పరలోక పిలుపును నిజముగా ఎవరు కలిగియున్నారు?
మానవజాతిని యెహోవా ప్రేమించుచున్నాడు. ఈ ప్రేమ ఎంతగొప్పదంటే, మన పితరుడగు ఆదాము పోగొట్టుకొనిన దానిని విడిపించుటకు విమోచన క్రయధనముగా, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఇచ్చెను! ఏమిటది? అది దాని సమస్త హక్కులతో, ఉత్తరాపేక్షలతో శాశ్వతమైన, పరిపూర్ణ మానవ జీవితము. (యోహాను 3:16) విమోచన క్రయధనము, మానవజాతి యెడల యేసుచూపిన ప్రేమకుకూడ గురుతైయున్నది.—మత్తయి 20:28.
యేసు విమోచన క్రయధన బలి ఆధారముగా దేవుడనుగ్రహించిన రెండు నిరీక్షణలకు ద్వారము తెరచుటయందు దైవికప్రేమ ప్రదర్శింపబడెను. (1 యోహాను 2:1, 2) మానవునిగా యేసు మరణించక మునుపు, దైవిక గుర్తింపుగల వారికి కేవలము భూపరదైసులో జీవించు నిరీక్షణమాత్రమే ఉండెను. (లూకా 23:43) అయితే సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, యెహోవా ఒక “చిన్నమందకు” పరలోక నిరీక్షణను దయచేసెను. (లూకా 12:32) అయితే ఇటీవలి కాలములలో ఏమి సంభవించెను? 1931 నుండి రాజ్యవర్తమానము ఎక్కువగా “వేరేగొర్రెలపై” కేంద్రీకరించబడెను, మరియు 1935 నుండి క్రీస్తుద్వారా దేవుడు తనకొరకు “ఒక గొప్ప సమూహమును” చేరదీయుచున్నాడు. (యోహాను 10:16; ప్రకటన 7:9) వారి హృదయములలో దేవుడు పరదైసు భూమిపై నిత్యము జీవించు నిరీక్షణను ఉంచెను. సంపూర్ణ ఆహారమును భుజించవలెనని, జంతువులపై ప్రేమపూర్వక అధికారము చేయవలెనని, నిత్యము నీతిమంతులైన తోటి మానవుల సహవాసమును అనుభవించవలెనని వారు ఇచ్ఛయించుదురు.
కరుణగల యాజకులు మరియు రాజులు
విమోచన క్రయధనముగా తన జీవితము నర్పించుటకు ప్రేమ యేసును పురికొల్పినందున, ఆయన నిశ్చయముగా కరుణగల పరలోకపు రాజుగా ఉండును. అయినను, తన వెయ్యేండ్ల పరిపాలనలో మానవజాతిని పరిపూర్ణతకు ఉద్ధరించుటలో యేసు ఒక్కడే ఉండడు. పరలోకములో కరుణగల ఇతర రాజుల కొరకును యెహోవా ఏర్పాటుచేసెను. అవును, “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:1-6.
క్రీస్తుతో ఎంతమంది సహపాలకులు ఉందురు, మరియు వారు అటువంటి మహాద్భుతమైన ఆధిక్యతకు ఎట్లు ఎంపిక చేయబడుదురు? పరలోక సియోను పర్వతముపై గొర్రెపిల్లయగు యేసుక్రీస్తుతో, 1,44,000 మందిని అపొస్తలుడైన యోహాను చూసెను. “భూలోకమునుండి కొనబడిన” వారిగా, వారికి పరీక్షలను అనుభవించుట, అసంపూర్ణతయొక్క బరువులను సహించుట, బాధపడుట మరియు మానవులుగా చనిపోవుట అనగా ఏమిటో తెలియును. (ప్రకటన 14:1-5; యోబు 14:1) అందుచేత, వారెంత కరుణగల రాజులైన-యాజకులై యుందురు!
ఆత్మయొక్క సాక్ష్యము
ఆ 1,44,000 మంది పరిశుద్ధుడైన యెహోవా “వలన అభిషేకము పొందిన వారు.” (1 యోహాను 2:20) అది పరలోక నిరీక్షణ కొరకు అభిషేకించుటయై యున్నది. దేవుడు ‘వారిపై ముద్రవేసి, వారి హృదయాలపై ఆత్మ అను సంచకరువును అనుగ్రహించెను.’—2 కొరింథీయులు 1:21, 22.
అవును, పరలోక పిలుపుగలవారు ఆమేరకు దేవుని ఆత్మయొక్క సాక్ష్యమును కలిగియుందురు. దీనినిగూర్చి, రోమీయులు 8:15-17 నందు పౌలు ఇలా వ్రాశాడు: “మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము—అబ్బా తండ్రీ అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. (సాక్ష్యమిచ్చుచున్నది NW) మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” దేవుని ఆత్మ, లేక చురుకైన శక్తి మూలముగా, ఆ అభిషక్తులు, “అబ్బా తండ్రీ” అని పిలుతురు.
ఒక వ్యక్తి పరలోక పిలుపును అభిషేకము పొందాడనుటకు పుత్రత్వమును గూర్చిన ఆత్మ, లేక ప్రబలమైన భావము ముఖ్య రుజువైయుండును. (గలతీయులు 4:6, 7) అటువంటి వ్యక్తి పరలోక రాజ్య తోటివారసులైన 1,44,000 మందిలో ఒకనిగా దేవుడు తనను ఆత్మీయ పుత్రునిగా కనెనని సంపూర్ణ నిశ్చయత కలిగియుండును. తన పరలోక నిరీక్షణ స్వంతగా తాను కలుగజేసుకొనిన కోరిక లేక ఊహకాదని, అయితే దేవుని ఆత్మ తనయెడల జరిగించిన చర్య ఫలితముగా అది యెహోవా నుండి కలిగెనని అతడు సాక్ష్యమివ్వగలడు.—1 పేతురు 1:3, 4.
దేవుని పరిశుద్ధాత్మ ప్రభావము క్రింద, అభిషక్తుల ఆత్మ, లేక ప్రగాఢ దృక్పధము ఒక ప్రేరేపించు శక్తిగా పనిచేయును. పరలోక నిరీక్షణను గూర్చి దేవుని వాక్యము చెప్పుచున్నదానికి క్రియాత్మకముగా ప్రతిస్పందించుటకు అది వారిని కదిలించును. పరిశుద్ధాత్మ మూలముగా యెహోవా తమతో వ్యవహరించు దానికి కూడ వారు క్రియాత్మకముగా ప్రతిస్పందింతురు. ఆ విధముగా, వారు తాము దేవుని ఆత్మీయ పిల్లలమని, వారసులమని నిశ్చయత కలిగియుందురు.
ఆయన ఆత్మీయ పిల్లలనుగూర్చి, పరలోక నిరీక్షణనుగూర్చి అభిషక్తులైన వారు దేవుని వాక్యమందు చదువునప్పుడు, వారి స్వాభావిక ఇచ్ఛ దానంతటదే వెంటనే వారి అంతరంగమందు: ‘ఇది నేనే అని చెప్తుంది!’ అవును, తమ తండ్రి వాక్యము పరలోక బహుమానమును గూర్చి వాగ్దానము చేసినప్పుడు వారు ఆనందముతో ప్రతిస్పందింతురు. “ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము” అని వారు చదివినప్పుడు, ‘ఆ పిల్లలము మేమే’ అని వారనుకొందురు. (1 యోహాను 3:2) “తాను సృష్టించిన వాటిలో . . . ప్రథమ ఫలముగా ఉండునట్లు” ప్రజలను దేవుడు తెచ్చెనని అభిషక్తులైన వారు చదివినప్పుడు, ‘అవును, ఆయన ఆ సంకల్పము కొరకు నన్ను తెచ్చెను’ అని ప్రత్యుత్తరమిచ్చునట్లు వారి మనోవైఖరి ఉండును. (యాకోబు 1:18) తాము “క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మమును” మరియు ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని వారికి తెలియును. (రోమీయులు 6:3) కావున వారు క్రీస్తు ఆత్మీయ శరీరములో భాగమైయున్న విషయమై స్థిర నిశ్చయతను కలిగియుండి, ఆయన మరణమును పోలిన మరణము ననుభవించి పరలోక జీవమునకు పునరుత్థానము చేయబడుదుమను నిరీక్షణను కలిగియుందురు.
పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు, అభిషక్తులైన వారు ‘తమ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు తాము చేయగలిగినదంతా చేయవలెను.’ (2 పేతురు 1:5-11) భూలోక నిరీక్షణగలవారి వలెనే, వారును విశ్వాసము ద్వారా నడుచుకొనుచు ఎడతెగక ఆత్మీయముగా అభివృద్ధి చెందుదురు. కావున, ఆత్మయొక్క సాక్ష్యమందు ఇంకా ఏమికలదు?
వారెందుకు భాగము వహింతురు
ప్రస్తుత భూజీవితము మీద అసంతృప్తి చెందినందున అభిషక్తులైన క్రైస్తవులు పరలోకమునకు వెళ్లవలెనని కోరుకొనరు. (యూదా 3, 4, 16 పోల్చుము.) బదులుగా, వారు దేవుని పిల్లలని పరిశుద్ధాత్మ వారి ఆత్మతో సాక్ష్యమిచ్చును. అంతేకాకుండా తాము క్రొత్త నిబంధనలోనికి తీసికొనబడితిమను విషయమై వారు నిశ్చయత కలిగియుందురు. ఈ నిబంధనకు వచ్చిన ఇరువర్గముల (పార్టీల) వారెవరనగా యెహోవా దేవుడు మరియు ఆత్మీయ ఇశ్రాయేలు. (యిర్మీయా 31:31-34; గలతీయులు 6:15, 16; హెబ్రీయులు 12:22-24) ఈ నిబంధన, యేసు చిందించిన రక్తముద్వారా ప్రయోగమునకు తీసుకురాబడి, అది యెహోవా నామము కొరకు ప్రజలను ఏర్పాటుచేసి అభిషక్త క్రైస్తవులైన వారిని అబ్రాహాము “సంతానములో” భాగముగా తయారుచేయును. (గలతీయులు 3:26-29; అపొ. కార్యములు 15:14) ఆత్మీయ ఇశ్రాయేలీయులందరు పరలోకమందలి అమర్త్యమైన జీవమునకు పునరుత్థానము చేయబడు పర్యంతము ఆ క్రొత్త నిబంధన ప్రయోగమందుండును.
అంతేకాకుండా, నిజముగా పరలోక పిలుపుగలవారు నిస్సందేహముగా పరలోకరాజ్య నిబంధనలో కూడ ఉందురు. తనకు తన అనుచరులకు మధ్యనుండు ఈ నిబంధనను సూచించుచు యేసు ఇట్లనెను: “నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:28-30) సా.శ. 33 పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి యేసు శిష్యులు అభిషేకించబడుట ద్వారా ఈ నిబంధన వారియెడల ప్రారంభించబడెను. క్రీస్తు మరియు ఆయన తోటి రాజుల మధ్య ప్రయోగాత్మకముగా అది నిరంతరము నిలిచియుండును.—ప్రకటన 22:5.
పరలోక పిలుపుగల వారు తాము క్రొత్త నిబంధనలోను, రాజ్య నిబంధనలోను ఉన్నామని రూఢిగా నమ్ముదురు. కావున, ప్రభురాత్రి భోజనము, లేక యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ వార్షిక ఆచరణలోని సూచనార్థక రొట్టె మరియు ద్రాక్షారసములో సరియైన రీతిలో వారు భాగము వహింతురు. పులియని రొట్టె యేసుయొక్క పాపరహిత శరీరమునకు, ద్రాక్షారసము ఆ క్రొత్త నిబంధనను ప్రామాణికము చేయుటకు మరణమందు ధారపోసిన ఆయన పరిపూర్ణ రక్తమునకు సూచనగా యున్నవి.—1 కొరింథీయులు 11:23-26.
పరలోక జీవపు నిరీక్షణను రూఢిగా యెహోవా నీలో కలుగజేసినట్లయిన, దానిని నీవు నమ్ముదువు. ఆ నిరీక్షణను వ్యక్తపరచుచు నీవు ప్రార్థన చేయుదువు. అది నీలో లీనమైపోవును, మరియు నీవు దానిని నీ అంతర్భాగమునుండి తీసివేసికొనలేవు. నీవు దహించివేయు ఆత్మీయ ఆకాంక్షలను కలిగియుందువు. అయితే నీవు విభాగింపబడిన మరియు అనిశ్చయతగల వాడవైనట్లయిన, ప్రభురాత్రి భోజన చిహ్నములలో నిశ్చయముగా నీవు భాగము వహించకూడదు.
తప్పిదమైన ఊహలు ఎందుకు?
కొందరు జ్ఞాపకార్థ చిహ్నములలో తప్పిదముగా భాగము వహించవచ్చును, ఎందుకంటే అభిషేకించబడుట, “పొందగోరువాని వలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదుగాని, . . . దేవునివలననే” అని వారు నిజముగా గుర్తించరు. (రోమీయులు 9:16) క్రొత్త నిబంధనలోనికి తాను తీసికొనబడవలెనని మరియు పరలోక రాజ్యములో క్రీస్తు వారసునిగా తయారుకావలెనని అతను లేక ఆమె కోరుచున్నదని తీర్మానించుట ఆయావ్యక్తులు చేయవలసినది కాదు. యెహోవాయొక్క ఎంపికయే లెక్కించబడును. ప్రాచీన ఇశ్రాయేలునందు, తన యాజకులుగా ఉండవలసిన వారిని దేవుడే ఎంపిక చేసికొనెను, మరియు అహరోను కుటుంబమునకు దైవికముగా ఏర్పాటుచేయబడిన యాజకత్వమును అహంకారముతో వెదకినందున ఆయన కోరహును సంహరించెను. (నిర్గమకాండము 28:1; సంఖ్యాకాండము 16:4-11, 31-35; 2 దినవృత్తాంతములు 26:18; హెబ్రీయులు 5:4, 5) అదేప్రకారము, దేవుడు అతనికి అలాంటి పిలుపునివ్వనప్పుడు ఒకవ్యక్తి తనకుతాను పరలోక రాజులు మరియు యాజకులలో ఉండుటకు పిలువబడినవానిగా వ్యక్తపరచుకున్నట్లయిన అది యెహోవాను అసంతోషపర్చును.—1 తిమోతి 5:24, 25 పోల్చుము.
తీవ్రమైన సమస్యల ఫలితముగా ఉత్పన్నమయిన బలమైన భావోద్రేకము కారణముగా తనకు పరలోక పిలుపు కలదని ఒకవ్యక్తి తప్పుగా భావించవచ్చును. జతలోని ఒకరి మరణము లేక మరొక దుఃఖకర సంఘటన భూమిమీది జీవితముపై ఒకవ్యక్తికి విరక్తి కల్గించవచ్చును. లేక ఒక సన్నిహిత సహచరుడు తాను అభిషక్తుడనని చెప్పవచ్చును, కావున ఆ వ్యక్తి తనకుకూడ అదే సంభవించవలెనని కోరవచ్చును. అటువంటి విషయములు పరలోక జీవితము అతని కొరకని అతని భావింపజేయవచ్చును. అయితే ఇది ఎవరికైనను ఆత్మీయ పుత్రత్వమును ఇచ్చు దేవుని విధానము కాదు. భూజీవితమునకు సంబంధించి కోరదగని పరిస్థితులు లేక భావోద్రేక నిస్పృహ కారణముగా పరలోకమునకు వెళ్లవలెనని ఒకవ్యక్తి కోరినట్లయిన అది భూమి సంబంధముగా దేవుని సంకల్పముల యెడల కృతజ్ఞత చూపించక పోవుటను సూచించును.
గతమందలి మత ఉద్దేశ్యములు కూడ ఒకవ్యక్తి తనకు పరలోకపు పిలుపు కలదని తప్పుగా తీర్మానించుకొనుటకు కారణము కావచ్చును. విశ్వాసులకు పరలోక జీవితమే నిరీక్షణని చెప్పిన అబద్ధ మతముతో బహుశ అతడు ఒకప్పుడు సహవసించి యుండవచ్చును. కావున, ఒక క్రైస్తవుడు భావోద్రేకము మరియు గతమందలి తప్పుడు ఉద్దేశ్యములతో ఊగిసలాడకుండా ఉండుటకు జాగ్రత్తపడవలెను.
జాగ్రత్తగా పరీక్షించుకొనుట ఆవశ్యకము
అతి ప్రాముఖ్యమైన ఒక అంశమును తెల్పుచు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.” (1 కొరింథీయులు 11:27-29) కావున, ఇటీవలి సంవత్సరములలో తనకు పరలోకపు పిలుపు వచ్చినదని తలంచుట కారంభించిన బాప్తిస్మము పొందిన క్రైస్తవుడు విషయమును బహు జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకముగా ఆలోచించవలెను.
అటువంటి వ్యక్తి తననుతాను ఇట్లుకూడ ప్రశ్నించుకోవచ్చును: ‘పరలోక జీవిత తలంపును కలిగియుండుటకు నాపై ఇతరులు ప్రభావము చూపారా?’ ఇది సరియైన విషయము కాదు, ఏలయనగా అటువంటి ఆధిక్యత కొరకు ఇతరులను ఎన్నుకొనుటకు దేవుడు ఎవరికిని పని అప్పగించలేదు. స్వైరకల్పనా భావము దేవుడు అభిషేకించాడనుటకు ఎంతమాత్రము ఒక సూచన కాదు, మరియు వర్తమానములతో స్వరములు వినులాగున చేయుచు ఆయన రాజ్య వారసులను అభిషేకించడు.
కొందరు తమనుతాము ఇట్లు అడుగుకొనవచ్చును: ‘క్రైస్తవునిగా కాక పూర్వము, నేను మాదకద్రవ్యముల ఉపయోగమందు మునిగియుంటినా? భావోద్రేకములపై ప్రభావముచూపు మందులను నేను ఉపయోగించుచున్నానా? మానసిక, భావోద్రేక సమస్యల కొరకు నేను చికిత్స పొందితినా?’ పరలోక నిరీక్షణయని తాము నమ్మినదానికి వ్యతిరేకముగా తాము మొదట పోరాడామని కొందరు చెప్పిరి. కొంతకాలము దేవుడు తమ భూనిరీక్షణను తీసివేసి చివరకు తమకు పరలోక నిరీక్షణ ఇచ్చాడని మరికొందరు చెప్పిరి. అయితే అటువంటి విధానము దైవిక వ్యవహారములకు భిన్నమై యున్నది. అంతేకాకుండా, విశ్వాసము అనిశ్చయము కాదు; నిశ్చయము.—హెబ్రీయులు 11:6.
ఒకవ్యక్తి ఇంకను తననుతాను ఇట్లు ప్రశ్నించుకోవచ్చును: ‘నేను ప్రధానత్వము కోరుచున్నానా? ఇప్పుడు లేక క్రీస్తుతో ఉండు తోటిరాజులు మరియు యాజకులలో ఒకనిగా అధికార స్థానము కొరకు నేను అత్యాశ కలిగియున్నానా?’ సా.శ. మొదటి శతాబ్దములో, పరలోక రాజ్యములో ప్రవేశించ వెదకమని సాధారణ ఆహ్వానము ఇవ్వబడినప్పుడు, అభిషక్తులైన క్రైస్తవులందరు నిర్వాహక సభ సభ్యులుగా లేక పెద్దలుగా లేక పరిచారకులుగా బాధ్యతా స్థానములు వహించలేదు. అనేకులు స్త్రీలైయుండిరి, మరియు వారికి ఏ ప్రత్యేక అధికారము లేకుండెను; ఆలాగే ఆత్మచే అభిషేకించబడుట వారు దేవుని వాక్యమును అసాధారణముగా అర్థము చేసికొనునట్లు చేయలేదు, ఏలయనగా కొంతమంది అభిషక్తులకు ఉపదేశించి సలహానిచ్చు అవసరతను పౌలు కనుగొనెను. (1 కొరింథీయులు 3:1-3; హెబ్రీయులు 5:11-14) పరలోక పిలుపు గలవారు తమను ప్రాముఖ్యమైన వ్యక్తులుగా దృష్టించుకోరు, మరియు తాము అభిషేకించబడిన వారమను విషయముపై దృష్టి నాకర్షింపజేయరు. బదులుగా, వారు సరియైన రీతిలో “క్రీస్తు మనస్సు” గల వారినుండి అపేక్షించగల వినయమును ప్రదర్శింతురు. (1 కొరింథీయులు 2:16) తమ నిరీక్షణ పరలోక సంబంధమైనను లేక భూ సంబంధమైనను, క్రైస్తవులందరు దేవుని నీతియుక్త కట్టడలను అనుసరించవలెనను విషయమును కూడా గుర్తింతురు.
పరలోక పిలుపు కలదని చెప్పుకొనుట ఒక వ్యక్తికి ప్రత్యేక దివ్యవార్తలను ఏమి తీసికొనిరాదు. సంబంధ వ్యవహారములకు దేవుడొక మార్గమును కలిగియున్నాడు, దానిద్వారా ఆయన తన భూసంబంధమైన సంస్థకు ఆత్మీయాహారమును దయచేయుచున్నాడు. (మత్తయి 24:45-47) కాబట్టి అభిషక్త క్రైస్తవునిగా ఉండుట భూసంబంధమైన నిరీక్షణగల “గొప్ప సమూహము” వారికంటే ఎక్కువ జ్ఞానమునిచ్చునని ఎవరును తలంచకూడదు. (ప్రకటన 7:9) సాక్ష్యమిచ్చుటలో, లేఖన సంబంధ ప్రశ్నలకు జవాబిచ్చుట, లేక బైబిలు ప్రసంగముల నిచ్చుటలో ప్రావీణ్యము చూపుట ద్వారా ఆత్మచే అభిషేకించబడుట సూచింపబడదు, ఎందుకనగా భూసంబంధమైన నిరీక్షణగల క్రైస్తవులు సహితము ఈ విషయములను బహుచక్కగా చేయుదురు. అభిషక్తులవలెనే, వారుకూడ మాదిరికరమైన క్రైస్తవ జీవితములు జీవించెదరు. ఆ విషయానికొస్తే, సమ్సోను, క్రైస్తవ కాలములకు ముందున్న ఇతరులు దేవుని ఆత్మను కలిగియుండి ఆసక్తితో అవగాహనతో నింపబడిరి. అయినను, ‘మహా మేఘమువంటి ఆ సాక్షిసమూహములో’ ఎవరును పరలోక నిరీక్షణ కలిగిలేకుండిరి.—హెబ్రీయులు 11:32-38; 12:1; నిర్గమకాండము 35:30, 31; న్యాయాధిపతులు 14:6, 19; 1 సమూయేలు 16:13; యెహెజ్కేలు 2:2.
ఎవరు ఎంపికచేయుదురో గుర్తుంచుకొనుము
తోటి విశ్వాసి ఎవరైన పరలోక పిలుపునుగూర్చి అడిగినట్లయిన, నియమించబడిన పెద్ద లేక పరిపక్వతగల క్రైస్తవుడు ఒకరు అతనితో విషయమును చర్చించవచ్చును. అయితే ఒకవ్యక్తి మరొకరి కొరకు ఈ నిర్ణయము చేయలేడు, ఎందుకంటే పరలోక నిరీక్షణను ఇచ్చునది యెహోవాయే. నిజముగా పరలోక పిలుపుగల వ్యక్తి తనకు అటువంటి నిరీక్షణ ఉన్నదాయని తోటి విశ్వాసులను ఎన్నడు అడుగు అవసరముండదు. అభిషక్తులైన వారు “క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు.” (1 పేతురు 1:23) పరలోక నిరీక్షణతో, ఆ వ్యక్తిని “ఒక నూతన సృష్టిగా” తయారుచేయు “బీజమును” దేవుడు తన ఆత్మ మరియు వాక్యము ద్వారా అతనిలో నాటును. (2 కొరింథీయులు 5:17) అవును, యెహోవా దేవుడే ఎంపిక చేయును.
కావున, క్రొత్తవారితో బైబిలు పఠించునప్పుడు, వారు పరలోక నిరీక్షణ కలిగియున్నారాయని నిర్ణయించుకొనుటకు ప్రయత్నించుమని సూచించుట మంచిది కాదు. అయితే అభిషక్తుడైన క్రైస్తవుడెవరైనా విశ్వాసము కోల్పోయినట్లు రుజువయినట్లయిన, అతని స్థానములో మరొకరినుంచు అవసరము ఉండదా? అప్పుడు అనేక సంవత్సరములుగా మన పరలోకపు తండ్రికి నమ్మకముగా సేవచేయుచున్న మాదిరికరమైన వ్యక్తికెవరికైనా దేవుడు పరలోకపు పిలుపునిచ్చునని తీర్మానించిచెప్పుట సహేతుకముగా ఉండును.
క్రీస్తు పరలోక పెండ్లికుమార్తె సభ్యులుగా తయారుకమ్మని ప్రజలకు చెప్పుట, ఈనాడు, దేవుని సమాచార ముఖ్యోద్దేశము కాదు. బదులుగా, “ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు.” భూపరదైసులో జీవితమునకు ఇదియొక ఆహ్వానమై యున్నది. (ప్రకటన 22:2, 17) ఈ కార్యమందు అభిషక్తులు నాయకత్వము వహించుచునే, “వినయమును” (మానసిక దీనత్వమును NW) ప్రదర్శింతురు మరియు ‘తమ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు’ పనిచేయుదురు. (w91 3/15)