కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 12/15 పేజీలు 11-15
  • మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మిక లక్షణాలను ఎలా కనబరచవచ్చు?
  • మాట్లాడే విషయంలో మాదిరిగా ఉండండి
  • ప్రవర్తనకు, పవిత్రతకు సంబంధించి మాదిరికరంగా ఉండాలి
  • ప్రేమ, విశ్వాసం చాలా ప్రాముఖ్యం
  • మీ అభివృద్ధిని తేటగా కనబరిచేందుకు కృషి చేయండి
  • యౌవనస్థులారా, మీ అభివృద్ధిని తేటగా కనబరచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీ అభివృద్ధి తేటగా కనబడనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 12/15 పేజీలు 11-15

మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచండి

“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”—1 తిమో. 4:15.

1, 2. తిమోతి బాల్యం గురించి మనకు ఏమి తెలుసు? ఆయనకు దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఏమి జరిగింది?

తిమోతి చిన్నప్పుడు రోమా ప్రాంతమైన గలతీయలో నివసించాడు. ఆ ప్రాంతం ఇప్పుడు టర్కీలో ఉంది. యేసు మరణించిన కొన్ని సంవత్సరాలకు ఎన్నో సంఘాలు అక్కడ స్థాపించబడ్డాయి. ఆ సమయంలోనే యువ తిమోతి, వాళ్ల అమ్మ, వాళ్ల అమ్మమ్మ క్రైస్తవులుగా మారి ఒకానొక సంఘంలో చురుగ్గా దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. (2 తిమో. 1:3-5; 3:14, 15) యువ క్రైస్తవునిగా తిమోతి తనకు బాగా పరిచయమున్న వాతావరణంలో జీవితాన్ని సంతోషంగా గడిపివుంటాడు. అయితే, ఉన్నట్లుండి ఆయన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

2 ఆ ప్రాంతానికి అపొస్తలుడైన పౌలు రెండవసారి వెళ్లేసరికి పరిస్థితిలో మార్పు కనిపించింది. ఆ సమయంలో, తిమోతికి దాదాపు 20 ఏళ్లు ఉండొచ్చు. తిమోతికి సంఘాల్లోని ‘సహోదరుల మధ్య మంచిపేరు’ ఉందని పౌలు లుస్త్రకు వెళ్లినప్పుడే గమనించివుంటాడు. (అపొ. 16:2) అప్పుడు యువ తిమోతి తన వయసుకు మించిన పరిణతిని కనబర్చివుంటాడు. పౌలు, స్థానికంగా ఉన్న మరికొందరు పెద్దలు పరిశుద్ధాత్మ నిర్దేశంలో తిమోతి మీద హస్తనిక్షేపణం చేయడం ద్వారా లేదా చేతులు ఉంచడం ద్వారా సంఘంలో ప్రత్యేక పని కోసం ఆయనను నియమించారు.—1 తిమో. 4:14; 2 తిమో. 1:6.

3. తిమోతికి ఎలాంటి అరుదైన సేవాధిక్యత లభించింది?

3 అపొస్తలుడైన పౌలుతో కలిసి మిషనరీ యాత్రలు చేసే అరుదైన అవకాశం తిమోతికి లభించింది! (అపొ. 16:3) పౌలు ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన ఎంత సంభ్రమాశ్చర్యాలకు గురైవుంటాడో ఒక్కసారి ఊహించండి! ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు అపొస్తలులు, మరితర పెద్దలు అప్పగించిన వివిధ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన కొన్నిసార్లు పౌలుతో, మరికొన్నిసార్లు ఇతరులతో ప్రయాణం చేశాడు. పౌలు, తిమోతి ప్రయాణపనిలో పాల్గొంటూ సహోదరులను ఆధ్యాత్మికంగా బలపర్చారు. (అపొస్తలుల కార్యములు 16:4, 5 చదవండి.) కాబట్టి, ఆయన ఆధ్యాత్మికంగా ప్రగతిసాధించిన సహోదరునిగా చాలామంది క్రైస్తవులకు పరిచయమయ్యాడు. తిమోతితో కలిసి దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఇలా రాశాడు: “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. . . . అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.”—ఫిలి. 2:20-22.

4. (ఎ) పౌలు తిమోతికి ఏ బరువైన బాధ్యతను అప్పగించాడు? (బి) 1 తిమోతి 4:15లో పౌలు చెప్పిన మాటలనుబట్టి మన మనసులో ఏ ప్రశ్నలు వస్తాయి?

4 పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాసేనాటికి పెద్దలను, పరిచర్య సేవకులను నియమించే బరువైన బాధ్యతను ఆయన తిమోతికి అప్పగించాడు. (1 తిమో. 3:1; 5:22) అప్పటికి, తిమోతి నమ్మకస్థుడైన క్రైస్తవ పైవిచారణకర్తగా ప్రగతి సాధించాడని దీన్నిబట్టి తెలుస్తుంది. అయితే, ఆ పత్రికలోనే, ‘నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచుము’ అని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. (1 తిమో. 4:15) తిమోతి అప్పటికే అసాధారణమైన రీతిలో ప్రగతి సాధించాడు కదా? మరి పౌలు ఆయనతో ఎందుకు అలా అన్నాడు? దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఆధ్యాత్మిక లక్షణాలను ఎలా కనబరచవచ్చు?

5, 6. ఎఫెసు సంఘ ఆధ్యాత్మిక స్వచ్ఛత ఎలా ప్రమాదంలో పడింది? తిమోతి ఆ సంఘాన్ని ఎలా రక్షించగలడు?

5 పౌలు 1 తిమోతి 4:15లోని మాటలను ఏ సందర్భంలో అన్నాడో చూద్దాం. (1 తిమోతి 4:11-16 చదవండి.) ఆ మాటలు రాయడానికి ముందు తిమోతిని ఎఫెసులోనే ఉండమని చెప్పి పౌలు మాసిదోనియకు వెళ్లాడు. ఎందుకు? ఆ పట్టణంలో కొందరు అబద్ధ బోధలను ప్రవేశపెట్టడం ద్వారా సంఘంలో విభజనలు సృష్టిస్తున్నారు. సంఘ ఆధ్యాత్మిక స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత తిమోతికి అప్పగించబడింది. ఆయన ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించవచ్చు? ఇతరులు అనుకరించేలా మంచి మాదిరిని ఉంచడం ద్వారా ఆయన కొంతవరకు దాన్ని నిర్వర్తించవచ్చు.

6 పౌలు తిమోతికి ఇలా రాశాడు: “మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.” అంతేకాక, “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము” అని కూడ చెప్పాడు. (1 తిమో. 4:12, 15) తిమోతి ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారానే ఆ అభివృద్ధి సాధించాలి గానీ సంఘంలో ఏదో అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా కాదు. క్రైస్తవులందరూ అలాంటి అభివృద్ధినే సాధించాలి.

7. సంఘంలోని అందరూ దేన్ని సాధించాలి?

7 తిమోతి కాలంలోలాగే, నేడు కూడ సంఘంలో సహోదరులు వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొందరు పెద్దలుగా లేదా పరిచర్య సేవకులుగా సేవచేస్తారు. మరికొందరు పయినీర్లుగా సేవచేస్తారు. ఇంకా కొందరు ప్రయాణ పనిలో, బెతెల్‌ సేవలో లేదా మిషనరీ సేవలో పాల్గొంటారు. పెద్దలు సమావేశాల్లో, కూటాల్లో బోధిస్తారు. అయితే స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా క్రైస్తవులందరూ ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించగలరు. (మత్త. 5:16) తిమోతిలాగే ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్న సహోదరులు కూడ తమ ఆధ్యాత్మిక అభివృద్ధిని అందరికీ తేటగా కనబరచాలి.

మాట్లాడే విషయంలో మాదిరిగా ఉండండి

8. మన మాటలు మన ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

8 తిమోతి అనేక విషయాలతోపాటు మాట్లాడే విషయంలో కూడ మాదిరిగా ఉండాలి. ఈ విషయంలో మనం ఎలా అభివృద్ధి కనబరచవచ్చు? మన మాటలనుబట్టి మనం ఎలాంటి వారమో తెలుస్తుంది. అందుకే యేసు, “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని అన్నాడు. (మత్త. 12:34) యేసు సహోదరుడైన యాకోబు కూడ మన మాటలు మన ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గుర్తించాడు. ఆయన ఇలా రాశాడు: “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.”—యాకో. 1:26.

9. మన మాటలు ఏయే విధాలుగా మాదిరికరంగా ఉండాలి?

9 మనం ఆధ్యాత్మికంగా ఎంతవరకు ప్రగతి సాధించామో మన మాటలనుబట్టి సంఘంలోని ఇతరులకు తెలుస్తుంది. అందుకే, పరిణతిగల క్రైస్తవులు ఇతరులను అగౌరవపరిచే, విమర్శించే, బాధపెట్టే విధంగా మాట్లాడే బదులు బలపర్చే, ఓదార్చే, ప్రోత్సహించే విధంగా మాట్లాడడానికి కృషిచేయాలి. (సామె. 12:18; ఎఫె. 4:29; 1 తిమో. 6:3-5, 20) దేవుని ఉన్నత ప్రమాణాలను సమర్థిస్తూ మాట్లాడడానికి, వాటి ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడితే, మనకు దేవునిపట్ల భక్తివుందని ఇతరులకు తెలుస్తుంది. (రోమా. 1:15, 16) సహృదయులు మనం ఎలా మాట్లాడతామో గమనించి మన మాదిరిని అనుకరించవచ్చు.—ఫిలి. 4:8, 9.

ప్రవర్తనకు, పవిత్రతకు సంబంధించి మాదిరికరంగా ఉండాలి

10. మనం ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే నిష్కపటమైన విశ్వాసం ఎందుకు చాలా అవసరం?

10 మనం మాదిరికరంగా ఉండాలంటే కేవలం ప్రోత్సాహకరంగా మాట్లాడితే సరిపోదు. మంచి విషయాలు చెబుతూ మంచి పనులు చేయకపోతే మనం వేషధారులమౌతాం. పరిసయ్యుల వేషధారణ గురించి, వారి ప్రవర్తనవల్ల వచ్చిన చెడు ఫలితాల గురించి పౌలుకు బాగా తెలుసు. పైకి ఒకలాగ లోన మరోలాగ ఉండే విషయంలో పౌలు తిమోతికి ఎన్నోసార్లు జాగ్రత్తలు చెప్పాడు. (1 తిమో. 1:5; 4:1, 2) అయితే, తిమోతి వేషధారుడేమీ కాదు. తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌలు, “నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము” చేసుకుంటున్నానని చెప్పాడు. (2 తిమో. 1:3-5) అయినా, క్రైస్తవునిగా తనలో ఏ కపటంలేదని తిమోతి ఇతరులకు చూపించాలి. ప్రవర్తన విషయంలో ఆయన మాదిరిగా ఉండాలి.

11. సిరిసంపదల గురించి పౌలు తిమోతికి ఏమి రాశాడు?

11 పౌలు తిమోతికి రాసిన రెండు పత్రికల్లో ప్రవర్తనకు సంబంధించిన అనేక విషయాల్లో చక్కని ఉపదేశానిచ్చాడు. ఉదాహరణకు, తిమోతి డబ్బు సంపాదనలో మునిగిపోకూడదని పౌలు చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమో. 6:10) ఓ వ్యక్తికి సిరిసంపదల మీద మోజు ఉంటే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక లోపమున్నట్లే. అయితే, ‘అన్నవస్త్రములతో’ తృప్తిచెందుతూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపే క్రైస్తవులు ఆధ్యాత్మిక అభివృద్ధిని కనబరుస్తారు.—1 తిమో. 6:6-8; ఫిలి. 4:11-13.

12. మన జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎలా కనబర్చవచ్చు?

12 క్రైస్తవ స్త్రీలు ‘అణకువ, స్వస్థబుద్ధిని కనబరుస్తూ తగుమాత్రపు వస్త్రముతో తమనుతాము అలంకరించుకోవడం’ ఎంత ప్రాముఖ్యమో పౌలు తిమోతికి చెప్పాడు. (1 తిమో. 2:9, 10) తాము వేసుకునే దుస్తులు, కేశాలంకరణ విషయంలో, వ్యక్తిగత జీవితంలోని మరికొన్ని రంగాల్లో అణకువ, స్వస్థబుద్ధి కనబరిచే స్త్రీలు ఇతరులకు చక్కని మాదిరిగా ఉంటారు. (1 తిమో. 3:11) ఈ సూత్రం క్రైస్తవ పురుషులకు కూడ వర్తిస్తుంది. ‘మితానుభవులుగా, స్వస్థబుద్ధిగలవారిగా, మర్యాదస్థులుగా’ ఉండమని పౌలు పైవిచారణకర్తలకు ఉపదేశించాడు. (1 తిమో. 3:2) ఈ లక్షణాలను మనం ఎల్లప్పుడూ చూపిస్తే మన ఆధ్యాత్మిక అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుంది.

13. తిమోతిలా పవిత్రత విషయంలో మనం ఎలా మాదిరిగా ఉండవచ్చు?

13 తిమోతి పవిత్రత విషయంలో కూడా మాదిరిగా ఉండాలి. లైంగిక నైతికత అనే నిర్దిష్టమైన విషయాన్ని మనసులో ఉంచుకొని పౌలు ఆ మాటను ఉపయోగించాడు. ముఖ్యంగా స్త్రీలతో ఆయన ప్రవర్తించే తీరు ఒకరు వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు. ఆయన ‘వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను పూర్ణపవిత్రతతో అక్కచెల్లెల్లుగా’ పరిగణించాలి. (1 తిమో. 4:12; 5:2) కొందరు గుట్టుగా చేసే లైంగిక దుర్నీతికి సంబంధించిన క్రియలు కూడ దేవునికి తెలుస్తాయి. అవి ఏదో ఒక రోజు బయటపడతాయి. అలాగే ఓ క్రైస్తవుడు మంచి క్రియలు చేసినప్పుడు కూడ అవి తేటతెల్లమౌతాయి. (1 తిమో. 5:24, 25) ప్రవర్తనకు, పవిత్రతకు సంబంధించి తాము సాధిస్తున్న అభివృద్ధిని కనబరిచే అవకాశం సంఘంలోని అందరికీ ఉంది.

ప్రేమ, విశ్వాసం చాలా ప్రాముఖ్యం

14. ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించడం చాలా ప్రాముఖ్యమని లేఖనాలు ఎలా నొక్కిచెబుతున్నాయి?

14 నిజక్రైస్తవుల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ప్రేమ. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.” (యోహా. 13:35) మనం అలాంటి ప్రేమను ఎలా చూపించవచ్చు? “ప్రేమతో ఒకనినొకడు” సహిస్తూ, “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము . . . ఒకరినొకరు క్షమించు[కుంటూ],” ఆతిథ్యాన్ని చూపించాలని దేవుని వాక్యం మనల్ని వేడుకుంటోంది. (ఎఫె. 4:1, 2, 32; హెబ్రీ. 13:1, 2) “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై” ఉండమని అపొస్తలుడైన పౌలు రాశాడు.—రోమా. 12:10.

15. ప్రతీ ఒక్కరూ, ముఖ్యంగా క్రైస్తవ పైవిచారణకర్తలు ప్రేమను చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

15 తిమోతి తోటి క్రైస్తవులతో కటువుగా, నిర్దయగా ప్రవర్తించివుంటే బోధకునిగా, పైవిచారణకర్తగా ఆయన చేసిన మంచి పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యుండేవి. (1 కొరింథీయులు 13:1-3 చదవండి.) కానీ తిమోతి అలా ప్రవర్తించలేదు. తన సహోదరులపట్ల నిష్కపటమైన ప్రేమ చూపించాడు. అంతేకాక, వారికి ఆతిథ్యమిచ్చి, వారి కోసం మంచి పనులు చేశాడు. ఇవన్నీ ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాడని తప్పక చూపించివుంటాయి. అందుకే, తిమోతికి రాసిన పత్రికలో, ప్రేమను చూపించే విషయంలో తిమోతి మాదిరిగా ఉండాలని పౌలు నొక్కిచెప్పాడు.

16. తిమోతికి బలమైన విశ్వాసం ఎందుకు అవసరమైంది?

16 తిమోతి ఎఫెసులో ఉన్నప్పుడు ఆయన విశ్వాసం పరీక్షించబడింది. కొందరు క్రైస్తవ సత్యానికి విరుద్ధమైన సిద్ధాంతాలను బోధించసాగారు. మరికొందరు “కల్పనాకథలు” వ్యాప్తి చేశారు లేదా సంఘ ఆధ్యాత్మికతకు పనికిరాని విషయాలమీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు. (1 తిమోతి 1:3, 4 చదవండి.) అలాంటివారు ‘ఏమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులయ్యారు’ అని పౌలు చెప్పాడు. (1 తిమో. 6:3-5) సంఘంలో చొరబడుతున్న ఆ హానికరమైన సిద్ధాంతాలు ఏమిటో చూద్దామని తిమోతి అనుకోవడం మంచిదేనా? మంచిదికాదు. ఎందుకంటే ‘మంచి పోరాటము పోరాడుతూ,’ “అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము” అని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. (1 తిమో. 6:12, 20, 21) తిమోతి పౌలు ఇచ్చిన ఆ మంచి ఉపదేశాన్ని తప్పక పాటించివుంటాడు.—1 కొరిం. 10:12.

17. నేడు మన విశ్వాసం ఎలా పరీక్షించబడవచ్చు?

17 ఆసక్తికరంగా, “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురు” అని తిమోతికి ముందుగానే చెప్పబడింది. (1 తిమో. 4:1) బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారితోసహా సంఘంలోని వారందరూ తిమోతిలా బలమైన, స్థిరమైన విశ్వాసాన్ని కనబరచాలి. మతభ్రష్టత్వానికి దూరంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని చూపిస్తే, మన అభివృద్ధి అందరికీ తేటగా కనబరచవచ్చు, విశ్వాసంలో మాదిరిగా ఉండవచ్చు.

మీ అభివృద్ధిని తేటగా కనబరిచేందుకు కృషి చేయండి

18, 19. (ఎ) మీ అభివృద్ధిని అందరికీ తేటగా ఎలా కనబరచవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి తెలుసుకుంటాం?

18 ఓ నిజక్రైస్తవుని సామర్థ్యాలు, కనిపించే తీరు, హోదా వంటి వాటికీ అతని ఆధ్యాత్మిక అభివృద్ధికీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, ఒక వ్యక్తి సంఘంలో ఎంతో కాలంగా సేవ చేస్తున్నంత మాత్రాన ఆ అభివృద్ధి కనిపించాలనేమీ లేదు. అయితే మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో యెహోవాకు విధేయత చూపించడం ద్వారా మన నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. (రోమా. 16:19) ఒకరినొకరు ప్రేమించాలని, బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఇవ్వబడిన ఆజ్ఞకు మనం లోబడాలి. మన అభివృద్ధి అందరికీ కనబడేలా మనం పౌలు తిమోతికి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, వాటిని పాటించడానికి కృషిచేద్దాం.

19 మనం ఆధ్యాత్మిక అభివృద్ధి, క్రైస్తవ పరిణతి సాధిస్తే దేవుని ఆత్మ ఫలంలోని మరో లక్షణమైన సంతోషాన్ని కనబరుస్తాం. (గల. 5:22, 23) మనం కష్టకాలాల్లో దాన్ని ఎలా అలవర్చుకోవచ్చో, దాన్ని ఎలా ఎల్లప్పుడూ చూపించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

మీరెలా జవాబిస్తారు?

• మన మాటలనుబట్టి ఇతరులకు మన గురించి ఏమి తెలుస్తుంది?

• ప్రవర్తనకు, పవిత్రతకు సంబంధించి మన అభివృద్ధిని తేటగా ఎలా కనబరచవచ్చు?

• ప్రేమ, విశ్వాసం చూపించే విషయంలో క్రైస్తవులు ఎందుకు మాదిరికరంగా ఉండాలి?

[11వ పేజీలోని చిత్రం]

యువ తిమోతి తన వయసుకు మించిన పరిణతి చూపించాడు

[13వ పేజీలోని చిత్రాలు]

మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతోందా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి