కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 11/15 పేజీలు 26-30
  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనకు క్షమాగుణం ఎందుకు ఉండాలి?
  • మీ భావోద్వేగాలను పరిశీలించుకోండి
  • మిమ్మల్ని నొప్పించడానికే వాళ్లు అలా చేశారని అనుకోకండి
  • ‘మీ సమాధానము మీకు తిరిగి వస్తుంది’
  • యెహోవాకు నచ్చే విధంగా ప్రతిస్పందించండి
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • హృదయపూర్వకంగా క్షమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 11/15 పేజీలు 26-30

ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి

“ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”​—కొలొ. 3:13.

మీరెలా జవాబిస్తారు?

  • మనం క్షమించడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి?

  • మనకు క్షమాగుణం ఉండాలని చూపించేందుకు యేసు ఏ ఉపమానాన్ని చెప్పాడు?

  • ఒకరినొకరం మనస్ఫూర్తిగా క్షమించుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

1, 2. మీకు క్షమాగుణం ఉందో లేదో పరిశీలించుకోవడం ఎందుకు సముచితం?

యెహోవా దేవుడు పాపాన్ని ఎలా ఎంచుతాడో, మనం పాపం చేసినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో మనం లేఖనాల నుండి తెలుసుకోవచ్చు. అంతేకాక, ఆయన క్షమాగుణం గురించి కూడా లేఖనాలు ఎన్నో విషయాల్ని వెల్లడి చేస్తున్నాయి. దావీదు, మనష్షే చూపించిన వైఖరి వల్ల వాళ్లు యెహోవా క్షమాపణను ఎలా పొందారో మనం ముందటి ఆర్టికల్‌లో చూశాం. తాము చేసిన చెడ్డ పనుల విషయంలో వాళ్లు నిజంగా దుఃఖపడి తమ పాపాలను ఒప్పుకున్నారు, మారుమనస్సు పొందారు, నిజమైన పశ్చాత్తాపం చూపించారు. దాంతో యెహోవా వాళ్లపై మళ్లీ తన అనుగ్రహం చూపించాడు.

2 ఇప్పుడు మనం క్షమాపణ గురించి మరో కోణం నుండి పరిశీలిద్దాం. మనష్షే చేతుల్లో అన్యాయంగా బాధలు పడ్డ వాళ్లలో మీ బంధుమిత్రులు ఉండివుంటే, మీరు మనష్షే విషయంలో ఎలా భావించి ఉండేవాళ్లు? మీరు ఆయనను క్షమించగలిగి ఉండేవాళ్లా? ఇప్పుడు మనం అన్యాయం, హింస, స్వార్థం వంటివి నిండివున్న లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్న గురించి ఆలోచించడం సముచితం. క్రైస్తవులమైన మనం ఎందుకు క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి? మీరు ఒకవేళ అవమానాన్ని, అన్యాయాన్ని ఎదుర్కొంటే మీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకొని యెహోవాకు నచ్చినట్లు ప్రవర్తించడానికి, ఇతరులను క్షమించడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

మనకు క్షమాగుణం ఎందుకు ఉండాలి?

3-5. (ఎ) క్షమాగుణం అవసరమని చూపించడానికి యేసు ఏ ఉపమానాన్ని చెప్పాడు? (బి) మత్తయి 18:21-35లో ఉన్న ఉపమానం ద్వారా యేసు అసలు ఏ విషయాన్ని చెప్పాలనుకున్నాడు?

3 క్రైస్తవ సంఘంలోని వాళ్లయినా, బయటి వాళ్లయినా మనల్ని బాధపెడితే మనం వాళ్లను క్షమించాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇతరులతో, యెహోవాతో సమాధానంగా ఉండాలంటే అలా చేయడం చాలా ప్రాముఖ్యం. ఇతరులు మనల్ని ఎన్నిసార్లు బాధపెట్టినా మనం వాళ్లను క్షమించడం మన బాధ్యతని బైబిలు చూపిస్తోంది. అది ఎందుకు సరైనదో తెలియజేయడానికి పెద్ద మొత్తంలో అప్పుపడ్డ ఓ దాసుని గురించిన ఉపమానాన్ని యేసు చెప్పాడు.

4 ఒక దాసుడు తన యజమానికి పెద్ద మొత్తంలో అంటే ఆరుకోట్ల రోజులు పనిచేస్తే వచ్చేంత డబ్బు అప్పుపడ్డాడు. అయితే ఆ దాసుణ్ణి యజమాని క్షమించాడు. ఆ తర్వాత, ఆ దాసుడు వెళ్లి తనకు చిన్న మొత్తంలో అంటే 100 రోజులు పనిచేస్తే వచ్చేంత డబ్బు అచ్చియున్న తన తోటి దాసుణ్ణి పట్టుకున్నాడు. కొన్ని రోజులు ఓపిక పట్టమని అతను ఎంత బ్రతిమిలాడినా వినకుండా అతణ్ణి చెరసాలలో వేయించాడు. అది తెలుసుకున్న యజమాని చాలా కోపంతో ఆ మొదటి దాసుణ్ణి పిలిచి, “నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా?” అని చెప్పి, “తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వానినప్పగించెను.”​—మత్త. 18:21-34.

[27వ పేజీలోని చిత్రం]

యేసు ఈ ఉపమానం ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడు?

5 ఆ ఉపమానం ద్వారా అసలు యేసు ఏ విషయం నేర్పించాలనుకున్నాడు? ఆయన ఆ ఉపమానం చివర్లో ఇలా చెప్పాడు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.” (మత్త. 18:35) యేసు చెప్పాలనుకున్న విషయం ఆ మాటల్లో స్పష్టంగా ఉంది. అపరిపూర్ణులుగా జీవించినంతకాలం మనం చేసే పాపాలను బట్టి చూస్తే అసలు మనలో ఎవ్వరమూ యెహోవా ప్రమాణాలకు సరిపోము. అయినా యెహోవా మనల్ని క్షమిస్తున్నాడు, మన పాపాల్ని పూర్తిగా తుడిచేస్తున్నాడు. కాబట్టి, యెహోవాకు స్నేహితులుగా ఉండాలని కోరుకునేవాళ్లు ఇతరుల తప్పులను క్షమించాల్సిందే. యేసు ఆ ఉద్దేశంతోనే తన కొండమీది ప్రసంగంలో ఇలా అన్నాడు: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.”​—మత్త. 6:14, 15.

6. ఇతరులను క్షమించడం మనకు కొన్నిసార్లు ఎందుకు కష్టమనిపించవచ్చు?

6 ‘అది వినడానికి బాగుంది కానీ, ఆచరణలో పెట్టడం కష్టం’ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే, ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం తరచూ భావోద్వేగానికి లోనౌతాం. అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తికి కోపం రావచ్చు, అవతలివాళ్లు నమ్మకద్రోహం చేశారని అనిపించవచ్చు, తనకు న్యాయం జరగాలని లేదా వాళ్లకు తగిన శాస్తి చేయాలని అనిపించవచ్చు. నిజానికి, తమను బాధపెట్టినవాళ్లను క్షమించడం తమవల్ల కాదని కొందరికి అనిపించవచ్చు. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తుంటే, మీరు క్షమాగుణాన్ని ఎలా అలవర్చుకోవచ్చు?

మీ భావోద్వేగాలను పరిశీలించుకోండి

7, 8. నిర్దయగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించిన వాళ్లను క్షమించడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

7 ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు లేదా బాధపెట్టారని మనకు అనిపించినప్పుడు మనం ఆవేశపడతాం. కోపం అనే విషయం మీద నిర్వహించిన ఓ అధ్యయనం ఒక యువకుని అనుభవాన్ని వెల్లడించింది. ఆ యువకుడు ఇలా అన్నాడు: ‘ఓ రోజు నేను కోపం పట్టలేక, మళ్లీ ఈ ఇంటి గడప తొక్కను అని శపథం చేసి ఇంటి నుండి బయటకు వచ్చేశాను. అది వెచ్చని వేసవి కాలం, అందమైన రోడ్ల గుండా నేను చాలా దూరం నడిచాను. అయితే ఆ ప్రశాంతమైన పరిసరాల మధ్య చాలాసేపు నడిచిన తర్వాత నా కోపం తగ్గుముఖం పట్టింది. కొన్ని గంటల తర్వాత నా కోపం పూర్తిగా తగ్గిపోవడంతో మనసు మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చేశాను.’ ఆ అనుభవం చూపిస్తున్నట్లుగా మన ఆవేశం తగ్గడానికి కాస్త సమయం తీసుకొని, పరిస్థితి గురించి సావధానంగా ఆలోచిస్తే మనం అవతలి వాళ్లను క్షమించగలుగుతాం, ‘అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే’ అని తర్వాత విచారించాల్సిన పరిస్థితి కూడా రాదు.​—కీర్త. 4:4; సామె. 14:29; యాకో. 1:19, 20.

8 మీరలా సావధానంగా ఆలోచించినా మీ ఆవేశం తగ్గకపోతే అప్పుడేమిటి? అసలు మీ మనసు ఎందుకు నొచ్చుకుందో నిర్ధారించుకోవడానికి ప్రయత్నించండి. మీతో ఇతరులు అన్యాయంగా, అమర్యాదగా ప్రవర్తించినందుకా? లేక ఇతరులు మిమ్మల్ని కావాలనే నొప్పించారని మీకు అనిపించినందుకా? అసలు వాళ్లు చేసింది నిజంగా చెడ్డ పనేనా? మీరు బాధపడడానికిగల కారణాల్ని విశ్లేషించుకొని దాన్ని అర్థంచేసుకుంటే దేవునికి ఇష్టమైన విధంగా స్పందించగలుగుతారు. (సామెతలు 15:28; 17:27 చదవండి.) అలా కారణాల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తే, అసలు సమస్య ఏమిటో గుర్తించగలుగుతారు, ఇతరుల్ని క్షమించగలుగుతారు. కష్టమైనా సరే మీరు అలా చేస్తే, బైబిలు సహాయంతో మీరు మీ “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను” పరిశీలించుకోగలుగుతారు, యెహోవాలా క్షమాగుణాన్ని చూపించగలుగుతారు.​—హెబ్రీ. 4:12.

మిమ్మల్ని నొప్పించడానికే వాళ్లు అలా చేశారని అనుకోకండి

9, 10. (ఎ) ఇతరులు మనల్ని నొప్పించారని అనిపించినప్పుడు కొన్నిసార్లు మనమెలా స్పందించే అవకాశం ఉంది? (బి) సానుకూలంగా ఆలోచించి ఇతరుల్ని క్షమించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది?

9 జీవితంలో చాలా పరిస్థితుల్లో మనం కోపావేశాలకు లోనౌతాం. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు వేరేవాళ్ల వాహనం దాదాపు మీ వాహనాన్ని ఢీకొట్టేంత దగ్గరికి వచ్చిందనుకోండి. మీరెలా స్పందిస్తారు? అలాంటి సందర్భాల్లో కోపంతో డ్రైవర్లు కొట్లాటలకు దిగిన ఉదంతాల గురించి బహుశా మీరు వార్తాపత్రికల్లో చదివే ఉంటారు. అయితే, క్రైస్తవులుగా మనం అలా చేయము.

10 ఓ క్షణమాగి పరిస్థితిని విశ్లేషించడం ఎంత మంచిదో కదా! మీ ధ్యాస పక్కకు మళ్లినందువల్ల, జరిగిన సంఘటనకు బహుశా మీరు కూడా కారణం కావచ్చు. లేదా అవతలి వ్యక్తి వాహనంలో ఏదో లోపం తలెత్తి ఉండవచ్చు. ఆ ఉదాహరణ చూపిస్తున్నట్లుగా మనం పరిస్థితిని రెండువైపులా ఆలోచించి, దాన్ని అర్థంచేసుకొని అవతలి వాళ్లను క్షమిస్తే మనం కోపాన్ని, నిరాశను లేదా ఇతర భావోద్వేగాలను తగ్గించుకోగలుగుతాం. “ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును” అని ప్రసంగి 7:9 చెబుతోంది. మిమ్మల్ని నొప్పించడానికే వాళ్లు అలా చేశారని అనుకోకండి. ఇతరులు కావాలనే మనల్ని నొప్పించారని మనం అనుకుంటాం కానీ చాలా సందర్భాల్లో అది నిజం కాకపోవచ్చు. కేవలం అపరిపూర్ణత వల్ల లేదా అపార్థం చేసుకోవడం వల్ల సమస్య తలెత్తవచ్చు. ఇతరులు మీతో నిర్దయగా మాట్లాడారని, ప్రవర్తించారని అనిపించినప్పుడు విషయాన్ని పలుకోణాల్లో ఆలోచించి ప్రేమతో క్షమించడానికి సిద్ధంగా ఉండండి. మీరలా చేస్తే చాలా సంతోషంగా ఉంటారు.​—1 పేతురు 4:8 చదవండి.

‘మీ సమాధానము మీకు తిరిగి వస్తుంది’

11. సువార్తకు ప్రజలు స్పందించే తీరు ఎలా ఉన్నా సరే రాజ్య ప్రచారకులమైన మనం ఏ విధంగా వ్యవహరించాలి?

11 మీరు పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే మీరెలా నిగ్రహం చూపించవచ్చు? యేసు 70 మంది సువార్తికుల్ని పంపించినప్పుడు, “ఈ ఇంటికి సమాధానమగును గాక” అని ఇంటివాళ్లతో చెప్పమన్నాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు: “సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.” (లూకా 10:1, 5, 6) ప్రజలు సువార్తను అంగీకరించినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. ఎందుకంటే, ఆ సందేశం వల్ల వాళ్లకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొన్నిసార్లు ఇంటివాళ్లు అసలేమాత్రం గౌరవం లేకుండా మాట్లాడితే ఎలా? యేసు చెప్పినట్లుగా మనం అప్పుడు కూడా సమాధానంగా ఉండాలి. ఇంటివాళ్లు ఎలా ప్రవర్తించినా మనం సమాధానంగా ఆ ఇంటి నుండి వెళ్లిపోవాలి. కానీ, కోపావేశాలకు లోనైతే మనం మన సమాధానాన్ని కాపాడుకోలేం.

12. మనం ఎలా వ్యవహరించాలని ఎఫెసీయులు 4:31, 32లో పౌలు చెప్పాడు?

12 క్రైస్తవ పరిచర్యలోనే కాక అన్ని పరిస్థితుల్లో మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇతరులను క్షమించడమంటే వాళ్ల చెడు నడతను చూసీచూడనట్లు వదిలేయడం కాదు లేదా దానివల్ల జరిగిన హానిని తక్కువచేసి చూడడం కాదు. బదులుగా, ఇతరుల తప్పుల వల్ల మనకు వచ్చిన కోపాన్ని తీసేసుకొని మన సమాధానాన్ని కాపాడుకోవాలి. కొంతమంది ప్రతికూలమైన వాటి గురించే ఆలోచిస్తూ, ఇతరులు తమతో చాలా చెడుగా ప్రవర్తించారనే విషయాన్ని పదేపదే గుర్తుచేసుకుంటూ తమ సంతోషాన్ని కోల్పోతారు. మీ పరిస్థితి అలా కాకుండా చూసుకోండి. మనసులో కోపాన్ని ఉంచుకుంటే సంతోషంగా ఉండలేరనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే, ఇతరుల్ని క్షమిస్తూ ఉండండి.​—ఎఫెసీయులు 4:31, 32 చదవండి.

యెహోవాకు నచ్చే విధంగా ప్రతిస్పందించండి

13. (ఎ) ఒక క్రైస్తవుడు ఏ విధంగా తన శత్రువు “తలమీద నిప్పులు కుప్పగా” పోస్తాడు? (బి) కోపం తెప్పించే పరిస్థితుల్లో కూడా మనం మృదువుగా వ్యవహరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

13 కొన్నిసార్లు మిమ్మల్ని నొప్పించినవాళ్లకు బైబిలు ప్రమాణాల విలువను తెలియజేయాలని మీకు అనిపించవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమా. 12:20, 21) కోపం తెప్పించే పరిస్థితుల్లో కూడా మీరు దయగా వ్యవహరిస్తే, ఎంత కఠినులైనా మారవచ్చు, వాళ్లలోని మంచి లక్షణాలు బయటకు రావచ్చు. మనల్ని నొప్పించినవాళ్లను అర్థంచేసుకుంటూ సహానుభూతి, కనికరం వంటి లక్షణాలు చూపిస్తే వాళ్లు బైబిలు సత్యాలు తెలుసుకునేలా సహాయం చేయగలుగుతాం. ఎలాంటి పరిస్థితిలోనైనా మనం మృదువుగా వ్యవహరిస్తే, ఇతరులు మన మంచి ప్రవర్తనను చూసి, ‘మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామా’ అని వాళ్లు ఆలోచించే అవకాశం ఉంది.​—1 పేతు. 2:12; 3:15, 16.

14. ఒక వ్యక్తి మనతో ఎంత చెడుగా వ్యవహరించినా, మన మనసులో ఆయన మీద ఎందుకు కోపం ఉంచుకోకూడదు?

14 కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందితో మనం సహవాసం చేయకూడదు. ఒకప్పుడు క్రైస్తవసంఘ సభ్యులై ఉండి, ఘోరమైన పాపం చేసి పశ్చాత్తాపపడనందువల్ల సంఘం నుండి బహిష్కరించబడిన వాళ్లతో మనం సహవాసం చేయకూడదు. అలాంటి వ్యక్తి మన మనసును గాయపర్చి ఉంటే, ఆయన పశ్చాత్తాపపడి తిరిగి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను క్షమించడం కష్టం కావచ్చు. ఎందుకంటే, ఆ గాయం అంత త్వరగా మానిపోదు. అలాంటప్పుడు, పశ్చాత్తాపపడిన వాళ్లను క్షమించడానికి కావాల్సిన క్షమాగుణాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు పదేపదే ప్రార్థించాలి. నిజానికి, ఇతరుల మనసులో అసలు ఏముందో మనకు తెలుస్తుందా చెప్పండి. కానీ యెహోవాకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. ఒక వ్యక్తి హృదయాంతరాల్లో ఏముందో ఆయన పరిశీలిస్తాడు, పాపులతో ఓపికగా వ్యవహరిస్తాడు. (కీర్త. 7:9, 10; సామె. 17:3) అందుకే లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” (రోమా. 12:17-19) కాబట్టి, మనం ఇతరులకు సరైన తీర్పు తీర్చగలుగుతామా? అస్సలు తీర్చలేము. (మత్త. 7:1, 2) కానీ, యెహోవాయే న్యాయమైన తీర్పు తీరుస్తాడని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.

15. మనం ఏ విషయాన్ని గుర్తుంచుకుంటే మనల్ని బాధపెట్టిన వాళ్ల పట్ల మన వైఖరి మారుతుంది?

15 ఎవరైనా మీకు అన్యాయం చేశారని మీకు అనిపిస్తే, లేదా తప్పు చేసి పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించడం మీకు కష్టమనిపిస్తే, సదరు వ్యక్తి కూడా ఒక సమస్యతో బాధపడుతున్నాడని గుర్తుంచుకోండి. ఆయన/ఆమె కూడా వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత వల్ల నానా అగచాట్లు పడుతున్నారు. (రోమా. 3:23) యెహోవా దేవుడు అపరిపూర్ణ మానవులందరి మీద కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి, మనల్ని నొప్పించిన వాళ్ల కోసం మనం ప్రార్థించాలి. సాధారణంగా మనం ఎవరి గురించైతే ప్రార్థిస్తామో వాళ్లమీద కోపం పెట్టుకునే అవకాశాలు తక్కువ. మనల్ని హింసించేవాళ్ల మీద కూడా మనం కోపం పెట్టుకోకూడదనే విషయం యేసు చెప్పిన ఈ మాటల్లో స్పష్టమౌతోంది: “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.”​—మత్త. 5:44.

16, 17. ఫలానా వాళ్లు నిజంగా పశ్చాత్తాపపడ్డారని పెద్దలు తీర్మానిస్తే మీరు ఎలా స్పందించాలి? ఎందుకు?

16 తప్పుచేసిన క్రైస్తవుల విషయంలో న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను యెహోవా సంఘ పెద్దలకు అప్పగించాడు. దేవునికి ఉన్నంత అవగాహన లేకపోయినా, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యంలోని నిర్దేశానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్లు శాయశక్తులా కృషిచేస్తారు. కాబట్టి, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించిన తర్వాత వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఆయన ఉద్దేశం ప్రకారంగానే ఉంటాయి.​—మత్త. 18:18.

[30వ పేజీలోని చిత్రం]

ఇతరుల్ని క్షమించడం క్రైస్తవుల బాధ్యత

17 అలాంటప్పుడే మన యథార్థత పరీక్షించబడుతుంది. ఫలానా వాళ్లు నిజంగా పశ్చాత్తాపపడ్డారని పెద్దలు తీర్మానిస్తే మీరు అలాంటి వ్యక్తుల్ని క్షమిస్తారా? వాళ్లతో మళ్లీ ప్రేమగా వ్యవహరిస్తారా? (2 కొరిం. 2:5-8) ఒకవేళ అలాంటి వ్యక్తులు మీకు, మీవాళ్లకు హానిచేసిన వ్యక్తులైతే వాళ్లను క్షమించడం, వాళ్లతో ప్రేమగా వ్యవహరించడం కష్టం కావచ్చు. కానీ యెహోవా పట్ల, సంఘం ద్వారా ఆయన విషయాల్ని చక్కదిద్దే తీరు పట్ల నమ్మకం ఉంచితే మీరు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తారు. అంతేగాక, ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామని మీరు చూపిస్తారు.​—సామె. 3:5, 6.

18. మనస్ఫూర్తిగా క్షమించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

18 క్షమించడానికి సిద్ధంగా ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల, మన మనసులో పాతుకుపోయి మనల్ని కృంగదీస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న భావావేశాల్ని తొలగించుకోగలుగుతామని, అలాగే ఇతరులతో సత్సంబంధాలను కలిగివుంటూ సంతోషంగా ఉండగలుగుతామని వాళ్లు చెబుతున్నారు. మరోవైపు, మనం ఇతరుల్ని క్షమించకపోతే ఎన్నో నష్టాలు వాటిల్లుతాయి. దానివల్ల ఆరోగ్యం పాడౌతుంది, సంబంధాలు దెబ్బతింటాయి, ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాక, ఇతరులతో మనస్ఫూర్తిగా మాట్లాడలేం. అయితే, క్షమించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మన పరలోక తండ్రియైన యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండగలుగుతాం.​—కొలొస్సయులు 3:12-14 చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి