కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 1/15 పేజీలు 12-16
  • దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉద్యోగం
  • సరదాలు, వినోదం
  • కుటుంబ బాంధవ్యాలు
  • సరైన మార్గాన్ని ఎంచుకోండి
  • మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • వినోదాన్ని ఎలా ఎంచుకోవాలి?
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 1/15 పేజీలు 12-16
[12వ పేజీలోని చిత్రం]

దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకండి

‘ఎవరిని సేవిస్తారో నేడు మీరు కోరుకోండి.’—యెహో. 24:15.

మీ జవాబు ఏమిటి?

  • ఉద్యోగాన్ని దాని స్థానంలో ఎలా ఉంచవచ్చు?

  • సరదాల్ని, వినోదాన్ని వాటి స్థానంలో ఎలా ఉంచవచ్చు?

  • కుటుంబంలో ఒకరు యెహోవాను విడిచిపెట్టినప్పుడు కలిగే బాధను మీరు ఎలా తట్టుకోవచ్చు?

1-3. (ఎ) యెహోషువ తన జీవితంలో సరైన ఎంపిక చేసుకున్నాడని ఎందుకు చెప్పవచ్చు? (బి) నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

‘కోరుకోండి’ లేదా ‘ఎంచుకోండి’ అనేది ఒక శక్తివంతమైన పదం. ఎంపిక చేసుకునే వ్యక్తుల ముందు కొన్ని మార్గాలు ఉంటాయి, అలాగే జీవితంలో ఏ మార్గంలో వెళ్లాలనే విషయంలో వాళ్లకు కొద్దో గొప్పో నియంత్రణ ఉంటుంది. ఉదాహరణకు, రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తికి ఒక చోటకు రాగానే రెండు దారులు కనిపించాయి. ఆయన ఏ దారిలో వెళ్తాడు? ఎక్కడికి వెళ్లాలో ఆయనకు స్పష్టంగా తెలిసుంటే ఆయన ఎంచుకునే ఒక దారి ఆయనను గమ్యస్థానానికి చేరుస్తుంది, మరో దారి మాత్రం గమ్యం నుండి దూరంగా తీసుకెళ్తుంది.

2 అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న చాలామంది గురించి బైబిల్లో ఉంది. ఉదాహరణకు, కయీను తన కోపాన్ని వెళ్లగ్రక్కాలా లేక అదుపులో పెట్టుకోవాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. (ఆది. 4:6, 7) అలాగే సత్య దేవుణ్ణి సేవించాలా లేక అబద్ధ దేవుళ్లను ఆరాధించాలా అని యెహోషువ ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. యెహోవాకు సన్నిహితంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టే యెహోషువ దేవునికి నచ్చిన మార్గంలో నడవాలని ఎంపిక చేసుకున్నాడు. కానీ కయీనుకు అలాంటి లక్ష్యం లేదు కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం ఆయనను దేవునికి మరింత దూరం చేసింది.

3 ఏ మార్గంలో వెళ్లాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి కొన్నిసార్లు మనకు ఎదురౌతుంది. అప్పుడు మనం లక్ష్యాన్ని లేదా గమ్యస్థానాన్ని మనసులో ఉంచుకోవాలి. అంటే యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసే వాటన్నిటికీ దూరంగా ఉంటూ మనం చేసే ప్రతీ పనిలో ఆయనను ఘనపర్చాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. (హెబ్రీయులు 3:12 చదవండి.) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో యెహోవా నుండి మనల్ని దూరం చేయగల ఏడు రంగాలను, వాటి విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిస్తాం.

ఉద్యోగం

4. ఉద్యోగం చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

4 క్రైస్తవులు తమను తాము పోషించుకోవాలి, తమ కుటుంబ సభ్యులను కూడా పోషించాలి. కుటుంబ సభ్యుల అవసరాల గురించి పట్టించుకోని వ్యక్తి అవిశ్వాసి కన్నా చెడ్డవాడని బైబిలు చెబుతోంది. (2 థెస్స. 3:10; 1 తిమో. 5:8) ఉద్యోగం చేయడం జీవితంలో ప్రాముఖ్యమైన విషయమే అయినా మనం జాగ్రత్తగా లేకపోతే కొన్నిసార్లు అది మనల్ని యెహోవా నుండి దూరం చేస్తుంది. ఎలా?

5. ఒక ఉద్యోగంలో చేరాలా వద్దా అని ఆలోచించేటప్పుడు ముఖ్యంగా ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి?

5 మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. కానీ మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఉద్యోగం దొరకడం ఒకవేళ చాలా కష్టంగా ఉంటే, మీకు వచ్చిన మొదటి ఉద్యోగం అది ఎలాంటిదైనా సరే చేసేయాలని బహుశా మీకు అనిపించవచ్చు. కానీ అ ఉద్యోగం బైబిలు సూత్రాలకు విరుద్ధమైనదైతే? ఆ ఉద్యోగం వల్ల, దానికోసం చేసే ప్రయాణాల వల్ల మీ క్రైస్తవ కార్యకలాపాలు దెబ్బతింటాయని లేదా మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని మీకు తెలిస్తే? అసలు ఉద్యోగం-సద్యోగం లేకుండా ఉండే బదులు ఏదో ఒకటుంటే మంచిదేగా అనుకుంటూ ఆ ఉద్యోగంలో చేరిపోతారా? తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే యెహోవాకు దూరం అవుతారని జ్ఞాపకం ఉంచుకోండి. (హెబ్రీ. 2:1) మీరు ఉద్యోగం కోసం వెదుకుతున్నా లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మరొకటి చూసుకోవాలని అనుకుంటున్నా సరైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు?

6, 7. (ఎ) ఉద్యోగం విషయంలో ఒక వ్యక్తికి ఎటువంటి లక్ష్యాలు ఉండే అవకాశం ఉంది? (బి) ఏ లక్ష్యం మిమ్మల్ని యెహోవాకు దగ్గర చేస్తుంది? ఎందుకు?

6 ముందు చెప్పినట్లుగా మీ లక్ష్యాన్ని స్పష్టంగా మనసులో ఉంచుకోండి. ‘నేను ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కుటుంబ అవసరాలను తీరుస్తూ మీరు, మీ కుటుంబం యెహోవా సేవలో కొనసాగేందుకు ఆ ఉద్యోగం ఉపకరిస్తుందని మీరు అనుకుంటుంటే మీ ప్రయత్నాలను యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు. (మత్త. 6:33) ఒకవేళ మీ ఉద్యోగం పోయినా లేదా మీరు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా యెహోవా మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. (యెష. 59:1) తన ‘భక్తులను శోధనలోనుండి ఎలా తప్పించాలో’ యెహోవాకు తెలుసు.—2 పేతు. 2:9, 10.

7 మరోవైపున కేవలం ఆస్తిపాస్తుల్ని కూడబెట్టడమే మీ లక్ష్యమైతే? బహుశా ఆ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారేమో కానీ, అలాంటి లక్ష్యాల కోసం పాటుపడడం ప్రమాదకరం. (1 తిమోతి 6:9, 10 చదవండి.) ఆస్తిపాస్తులకు, ఉద్యోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తే మీరు యెహోవాకు దూరమౌతారు.

8, 9. ఉద్యోగం విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి వైఖరి ఉండాలి? వివరించండి.

8 మీరు తల్లిదండ్రులైతే మీరు ఎంచుకున్న మార్గం మీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. మీరు మీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని వాళ్లు అనుకుంటున్నారు? మీ ఉద్యోగానికా లేక దేవునితో మీకున్న స్నేహానికా? మీరు మీ హోదాకు, పేరుప్రతిష్ఠలకు, డబ్బుకు మొదటిస్థానం ఇవ్వడం వాళ్లు చూస్తుంటే, వాళ్లు కూడా అలాంటి నాశనకరమైన దారిలో వెళ్లరంటారా? తల్లిదండ్రులుగా మీమీద ఉన్న గౌరవాన్ని వాళ్లు కోల్పోరా? ఒక క్రైస్తవ యువతి ఇలా అంది: “నాకు గుర్తున్నంతవరకు మా నాన్నకు ఉద్యోగమే లోకం. మా కుటుంబానికి అత్యుత్తమమైన వాటిని అందించడం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడని మొదట్లో నేను అనుకునేదాన్ని. మాకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని ఆయన కోరుకునేవాడు. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితి మారింది. ఆయన ఇప్పుడు అవసరానికి మించి పనిచేస్తూ విలాసవంతమైన వస్తువులను ఇంటికి తెస్తున్నాడు. దాంతో, ఆధ్యాత్మిక లక్ష్యాలను ప్రోత్సహించే కుటుంబంగా కాక బాగా డబ్బున్న కుటుంబంగా మాకు పేరొచ్చింది. ఆయన మాకు డబ్బుకు బదులు ఆధ్యాత్మిక సహాయం ఇచ్చుంటే బాగుండేది.”

9 తల్లిదండ్రులారా, మీరు ఉద్యోగానికి మరీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ యెహోవాకు దూరం అవ్వకండి. డబ్బు కన్నా, ఇతర వస్తువుల కన్నా యెహోవాతో స్నేహాన్ని కలిగివుండడమే అత్యంత ప్రాముఖ్యమని మీరు నమ్ముతున్నట్లు మీ జీవన విధానం ద్వారా మీ పిల్లలకు చూపించండి.—మత్త. 5:3.

10. ఫలానా రంగంలో స్థిరపడాలని కోరుకునే యౌవనస్థులు ఏ విషయాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది?

10 మీరు ఒకవేళ జీవితంలో బాగా స్థిరపడాలని ఆలోచిస్తున్న యువతీయువకులైతే మీరు సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవచ్చు? ఇప్పటివరకు మనం చర్చించినట్లుగా, మీ జీవితం ఎటు వెళ్తుందో మీరు పరిశీలించుకోవాలి. మీరు స్థిరపడాలనుకుంటున్న రంగంలో శిక్షణ తీసుకొని, ఆ ఉద్యోగం చేస్తే మీరు రాజ్యానికి సంబంధించిన విషయాలకు మరింతగా ప్రాముఖ్యత ఇవ్వగలుగుతారా? లేక యెహోవాకు ఇంకా దూరం అవుతారా? (2 తిమో. 4:10) నేటి ప్రజల్లా మీ ఆనందం మీ బ్యాంకు బ్యాలెన్సు మీద, షేర్‌ మార్కెట్లలో మీకు వచ్చే రాబడి మీద ఆధారపడి ఉంటుందా? లేక దావీదుకు ఉన్నటువంటి నమ్మకమే మీకూ ఉందా? ఆయనిలా అన్నాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్త. 37:25) ఒక మార్గం మిమ్మల్ని యెహోవాకు దూరం చేస్తుందని, మరో మార్గం అత్యుత్తమ జీవితానికి నడిపిస్తుందని గుర్తుంచుకోండి. (సామెతలు 10:22; మలాకీ 3:10 చదవండి.) మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు?a

సరదాలు, వినోదం

11. సరదాగా గడపడం, వినోదం వంటి వాటి గురించి బైబిలు ఏమి చెబుతోంది? అయితే మనం ఏమి గుర్తుంచుకోవాలి?

11 బైబిలు సరదాగా గడపడాన్ని నిషేధించట్లేదు, అలా గడిపితే సమయాన్ని వృథా చేసినట్లేనని అస్సలు చెప్పట్లేదు. ‘శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకు ప్రయోజనకరమని’ పౌలు తిమోతికి చెప్పాడు. (1 తిమో. 4:8) ‘నవ్వుటకు, నాట్యమాడుటకు కూడా సమయం కలదని’ బైబిలు చెబుతోంది, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరమని కూడా అది ప్రోత్సహిస్తోంది. (ప్రసం. 3:1, 4; 4:6) అయితే మనం జాగ్రత్తగా లేకపోతే సరదాలు, వినోదం వంటివి కూడా మనల్ని యెహోవాకు దూరం చేయగలవు. ఎలా? ముఖ్యంగా రెండు విషయాలను బట్టి అంటే, మనం ఎలాంటి వినోదాన్ని ఎంపిక చేసుకుంటున్నాం, దానికోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం అనేవాటిని బట్టే మనం ప్రమాదంలో చిక్కుకుంటామో లేదో తెలుస్తుంది.

[14వ పేజీలోని చిత్రం]

సరైన వినోదాన్ని తగిన మోతాదులో ఆస్వాదించడం ఆహ్లాదాన్ని ఇస్తుంది

12. సరదాలను, వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు వేటిని మనసులో ఉంచుకోవాలి?

12 ముందు ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలో చూద్దాం. సరదాగా సమయం గడపడం కోసం, వినోదం కోసం సరైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ, దేవునికి అసహ్యమైన వినోదం అంటే హింసకు, లైంగిక అనైతికతకు, దయ్యాలకు సంబంధించిన వినోదమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. కాబట్టి ఎలాంటి విషయాల్లో మనం సరదాగా సమయం గడుపుతున్నామో, ఎలాంటి వినోదాన్ని ఆస్వాదిస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అవి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? హింసకు పాల్పడడం, ఇతరులతో అతిగా పోటీపడడం, దేశభక్తి వంటివాటిని అవి మనలో నూరిపోస్తున్నాయా? (సామె. 3:31) అవి మీ డబ్బునంతా ఊడ్చేస్తున్నాయా? వాటిని చూసి ఇతరులు అభ్యంతరపడతారా? (రోమా. 14:21) మీ సరదాల వల్ల, వినోదం వల్ల మీరు ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాల్సి వస్తోంది? (సామె. 13:20) వాటివల్ల, తప్పు చేయాలనే కోరిక మీలో కలుగుతోందా?—యాకో. 1:14, 15.

13, 14. సరదాల కోసం ఎంత సమయం కేటాయించాలో ఆలోచించేటప్పుడు ఏయే విషయాలు మనసులో పెట్టుకోవాలి?

13 అలాగే వినోదం కోసం, సరదాల కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నారో కూడా చూసుకోండి. ‘నా సరదాల కోసం నేను మరీ ఎక్కువ సమయం గడపడం వల్ల ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం లేకుండా పోతోందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒకవేళ వినోదం కోసం మరీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటే, అది మీకు సేదదీర్పును ఇవ్వడం లేదని మీరే గ్రహిస్తారు. నిజానికి వినోదానికి తగినంత సమయం మాత్రమే ఇచ్చేవాళ్లు ఎక్కువగా ఆనందిస్తారు. ఎందుకంటే తాము మరింత ‘శ్రేష్ఠమైన కార్యాలను’ నెరవేర్చామని వాళ్లకు తెలుసు కాబట్టి, వినోదం కోసం కొంచెం సమయం వెచ్చించినందుకు వాళ్ల మనసు నొచ్చుకోదు.—ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.

14 వినోద కార్యకలాపాల్లో ఎక్కువ సమయాన్ని గడిపితే బాగుంటుందని మనకు అనిపించవచ్చు కానీ, అది మనల్ని యెహోవా నుండి దూరం చేయగలదు. ఆ విషయాన్ని కిమ్‌ అనే 20 ఏళ్ల సహోదరి తన అనుభవం నుండి నేర్చుకుంది. ఆమె ఇలా అంది: “నేను ఎప్పుడు చూసినా పార్టీలంటూ తిరిగేదాన్ని. శుక్రవారం, శనివారం, ఆదివారం ఇలా ఏ వారాంతంలో అయినా ఏదో ఒక పార్టీ జరుగుతుండేది. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయనే సంగతి నాకు ఇప్పుడు అర్థమౌతోంది. ప్రస్తుతం పయినీరు సేవ చేస్తున్న నేను పరిచర్యకు వెళ్లడం కోసం ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తాను కాబట్టి తెల్లవారుజాము ఒకటి రెండింటి దాకా పార్టీల్లో ఉండడం కుదరదని నాకు తెలుసు. నలుగురినీ కలుసుకునే అలాంటి పార్టీలు మరీ చెడ్డవి కాదు, అయితే అవి ప్రాముఖ్యమైన వాటినుండి మన ధ్యాసను మళ్లిస్తాయి. మిగతావాటిలాగే పార్టీలను కూడా వాటి స్థానంలో ఉంచాలి.”

15. పిల్లలకు ఉత్తేజకరమైన వినోదాన్ని అందించడం కోసం తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

15 తల్లిదండ్రులు తమవే కాక తమ పిల్లల భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను కూడా చూసుకోవాలి. అందులో భాగంగా సరదాగా సమయం గడిపేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. మీరు తల్లిదండ్రులైతే, సరదాగా గడపడం ఏదో పాపమైనట్టు ప్రవర్తించకండి. అదే సమయంలో చెడు వినోద కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. (1 కొరిం. 5:6) తగినంత శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే, మీ కుటుంబానికి నిజంగా ఆహ్లాదాన్నిచ్చే మంచి వినోద కార్యక్రమాలను మీరు ఏర్పాటు చేయగలుగుతారు.b అలా చేయడం ద్వారా మీరు, మీ పిల్లలు యెహోవాకు మరింత దగ్గరయ్యే మార్గంలో వెళ్లగలుగుతారు.

కుటుంబ బాంధవ్యాలు

16, 17. చాలామంది తల్లిదండ్రులు ఎటువంటి వేదనను అనుభవించారు? వాళ్ల బాధను యెహోవా అర్థం చేసుకుంటాడని మనకెలా తెలుసు?

16 తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉంటుందంటే కొన్నిసార్లు యెహోవా తన ప్రజల పట్ల తనకున్న ప్రేమను ఉదహరించడానికి ఆ బంధాన్ని ఉపయోగించాడు. (యెష. 49:15) కాబట్టి కుటుంబంలోని ఒకరు యెహోవాను విడిచిపెట్టినప్పుడు సహజంగానే మిగతా వాళ్లకు తీరని దుఃఖం కలుగుతుంది. తన కూతురు సంఘం నుండి బహిష్కరించబడినప్పుడు తనకెలా అనిపించిందో చెబుతూ ఒక సహోదరి ఇలా అంది, “నా గుండె బద్దలైపోయింది, తను అసలు యెహోవాను ఎందుకు విడిచిపెట్టిందో నాకు అర్థంకాలేదు, నా పెంపకం సరిగ్గా లేనందువల్లే అలా జరిగిందేమో అని నన్ను నేను నిందించుకున్నాను.”

17 యెహోవా మీ బాధను అర్థం చేసుకుంటాడు. మొదటి మానవునితో సహా, జలప్రళయానికి ముందు చాలామంది ప్రజలు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా “హృదయములో నొచ్చుకొనెను.” (ఆది. 6:5, 6) అలాంటివి సంభవించినప్పుడు ఎంత వేదన కలుగుతుందో వాటిని అనుభవించిన వాళ్లు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అయినా బహిష్కరణకు గురైన ఒక కుటుంబీకుని తప్పుడు ప్రవర్తన వల్ల మీరు యెహోవా నుండి దూరం అవడం అవివేకం. అయితే కుటుంబ సభ్యుడు యెహోవాను విడిచిపెట్టినప్పుడు కలిగే తీవ్రమైన బాధను మీరు ఎలా తట్టుకోవచ్చు?

18. తమ పిల్లల్లో ఒకరు యెహోవాను విడిచిపెట్టినప్పుడు తల్లిదండ్రులు తమను తాము ఎందుకు నిందించుకోకూడదు?

18 జరిగిన దానికి మీరే కారణం అని ఎన్నడూ మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మనుష్యుల ముందు యెహోవా కొన్ని ఎంపికలు పెట్టాడు, యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందిన ‘ప్రతీ వ్యక్తి తన బరువును తానే భరించుకోవాలి.’ (గల. 6:5) యెహోవా అంతిమంగా, తప్పుడు మార్గంలో నడిచిన పాపినే బాధ్యునిగా ఎంచుతాడు తప్ప మిమ్మల్ని కాదు. (యెహె. 18:20) ఇతరులను కూడా నిందించకండి. క్రమశిక్షణ ఇవ్వడానికి యెహోవా చేస్తున్న ఏర్పాట్లను గౌరవించండి. మీరు పోరాడాల్సింది అపవాదితోనే, సంఘాన్ని కాపాడుతున్న పెద్దలతో కాదు.—1 పేతు. 5:8, 9.

[16వ పేజీలోని చిత్రం]

మీ ఆత్మీయులు యెహోవా దగ్గరకు తిరిగి రావాలని నిరీక్షించడం తప్పు కాదు

19, 20. (ఎ) తమ పిల్లలు బహిష్కరణకు గురైనప్పుడు తల్లిదండ్రులు ఆ బాధను తట్టుకోవాలంటే ఏం చేయాలి? (బి) తల్లిదండ్రులకు ఏ నిరీక్షణ ఉండడం తప్పు కాదు?

19 మీరు ఒకవేళ యెహోవా మీద కోపం పెంచుకుంటే, ఆయనకు దూరం అవుతారు. కుటుంబ బాంధవ్యాల కన్నా యెహోవాకే మీరు ప్రముఖ స్థానం ఇస్తున్నారని తప్పుచేసిన ఆ కుటుంబ సభ్యుడు గ్రహించాలి. ఏదేమైనా దేవునితో మీకున్న సంబంధాన్ని కాపాడుకోండి, అప్పుడే మీరు ఆ పరిస్థితిని తట్టుకోగలుగుతారు. నమ్మకస్థులైన క్రైస్తవ సహోదరసహోదరీల నుండి దూరంగా ఉండకండి. (సామె. 18:1) మీ బాధనంతా ప్రార్థనలో యెహోవాకు తెలియజేయండి. (కీర్త. 62:7, 8) బహిష్కరణకు గురైన వ్యక్తితో ఈ-మెయిల్స్‌, తదితరమైన వాటి ద్వారా సంభాషించడం కోసం సాకులు వెదకకండి. (1 కొరిం. 5:11) ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో లీనమవ్వండి. (1 కొరిం. 15:58) పైన పేర్కొన్న సహోదరి ఇలా అంది: “నేను యెహోవా సేవలో నిమగ్నం అవ్వాలని, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని నాకు తెలుసు. నేను అలా ఉంటేనే, తప్పిపోయిన నా కుమార్తె మళ్లీ యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తనకు సహాయం చేయగలుగుతాను.”

20 ‘ప్రేమ అన్నిటిని నిరీక్షించును’ అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 13:4, 7) మీ ఆత్మీయులు యెహోవా దగ్గరకు తిరిగి రావాలని నిరీక్షించడం తప్పు కాదు. ప్రతీ సంవత్సరం, తప్పు చేసిన ఎంతోమంది పశ్చాత్తాపపడి యెహోవా సంస్థకు తిరిగొస్తున్నారు. పశ్చాత్తాపం చూపించిన వాళ్ల మీద యెహోవా కోపం చూపించడు, బదులుగా వాళ్లను ‘క్షమించుటకు సిద్ధంగా ఉంటాడు.’—కీర్త. 86:5.

సరైన మార్గాన్ని ఎంచుకోండి

21, 22. మీ స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలని మీరు తీర్మానించుకున్నారు?

21 యెహోవా మనుష్యులందరికీ స్వేచ్ఛాచిత్తం ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20 చదవండి.) అయితే ఆ స్వేచ్ఛతో పాటు మనకు బరువైన బాధ్యత కూడా ఉంది. ప్రతీ క్రైస్తవుడు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను ఏ మార్గంలో పయనిస్తున్నాను? ఉద్యోగం, వినోదం, సరదాలు, కుటుంబ బాంధవ్యాల వల్ల నేను యెహోవాకు దూరమయ్యానా?’

22 యెహోవాకు తన ప్రజల మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరదు. కొన్నిసార్లు చెడు మార్గాన్ని ఎంచుకుని మనమే యెహోవా నుండి దూరంగా వెళ్తాం. (రోమా. 8:38, 39) అయితే అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం చూసుకోవచ్చు. దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకూడదని గట్టిగా తీర్మానించుకోండి. అలా తీర్మానించుకోవాల్సిన మరో నాలుగు రంగాల గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

a సరైన రంగాన్ని ఎంపిక చేసుకునే విషయంలో మరింత సమాచారం కోసం యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం), 2వ సంపుటిలోని 38వ అధ్యాయం చూడండి.

b ఈ విషయంలో సలహాల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) నవంబరు 2011 సంచికలోని 17-19 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి