తిమోతి, మరితరులు పౌలుతోపాటు కొరింథును విడిచిపెట్టి యెరూషలేముకు పయనమయ్యారు, వారందరూ కనీసం త్రోయ వరకన్నా పౌలుతో ఉన్నారు. తిమోతి యెరూషలేము వరకు కొనసాగాడా లేదా అన్నది అనిశ్చితం. కానీ రోమ్‌లోని ఖైదులోనుండి దాదాపు సా.శ. 60-61లో పౌలు వ్రాసిన మూడు లేఖల్లోని మొదటి వచనాల్లో ఆయన పేరు ఉంది.a (అపొస్తలుల కార్యములు 20:4; ఫిలిప్పీయులు 1:1; కొలొస్సయులు 1:1; ఫిలేమోను 1) పౌలు తిమోతిని రోమ్‌నుండి ఫిలిప్పీకు పంపించాలని అనుకున్నాడు. (ఫిలిప్పీయులు 2:19) పౌలు ఖైదు నుండి విడుదల పొందిన తర్వాత, తిమోతి ఈ అపొస్తలుని నిర్దేశం ప్రకారం ఎఫెసులోనే ఉండిపోయాడు.—1 తిమోతి 1:3.

మొదటి శతాబ్దంలో ప్రయాణాలు చేయడం అంత సులభమూ కాదు, అంత సౌకర్యవంతమూ కాదు, అందుకని తిమోతి ఇష్టపూర్వకంగా సంఘాల నిమిత్తం అనేక ప్రయాణాలు చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. (కావలికోట ఆగస్టు 15, 1996, పేజీ 29లోని బాక్సు చూడండి.) ఆయన ముందున్న ప్రయాణాల్లో కేవలం ఒకదాన్ని పరిశీలించి ఇది తిమోతిని గురించి మనకు ఏమి చెబుతుందో చూడండి.

తిమోతి వ్యక్తిత్వంపై వెలుగు

పౌలు రోమ్‌లోని ఖైదులో ఉండి ఫిలిప్పీలో హింసల్ని అనుభవిస్తున్న క్రైస్తవులకు లేఖ వ్రాసినప్పుడు తిమోతి ఆయనతోపాటు ఉన్నాడు, పౌలు తన లేఖలో ఇలా అన్నాడు: “నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.”—ఫిలిప్పీయులు 1:1, 13, 28-30; 2:19-22.

తోటి విశ్వాసుల పట్ల తిమోతికి ఉన్న చింతను ఈ మాటలు నొక్కిచెప్పాయి. ఆయన ఓడలో ప్రయాణించకపోతే మాత్రం, అడ్రియాటిక్‌ సముద్రపాయను దగ్గరి దారిన దాటి రోమ్‌నుండి ఫిలిప్పీకి కాలినడకన వెళ్లడానికి 40 రోజులు తిరిగి రావటానికి 40 రోజులు పడుతుంది. తన సహోదర సహోదరీలకు సేవచేయడానికి తిమోతి అదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

తిమోతి విస్తృతమైన ప్రయాణాలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఆయనకు ఒంట్లో బాగుండలేదు. ఆయనకు కడుపులో కాస్త అనారోగ్యంగా ఉన్నదన్నది స్పష్టం, “తరచుగా వచ్చు బలహీనతల”ను కూడా అనుభవించాడు. (1 తిమోతి 5:23) అయినా ఆయన సువార్త నిమిత్తం ఎంతో శ్రమించాడు. పౌలుకు ఆయనతో అంత సన్నిహితమైన సంబంధం ఉండటంలో ఆశ్చర్యం లేదు!

అపొస్తలుడైన పౌలు సంరక్షణ క్రింద, వారిద్దరు కలిసి పొందిన అనుభవాల మూలంగా తిమోతి పౌలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడం ప్రారంభించాడన్నది స్పష్టమౌతుంది. అందుకనే పౌలు ఆయనకు ఇలా చెప్పగలిగాడు: “నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి.” తిమోతి పౌలుతోపాటు కన్నీరు విడిచాడు, ఆయన ప్రార్థనల్లో ఉన్నాడు, రాజ్యాసక్తులను అభివృద్ధి చేయడానికి ఆయనతో భుజభుజాలు కలిపి శ్రమించాడు.—2 తిమోతి 1:3, 4; 3:10, 11.

‘నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యవద్దని’ పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. దీన్నిబట్టి చూస్తే తిమోతి కాస్త బిడియస్తునిగా, తన అధికారాన్ని నొక్కిచెప్పడానికి సందేహిస్తున్న వ్యక్తిగా ఉండవచ్చని తెలుస్తుంది. (1 తిమోతి 4:12; 1 కొరింథీయులు 16:10, 11) అయినా, ఆయనకు ఒంటరిగానే సేవ చేయగల సామర్థ్యం ఉంది, పౌలు ఆయన్ను బాధ్యతాయుతమైన నియామకాలపై ధైర్యంగా పంపించగలిగాడు. (1 థెస్సలొనీకయులు 3:1, 2) ఎఫెసులోని సంఘంలో బలమైన దైవపరిపాలనా పర్యవేక్షణ అవసరం ఉన్నట్లు పౌలు గుర్తించినప్పుడు ఆయన, “సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని . . . కొందరికి ఆజ్ఞాపించుటకు” తిమోతిని అక్కడే ఉండమని చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (1 తిమోతి 1:3) అయితే, అనేకమైన బాధ్యతలు నమ్మకంగా అప్పజెప్పబడినప్పటికీ తిమోతి వినయమనస్కుడిగా ఉన్నాడు. బహుశ తనకు బిడియం ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగలవాడే. ఉదాహరణకు, ఆయన పౌలుకు సహాయం చేయడానికి రోమ్‌కు వెళ్లాడు, పౌలు అక్కడ తన విశ్వాసం మూలంగా న్యాయవిచారణలో ఉన్నాడు. నిజానికి, బహుశ అదే కారణాన తిమోతి కూడా ఖైదులో కొంతకాలం గడిపాడు.—హెబ్రీయులు 13:23.

నిస్సందేహంగా తిమోతి పౌలు నుండి ఎంతో నేర్చుకున్నాడు. పౌలు తన ఈ జతపనివాని పట్ల కలిగివున్న గౌరవానికి, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో భాగంగా ఉన్న దైవికంగా ప్రేరేపించబడిన రెండు లేఖలను పౌలు ఆయనకు వ్రాశాడన్న వాస్తవం కావలసినంత సాక్ష్యాధారాన్నిస్తుంది. దాదాపు సా.శ. 65లో పౌలు తాను హతసాక్షి అయ్యే సమయం ఆసన్నమైందని గ్రహించినప్పుడు ఆయన మరోసారి తిమోతిని పిలిపించాడు. (2 తిమోతి 4:6, 9) అపొస్తలుడైన పౌలు చంపబడటానికి ముందు తిమోతి ఆయన్ను కలిశాడా లేదా అన్నది లేఖనాలు చెప్పడం లేదు.

మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి!

తిమోతి ఉంచిన చక్కని మాదిరి నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన పౌలుతో సహవసించడం మూలంగా ఎంతో ప్రయోజనాన్ని పొందాడు, బిడియంగల ఒక యౌవనస్థుని నుండి ఒక పైవిచారణకర్తగా తయారయ్యాడు. నేడు అటువంటి సహవాసాన్ని అనుభవించడం ద్వారా యౌవనులైన క్రైస్తవ స్త్రీపురుషులు ఎంతో నేర్చుకోవచ్చు. వారు యెహోవా సేవను తమ కెరీర్‌గా చేసుకుంటే వారు చేయడానికి యోగ్యమైన పని ఎంతో ఉంటుంది. (1 కొరింథీయులు 15:58) వారు తమ స్వంత సంఘంలో పయినీర్లుగా అంటే పూర్తికాల ప్రకటనా పనివారుగా తయారు కావచ్చు, లేదా వారు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ సేవచేయవచ్చు. ఉన్న అనేక సాధ్యతల్లో కొన్ని ఏమిటంటే, వేరే దేశాల్లో మిషనరీ పని, లేదా వాచ్‌ టవర్‌ సొసైటీ యొక్క ప్రపంచ ముఖ్య కార్యాలయాల్లోను లేదా దాని బ్రాంచిల్లో ఒకదానిలోను సేవ చేయడం. నిజమే, క్రైస్తవులందరూ యెహోవాకు పూర్ణాత్మతో సేవచేయడం ద్వారా తిమోతి ప్రదర్శించినటువంటి స్ఫూర్తినే ప్రదర్శించగలరు.

మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనీ, యెహోవా సంస్థలో ఆయన ఏది యుక్తమని తలుస్తాడో దానిలో ఉపయోగపడాలనీ ఆకాంక్షిస్తున్నారా? మరైతే తిమోతి చేసినట్లుగా చేయండి. సాధ్యమైనంత మట్టుకు మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి. భవిష్యత్తులో మీరు ప్రవేశించడానికి ఎటువంటి సేవాధిక్యతా ద్వారాలు తెరుచుకుంటాయో ఎవరికి తెలుసు?

[అధస్సూచీలు]

a పౌలు వ్రాసిన ఇతర నాలుగు లేఖల్లో కూడా తిమోతి ప్రస్తావన ఉంది.—రోమీయులు 16:21; 2 కొరింథీయులు 1:1; 1 థెస్సలొనీకయులు 1:1; 2 థెస్సలొనీకయులు 1:1.

[31వ పేజీలోని చిత్రం]

“అతని వంటివాడెవడును నాయొద్ద లేడు”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి