యెహోవా తన మహిమను వినయస్థులకు వెల్లడి చేస్తాడు
“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.”—సామెతలు 22:4.
1, 2. (ఎ) స్తెఫను ‘విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండినవాడని’ అపొస్తలుల కార్యముల పుస్తకమెలా వివరిస్తోంది? (బి) స్తెఫను వినయస్థుడని చెప్పడానికి ఎలాంటి రుజువుంది?
స్తెఫను ‘విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండినవాడు.’ ఆయన ‘కృపతోను బలముతోను నిండినవాడు’ కూడా. యేసు తొలి శిష్యుల్లో ఒకరిగా స్తెఫను ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక క్రియలు చేశాడు. ఒక సందర్భంలో కొందరు వచ్చి ఆయనతో తర్కించారు “గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.” (అపొస్తలుల కార్యములు 6:5, 8-10) స్తెఫను శ్రద్ధగల దేవుని వాక్య విద్యార్థిగా ఉండడమే కాక, తన కాలంలోని యూదా మత నాయకుల ఎదుట దేవుని వాక్యాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలోవున్న, ఆయనిచ్చిన వివరణాత్మక సాక్ష్యం, దేవుని సంకల్పం క్రమేపీ వెల్లడి చేయబడడంలో ఆయనకున్న ప్రగాఢ ఆసక్తిని రుజువుచేస్తోంది.
2 తమ హోదా, పరిజ్ఞానం సాధారణ ప్రజలకంటే తాము ఉన్నతులమని భావించేలా చేసిన ఆ మత నాయకులకు భిన్నంగా స్తెఫను వినయస్థునిగా ఉన్నాడు. (మత్తయి 23:2-7; యోహాను 7:49) స్తెఫనుకు లేఖనాల్లో మంచి ప్రావీణ్యమున్నా, అపొస్తలులు ‘ప్రార్థనకు, వాక్య పరిచర్యకు’ ఎక్కువ సమయం వెచ్చించేందుకు అనువుగా ఆయనకు ‘ఆహారము పంచిపెట్టే’ నియామకం ఇచ్చినప్పుడు ఆయనెంతో సంతోషంగా ఆ పనిని స్వీకరించాడు. సహోదరుల్లో స్తెఫనుకు మంచి పేరుంది, అందుకే ఆయన ప్రతీ దినం ఆహారం పంచిపెట్టడానికి యోగ్యులైన ఏడుగురిలో ఒకరిగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన దానిని వినయంతో అంగీకరించాడు.—అపొస్తలుల కార్యములు 6:1-6.
3. అద్భుత రీతిలో దేవుని కృపను వెల్లడి చేసిన దేనిని స్తెఫను కళ్లారా చూశాడు?
3 వినయ స్వభావంతోపాటు స్తెఫనుకున్న ఆధ్యాత్మికతను, యథార్థతను యెహోవా గమనించకపోలేదు. స్తెఫను శత్రు స్వభావంగల యూదా మతనాయకుల గుంపుకు మహాసభలో సాక్ష్యమిస్తున్నప్పుడు, ఆయనను వ్యతిరేకించే వారికి ‘ఆయన ముఖము దేవదూత ముఖమువలె కనబడింది.’ (అపొస్తలుల కార్యములు 6:15) ఆయన ముఖారవిందం, మహిమగల యెహోవా దేవుని నుండి వచ్చిన సమాధానంతో నిండిన దూత ముఖమువలె కనిపించింది. మహాసభ సభ్యులకు ధైర్యంగా సాక్ష్యమిచ్చిన తర్వాత, అద్భుత రీతిలో దేవుని కృప వెల్లడి కావడాన్ని స్తెఫను కళ్లారా చూశాడు. ఆయన “పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూ[శాడు].” (అపొస్తలుల కార్యములు 7:55) ఈ అద్భుత దర్శనం, దేవుని కుమారునిగా, మెస్సీయాగా యేసు స్థానాన్ని స్తెఫనుకు పునరుద్ఘాటించింది. అది వినయస్థుడైన స్తెఫనును బలపరిచి, ఆయనకు యెహోవా అనుగ్రహముందనే హామీనిచ్చింది.
4. యెహోవా తన మహిమను ఎవరికి వెల్లడి చేస్తాడు?
4 స్తెఫనుకు ఇవ్వబడిన దర్శనం ఉదహరిస్తున్నట్లుగా, వినయస్థులుగా ఉంటూ ఆయనతోవున్న సంబంధాన్ని ఉన్నతంగా ఎంచే దైవభక్తిగల వారికి యెహోవా తన మహిమను, తన సంకల్పాన్ని వెల్లడి చేస్తాడు. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:4) కాబట్టి, నిజమైన వినయమంటే ఏమిటి, ఈ ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనమెలా అలవరచుకోవచ్చు, మన జీవితపు అన్ని రంగాల్లో దాన్ని కనబరచడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు అనేవి మనం అర్థం చేసుకోవడం ఆవశ్యకం.
వినయం దేవుని లక్షణం
5, 6. (ఎ) వినయమంటే ఏమిటి? (బి) యెహోవా వినయమెలా కనబరిచాడు? (సి) యెహోవా వినయం మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?
5 విశ్వంలో సర్వోన్నతుడూ, అత్యంత మహిమాన్వితుడూ అయిన యెహోవా దేవుడు వినయానికి సర్వోత్తమ ఆదర్శంగా ఉండడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. రాజైన దావీదు యెహోవాతో ఇలా అన్నాడు: “నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు, నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.” (కీర్తన 18:35) యెహోవా సాత్వికము గలవాడని లేదా వినయం గలవాడని దావీదు వర్ణించినప్పుడు, ఆయన “తలవంచి వంగు” అనే అర్థాన్నిచ్చే హీబ్రూ మూలపదాన్ని ఉపయోగించాడు. “వినయం” అనే పదమే గాక “అణకువ,” “సాత్వికం,” “వినమ్రత” వంటి తత్సంబంధిత పదాలు కూడా ఆ మూలపదానికి చెందినవే. కాబట్టి యెహోవా అపరిపూర్ణ మానవుడైన దావీదుతో వ్యవహరించేందుకు తనను తాను ఆయన స్థాయికి తగ్గించుకున్నప్పుడు, ఆయనను తనకు ప్రాతినిధ్యం వహించే రాజుగా ఉపయోగించుకున్నప్పుడు వినయం ప్రదర్శించాడు. 18వ కీర్తన పైవిలాసం చూపిస్తున్నట్లుగా, యెహోవా దావీదును “శత్రువులందరి చేతిలోనుండియు, సౌలు చేతిలోనుండియు” తప్పిస్తూ ఆయనను రక్షించాడు, బలపరిచాడు. అదే విధంగా, రాజుగా తనకు లభించే ఎలాంటి గొప్పతనమైనా లేదా మహిమైనా కేవలం యెహోవా వినయంగా తన పక్షాన చర్య తీసుకోవడంపైనే ఆధారపడి ఉందని దావీదుకు తెలుసు. ఈ గ్రహింపు దావీదు వినయంగా ఉండడానికి ఆయనకు సహాయం చేసింది.
6 మన విషయమేమిటి? సత్యం బోధించడానికి యెహోవా మనలను ఎంచుకోవడమే కాక తన సంస్థ ద్వారా మనకు ప్రత్యేక సేవాధిక్యతలు అనుగ్రహించి ఉండవచ్చు లేదా తన చిత్తం నెరవేర్చడానికి ఏదోవిధంగా మనలను ఉపయోగించుకొని ఉండవచ్చు. దాని విషయంలో మనమెలా భావించాలి? మనం వినయంతో ఉండవద్దా? యెహోవా వినయంపట్ల మనం కృతజ్ఞులముగా ఉంటూ, మన వినాశనానికి దారితీసే అహంకారాన్ని విసర్జించవద్దా?—సామెతలు 16:18; 29:23.
7, 8. (ఎ) మనష్షేతో వ్యవహరించినప్పుడు యెహోవా వినయమెలా కనబరచబడింది? (బి) వినయం చూపించడంలో యెహోవా, మనష్షే మనకెలా ఆదర్శంగా ఉన్నారు?
7 అపరిపూర్ణ మానవులతో వ్యవహరించడం ద్వారా యెహోవా గొప్ప వినయం చూపించడమే కాకుండా దీనమనస్సుగల వారిని కనికరించడానికి, తమను తాము తగ్గించుకునే వారిని లేవనెత్తడానికి లేదా ఉన్నతపరచడానికి తనకున్న ఇష్టతను కూడా ఆయన ప్రదర్శించాడు. (కీర్తన 113:4-7) ఉదాహరణకు, యూదా రాజైన మనష్షే విషయమే తీసుకోండి. ఆయన అబద్ధ ఆరాధనను ప్రోత్సహించడానికి, రాజుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, “యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.” (2 దినవృత్తాంతములు 33:6) చివరకు, అష్షూరు రాజు మనష్షే సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి అనుమతిస్తూ యెహోవా ఆయనను శిక్షించాడు. చెరసాలలో మనష్షే ‘తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన్నుతాను బహుగా తగ్గించుకొన్నాడు,’ అందువల్ల యెహోవా మనష్షేను మళ్లీ యెరూషలేము సింహాసనంపై కూర్చుండబెట్టడంతో, ఆయన ‘యెహోవా దేవుడై యున్నాడని తెలిసికొన్నాడు.’ (2 దినవృత్తాంతములు 33:11-13) అవును, చివరకు మనష్షే కనబరచిన వినయపూర్వకమైన మనస్సు యెహోవాను సంతోషపెట్టగా, దానికి ప్రతిఫలంగా యెహోవా ఆయనను క్షమించి రాజుగా పునరుద్ధరించడం ద్వారా వినయం ప్రదర్శించాడు.
8 క్షమించే విషయంలో యెహోవాకున్న ఇష్టత, మనష్షే చూపించిన పశ్చాత్తప్త దృక్పథం మనకు వినయం విషయంలో ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పిస్తున్నాయి. మనల్ని నొప్పించిన వారిపట్ల మన వ్యవహార విధానం, పాపం చేసినప్పుడు మనం కనబరిచే దృక్పథం, యెహోవా మనతో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేయగలవని మనం ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవాలి. ఇతరుల తప్పుల్ని మనం ఇష్టపూర్వకంగా క్షమిస్తూ, మన అపరాధాల్ని వినయంగా అంగీకరించినప్పుడు యెహోవా మనపట్ల కనికరం చూపించవచ్చు.—మత్తయి 5:23, 24; 6:12.
వినయస్థులకు దేవుని మహిమ వెల్లడి చేయబడింది
9. వినయం బలహీనతకు గుర్తా? వివరించండి.
9 అయితే వినయాన్ని తత్సంబంధిత లక్షణాలను బలహీనతకో లేదా తప్పును మన్నించే స్వభావానికో గుర్తుగా తలంచకూడదు. పరిశుద్ధ లేఖనాలు సాక్ష్యమిస్తున్నట్లుగా యెహోవా వినయస్థుడే, అయినప్పటికీ అవసరమైన సందర్భాల్లో ఆయన నీతియుక్తమైన రౌద్రాన్ని, అసాధారణ శక్తిని ప్రదర్శిస్తాడు. యెహోవా తనకున్న వినయం కారణంగా గర్విష్ఠులకు దూరంగా ఉంటూ దీనులపట్ల అనుగ్రహపూర్వకమైన శ్రద్ధను లేదా ప్రత్యేక అవధానాన్ని కనబరుస్తాడు. (కీర్తన 138:6) యెహోవా దీనులైన తన సేవకులపట్ల ప్రత్యేక శ్రద్ధను ఎలా కనబరిచాడు?
10. మొదటి కొరింథీయులు 2:6-10 లో సూచించబడినట్లుగా, యెహోవా వినయస్థులకు ఏమి వెల్లడి చేస్తాడు?
10 యెహోవా తన నిర్ణయకాలంలో, తాను ఎన్నుకున్న సమాచార మాధ్యమం ద్వారా తన సంకల్ప నెరవేర్పు వివరాలను వినయస్థులకు వెల్లడి చేశాడు. ఈ మహిమాన్విత వివరాలు అహంకార స్వభావంతో మానవ జ్ఞానంమీద లేదా ఆలోచనమీద ఆధారపడే, వాటికి మూర్ఖంగా హత్తుకునే వారికి మరుగై ఉంటాయి. (1 కొరింథీయులు 2:6-10) అయితే యెహోవా సంకల్పాన్ని గురించిన ప్రామాణిక అవగాహన పొందిన వినయస్థులు ఆయన అసాధారణమైన మహిమను ఎంతో విలువైనదిగా ఎంచుతారు కాబట్టి, ఆయనను ఘనపరిచేందుకు పురికొల్పబడతారు.
11. మొదటి శతాబ్దంలో, కొందరు ఎలా వినయరాహిత్యాన్ని ప్రదర్శించారు, అది వారికి హానికరమని ఎలా నిరూపించబడింది?
11 మొదటి శతాబ్దంలో, క్రైస్తవులమని చెప్పుకున్న వారితోపాటూ చాలామంది వినయం చూపించకుండా, దేవుని సంకల్పం గురించి అపొస్తలుడైన పౌలు వారికి వెల్లడించిన విషయాలను బట్టి అభ్యంతరపడ్డారు. పౌలు తన జాతి, విద్య, వయస్సు లేదా ఎంతో కాలంగా సత్క్రియలు చేశాడన్న ఖ్యాతి వంటివాటిని బట్టి “అన్యజనులకు అపొస్తలుడు” కాలేదు. (రోమీయులు 11:14) అటువంటి వాటిని, యెహోవా తన ఉపకరణంగా ఉపయోగించుకోవడానికి నిశ్చయించే ముఖ్యాంశాలుగా, శరీర సంబంధమైన మనస్సుగలవారే ఎక్కువగా దృష్టిస్తారు. (1 కొరింథీయులు 1:26-29; 3:1; కొలొస్సయులు 2:18) అయితే యెహోవా పౌలును తన కృపకు, నీతియుక్త సంకల్పానికి అనుగుణంగా ఎంచుకున్నాడు. (1 కొరింథీయులు 15:8-10) “మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులు” అని పౌలు వర్ణించిన వారితోపాటు ఇతర వ్యతిరేకులు పౌలును, లేఖనాధారంగా ఆయన చేసిన తర్కాన్ని నిరాకరించారు. వారిలో వినయం లోపించడం వల్ల వారు యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చే అద్భుతమైన తీరు గురించిన పరిజ్ఞానాన్ని, అవగాహనను పొందలేకపోయారు. యెహోవా తన చిత్తం నెరవేర్చడానికి ఎంపిక చేసుకున్న వారిని మనమెప్పటికీ తక్కువ అంచనావేయకుండా, ముందే ఒక నిర్ణయానికి రాకుండా ఉందము గాక.—2 కొరింథీయులు 11:4-6.
12. వినయస్థులపై యెహోవా అనుగ్రహం చూపిస్తాడని మోషే ఉదాహరణ ఎలా చూపిస్తోంది?
12 మరోవైపున, వినయస్థులకు దేవుని మహిమ యొక్క పూర్వఛాయను చూసేలా అనుగ్రహించబడిందని నొక్కితెలిపే ఉదాహరణలు బైబిలులో చాలా ఉన్నాయి. మనుష్యులందరిలో “మిక్కిలి సాత్వికుడు” అయిన మోషే దేవుని మహిమను చూసి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఆస్వాదించాడు. (సంఖ్యాకాండము 12:3) 40 సంవత్సరాలపాటు నమ్రతగల గొర్రెల కాపరిగా గడిపిన ఆ వినయస్థుని పట్ల సృష్టికర్త అనేక విధాలుగా ఎంతో అనుగ్రహం చూపించాడు, మోషే ఆ నలభై సంవత్సరాల్లో ఎక్కువభాగం బహుశా అరేబియా ద్వీపకల్పంలోనే గడిపివుంటాడు. (నిర్గమకాండము 6:12, 30) ఆయన, యెహోవా మద్దతుతో ఇశ్రాయేలు జనాంగానికి ప్రతినిధి, ముఖ్య వ్యవస్థాపకుడు అయ్యాడు. ఆయన, దేవుడు పరస్పరం సంభాషించుకున్నారు. ఒక దర్శనంలో ఆయన “యెహోవా స్వరూపమును” చూశాడు. (సంఖ్యాకాండము 12:7, 8; నిర్గమకాండము 24:10, 11) వినయంగల సేవకుడు, దేవుని ప్రతినిధి అయిన ఆయనను గుర్తించిన వారు కూడా ఆశీర్వదించబడ్డారు. అదే విధంగా, మనం మోషేకన్నా గొప్ప ప్రవక్త అయిన యేసును, ఆయన నియమించిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ గుర్తించి, వారికి విధేయులుగా ఉంటే ఆశీర్వదించబడతాం.—మత్తయి 24:45, 46; అపొస్తలుల కార్యములు 3:22.
13. మొదటి శతాబ్దంలో వినయస్థులైన గొర్రెల కాపరులకు యెహోవా ఎలా తన మహిమను వెల్లడి చేశాడు?
13 ‘రక్షకుని అంటే, ప్రభువైన క్రీస్తు’ జననం గురించిన సువార్తను దేవదూత ప్రకటించినప్పుడు, ‘యెహోవా మహిమ ఎవరి చుట్టూ ప్రకాశించింది’? అది పొగరుబోతు మత నాయకులకు లేదా అత్యున్నత హోదాగల ప్రధానులకు కాదుగానీ “పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొం[టున్న]” వినయస్థులైన గొర్రెల కాపరుల చుట్టే ప్రకాశించింది. (లూకా 2:8-11) వీరు తమ నైపుణ్యతలను బట్టి లేదా పనిని బట్టి ఉన్నతులుగా ఎంచబడలేదు. అయినప్పటికీ, యెహోవా వారినే పరిగణలోకి తీసుకొని మెస్సీయా పుట్టుకను మొట్టమొదట తెలియజేయడానికి ఎంచుకున్నాడు. అవును, యెహోవా వినయస్థులకు, దైవభక్తిగలవారికి మాత్రమే తన మహిమను వెల్లడి చేస్తాడు.
14. వినయస్థులను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు?
14 ఈ ఉదాహరణలు మనకేమి బోధిస్తున్నాయి? యెహోవా వినయస్థులపై అనుగ్రహం చూపించి, వారికి తన సంకల్పానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, అవగాహనను వెల్లడి చేస్తాడని అవి మనకు వివరిస్తున్నాయి. ఆయన కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకొని, మహత్తరమైన తన సంకల్పాన్ని ఇతరులకు తెలియజేయడానికి వారిని ఉపయోగించుకుంటాడు, వారికి మానవులు చూసే అర్హతలు ఉండకపోవచ్చు. ఇది నిర్దేశం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు, ఆయన ప్రవచన వాక్యం వైపు, ఆయన సంస్థ వైపు చూడడానికి మనల్ని పురికొల్పాలి. యెహోవా మహత్తరమైన తన సంకల్పాన్ని వినయస్థులైన తన సేవకులకు బయలుపరుస్తూనే ఉంటాడని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఆమోసు ప్రవక్త ఇలా ప్రకటించాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.”—ఆమోసు 3:7.
వినయం అలవరచుకొని దేవుని అనుగ్రహం పొందండి
15. వినయం కాపాడుకోవడానికి మనమెందుకు కృషిచెయ్యాలి, ఇశ్రాయేలు రాజైన సౌలు విషయంలో ఇదెలా నొక్కిచెప్పబడింది?
15 దేవుని అనుగ్రహాన్ని శాశ్వతంగా అనుభవించాలంటే, మనం వినయస్థులుగా నిరూపించుకోవాలి. అయితే మనం ఒకసారి వినయం చూపించామంటే దానర్థం మనమిక ఎల్లకాలం వినయస్థులుగా ఉంటామని కాదు. ఒక వ్యక్తి వినయాన్ని వదిలేసి అహంకారానికీ, వినాశనానికీ దారితీసే గర్వానికీ, స్వీయ పొగడ్తలకూ లొంగిపోవచ్చు. ఇశ్రాయేలుపై మొదటి రాజుగా అభిషేకించబడిన సౌలు సరిగ్గా అలాగే చేశాడు. మొదట ఆయన ఎంపిక చేయబడినప్పుడు, ఆయన తాను ‘అల్పుడనన్నట్లుగా’ భావించాడు. (1 సమూయేలు 15:17) అయితే కేవలం రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, ఆయన దురహంకారంతో ప్రవర్తించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా బలులు అర్పించడానికి యెహోవా చేసిన ఏర్పాటును ఆయన తృణీకరించడమే కాక, తాను స్వయంగా బలులు ఎందుకు అర్పించాడనేదానికి సాకులు చెప్పాడు. (1 సమూయేలు 13:1, 8-14) ఆయనలో వినయం లోపించిందని స్పష్టం చేసిన అనేక సంఘటనల్లో ఇది మొదటిది మాత్రమే. ఫలితంగా ఆయన దేవుని ఆత్మను, అనుగ్రహాన్ని కోల్పోయి చివరకు అవమానకరమైన రీతిలో చనిపోయాడు. (1 సమూయేలు 15:3-19, 26; 28:6; 31:4) ఇందులోని పాఠం సుస్పష్టం: స్వీయ ప్రాముఖ్యతా భావాలను అణచివేస్తూ వినయ విధేయతలను కాపాడుకోవడానికి కృషిచేయాలి, అప్పుడే మనం యెహోవా అనుగ్రహం కోల్పోవడానికి కారణమయ్యే దురహంకార క్రియలేవీ చేయకుండా ఉంటాం.
16. యెహోవాతో, మన తోటివారితో మనకున్న సంబంధం గురించి ధ్యానించడం వినయాన్ని అలవరచుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది?
16 వినయం దేవుని ఆత్మ ఫలంలో భాగంగా పేర్కొనబడకపోయినా, అది అలవరచుకోవలసిన దైవిక లక్షణం. (గలతీయులు 5:22; కొలొస్సయులు 3:9-12) దీనిలో మానసిక స్థితి, అంటే మనల్ని మనం మరియు ఇతరులను ఎలా దృష్టిస్తామనేది ఇమిడివుంది కాబట్టి వినయాన్ని అలవరచుకోవడానికి మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాలి. యెహోవాతో, మన తోటివారితో మనకున్న సంబంధం గురించి గంభీరంగా ఆలోచించడం, ధ్యానించడం మనం వినయస్థులుగా నిలిచి ఉండడానికి సహాయం చేయగలదు. దేవుని దృష్టిలో అసంపూర్ణ శరీరులందరూ కొద్దిసేపుండి ఆ తర్వాత వాడిపోయే గడ్డిలా ఉన్నారు. నరులు కేవలం పొలంలోని మిడతలవలె ఉన్నారు. (యెషయా 40:6, 7, 22) ఒక గడ్డిపోచ మిగతా గడ్డి పోచలకంటే తాను కాస్త పొడవుగా ఉన్నానని గర్వించడానికేమైనా కారణముందా? ఒక మిడత ఇతర మిడతలకంటే తాను కాస్త ఎక్కువ ఎత్తుకు ఎగురగలదు కాబట్టి తన సామర్థ్యాన్నిబట్టి గొప్పలు పోగలదా? అలా ఆలోచించడం కూడా హాస్యాస్పదమే. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా గుర్తుచేశాడు: “నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” (1 కొరింథీయులు 4:7) ఇలాంటి బైబిలు వచనాలను ధ్యానించడం మనం వినయాన్ని అలవరచుకొని, దాన్ని కనబరచడానికి మనకు సహాయం చేయగలదు.
17. వినయం అలవరచుకోవడానికి దానియేలు ప్రవక్తకు ఏమి సహాయం చేసింది, మనమూ అలాగే చేయడానికి మనకేమి సహాయం చేయగలదు?
17 హీబ్రూ ప్రవక్తయైన దానియేలు తననుతాను “తగ్గించుకొనిన” కారణంగా అంటే వినయం చూపించడం వల్ల దేవుని దృష్టిలో ‘బహు ప్రియుడు’ అని పేర్కొనబడ్డాడు. (దానియేలు 10:11, 12) వినయం అలవరచుకోవడానికి దానియేలుకు ఏమి సహాయం చేసింది? మొట్టమొదట, ఆయన క్రమం తప్పక యెహోవాకు ప్రార్థన చేస్తూ, ఆయనపై అచంచల విశ్వాసం ప్రదర్శించాడు. (దానియేలు 6:10, 11) దానికితోడు, ఆయన దేవుని వాక్యంపై శ్రద్ధ, సరైన స్ఫూర్తిగల విద్యార్థిగా ఉన్నాడు, ఇది దేవుని మహత్తర సంకల్పంపై దృష్టి నిలపడానికి ఆయనకు సహాయం చేసింది. ఆయన తన ప్రజల దోషాలనే కాకుండా తన అపరాధాలను కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన తన స్వనీతికి బదులు దేవుని నీతిని సమర్థించడంలో నిజమైన ఆసక్తి చూపించాడు. (దానియేలు 9:2, 5, 7) మనం విశిష్టమైన దానియేలు మాదిరిని అనుకరించడమే కాక, మన జీవితపు అన్ని రంగాల్లోను వినయాన్ని అలవరచుకొని, దానిని ప్రదర్శించడానికి కృషిచేయగలమా?
18. నేడు వినయం కనబరిచే వారికెలాంటి మహిమ వేచివుంది?
18 “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” అని సామెతలు 22:4 చెబుతోంది. అవును, యెహోవా వినయస్థులను దీవిస్తాడు దాని ఫలితమే ఘనత, జీవము. దేవునికి తాను చేసే సేవను దాదాపు విరమించుకోబోతున్న సమయంలో యెహోవాచే తన ఆలోచన సరిదిద్దబడిన తర్వాత కీర్తనకర్తయైన ఆసాపు వినయంతో ఇలా ఒప్పుకున్నాడు: “నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.” (కీర్తన 73:24) మరి నేటి విషయమేమిటి? వినయం ప్రదర్శించే వారికి ఎలాంటి మహిమ వేచివుంది? యెహోవాతో అనుగ్రహపూర్వకమైన, ఆశీర్వాదకరమైన సంబంధాన్ని ఆస్వాదించడంతో పాటు వారు, దావీదు రాజు వ్రాసిన ఈ ప్రేరేపిత మాటల నెరవేర్పును చూస్తామని ఆశించవచ్చు: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.” అది నిజంగా మహిమాన్వితమైన భవిష్యత్తే!—కీర్తన 37:11.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• యెహోవా తన మహిమను వెల్లడి చేసిన వినయస్థునిగా స్తెఫను ఎలా ఒక మాదిరిగా ఉన్నాడు?
• యెహోవా దేవుడు ఏయే విధాలుగా వినయం ప్రదర్శించాడు?
• యెహోవా తన మహిమను వినయస్థులకు వెల్లడి చేస్తాడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?
• వినయం అలవరచుకోవడానికి దానియేలు మాదిరి మనకెలా సహాయం చేయగలదు?
[12వ పేజీలోని బాక్సు]
బలంగలవాడు అయినా వినయస్థుడే
అమెరికాలోని ఒహాయోలో, సీడార్ పాయింట్వద్ద 1919లో జరిగిన (నేడు యెహోవాసాక్షులని పిలువబడుతున్న) బైబిలు విద్యార్థుల సమావేశంలో, అప్పట్లో క్షేత్రసేవను పర్యవేక్షిస్తున్న 50 సంవత్సరాల జె. ఎఫ్. రూథర్ఫర్డ్ సమావేశ ప్రతినిధుల సామాన్లు మోస్తూ వారివెంట వారి గదులవరకూ వెళ్లే హోటల్బాయ్లా సంతోషంగా స్వచ్ఛందంగా పనిచేశాడు. సమావేశపు చివరి రోజున ఆయన 7,000 మంది ప్రేక్షకులను ఈ మాటలతో ఉత్తేజపరిచాడు: “మన ప్రభువుయొక్క మహిమాన్విత రాజ్యం గురించి . . . ప్రజలకు ప్రకటిస్తున్న మీరు, రాజులకు రాజూ ప్రభువులకు ప్రభువూ అయిన వానికి రాయబారులుగా ఉన్నారు.” సహోదరుడైన రూథర్ఫర్డ్ తాను సత్యమని నమ్మిన విషయాలను గట్టిగా విశ్వసిస్తూ వాటి గురించి ధైర్యంగా, రాజీ పడకుండా మాట్లాడతాడని పేరుగాంచినప్పటికీ, ఆయన దేవునియెదుట యథార్థమైన వినయస్థునిగా ఉన్నాడు. ఇది ఆయన బెతెల్లో ఉన్నప్పుడు ఉదయపు ఆరాధనలో ఆయనచేసే ప్రార్థనల్లో తరచూ ప్రతిబింబించేది.
[9వ పేజీలోని చిత్రం]
లేఖనాల్లో ప్రవీణుడైన స్తెఫను వినయంతో ఆహారం పంచిపెట్టాడు
[10వ పేజీలోని చిత్రం]
మనష్షే వినయ మనస్సు యెహోవాను సంతోషపెట్టింది
[12వ పేజీలోని చిత్రం]
దానియేలును ‘బహు ప్రియునిగా’ చేసినదేమిటి?