ఆ దినము సమీపించు కొలది ఒకనినొకడు పురికొల్పుకొనుడి
“ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీయులు 10:25.
1, 2. ఏ దినము సమీపించుచున్నది, మరియు యెహోవాయొక్క ప్రజలు ఎటువంటి మనోభావమును చూపవలెను?
ఈనాడు, ‘రమ్ము జీవజలములను పుచ్చుకొనుము’ అని చెప్పుటలో భాగమువహించు వారు ఏకాకులుగా ఉండరు. యెహోవా విజయమును సాధించు ఆ మహాదినము సమీపించు కొలది వారీ బైబిలు ఉపదేశమును అనుసరింతురు. అదేమనగా: “కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీయులు 10:24, 25.
2 లేఖనములు ఆ “దినమును” “యెహోవా దినము” గా ప్రవచించుచున్నవి. (2 పేతురు 3:10 NW) యెహోవా సర్వోన్నతుడు మరియు సర్వశక్తిగల దేవుడైయున్నందున ఆయన దినమును మించి ప్రకాశించు దినము వేరొకటిలేదు. (అపొస్తలుల కార్యములు 2:20) దాని భావము ఆయన విశ్వమంతటికి సార్వభౌముడైన దేవుడుగా తన సత్యత్వమును రుజువుపరచుకొనుటైయున్నది. సాటిలేని ప్రాముఖ్యతగల ఆ దినము సమీపించుచున్నది.
3. మొదటి శతాబ్ధ క్రైస్తవులకు యెహోవా దినము ఎట్లు సమీపించుచుండెను, మరియు ఈరోజు మనవిషయమేమి?
3 మన సామాన్యశకముయొక్క మొదటి శతాబ్దములోని క్రైస్తవులతో అపొస్తలుడైన పౌలు యెహోవా దినము సమీపించుచున్నదని చెప్పెను. వారు ఆదినపు రాకకొరకు ఎదురు చూచిరి. కాని ఆ సమయములో ఆ దినము 1900 సంవత్సరముల దూరమున ఉండెను. (2 థెస్సలొనీకయులు 2:1-3) అట్టి వాస్తవమున్నను, వారు పురికొల్పబడవలసియుండిరి. ఎందుకనగా ఆ దినము నిశ్చయముగా రానైయుండెను. మరియు క్రైస్తవులు ఆ విశ్వాసములో నిశ్చలతతో క్రమముగా కొనసాగిన, వారు ఆ ఆశీర్వాదించబడిన దినములో ప్రవేశించుదురు. (2 తిమోతి 4:8) వెనుకటి ఆ సమయములో ఆ దినము సమీపించుచున్నట్టుగా ఎంచబడినది. అయితే మన సమయములో అది నిశ్చయముగా సమీపించియున్నది. ఆశ్చర్యకరంగా పూర్తవుతున్న బైబిలు ప్రవచనములన్నియు ఆ సంతోషభరితమైన విషయమును రుజువుపరచుచున్నవి. త్వరలో మన దేవుడైన యెహోవాయొక్క ఆ నామము నిరంతరమునకు పరిశుద్ధపరచబడును.—లూకా 11:2.
దైవికనామము ద్వారా పురికొల్పబడుట
4. ప్రకటన 19:6 ప్రకారము ఎవరు రాజు కానున్నారు, మరియు ఆయన నామమును ఎట్లు గ్రహించగలము?
4 దైవిక నామము మానవ కుటుంబమంతటికి ఆసక్తికరమైన విషయమైయుండవలెను. టుడేస్ ఇంగ్లీషు వర్షన్ ఇట్లు చెప్పుచున్నది: “దేవుని స్తుతించుడి! ప్రభువు, మన సర్వశక్తిగల దేవుడు రాజయ్యాడు!” (ప్రకటన 19:6) ఆ 20వ శతాబ్దపు బైబిలు ప్రకారము, ఆ ప్రభువు, సర్వశక్తిగల దేవుడైయున్నాడు. ఆ తర్జుమా మరియు ఇతర ఆధునిక తర్జుమాలు రాజుగా ఏలుటకు ఆరంభించిన ఆ దైవిక వ్యక్తియొక్క నామమును చూపుటలేదు. అయితే రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, న్యూ ఇంటర్ నేషనల్ వర్షన్, మరియు మొఫత్స్ తర్జుమాలయందు ప్రకటన 19:6 లో కనుగొనబడు ఆశ్చర్యార్థకపు కేకయగు “హల్లెలూయా!” లో (“యా ను స్తుతించుడి” లేక “యెహోవాను స్తుతించుడి”) దైవిక నామము ఇమిడియున్నది. మనసామాన్యశకము యొక్క అధికభాగములో దైవికనామము బైబిలు తర్జుమాలలో మరుగుచేయబడెను. అయితే మనము చూడనైయున్న రీతిగా పురాతన కాలములోను మరియు ఆధునిక కాలములోను ఆ నామము దేవుని ప్రజలకు గొప్ప ప్రోత్సాహమును ఇచ్చెను.
5, 6. (ఎ) తాను ప్రాతినిధ్యము వహించు దేవుని నామమును మోషే తెలిసికొనవలసిన అవసరము ఎందుకుండెను? (బి) మోషే దేవుని నామమును నొక్కితెలిపినప్పుడు అది ఇశ్రాయేలీయులపై ఎట్టి ప్రభావమును కలుగజేసియుండును?
5 మహోన్నతుడైన దేవుడు మోషేను ఐగుప్తులో దాసత్వములోయున్న ప్రజల యొద్దకు పంపెనని మనము గుర్తుకు తెచ్చుకొనగలము. అప్పుడు మోషేను ఎవరు పంపారు అనే ప్రశ్న ఆ ప్రజల మనస్సులలో ఉత్పన్నమాయెను. ఆ బాధపడుతున్న యూదా ప్రజలు తాను ప్రాతినిధ్యము వహిస్తున్న దేవుని నామమును తెలిసికొన గోరుదురని మోషే ముందే గ్రహించెను. ఈ విషయమును గూర్చి నిర్గమకాండము 3:15 లో ఇట్లు చదువుదుము: “మరియు దేవుడు మోషేతో ఇట్లనెను; మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్ధనామము.”
6 ఈ వర్తమానము వారికి నెక్కి చెప్పబడినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో పురికొల్పబడియుండవచ్చును. ఏకైక సత్యదేవుడైన యెహోవాచే వారి విడుదల నిశ్చయపరచబడియుండెను. అహంభావముతో తనను తాను ఒంటరిగా ఉంచుకొనకుండా తన వ్యక్తిగత నామము యొక్క అర్థమును ప్రదర్శించునపుడు, ఆ దేవునితో పరిచయమేర్పరచుకొను ఉత్తరాపేక్ష వారినెంతగా పురికొల్పియుండవచ్చును!—నిర్గమకాండము 3:13; 4:29-31.
7. (ఎ) యేసుయొక్క శిష్యులు దైవిక నామముతో పరిచయము కలిగియుండిరని మనకెట్లు తెలియును? (బి) దేవుని నామము ఎట్లు వెనుకకు త్రోయబడెను?
7 ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శిష్యులు కూడా దైవిక నామమైన యెహోవా మరియు అది నిలిచిన దానిని బట్టి అధికముగా పురికొల్పబడిరి. (యోహాను 17:6, 26) నిశ్చయముగా యేసు, తన భూసంబంధమైన పరిచర్యలో దైవిక నామమును వెనుకకు నెట్టి యుండలేదు, మరియు ఆయన యేసు అను తన స్వంత నామమును ప్రథమముగా పెట్టుటయు ఆయన ఉద్దేశ్యము కాదు. కేవలము నిజమైన క్రైస్తవ విశ్వాసము నుండి ముందుగా ప్రవచింపబడిన మతభ్రష్టత ఆరంభమైన తరవాతనే దైవిక నామము వెనుకకు నెట్టబడెను. అవును, క్రియారూపకంగా క్రైస్తవ పరస్పర సంభాషణ నుండి అది తుడిచివేయబడింది. (అపొస్తలుల కార్యములు 20:29, 30) దేవుని కుమారుని నామమునకు అధిక ప్రాముఖ్యతనిచ్చి తండ్రి నామమును మరుగుచేయుట ఒకసారి మొదలయిన తరువాత, నామకార్థ క్రైస్తవులు తండ్రి ఆరాధన వ్యక్తిత్వములేనిదిగా భావించి, కుటుంబమువంటి సన్నిహిత భావము లేనిదిగాను మరియు ఏమంత ప్రోత్సాహము నివ్వనిదిగాను కనుగొనిరి.
8. యెహోవాసాక్షులు అనునామము ధరించిన తరువాత దేవుని ప్రజలపై అది ఎటువంటి ప్రభావము కలిగిస్తు ఉన్నది?
8 కావున వాచ్‌టవర్ సంస్థతో కలిసి పనిచేస్తున్న అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు 1931లో యెహోవా సాక్షులు అను నామమును దాల్చుకొన్నపుడు అది మితిలేని సంతోషమునకు కారణమైయుండెను. అది ఆనందమును కలిగించునదే కాక ప్రోత్సాహమును కూడా ఇచ్చెను. ఇందు మూలముగా, క్రొత్తగా పేరు పెట్టుకొనిన ఆ బైబిలు విద్యార్థులు ఒకరినొకరు పురికొల్పకొనగలిగిరి.—యెషయా 43:12 తో పోల్చుము.
9. తాము ఎవరికి సాక్షులైయున్నారో, ఆయనను గూర్చి నిజక్రైస్తవులు యే భావము కలిగియున్నారు?
9 అందునుబట్టి, ఈనాడు నిజక్రైస్తవులు, తమనాయకుడైన యేసుక్రీస్తు భూమిపై ఉన్నపుడు చేసిన విధముగానే, తాము ఎవరికైతే ప్రవచించబడిన సాక్షులుగా ఉన్నారో ఆయనను గుర్తించుట సరియైన దానిగా ఎంచుదురు. (ప్రకటన 1:1, 2) అవును ఆయనను మాత్రమే వారు యెహోవా అను నామము ధరించిన వానిగా గుర్తించెదరు.—కీర్తన 83:18.
సంతోషము మరియు పరిశుద్ధాత్మతో నింపబడుట
10-12. (ఎ) యేసు శిష్యులపై చురుకైన శక్తి ఎటువంటి ప్రభావమును కలిగించునదైయుండును? (బి) సంతోషముతో ప్రేరేపించబడిన యెహోవా సాక్షులు ఒకరితోనొకరు ఎట్లు వ్యవహరించ కోరుకొనెదరు?
10 యేసుక్రీస్తు తన అపొస్తలులను విడిచి వెళ్లునపుడు ఇట్లు చెప్పెను: “కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.”—మత్తయి 28:19, 20.
11 క్రొత్తగా బోధించబడిన క్రైస్తవులు పరిశుద్ధాత్మయొక్క నామములో బాప్తిస్మము పొందవలసియున్నారను దానిని గమనించుము. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికాదుగాని యెహోవా దేవుని చురుకైన శక్తి. దానిని ఆయన యేసుక్రీస్తుద్వారా ఉపయోగించును. పెంతెకొస్తునందు యెహోవా దేవుడు యేసుక్రీస్తుద్వారా ఈ చురుకైన శక్తిని యేసుక్రీస్తుయొక్క సమర్పిత అనుచరులపై క్రుమ్మరించెను. (అపొస్తలుల కార్యములు 2:33) వారందరు ఈ పరిశుద్ధాత్మతో నింపబడిరి మరియు ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలములో ఒకటి సంతోషము. (గలతీయులు 5:22, 23; ఎఫెసీయులు 5:18-20) సంతోషము ఒక ఉత్తేజకర గుణమైయున్నది. శిష్యులు పరిశుద్ధాత్మయొక్క ఆనందముతో నింపబడవలసియుండిరి. అపొస్తలుడైన పౌలుద్వారా ఇట్టి పదములతో పలుకబడిన ప్రార్థన ఎంతో అనుగుణ్యమైనది: “కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక.”—రోమీయులు 15:13.
12 ఇట్టి సంతోషమును ప్రేరేపించు ఆత్మతో నిండినవారై, యెహోవా సాక్షులు ఈనాడు, “గొప్పసమూహము” తో సహా, స్నేహభావములేని ఈ విధానములో ఒకరినొకరు పురికొల్పుకొనుటకు ఇష్టపడుదురు. అందుకొరకే అపొస్తలుడైన పౌలు “ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని” వ్రాసెను.—ప్రకటన 7:9, 10; రోమీయులు 1:11; 14:17.
పురికొల్పబడుటకు ప్రతి కారణము
13. మనము పురికొల్పబడుటకును, ఒకరినొకరము పురికొల్పుకొనుటకును మనము ఏ కారణములను కలిగియున్నాము?
13 నీతికి సంబంధించిన ప్రతిదానిని వ్యతిరేకించు వానినిరాజుగా మరియు దేవతగా కలిగియున్న ఈ విధానములో తమ్మును తాము కనుగొన్న క్రైస్తవులు, యెహోవా దేవుని పరిశుద్ధాత్మతో ప్రభావితమై ప్రపంచవ్యాప్తముగాయున్న క్రైస్తవ సంఘములో ఒకరినొకరు పురికొల్పుకొనవలెను. (హెబ్రీయులు 10:24, 25; అపొస్తలుల కార్యములు 20:28) మనము పురికొల్పబడుటకు ప్రతి కారణము ఉన్నది. అవును, యెహోవానుగూర్చియు, యేసుక్రీస్తునుగూర్చియు మరియు వారు వాడు చురుకైన శక్తియైన పరిశుద్ధాత్మను గూర్చియు అనుభవజ్ఞానమును కలిగియున్నందుకు మనము ఎంత కృతజ్ఞతగలవారమై యుండవలెను! వారిచ్చు నిరీక్షణ నిమిత్తము మనమెంత కృతజ్ఞత గలవారమైయుండవలెను! ఆవిధముగా మన ఆరాధన సంతోషముతో నింపబడియున్నది. అపొస్తలుడైన పౌలు తన ఉత్తరములో సంబోధించిన క్రైస్తవులకు ఒకరినొకరు పురికొల్పుకొని వారి అతి పవిత్ర విశ్వాసములో ఒకరినొకరు పెంపొదింపవలెనని చెప్పెను. సూచనార్థకముగా వారు ‘ఆ దినము సమీపించుట చూచినకొలది’ వారు దాన్ని మరి ఎక్కువగా చేయవలెను. అంతేకాకుండా రాజకీయశక్తులు, నామకార్థక క్రైస్తవత్వమును ఇతర అబద్ధమతములతో సహా భూమిపై నుండి తుడిచివేయునపుడు, ఆ పరిస్థితిలో మనము ఒకరినొకరు మరి యెక్కువగా పురికొల్పుకొను అవసరతను హెచ్చించును.
14. ఒకరినొకరు ఎవరు ప్రోత్సహించుచూ ఉండవలెను, మరియు ఎట్లు?
14 వారివారి వ్యక్తిగతమైన సంఘములలో మందను ప్రోత్సహించుటయందు పెద్దలు ముందడుగు వేసినను, హెబ్రీయులకు 10:25 సలహా ఇచ్చినరీతిగా క్రైస్తవులు అందరు ఒకరినొకరు పురికొల్పుకొనవలెను. వాస్తవముగా ఇది క్రైస్తవ అవసరతయైయున్నది. నీవు సంఘములో ఒక సభ్యుడవైతే ఈ ప్రోత్సాహమును ఇచ్చుచున్నావా? నేను ‘దీనినెట్లు చేయగలను? నేనేమి చేయవలెను?’ అని నీవు ఆలోచించుచుండవచ్చును. ఏవిధంగానైతే ఇతరులు నమ్మకంగా సంఘకూటములకు క్రమంగా హాజరవునపుడు మీరు ప్రోత్సాహము పొందుతారో, మీరుకూడా కూటములకు హాజరగుటవలన, మరియు ఇతర క్రైస్తవ ఏర్పాట్లకు మీ మద్దతువలన ఇతర సహోదర సహోదరీలు ప్రోత్సాహము పొందరా? వారుకూడా మీ నమ్మకమైన ఓర్పుతో కూడిన ఉదాహరణము ద్వారా పురికొల్పబడుదురు. జీవితములో సమస్యలు మరియు కష్టములు వచ్చినప్పటికి క్రైస్తవ మార్గములో కొనసాగుట ద్వారా, మీరు ఒక ప్రేరేపితమైన ఉదాహరణముగా ఉండవచ్చు.
అపవాది నుండి వచ్చు వ్యతిరేకతకు ప్రతిగా పనిచేయుము
15. అపవాది ఎందుకు “బహు క్రోధము” కలిగియున్నాడు, మరియు ఎవరికి విరుద్ధంగా?
15 యెహోవా దినము సమీపంగా ఉన్నదని తెలిసింది మనకొక్కరికే కాదు. అపవాదియైన సాతానుకు కూడా తెలుసు. ప్రకటన 12:12 మనకు చెప్పునదేమనగా భూమికి ఇప్పుడు శ్రమ. “అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” ప్రకటన 12:17 చెప్పురీతిగా అతడు అధిక ఆగ్రహమును “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు” ఉన్నవారిపై మరలించియున్నాడు. నిస్సందేహముగా అపవాది మనలను నిరుత్సాహపరచ గోరును, మరియు దానిని చేయుటకు ఎట్లు ప్రయత్నించవలెనో అతనికి తెలుసు. అతనికి మన బలహీనతలు మరియు సమస్యలు తెలుసు మరియు అతడు వాటిని మనపై వాడును.
16. సాతాను ఎందుకు నిరుత్సాహమును పనిముట్టుగా వాడుతుంది?
16 అపవాది నిరుత్సాహమును ఎందుకు ఒక ఆయుధమువలె వాడును? ఎందుకనగా అది తరచుగా పనిచేయును. ఒకవ్యక్తి సూటిగా వచ్చిన వ్యతిరేకతను మరియు హింసను ఓర్చుకొన్నప్పటికి అతడు నిరుత్సాహమునకు లోనైపోవచ్చు. యెహోవాసేవ నుండి ప్రజలను మరలించగలనని నిరూపించుటకు ప్రయత్నించును మరియు ఆయనను నిందించుటకు సాతాను కోరుకొనును.(సామెతలు 27:11; యోబు 2:4, 5 తో పోల్చుము; ప్రకటన 12:10) అతడు నిన్ను నిరుత్సాహపరచినట్లయితే దేవుని సేవలో మీరు నెమ్మదిగా వెళ్లువిధంగా చేయవచ్చు. దేవుని రాజ్యసువార్త ప్రకటించు పనితో నిష్క్రియునిగా చేయవచ్చు.—2 కొరింథీయులు 2:10, 11; ఎఫెసీయులు 6:11; 1 పేతురు 5:8.
17. మోషే దినములలో నిరుత్సాహముయొక్క ప్రతికూల ప్రభావములు ఎట్లు కనబడెను?
17 నిరుత్సాహముయొక్క ప్రతికూలమైన ప్రభావములను, పురాతన ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల ఉదాహరణము ద్వారా మనము చూడవచ్చును. మోషే ఫరోతో మాట్లాడిన తరువాత ఆ క్రూర రాజు వారిపై తన భారమును అధికముచేసి వారిని హింసించెను. అయితే ఇశ్రాయేలీయులను నిశ్చయముగా రక్షించి, వారిని తన ప్రజలుగా చేసి, వారిని విడిపించి, వాగ్థానము చేసిన దేశములోనికి తెచ్చెదనని మోషేతో చెప్పి, దేవుడు వారికి హామీ ఇచ్చెను. మోషే దీనిని గూర్చి ఇశ్రాయేలు కుమారులకు చెప్పెను. అయితే నిర్గమకాండము 6:9 ఇట్లు చెప్పుచున్నది: “అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠినదాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.” వారి ప్రతిక్రియవలన మోషే కూడా నిరుత్సాహపడి, యెహోవా మోషేను ఒప్పించి, ప్రోత్సహించు వరకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఫరోతో మోషే మాట్లాడుటకు వెనుదీసెను.—నిర్గమకాండము 6:10-13.
18. దేవుని ప్రజలు సాతాను వలన కలుగు నిరుత్సాహమునకు ప్రతికూలముగా పనిచేయుట ఎందుకు అవసరమైయున్నది?
18 నిరుత్సాహమువలన దేవుని సేవకునిపై వచ్చు హానికరమైన ప్రభావమును గూర్చి అపవాదియైన సాతానుకు తెలుసు. సామెతలు 24:10 చెప్పినట్టుగా: “శ్రమదినమున నీవు క్రుంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు.” మనము అంత్యదినములయొక్క లోతైన భాగములో జీవించుచున్నాము గనుక మనము ఆత్మీయంగా శక్తివంతులము మరియు బలమైన వారై ఉండాలి. మనలను వెనుకకు అణచిపెట్టగల అపరిపూర్ణతలు బలహీనతలతో మరియు తప్పులతో పోరాడడమే మనకు కష్టతరము. అయితే సాతాను ఈ తప్పులు ఉపయోగించుటకు ప్రయత్నించును కాబట్టి మనకు సహాయము అవసరము.
క్రీస్తు బలియాగముపై దృఢముగా ఆధారపడుము
19. నిరుత్సాహమునకు ప్రతికూలముగా పనిచేయుటకు మనకు ఏది సహాయము చేయును మరియు ఎందుకు?
19 ఈ విషయములో మనకొక గొప్పసహాయము యేసుక్రీస్తు ద్వారా యెహోవా కలుగజేసిన విమోచన ఏర్పాటయియున్నది. ఈ విమోచన ఏర్పాటుపై దృఢముగా ఆధారపడుట ద్వారా మనము నెగ్గు వారమగుదుము. అవును, ఈ ఏర్పాటును కించపరచుట హానికరమైయున్నది. మనము అసంపూర్ణులమై యున్నంతకాలము ఇంకను తప్పిదము లేక పాపమును చేసెదము. అయితే నిరుత్సాహపడి, నిరీక్షణలేదను భావముతో, వదలివేసి సాతాను ఎరలో పడిపోవు అవసరములేదు. మన పాపము కొరకు ఒక పూర్తి బలియాగమున్నదని మనకు తెలుసు. ఆ విమోచన పాపములను తీసివేయగలదు. మనము “గొప్పసమూహము” వారికి చెందినవారమైనట్లయిన గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనగలమని పూర్తి విశ్వాసము మరియు నమ్మకము కలిగియుండవలెను.—ప్రకటన 7:9, 14.
20. గొప్ప నిరుత్సాహపరచువాడైన అపవాదిని మనము జయించగలమని ప్రకటన 12:11 ఎట్లు చూపుచున్నది?
20 ప్రకటన 12:10 లో సాతాను “రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులపై నేరము మోపువాడుగా” వర్ణించబడ్డాడు. అటువంటి నేరము మోపు దుష్టున్ని మరియు శక్తివంతమైన నిరుత్సాహపరచు వానిని మనమెట్లు జయించగలము? అదే అధ్యాయపు 11వ వచనము దానికి జవాబునిచ్చును: “వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు. గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారుకారు.” కావున యెహోవాయొక్క ప్రజలు తమ పూర్తి నమ్మకమును విమోచన బలియాగముపైన గొర్రెపిల్ల రక్తముపైన ఉంచవలెను. క్రమముగా దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచు సాక్ష్యమిచ్చుట వలన కలుగు ప్రోత్సాహమును బలముగా ఉండనీయుము.
21. సహోదరులను నిరుత్సాహపరచు అపవాది పనిలో మనము అనుకోకుండా ఎట్లు భాగము వహించవచ్చును?
21 కొన్ని సమయాల్ల అనుకోకుండా మన సహోదరులను నిరుత్సాహపరచు అపవాది పనిలో మనము కూడా భాగము వహించవచ్చు. ఎట్లు? ఎక్కువగా ఇతరుల తప్పులు ఎత్తిచూపుటవల్ల, ఇతరులనుండి అధికము కోరడం మరియు అధికముగా నీతిమంతునివలె ప్రవర్తించటం ద్వారా. (ప్రసంగి 7:16) మనమందరము లోపములను బలహీనతలను కలిగియున్నాము. అపవాదిచేయునట్లు మనము వాటిపై ప్రయోగము చేయకుండా ఉందము. దానికి బదులుగా మన సహోదరులను గూర్చి మరియు సంస్థీకరించబడిన గుంపుగా యెహోవా ప్రజలనుగూర్చి ఎల్లప్పుడు ప్రోత్సాహకరంగా మాట్లాడుదము. మనము ఎల్లప్పుడు ఒకరినొకరు ఉప్పొంగచేయుచు, కృంగదీయకుండా ఉందము.
ఆ దినము సమీపించిన కొలది పురికొల్పుకొనుట
22, 23. (ఎ) పురికొల్పుపనిని మనము కేవలము పెద్దలకే ఎందుకు విడువరాదు? (బి) క్రైస్తవ సంఘములోని అధ్యక్షులు ఎట్లు ప్రోత్సాహమును పొందగలరు?
22 ఆ దినము సమీపించిన కొలది యెల్లప్పుడు ఒకరినొకరు పురికొల్పుకొనుట మన ధృఢ నిశ్చయముగా చేసికొనవలెను. మీ నమ్మకముగల ఉదాహరణముతో మరియు ఓదార్పుకరమైన మాటలతో ఇతరులను ప్రోత్సహించుము. ఈ విషయములో యెహోవాను మరియు యేసుక్రీస్తును అనుకరించుము. ప్రోత్సహించు పనిని కేవలము సంఘపెద్దలకే విడిచి పెట్టకుము. ఎందుకు? పెద్దలమట్టుకు పెద్దలకు కూడా ప్రోత్సాహము అవసరము. వారు కూడా మందలోని ఇతరులవలె బలహీనతలను, లోపములను కలిగియున్నారు. మరియు కుళ్లిపోతున్న ఈ లోకములో తమకుటుంబ అవసరతలు తీర్చుటలో వారు కూడా అదే సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికి తోడుగా పౌలు చెప్పినట్లు సంఘములను గూర్చిన చింతయు వారికి గలదు. (2 కొరింథీయులు 11:28, 29) వారిది కష్టమైన పని. వారికి ప్రోత్సాహము అవసరము.
23 సంఘములో అధ్యక్షపదవి కలిగియున్న సహోదరులతో సహకరించుటద్వారా వారిని మీరు గొప్పగా పురికొల్పగలరు. అప్పుడు మీరు హెబ్రీయులు 13:17 లోని ఉపదేశమును అనుసరిస్తూ ఉందురు: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆపనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాటవిని వారికి లోబడియుండుడి.”
24. నిరుత్సాహముతో నిండియున్న ఈ దినమున, మనము ఏమి చేస్తూ ఉండవలెను మరియు ఎందుకు?
24 మనము నిరుత్సాహముతో కూడిన దినములో జీవించుచున్నాము. యేసు ప్రవచించిన రీతిగా, రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యుల హృదయము వాస్తవముగా కలవరముతో ధైర్యముచెడి కూలుతున్నది. (లూకా 21:25, 26) కృంగదీసి మరియు నిరుత్సాహపరచు అనేకసమస్యలు కలిగియున్న ఈ సమయములో “ఒకరి నెకరు పురికొల్పుకొందము, మరియు ఆ దినము సమీపించిన కొలది మరియెక్కువగా ఆలాగు చేయుదము.” 1 థెస్సలొనీకయులు 5:11 లోని పౌలు యొక్క మంచి ఉపదేశమును అనుసరించుము: “కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.” (w90 12/15)
మీ జవాబు ఏమైయున్నది?
◻ మునుపటి కంటె ఎక్కువగా క్రైస్తవులు ఎందుకు ఒకరినొకరు పురికొల్పుకొనవలెను?
◻ దైవిక నామమునుగూర్చిన జ్ఞానము యెహోవా ప్రజలను ఎట్లు పురికొల్పుచున్నది?
◻ ఏఏ విధములుగా మనము వ్యక్తిగతముగా ఒకరినొకరము పురికొల్పకొనగలము?
◻ మన సహోదరులను నిరుత్సాహపరచు అపవాది పనిలో పాల్గొనుటను మనము ఎందుకు విసర్జించవలెను?
[17వ పేజీలోని చిత్రాలు]
తమ సంఘములలోని మందను పురికొల్పుటలో పెద్దలు నాయకత్వము వహింతురు