కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/15 పేజీలు 12-17
  • హృదయపూర్వకంగా క్షమించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హృదయపూర్వకంగా క్షమించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షమ అవసరం—మనం క్షమించబడుతున్నాము
  • క్షమించే వారిగా ఉండటానికి కృషిచేయాలి
  • శాంతిని నెలకొల్పండి—క్షమించండి
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/15 పేజీలు 12-17

హృదయపూర్వకంగా క్షమించండి

“మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయ పూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయు[ను].”—మత్తయి 18:35.

1, 2. (ఎ) అందరికీ తెలిసిన ఒక పాపాత్మురాలు యేసుపట్ల తన మెప్పుదలను ఎలా ప్రదర్శించింది? (బి) ప్రతిస్పందనగా యేసు ఏ విషయాన్ని చెప్పాడు?

ఆమె బహుశ ఒక వ్యభిచారిణి అయ్యుండవచ్చు, మతనిష్ఠగల మనిషి ఇంట్లో కనబడాల్సిన వ్యక్తి కాదు. ఆమెనక్కడ చూసి కొందరు విభ్రాంతి చెందితే, ఆమె చేసిన పని మరీ విభ్రాంతికరంగా ఉంది. ఆమె అత్యున్నతమైన నైతిక విలువలుగల ఆ పురుషుని చెంతకు వచ్చి, ఆయన పాదాలను కన్నీటితో కడిగి, తన తల వెండ్రుకలతో వాటిని తుడుస్తూ ఆయన చేసిన కార్యాలపట్ల మెప్పుదలను వ్యక్తం చేసింది.

2 ఆ పురుషుడు యేసు, ఆయన “పాపాత్మురాలైన” ఈ స్త్రీని చూసి విముఖతను కనపర్చలేదు. ఆ ఇల్లు పరిసయ్యుడైన సీమోనుది, ఈయన ఆమె పాపాత్మురాలు అని ఆందోళన చెందాడు. అప్పు ఇచ్చే ఒక వ్యక్తికి బాకీ ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతూ యేసు ప్రతిస్పందించాడు. వారిలో ఒక వ్యక్తి చాలా బాకీ ఉన్నాడు—ఒక శ్రామికుడు రెండు సంవత్సరాలపాటు సంపాదించే జీతం అది. రెండవ వ్యక్తి దానిలో పదవ వంతు బాకీ ఉన్నాడు, అంటే మూడు నెలల జీతం కన్నా తక్కువ అన్నమాట. వీరిలో ఇద్దరూ తమ బాకీని చెల్లించలేకపోయినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి “వారిద్దరిని క్షమించెను.” ఇద్దర్లో ఎక్కువ మొత్తం క్షమించబడిన వ్యక్తి ప్రేమతో ప్రతిస్పందించేందుకు స్పష్టంగా ఎక్కువ కారణం ఉంది. ఈ స్త్రీ సహృదయంతో చేసిన క్రియను ఈ దృష్టాంతానికి జోడిస్తూ, యేసు ఈ సూత్రాన్ని జతచేశాడు: “ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించు[ను].” తర్వాత ఆమెతో ఇలా అన్నాడు: “నీ పాపములు క్షమింపబడియున్నవి.”—లూకా 7:36-48.

3. మన గురించి మనం ఏమి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది?

3 మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, “నేనే ఆ స్త్రీనైతే, లేదా అటువంటి పరిస్థితిలోనే నేను ఉంటే నాపట్ల కరుణ చూపించబడినప్పుడు అటు తర్వాత నేను ఇతరులపట్ల క్షమారహితంగా కఠినంగా ఉంటానా?’ జవాబుగా, ‘లేదు ఉండను!’ అని మీరు చెబుతుండవచ్చు. అయినప్పటికీ, మీరు ఇతరులను క్షమించటానికి సుముఖతతో ఉంటారని నిజంగా నమ్ముతారా? అది మీ సహజమైన స్వభావమేనా? మీరలా తరచుగా క్షమిస్తుంటారా, ఇతరులు మిమ్మల్ని క్షమించేవ్యక్తియని వర్ణిస్తారా? వీటికి, మనలో ప్రతి ఒక్కరమూ నిస్సంకోచమైన, ఆత్మపరిశీలనతో కూడిన అవధానాన్ని ఎందుకు ఇవ్వాలో చూద్దాము.

క్షమ అవసరం—మనం క్షమించబడుతున్నాము

4. మన విషయంలో ఏ వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి?

4 మీరు అపరిపూర్ణులు, ఆ విషయం వేరెవరికన్నా బాగా మీకే తెలుసు. మిమ్మల్ని దాని గురించి అడిగితే మీరు బహుశ 1 యోహాను 1:8లోని ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఒప్పుకోవచ్చు: “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.” (రోమీయులు 3:23; 5:12) కొందరి విషయంలో వారి పాపస్వభావం గంభీరమైన ఘోరమైన పాపాల్లో బయటపడవచ్చు. కానీ మీకు తెలిసి తెలిసి అటువంటి పాపాలు చేసివుండకపోయినా, అనేకసార్లు దేవుని ప్రమాణాల నుండి పడిపోయిన, అంటే మీరు పాపం చేసిన అనేక సందర్భాలు ఉన్నాయన్నది మాత్రం నిశ్చయం. అది నిజం కాదా?

5. మనం దేవునికి ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి?

5 అందుకని, మీ పరిస్థితి అపొస్తలుడైన పౌలు వర్ణనకు సరిపోతుండవచ్చు: “అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు . . . మన అపరాధములనన్నిటిని క్షమించి, [యేసు]తోకూడ మిమ్మును జీవింపచేసెను.” (కొలొస్సయులు 2:13, 14; ఎఫెసీయులు 2:1-3) “మన అపరాధములనన్నిటిని క్షమించి” అన్న మాటల్ని జాగ్రత్తగా గమనించండి. అందులో చాలానే ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరమూ దావీదులా ఇలా విజ్ఞాపన చేసుకోవల్సిన అవసరం ఉంది: “యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.” (ఇటాలిక్కులు మావి.)—కీర్తన 25:11.

6. యెహోవాను గురించీ ఆయన క్షమా గుణాన్ని గురించీ మనం ఏమని పూర్తి నమ్మకంతో ఉండగలము?

6 మీరూ—మనలో ప్రతి ఒక్కరమూ—క్షమాపణను ఎలా పొందగలము? యెహోవా దేవుడు క్షమించటానికి సుముఖతతో ఉన్నాడన్నది ఇక్కడ కీలకాంశం. ఇది ఆయన వ్యక్తిత్వంలో విడదీయరాని ఒక లక్షణం. (నిర్గమకాండము 34:6, 7; కీర్తన 86:5) అర్థం చేసుకోదగిన రీతిలోనే, మనం తనకు ప్రార్థిస్తూ తనను మన్నించుమని అడుగుతూ, మనల్ని క్షమించుమని కోరతామని దేవుడు ఆశిస్తాడు. (2 దినవృత్తాంతములు 6:21; కీర్తన 103:3, 10, 14) అటువంటి క్షమను మనకు ప్రసాదించటానికి ఆయన చట్టబద్ధమైన ఆధారాన్ని—అంటే యేసు విమోచన క్రయధన బలిని కూడా ఏర్పాటుచేశాడు.—రోమీయులు 3:24; 1 పేతురు 1:18, 19; 1 యోహాను 4:9, 14.

7. మీరు ఏ విధంగా యెహోవాను పోలి నడుచుకోవాలని కోరుకోవాలి?

7 క్షమించటానికి దేవుడు చూపే ఇష్టతలో మీరు ఇతరులతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఒక నమూనాను మీరు గ్రహించాలి. పౌలు ఇలా వ్రాస్తూ దీనిపై దృష్టిని కేంద్రీకరించాడు: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఎఫెసీయులు 4:32) మనం దేవుని మాదిరి నుండి నేర్చుకోవటం పౌలు చెబుతున్నదానిలో అంతర్గతంగా ఉందన్నది నిస్సందేహం, ఎందుకంటే తర్వాతి వచనం ఇలా సాగుతుంది: “కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:1) మీరు రెంటికీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారా? యెహోవా మిమ్మల్ని క్షమించాడు, అందుకని—పౌలు బలంగా తర్కించేదాని ప్రకారం—మీరాయనను పోలి నడుచుకోవాలి ‘కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించాలి.’ కానీ ఇలా ప్రశ్నించుకోండి, ‘నేనది చేస్తున్నానా? నా సహజ స్వభావం అది కానట్లైతే, నేనా పథంలో నడవటానికి ప్రయత్నం చేస్తున్నానా, క్షమించటంలో దేవుణ్ని పోలి నడుచుకోవటానికి గట్టి కృషిచేస్తున్నానా?’

క్షమించే వారిగా ఉండటానికి కృషిచేయాలి

8. మన సంఘంలో ఉన్న సభ్యుల విషయంలో మనం ఏమి గుర్తించాలి?

8 క్రైస్తవ సంఘంలో మనం క్షమించటం అనే దైవిక అలవాటును పెంపొందించుకోవాల్సిన సందర్భాలు తక్కువే ఉంటాయని భావించటం చాలా బాగుంటుంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధం. నిజమే, మన క్రైస్తవ సహోదర సహోదరీలు ప్రేమ విషయంలో యేసు ఉంచిన నమూనాను అనుసరించటానికి కృషి చేస్తున్నారు. (యోహాను 13:35; 15:12, 13; గలతీయులు 6:2) ఈ దుష్టలోకంలో ఎంతో సర్వసాధారణమైపోయిన రీతుల్లో ఆలోచించటం, మాట్లాడటం, ప్రవర్తించటం విడనాడటానికి వారెంతో సమయంపాటు కృషిచేశారు, ఇప్పటికీ కృషిచేస్తున్నారు. వారు నిజంగానే నూతన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలని ఇష్టపడుతున్నారు. (కొలొస్సయులు 3:9, 10) అయినా, భూమ్యంతటా ఉన్న సంఘంలోని, ప్రతి స్థానిక సంఘంలోని సభ్యులు అపరిపూర్ణులన్న విషయాన్ని మనం త్రోసిపుచ్చలేము. మొత్తంమీద చూస్తే వారు ఒకప్పటికన్నా ఇప్పుడు ఎంతో శ్రేష్ఠమైనవారిగా ఉన్నారు, అయినా వారింకా అపరిపూర్ణులుగానే ఉన్నారు.

9, 10. సహోదరుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యపోకూడదు?

9 సంఘంలో, మన సహోదర సహోదరీల్లో అపరిపూర్ణత ఉంటుందని మనం గ్రహించాలని దేవుడు బైబిలులో ముక్కుసూటిగా చెబుతున్నాడు. ఉదాహరణకు పౌలు కొలొస్సయులు 3:13లో (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) నమోదు చేసిన మాటల్ని చూడండి: “ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. ప్రభువు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి.”

10 దేవుడు మనల్ని క్షమించటానికీ, మనం ఇతరులపట్ల క్షమాగుణాన్ని ప్రదర్శించవలసిన మన బాధ్యతకూ, అవసరానికీ మధ్య ఉన్న సంబంధాన్ని బైబిలు ఇక్కడ గుర్తు చేయటం గమనార్హమైన విషయం. ఇది ఎందుకు ఇంత కష్టతరమైన పని? ఎందుకంటే, ‘ఎవరికైనా ఫిర్యాదు చేయడానికి కారణం ఉండవచ్చని’ పౌలు ఒప్పుకున్నాడు. అలా అనుకునేందుకు కారణాలు ఉంటాయని ఆయన గ్రహించాడు. ఇది మొదటి శతాబ్దంలో జరిగివుంటుంది, చివరికి ‘పరలోకమందు నిరీక్షణ ఉంచబడిన’ క్రైస్తవ “పరిశుద్ధుల” మధ్య కూడా జరిగివుంటుంది. (కొలొస్సయులు 1:1, 5) అందుకని, “దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవా[రని]” పరిశుద్ధాత్మ అందించిన సాక్ష్యం లేని నేటి నిజ క్రైస్తవుల్లోని అత్యధికుల విషయంలో పరిస్థితి వేరుగా ఉంటుందని అనుకోగలమా? (కొలొస్సయులు 3:12) కాబట్టి, మన సంఘంలో నిజమైన తప్పుల మూలంగా అయినా, లేదా తప్పు జరిగిందని భావించటం మూలంగా అయినా ఫిర్యాదు చేయడానికి కారణాలు ఉన్నట్లైతే ఏదో ఘోరమైన తప్పులు జరిగిపోతున్నట్లు ఒక ముగింపుకు రానవసరం లేదు.

11. శిష్యుడైన యాకోబు దేని విషయమై మనల్ని అప్రమత్తపర్చాడు?

11 యేసు సహోదరుడైన యాకోబు చెప్పిన మాటలు కూడా, మనం మన సహోదరుల్ని క్షమించాల్సిన అవసరం ఏర్పడే సందర్భాలు కనీసం అప్పుడప్పుడైనా కలుగుతాయని ఎదురుచూడాలని చూపిస్తున్నాయి. “మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయతే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.” (యాకోబు 3:13, 14) నిజ క్రైస్తవుల హృదయాల్లో “సహింపనలవికాని మత్సరమును వివాదమును” ఉండటమా? అవును, మొదటి శతాబ్దపు సంఘంలో అటువంటివి తలెత్తాయనీ నేడు కూడా తలెత్తుతాయనీ యాకోబు మాటలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

12. ప్రాచీన ఫిలిప్పీ సంఘంలో ఎటువంటి సమస్య తలెత్తింది?

12 ఈ విషయమై ఒక వాస్తవికమైన ఉదాహరణలో, పౌలుతో కూడ సన్నిహితంగా పనిచేస్తూ గట్టి కృషిచేసిన మంచి పేరు సంపాదించుకున్న ఇద్దరు అభిషిక్త క్రైస్తవులు ఇమిడివున్నారు. ఫిలిప్పీ సంఘంలోని సభ్యులైన యువొదియ సుంటుకేల గురించి చదివినట్లు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ విషయాన్ని వివరణాత్మకంగా వర్ణించకపోయినప్పటికీ ఫిలిప్పీయులు 4:2, 3 వారిద్దరి మధ్యా ఏదో సమస్య ఉన్నదని చూపిస్తుంది. అది అనాలోచితంగా నిర్దయగా అన్న మాట మూలంగానో, ఎవరైనా బంధువుపట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు అనిపించడం మూలంగానో లేదా పోటీతత్వంతో కూడిన అసూయ ప్రదర్శితం కావడం మూలంగానో ప్రారంభమయ్యిందా? విషయం ఏదైనప్పటికీ, ఎక్కడో రోమ్‌లో ఉన్న పౌలు దీని గురించి వినేంత గంభీరంగా తయారైంది. ఈ ఇద్దరు ఆధ్యాత్మిక సహోదరీల మధ్య మాటల్లేకుండాపోయి ఉండవచ్చు, తత్ఫలితంగా కూటాల్లో ఒకరికి దూరంగా మరొకరు మసలుకుంటూనో లేదా ఒకరి గురించి మరొకరు తమ స్నేహితులతో కఠినమైన వ్యాఖ్యానాలు చేస్తూనో ఉంటుండవచ్చు.

13. యువొదియ సుంటుకేల మధ్య ఏది పరిష్కారానికి నడిపించివుండవచ్చు, అది మనకు ఏ పాఠాన్ని అందిస్తుంది?

13 ఇది మీకు సుపరిచితంగా అన్పిస్తుందా, మీ సంఘంలో ఎవరి మధ్యనైనా జరిగినదానికి, లేదా మీరే ఇమిడివున్న ఏదైనా విషయానికి పోలివుందా? అటువంటి సమస్య నేడు కూడా కొంత స్థాయిలో ఉనికిలో ఉండవచ్చు. మనం ఏమి చేయగలం? అప్పటి సందర్భంలో పౌలు ఈ ఇద్దరు అభిషిక్త సహోదరీలను “ఏకమనస్సుగలవారై యుండుడని” ఉద్బోధించాడు. వారు విషయాన్ని చర్చించటానికీ, వాతావరణాన్ని తేలికపర్చటానికీ, పరస్పరం క్షమించుకునేందుకు ఇష్టపడటానికీ, తద్వారా క్షమించటమనే యెహోవా మనోభావాన్ని అనుకరించటానికీ అంగీకరించివుండవచ్చును. యువొదియ సుంటుకేలు సఫలమయ్యారనడానికన్నా వేరేగా తలంచటానికి కారణమేమీ లేదు, అలాగే మనం కూడా సఫలులం కావచ్చును. అటువంటి క్షమించే వైఖరిని నేడు కూడా విజయవంతంగా అమలుపర్చవచ్చు.

శాంతిని నెలకొల్పండి—క్షమించండి

14. వ్యక్తిగత విభేదాలను పట్టించుకోకుండా ఉపేక్షించటం ఎందుకు తరచు సాధ్యం కావాలి, అది ఎందుకు శ్రేష్ఠమైన పని?

14 మరో క్రైస్తవునితో మీకేదైనా సమస్యగా ఉన్నప్పుడు క్షమించటానికి నిజంగా ఏమి అవసరం? కచ్చితంగా చెప్పాలంటే, ఏ ఒక్క సులువైన పద్ధతీ లేదు, కానీ బైబిలు సహాయకరంగా ఉండే ఉదాహరణలను ఇస్తుంది, వాస్తవికమైన సలహాను అందిస్తుంది. ఒక కీలకమైన సిఫారసు ఏమిటంటే—అంగీకరించి అన్వయించుకోవటానికి అంత సులభం కాకపోయినా—ఆ విషయాన్ని మర్చిపోవటమే, లేదా ఉపేక్షించటమే. యువొదియ సుంటుకేల విషయంలో జరిగినట్లుగా తరచు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అసలు చూస్తే అవతలి వ్యక్తిదే తప్పు అని ఇవతలి వ్యక్తి భావిస్తాడు. అందుకని అటువంటి సందర్భంలో అవతలి క్రైస్తవుడు నిందార్హుడనీ లేదా ఎక్కువ హాని కలిగింది ఆయన మూలంగానేనని మీరు భావిస్తుండవచ్చు. అయినప్పటికీ, మీరు క్షమించి విషయాన్ని అంతటితో సమాప్తి చేయగలరా? ఒకవేళ—ఇది చాలా అరుదుగా జరుగుతుంది—తప్పంతా పూర్తిగా అవతలి క్రైస్తవునిదే అయినట్లైతే, క్షమించివేసి విషయాన్ని ఉపేక్షించటానికీ అంతటితో ముగించటానికీ మీరు కీలకమైన స్థానంలో ఉంటారు.

15, 16. (ఎ) యెహోవాను మీకా ఎలా వర్ణించాడు? (బి) దేవుడు ‘అతిక్రమముల విషయమై ఉపేక్షించటం’ అంటే ఏమిటి భావం?

15 క్షమించటంలో మన మాదిరికర్తగా దేవుణ్ని విస్మరించకుందాము. (ఎఫెసీయులు 4:32–5:1) తప్పిదాల్ని ఉపేక్షించటంలో ఆయన మాదిరిని గురించి ప్రవక్త అయిన మీకా ఇలా వ్రాశాడు: “తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు [“ఉపేక్షించే,” NW] దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.”—మీకా 7:18.

16 యెహోవా “అతిక్రమముల విషయమై ఉపేక్షించే” దేవుడని వర్ణించటం ద్వారా, తప్పుల్ని జ్ఞాపకం చేసుకునే సామర్థ్యం ఆయనకు లేదనీ, పూర్వస్మృతుల్ని మర్చిపోవాలని ఎంపిక చేసుకునే వ్యక్తియనీ బైబిలు చెప్పటంలేదు. సమ్సోను, దావీదుల విషయం చూడండి, వీరిద్దరూ గంభీరమైన తప్పిదాలు చేశారు. అటుతర్వాత ఎంతో కాలానికి కూడా దేవుడు వారి పాపాల్ని గుర్తుంచుకోగలిగాడు; వారు చేసిన పాపాల్లో కొన్నింటిని యెహోవా బైబిలులో నమోదు చేయించటం మూలంగా వాటి గురించి చివరికి మనకు కూడా తెలుసు. అయినప్పటికీ క్షమాశీలి అయిన మన దేవుడు ఆ ఇద్దరిపట్లా కరుణతో, వారిని మనం విశ్వాసానికి మాదిరులుగా అనుకరించటానికి మనకు అందించాడు.—హెబ్రీయులు 11:32; 12:1.

17. (ఎ) ఇతరులు చేసిన తప్పుల్నీ, అపరాధాల్నీ ఉపేక్షించటానికి మనకు ఏ విధానం సహాయపడగలదు? (బి) మనం ఆ విధానాన్ని అనుసరించటానికి కృషిచేసినట్లైతే మనం ఎలా యెహోవాను అనుకరిస్తున్నట్లు? (పాదవచనం చూడండి.)

17 అవును, యెహోవా అతిక్రమములను ‘ఉపేక్షించ’గలడు,a దావీదు ఆయన్ను ఆ విధంగానే చేయమని మళ్లీ మళ్లీ అడిగాడు. (2 సమూయేలు 12:13; 24:10) అపరిపూర్ణ మానవులుగా మన తోటి సేవకులు మనల్ని నిర్లక్ష్యం చేయటాన్నీ మనపట్ల అపరాధాలు చేయటాన్నీ ఉపేక్షించేందుకు సుముఖంగా ఉంటూ మనం ఈ విషయంలో దేవుణ్ని అనుకరించగలమా? మీరు రన్‌వే మీదుగా వేగంగా దూసుకుపోతున్న ఒక జెట్‌ విమానంలో కూర్చుని ఉన్నట్లు ఊహించుకోండి. బయటికి చూసినప్పుడు రన్‌వే మీద మీకు పరిచయస్థురాలైన ఒక వ్యక్తి వెక్కిరిస్తున్నట్లుగా చిన్నపిల్లలా తన నాలుకను బయటికి పెడుతూ అమర్యాదకరంగా ప్రవర్తించిందనుకోండి. ఆమె కోపంతో ఉందని మీకు తెలుసు, ఆమె మిమ్మల్ని మనస్సులో ఉంచుకుని ఉండవచ్చు. లేదా మీ గురించి అసలు ఏమాత్రం ఆలోచిస్తుండకపోవచ్చు కూడా. ఏదేమైనా, విమానం ఎత్తుగా వెళ్ళడానికిగాను గాల్లో గుండ్రంగా వెనక్కి తిరిగినప్పుడు ఆ వ్యక్తి మీదుగా వెళ్తున్నప్పుడు ఆమె మీకు చిన్న చీమలా కన్పిస్తుంది. ఒక్క గంటలో మీరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు, మిమ్మల్ని అభ్యంతరపెట్టిన ప్రవర్తనకు మీరు చాలా దూరంగా వచ్చేశారు. అదే విధంగా, ఒకవేళ మనం యెహోవా లాగ ఉండటానికి ప్రయత్నిస్తూ జ్ఞానయుక్తంగా అపరాధాన్ని ఉపేక్షించటం మనకు సహాయకరంగా ఉంటుంది. (సామెతలు 19:11) ఆ అమర్యాదకరమైన ప్రవర్తన ఇప్పటికి పది సంవత్సరాల తర్వాత లేదా రాబోయే సహస్రాబ్దిలోని రెండు వందల సంవత్సరాల తర్వాత ఎంతో చిన్నదిగా కన్పించదూ? దాన్ని ఊరికే ఎందుకు ఉపేక్షించకూడదు?

18. ఏదైనా అపరాధాన్ని మనం మర్చిపోవటం సాధ్యం కానప్పుడు ఏ సలహాను మనం అన్వయించుకోవచ్చు?

18 అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో ఫలాని విషయం గురించి ప్రార్థించి ఉండవచ్చు, క్షమించటానికి ప్రయత్నించి ఉండవచ్చు, కానీ మీరు క్షమించలేక పోతున్నట్లు అన్పించవచ్చు. అప్పుడేమిటి? అవతలి వ్యక్తి దగ్గరకు వెళ్ళి శాంతిని సాధించటానికై విభేదాన్ని పరిష్కరించుకోవటానికి ఏకాంతంగా ప్రయత్నించమని యేసు ఉద్బోధించాడు. “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.”—మత్తయి 5:23, 24.

19. మనం మన సహోదరునితో శాంతిని స్థాపిస్తుండగా మనం ఏ వైఖరిని కలిగివుండాలి, ఏ వైఖరిని విసర్జించాలి?

19 మీరే ఒప్పు అనీ అవతలి వ్యక్తే తప్పు అనీ ఒప్పించటానికి మీ సహోదరుని దగ్గరకు వెళ్లమని యేసు చెప్పలేదన్నది ప్రాముఖ్యమైన విషయం. తప్పు ఆయనదే అయ్యుండవచ్చు. ఇరువైపులా తప్పు జరిగివుంటుందన్నది మరింత నిజం కావచ్చు. ఏదేమైనా, అవతలి వ్యక్తిని సమ్మతింపజేయటం, ఒకవిధంగా చెప్పాలంటే అతడు మన కాళ్లమీద పడేలా చేసుకోవటం లక్ష్యం కాకూడదు. మీరు చర్చలో పరిస్థితితో ఆ విధంగా వ్యవహరిస్తే వైఫల్యం దాదాపు అనివార్యం. అంతేగాక, ప్రతి చిన్న వివరణనూ లేదా ఊహించేసుకున్న అపరాధాల్నీ పునఃపరిశీలించటం కూడా లక్ష్యంగా ఉండకూడదు. క్రైస్తవ ప్రేమతో కూడిన స్ఫూర్తితో చర్చను ప్రశాంతంగా చేసినప్పుడు అసలు సమస్యకు మూల కారణం విచారకరమైన అపార్థం అని వెల్లడి అయితే మీరిద్దరూ దాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నించగలరు. కానీ చర్చ మూలంగా పూర్తి అంగీకారం కుదరకపోయినా, అది అన్ని విషయాల్లోనూ అంత అవసరమా? మీరిద్దరూ క్షమాశీలి అయిన మన దేవుణ్ని హృదయపూర్వకంగా సేవించాలని కోరుకుంటున్నారని కనీసం మీరు అంగీకరిస్తే అది ఎంత శ్రేష్ఠం? మీరా వాస్తవాన్ని గ్రహించగలిగితే, “మన అపరిపూర్ణత మూలంగా మన మధ్య ఈ విభేదం ఏర్పడినందుకు నేను విచారిస్తున్నాను. దయచేసి దీన్ని మనం ఉపేక్షిద్దాము” అని ఇద్దరు హృదయపూర్వకంగా చెప్పడం సులభమౌతుంది.

20. అపొస్తలుల మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

20 గుర్తుంచుకోండి అపొస్తలుల మధ్య విభేదాలు ఉన్నాయి, ఎందుకంటే వారిలో కొందరు మరింత ఎక్కువ ఘనతను కోరుకున్నారు. (మార్కు 10:35-39; లూకా 9:46; 22:24-26) ఇందుమూలంగా ఒత్తిడి ఏర్పడింది, బహుశ మనస్సులు గాయపడటమో చివరికి తీవ్రమైన అభ్యంతరాలు ఏర్పడటమో కూడా జరిగివుండవచ్చు. కానీ వారు అటువంటి విభేదాల్ని ఉపేక్షించగలిగారు, కలిసి ఒక్కటిగా పనిచేస్తూ ముందుకు సాగగలిగారు. వారిలో ఒకరు అటుతర్వాత ఇలా వ్రాశాడు: “జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.”—1 పేతురు 3:10, 11.

21. క్షమించటాన్ని గురించి యేసు ఏ ప్రభావవంతమైన సలహాను ఇచ్చాడు?

21 మనం ఇంతకు మునుపు ఒక విషయాన్ని పరిశీలించాము: మనం గతంలో చేసిన అనేక పాపాల్ని దేవుడు క్షమించాడు, అందుకని మనం ఆయన్ను అనుకరిస్తూ మన సహోదరుల్ని క్షమించాలి. (కీర్తన 103:12; యెషయా 43:25) కానీ ఈ చక్రంలో మరో విషయం కూడా ఉంది. మాదిరి ప్రార్థనను ఇచ్చిన తర్వాత యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.” ఒక సంవత్సరం తర్వాత ఆయన అసలు సారాన్ని చెబుతూ తన శిష్యులకు ఇలా ప్రార్థించమని చెప్పాడు: “మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (మత్తయి 6:12, 14; లూకా 11:4) మళ్లీ తాను మరణించటానికి కొద్ది రోజుల ముందు యేసు ఇలా జతచేశాడు: “మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.”—మార్కు 11:25.

22, 23. క్షమించటానికి మనం ఇష్టపడటం మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదు?

22 అవును, దేవుని క్షమాపణను మనం పొందుతూనే ఉండే అవకాశాలు చాలా మట్టుకు, మన సహోదరులను మనం క్షమించటానికి ఎంతగా ఇష్టపడుతున్నామన్న దానిపైన ఆధారపడివున్నాయి. క్రైస్తవుల మధ్య వ్యక్తిగత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, మిమ్మల్ని మీరు, ‘ఏదో చిన్న అమర్యాదకరమైన ప్రవర్తన విషయంలోనో, ఏదో చిన్న అపరాధం విషయంలోనో, లేదా ఏదో మానవ అపరిపూర్ణత బయటపడటం విషయంలోనో ఒక సహోదరుడు గానీ ఒక సహోదరి గానీ తప్పు చేసినట్లు రుజువు చేయటం కన్నా దేవుని క్షమాపణను పొందటం ఎంతో ఎక్కువ ప్రాముఖ్యమైనది కాదా?’ అని ప్రశ్నించుకోండి. దానికి జవాబు మీకు తెలుసు.

23 అయితే విషయం ఏదో చిన్న అపరాధం గానీ చిన్న సమస్య గానీ కాక బాగా గంభీరమైనదైతే అప్పుడేమిటి? మత్తయి 18:15-18లో నమోదు చేయబడిన యేసు సలహా ఎప్పుడు వర్తిస్తుంది? తర్వాత మనం ఈ విషయాల్ని పరిశీలిద్దాము.

[అధస్సూచీలు]

a మీకా 7:18లో ఉపయోగించబడిన హెబ్రీ రూపకాలంకారం, “తాను అవధానం ఇవ్వటానికి ఇష్టపడని వస్తువును గమనించకుండా ముందుకు సాగిపోయే ఒక ప్రయాణీకుని ప్రవర్తన నుండి తీసుకోబడింది. దేవుడు పాపాన్ని గమనించడన్న తలంపుని గానీ ఆయన దాన్ని ప్రాముఖ్యమైనది కాదన్నట్లు లేదా ఏమాత్రం ప్రాముఖ్యమైనది కాదన్నట్లు పరిగణిస్తాడన్న తలంపుని గానీ ఇవ్వటం లేదు, కానీ శిక్షించాలన్న దృష్టితో ఆ పాపాన్ని గుర్తుంచుకోడన్న తలంపునిస్తుంది; ఆయన శిక్షించడు గానీ క్షమిస్తాడన్న తలంపునిస్తుంది.”—న్యాయాధిపతులు 3:26; 1 సమూయేలు 16:8.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ క్షమించే విషయంలో యెహోవా మనకు ఎలా ఒక నమూనాను ఇస్తున్నాడు?

◻ మన సంఘంలోని వారి గురించి మనం ఏమి గుర్తుంచుకోవాలి?

◻ అత్యధిక సందర్భాల్లో అమర్యాదకరంగా ప్రవర్తించటం విషయమై లేదా అపరాధాల విషయమై మనం ఏమి చేయగల్గాలి?

◻ అవసరమైతే మనం మన సహోదరునితో శాంతిని స్థాపించటానికి ఏమి చేయగలము?

[15వ పేజీలోని చిత్రం]

ఒక క్రైస్తవునితో విభేదం ఏర్పడినప్పుడు, దాన్ని ఉపేక్షించటానికి ప్రయత్నించండి; కాలం గడుస్తుండగా ఆ విషయం క్రమక్రమంగా అల్పమైనదిగా మారిపోతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి