మీరెలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించుకోండి
“మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” —2 పేతు. 3:11, 12.
1, 2. దేవుని ఆమోదం పొందాలంటే మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న ఆలోచన సాధారణంగానే మనందరిలో ఉంటుంది. అయితే, మన గురించి యెహోవా ఏమనుకుంటున్నాడో అని క్రైస్తవులమైన మనం మరింత ఎక్కువగా ఆలోచించాలి కదా? ఎంతైనా యెహోవాయే విశ్వమంతటిలో అత్యంత గొప్ప వ్యక్తి, ఆయన దగ్గరే “జీవపు ఊట” ఉంది.—కీర్త. 36:9.
2 యెహోవా దృష్టిలో మనమెలాంటి వ్యక్తులుగా ఉండాలో నొక్కిచెబుతూ, “పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను” నడుచుకోమని అపొస్తలుడైన పేతురు మనల్ని అభ్యర్థించాడు. (2 పేతురు 3:11, 12 చదవండి.) మనం దేవుని ఆమోదం పొందాలంటే, మన “ప్రవర్తన” పరిశుద్ధంగా ఉండాలి, అంటే నైతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాక, మనం దేవుని మీద పూజ్యభావంతో ఆయనకు నమ్మకంగా హత్తుకొని ఉంటూ ‘దైవభక్తితో’ నడుచుకోవాలి. దీన్నిబట్టి, దేవుని ఆమోదం పొందాలంటే మన ప్రవర్తన ఒక్కటే కాదు, మన అంతరంగం కూడా ఎలా ఉందో చూసుకోవడం ప్రాముఖ్యమని అర్థమౌతోంది. యెహోవా ‘హృదయాన్ని పరిశోధిస్తాడు’ కాబట్టి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉందో లేదో, తనపట్ల మనకు పూర్ణభక్తి ఉందో లేదో ఆయనకు తెలుసు.—1 దిన. 29:17.
3. దేవునితో మనకున్న సంబంధం విషయంలో మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?
3 మనం దేవుని ఆమోదం పొందడం మన శత్రువైన అపవాదియగు సాతానుకు ఇష్టంలేదు. నిజానికి, యెహోవాతో మనకున్న సంబంధాన్ని మనం తెంచుకునేలా చేయడానికి సాతాను శతవిధాలా ప్రయత్నిస్తాడు. మనల్ని ప్రలోభపెట్టి, మనం ఆరాధించే దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి సాతాను అబద్ధాలు ఆడడానికైనా, మోసం చేయడానికైనా వెనకాడడు. (యోహా. 8:44; 2 కొరిం. 11:13-15) కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ప్రజల్ని సాతాను ఎలా మోసం చేస్తాడు? యెహోవాతో నాకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి నేను ఏమి చేయాలి?’
ప్రజల్ని సాతాను ఎలా మోసం చేస్తాడు?
4. దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచేసే ప్రయత్నంలో సాతాను దేని మీద గురి పెడతాడు? ఎందుకు?
4 శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకో. 1:14, 15) దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచేసే ప్రయత్నంలో సాతాను మన కోరికలు పుట్టే చోటు మీద అంటే, మన హృదయం మీద గురి పెడతాడు.
5, 6. (ఎ) సాతాను వేటిని ఉపయోగించి మన మీద గురి పెడతాడు? (బి) మన హృదయ కోరికల్ని కలుషితం చేయడానికి సాతాను ఏ పద్ధతుల్ని ఉపయోగించుకుంటాడు? ఆ ఉరులు ఉపయోగించే విషయంలో సాతానుకు ఎంత అనుభవం ఉంది?
5 సాతాను వేటిని ఉపయోగించి మన హృదయం మీద గురి పెడతాడు? “లోకమంతయు దుష్టుని యందున్నది” అని బైబిలు చెబుతోంది. (1 యోహా. 5:19) సాతాను ఈ “లోకములో ఉన్నవాటిని” ఆయుధాలుగా ఉపయోగించుకుంటాడు. (1 యోహాను 2:15, 16 చదవండి.) గత కొన్ని వేల సంవత్సరాల్లో, అపవాది నేర్పుతో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, మనకు తెలియకుండానే తన ప్రలోభంలో పడేలా అతడు కుయుక్తితో చేసే ప్రయత్నాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.—యోహా. 17:15.
6 హృదయ కోరికల్ని కలుషితం చేసే పద్ధతుల్ని సాతాను ఉపయోగించుకుంటాడు. సాతాను ఉపయోగించే మూడు పద్ధతులేంటో అపొస్తలుడైన యోహాను పేర్కొన్నాడు: (1) “శరీరాశ,” (2) “నేత్రాశ,” (3) “జీవపుడంబము.” అరణ్యంలో యేసును శోధించడానికి సాతాను ఆ పద్ధతుల్ని ఉపయోగించాడు. ఎన్నో సంవత్సరాలుగా అలాంటి ఉరుల్ని ఉపయోగించీ ఉపయోగించీ సాతాను ఇప్పుడు ఒక్కో వ్యక్తి కోరికలకు తగ్గట్లు తన పద్ధతిని మలుచుకుంటూ ఆ ఉరుల్ని సమర్థంగా ఉపయోగిస్తున్నాడు. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలో పరిశీలించే ముందు, అపవాది ఆ ఉరుల్ని ఉపయోగించి హవ్వ విషయంలో ఎలా సఫలమయ్యాడో, యేసు విషయంలో ఎలా విఫలమయ్యాడో చూద్దాం.
“శరీరాశ”
“శరీరాశ” వల్లే హవ్వ పతనమైంది (7వ పేరా చూడండి)
7. సాతాను హవ్వను శోధించడానికి ‘శరీరాశను’ ఎలా ఉపయోగించాడు?
7 మనుష్యులు బ్రతకడానికి ఆహారం ఎంతో అవసరం. భూమి మెండుగా ఆహారాన్ని ఉత్పత్తి చేసేటట్లు సృష్టికర్త దాన్ని తయారు చేశాడు. దేవుని చిత్తం చేయకుండా మనల్ని తప్పుదోవ పట్టించడానికి, ఆహారం పట్ల మన సహజమైన కోరికనే సాతాను సొమ్ము చేసుకోవచ్చు. హవ్వ విషయంలో దాన్నెలా చేశాడో చూడండి. (ఆదికాండము 3:1-6 చదవండి.) “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష” ఫలాన్ని తిన్నా ఆమె చావదని, దాన్ని తిన్న రోజున ఆమె దేవునిలా అవుతుందని సాతాను హవ్వతో అన్నాడు. (ఆది. 2:9) బ్రతికేందుకు దేవునికి లోబడనక్కర్లేదని అపవాది హవ్వకు నూరిపోశాడు. అది ఎంత పచ్చి అబద్ధమో కదా! హవ్వ మనసులో ఆ బీజం పడ్డాక ఆమె ముందు రెండు ఎంపికలు ఉన్నాయి: ఆమె దాన్ని తిరస్కరించవచ్చు లేదా ఆ పండు తినాలనే కోరిక బలపడేలా దాని గురించే ఆలోచించవచ్చు. తోటలో తన చుట్టూ ఎన్నో ఇతర చెట్లు ఉన్నా, తోట మధ్యలో ఉన్న చెట్టు గురించి సాతాను చెప్పిన మాటల్నే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత, “ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని” తిన్నది. సాతాను ఆ విధంగా సృష్టికర్త నిషేధించిన దానిమీద ఆమెలో కోరికను పుట్టించాడు.
యేసు దేనివల్ల కూడా పక్కదారి పట్టలేదు (8వ పేరా చూడండి)
8. యేసును ‘శరీరాశతో’ శోధించడానికి సాతాను ఎలా ప్రయత్నించాడు? కానీ, ఆ ప్రయత్నం ఎందుకు ఫలించలేదు?
8 అరణ్యంలో యేసును శోధించడానికి ప్రయత్నించినప్పుడు కూడా కుయుక్తితో కూడిన ఆ పద్ధతినే సాతాను ఉపయోగించాడు. యేసు 40 పగళ్లు, 40 రాత్రులు ఉపవాసం చేశాక, సాతాను యేసు ఆకలిని అవకాశంగా తీసుకొని శోధించాలనుకున్నాడు. సాతాను ఇలా అన్నాడు: “నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుము.” (లూకా 4:1-3) యేసు ముందు రెండు ఎంపికలు ఉన్నాయి: ఆకలి తీర్చుకోవడానికి తన అద్భుత శక్తిని ఉపయోగించుకోవద్దని అనుకోవచ్చు లేదా ఉపయోగించుకోవాలని అనుకోవచ్చు. స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకోకూడదని యేసుకు తెలుసు. ఆయన ఆకలితో ఉన్నప్పటికీ, తన ఆకలి తీర్చుకోవడం కన్నా యెహోవాతో తనకున్న సంబంధానికే ఆయన ప్రాధాన్యమిచ్చాడు. సాతానుకు యేసు ఇలా జవాబిచ్చాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.”—మత్త. 4:4; లూకా 4:4.
“నేత్రాశ”
9. “నేత్రాశ” అనే పదం దేన్ని సూచిస్తోంది? హవ్వ విషయంలో సాతాను ఎలా నేత్రాశకు గురిపెట్టాడు?
9 “నేత్రాశ” కూడా ఓ శోధనే అని యోహాను పేర్కొన్నాడు. దేన్నైనా చూస్తే చాలు, దానిమీద కోరిక పుట్టగలదని ఆ పదం సూచిస్తోంది. “మీ కన్నులు తెరవబడును” అని సాతాను హవ్వతో అన్నప్పుడు నేత్రాశకే గురిపెట్టాడు. దేవుడు నిషేధించిన పండును చూసే కొద్దీ, ఆ పండు హవ్వకు మరింత ఆకర్షణీయంగా కనబడింది. ఆమెకు ఆ పండు ‘కన్నులకు అందమైనదిగా’ కనిపించింది.
10. యేసును శోధించడానికి ‘నేత్రాశను’ సాతాను ఎలా ఉపయోగించాడు? యేసు దానికెలా స్పందించాడు?
10 యేసు విషయమేమిటి? “అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోకరాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి —ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును” అని చెప్పాడు. (లూకా 4:5, 6) యేసు తన రెండు కళ్లతో ఒక నిమిషంలో రాజ్యాలన్నిటినీ చూడడం సాధ్యం కాదుగానీ, ఆ రాజ్యముల మహిమను ఓ దర్శనంలా చూపిస్తే యేసు వాటికి ఆకర్షితుడౌతాడని సాతాను అనుకున్నాడు. సిగ్గు లేకుండా సాతాను యేసుతో ఇలా అన్నాడు: “నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగును.” (లూకా 4:7) యేసు ఎట్టిపరిస్థితుల్లోనూ సాతాను కోరుకున్నట్లు ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలనుకోలేదు. ఏ మాత్రం ఆలోచించకుండా యేసు తక్షణమే ఇలా బదులిచ్చాడు: “నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది.”—లూకా 4:8.
“జీవపుడంబము”
11. సాతాను హవ్వను ఎలా మోసగించాడు?
11 లోకంలో ఉన్నవాటి గురించి చెబుతున్నప్పుడు యోహాను, “జీవపుడంబమును” ప్రస్తావించాడు. ఈ భూమ్మీద ఆదాముహవ్వలు ఇద్దరే ఉన్నప్పుడు వాళ్లు ఇతరుల ముందు ‘జీవపుడంబాన్ని’ ప్రదర్శించే అవకాశం లేదు. కానీ, వాళ్లు గర్వాన్ని ప్రదర్శించారు. హవ్వను శోధిస్తున్నప్పుడు, ఏదో అద్భుతమైన దాన్ని దేవుడు ఆమె నుండి దాస్తున్నాడని సాతాను నమ్మబలికాడు. “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తిన్న రోజున తను “దేవతలవలె” అవుతుందని హవ్వకు సాతాను చెప్పాడు. (ఆది. 2:17; 3:5) అలా, యెహోవా నుండి వేరుగా ఉండేందుకు స్వాతంత్ర్యాన్ని పొందవచ్చని సాతాను హవ్వకు సూచించాడు. హవ్వ ఆ అబద్ధాన్ని నమ్మడానికి బహుశా గర్వమే కారణం. నిజంగానే తాను చనిపోననుకొని, హవ్వ నిషేధితమైన ఆ పండును తిన్నది. ఆమె ఎంత తప్పుగా ఆలోచించిందో కదా!
12. యేసును శోధించడానికి సాతాను ఉపయోగించిన మరో పద్ధతి ఏమిటి? యేసు దానికెలా స్పందించాడు?
12 హవ్వకు భిన్నంగా యేసు వినయం చూపించి మనకు ఎంత చక్కని ఆదర్శాన్ని ఉంచాడో కదా! యేసును శోధించడానికి సాతాను మరో పద్ధతిలో ప్రయత్నించాడు, కానీ దేవుణ్ణి పరీక్షించే పని చేయాలన్న ఆలోచనను కూడా యేసు దరిచేరనివ్వలేదు. ఒకవేళ అలా చేసివుంటే యేసు గర్వం చూపించినట్లయ్యుండేది. కానీ, యేసు స్పష్టంగా, సూటిగా ఇలా అన్నాడు: “నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నది.”—లూకా 4:9-12 చదవండి.
యెహోవాతో మనకున్న సంబంధాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
13, 14. కొన్ని శోధనల్ని సాతాను నేడు ఎలా ఉపయోగిస్తున్నాడో వివరించండి.
13 హవ్వ విషయంలో, యేసు విషయంలో ఉపయోగించిన శోధనల్నే సాతాను నేడు కూడా ఉపయోగిస్తున్నాడు. ‘శరీరాశను’ ఉపయోగించి సాతాను అనైతికతను, మితిమీరి తినడాన్ని, విపరీతంగా తాగడాన్ని పెంపొందించేందుకు ఈ లోకాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఏమరుపాటుగా ఉండే వ్యక్తులను బుట్టలో వేసుకోవడానికి ఇంటర్నెట్ వంటివాటి ద్వారా పోర్నోగ్రఫీని ఉపయోగిస్తూ సాతాను “నేత్రాశ” మీద గురి పెడుతున్నాడు. సిరిసంపందలు, అధికారం, పేరుప్రతిష్ఠలు వంటివి గర్విష్ఠులకు, “జీవపుడంబము” ప్రదర్శించేవాళ్లకు ఎంతటి శోధనను తెస్తాయో కదా!
ఈ పరిస్థితుల్లో ఏ లేఖన సూత్రాలు మీకు గుర్తుకురావాలి? (13, 14 పేరాలు చూడండి)
14 “లోకములో ఉన్నవాటిని,” జాలరి ఉపయోగించే ఎరలతో పోల్చవచ్చు. అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ, వాటిలో ప్రతీది కొక్కెముకు తగిలించి ఉంటాయి. రోజువారీ అవసరాలు అని ప్రజలు పరిగణించేవాటినే ఉపయోగించుకొని సాతాను వాళ్లచేత దేవుని నియమాలకు విరుద్ధమైన పనుల్ని చేయిస్తాడు. చాపకింద నీరులా ఉండే అలాంటి శోధనలు మన కోరికల్ని ప్రభావితం చేసి, మన హృదయాన్ని కలుషితం చేస్తాయి. నిజానికి అవి, దేవుని చిత్తం చేయడం కన్నా మన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ సౌకర్యాల్ని ఆస్వాదించడమే ప్రాముఖ్యమని మనల్ని నమ్మిస్తాయి. అలాంటి శోధనలకు మనం లొంగిపోతామా?
15. సాతాను శోధనల్ని ఎదిరించే విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
15 సాతాను శోధనలకు హవ్వ లొంగిపోయినా, యేసు మాత్రం వాటిని విజయవంతంగా ఎదిరించాడు. ప్రతీసారి ఆయన, “వ్రాయబడియున్నది” లేదా “చెప్పబడియున్నది” వంటి పదాల్ని ఉపయోగిస్తూ లేఖనాల్లో నుండే జవాబిచ్చాడు. బైబిలును శ్రద్ధతో క్రమంగా అధ్యయనం చేస్తే మనం లేఖనాలతో సుపరిచుతులమై, శోధనలు ఎదురైనప్పుడు మన ఆలోచనను నిలుకడగా ఉంచుకోవడానికి సహాయం చేసే లేఖనాల్ని వెంటనే గుర్తుచేసుకోగలుగుతాం. (కీర్త. 1:1, 2) దేవునికి నమ్మకంగా ఉన్న విశ్వాసుల ఉదాహరణల్ని గుర్తుంచుకుంటే, మనం వాళ్లను ఆదర్శంగా తీసుకోగలుగుతాం. (రోమా. 15:4) యెహోవా పట్ల నిజమైన భక్తిని కలిగివుంటూ ఆయన ప్రేమించే వాటిని ప్రేమించి, ఆయన ద్వేషించే వాటిని ద్వేషిస్తే మనం కాపాడబడతాం.—కీర్త. 97:10.
16, 17. ‘పరీక్షించి తెలుసుకునే’ మన సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే మన వ్యక్తిత్వం ఎలా తయారౌతుంది?
16 మనం లోకంలోని ఆలోచనా తీరు ప్రకారం కాకుండా దేవుని ఆలోచనా తీరు ప్రకారం నడుచుకోవాలంటే, ‘పరీక్షించి తెలుసుకునే’ మన సామర్థ్యాన్ని ఉపయోగించాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. (రోమా. 12:1, 2) మన ఆలోచనల మీద పూర్తి నియంత్రణను కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెబుతూ పౌలు ఇలా అన్నాడు: ‘మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టుచున్నాము.’ (2 కొరిం. 10:5) మన ఆలోచనలు మన వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మనం క్షేమాభివృద్ధికరమైన విషయాల మీద ‘ధ్యానముంచుకోవాలి.’—ఫిలి. 4:8.
17 తప్పుడు ఆలోచనలతో, చెడు కోరికలతో మనసును నింపుకుంటే మనం పరిశుద్ధంగా ఉండలేం. మనం ‘పవిత్ర హృదయంతో’ యెహోవాను ప్రేమించాలి. (1 తిమో. 1:5) కానీ, హృదయం మోసకరమైనది కాబట్టి, ఈ ‘లోకంలో ఉన్నవి’ మనకు ఎంత హాని చేస్తున్నాయో మనం గుర్తించకపోవచ్చు కూడా. (యిర్మీ. 17:9) అందుకే, బైబిలు లేఖనాల వెలుగులో మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకుంటూ ‘మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో, మనల్ని మనమే శోధించుకొని, పరీక్షించుకొని’ చూసుకోవద్దా?—2 కొరిం. 13:5.
18, 19. యెహోవాకు నచ్చినట్లు ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలని మనం ఎందుకు తీర్మానించుకోవాలి?
18 దైవప్రేరణతో యోహాను చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకోవడం వల్ల కూడా మనం ఈ “లోకములో ఉన్నవాటిని” ఎదిరించగలుగుతాం. ఆయన ఇలా చెప్పాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహా. 2:17) సాతాను వ్యవస్థ శాశ్వతమైనదన్నట్టు, నిజమైనదన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఏదో ఒక రోజు అది అంతమై తీరుతుంది. సాతాను లోకం అందించేవేవీ శాశ్వతం కావనే వాస్తవాన్ని గుర్తుంచుకుంటే మనం అతడి శోధనలకు లొంగిపోము.
19 “ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉన్న మనం దేవుడు ఆమోదించే వ్యక్తులుగా ఉండాలని అపొస్తలుడైన పేతురు ఉపదేశిస్తున్నాడు. (2 పేతు. 3:11, 12) ఆ రోజు త్వరలోనే వస్తుంది, సాతాను వ్యవస్థను దేవుడు కూకటివేళ్లతో సహా పెకిలించేస్తాడు. అప్పటివరకు, హవ్వనూ యేసునూ శోధించినట్లే మనల్ని కూడా శోధించడానికి సాతాను ఈ “లోకములో ఉన్నవాటిని” ఉపయోగిస్తూనే ఉంటాడు. హవ్వలా మనం మన సొంత కోరికల్ని తీర్చుకునే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం, సాతానునే మన దేవునిగా చేసుకోవడంతో సమానం. ఎంత కోరదగినవిగా, ఎంత ఆకట్టుకునేవిగా కనిపించినా మనం యేసులా అలాంటి శోధనల్ని ఎదిరించాలి. మనలో ప్రతీ ఒక్కరం యెహోవాకు నచ్చినట్లు ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలని తీర్మానించుకుందాం.