కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 2/15 పేజీలు 9-12
  • దేవుని సేవలో ఐక్యమైయున్న పెద్ద కుటుంబాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని సేవలో ఐక్యమైయున్న పెద్ద కుటుంబాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ రోజుల్లోని పెద్ద కుటుంబాలు
  • తల్లిదండ్రులు తప్పక ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండాలి
  • జట్టుగా కలిసి పనిచేయడం
  • మంచి సంభాషణ, ఒకే లక్ష్యాలు
  • యెహోవా మీద ఆధారపడటం
  • ఎన్నడూ మానుకోకండి!
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • కుటుంబ పరిరక్షణా బాధ్యతను నిర్వహించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 2/15 పేజీలు 9-12

దేవుని సేవలో ఐక్యమైయున్న పెద్ద కుటుంబాలు

“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యచ్చు బహుమానమే” అంటూ కీర్తనల రచయిత ఇంకా ఇలా వ్రాశాడు. “యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు.”—కీర్తన 127:3-5.

అవును, పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానమై ఉండగలరు. తన అంబులపొదిలో ఉన్న బాణాలను గురిచూసి ఎలా కొట్టాలో తెలుసుకున్నప్పుడు విలుకాడు సంతృప్తి పొందినట్లే, తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యజీవానికి నడిపే మార్గమున నడిపించినప్పుడు సంతృప్తి పొందుతారు.—మత్తయి 7:14.

సాధారణంగా, పూర్వకాలంలో దేవుని ప్రజల మధ్య ‘అంబులపొది నిండి’ ఉన్నట్లు కుటుంబాలలో ఎక్కువమంది పిల్లలుండేవారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బందీలుగా ఉన్న సంవత్సరాల గురించి ఆలోచించండి: “ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.” (నిర్గమకాండము 1:7) ఐగుప్తులోకి ప్రవేశించిన ఇశ్రాయేలీయుల సంఖ్యను ఐగుప్తు నుండి బయటకి వచ్చిన ఇశ్రాయేలీయుల సంఖ్యతో పోల్చడం, సగటు కుటుంబంలో పదేసిమంది పిల్లలు ఉండేవారని సూచిస్తుంది!

తరువాత, యేసు ఏ కుటుంబంలో అయితే పెరిగాడో దాన్ని అనేకమంది నేడు పెద్ద కుటుంబమనే భావించవచ్చు. యేసు మొదటి కుమారుడు, అయితే యోసేపు మరియలకు ఇంకా నలుగురు కుమారులు, కొంతమంది కుమార్తెలు ఉన్నారు. (మత్తయి 13:54-56) తమ గుంపులో యేసు లేడని గుర్తించకుండానే యోసేపు మరియలు యెరూషలేము నుండి తిరుగు ప్రయాణాన్ని ఎలా ప్రారంభించ గలిగారన్నదాన్ని, వారికి ఎక్కువమంది పిల్లలున్నారన్న విషయాన్ని బట్టి బహుశ అర్థం చేసుకోవచ్చు.—లూకా 2:42-46.

ఈ రోజుల్లోని పెద్ద కుటుంబాలు

ఈ రోజుల్లో, చాలామంది క్రైస్తవులు ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక కారణాలను బట్టి, ఇంకా ఇతర కారణాలను బట్టి చిన్న కుటుంబాలను కలిగివుండాలనుకుంటారు. అయినప్పటికీ, అనేక సమాజాల్లో పెద్ద కుటుంబాలు ఇప్పటికీ సాధారణమైనవిగానే పరిగణింపబడుతున్నాయి. ద స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 1997 ప్రకారం, జననాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం సబ్‌ సహారన్‌ ఆఫ్రికా. అక్కడ సగటు స్త్రీకి ఆరుగురు పిల్లలు ఉంటారు.

పెద్ద కుటుంబాలున్న క్రైస్తవ తల్లిదండ్రులు, యెహోవాను ప్రేమించేలా తమ పిల్లలను పెంచడం అంత సులభంకాదు, కానీ చాలామంది అలా విజయవంతంగా పెంచగలుగుతున్నారు. కుటుంబ విజయం స్వచ్ఛారాధనలో ఐక్యమై ఉండడంపైనే ఆధారపడివుంటుంది. కొరింథులోని సంఘానికి అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలు నేటి క్రైస్తవ కుటుంబాలకు కూడా అంతే శక్తివంతంగా వర్తిస్తాయి. ఆయన ఇలా వ్రాశాడు: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 1:10) అలాంటి ఐక్యతను ఎలా సాధించవచ్చు?

తల్లిదండ్రులు తప్పక ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండాలి

ఒక కీలకాంశం ఏమిటంటే తల్లిదండ్రులు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొన్నవారై ఉండాలి. మోషే ఇశ్రాయేలీయులకు ఏమి చెప్పాడో గమనించండి: “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”—ద్వితీయోపదేశకాండము 6:4-7.

దేవుని ఆజ్ఞలు తల్లిదండ్రుల ‘హృదయములలో’ ఉండాలని మోషే నొక్కి చెప్పాడని గమనించండి. అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమమైన ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వడానికి పురికొల్పబడతారు. వాస్తవానికి, తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడే తమ పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధించాలనే ఆతురత కల్గివుంటారు.

ఒకరు ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండి యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించాలంటే, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం, ధ్యానించడం, అన్వయించుకోవడం చాలా ప్రాముఖ్యం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, “దివారాత్రము” దానిని చదివే వ్యక్తి “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును” అని కీర్తనల గ్రంథకర్త వ్రాశాడు.—కీర్తన 1:2, 3

ఒక చెట్టుకి క్రమం తప్పకుండా నీరు పెడితే అది ఎలాగైతే మంచి ఫలాన్ని ఇస్తుందో అదే ప్రకారం, ఆధ్యాత్మికంగా పోషించబడిన కుటుంబాలు యెహోవాకు మహిమకలిగే విధంగా దైవిక ఫలాలను ఫలిస్తాయి. పశ్చిమాఫ్రికాలో నివసిస్తున్న యువమెగ్యు కుటుంబం అటువంటిదే. యువమెగ్యుకు ఎనిమిదిమంది పిల్లలు ఉన్నప్పటికీ, ఆయనా ఆయన భార్యా క్రమ పయినీర్లుగా లేక యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులుగా సేవచేస్తున్నారు. ఆయనిలా చెప్తున్నాడు: “మేము ఇప్పటికి ఇరవై ఏళ్లకుపైగా క్రమంగా కుటుంబ బైబిలు పఠనం చేసుకుంటున్నాము. మా పిల్లల చిన్నతనం నుంచే మేము వారికి దేవుని వాక్యాన్ని బోధించాము, అయితే కేవలం కుటుంబ పఠనమప్పుడు మాత్రమే కాదుగాని పరిచర్య చేసే సమయంలోనూ మరి ఇతర సమయాల్లోనూ వారికి బోధించాము. మా పిల్లలందరూ రాజ్యసువార్త ప్రచారకులే, ఆరు సంవత్సరాల మా చిన్న కుమార్తె మాత్రం ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు.”

జట్టుగా కలిసి పనిచేయడం

“జ్ఞానమువలన ఇల్లు కట్టబడును” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 24:3) కుటుంబంలో, అలాంటి జ్ఞానం జట్టుగా కలిసి పనిచేయడానికి దోహదపడుతుంది. కుటుంబ జట్టుకు “నాయకుడు” తండ్రి; ఆయనే కుటుంబానికి దేవుడు నియమించిన శిరస్సు. (1 కొరింథీయులకు 11:3) ప్రేరేపించబడిన అపొస్తలుడైన పౌలు, “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యంటివారిని, [వస్తుపరంగానూ ఆధ్యాత్మికపరంగానూ] సంరక్షింపక పోయనయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని చెప్పినప్పుడు, శిరస్సత్వ బాధ్యత యొక్క గంభీరతను నొక్కి చెబుతున్నాడు.—1 తిమోతి 5:8.

దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఈ సలహాకు అనుగుణంగా, క్రైస్తవ భర్తలు తమ భార్యల ఆధ్యాత్మికత గురించి శ్రద్ధ తీసుకోవాలి. భార్యలు ఒకవేళ ఇంటి పనులలో మునిగిపోయి ఉంటే వారి ఆధ్యాత్మికత దెబ్బతింటుంది. ఆఫ్రికాలోని ఒక దేశంలో, క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఒక క్రైస్తవుడు తన భార్య ఆధ్యాత్మిక విషయాల్లో ఉదాసీనంగా ఉన్నట్లు అనిపిస్తుందని తన సంఘంలోని పెద్దలకు చెప్పాడు. ఆయన భార్యకు ఆచరణాత్మకమైన సహాయం అవసరమని పెద్దలు సూచించారు. గనుక ఆమె భర్త ఇంటిపనులలో ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. అంతేగాక, ఆమె బైబిలు చదివి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆమెకు సహాయం చేసేందుకు ఆయన సమయాన్ని వెచ్చించాడు. ఆమె దానికి చక్కగా ప్రతిస్పందించింది, ఇప్పుడు ఆ కుటుంబమంతా దేవుని సేవలో ఐక్యమై ఉంది.

తండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవాలి. పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) తల్లిదండ్రులు తమ పిల్లలకు కోపము రేపకూడదనే హెచ్చరికను, అలాగే వారికి తర్ఫీదివ్వమన్న నిర్దేశాన్ని లక్ష్యపెట్టినప్పుడు, పిల్లలు తాము కుటుంబ జట్టులో భాగమన్నట్లు భావిస్తారు. ఫలితంగా, పిల్లలు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కాక ఒకరినొకరు ప్రోత్సహించుకోవచ్చు.

జట్టుగా కలిసి పనిచేయడంలో, ఆధ్యాత్మిక బాధ్యతలు చేపట్టడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నప్పుడు వారికి ఆ బాధ్యతలను అప్పగించడం ఇమిడివుంది. 11 మంది పిల్లల తండ్రియైన ఒక క్రైస్తవ పెద్ద, ఉదయాన్నే నిద్రలేచి పనికి వెళ్లక ముందు ఆ పిల్లలలో అనేక మందితో పఠనాలు చేస్తాడు. వారిలో పెద్దవారు తాము బాప్తిస్మం తీసుకున్న తర్వాత వంతులవారీగా తమ చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు సహాయం చేసేవారు, వారికి బైబిలును బోధించడం కూడా అందులో ఇమిడివుంది. తండ్రి దానిని పర్యవేక్షించేవాడు, వారి కృషిని మెచ్చుకొనేవాడు. పిల్లలలో ఆరుగురు బాప్తిస్మం తీసుకున్నారు, మిగిలిన వారు ఆ గమ్యాన్ని చేరడానికి ఇంకా కృషి చేస్తూ ఉన్నారు.

మంచి సంభాషణ, ఒకే లక్ష్యాలు

కుటుంబాలు ఐక్యంగా ఉండాలంటే ప్రేమపూర్వకమైన సంభాషణ మరియు ఒకే ఆధ్యాత్మిక లక్ష్యాలను కలిగివుండడం ఆవశ్యకం. నైజీరియాలో నివసిస్తున్న క్రైస్తవపెద్ద అయిన గోర్డన్‌ ఏడుగురు పిల్లల తండ్రి, పిల్లలు 11 నుంచి 27 సంవత్సరాల వయస్సులవారు. తల్లిదండ్రుల వలెనే ఆరుగురు పిల్లలు పయినీర్లు. ఆఖరి అబ్బాయి ఈ మధ్యనే బాప్తిస్మం తీసుకొని కుటుంబంలోని మిగిలిన వారితో కలిసి శిష్యులను చేసే పనిలో క్రమంగా భాగం వహిస్తున్నాడు. పెద్దకుమారులు ఇద్దరూ సంఘంలో పరిచారకులుగా సేవచేస్తున్నారు.

గోర్డన్‌ తన పిల్లలలో ప్రతీఒక్కరితో వ్యక్తిగతంగా బైబిలు పఠనాలను చేశాడు. అంతేకాక, ఆ కుటుంబంలో బైబిలును చదివి దానిని అవగాహన చేసుకోవడానికి ఒక కార్యక్రమం ఉంది. ప్రతి ఉదయం ఒక బైబిలు వచనాన్ని చదివి, కూటాల కోసం సిద్ధపడడానికి కూడుకుంటారు.

కుటుంబంలోని ప్రతి సభ్యుడూ కూడా కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలన్నింటినీ చదవాలన్నది వారి ముందుంచబడిన లక్ష్యాలలో ఒకటి. ఈ మధ్య, వారి దినచర్యలో ప్రతిరోజు బైబిలు చదవడం కూడా భాగమయ్యింది. తాము చదివిన దానిని కుటుంబంలోని మిగిలిన సభ్యులతో క్రమంగా పంచుకోవడం ద్వారా ఆ అలవాటును కొనసాగించడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారు.

వారపు కుటుంబ బైబిలు పఠనం ఎంతో క్రమంగా జరుగుతుంది, దాని గురించి ఎవరికీ గుర్తుచేయనవసరం లేదు—ప్రతీ ఒక్కరు దాని కోసం ఎదురుచూస్తారు. సంవత్సరాలు గడుస్తుండగా, పిల్లల వయస్సులను వారి అవసరతలను బట్టి, కుటుంబ పఠనంలో ఏ విషయాలు పఠించాలి, ఎలా పఠించాలి, ఎంతసేపు పఠించాలి అనేవి మారుతూ వచ్చాయి. కుటుంబం దేవుని నమ్మకమైన ఇతర సేవకులకు సన్నిహితమయ్యింది, ఇది పిల్లల మీద ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపింది.

కుటుంబంగా వారు కలిసి పనులు చేసుకుంటారు, వినోదం కోసం సమయాన్ని కేటాయించారు. వారంలో ఒకరోజు “ఫ్యామిలి ఈవినింగ్‌” అని పెట్టుకుంటారు, దాంట్లో క్విజ్‌లు, ఆరోగ్యకరమైన జోక్‌లు, పియానో వాయించడం, కథలు చెప్పడం, ఇతర కాలక్షేపాలు ఉండేవి. అప్పుడప్పుడు, బీచ్‌లకూ, ఆసక్తికరమైన స్థలాలకూ వెళ్తారు.

యెహోవా మీద ఆధారపడటం

పెద్దకుటుంబాలలో పిల్లలను పెంచడంలో ఉన్న కష్టాలను పైన చెప్పబడినవేవీ కూడా తగ్గించవు. “ఎనిమిదిమంది పిల్లలకు మంచి తండ్రిగా ఉండటం గొప్ప సవాలే” అని ఒక క్రైస్తవుడు చెబుతున్నాడు. “వారిని పెంచిపోషించడానికి భౌతిక మరియు అధ్యాత్మిక ఆహారం ఎంతో సమృద్ధిగా అవసరం; వారిని సంరక్షించడానికి తగినంత డబ్బును సంపాదించడానికి నేను ఎంతో కష్టపడి పనిచేయాలి. పెద్ద పిల్లలు యౌవనప్రాయంలో ఉన్నారు, ఎనిమిది మందీ స్కూలుకు వెళుతున్నారు. అధ్యాత్మిక శిక్షణ ఆవశ్యకమని నాకు తెలుసు, కానీ మా పిల్లలలో కొందరు మొండివారిగా, అవిధేయులుగా ఉన్నారు. వాళ్లు నన్ను దుఃఖపరుస్తారు, కాని కొన్నిసార్లు నేనూ యెహోవా హృదయాన్ని దుఃఖపరచే పనులు చేస్తానని నాకు తెలుసు, ఆయన నన్ను క్షమిస్తున్నాడు. కాబట్టి వాళ్లు తమ తప్పును గ్రహించేంతవరకు నేను ఓపికతో వారిని సరిదిద్దుతూనే ఉండాలి.

“అందరూ మారుమనస్సు పొందాలనే ఉద్దేశంతో మన పట్ల సహనం కల్గివున్న యెహోవా మాదిరిని అనుసరించడానికి నేను ప్రయత్నిస్తాను. నా కుటుంబంతో పఠనం చేస్తున్నాను, మా పిల్లలలో కొందరు బాప్తిస్మం తీసుకోవడమనే లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నారు. ఫలితాలను సాధించడానికి నేను నా స్వంత శక్తి మీద ఆధారపడను; నా స్వంత శక్తితో నేను ఎక్కువ సాధించలేను. నేను ఎప్పుడు కూడా ప్రార్థనలో యెహోవాకు చేరువవ్వడానికీ, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని చెబుతున్న సామెతను అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తాను. మా పిల్లలకు తర్ఫీదిచ్చే పనిని సాధించడానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.”—సామెతలు 3:5, 6.

ఎన్నడూ మానుకోకండి!

కొన్నిసార్లు పిల్లలకు తర్ఫీదివ్వడం నిష్ప్రయోజనకరమైన పనిలా అనిపించవచ్చు, కాని తర్ఫీదివ్వడం ఎన్నడూ మానుకోకండి! తర్ఫీదివ్వడంలో పట్టుదల కల్గివుండండి! మీ పిల్లలు ఇప్పుడు అనుకూలంగా ప్రతిస్పందించక పోయినప్పటికీ, లేక మీ ప్రయత్నాలను గుణగ్రహించకపోయినప్పటికీ, తర్వాత వారు అలా చేయవచ్చు. పిల్లవాడు ఆత్మఫలాలను ఫలించే క్రైస్తవునిగా ఎదగడానికి సమయం పడుతుంది.—గలతీయులు 5:22, 23.

మొనికా కెన్యాలో నివసిస్తుంది, పదిమంది సంతానంలో ఆమె ఒకరు. ఆమె ఇలా అంటుంది: “శిశుప్రాయం నుండే మా తల్లిదండ్రులు మాకు బైబిలు సత్యాన్ని బోధించారు. ప్రతీ వారం నాన్న మాతో క్రైస్తవ ప్రచురణలను పఠించేవాడు. ఆయన ఉద్యోగాన్ని బట్టి, పఠనం ఎప్పుడూ ఒకే దినాన జరిగేది కాదు. కొన్నిసార్లు, ఆయన పనినుండి ఇంటికి వచ్చేటప్పుడు మేము బయట ఆడుకోవడం చూసి ఇంకొక అయిదు నిమిషాల్లో అందరూ బైబిలు పఠనం కోసం ఇంట్లోకి రావాలి అని చెప్పేవారు. బైబిలు పఠనం తర్వాత, ప్రశ్నలు అడగమనో లేక ఏవైనా సమస్యలను చర్చించమనో ప్రోత్సహించేవారు.

“మేము దైవభయం గల పిల్లలతో తప్పక సహవసించేలా చూసేవారు. నాన్న మా ప్రవర్తన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడానికి క్రమంగా మా స్కూలుకి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఒకసారి, మా అన్నయ్యలు ముగ్గురూ ఇతర పిల్లలతో దెబ్బలాడారనీ, కొన్నిసార్లు ధిక్కరిస్తున్నారనీ విన్నారు. వాళ్లలా చెడుగా ప్రవర్తించినందుకు నాన్న వాళ్లను శిక్షించారు అంతేగాక, దైవిక మార్గానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎందుకవసరమో లేఖనాలనుండి వివరించడానికి కూడా ఆయన సమయాన్ని వెచ్చించారు.

“మా తల్లిదండ్రులు కూటాలలో జరగబోయే భాగాలను మాతోపాటు ముందుగా సిద్ధపడటం ద్వారా కూటాలకు హాజరవ్వడం వలన వచ్చే ప్రయోజనాలను మాకు చూపించారు. ఇంటింటికి ప్రకటించడాన్ని ముందుగా ఇంట్లో అభ్యాసం చేయడం ద్వారా మేము పరిచారకులమయ్యేందుకు తర్ఫీదు పొందాము. మా తల్లిదండ్రులు ప్రాంతీయ పరిచర్యకు వెళ్లేటప్పుడు, చిన్నతనం నుండే మేము వారితోపాటు వెళ్లేవాళ్లం.

“ఈనాడు, నా అన్నలిద్దరూ ప్రత్యేక పయినీర్లు, ఒక చెల్లి క్రమ పయినీరు. పెళ్ళై కుటుంబం ఉన్న ఒక అక్క ఆసక్తిగల సాక్షి. 16, 18 సంవత్సరాలు ఉన్న నా ఇద్దరు చెల్లెళ్ళు బాప్తిస్మం పొందని ప్రచారకులు. ఇద్దరు చిన్న తమ్ముళ్లు తర్ఫీదు పొందుతున్నారు. నేను యెహోవాసాక్షుల కెన్యా బ్రాంచ్‌ కార్యాలయంలో మూడు సంవత్సరాలుగా సేవచేస్తున్నాను. నేను నా తల్లిదండ్రులను ప్రేమించి, మెచ్చుకుంటున్నాను ఎందుకంటే వారు ఆధ్యాత్మిక వ్యక్తులు; వారు మాకొక మంచి మాదిరిని ఉంచారు.”

మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ, నిత్యజీవానికి నడిపే మార్గంలో నడిచేందుకు వారికి సహాయం చెయ్యడాన్ని ఎన్నడూ మానుకోవద్దు. యెహోవా మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తుండగా, “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు” అని అపొస్తలుడైన యోహాను తన ఆధ్యాత్మిక పిల్లల గురించి చెప్పిన మాటలను మీరూ ప్రతిధ్వనింపజేస్తారు.—3 యోహాను 4.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి