నిరుత్సాహాన్ని గురించి ఏమి చేయవచ్చు?
ఒక వ్యక్తి నిరుత్సాహంతో ఎలా పోరాడవచ్చు? యెహోవాసాక్షుల సంఘాలను క్రమంగా సందర్శించే అనేకమంది ప్రయాణ పైవిచారణకర్తలను ఈ ప్రశ్న అడగడం జరిగింది. వారిచ్చిన సమాధానాలు, నిరుత్సాహానికి కారణాలనూ, ఏ క్రైస్తవుడినైనా ప్రభావితం చేయగల ఈ పరిస్థితికి నివారణోపాయాలనూ విశ్లేషించుకోవడానికి మనకు సహాయం చేయగలవు.
నిరుత్సాహంతో వ్యవహరించడానికి కేవలం విశ్లేషణ కంటే ఎక్కువే అవసరం, అయితే చిహ్నాలు కొన్ని ఇలా ఉండవచ్చు, ప్రార్థనలో లేదా వ్యక్తిగత అధ్యయనంలో ఆసక్తి లేకపోవడం, కూటాలకు క్రమంగా హాజరుకాకపోవడం, ఉత్సాహం లేకపోవడం, క్రైస్తవ సహవాసులపట్ల ఒక విధమైన ఉదాసీన భావం కూడా ఉండవచ్చు. అయితే, అత్యంత ప్రభావవంతమైన సూచనల్లో ఒకటి, సువార్తపనిలో ఆసక్తి తగ్గిపోవడం. మనం చిహ్నాలను పరీక్షించి, కొన్ని నివారణోపాయాలను పరిశీలిద్దాము.
మన సువార్తపనిలో నిరుత్సాహం
శిష్యులను చేయమని ఇవ్వబడిన పనికి సంబంధించిన కష్టాల గురించి యేసుక్రీస్తుకు తెలుసు. (మత్తయి 28:19, 20) వారు చేసే ప్రకటనాపని వారిపైకి హింసను తెస్తుందని తెలిసి కూడా ఆయన తన అనుచరులను “తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను” పంపినట్టు పంపాడు. (మత్తయి 10:16-23) అయినప్పటికీ, వాళ్లు నిరుత్సాహపడడానికి ఇదొక కారణం కాదు. వాస్తవానికి, యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడిన దేవుని సేవకులు హింసను బట్టి తరచూ బలపర్చబడ్డారు.—అపొస్తలుల కార్యములు 4:29-31; 5:41, 42.
క్రీస్తు శిష్యులు తీవ్రమైన హింసను ఎదుర్కొనని సమయాల్లో కూడా, వాళ్లను ఎవరూ సాదరంగా స్వీకరించలేదు. (మత్తయి 10:11-15) అలాగే, యెహోవాసాక్షుల ప్రకటనపని నేడు అంత సులభంగా ఏమీ నిర్వహించబడడం లేదు.a చాలామందికి దేవునిపై నమ్మకం అనేది వ్యక్తిగతమైన విషయం, వాళ్లు దాన్ని ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు. మరితరులకు, తమకు ఏ మత సంస్థపట్లనైతే కొన్ని దురభిమానాలున్నాయో ఆ సంస్థతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోవడమూ ఇష్టముండదు. ఉదాసీనత, ఫలితాలు లేకపోవడం, లేక ఇతర అనేక సమస్యలు నిరుత్సాహానికి భయంకరమైన మూలాలు కాగలవనడంలో సందేహం లేదు. ఈ అడ్డంకులను ఎలా అధిగమించవచ్చు?
మంచి ఫలితాలను పొందడం
పరిచర్యలో మనం పొందే ఆనందం కొంతమేరకు మనకు లభించే ఫలితాలతో సంబంధం కల్గివుంది. మరైతే మనం, పరిచర్యలో మరింత ఫలవంతంగా ఎలా ఉండగలం? మనం ‘మనుష్యులను పట్టే జాలరులం.’ (మార్కు 1:16-18) ప్రాచీన ఇశ్రాయేలులో జాలరులు ఎక్కువ చేపలను పట్టుకోగలిగేందుకు రాత్రి సమయంలో వెళ్లేవారు. అధికశాతం మంది ప్రజలు ఇళ్లల్లో ఉన్నప్పుడూ, వాళ్లు మన సందేశాన్ని వినడానికి సుముఖంగా ఉన్నప్పుడూ వారిని “పట్టడానికి” వెళ్లగలిగేలా మనం కూడా మన ప్రాంతాన్ని విశ్లేషించుకోవాలి. సాయంకాలాల్లోగానీ, వారాంతాల్లోగానీ, లేదా మరితర సమయాల్లోగానీ అలా వెళ్లవచ్చు. ఒక ప్రయాణ పైవిచారణకర్త చెప్పినదాని ప్రకారం, ప్రజలు పగలంతా పనిచేసే ప్రాంతాల్లో ఇది ఆచరణాత్మకంగా ఉండవచ్చు. సాయంకాలాల్లో సాక్ష్యమివ్వడం తరచూ చక్కని ఫలితాలను తెస్తుందని ఆయన పేర్కొంటున్నాడు. టెలిఫోన్ ద్వారా సాక్ష్యమివ్వడం లేక అనియత సాక్ష్యం కూడా ఎక్కువమంది ప్రజలను చేరడానికి మనకు సహాయం చేస్తుంది.
పరిచర్యలో పట్టుదల కల్గివుండడం మంచి ఫలితాలను తెస్తుంది. తూర్పు ఐరోపాలోనూ, కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ, రాజ్య ప్రకటన పని బాగా అభివృద్ధి చెందుతోంది, అది చక్కని పెరుగుదలను తెచ్చింది. అలాగే, ఎంతో కాలంగా నిష్ఫలమైనవిగా పరిగణింపబడుతున్న ప్రాంతాల్లోనూ లేదా చివరికి తరచుగా ప్రకటించబడిన ప్రాంతాల్లోనూ ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే, మీ ప్రాంతం అలాంటి మంచి ఫలితాలను ఇవ్వకుండా ఉంటే అప్పుడేమిటి?
మంచి దృక్పథాన్ని కాపాడుకోవడం
యేసు చెప్పిన లక్ష్యాలను స్పష్టంగా మనస్సులో ఉంచుకోవడం, పరిచర్యలో ఉదాసీన వైఖరి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. తన శిష్యులు యోగ్యులైనవారిని వెదకాలని క్రీస్తు కోరుకున్నాడు గానీ సామూహిక మతమార్పిడులు చేయాలని కాదు. ప్రాచీనకాలం నాటి ప్రవక్తలు చెప్పినదాన్ని చాలామంది ఇశ్రాయేలీయులు విననట్లుగానే, అధికశాతం మంది సువార్తను అంగీకరించరని ఆయన అనేక సందర్భాల్లో తెలియజేశాడు.—యెహెజ్కేలు 9:4; మత్తయి 10:11-15; మార్కు 4:14-20.
“తమ ఆధ్యాత్మిక అవసరాల పట్ల శ్రద్ధగలవారు” “రాజ్య సువార్త”ను కృతజ్ఞతతో స్వీకరిస్తారు. (మత్తయి 5:3, NW; 24:14) వారు దేవుడు కోరిన విధంగానే ఆయన సేవచేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి, మన కార్యకలాపానికి ఫలితాలు ప్రజల హృదయ పరిస్థితిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి గానీ సందేశాన్ని అందించటంలో మనకున్న సామర్థ్యంపై కాదు. నిజమే, సువార్తను మరింత అంగీకారయోగ్యమైనదిగా చేసేందుకు మనం చేయగల్గినదంతా చేయాలి. అయినప్పటికీ, ఫలితాలు దేవునిపైనే ఆధారపడివుంటాయి, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.”—యోహాను 6:44.
మనం చేసే ప్రకటనాపని యెహోవా నామం తెలిసేలా చేస్తుంది. ప్రజలు విన్నా వినకపోయినా, మన ప్రకటనా పని యెహోవా పరిశుద్ధ నామం పవిత్రపర్చబడడానికి దోహదపడుతుంది. అంతేగాక, మన సువార్త ప్రకటన పని ద్వారా, మనం క్రీస్తు శిష్యులమని నిరూపించుకుంటాము, మన కాలంలో నిర్వహించబడుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పనిలో భాగం వహించే ఆధిక్యత మనకు లభిస్తుంది.—మత్తయి 6:9; యోహాను 15:8.
నిరుత్సాహం, సంబంధాలు
కొన్ని మానవ సంబంధాలు, అవి కుటుంబంలోనివైనా లేక సంఘంలోనివైనా సరే, మనల్ని నిరుత్సాహపర్చగలవు. ఉదాహరణకు, ఎవరూ అర్థం చేసుకోరన్న భావన ఒకటి. తోటి విశ్వాసుల అపరిపూర్ణతలు కూడా మనల్ని నిరుత్సాహపర్చవచ్చు. మరోసారి, లేఖనాలు మనకు ఎంతో సహాయకరంగా ఉండగలవు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న “సహోదరుల” సమూహమంతా ఒక పెద్ద ఆధ్యాత్మిక కుటుంబంగా రూపొందుతుంది. (1 పేతురు 2:17) కానీ వ్యక్తిత్వ సంఘర్షణల మూలంగా సమస్యలు తలెత్తినప్పుడు, ఒక ఐక్య ప్రజకు చెందుతామన్న భావన సమసిపోవచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాటికి అతీతులేమీ కాదని స్పష్టమౌతుంది, ఎందుకంటే ఐక్యతతో కలిసి జీవించమని అపొస్తలుడైన పౌలు పదే పదే వారికి గుర్తు చేయవలసి వచ్చింది. ఉదాహరణకు, తమ మధ్యనున్న సమస్యలను పరిష్కరించుకోమని ఆయన యువొదియ సుంటుకే అనే ఇద్దరు క్రైస్తవ స్త్రీలకు ఉద్బోధించాడు.—1 కొరింథీయులు 1:10; ఎఫెసీయులు 4:1-3; ఫిలిప్పీయులు 4:2, 3.
సమస్య అదే అయితే, మనం మన సహోదర సహోదరీల పట్ల యథార్థమైన ప్రేమను ఎలా పునఃపెంపొందింపజేసుకోవచ్చు? క్రీస్తు వారి కోసం మరణించాడనీ, వాళ్లు కూడా మనలాగే ఆయన అర్పించిన విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచారనీ మనకు మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనమలా చేయవచ్చు. మన సహోదరుల్లో అనేకులు యేసుక్రీస్తును అనుకరిస్తూ, మనకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం మనస్సులో ఉంచుకోవాలి.
కొన్ని సంవత్సరాల క్రితం, ఫ్రాన్స్ నందలి పారిస్‌లో, యౌవనస్థుడైన ఒక సాక్షి, రాజ్యమందిరం వెలుపల ఎవరో పెట్టిన, బాంబువున్న సూట్‌కేస్‌ను పట్టుకోవడానికి వెనుకాడలేదు. ఆయన ఎన్నో అంతస్థులు మెట్లు దిగి వెళ్లి దాన్ని ఒక ఫౌంటెన్‌లోకి విసిరాడు, అక్కడే అది పేలింది. అలా తన జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోవడానికి ఏమి పురికొల్పిందని ఆయనను అడిగినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: “మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నేను గుర్తించాను. కాబట్టి అందరం చనిపోవడం కంటే నేనొక్కడినే చనిపోవడం మంచిదని నేననుకున్నాను.”b యేసు మాదిరిని అంత దగ్గరగా అనుకరించడానికి సిద్ధమయ్యే సహవాసులను కల్గివుండడం ఎంత ఆశీర్వాదకరం!
అంతేగాక, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల నిర్బంధ శిబిరాల్లో ఉన్న యెహోవాసాక్షుల మధ్య ఉన్న సహకార స్ఫూర్తిని మనం ధ్యానించవచ్చు.c ఇటీవలి కాలంలో, మలావీలోని మన సహోదర సహోదరీలు నిజక్రైస్తవులుగా అదే విధంగా తమ యథార్థతను కాపాడుకున్నారు. స్థానిక సంఘంలోని మన సహోదరులు కష్ట పరిస్థితుల్లో అదే విధంగా ప్రవర్తిస్తారన్న తలంపు, అనుదిన ఒత్తిళ్ళను, సమస్యలను చూసీచూడనట్టు విడిచిపెట్టేందుకు లేదా కనీసం వాటికి అంత ప్రాధాన్యతను ఇవ్వకుండా ఉండేందుకు మనల్ని పురికొల్పదా? మనం క్రీస్తు మనస్సును వృద్ధి చేసుకుంటే, తోటి ఆరాధకులతో మన అనుదిన సంబంధాలు నిరుత్సాహానికి గాక ఉల్లాసానికి మూలమౌతాయి.
నిరుత్సాహపరిచే వ్యక్తిగత భావాలు
“కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.” (సామెతలు 13:12) కొంతమంది యెహోవా సేవకుల ఉద్దేశం ప్రకారం, ఈ విధానాంతం తగినంత త్వరగా రావడంలేదు. అనేకమంది అవిశ్వాసుల్లానే, క్రైస్తవులకు కూడా మనం జీవిస్తున్న కాలం ‘అపాయకరమైన కాలముగా’ ఉంది.—2 తిమోతి 3:1-5.
అయితే, అవిశ్వాసులకు భిన్నంగా, క్రైస్తవులు ఈ కష్టతరమైన పరిస్థితుల్లో యేసు ప్రత్యక్షత యొక్క “సూచన”ను చూసి ఆనందించాలి, ఆ సూచన, దేవుని రాజ్యం ఈ దుష్ట విధానానికి త్వరలోనే అంతం తెస్తుందని సూచిస్తుంది. (మత్తయి 24:3-14) పరిస్థితులు విషమించినప్పుడు కూడా—“మహా శ్రమ” కాలంలో కచ్చితంగా అలాగే జరుగుతుంది—ఈ సంఘటనలు మనకు ఆనందానికి మూలం, ఎందుకంటే అవి త్వరలో రానైయున్న దేవుని నూతన లోకానికి పూర్వసూచనగా ఉంటాయి.—మత్తయి 24:20, 21; 2 పేతురు 3:13.
రాజ్యం ప్రస్తుత-దిన విషయాల్లో జోక్యం చేసుకుంటుందన్న విషయాన్ని ఒక క్రైస్తవుడు మానసికంగా వాయిదా వేసుకోవడం, అతడు వస్తు సంబంధ ప్రయాసలకు అధిక సమయాన్ని వెచ్చించేలా చేయవచ్చు. అతడు గనుక లౌకికపరమైన పనీ వినోదమూ తన సమయాన్నీ శక్తినీ హరించివేయడానికి అనుమతిస్తే, తనకున్న లేఖనాధార బాధ్యతలను సరైన విధంగా నెరవేర్చడం అతనికి కష్టమైపోతుంది. (మత్తయి 6:24, 33, 34) అలాంటి దృక్పథం చికాకును అధికం చేసి, తద్వారా నిరుత్సాహాన్ని కల్గిస్తుంది. ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా వ్యాఖ్యానించాడు: “నూతనలోకపు ప్రమాణాల్ని ఈ లోకవిధానంలో ఏర్పర్చుకోవటానికి ప్రయత్నించడం అవాస్తవికం.”
శ్రేష్ఠమైన నివారణల్లో రెండు
ఒకసారి సమస్య నిర్ధారణ జరిగిన తర్వాత, ఒక వ్యక్తి సరైన నివారణను ఎలా కనుగొనవచ్చు? అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన పద్ధతుల్లో ఒకటి వ్యక్తిగత పఠనం. ఎందుకు? “మనం చేస్తున్నది మనమెందుకు చేయాలో అది మనకు జ్ఞాపకం చేస్తుంది,” అని ఒక ప్రయాణ పైవిచారణకర్త పేర్కొన్నాడు. మరొకరు ఇలా వివరించారు: “కేవలం బాధ్యతగా ప్రకటన పనిచేయడం కొంతకాలం తర్వాత ఒక భారమైపోతుంది.” కాని, మనం అంతాన్ని సమీపిస్తుండగా మన పాత్రను గురించిన విస్పష్టమైన దృక్కోణాన్ని తిరిగి పొందడానికి చక్కని వ్యక్తిగత పఠనం మనకు సహాయం చేస్తుంది. అదే తలంపు అనుసారంగా, దేవుని చిత్తాన్ని చేయడంలో నిజమైన ఆనందాన్ని పొందడానికి ఆధ్యాత్మిక ఆహారం సరైన విధంగా తీసుకోవలసిన అవసరాన్ని గురించి లేఖనాలు మనకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాయి.—కీర్తన 1:1-3; 19:7-10; 119:1, 2.
పెద్దలు ప్రోత్సాహకరమైన కాపరి సందర్శనాలు చేయడం ద్వారా నిరుత్సాహాన్ని అధిగమించడానికి ఇతరులకు సహాయం చేయవచ్చు. ఈ ఆంతరంగిక సందర్శనాల సమయంలో, మనలో ప్రతి ఒక్కరు ఎంతో ముఖ్యమైనవారనీ, యెహోవా ప్రజల మధ్య ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్గివున్నారనీ పెద్దలు చూపించవచ్చు. (1 కొరింథీయులు 12:20-26) తోటి క్రైస్తవులను సూచిస్తూ, ఒక పెద్ద ఇలా అన్నాడు: “వాళ్లకున్న విలువను గురించి వాళ్లకు నొక్కి చెప్పడానికి, వాళ్లు గతంలో సాధించినవాటిని వాళ్లకు జ్ఞాపకం చేస్తాను. వాళ్లు యెహోవా దృష్టిలో అమూల్యమైనవారనీ, ఆయన కుమారుని రక్తం వారి పక్షాన ఇవ్వబడిందనీ వాళ్లకు చెప్తాను. ఇలా చేసే తర్కాన్ని ఎప్పుడూ సాదరంగా స్వీకరించడం జరుగుతుంది. దానితోపాటు పటిష్ఠమైన బైబిలు రిఫెరెన్సులను చూపిస్తే, నిరుత్సాహానికి గురైనవారు కుటుంబ ప్రార్థన, పఠనం, బైబిలు అధ్యయనం వంటి క్రొత్త లక్ష్యాలను పెట్టుకునే స్థితిలో ఉంటారు.”—హెబ్రీయులు 6:10.
కాపరి సందర్శనాలు చేస్తున్న సమయంలో, దేవుడ్ని ప్రీతిపర్చడం అసాధ్యం అనిపించేలా చేయకుండా ఉండేందుకు పెద్దలు జాగ్రత్త వహించాలి. బదులుగా, యేసు అనుచరుల మీదున్న బాధ్యత భారమైనది కాదని గ్రహించడానికి, నిరుత్సాహం చెందిన తోటి ఆరాధకులకు పెద్దలు సహాయం చేయవచ్చు. తత్ఫలితంగా, మన క్రైస్తవ సేవ ఆనందానికి మూలమౌతుంది.—మత్తయి 11:28-30.
నిరుత్సాహాన్ని జయించడం
కారణాలు ఏవైనప్పటికీ, నిరుత్సాహం నిర్మూలించబడవలసిన పీడ. అయితే ఈ పోరాటంలో మనం ఒంటరి వారం కాదని గుర్తుంచుకోండి. మనం నిరుత్సాహపడితే, మన క్రైస్తవ సహవాసుల సహాయాన్ని, ప్రాముఖ్యంగా పెద్దల సహాయాన్ని స్వీకరిద్దాం. అలా చేయడం ద్వారా, మనం నిరుత్సాహ భావాలను తగ్గించుకోవచ్చు.
అన్నిటికి పైగా, నిరుత్సాహాన్ని అధిగమించేందుకు సహాయం కోసం మనం దేవుని వైపు తిరగవలసి ఉంది. మనం ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడితే, నిరుత్సాహాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. (కీర్తన 55:22; ఫిలిప్పీయులు 4:6, 7) ఏదేమైనప్పటికీ, ఆయన ప్రజలముగా మనం, “శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది” అని పాడిన కీర్తన గ్రంథకర్త భావాలను పంచుకోవచ్చు.—కీర్తన 89:15-17.
[అధస్సూచీలు]
a 1981 మే 15, కావలికోట (ఆంగ్లం) లోని “ఇంటింటి పరిచర్య సవాలు” అనే శీర్షికను చూడండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ప్రచురించిన 1985, ఫిబ్రవరి 22 తేజరిల్లు! (ఆంగ్లం) లోని 12, 13 పేజీలను చూడండి.
c 1980, ఆగస్టు 15 కావలికోట (ఆంగ్లం)లోని, “నేను ‘మరణయాత్రను’ తప్పించుకుని జీవించాను” అనే శీర్షికను, 1985, జూన్ 22 తేజరిల్లు! (ఆంగ్లం)లోని, “నాజీ జర్మనీలో యథార్థతను కాపాడుకోవడం” అనే శీర్షికను చూడండి.
[31వ పేజీలోని చిత్రం]
ప్రేమగల పెద్దలు చేసే ప్రోత్సాహకరమైన కాపరి సందర్శనాలు క్రైస్తవులు నిరుత్సాహాన్ని అధిగమించడానికి సహాయం చేయగలవు