పత్రిక ముఖ్యాంశం | దేవుని రాజ్యం—అది మీ కోసం ఏంచేస్తుంది?
దేవుని రాజ్యం—యేసు దాన్ని ఎందుకంత ముఖ్యమైనదిగా చూశాడు?
యేసు భూమ్మీద పరిచర్య చేసినప్పుడు ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఉదాహరణకు ఎలా ప్రార్థించాలో, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, నిజంగా సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలో ఆయన తన అనుచరులకు బోధించాడు. (మత్తయి 6:5-13; మార్కు 12:17; లూకా 11:28) అయితే ఆయన అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడింది, మాట్లాడడానికి ఇష్టపడింది దేవుని రాజ్యం గురించే.—లూకా 6:45.
‘దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడానికే’ యేసు తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చాడు. (లూకా 8:1) ఇశ్రాయేలు ప్రాంతంలో వందల మైళ్లు నడుస్తూ, ప్రజలకు దేవుని రాజ్యం గురించి బోధించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. యేసు పరిచర్య గురించి మనం నాలుగు సువార్త పుస్తకాల్లో చదవవచ్చు. వాటిలో రాజ్యం గురించిన ప్రస్తావన 100 కన్నా ఎక్కువసార్లు ఉంది. అవి ఎక్కువగా యేసు మాటల్లో కనిపిస్తాయి, అయితే దేవుని రాజ్యం గురించి యేసు చెప్పినవాటిలో అవి కేవలం కొన్ని మాత్రమే.—యోహాను 21:25.
యేసు భూమ్మీద ఉన్నప్పుడు రాజ్యం గురించి ప్రకటించడానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చాడు? ఒక కారణం ఏమిటంటే, దేవుడు ఆ రాజ్యానికి తనను పరిపాలకునిగా ఎంచుకున్నాడని యేసుకు తెలుసు. (యెషయా 9:6; లూకా 22:28-30) అయితే యేసు అధికారం లేదా మహిమ పొందడం మీద దృష్టి పెట్టలేదు. (మత్తయి 11:29; మార్కు 10:17, 18) సొంత ప్రయోజనాల కోసమే రాజ్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అప్పుడూ ఇప్పుడూa ఆయన దృష్టంతా తాను ప్రేమించేవాళ్ల కోసం, అంటే తన పరలోక తండ్రి కోసం, తన నమ్మకమైన అనుచరుల కోసం దేవుని రాజ్యం ఏం చేస్తుందనే దాని మీదే ఉంది.
యేసు పరలోక తండ్రి కోసం రాజ్యం ఏమి చేస్తుంది?
తన పరలోక తండ్రి పట్ల యేసుకు ప్రగాఢమైన ప్రేమ ఉంది. (సామెతలు 8:30; యోహాను 14:31) తన తండ్రికి ఉన్న ఆకట్టుకునే లక్షణాల్ని, అంటే ఆయన ప్రేమ, కనికరం, న్యాయం వంటి లక్షణాల్ని యేసు చాలా విలువైనవిగా చూస్తాడు. (ద్వితీయోపదేశకాండం 32:4; యెషయా 49:15; 1 యోహాను 4:8) కాబట్టి, తన తండ్రి గురించి వ్యాప్తి అవుతున్న అబద్ధాలు యేసుకు అస్సలు ఇష్టంలేదు. ఉదాహరణకు, దేవుడు మనుషుల కష్టాల్ని పట్టించుకోడని, మనం బాధలు పడాలని కోరుకుంటున్నాడని ప్రజలు నమ్ముతున్నారు. అలాంటి అబద్ధాల వల్ల తన తండ్రి పేరుకు వచ్చిన అవమానాన్ని రాజ్యం తీసేస్తుందని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన “రాజ్యం గురించిన మంచివార్త” చాలా ఆసక్తితో ప్రకటించాడు. (మత్తయి 4:23; 6:9, 10) ఇంతకీ రాజ్యం ఆ పని ఎలా చేస్తుంది?
మనుషులకు మంచి జరిగేలా యెహోవా తన రాజ్యం ద్వారా పెద్దపెద్ద మార్పులు చేస్తాడు. నమ్మకమైన ప్రజల “కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.” ఆ కన్నీళ్లకు కారణమైన కష్టాల్ని ఆయన పూర్తిగా తీసేస్తాడు. అంటే, “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.” (ప్రకటన 21:3, 4) తన రాజ్యం ద్వారా దేవుడు మనుషుల బాధలన్నిటినీ పూర్తిగా తీసేస్తాడు.b
కాబట్టి రాజ్యం గురించి చెప్పడానికి యేసు అంత ఆసక్తి చూపించాడంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు! అది, తన తండ్రి ఎంత శక్తిమంతుడో, ఎంత కనికరం గలవాడో చూపిస్తుందని యేసుకు తెలుసు. (యాకోబు 5:11) అంతేకాదు, రాజ్యం యేసు ప్రేమించే నమ్మకమైన మనుషులకు ఎలాంటి ప్రయోజనాలు తెస్తుందో కూడా ఆయనకు తెలుసు.
నమ్మకమైన మనుషుల కోసం రాజ్యం ఏమి చేస్తుంది?
భూమ్మీదికి రావడానికి చాలాకాలం ముందు యేసు తన తండ్రితోపాటు పరలోకంలో ఉన్నాడు. సృష్టంతటినీ చేయడానికి, అంటే అంతులేని నక్షత్రాలు-నక్షత్రవీధులతో నిండిన అద్భుతమైన ఆకాశం మొదలుకొని మన అందమైన భూమిని, దానిమీద జీవించే ప్రతీదాన్ని చేయడానికి తండ్రి ఆ కుమారుణ్ణి ఉపయోగించుకున్నాడు. (కొలొస్సయులు 1:15, 16) అయితే యేసు వాటన్నిటి కన్నా, ‘ముఖ్యంగా మనుషుల్ని బట్టి ఎంతో ఆనందించేవాడు.’—సామెతలు 8:31.
యేసు పరిచర్య అంతటిలో మనుషుల మీద ప్రేమ కనిపిస్తుంది. ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండి, తాను దీనులకు “మంచివార్త ప్రకటించడానికి” భూమికి వచ్చానని చెప్పాడు. (లూకా 4:18) అయితే యేసు, సహాయం చేయడం గురించి కేవలం మాట్లాడి ఊరుకోలేదు. ఆయన తరచూ ప్రజలమీద తనకు ప్రేమ ఉందని చూపించే పనులు చేశాడు. ఒకసారి యేసు మాటలు వినడానికి చాలామంది ప్రజలు వచ్చారు, అప్పుడు ఆయన “వాళ్లమీద జాలిపడి, వాళ్లలో రోగుల్ని బాగుచేశాడు.” (మత్తయి 14:14) ఇంకోసారి, తీవ్రమైన జబ్బు ఉన్న ఒకతను యేసుకు ఇష్టమైతే తనను బాగుచేయమని నమ్మకంతో అడిగాడు. అప్పుడు యేసు కనికరంతో చలించిపోయి, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అని చెప్పి బాగుచేశాడు. (లూకా 5:12, 13) మరోసారి, తన స్నేహితురాలైన మరియ తమ్ముడు లాజరు చనిపోయాడు. ఆమె బాధ చూసి యేసు “లోలోపల మూలిగాడు,” “చాలా బాధపడ్డాడు,” “కన్నీళ్లు పెట్టుకున్నాడు.” (యోహాను 11:32-36) అంతేకాదు, ఎవ్వరూ ఊహించని పనొకటి యేసు చేశాడు, చనిపోయి నాలుగు రోజులుగా సమాధిలో ఉన్న లాజరును తిరిగి బ్రతికించాడు!—యోహాను 11:38-44.
అయితే అప్పుడు యేసు చేసిన సహాయం కొంతకాలమే ఉంటుందని ఆయనకు తెలుసు. తాను బాగుచేసినవాళ్లు మళ్లీ అనారోగ్యం పాలౌతారని, తాను బ్రతికించినవాళ్లు మళ్లీ చనిపోతారని యేసుకు తెలుసు. అలాంటి సమస్యలన్నిటికీ దేవుని రాజ్యం మాత్రమే శాశ్వత పరిష్కారం తీసుకొస్తుందని కూడా యేసుకు తెలుసు. అందుకే యేసు కేవలం అద్భుతాలు చేసి ఊరుకోలేదు కానీ, “రాజ్యం గురించిన మంచివార్త” ఉత్సాహంగా ప్రకటించాడు. (మత్తయి 9:35) యేసు చేసిన అద్భుతాలు, దేవుని రాజ్యం భూవ్యాప్తంగా ఏం చేస్తుందో చూపించాయి. ఆ కాలం గురించి బైబిలు ఏం మాటిస్తుందో పరిశీలించండి.
అనారోగ్య సమస్యలు ఉండవు.
“అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి, చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి. కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు, మూగవాళ్ల నాలుక సంతోషంతో కేకలు వేస్తుంది.” అంతేకాదు, “అందులో నివసించే వాళ్లెవ్వరూ, ‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు.”—యెషయా 33:24; 35:5, 6.
మరణం ఉండదు.
“నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29.
“ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు, సర్వోన్నత ప్రభువైన యెహోవా, ప్రజలందరి ముఖాల మీది కన్నీళ్లను తుడిచేస్తాడు.”—యెషయా 25:8.
చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.
“సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు.”—యోహాను 5:28, 29.
“దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 24:15.
అందరికీ సొంత ఇల్లు ఉంటుంది, నిరుద్యోగ సమస్య ఉండదు.
“వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు. ... నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు.”—యెషయా 65:21, 22.
యుద్ధాలు జరగవు.
“ఆయన భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తన 46:9.
“దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు, వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.”—యెషయా 2:4.
ఆహారకొరతలు ఉండవు.
“భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు.”—కీర్తన 67:6.
“భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది; పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది.”—కీర్తన 72:16.
పేదరికం ఉండదు.
“పేదవాళ్లు ఎల్లకాలం మరవబడరు.”—కీర్తన 9:18.
“సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు.”—కీర్తన 72:12, 13.
దేవుని రాజ్యం తీసుకొచ్చే ఇలాంటి ఆశీర్వాదాల్ని పరిశీలించినప్పుడు, యేసు దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనకు అర్థమౌతుంది. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు, వినడానికి ఆసక్తి చూపించిన ప్రతీ ఒక్కరితో దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా మాట్లాడాడు. ఎందుకంటే, నేడు మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలన్నిటినీ ఆ రాజ్యం తీసేస్తుందని యేసుకు తెలుసు.
రాజ్యం గురించి బైబిల్లో ఉన్న వాగ్దానాలు మీకు నచ్చాయా? ఆ రాజ్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుందా? అది తీసుకొచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలంటే ఏం చేయాలి?
a ఈ ఆర్టికల్ యేసు భావాలను వర్తమాన కాలంలో వర్ణిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన పరలోకంలో సజీవంగా ఉన్నాడు; ఆయన పరలోకానికి తిరిగి వెళ్లాక, రాజ్యం ఆయన హృదయానికి ఇంకా దగ్గరగా ఉందనడంలో సందేహం లేదు.—లూకా 24:51.
b దేవుడు మనుషుల్ని కొంతకాలం ఎందుకు బాధలు పడనిస్తున్నాడో తెలుసుకోవడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి అనే పుస్తకంలో 26వ పాఠం చూడండి.