మీరు అంతము వరకు సహించగలరు
“మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో [“సహనముతో,” NW] పరుగెత్తుదము.”—హెబ్రీయులు 12:1.
1, 2. సహనం కనపర్చడం అంటే ఏమిటి?
“మీకు ఓరిమి [“సహనము,” NW] అవసరమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులకు వ్రాశాడు. (హెబ్రీయులు 10:36) ఈ లక్షణం ఎంత ప్రాముఖ్యమైనదో నొక్కిచెబుతూ అపొస్తలుడైన పేతురు అదే విధంగా క్రైస్తవులకు ఇలా ఉద్భోదించాడు: “మీ విశ్వాసమునందు . . . సహనమును . . . అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5-7) కానీ అసలు సహనం అంటే ఏమిటి?
2 “సహనం” అన్నదానికైన గ్రీకు క్రియా పదాన్ని, “పారిపోకుండా నిలిచియుండుట . . . స్థిరంగా నిలబడుట, గట్టిగా హత్తుకొనుట” అని ఒక గ్రీకు-ఇంగ్లీషు నిఘంటువు నిర్వచిస్తుంది. “సహనం” అన్నదానికైన గ్రీకు నామవాచక పదాన్ని గురించి ఒక సంప్రదింపు గ్రంథం ఇలా చెబుతుంది: “పోనీ వదిలేద్దాంలే అనికాకుండ గట్టి నిరీక్షణతో సమస్తాన్ని భరించే స్ఫూర్తిని ఇది కలిగియుంది . . . ఇది ఒక వ్యక్తి తన పాదాలు కదలకుండా గాలికి ఎదురుగా నిలబడేట్లు చేస్తుంది. కలిగే ఏ నొప్పిని లెక్కచేయక గమ్యాన్నే చూస్తుంది గనుక, అది అత్యంత కఠినమైన పరీక్షను సహితం ఒక మహిమగా మార్చగల సద్గుణమైయుంది.” కాబట్టి సహనం అడ్డంకులు, కష్టాలు ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి స్థిరంగా నిలబడి నిరీక్షణను కోల్పోకుండా ఉండేలా చేస్తుంది. ఈ లక్షణం అవసరం ప్రాముఖ్యంగా ఎవరికుంది?
3, 4. (ఎ) సహనం ఎవరికి అవసరం? (బి) మనం అంతం వరకు ఎందుకు సహించాలి?
3 క్రైస్తవులందరూ సహనం అవసరం ఉన్న పందెంలో సూచనార్థకంగా ఉన్నారు. దాదాపు సా.శ. 65లో అపొస్తలుడైన పౌలు తన తోటి పనివాడు, నమ్మకమైన ప్రయాణ సహవాసియైన తిమోతికి భరోసానిస్తూ ఈ మాటల్ని వ్రాశాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.” (2 తిమోతి 4:7) ‘పరుగును కడ ముట్టించడం’ అన్న మాటల్తో పౌలు క్రైస్తవునిగా తన జీవితాన్ని నిర్దేశిత దిశ, ముగింపు గీత ఉన్న పరుగు పందెంతో పోలుస్తున్నాడు. ఆ సమయానికల్లా పౌలు పందెంలో చివరికంటా విజయవంతంగా చేరుకోబోతున్నాడు, బహుమానాన్ని పొందుతానని నమ్మకంగా ఎదురుచూస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు . . . అనుగ్రహించును.” (2 తిమోతి 4:8) తాను అంతం వరకు సహించాడు కాబట్టి తనకు బహుమానం లభిస్తుందని పౌలు పూర్తి నిశ్చయతతో ఉన్నాడు. మనందరి విషయమేమిటి?
4 పందెంలో పాల్గొనే వారిని ప్రోత్సహించడానికి పౌలు ఇలా వ్రాశాడు: “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో [“సహనముతో,” NW] పరుగెత్తుదము.” (హెబ్రీయులు 12:1) క్రైస్తవులముగా మనం, యెహోవా దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఈ సహనపు పందెంలో ప్రవేశిస్తాము. శిష్యులుగా ఉండే ఈ మార్గంలో మంచి ప్రారంభం అనేది ప్రాముఖ్యమే, కానీ అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది మనం చివరికంటా పరుగెత్తడమే. యేసు ఇలా ప్రకటించాడు: “అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) పందేన్ని విజయవంతంగా ముగించే వారికోసం వేచివుండే బహుమానం నిత్యజీవం! అందుకని మన మనస్సులో ఒక లక్ష్యంతో అంతం వరకూ సహించాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఏమి సహాయపడుతుంది?
సరైన పోషకాహారం—ప్రాముఖ్యం
5, 6. (ఎ) జీవితపు పందెంలో సహనం కనపర్చాలంటే మనం దేనికి అవధానం ఇవ్వాలి? (బి) మనం ఏ ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందాలి, ఎందుకు?
5 గ్రీసులోని కొరింథు నగరం దగ్గర్లో ప్రాచీన కాలాల్లో ప్రసిద్ధిచెందిన ఇస్త్మియన్ క్రీడలు జరిగే ప్రాంతం ఉంది. కొరింథులోని తన సహోదరులకు అక్కడ జరిగే క్రీడారంగ పోటీలు మరితర ఆటలపోటీలు సుపరిచితమేనని పౌలుకు తెలుసు అనడంలో సందేహంలేదు. వారి జ్ఞానంపై ఆధారపడుతూ ఆయన వారు చేరివున్న జీవితపు పరుగుపందెం గురించి గుర్తు చేశాడు: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.” పందెంలో ఉండటం, చివరికంటా పట్టుదలతో కొనసాగటం యొక్క ప్రాముఖ్యతను పౌలు నొక్కి చెప్పాడు. కానీ వారలా చేయడానికి ఏమి సహాయపడుతుంది? ఆయనిలా జతచేశాడు: “పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును.” అవును, ప్రాచీన కాలంలో పందెంలో పాల్గొనేవారు కఠినమైన శిక్షణకు లోబడేవారు, తాము ఏమి తింటాము ఏమి త్రాగుతాము అనే విషయంలో అత్యంత జాగ్రత్త వహించేవారు, గెలుపొందేందుకు గాను వారు తమ ప్రతి కార్యకలాపాన్నీ అదుపు చేసుకునేవారు.—1 కొరింథీయులు 9:24, 25.
6 క్రైస్తవులు ప్రవేశించిన పందెం సంగతేమిటి? “జీవితపు పందెంలో సహనం కనపర్చాలంటే మనం మన ఆధ్యాత్మిక పోషకాహారానికి పూర్తి అవధానాన్నివ్వాలి” అని యెహోవాసాక్షుల ఒక సంఘంలోని ఒక పెద్ద అంటున్నాడు. “ఓర్పునకు [“సహనానికి,” NW] . . . కర్తయగు దేవుడు” అయిన యెహోవా మనకు అందించిన ఆధ్యాత్మిక ఆహారం గురించి ఆలోచించండి. (రోమీయులు 15:5) మన ఆధ్యాత్మిక పోషణకు ప్రాథమిక మూలం ఆయన వాక్యమైన బైబిలు. మనం బైబిలును క్రమంగా చదవడానికి షెడ్యూలు వేసుకోవద్దా? “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా యెహోవా తగిన సమయంలో కావలికోట మరియు తేజరిల్లు! అనే పత్రికలూ మరితర బైబిలు ఆధారిత ప్రచురణలు అందిస్తున్నాడు. (మత్తయి 24:45) వీటిని శ్రద్ధగా పఠించడం మనల్ని ఆధ్యాత్మికంగా పటిష్ఠపరుస్తుంది. అవును, మనం సమయాన్ని తీసుకోవాలి, వ్యక్తిగత పఠనం కోసం ‘సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి.’—ఎఫెసీయులు 5:15-16.
7. (ఎ) మనం కేవలం ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలను తెలుసుకోవడంతోనే ఎందుకు సంతృప్తి చెందకూడదు? (బి) మనం ఎలా “సంపూర్ణులమగుటకు సాగిపో”గలము?
7 క్రైస్తవ శిష్యులుగా ఈ మార్గంలో మనం కొనసాగాలంటే, ప్రాథమికమైన “మూలోపదేశము”కు మించి మనం “సంపూర్ణులమగుటకు సాగి”పోవలసిన అవసరం ఉంది. (హెబ్రీయులు 6:1) కాబట్టి మనం సత్యము యొక్క “వెడల్పు పొడుగు లోతు ఎత్తు” యందు ఆసక్తిని పెంపొందించుకుని, ‘వయస్సు వచ్చిన వారికే తగిన బలమైన ఆహారము’ నుండి పోషణను పొందాలి. (ఎఫెసీయులు 3:15-18; హెబ్రీయులు 5:12-14) ఉదాహరణకు, యేసు భూమ్మీద ఉన్నప్పటి, నమ్మదగిన ఆయన జీవిత వృత్తాంతాలైన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను తీసుకోండి. ఈ సువార్త నివేదికలను జాగ్రత్తగా పఠించడం ద్వారా మనం, యేసు చేసిన కార్యాలనూ ఆయన ఎటువంటి వ్యక్తి అన్నదీ తెలుసుకోవటం మాత్రమే కాదుగానీ ఆయన చర్యలను ప్రేరేపించిన ఆలోచనా విధానాన్ని కూడా మనం గ్రహిస్తాము. అప్పుడు మనం “క్రీస్తు మనస్సు కలిగిన” వారము కాగల్గుతాము.—1 కొరింథీయులు 2:16.
8. క్రైస్తవ కూటాలు జీవితపు పందెంలో సహనం కనపర్చడానికి ఎలా మనకు సహాయం చేస్తాయి?
8 పౌలు తన తోటి విశ్వాసులకు ఇలా ఉద్భోదించాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) క్రైస్తవ కూటాలు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తాయో కదా! మనలో ఆసక్తి చూపిస్తూ, మనం అంతం వరకూ సహించడానికి మనకు సహాయం చేయాలని ఇష్టపడే ప్రేమగల సహోదరీ సహోదరులతో ఉండటం ఎంత సేదదీర్పునిస్తుందో కదా! యెహోవా అందించే ఈ ప్రేమపూర్వక ఏర్పాటును మనం తేలిగ్గా తీసుకోలేము. శ్రద్ధగా చేసే వ్యక్తిగత పఠనం, కూటాలకు క్రమంగా హాజరవ్వటం ద్వారా మనం ‘బుద్ధి విషయమై పెద్దవారమౌదాము.’—1 కొరింథీయులు 14:20.
మిమ్మల్ని ఉత్తేజపర్చడానికి ప్రేక్షకులు
9, 10. (ఎ) సహనం అవసరమయ్యే పందెంలో ప్రేక్షకులు ఎలా ప్రోత్సాహానికి మూలంగా ఉంటారు? (బి) హెబ్రీయులు 12:1లో పేర్కొనబడిన ‘మనల్ని ఆవరించివున్న మేఘమువలె ఉన్న గొప్ప సాక్షి సమూహము’ ఏమిటి?
9 అయితే, పరుగెత్తేవాడు ఎంత చక్కగా సిద్ధపడి ఉన్నప్పటికీ, మార్గంలో ఆయన తొట్రుపడేలా చేసేవి జరగవచ్చు. “మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?” అని పౌలు అడిగాడు. (గలతీయులు 5:7) స్పష్టంగా, కొందరు గలతీ క్రైస్తవులు చెడు సహవాసాల్ని పెంపొందించుకున్నారు, దాని ఫలితంగా వారు జీవితపు పందెంలో వికర్షణకు గురయ్యారు. మరోవైపు, ఇతరుల నుండి మద్దతూ ప్రోత్సాహమూ పందెంలో సహనం కనపర్చడాన్ని సులభతరం చేస్తాయి. ఇది, ఏదైనా క్రీడలో పాల్గొనేవారిపై ప్రేక్షకులు చూపించగల ప్రభావం లాంటిదే. పోటీదారులు మొదలు నుండి ముగింపు వరకూ పట్టుదలతో ఉండేలా ఉత్సాహవంతులైన ప్రేక్షకులు వారి ఉత్తేజాన్ని ఎక్కువ చేస్తారు. సాధారణంగా ఉండే పెద్ద సంగీతమూ చప్పట్లతోపాటు, ఆనందాతిరేకంతో ప్రేక్షకులు పెట్టే కేకలు పోటీదారులు ముగింపు గీతను చేరుకుంటుండగా వారికి అవసరమైన పురికొల్పును ఇస్తాయి. నిజంగానే, సహానుభూతిగల ప్రేక్షకులు పందెంలో ఉన్నవారిపైన అనుకూలమైన ప్రభావాన్ని చూపించగలరు.
10 క్రైస్తవులు ప్రవేశించిన జీవితపు పందెంలో ప్రేక్షకులు ఎవరు? హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉన్నట్లుగా, విశ్వసనీయులైన క్రీస్తుపూర్వ యెహోవాసాక్షులను పేర్కొన్న తర్వాత పౌలు ఇలా వ్రాశాడు: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో [“సహనముతో,” NW] పరుగెత్తుదము.” (హెబ్రీయులు 12:1) మేఘము అన్న రూపకాలంకారాన్ని ఉపయోగిస్తున్నప్పుడు పౌలు, నిర్దిష్టమైన పరిమాణమూ ఆకారంతో స్పష్టమైన రూపురేఖలతో ఉన్న మేఘాన్ని సూచించే గ్రీకు పదాన్ని ఉపయోగించలేదు. బదులుగా, నిఘంటుకారుడైన డబ్ల్యు. ఇ. వైన్ ప్రకారం, “ఆకాశం నిండా నిరాకారంగా దట్టంగా అలుముకుని ఉన్న మేఘాల”ను సూచించే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. స్పష్టంగా, పౌలు మనస్సులో గొప్ప సంఖ్యలోని సాక్షులు ఉన్నారు—ఎంతమందంటే వారు విస్తరించి ఉన్న మేఘంలా ఉన్నారు.
11, 12. (ఎ) నమ్మకమైన క్రీస్తుపూర్వ సాక్షులు మనం సహనంతో పందెంలో పరుగెత్తడానికి సూచనార్థకంగా ఎలా పురికొల్పగలరు? (బి) ‘గొప్ప సాక్షి మేఘము’ నుండి మనం మరింత ఎక్కువగా ఎలా ప్రయోజనం పొందగలము?
11 క్రీస్తుపూర్వ విశ్వసనీయులైన క్రైస్తవులు అక్షరార్థంగా ప్రస్తుత-దిన ప్రేక్షకులుగా ఉండగలరా? ఎంతమాత్రం సాధ్యం కాదు. వారందరూ మరణమందు నిద్రిస్తూ పునరుత్థానం కోసం వేచివున్నారు. అయినప్పటికీ, వారు జీవించివున్నప్పుడు పందెంలో విజయాన్ని పొందినవారే, వారి మాదిరులు బైబిలు పుటల్లో సజీవంగా ఉన్నాయి. మనం లేఖనాలను పఠిస్తుండగా, ఈ విశ్వసనీయుల పాత్రలు మన మనస్సుల్లో సజీవంగా మెదులుతూ మన పందేన్ని తుదముట్టించమని సూచనార్థకంగా ఆనందాతిరేకంతో కేకలు వేస్తూ ప్రోత్సహించగలరు.—రోమీయులు 15:4.a
12 ఉదాహరణకు, ఈ లోక సంబంధమైన అవకాశాలు మనల్ని ప్రలోభపెట్టినప్పుడు, మోషే ఐగుప్తులోని మహిమను ఎలా త్యజించాడో పరిశీలించడం మనం మన మార్గాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి పురికొల్పదా? మనకు ఎదురైన పరీక్ష కఠినమైనదిగా ఉన్నదన్పించినప్పుడు, తన కుమారుడైన ఇస్సాకును అర్పించమని అడిగినప్పుడు అబ్రాహాము ఎదుర్కొన్న కఠినమైన పరీక్షను గుర్తు చేసుకోవడం విశ్వాస పోటీలో మనం తల ఒగ్గకుండేలా నిశ్చయంగా ప్రోత్సహిస్తుంది. సాక్షుల ఈ ‘గొప్ప మేఘము’ మనల్ని ఈ మార్గంపై ఎంతమేరకు ప్రోత్సహిస్తుందన్నది మనం మన వివేచనా దృష్టితో వారిని ఎంత స్పష్టంగా చూస్తున్నామన్న దానిపై ఆధారపడివుంటుంది.
13. జీవితపు పందెంలో ఆధునిక కాలంలోని యెహోవాసాక్షులు మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారు?
13 ఆధునిక కాలాల్లో కూడా మన చుట్టూ గొప్ప సంఖ్యలో యెహోవాసాక్షులు ఉన్నారు. అభిషిక్త క్రైస్తవులు, అలాగే “గొప్ప సమూహము”లోని స్త్రీపురుషులు ఉంచిన విశ్వాస మాదిరులు ఎంత అద్భుతమైనవో కదా! (ప్రకటన 7:9) వారి జీవిత చరిత్రలను మనం అప్పుడప్పుడూ ఈ పత్రికలోనూ మరితర వాచ్ టవర్ ప్రచురణల్లోనూ చదువవచ్చు.b వారి విశ్వాసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనం కూడా అంతం వరకూ సహించడానికి ప్రోత్సాహాన్ని పొందుతాము. యెహోవాను విశ్వసనీయంగా సేవిస్తున్న సన్నిహితులైన మిత్రులు, బంధువుల మద్దతు కూడా ఉండటం ఎంత గొప్ప విషయం! అవును, జీవితపు పందెంలో మనల్ని ప్రోత్సహించడానికి చాలామంది మనకున్నారు.
మీ వేగాన్ని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకోండి
14, 15. (ఎ) మన వేగాన్ని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) లక్ష్యాల్ని పెట్టుకోవడంలో ఎందుకు సహేతుకంగా ఉండాలి?
14 మారథాన్లాంటి సుదీర్ఘమైన పందెంలో పరుగెత్తేటప్పుడు పోటీదారుడు తన వేగాన్ని జ్ఞానయుక్తంగా నిర్ణయించుకోవాలి. “మొదలే మరీ వేగంగా వెళ్ళడం పరాజయాన్నే తీసుకువస్తుంది” అని న్యూయార్క్ రన్నర్ పత్రిక అంటుంది. “సాధారణంగా దాని ఫలితం ఏమిటంటే చివరి కొన్ని మైళ్ళు పరుగెత్తటం ఎంతో కష్టతరంగా ఉంటుంది లేదా పోటీ మధ్యలోనే నిష్క్రమించడం జరుగుతుంది.” ఒక మారథాన్ రన్నర్ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “పరుగుపందెం సిద్ధపాటు కోసం నేను హాజరైన లెక్చర్లో ప్రసంగీకుడు స్పష్టంగా ఇలా హెచ్చరించాడు: ‘మరీ వేగంగా పరుగెత్తే వాళ్లతో సమానంగా పరుగెత్తటానికి ప్రయత్నించవద్దు. మీ వేగంలో మీరు పరుగెత్తండి. లేకపోతే మీరు పూర్తిగా అలసిపోయి మధ్యలోనే విరమించుకోవలసి వస్తుంది.’ ఈ సలహాను పాటించడం నేను పందేన్ని పూర్తిచేయడానికి సహాయపడింది.”
15 జీవితపు పందెంలో దేవుని సేవకులు తీవ్రంగా కృషి చేయాలి. (లూకా 13:24) అయితే, శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “పైనుండి వచ్చు జ్ఞానము . . . మృదువైనది [“సహేతుకమైనది,” NW].” (యాకోబు 3:17) ఇతరుల మంచి మాదిరి మనం మరింత ఎక్కువగా చేయడానికి పురికొల్పుతుండగా, మన సామర్థ్యాలకూ పరిస్థితులకూ అనుగుణ్యంగా వాస్తవికమైన లక్ష్యాలు పెట్టుకోవడానికి సహేతుకత మనకు సహాయం చేస్తుంది. లేఖనాలు మనకిలా గుర్తు చేస్తున్నాయి: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?”—గలతీయులు 6:4, 5.
16. మన వేగాన్ని నిర్ణయించుకోవడానికి మనకు దీనమనస్సు ఎలా సహాయం చేస్తుంది?
16 మీకా 6:8లో ఆలోచన రేకెత్తించే ఈ ప్రశ్న ఉంది: “మనుష్యుడా, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుట[యే] . . . గదా యెహోవా నిన్నడుగుచున్నాడు?” దీనమనస్సు కల్గివుండటంలో మన పరిమితులను గురించి తెలుసుకొనివుండటం కూడా ఇమిడివుంది. దేవునికి మనం చేయగల సేవపై, శరీరం సహకరించకపోవడమో లేదా వయస్సు పైబడటమో కొన్ని పరిమితులు ఉంచుతున్నాయా? మనం నిరుత్సాహానికి గురికాకుండా ఉందాము. ‘శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే’ మనం చేసే ప్రయత్నాలను, త్యాగాలను యెహోవా స్వీకరిస్తాడు.—2 కొరింథీయులు 8:12; పోల్చండి లూకా 21:1-4.
బహుమతిపైనే దృష్టి నిలపండి
17, 18. యేసు దేన్ని దృష్టిలో ఉంచుకోవడం ఆయన హింసా కొయ్యను సహించడానికి సహాయపడింది?
17 జీవితపు పందెంలో సహనాన్ని కనబర్చాల్సిన అవసరాన్ని కొరింథులోని క్రైస్తవులకు ఎత్తిచూపించడానికి పౌలు ఇస్త్మియన్ క్రీడల్లోని వారి అవధానానికి అర్హమైన మరో అంశాన్ని పేర్కొన్నాడు. ఆ క్రీడల్లోని పోటీదారుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.” (1 కొరింథీయులు 9:25-27) ఆ ప్రాచీన క్రీడల్లో విజేత పొందే బహుమతి ఒక కిరీటము, అంటే దేవదారు చెట్ల లేదా మరితర మొక్కల, లేదా చివరికి అడవిలోని సెలెరీ మొక్కల ఎండుటాకులతో చేసిన కిరీటమది—నిజంగానే అది “క్షయమగు కిరీటము.” అయితే అంతము వరకు సహించిన క్రైస్తవులకు దక్కేదేమిటి?
18 మన మాదిరికర్త అయిన యేసుక్రీస్తును సూచిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:1-2) యేసు హింసా కొయ్యను మించి తర్వాత తనకు లభించనైయున్న బహుమతిని చూడటం ద్వారా తన మానవ జీవితపు అంతం వరకు సహించాడు. ఆ బహుమతిలో యెహోవా నామం పవిత్రపర్చడానికి దోహదపడటంలోను, మానవ కుటుంబాన్ని మరణం నుండి తప్పించడానికి విమోచన క్రయధనాన్ని చెల్లించడంలోను, విధేయులైన మానవుల్ని పరదైసు భూమిపై నిరంతర జీవితానికి తాను పునరుద్ధరిస్తూ రాజుగా ప్రధాన యాజకునిగా పరిపాలించడంలోను తాను అనుభవిస్తున్న ఆనందం చేరివుంది.—మత్తయి 6:9, 10; 20:28; హెబ్రీయులు 7:23-26.
19. క్రైస్తవ శిష్యులుగా మనం మార్గంలో కొనసాగుతుండగా మనం దేనిపై దృష్టిని కేంద్రీకరించాలి?
19 క్రీస్తు శిష్యులుగా మన మార్గంలో కొనసాగుతుండగా మనకు ఉంచబడిన ఆనందాన్ని గురించి ఆలోచించండి. ఇతరులకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమనే, జీవరక్షకమైన బైబిలు జ్ఞానాన్ని ప్రకటించడమనే ప్రగాఢమైన సంతృప్తినిచ్చే పనిని యెహోవా మనకు ఇచ్చాడు. (మత్తయి 28:19, 20) సత్య దేవునిలో ఆసక్తి ఉన్న వ్యక్తిని కనుగొనడం, ఆ వ్యక్తికి జీవపు పందెంలో ప్రవేశించేలా సహాయం చేయడం ఎంతటి ఆహ్లాదాన్నిస్తుంది! మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు చూపించే ప్రతిస్పందన ఏదైనప్పటికీ యెహోవా నామాన్ని పవిత్రపర్చడానికి సంబంధించిన పనిలో భాగం వహించడం అనేది ఒక ఆధిక్యత. మన సాక్ష్యపు క్షేత్రంలో ఉదాసీనత ఎదురైనా, వ్యతిరేకత ఉన్నా మనం మన పరిచర్యలో సహనాన్ని కనపర్చినప్పుడు మనం యెహోవా హృదయాన్ని సంతోషపెడుతున్నామన్న ఆనందం మనకుంటుంది. (సామెతలు 27:11) ఆయన మనకు వాగ్దానం చేస్తున్న గొప్ప బహుమతి నిత్యజీవము. అది ఎంత ఆనందభరితంగా ఉంటుంది! ఈ ఆశీర్వాదాలను మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన, పందెంలో పట్టుదలతో కొనసాగాల్సిన అవసరం ఉంది.
అంతం సమీపిస్తుండగా
20. జీవితపు పందెం యొక్క అంతం సమీపిస్తుండగా అది మరింత కష్టతరంగా ఎలా మారుతుంది?
20 జీవితపు పందెంలో మనం మన ప్రధాన ప్రత్యర్థి అయిన అపవాదియగు సాతానుకు విరుద్ధంగా పోరాడాలి. మనం అంతాన్ని సమీపిస్తుండగా మనం తొట్రుపడేలా లేదా నెమ్మదైపోయేలా చేయడానికి అతడు అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తున్నాడు. (ప్రకటన 12:12, 17) యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, ఇంకా “అంత్యకాలము”ను గుర్తించే ఎన్నెన్నో కష్టాలు ఉన్న దృష్ట్యా విశ్వసనీయంగా, సమర్పిత రాజ్య ప్రచారకులుగా కొనసాగటం సులభం కాదు. (దానియేలు 12:4; మత్తయి 24:3-14; లూకా 21:11; 2 తిమోతి 3:1-5) అంతేగాక, అంతము మనం ఊహించిన దానికన్నా ఇంకా దూరంలో ఉన్నట్లు కొన్నిసార్లు అన్పించవచ్చు, ప్రాముఖ్యంగా మనం ఈ పందెంలో దశాబ్దాల క్రితం ప్రవేశించినట్లైతే. అయినప్పటికీ, అంతం త్వరలోనే వస్తుందని దేవుని వాక్యం మనకు హామీనిస్తుంది. ఆలస్యం కాదని యెహోవా చెబుతున్నాడు. అంతం కనుచూపు మేరలోనే ఉంది.—హబక్కూకు 2:3; 2 పేతురు 3:9, 10.
21. (ఎ) జీవితపు పందెంలో మనం ముందుకు సాగిపోతుండగా ఏది మన శక్తిని దృఢపరుస్తుంది? (బి) అంతం మరింత దగ్గరౌతుండగా మన దృఢ నిశ్చయం ఏమైవుండాలి?
21 అందుకని, జీవితపు పందెంలో విజయం సాధించడానికి మనం, మన ఆధ్యాత్మిక పోషణ కోసం యెహోవా ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేసినవాటి నుండి బలాన్ని పొందాలి. పందెంలో మనతోపాటు పరిగెడుతున్న మన తోటి విశ్వాసులతో క్రమంగా సహవసించడం ద్వారా పొందగల ప్రోత్సాహం కూడా మనకు ఆవశ్యకం. మార్గమధ్యంలో తీవ్రమైన హింస, అనూహ్య సంఘటనలు మన పందేన్ని కష్టతరం చేసినప్పటికీ మనం అంతం వరకు సహించగలము ఎందుకంటే యెహోవా మనకు “బలాధిక్యము”ను అనుగ్రహిస్తాడు. (2 కొరింథీయులు 4:7) మనం పందెంలో విజయం సాధించాలని యెహోవా ఆశిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఉత్తేజకరంగా ఉంది! దృఢ నిశ్చయంతో, “తగినకాలమందు పంటకోతుము” అన్న పూర్తి నమ్మకముతో, “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో [“సహనముతో,” NW] పరుగెత్తుదము.”—హెబ్రీయులు 12:1; గలతీయులు 6:9.
[అధస్సూచీలు]
a హెబ్రీయులు 11:1–12:3 గురించిన చర్చకై జనవరి 15, 1987, కావలికోట, (ఆంగ్లం) 10-20 పేజీలు చూడండి.
b అటువంటి ప్రోత్సాహకరమైన అనుభవాల్లో కొన్ని ఇటీవల కావలికోట యొక్క జూన్ 1, 1998, పేజీలు 28-31; సెప్టెంబరు 1, 1998, పేజీలు 24-8; ఫిబ్రవరి 1, 1999, పేజీలు 25-9లో ఉన్నాయి.
మీకు జ్ఞాపకం ఉందా?
◻ మనం అంతం వరకూ ఎందుకు సహనంతో ఉండాలి?
◻ యెహోవా చేసిన ఏ ఏర్పాట్లను మనం నిర్లక్ష్యం చేయకూడదు?
◻ మన వేగాన్ని జ్ఞానయుక్తంగా నిర్ణయించడం ఎందుకు ప్రాముఖ్యం?
◻ మనం పందెంలో ముందుకు కొనసాగుతుండగా మన ముందు ఏ ఆనందం ఉంచబడింది?
[18వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ కూటాల నుండి ప్రోత్సాహాన్ని పొందండి