కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 జనవరి పేజీలు 12-16
  • స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా, యేసు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
  • స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు
  • స్వేచ్ఛాచిత్తాన్ని సరైన విధంగా ఉపయోగించండి
  • ఇతరుల స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవించండి
  • నిజమైన స్వేచ్ఛకు మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • స్వతంత్రులేగాని జవాబుదారులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • స్వేచ్ఛాచిత్తమనే అద్భుత వరం
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 జనవరి పేజీలు 12-16
ఊరు పట్టణాన్ని విడిచి వెళ్తున్న అబ్రాహాము, శారా, ఇతరులు

స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి

“యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.” —2 కొరిం. 3:17.

పాటలు: 40, 54

మీరెలా జవాబిస్తారు?

  • స్వేచ్ఛాచిత్తం అంటే ఏమిటి?

  • మనం యెహోవాను ఎంత ప్రేమిస్తున్నామో మన నిర్ణయాల ద్వారా ఎలా చూపించవచ్చు?

  • ఇతరుల నిర్ణయాల్ని మనమెలా గౌరవించవచ్చు?

1, 2. (ఎ) స్వేచ్ఛాచిత్తం గురించి కొంతమంది అభిప్రాయమేంటి? (బి) స్వేచ్ఛాచిత్తం గురించి బైబిలు ఏమి చెప్తోంది? ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

ఒక స్త్రీ సొంతగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఆమె తన స్నేహితురాలితో ఇలా అంది, “నాకు ఆలోచించే పని పెట్టకు. నేనేమి చేయాలో చెప్పు చాలు. అదే తేలిక.” ఆ స్త్రీ, సృష్టికర్త తనకిచ్చిన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించే బదులు తను ఏ నిర్ణయం తీసుకోవాలో ఇతరులు చెప్పాలనుకుంది. మరి మీ విషయమేమిటి? నిర్ణయాలు సొంతగా తీసుకుంటారా? లేక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఇతరులు చెప్పాలని అనుకుంటారా? స్వేచ్ఛాచిత్తం పై మీ అభిప్రాయమేంటి?

2 స్వేచ్ఛాచిత్తం గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అసలు స్వేచ్ఛాచిత్తమే లేదని, మనమేమి చేయాలో దేవుడు ముందే నిర్ణయించేశాడని అంటారు. మరికొంతమంది, మనకు ఎలాంటి హద్దులు లేనప్పుడే స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించుకోవడం వీలౌతుందని అంటారు. ఏదేమైనా దేవుడు మనుషులందర్నీ సొంతగా తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యంతో, స్వేచ్ఛతో సృష్టించాడని బైబిలు చెప్తోంది.(యెహోషువ 24:15 చదవండి.) మరి, మన స్వేచ్ఛాచిత్తానికి ఏవైనా హద్దులు ఉన్నాయా? నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మనమెలా ఉపయోగించాలి? మనం తీసుకునే నిర్ణయాలు యెహోవాపై మనకున్న ప్రేమను ఎలా చూపిస్తాయి? ఇతరుల నిర్ణయాల్ని గౌరవిస్తున్నామని మనమెలా చూపించవచ్చు? వంటి ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబుల్ని కూడా ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

యెహోవా, యేసు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3. యెహోవా తనకున్న స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తాడు?

3 పూర్తి స్వేచ్ఛ యెహోవాకు మాత్రమే ఉంది. అయితే ఆయన దాన్ని ఉపయోగించుకునే విధానం నుండి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజలుగా, అంటే “స్వకీయజనముగా” ఉండేందుకు ఎంచుకున్నాడు. (ద్వితీ. 7:6-8) ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే, ఆయన తన స్నేహితుడైన అబ్రాహాముకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకున్నాడు. (ఆది. 22:15-18) అంతేకాదు యెహోవా తన స్వేచ్ఛను ఉపయోగించేటప్పుడు ఎల్లప్పుడూ ప్రేమగా, న్యాయంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు తన మాట విననప్పుడు ఆయన వాళ్లను సరిదిద్దిన విధానంలో అది మనకు కనిపిస్తుంది. తాము చేసిన వాటికి ఇశ్రాయేలీయులు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు ఆయన వాళ్లపై ప్రేమ, కనికరం చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నేను వాళ్లని క్షమిస్తాను. వాళ్లను ధారాళంగా ప్రేమిస్తాను.’ (హోషే. 14:4, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యెహోవా తన స్వేచ్ఛను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించడం ద్వారా మనకు మంచి ఆదర్శాన్ని ఉంచాడు.

4, 5. (ఎ) దేవుడు స్వేచ్ఛాచిత్తాన్ని మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? ఆయన దాన్నెలా ఉపయోగించాడు? (బి) మనందరం ఏ ప్రశ్న గురించి ఆలోచించాలి?

4 యెహోవా దూతల్ని, మనుష్యుల్ని సృష్టించి వాళ్లకు స్వేచ్ఛాచిత్తం ఇచ్చాడు. యెహోవా చేసిన మొదటి సృష్టి యేసు. ఆయన యేసును తన స్వరూపంలో చేశాడు, స్వేచ్ఛాచిత్తం ఇచ్చాడు. (కొలొ. 1:15) మరి యేసు దాన్నెలా ఉపయోగించాడు? యేసు భూమ్మీదకు రాకముందు, దేవునికి నమ్మకంగా ఉండాలని, సాతాను చేస్తున్న తిరుగుబాటులో పాలుపంచుకోకూడదని నిర్ణయించుకున్నాడు. భూమ్మీదకు వచ్చాక, సాతాను శోధనల్ని ఎదిరించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. (మత్త. 4:10) ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి చేసిన ప్రార్థనలో, తన తండ్రి చిత్తం చేయడమే తనకు అన్నిటికన్నా ప్రాముఖ్యమనే ధృడనిశ్చయం కనిపిస్తుంది. యేసు ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.” (లూకా 22:42) యేసును అనుకరించడం మనకు సాధ్యమౌతుందా? మన స్వేచ్ఛాచిత్తాన్ని యెహోవాను ఘనపర్చడానికి, ఆయన చిత్తం చేయడానికి ఉపయోగించగలమా?

5 మనం యేసును అనుకరించగలం. ఎందుకంటే మనల్ని కూడా దేవుడు తన స్వరూపంలోనే సృష్టించాడు. (ఆది. 1:26) కానీ యెహోవాకు ఉన్నంత పూర్తి స్వేచ్ఛ మనకు లేదు. స్వేచ్ఛ ఇచ్చే విషయంలో యెహోవా మనకు కొన్ని హద్దులు పెట్టాడని, మనం వాటిని పాటించాలని ఆయన కోరుకుంటున్నాడని దేవుని వాక్యం వివరిస్తోంది. ఉదాహరణకు కుటుంబంలో భార్య భర్తకు లోబడివుండాలి, పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడివుండాలి. (ఎఫె. 5:22; 6:1) ఇలాంటి హద్దులు మనం స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించే విధానంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఈ జవాబు మీదే మన శాశ్వత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు

6. మన స్వేచ్ఛకు హద్దులు ఉండడం ఎందుకు ముఖ్యమో తెలియజేసే ఓ ఉదాహరణ చెప్పండి.

6 స్వేచ్ఛాచిత్తం ఇచ్చి హద్దులుపెట్టడం నిజమైన స్వేచ్ఛ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే హద్దులు మనల్ని సంరక్షిస్తాయి. ఉదాహరణకు మనం ఓ దూరప్రాంతానికి వెళ్లాలని ప్రయాణం మొదలుపెట్టాం అనుకుందాం. ఒకవేళ ట్రాఫిక్‌ రూల్స్‌ లేకుండా, ప్రతీఒక్కరు ఎంత స్పీడ్‌లో కావాలంటే అంత స్పీడ్‌లో, రోడ్డుకు ఏ వైపు కావాలంటే ఆ వైపున తమ వాహనాలను నడుపుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి రోడ్డుపై ప్రయాణించడం సురక్షితమేనా? ఖచ్చితంగా కాదు. ప్రతీఒక్కరు నిజమైన స్వేచ్ఛ వల్ల కలిగే ప్రయోజనాల్ని ఆనందించాలంటే హద్దులు ఉండాలి. దేవుడు పెట్టిన హద్దులు మనకెలా ప్రయోజనకరమో తెలియజేసే కొన్ని ఉదాహరణల్ని బైబిల్లో పరిశీలిద్దాం.

7. (ఎ) ఆదాముకు, జంతువులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? (బి) ఆదాము తన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించిన ఓ విధానం ఏమిటి?

7 యెహోవా మొదటి మానవుడైన ఆదామును సృష్టించినప్పుడు, దేవదూతలకు ఇచ్చినట్లుగానే అతనికి కూడా స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని ఇచ్చాడు. కానీ ఆయన జంతువులకు ఆ బహుమానాన్ని ఇవ్వలేదు. ఆదాము తన స్వేచ్ఛాచిత్తాన్ని మంచి కోసం ఎలా ఉపయోగించాడు? జంతువులన్నిటికీ పేర్లు పెట్టే అవకాశాన్ని యెహోవా ఆదాముకు ఇచ్చాడు. ‘ఆదాము వాటికి ఏ పేరు పెడతాడో చూడడానికి అతని దగ్గరకు వాటిని రప్పించాడు.’ ఆదాము ప్రతీ జంతువును జాగ్రత్తగా గమనించి వాటికి సరిగ్గా సరిపోయే పేర్లను పెట్టాడు. ఆదాము పెట్టిన ఏ పేరును యెహోవా మార్చలేదు. బదులుగా ‘జీవముగల ప్రతీదానికి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు దానికి కలిగింది.’—ఆది. 2:19.

8. ఆదాము తన స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా పాడుచేసుకున్నాడు? దానివల్ల ఏమైంది?

8 భూమిని అందమైన తోటగా మార్చే బాధ్యతను యెహోవా ఆదాముకు అప్పగించాడు. ఆయన ఆదాముతో ఇలా అన్నాడు, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి.” (ఆది. 1:28) కానీ ఆదాము, దేవుడు వద్దని చెప్పిన పండును తినాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని తినడం ద్వారా యెహోవా పెట్టిన హద్దుల్ని అతను మీరాడు. ఆదాము తన స్వేచ్ఛాచిత్తాన్ని సరిగ్గా ఉపయోగించక పోవడంవల్లే మనుషులందరూ వేల సంవత్సరాలుగా బాధలుపడుతున్నారు. (రోమా. 5:12) ఆదాము తీసుకున్న నిర్ణయం వల్ల కలిగిన ఘోరమైన పర్యవసానాల్ని గుర్తుపెట్టుకుందాం. మన స్వేచ్ఛాచిత్తాన్ని సరిగ్గా ఉపయోగించడానికి, యెహోవా పెట్టిన హద్దుల్ని మీరకుండా ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది.

9. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఏ అవకాశం ఇచ్చాడు? వాళ్లు ఏమని మాటిచ్చారు?

9 మనందరం ఆదాముహవ్వల నుండి అపరిపూర్ణతను, మరణాన్ని వారసత్వంగా పొందాం. అయినప్పటికీ స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని ఉపయోగించే హక్కు అందరికీ ఉంది. దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించిన విధానంలో అది మనకు తెలుస్తుంది. తనకు ప్రత్యేక సొత్తుగా ఉండే అవకాశాన్ని ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. (నిర్గ. 19:3-6) వాళ్లు దేవుని ప్రజలుగా ఉండాలని నిర్ణయించుకుని, ఆయన పెట్టిన హద్దులకు లోబడతామని మాటిచ్చారు. వాళ్లిలా చెప్పారు, ‘యెహోవా చెప్పినదంతా చేస్తాము.’ (నిర్గ. 19:8) కానీ కొంతకాలం తర్వాత, వాళ్లు యెహోవాకు ఇచ్చిన మాటను తప్పారు. వాళ్లనుండి మనం ఓ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని మనం ఎల్లప్పుడూ విలువైనదిగా ఎంచుదాం. యెహోవాకు దగ్గరగా ఉంటూ ఆయన నియమాలకు లోబడదాం.—1 కొరిం. 10:11.

10. అపరిపూర్ణ మానవులు తమ స్వేచ్ఛాచిత్తాన్ని దేవున్ని ఘనపర్చడానికి ఉపయోగించగలరని హెబ్రీయులు 11వ అధ్యాయంలోని ఏ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

10 యెహోవా ఏర్పాటు చేసిన హద్దుల్ని గౌరవించాలని నిర్ణయించుకున్న 16 మంది నమ్మకమైన స్త్రీపురుషుల పేర్లు హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉన్నాయి. అలా గౌరవించినందుకు వాళ్లు ఎన్నో దీవెనల్ని, భవిష్యత్తు విషయంలో అద్భుతమైన నిరీక్షణను పొందారు. ఉదాహరణకు నోవహు గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. తన కుటుంబాన్ని, రాబోయే తరాల్ని కాపాడుకునేందుకు ఓడ కట్టుకోమని యెహోవా ఇచ్చిన నిర్దేశాల్ని పాటించాడు. (హెబ్రీ. 11:7) అబ్రాహాము, శారాలు ఇష్టపూర్వకంగా యెహోవాకు లోబడి, వాళ్లకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి వెళ్లారు. ఆ తర్వాత వాళ్లకు ఊరు పట్టణానికి “తిరిగి వెనక్కి వెళ్లిపోయే అవకాశం” ఉన్నప్పటికీ, భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాలపైనే మనసుపెట్టారు. వాళ్లు “అంతకన్నా మెరుగైన స్థలాన్ని” సొంతం చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని బైబిలు చెప్తోంది. (హెబ్రీ. 11:8, 13, 15, 16) మోషే ఐగుప్తు సంపదల్ని కాదనుకున్నాడు. అంతేకాదు “పాపం వల్ల వచ్చే తాత్కాలిక సుఖాల్ని అనుభవించాలనుకోలేదు; దానికి బదులు, దేవుని ప్రజలతో కలిసి హింసలు అనుభవించాలని నిర్ణయించుకున్నాడు.” (హెబ్రీ. 11:24-26) ఆ స్త్రీపురుషుల విశ్వాసాన్ని అనుకరిస్తూ దేవుడిచ్చిన స్వేచ్ఛాచిత్తం పట్ల కృతజ్ఞత కలిగివుందాం. దాన్ని దేవుని చిత్తం చేయడానికి ఉపయోగిద్దాం.

11. (ఎ) స్వేచ్ఛాచిత్తం వల్ల కలిగే ఓ గొప్ప దీవెన ఏమిటి? (బి) స్వేచ్ఛాచిత్తాన్ని సరైన విధంగా ఉపయోగించేలా ఏది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది?

11 మన బదులు ఇంకొకరు నిర్ణయాలు తీసుకుంటే బాగుండనిపించవచ్చు. కానీ దానివల్ల, మనం ఓ గొప్ప దీవెనను ఎప్పటికీ రుచిచూడలేకపోవచ్చు. ఏమిటా దీవెన? అదేమిటో ద్వితీయోపదేశకాండము 30:19, 20 లో ఉంది. (చదవండి.) 19వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులకు తమకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకునే అవకాశమిచ్చినట్లు చదువుతాం. 20వ వచనంలో, వాళ్లు తనను ఎంత ప్రేమిస్తున్నారో చూపించే అవకాశమిచ్చాడని తెలుసుకుంటాం. మనకు కూడా యెహోవాను ఆరాధించాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని యెహోవాను ఘనపర్చడానికి, ఆయన్ను ఎంత ప్రేమిస్తున్నామో చూపించడానికి ఉపయోగించే అద్భుతమైన అవకాశం ఉంది.

స్వేచ్ఛాచిత్తాన్ని సరైన విధంగా ఉపయోగించండి

12. స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని దేనికోసం ఎన్నడూ ఉపయోగించకూడదు?

12 మీరు మీ స్నేహితునికి ఓ విలువైన బహుమానం ఇచ్చారనుకోండి. ఒకవేళ అతను దాన్ని చెత్తబుట్టలో పడేస్తే, లేదా దాన్ని ఇతరుల్ని గాయపర్చడానికి ఉపయోగిస్తే మీకెలా అనిపిస్తుంది? బాధనిపిస్తుంది కదా. అదేవిధంగా యెహోవా మనకు స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని ఇచ్చాడు. ప్రజలు దాన్ని సరిగ్గా ఉపయోగించకుండా చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదా ఇతరులకు హాని చేసినప్పుడు ఆయన బాధపడతాడు. “చివరి రోజుల్లో” ప్రజలు ‘కృతజ్ఞత లేనివాళ్లుగా’ ఉంటారని బైబిలు చెప్పింది. (2 తిమో. 3:1, 2) కాబట్టి యెహోవా ఇచ్చిన విలువైన బహుమానం పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించవచ్చు?

13. క్రైస్తవులుగా మనకున్న స్వేచ్ఛను సరైన విధంగా ఉపయోగించే ఓ మార్గం ఏమిటి?

13 మన స్నేహితుల్ని, మన బట్టల్ని, నచ్చిన వినోదాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనందరికీ ఉంది. అయితే మనం ఆ స్వేచ్ఛను సాకుగా ఉపయోగించుకుని దేవుడు ఇష్టపడని నిర్ణయాల్ని తీసుకునే లేదా లోకంలోని ప్రజలు అనుకరించేవాటి వెంబడి వెళ్లే ప్రమాదం ఉంది. (1 పేతురు 2:16 చదవండి.) మనకున్న స్వేచ్ఛను తప్పు చేయడానికి ఉపయోగించే బదులు “దేవునికి మహిమ తీసుకొచ్చేలా” ఉపయోగించాలి.—1 కొరిం. 10:31; గల. 5:13.

14. స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మనం యెహోవాపై ఎందుకు నమ్మకం ఉంచాలి?

14 యెహోవా ఇలా చెప్పాడు, ‘నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను నువ్వు నడవాల్సిన త్రోవలో నిన్ను నడిపిస్తాను.’ (యెష. 48:17) మనం యెహోవాపై నమ్మకముంచి, మంచి నిర్ణయాలు తీసుకునేలా ఆయన ఏర్పాటు చేసిన హద్దులకు లోబడాలి. అంతేకాదు “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని” మనం వినయంగా ఒప్పుకుంటాం. (యిర్మీ. 10:23) ఆదాము, నమ్మకంగాలేని ఇశ్రాయేలీయులు యెహోవా పెట్టిన హద్దుల్ని కాదని, తమ సొంత జ్ఞానంపై ఆధారపడ్డారు. మనం వాళ్లను చూసి ఓ గుణపాఠం నేర్చుకోవాలి. మన సొంత జ్ఞానంపై ఆధారపడే బదులు ‘పూర్ణహృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచుదాం.’—సామె. 3:5.

ఇతరుల స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవించండి

15. గలతీయులు 6:5 లో ఉన్న సూత్రం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15 ఇతరులకున్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా మనం గౌరవించాలి. ఎందుకు? ఎందుకంటే మనందరికీ స్వేచ్ఛాచిత్తమనే బహుమానం ఉంది కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలాంటి నిర్ణయాలు తీసుకోరు. వాటిలో మన ప్రవర్తనకు, ఆరాధనకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఉన్నాయి. గలతీయులు 6:5 లో ఉన్న సూత్రాన్ని గుర్తుంచుకోండి. (చదవండి.) ఎవరి నిర్ణయాలకు వాళ్లే బాధ్యులని మనం గుర్తించినప్పుడు, స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించడంలో ఇతరులకున్న స్వేచ్ఛను మనం గౌరవిస్తాం.

వైన్‌ తాగనని చెప్తున్న పార్టీకి వచ్చిన ఒక సహోదరుడు

మనం తీసుకున్న నిర్ణయాన్నే ఇతరుల్ని కూడా తీసుకోమని బలవంతపెట్టకూడదు (15వ పేరా చూడండి)

16, 17. (ఎ) స్వేచ్ఛాచిత్తానికి సంబంధించి కొరింథు సంఘంలో ఎలాంటి సమస్య తలెత్తింది? (బి) పౌలు ఆ క్రైస్తవులకు ఎలా సహాయం చేశాడు? దాన్నుండి మనమేమి పాఠం నేర్చుకోవచ్చు?

16 తోటి విశ్వాసుల స్వేచ్ఛాచిత్తాన్ని మనమెందుకు గౌరవించాలో తెలియజేసే ఓ ఉదాహరణను బైబిల్లో గమనిద్దాం. విగ్రహాలకు అర్పించి ఆ తర్వాత సంతల్లో అమ్మే మాంసాన్ని తినవచ్చా, తినకూడదా అనే విషయం గురించి కొరింథు సంఘంలోని క్రైస్తవులు వాదించుకున్నారు. వాళ్లలో కొంతమందికి, విగ్రహంలో ఏమీ లేదని తెలుసు కాబట్టి ఆ మాంసం తినడంలో తప్పేమీ లేదని అనిపించింది. కానీ ఒకప్పుడు ఆ విగ్రహాలను ఆరాధించినవాళ్లకు మాత్రం, ఆ మాంసం తినడమంటే ఒకరకంగా వాటిని ఆరాధించడమేనని అనిపించింది. (1 కొరిం. 8:4, 7) నిజానికి ఈ సమస్య సంఘంలో విభేదాలు సృష్టించగలదు. మరి ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించుకోవడానికి పౌలు ఆ క్రైస్తవులకు ఎలా సహాయం చేశాడు?

17 మొదటిగా, దేవునితో వాళ్లకున్న సంబంధాన్ని ఆహారం బలపర్చదని పౌలు ఆ రెండు గుంపుల వాళ్లకు గుర్తుచేశాడు. (1 కొరిం. 8:8) రెండవదిగా, నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్లకున్న “హక్కు” బలహీనుల మనస్సాక్షిని గాయపర్చడానికి ఉపయోగించవద్దని వాళ్లను హెచ్చరించాడు. (1 కొరిం. 8:9) మూడవదిగా, మాంసం తినాలని నిర్ణయించుకున్న వాళ్లను తీర్పు తీర్చవద్దని సున్నిత మనస్సాక్షిగల వాళ్లతో చెప్పాడు. (1 కొరిం. 10:25, 29, 30) దీనిబట్టి, ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఎవరికివాళ్లు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని మనకు అర్థమౌతోంది. అంతేకాదు చిన్నచిన్న విషయాలకు సంబంధించి కూడా తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మన సహోదరులకు ఉంది. మరి మనం ఆ స్వేచ్ఛను కూడా గౌరవించాలి కదా!—1 కొరిం. 10:32, 33.

18. స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని మీరు విలువైనదిగా ఎంచుతున్నారని ఎలా చూపిస్తారు?

18 మనకు నిజమైన స్వేచ్ఛను తీసుకొచ్చే స్వేచ్ఛాచిత్తాన్ని యెహోవా మనకు బహుమానంగా ఇచ్చాడు. (2 కొరిం. 3:17) మనం యెహోవాను ఎంత ప్రేమిస్తున్నామో చూపించే అవకాశాన్ని ఆ బహుమానం మనకిస్తోంది కాబట్టి దాన్ని విలువైనదిగా ఎంచుతాం. యెహోవాను ఘనపర్చే నిర్ణయాల్ని తీసుకుంటూ ఉందాం. అంతేకాదు ఈ విలువైన బహుమానాన్ని ఉపయోగించడంలో ఇతరులకున్న స్వేచ్ఛను మనం గౌరవిద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి