మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనండి!
“దుర్దినములు రాకముందే—ఇప్పు[డే] . . . నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 12:1, 2.
1. దేవునికి సమర్పించుకున్న యౌవనస్థులు, తమ యౌవనాన్ని బలాన్ని ఎలా ఉపయోగించాలని కోరుకోవాలి?
తన చిత్తాన్ని చేయటానికి యెహోవా తన సేవకులకు బలమిస్తాడు. (యెషయా 40:28-31) వారి వయస్సు ఎంతైనప్పటికీ ఇది వాస్తవం. కానీ దేవునికి సమర్పించుకున్న యౌవనస్థులు ప్రత్యేకించి తమ యౌవనాన్ని బలాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అందుకని, వారు ప్రాచీన ఇశ్రాయేలు రాజు, “ప్రసంగి” అయిన సొలొమోను చేసిన హితబోధను హృదయంలోకి తీసుకుంటారు. ఆయన ఇలా ఉద్బోధించాడు: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 1:1; 12:1, 2.
2. సమర్పించుకున్న క్రైస్తవుల పిల్లలు ఏమి చేయాలి?
2 యౌవనకాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలన్న సొలొమోను మందలింపు మొదట ఇశ్రాయేలీయుల్లోని యౌవన స్త్రీపురుషులకే ఉద్దేశించబడింది. వారు యెహోవాకు సమర్పించబడిన జనాంగంలో జన్మించారు. మరి ఈనాడు సమర్పిత క్రైస్తవుల పిల్లల విషయమేమిటి? నిశ్చయంగా వారు తమ సృష్టికర్తను మనస్సులో ఉంచుకోవాలి. అలా చేస్తే వారు ఆయనను ఘనపరుస్తారు, తమకు ప్రయోజనం చేకూర్చుకుంటారు.—యెషయా 48:17, 18.
గతంనుంచి చక్కని మాదిరులు
3. యోసేపు, సమూయేలు, దావీదులు ఎలాంటి మాదిరులను ఉంచారు?
3 తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నవారిగా బైబిలునందు వ్రాయబడివున్న ఎంతోమంది యౌవనస్థుల చక్కని మాదిరులు ఉన్నాయి. యాకోబు కుమారుడైన యోసేపు తన చిన్నతనం నుంచే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. పోతీఫరు భార్య యోసేపును తనతో శయనించుమని ప్రలోభపెట్టినప్పుడు, ఆయన స్థిరచిత్తంతో తిరస్కరిస్తూ ఇలా అన్నాడు: “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందు[ను].” (ఆదికాండము 39:9) లేవీయుడైన సమూయేలు బాల్యములో మాత్రమేకాదు, తన జీవితకాలమంతా తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. (1 సమూయేలు 1:22-28; 2:18; 3:1-5) బెత్లెహేమువాడైన యౌవనుడైన దావీదు నిస్సందేహంగా తన సృష్టికర్తను మనస్సులో ఉంచుకున్నాడు. అతడు ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే భారీకాయుడ్ని ఎదుర్కొని ఇలా అన్నప్పుడు దేవునియందు అతనికున్న నమ్మకం ఋజువైంది: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొం[దురు]. అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యూ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించు[ను].” కొద్దిసేపట్లోనే గొల్యాతు చచ్చాడు, ఫిలిష్తీయులు పారిపోయారు.—1 సమూయేలు 17:45-51.
4. (ఎ) చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయుల అమ్మాయి, యువకుడైన యోషీయా తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నారని ఏది చూపిస్తుంది? (బి) 12 ఏండ్ల యేసు తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నానని ఎలా చూపించాడు?
4 సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న యౌవనులలో మరొకరు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయుల అమ్మాయి. ఆమె సిరియా సైన్యాధిపతియైన నయమాను భార్యకు చక్కని సాక్ష్యాన్నిచ్చినప్పుడు ఆయన దేవుని ప్రవక్త దగ్గరకు వెళ్లి, కుష్ఠురోగాన్నుండి స్వస్థతపొంది, యెహోవా ఆరాధకుడయ్యాడు. (2 రాజులు 5:1-19) యువకుడైన యోషీయా రాజు ధైర్యంగా యెహోవా స్వచ్ఛారాధనను పెంపొందింపచేశాడు. (2 రాజులు 22:1–23:25) అయితే లేతప్రాయంలో ఉండగనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారిలో శ్రేష్ఠమైన మాదిరి, నజరేయుడైన యేసుదే. ఆయనకు 12 ఏండ్ల వయస్సున్నప్పుడు ఏమి జరిగిందో చూడండి. ఆయన తల్లిదండ్రులు పస్కాపండుగకు ఆయనను యెరూషలేముకు తీసుకువచ్చారు. తిరిగివెళ్లేటప్పుడు యేసు తమతో లేడని వారు గమనించారు; ఆయన్ని వెదకటానికి వారు మళ్లీ వెనక్కి వచ్చారు. మూడవరోజు, దేవాలయంలో ఆయన బోధకులతో లేఖనాలకు సంబంధించిన ప్రశ్నలు చర్చిస్తూ ఉండగా వారు ఆయనను చూశారు. ఏమైందని ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న తన తల్లిని యేసు ఇలా అడిగాడు: “నాకోసం వెదకడమెందుకు? నేను నా తండ్రి మందిరంలో వుండాలని మీకు తెలియదా?” (లూకా 2:49, పరిశుద్ధ బైబిల్) ‘తన తండ్రి మందిరం’ అయిన దేవాలయంలో ఆధ్యాత్మిక విలువగల సమాచారాన్ని పొందడం యేసుకు ప్రయోజనకరమైనదై ఉంది. ఈనాడు, యెహోవాసాక్షుల రాజ్యమందిరం మన సృష్టికర్తను గూర్చిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఒక శ్రేష్ఠమైన స్థలంగా ఉంది.
యెహోవాను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి!
5. ప్రసంగి 12:1లో నమోదు చేయబడిన దాన్ని మీ స్వంత మాటల్లో మీరెలా వ్యక్తంచేస్తారు?
5 యెహోవాను హృదయపూర్వకంగా ఆరాధించేవారు సాధ్యమైనంత త్వరగా ఆయన సేవను చేపట్టి, తమ జీవితాంతమూ దేవునికి సేవచేయాలని కోరుకుంటారు. అయితే, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోవడం మూలంగా తన యౌవనకాలమంతా వ్యర్థంగా గడిచిపోయిన వారికున్న ఉత్తరాపేక్షలేమిటి? దైవ ప్రేరేపణతో ప్రసంగి ఇలా అంటున్నాడు: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పుసంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 12:1, 2.
6. వృద్ధులైన సుమెయోను, అన్న తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నారనటానికి నిదర్శనమేమిటి?
6 వృద్ధాప్యపు ‘దుర్దినములలో’ ఎవరూ సంతోషించలేరు. కానీ తమ మనస్సులో సృష్టికర్తను ఉంచుకున్న వృద్ధులు ఆనందించగలరు. ఉదాహరణకు, పెద్దవయసువాడైన సుమెయోను దేవాలయంలో శిశువైన యేసును తన చేతులలోకి తీసుకుని ఆనందంతో ఇలా ప్రకటించాడు: “నాథా, యప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.” (లూకా 2:25-32) యెనుబది నాలుగు సంవత్సరముల అన్న కూడా తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంది. ఆమె సర్వదా దేవాలయంలోనే ఉంటూ శిశువైన యేసును అక్కడికి తీసుకువచ్చినప్పుడు అక్కడే ఉంది. ఆమె “ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.”—లూకా 2:36-38.
7. దేవుని సేవలో వృద్ధాప్యానికెదిగిన వారి పరిస్థితి ఏమిటి?
7 దేవుని సేవ చేస్తూ వృద్ధులైన ప్రస్తుతదిన యెహోవా సాక్షులు మీద పడుతున్న వయసు మూలంగా ఇబ్బందులతో, పరిమితులతో బాధపడుతుండవచ్చు. అయినా, వారు ఎంత ధన్యులు, వారి నమ్మకమైన సేవను మనమెంత అభినందిస్తామో గదా! వారికి ‘యెహోవాయందు ఆనందం’ ఉంది, ఎందుకంటే భూమి విషయంలో ఆయన తన అజేయమైన శక్తిని ఉపయోగించడం ప్రారంభించాడనీ, యేసుక్రీస్తును శక్తిమంతమైన పరలోక రాజుగా నియమించాడనీ వారికి తెలుసు. (నెహెమ్యా 8:10) యౌవనులు వృద్ధులు ఈ ప్రబోధాన్ని లక్ష్యపెట్టడానికి ఇదే సమయం: “యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.”—కీర్తన 148:12, 13.
8, 9. (ఎ) ఎవరి “దుర్దినములు” నిష్ఫలమైనవిగా ఉంటాయి, ఎందుకలా? (బి) ప్రసంగి 12:2ను మీరెలా వివరిస్తారు?
8 తమ సృష్టికర్తను గురించిన ఆలోచన లేనివారికి ఆయన మహిమకరమైన సంకల్పాలను గురించిన అవగాహన లేనివారికి తమ వృద్ధాప్యమనే “దుర్దినములు” నిష్ఫలమైనవిగా అంటే బహుశ ఎంతో ఆందోళనకరమైనవిగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే శ్రమలను, సాతాను పరలోకం నుండి పడద్రోయబడినప్పటి నుండి మానవజాతిని పీడిస్తున్న వేదనలను తిప్పికొట్టగల ఆధ్యాత్మిక అవగాహన వారికుండదు. (ప్రకటన 12:7-12) కాబట్టి, “తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే” మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగి మనకు ఉద్బోధిస్తున్నాడు. (ప్రసంగి 12:2) ఈ మాటల ప్రాముఖ్యత ఏమిటి?
9 సొలొమోను యౌవనకాలాన్ని, నిర్మలమైన ఆకాశంనుంచి సూర్య చంద్ర నక్షత్రాలు కాంతిని వెదజల్లే పాలస్తీనాలోని వేసవికాలంతో పోలుస్తున్నాడు. అప్పుడు అన్నీ ఎంతో కాంతివంతంగా కనిపిస్తాయి. అయితే వృద్ధాప్యంలోని ఒకరి కాలం చల్లగా, చలికాలమందలి వర్షంలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కష్టాలతో నిండివుంటుంది. (యోబు 14:1) ఒకరు తమ సృష్టికర్తను తెలుసుకుని, జీవితంలోని వేసవికాలంలో ఆయన సేవ చేయలేకపోవటం ఎంత విచారకరం! ప్రత్యేకించి తమ యౌవనకాలంలో వ్యర్థమైనవాటిని వెంబడించి యెహోవాను సేవించే అవకాశాల్ని జారవిడుచుకున్నవారికి తమ వృద్ధాప్యమనే శీతకాలంలో అన్నీ అంధకారమయమౌతాయి. అయితే, మన వయస్సుతో నిమిత్తంలేకుండా, ప్రవక్తయైన మోషేకు నమ్మకమైన సహాయకుడైన విశ్వాసియైన కాలేబులా ‘యెహోవాను నిండుమనస్సుతో అనుసరిద్దాము.’—యెహోషువ 14:6-9.
మీదపడుతున్న వయసు ప్రభావాలు
10. (ఎ) “ఇంటి కావలివారు,” (బి) “బలిష్ఠులు” వేటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి?
10 సొలొమోను తర్వాతి కష్టాలను చెబుతూ ఇలా అన్నాడు, “ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.” (ప్రసంగి 12:3) ఇక్కడ ‘ఇల్లు’ మానవ దేహాన్ని సూచిస్తుంది. (మత్తయి 12:43-45; 2 కొరింథీయులు 5:1-8) దాని “కావలివారు” దేహాన్ని సంరక్షించి, దాని అవసరాలను తీర్చే, ముంజేతులు లేక బాహువులు. తరచూ వృద్ధాప్యంలో అవి బలహీనతతో వణకుతాయి, శక్తిహీనమౌతాయి, చచ్చుబడిపోతాయి. “బలిష్ఠులు” అంటే కాళ్లు, ఇక బలమైన స్తంభాల్లాగ ఉండవుగానీ బలహీనమైపోయి వంగిపోవటంవల్ల కాళ్లీడ్చుకుంటూ నడవవలసి వస్తుంది. అయితే, క్రైస్తవ కూటాల్లో మన తోటివిశ్వాసులైన వృద్ధులను చూడటం మీకు ఆనందంగా లేదా?
11. అలంకారికంగా మాట్లాడితే “విసరువారు,” “కిటికీలలోగుండ చూచువారు” ఎవరు?
11 “విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు” అదెలా? దంతాలు క్షయమైపోవచ్చు లేదా ఊడిపోవచ్చు, ఒకవేళ ఉంటే ఏవో కొన్ని మిగిలి ఉండవచ్చు. ఘనపదార్థాలను నమలటం కష్టం అవుతుంది లేదా పూర్తిగా నమలలేకపోవచ్చు. “కిటికీలలోగుండ చూచువారు” అంటే కళ్లూ, అలాగే మనం చూడటానికి ఉపయోగించే ఏ మానసిక సామర్థ్యాలైనా మసకబారతాయి లేదంటే పూర్తిగా కాంతిహీనమైపోతాయి.
12. (ఎ) ఎలా “వీధి తలుపులు మూయబడును”? (బి) వృద్ధులైన రాజ్యప్రచారకులను గూర్చి మీరేమనుకుంటున్నారు?
12 ప్రసంగి కొనసాగిస్తూ, “తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు.” (ప్రసంగి 12:4) నోటికున్న రెండు తలుపులు, అంటే పెదవులు, దేవునిసేవ చేయని, వయసు మీదపడినవారి ‘ఇంట్లో’ లేక దేహములో ఉన్నదాన్ని చెప్పడానికి ఇక ఎక్కువగా తెరుచుకోవు లేదా అసలే తెరుచుకోవు. సాధారణ జీవితమనే “వీధి” లోకి ఏమీ పంపబడదు. అయితే, ఉత్సాహవంతులైన వృద్ధులైన రాజ్యప్రచారకుల విషయమేంటి? (యోబు 41:14) వాళ్లు ఇంటింటికి నెమ్మదిగా నడుస్తుండవచ్చు, కొందరు ఎంతో కష్టంతో మాట్లాడుతుండవచ్చు, అయినా వారు నిశ్చయంగా యెహోవాను స్తుతిస్తున్నారు!—కీర్తన 113:1.
13. వృద్ధులకు సంబంధించిన ఇతర సమస్యలను గూర్చి ప్రసంగి ఎలా వర్ణించాడు, కానీ వృద్ధులైన క్రైస్తవులను గూర్చిన నిజమేమిటి?
13 దంతాలు లేని చిగుళ్లతో ఆహారాన్ని నములుతున్నప్పుడు తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది. తన పడకమీద వృద్ధుడు మంచినిద్రకు దూరం అవుతాడు. పిట్టయొక్క కూతలకే అతనికి మెలకువ వస్తుంది. ఆయన పాడేదే కొన్నిపాటలు, ఆయన తీసే రాగం ఏదైనా కూడా అది బలహీనంగా ఉంటుంది. “సంగీతమును చేయు స్త్రీలు”—రాగయుక్తమైన పాటలు—“శబ్దము” ఎక్కువగా చేయరు. వృద్ధులైనవారు ఇతరుల పాటలను, సంగీతాన్ని సరిగా వినలేరు. అయితే, అభిషిక్తులైన వృద్ధులు వారి సహచరులు వారిలో కొందరు అంత యౌవనులు కాకపోయినా, క్రైస్తవ కూటాల్లో దేవుని స్తుతించటానికి తమ గళాలను ఎత్తుతూనే ఉన్నారు. సంఘంలో యెహోవాను ఘనపర్చటానికి మనతో పాటు వారు ఉండటం మనకు ఎంత సంతోషకరమైన విషయం!—కీర్తన 149:1.
14. వృద్ధులను ఏ భయాలు పీడిస్తాయి?
14 ప్రాముఖ్యంగా సృష్టికర్తను విస్మరించిన ఎంతోమంది వృద్ధులు ఎంత దుఃఖాక్రాంతులై ఉన్నారోకదా! ప్రసంగి ఇంకా ఇలా అంటున్నాడు: “[వారు] ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును [“మిడుతలా కాళ్లీడ్చుకుంటూ నడుస్తావు,” పరిశుద్ధ బైబిల్], బుడ్డబుడుసరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు.” (ప్రసంగి 12:5) ఎత్తుగావున్న మెట్లమీది నుండి పడిపోతామేమోనని అనేకమంది వృద్ధులు భయపడతారు. అంతెందుకు ఎత్తైనదాన్ని చూస్తేనే వాళ్లకు కళ్లుతిరిగినట్లు ఉండవచ్చు. రద్దీగా ఉన్న వీధుల్లోకి వెళ్లాల్సివచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతాయనీ, లేదా దొంగలు దోచుకుంటారనీ వాళ్లు భయపడతారు.
15. ‘బాదముచెట్టు ఎలా పువ్వులు పూయును,’ మిడుత ఎలా ‘కాళ్లీడ్చుకుంటూ’ నడుస్తుంది?
15 “బాదము వృక్షము పువ్వులు పూయును,” వృద్ధులైనవారి విషయంలో అది, వారి తల నెరసిపోవటాన్ని, తర్వాత అది ముగ్గుబుట్టలా తెల్లగా మారిపోవటాన్ని సూచించవచ్చు. నెరసిన వెంట్రుకలు, బాదము పువ్వులు తెల్లబారి రాలిపోయినట్లు రాలిపోతాయి. అతడు “కాళ్లీడ్చుకుంటూ” నడుస్తుండగా, బహుశా తన నడుముపై చేతులు ఆనించుకుని ముందుకు వంగిపోయి నెమ్మదిగా నడుస్తుండగా బహుశ అతడు మిడుతలా కనిపిస్తుండవచ్చు. అయితే, ఒకవేళ మనలో ఎవరైనా కాస్త అలా కనిపించినా, మనం యెహోవా శక్తితో వేగంగా కదిలే మిడుతల దండులో ఉన్నామని ఇతరులు గమనించాలి!—కావలికోట, మే 1, 1998, పేజీలు 8-13 చూడండి.
16. (ఎ) “బుడ్డబుడుసరకాయ పగులును” అంటే అది దేన్ని సూచిస్తుంది? (బి) నరుని “నిత్యమైన ఉనికిపట్టు” ఏది, మరణం ఆసన్నమైందని ఏ సూచనలు స్పష్టం చేస్తాయి?
16 వృద్ధులైనవారి ఆకలి సన్నగిల్లిపోతుంది, ఆయన ముందున్న ఆహారం, అది బుడ్డబుడుసరికాయ [కామాక్షి చెట్టుకాయ]లా ఎంత రుచిగా ఉన్నాసరే. ఈ పండ్లు ఎంతో పూర్వంనుండి జఠరదీప్తికి ఉపయోగిస్తున్నారు. “బుడ్డబుడుసరికాయ పగులును” అంటే వృద్ధులైనవారి ఆకలి మందగించినప్పుడు జఠరదీప్తిని పుట్టించే ఈ పండు కూడా, వారికి ఆకలిని పుట్టించలేకపోతుంది అని సూచింపబడుతుంది. అలాంటి విషయాలు ఆయన “తన నిత్యమైన ఉనికిపట్టు” అయిన సమాధికి సమీపిస్తున్నాడని సూచిస్తున్నాయి. ఆయన తన సృష్టికర్తను మనస్సున స్మరణకు తెచ్చుకోకుండా, దేవుడు పునరుత్థానమందు తనను జ్ఞాపకం చేసుకోనంతటి అక్రమమైన జీవితాన్ని అనుసరించినట్లైతే గనుక అది ఆయనకు నిరంతర నివాసమన్నట్లు ఉండిపోగలదు. వృద్ధుల నోటికున్న రెండు తలుపుల గుండా వచ్చే శోకస్వరాలు, దుఃఖంతో కూడిన మూలుగులు మరణం ఆసన్నమైందన్న సూచనలను స్పష్టం చేస్తాయి.
17. “వెండి త్రాడు” ఎలా విడిపోవును, “బంగారు గిన్నె” దేనికి ప్రాతినిధ్యం వహించవచ్చు?
17 “వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.” అయితే ఇలా జరుగకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని మనము ఉద్బోధించబడుతున్నాము. (ప్రసంగి 12:6) మనకుండే వెన్నెముకే ఈ “వెండి త్రాడు” కావచ్చు. మెదడుకి ప్రచోదనాలను అందించే ఈ మహత్తరమైన మార్గం బాగుచేయబడలేని విధంగా దెబ్బతిన్నప్పుడు మరణం అనివార్యం. వెన్నెముకకు అతికినట్టుండే గిన్నెను పోలివుండే కపాలంలో ఇమిడివున్న మస్తిష్కమే “బంగారు గిన్నె”ను సూచించవచ్చు. బంగారంలా అమూల్యమైనదైన మెదడు పగిలిందంటే దానర్థం మరణమనే.
18. సూచనార్థకమైన “ధారయొద్ద కుండ” ఏది, అది పగిలినప్పుడు ఏమి జరుగుతుంది?
18 రక్త ప్రవాహాన్ని అందుకుని తిరిగి శరీరమంతా ప్రసరణమయ్యేలా పంపించే హృదయమే “ధారయొద్ద కుండ.” చనిపోయినప్పుడు హృదయం ధారయొద్ద పగిలిన కుండలా అవుతుంది, ఎందుకంటే శరీరం పోషించబడటానికి, ఉత్తేజితంకావటానికి అగత్యమైన రక్తాన్ని ఇక అది ఎంతమాత్రం అందుకోలేదు, తనలో ఉంచుకోలేదు, బయటికి పంపించలేదు. ‘బావియొద్ద చక్రము పడిపోవటం,’ జీవ పోషకమైన రక్త ప్రసరణ ఆగిపోవటమే. 17వ శతాబ్దపు వైద్యుడైన విలియం హార్వే, రక్తం ప్రసరిస్తుందని ప్రదర్శించి చూపడానికి ఎంతోకాలం ముందే యెహోవా, రక్త ప్రసరణ విధానాన్ని సొలొమోనుకు అలా బయల్పరిచాడు.
19. ప్రసంగి 12:7 నందలి మాటలు మరణానికి ఎలా అన్వయిస్తాయి?
19 ప్రసంగి ఇంకా ఇలా అన్నాడు: “మన్నయనది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.” (ప్రసంగి 12:7) “బావియొద్ద చక్రము” పడిపోవటంతో మన్నునుంచి తయారైన మానవ శరీరం తిరిగి మన్నైపోతుంది. (ఆదికాండము 2:7; 3:19) మనిషి మరణిస్తాడు, ఎందుకంటే ఆత్మ అంటే జీవశక్తి దేవుడు ఇచ్చినది గనుక అది తిరిగి మన సృష్టికర్త వద్దకు పోతుంది, అది ఆయన వద్దనే ఉంటుంది.—యెహెజ్కేలు 18:4, 20.
స్మరణకు తెచ్చుకునేవారి భవిష్యత్తు ఏమిటి?
20. కీర్తన 90:12లో నమోదు చేయబడినట్లుగా ప్రార్థించినప్పుడు మోషే ఏమని అర్థిస్తున్నాడు?
20 మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం ఎంత అగత్యమో సొలొమోను అమోఘంగా చూపించాడు. యెహోవాను మనస్సునందుంచుకుని ఆయన చిత్తాన్ని హృదయపూర్వకంగా చేసేవారి కోసం వేచివున్నది, ప్రస్తుతమున్న స్వల్ప జీవితమూ, కష్టాల జీవితంలాంటిది కాదు. వారు యౌవనులైనా వృద్ధులైనా మోషే ప్రార్థనలో వ్యక్తం చేసిన ఈ వైఖరినే కలిగి ఉంటారు: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” ‘తమ ఆయుష్కాలమును’ విలువైనదిగా ఎంచడంలోనూ, దేవుని అంగీకారం పొందే విధంగా వాటిని ఉపయోగించడంలోనూ జ్ఞానం కల్గివుండడానికి తనకూ తన ప్రజలైన ఇశ్రాయేలీయులకూ యెహోవా చూపించాలనీ లేక బోధించాలనీ వినయస్థుడైన దేవుని ప్రవక్త హృదయపూర్వకంగా కోరుకున్నాడు.—కీర్తన 90:10, 12.
21. యెహోవాకు మహిమ కలిగేలా మనం మన దినాల్ని లెక్కించుకోవాలంటే, మనం ఏమి చేయాల్సి ఉంటుంది?
21 ప్రత్యేకించి క్రైస్తవ యౌవనులు, సృష్టికర్తను మనస్సునందు ఉంచుకోమని ప్రసంగి ఇచ్చిన ఉపదేశాన్ని లక్ష్యపెట్టటానికి నిశ్చయించుకోవాలి. దేవునికి పవిత్రసేవను అర్పించటానికి వారికెన్ని సువర్ణావకాశాలున్నాయో గదా! అయితే, మన వయస్సు ఎంతైనప్పటికీ, ఈ ‘అంత్యకాలంలో’ యెహోవాకు మహిమ కలిగేలా మనం మన దినాల్ని లెక్కించటం నేర్చుకున్నట్లైతే, మనం వాటిని నిరంతరమూ లెక్కించుకుంటూనే ఉండగలము. (దానియేలు 12:4; యోహాను 17:3) అయితే అలా చేయటానికి, మనం మన మహా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవునిపట్ల మన సంపూర్ణ విధిని కూడా మనం నెరవేర్చాలి.
మీరెలా సమాధానమిస్తారు?
◻ యౌవనస్థులు తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఎందుకు ఉద్బోధించబడుతున్నారు?
◻ తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారిని గురించిన కొన్ని లేఖనాధార ఉదాహరణలు ఏవి?
◻ వృద్ధాప్యానికి సంబంధించి సొలొమోను వర్ణించిన కొన్ని ప్రభావాలు ఏవి?
◻ యెహోవాను స్మరణకు తెచ్చుకునేవారి కోసం ఏ భవిష్యత్తు వేచి ఉంది?
[15వ పేజీలోని చిత్రాలు]
దావీదు, చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయురాలైన అమ్మాయి, అన్న, సుమెయోను యెహోవాను స్మరణకు తెచ్చుకున్నారు
[16వ పేజీలోని చిత్రాలు]
వృద్ధులైన యెహోవాసాక్షులు మన గొప్ప సృష్టికర్తకు ఆనందంగా తమ పవిత్రసేవను అందిస్తున్నారు