కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 జనవరి పేజీలు 17-21
  • ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఏమి జరుగుతుంది?
  • వాళ్లకు ఎలా తెలుస్తుంది?
  • వాళ్లు ‘కొత్తగా జన్మిస్తారు’
  • యెహోవా మిమ్మల్ని అభిషేకించాడా?
  • “పవిత్రశక్తే మన మనసుకు సాక్ష్యమిస్తుంది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • పరలోక పిలుపును నిజముగా ఎవరు కలిగియున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మీరు “సత్యస్వరూపియగు ఆత్మను” పొందారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘మేము మీతో వస్తాం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 జనవరి పేజీలు 17-21
సా.శ. 33 పెంతెకొస్తు రోజున అభిషిక్త క్రైస్తవుల తలలమీద కనిపించిన అగ్నిలాంటి నాలుకలు

ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది

“మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.”—రోమా. 8:16.

పాటలు: 5, 14

అభిషిక్తుల గురించి ఈ లేఖనాలు ఏమి చెప్తున్నాయి?

  • 2 కొరిం. 1:21, 22; 2 పేతు. 1:10, 11

  • రోమా. 8:15, 16; 1 యోహా. 2:20, 27

1-3. పెంతెకొస్తు రోజున ఏ ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి? అవి లేఖనాల్లో ముందే చెప్పబడిన వాటిని ఎలా నెరవేర్చాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

అది ఆదివారం ఉదయం. యెరూషలేములోని వాళ్లు సంతోషంగా పెంతెకొస్తు పండుగ చేసుకుంటున్నారు. అది వాళ్లకు ఎంతో ప్రత్యేకమైన రోజు. సాధారణంగా ఈ పవిత్రమైన పండుగను గోధుమల కోతకాలం మొదలైనప్పుడు జరుపుకుంటారు. ఆరోజు ఉదయం ప్రధాన యాజకుడు దేవాలయంలో ఎప్పటిలానే బలులు అర్పించాడు. తర్వాత, ఆయన దాదాపు తొమ్మిది గంటలకు ప్రథమ ఫలముతో అంటే మొదట కోతకోసిన గోధుమలతో చేసిన రెండు పులిసిన రొట్టెలను అర్పించాడు. వాటిని సమర్పించడానికి ఆ ప్రధాన యాజకుడు ఆ రొట్టెలను యెహోవా సన్నిధిలో అల్లాడించాడు. ఇదంతా సా.శ. 33 పెంతెకొస్తు రోజున జరిగింది.—లేవీ. 23:15-20.

2 వందల ఏళ్లపాటు ప్రతీ సంవత్సరం ప్రధాన యాజకుడు ఇలా రొట్టెలను యెహోవా సన్నిధిలో అల్లాడిస్తూ ఉండేవాడు. అది సా.శ. 33 పెంతెకొస్తు రోజు జరిగిన ఓ ప్రాముఖ్యమైన సంఘటనను సూచించింది. ఆ సంఘటన, 120 మంది యేసు శిష్యులు యెరూషలేము మేడగదిలో కలుసుకొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జరిగింది. (అపొ. 1:13-15) దీని గురించి యోవేలు ప్రవక్త 800 సంవత్సరాల ముందే రాశాడు. (యోవే. 2:28-32; అపొ. 2:16-21) ఇంతకీ అక్కడ జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటి?

3 అపొస్తలుల కార్యములు 2:2-4 చదవండి. ఆ రోజు మేడగదిలో ఉన్న శిష్యుల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను లేదా పవిత్రశక్తిని కుమ్మరించి అభిషేకించాడు. (అపొ. 1:8) తర్వాత, ప్రజలు గుంపుగా వాళ్ల చుట్టూ చేరినప్పుడు శిష్యులు తాము చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అపొస్తలుడైన పేతురు అక్కడ జరిగిన సంఘటనను, దానికున్న ప్రాముఖ్యతను ఆ గుంపుకు వివరించాడు. ఆ తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” అదే రోజు దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు, వాళ్లు కూడా పవిత్రశక్తిని పొందారు.—అపొ. 2:37, 38, 41.

4. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తు రోజు మనకు ఎందుకు ప్రాముఖ్యం? (బి) చాలా సంవత్సరాల క్రితం, అదే రోజున ఏ ప్రాముఖ్యమైన సంఘటన జరిగి ఉండవచ్చు? (అధస్సూచి చూడండి.)

4 ప్రధాన యాజకుడు అలాగే ఆయన ప్రతీ పెంతెకొస్తు రోజున చేసే అర్పణలు వేటికి సూచనగా ఉన్నాయి? ప్రధాన యాజకుడు యేసును సూచిస్తున్నాడు. రొట్టెలు, దేవుడు పాపులైన మనుషుల్లో నుండి ఎన్నుకున్న అభిషిక్త శిష్యులందర్నీ సూచిస్తున్నాయి. బైబిలు వాళ్లను “ప్రథమఫలము” అని పిలుస్తుంది. (యాకో. 1:18) దేవుడు వాళ్లను తన కుమారులుగా అంగీకరించి, తన రాజ్యంలో భాగంగా యేసుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించడానికి ఎన్నుకున్నాడు. (1 పేతు. 2:9) తన మాటవినే మనుషులందరినీ యెహోవా తన రాజ్యంలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం యేసుతో పరలోకంలో ఉండేవాళ్లమైనా లేదా పరదైసు భూమ్మీద జీవించేవాళ్లమైనా సా.శ. 33 పెంతెకొస్తు మనకు చాలా ప్రాముఖ్యం.[1]

దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఏమి జరుగుతుంది?

5. అభిషిక్తులందరూ ఒకే విధంగా అభిషేకించబడలేదని మనకెలా తెలుసు?

5 మేడగదిలో కూడుకున్న శిష్యులు పెంతెకొస్తు రోజును ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజున వాళ్లలో ప్రతీ ఒక్కరి తలమీద అగ్ని లాంటిది కనిపించింది. అప్పుడు యెహోవా వాళ్లకు వేరే భాషల్లో మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు తమను పవిత్రశక్తితో అభిషేకించాడని వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. (అపొ. 2:6-12) అయితే అభిషేకించబడిన ప్రతీ క్రైస్తవునికి ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు జరగవు. ఉదాహరణకు, పెంతెకొస్తు రోజున యెరూషలేములో వేలమంది బాప్తిస్మం తీసుకున్నప్పుడే అభిషేకించబడ్డారు. కానీ వాళ్ల తలల మీద అగ్నిలాంటిది వచ్చినట్లు బైబిలు చెప్పడం లేదు. (అపొ. 2:38) అయితే క్రైస్తవులందరూ తాము బాప్తిస్మం తీసుకున్న సమయంలోనే అభిషేకించబడలేదు. సమరయులు తాము బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికి అభిషేకించబడ్డారు. (అపొ. 8:14-17) కానీ ఓ అరుదైన సందర్భంలో మాత్రం కొర్నేలి, ఆయన ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకోకముందే అభిషేకించబడ్డారు.—అపొ. 10:44-48.

6. దేవుడు అభిషేకించిన వాళ్లందరూ ఏమి పొందుతారు? దానివల్ల వాళ్లు ఏమి గ్రహిస్తారు?

6 అవును, తమను దేవుడు అభిషేకించాడని ఒకొక్కరు ఒక్కో సమయంలో గ్రహిస్తారు. కొందరు, యెహోవా తమను అభిషేకించాడని వెంటనే గ్రహించి ఉండవచ్చు. ఇంకొందరు, కొంతకాలం తర్వాత గ్రహించి ఉండవచ్చు. కానీ దేవుడు అభిషేకించిన ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుందో అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఆయనిలా చెప్పాడు, “మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ . . . వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు.” (ఎఫె. 1:13-14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అందుకే, యెహోవా ఎవరినైతే అభిషేకిస్తాడో వాళ్లు ఆ విషయాన్ని అర్థంచేసుకోవడానికి పవిత్రశక్తి ద్వారా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి వాళ్లు భవిష్యత్తులో భూమ్మీద కాదుగానీ పరలోకంలో నిరంతరం జీవిస్తారనడానికి పవిత్రశక్తి “హామీగా” ఉందని చెప్పవచ్చు.—2 కొరింథీయులు 1:21-22; 5:5 చదవండి.

7. పరలోకానికి వెళ్లాలంటే ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు ఏమి చేయాలి?

7 ఒక క్రైస్తవుణ్ణి దేవుడు అభిషేకించినంత మాత్రాన ఆ వ్యక్తి తప్పకుండా పరలోకానికి వెళ్తాడని కాదు. దేవుడు తనను పరలోకానికి ఆహ్వానించాడని అతనికి ఖచ్చితంగా తెలుసు, కానీ ఆ వ్యక్తి యెహోవాకు నమ్మకంగా ఉంటేనే పరలోకానికి వెళ్తాడు. పేతురు ఆ విషయాన్ని ఇలా వివరించాడు, “అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.” (2 పేతు. 1:10, 11) కాబట్టి ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు నమ్మకంగా ఉండడానికి ఎంతో కృషిచేయాలి. ఒకవేళ నమ్మకంగా లేకపోతే పరలోకానికి వెళ్లలేరు.—హెబ్రీ. 3:1; ప్రక. 2:10.

వాళ్లకు ఎలా తెలుస్తుంది?

8, 9. (ఎ) దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు అతనికి ఎలా అనిపిస్తుందో అర్థంచేసుకోవడం చాలామందికి ఎందుకు కష్టంగా ఉంటుంది? (బి) తనకు పరలోక నిరీక్షణ ఉందని ఓ వ్యక్తికి ఎలా తెలుస్తుంది?

8 దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు అతనికి ఎలా అనిపిస్తుందో అర్థంచేసుకోవడం నేడున్న చాలామంది దేవుని సేవకులకు కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు వాళ్లను అభిషేకించలేదు. దేవుడు మనుషుల్ని భూమ్మీద నిరంతరం జీవించడానికే చేశాడుగానీ పరలోకంలో జీవించడానికి కాదు. (ఆది. 1:28; కీర్త. 37:29) అయితే ఆయన కొంతమంది మనుషుల్ని పరలోకంలో రాజులుగా, యాజకులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన వాళ్లను అభిషేకించినప్పుడు వాళ్ల నిరీక్షణ, ఆలోచన విధానం, భావాలు మారతాయి. అందుకే వాళ్లు పరలోక జీవితం కోసం ఎదురుచూస్తారు.—ఎఫెసీయులు 1:17-19 చదవండి.

9 అయితే తనకు పరలోక నిరీక్షణ ఉందని ఓ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? “పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన” రోములోని అభిషిక్త సహోదరులకు పౌలు ఏమి చెప్పాడో గమనించండి. ఆయన ఇలా అన్నాడు, “మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.” (రోమా. 1:1-7; 8:15, 16) ఒక క్రైస్తవుడిని లేదా క్రైస్తవురాలిని పరలోకంలో యేసుతోపాటు రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు అభిషేకిస్తే, ఆ విషయాన్ని పవిత్రశక్తి ద్వారా ఆయన వాళ్లకు తెలియజేస్తాడు.—1 థెస్స. 2:11-12.

10. అభిషిక్త క్రైస్తవునికి వేరేవాళ్లు బోధించాల్సిన అవసరంలేదని 1 యోహాను 2:27 చెప్తున్న మాటలకు అర్థమేమిటి?

10 పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లకు దేవుడు తమను అభిషేకించాడనే విషయాన్ని వేరేవాళ్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ విషయాన్ని అర్థంచేసుకోవడానికి యెహోవాయే వాళ్లకు సహాయం చేస్తాడు. అభిషిక్త క్రైస్తవులకు అపొస్తలుడైన యోహాను ఇలా చెప్తున్నాడు, “మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.” (1 యోహా. 2:20, 27) మిగతావాళ్లలాగే అభిషిక్త క్రైస్తవులకు కూడా యెహోవా ఇచ్చే ఉపదేశం అవసరం. కానీ వాళ్లను దేవుడు అభిషేకించాడని వేరేవాళ్లు నిర్ధారించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని యెహోవా తన అత్యంత శక్తివంతమైన పవిత్రశక్తి ద్వారా వాళ్లకు స్పష్టం చేశాడు.

వాళ్లు ‘కొత్తగా జన్మిస్తారు’

11, 12. ఓ అభిషిక్త క్రైస్తవుడు ఏమి అనుకోవచ్చు? కానీ ఆయన ఏ విషయాన్ని మాత్రం అస్సలు సందేహించడు?

11 దేవుడు తన పవిత్రశక్తితో అభిషేకించినవాళ్లలో చాలా మార్పు వస్తుంది అందుకే వాళ్లు ‘కొత్తగా జన్మిస్తారు’ అని యేసు అన్నాడు.[2] (యోహా. 3:3, 5) ఆ తర్వాత ఆయన ఇలా వివరించాడు, “మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడు.” (యోహా. 3:7, 8) అవును పరలోక నిరీక్షణ ఉన్న ఓ వ్యక్తి, దేవుడు తనను పవిత్రశక్తితో అభిషేకించినప్పుడు ఎలా అనిపిస్తుందో ఆ నిరీక్షణలేని వ్యక్తికి అర్థమయ్యేలా వివరించడం సాధ్యం కాదు.

12 ఓ అభిషిక్త క్రైస్తవుడు, ‘యెహోవా వేరేవాళ్లను కాకుండా నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు’ అని అనుకోవచ్చు. అంతేకాదు తనకు దాన్ని పొందే అర్హత లేదని కూడా అనుకోవచ్చు. కానీ తనను యెహోవా ఎన్నుకున్నాడనే విషయంలో మాత్రం ఆయనకు ఏ సందేహం ఉండదు. బదులుగా యెహోవా తనకు ఇచ్చిన పరలోక బహుమానాన్ని బట్టి ఆయన చాలా సంతోషిస్తాడు, కృతజ్ఞత చూపిస్తాడు. అపొస్తలుడైన పేతురులాగే అభిషిక్తులందరూ ఇలా భావిస్తారు, “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.” (1 పేతు. 1:3, 4) అభిషిక్త క్రైస్తవులు ఈ మాటలు చదివినప్పుడు, వాళ్లతో తమ తండ్రే మాట్లాడుతున్నాడని ఖచ్చితంగా అర్థంచేసుకుంటారు.

13. దేవుడు ఒక వ్యక్తిని పవిత్రశక్తితో అభిషేకించినప్పుడు అతని ఆలోచనా తీరు ఎలా మారుతుంది? ఎందుకు?

13 అభిషిక్త క్రైస్తవులను యెహోవా అభిషేకించక ముందు వాళ్లకు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉండేది. యెహోవా దుష్టత్వాన్ని పూర్తిగా తీసేసి ఈ భూమిని పరదైసుగా మార్చే కాలం కోసం వాళ్లు ఎదురుచూశారు. బహుశా చనిపోయిన తమ కుటుంబ సభ్యుడో లేదా స్నేహితుడో మళ్లీ బ్రతికిరావడం చూడడాన్ని వాళ్లు ఊహించుకొని ఉంటారు. అంతేకాదు పరదైసులో ఇల్లు కట్టుకొని దానిలో ఉండాలనో, చెట్లు నాటి వాటి పండ్లను తినాలనో ఎదురుచూసి ఉండవచ్చు. (యెష. 65:21-23) అయితే, వాళ్ల ఆలోచనలో మార్పు ఎందుకు వచ్చింది? నిరుత్సాహపడడం వల్లో లేదా చాలా బాధలుపడడం వల్లో తమ ఆలోచనల్ని మార్చుకున్నారా? భూమ్మీద నిరంతరం జీవించడం విసుగుపుట్టిస్తుందని, ఇక్కడ సంతోషంగా ఉండలేమని వాళ్లు ఉన్నట్టుండి నిర్ణయించుకున్నారా? లేదా పరలోక జీవితం ఎలా ఉంటుందో చూడాలనుకున్నారా? కాదు. యెహోవా వాళ్లను అభిషేకించినప్పుడు తన పవిత్రశక్తిని ఉపయోగించి వాళ్ల ఆలోచనా తీరును, నిరీక్షణను మార్చాడు.

14. ప్రస్తుతం భూమ్మీద జీవించడం గురించి అభిషిక్త క్రైస్తవులు ఏమి అనుకుంటారు?

14 అంటే అభిషిక్తులు చనిపోవాలని కోరుకుంటారని దాని అర్థమా? అభిషిక్తుల భావాలను పౌలు చక్కగా వివరించాడు. ఆయన వాళ్ల మానవ శరీరాన్ని ‘గుడారముతో’ పోలుస్తూ ఇలా అన్నాడు, “ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.” (2 కొరిం. 5:3, 4) అభిషిక్త క్రైస్తవులు చనిపోవాలని కోరుకోరు. బదులుగా వాళ్లు భూమ్మీద జీవితాన్ని ఆనందిస్తూ తమ జీవితంలోని ప్రతీ రోజును కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి యెహోవాను సేవించడానికి ఉపయోగించాలనుకుంటారు. కానీ వాళ్లు ఏమి చేస్తున్నా, దేవుడు వాళ్లకు ఇస్తానని మాటిచ్చిన భవిష్యత్తును మర్చిపోరు.—1 కొరిం. 15:53; 2 పేతు. 1:4; 1 యోహా. 3:2-3; ప్రక. 20:6.

యెహోవా మిమ్మల్ని అభిషేకించాడా?

15. ఒక వ్యక్తిని దేవుడు పవిత్రశక్తితో అభిషేకించాడని వేటిని బట్టి చెప్పలేం?

15 ‘యెహోవా నన్ను అభిషేకించి ఉంటాడా’ అని మీరు బహుశా ఆలోచిస్తుండవచ్చు. ఒకవేళ అభిషేకించాడని మీకు అనిపిస్తుంటే ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి, మీరు రాజ్యసువార్తను చాలా ఉత్సాహంగా ప్రకటిస్తున్నారని మీకనిపిస్తుందా? బైబిల్ని అధ్యయనం చేయడమన్నా, “దేవుని మర్మములను” తెలుసుకోవడమన్నా మీకు చాలా ఇష్టమా? (1 కొరిం. 2:10) పరిచర్యలో అద్భుతమైన ఫలితాలు సాధించేలా యెహోవా మీకు సహాయం చేశాడని మీకు అనిపిస్తుందా? యెహోవా కోరుకునేది చేయడమే మీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమా? మీకు ఇతరులపట్ల చాలా ప్రేమ ఉందా? యెహోవాను సేవించేందుకు ఇతరులకు సహాయం చేయాల్సిన గొప్ప బాధ్యత మీకుందని భావిస్తున్నారా? మీ జీవితంలో యెహోవా మీకు అనేక విధాల్లో సహాయం చేయడాన్ని చూశారా? ఈ ప్రశ్నలన్నిటికీ మీ జవాబు అవును అయితే, యెహోవా మిమ్మల్ని అభిషేకించాడని దానర్థమా? ఎంతమాత్రం కాదు. ఎందుకంటే అభిషిక్తులైనా, కాకపోయినా దేవుని సేవకులందరికీ అలాగే అనిపిస్తుంది. యెహోవా తన పవిత్రశక్తి ద్వారా తన సేవకుల నిరీక్షణ ఏదైనా వాళ్లకు ఒకేలాంటి శక్తిని ఇవ్వగలడు. నిజానికి, మీకు పరలోక నిరీక్షణ ఉందేమోనని ఆలోచిస్తుంటే దేవుడు మిమ్మల్ని అభిషేకించలేదని అర్థం. ఎందుకంటే, యెహోవా అభిషేకించినవాళ్లు అది నిజమో కాదోనని ఆలోచించరు, వాళ్లకు అది ఖచ్చితంగా తెలుస్తుంది.

16. పవిత్రశక్తి పొందిన వాళ్లందర్నీ పరలోకంలో పరిపాలించడానికి దేవుడు అభిషేకించలేదని మనకెలా తెలుసు?

16 పవిత్రశక్తిని పొందినప్పటికీ పరలోకానికి వెళ్లని చాలామంది నమ్మకస్థుల గురించి బైబిల్లో ఉంది. వాళ్లలో ఒకరు బాప్తిస్మమిచ్చు యోహాను. యోహాను కన్నా గొప్ప వ్యక్తి లేడని యేసు చెప్పాడు. కానీ అతను పరలోకంలో రాజుగా పరిపాలించడని ఆయన చెప్పాడు. (మత్త. 11:10, 11) దావీదు కూడా పవిత్రశక్తిని పొందాడు. (1 సమూ. 16:13) యెహోవా గురించిన లోతైన విషయాల్ని అర్థంచేసుకోవడానికి, బైబిల్లోని కొన్ని భాగాల్ని రాయడానికి దావీదుకు పవిత్రశక్తి సహాయం చేసింది. (మార్కు 12:36) అయినా, “దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (అపొ. 2:34) యెహోవా తన పవిత్రశక్తి ద్వారా వీళ్లందరూ గొప్ప పనులు చేసేలా శక్తినిచ్చాడు కానీ పరలోకంలో జీవించేలా వాళ్లను అభిషేకించలేదు. అంటే వాళ్లు నమ్మకంగా లేరని లేదా వాళ్లకు పరలోకంలో పరిపాలించే అర్హతలేదని దానర్థమా? కాదు. బదులుగా పరదైసు భూమ్మీద నిత్యం జీవించేలా యెహోవా వాళ్లను పునరుత్థానం చేస్తాడు.—యోహా. 5:28, 29; అపొ. 24:14-15.

17, 18. (ఎ) ఇప్పుడున్న దేవుని సేవకుల్లో చాలామందికి ఏ నిరీక్షణ ఉంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

17 ఇప్పుడున్న దేవుని సేవకుల్లో చాలామంది పరలోకానికి వెళ్లరు. వాళ్లు కూడా అబ్రాహాము, దావీదు, బాప్తిస్మమిచ్చు యోహాను అలాగే బైబిల్లోని ఎంతోమంది ఇతర స్త్రీ పురుషుల్లాగే దేవుని పరిపాలనలో భూమ్మీద జీవించాలని ఎదురుచూస్తారు. (హెబ్రీ. 11:10) యేసుక్రీస్తుతోపాటు 1,44,000 మంది పరలోకం నుండి పరిపాలిస్తారు. అయితే, యుగసమాప్తి కాలంలో వాళ్లలో కొంతమంది భూమ్మీద మిగిలి ఉంటారని బైబిలు చెప్తుంది. (ప్రక. 12:17) అంటే 1,44,000 మందిలో చాలామంది ఇప్పటికే చనిపోయి పరలోకానికి వెళ్లిపోయారు.

18 తాను అభిషిక్తుడినని ఎవరైనా చెప్తే భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఎలా స్పందించాలి? మీ సంఘంలోని వాళ్లెవరైనా జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె, ద్రాక్షారసం తీసుకోవడం మొదలుపెడితే వాళ్లను మీరెలా చూడాలి? అలాగే తాము అభిషిక్తులమని చెప్పుకుంటున్నవాళ్ల సంఖ్య పెరుగుతుంటే దాని గురించి మీరు ఆందోళనపడాలా? ఈ ప్రశ్నలకు జవాబుల్ని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ [1] (4వ పేరా) సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది బహుశా పెంతెకొస్తు రోజునే అయ్యుంటుంది. (నిర్గ. 19:1) కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలను ధర్మశాస్త్ర నిబంధనలోకి లేదా ఒప్పందంలోకి తీసుకొచ్చిన రోజు, యేసు అభిషిక్త క్రైస్తవులను కొత్త నిబంధనలోకి లేదా కొత్త ఒప్పందంలోకి తీసుకొచ్చిన రోజు ఒకటే అయ్యుండవచ్చు.

^ [2] (11వ పేరా) కొత్తగా జన్మించడం అంటే ఏమిటో మరింత వివరంగా తెలుసుకోవడానికి కావలికోట 2009, ఏప్రిల్‌ 1 (ఇంగ్లీషు) సంచికలోని 3-11 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి