పాఠకుల ప్రశ్న
“మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు” యెహోవా మీకు రానివ్వడని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరిం. 10:13) అంటే మనం వేటిని తట్టుకోగలమో యెహోవా ముందే అంచనా వేసి, మనం ఏ కష్టాలు అనుభవించాలో నిర్ణయిస్తాడని దానర్థమా?
ఒకవేళ అదే నిజమైతే, అది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. ఉదాహరణకు ఈ అనుభవాన్ని పరిశీలించండి. ఒక సహోదరుని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు ఆ సహోదరుడు, ‘మా కొడుకు చావును నేనూ, నా భార్య తట్టుకోగలమని యెహోవా ముందే అంచనా వేశాడా? అలా తట్టుకోగలమని ఆయన అనుకున్నాడు కాబట్టే ఈ సంఘటన జరిగిందా?’ అని అడిగాడు. ప్రస్తుత లోకంలో మనందరి జీవితాల్లో ఏదోక విషాదం జరుగుతుంటుంది. అయితే మన జీవితంలో ఏమి జరిగినా దానికి యెహోవాయే కారణమని అనుకోవాలా?
1 కొరింథీయులు 10:13 వచనంలోని మాటల్ని లోతుగా పరిశీలిస్తే, మనం వేటిని తట్టుకోగలమో యెహోవాకు ముందే తెలుసనీ, దాన్నిబట్టే మనం ఏ కష్టాలు అనుభవించాలో ఆయన నిర్ణయిస్తాడనీ బైబిలు చెప్పట్లేదని అర్థంచేసుకుంటాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? దానికిగల నాలుగు కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
మొదటిగా, యెహోవా మనకు స్వేచ్ఛా చిత్తాన్ని అంటే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (ద్వితీ. 30:19, 20; యెహో. 24:15) అయితే మనం యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు, నిర్దేశం కోసం ఆయన వైపు చూడవచ్చు. (సామె. 16:9) కానీ మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వాటివల్ల వచ్చే పర్యవసానాల్ని అనుభవించాల్సి ఉంటుంది. (గల. 6:7) కాబట్టి మనం ఏ కష్టాలు అనుభవించాలో యెహోవా ముందే నిర్ణయిస్తే, మనకు నిజంగా స్వేచ్ఛా చిత్తం ఉన్నట్టేనా?
రెండవదిగా, అనుకోకుండా జరిగే సంఘటనల నుండి యెహోవా మనల్ని కాపాడడు. (ప్రసం. 9:11) ప్రమాదం జరుగుతుందని తెలియక ఆ సమయంలో ఆ చోట ఉండడం వల్ల ఒక వ్యక్తికి ఘోరమైన ప్రమాదం జరిగివుండవచ్చు. ఒక సందర్భంలో, గోపురం కూలిపోయి 18 మంది చనిపోయిన సంఘటన గురించి యేసు మాట్లాడాడు. వాళ్ల చావుకు కారణం దేవుడు కాదని ఆయన స్పష్టం చేశాడు. (లూకా 13:1-5) నిజానికి, ఒక ప్రమాదం జరగకముందే ఎవరు బ్రతుకుతారో, ఎవరు చనిపోతారో దేవుడు నిర్ణయిస్తాడని అనుకోవడంలో అర్థంలేదు.
మూడవదిగా, మనలో ప్రతీఒక్కరం యెహోవాకు నమ్మకంగా ఉండాలి. యెహోవా సేవకులు స్వార్థంతోనే ఆయన్ను సేవిస్తారని సాతాను అన్నాడు. అంతేకాదు మనకు కష్టాలు వస్తే, మనం యెహోవాకు నమ్మకంగా ఉండమని సాతాను సవాలు చేశాడు. (యోబు 1:9-11; 2:4; ప్రక. 12:10) ఒకవేళ యెహోవా మనల్ని కొన్ని కష్టాల నుండి కాపాడితే, సాతాను మాటే నిజం అన్నట్టు ఉంటుంది.
నాలుగవదిగా, మనకు భవిష్యత్తులో జరగబోయే ప్రతీదీ యెహోవా ముందే తెలుసుకోవాలనుకోడు. నిజమే, కావాలనుకుంటే మనకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో యెహోవా తెలుసుకోగలడు. (యెష. 46:10) కానీ ప్రతీదీ ముందుగానే తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించడని బైబిలు చెప్తుంది. (ఆది. 18:20, 21; 22:12) యెహోవా ప్రేమగలవాడు, నీతిమంతుడు కాబట్టి నిర్ణయాలు తీసుకునే మన స్వేచ్ఛకు ఆయన అడ్డుతగలడు.—ద్వితీ. 32:4; 2 కొరిం. 3:17.
మరి, “మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు” యెహోవా మీకు రానివ్వడని పౌలు అన్న మాటలకు అర్థమేమిటి? అంటే మనం కష్టాలు ఎదుర్కొనే ముందు కాదుగానీ, కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో యెహోవా ఏమి చేస్తాడో పౌలు వివరిస్తున్నాడు.a మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే, మన జీవితంలో వచ్చే ఏ కష్టాన్నైనా ఎదుర్కోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. (కీర్త. 55:22) అయితే, పౌలు ఎందుకు అలా అన్నాడో అర్థంచేసుకోవడానికి రెండు కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
మొదటిది, మనం అనుభవిస్తున్న కష్టాలు ‘మనుషులకు సాధారణంగా కలిగేవే’. మనం సాతాను లోకంలో జీవించినంత కాలం కష్టాలు వస్తూనే ఉంటాయి, కొన్నిసార్లు విషాద సంఘటనలు కూడా ఎదురవ్వవచ్చు. కానీ యెహోవా మీద ఆధారపడితే ఈ కష్టాలను తట్టుకొని, ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతాం. (1 పేతు. 5:8, 9) 1 కొరింథీయులు 10వ అధ్యాయం ప్రారంభంలో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాల గురించి పౌలు రాశాడు. (1 కొరిం. 10:6-11) యెహోవా మీద ఆధారపడ్డవాళ్లు ఆ కష్టాలను తట్టుకోగలిగారు. కానీ కొంతమంది ఇశ్రాయేలీయులు యెహోవాకు అవిధేయత చూపించారు. వాళ్లు ఆయనపై ఆధారపడలేదు కాబట్టి ఆయనకు నమ్మకంగా ఉండలేకపోయారు.
రెండవది, “దేవుడు నమ్మకస్థుడు.” దానర్థం ఏమిటి? చరిత్రంతటిలో యెహోవా తన సేవకులను ఎలా సంరక్షించాడో మనం గమనించినప్పుడు, “తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి” ఆయన నమ్మకంగా సహాయం చేస్తాడని తెలుసుకుంటాం. (ద్వితీ. 7:9) యెహోవా ఎప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడని మనం తెలుసుకుంటాం. (యెహో. 23:14) (1) మనం తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ కష్టాన్ని యెహోవా రానివ్వడనే నమ్మకంతో ఉండవచ్చు. (2) మనకు “తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడు”.
యెహోవా “మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు”
తన మీద ఆధారపడే వాళ్లకు యెహోవా ‘తప్పించుకునే మార్గాన్ని’ ఎలా కలగజేస్తాడు? నిజమే కష్టాన్ని తీసేయగల శక్తి ఆయనకుంది. కానీ, “దాన్నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడు; సహించడానికి సహాయం చేస్తాడు” అని పౌలు చెప్పిన మాటల్ని గుర్తుంచుకోండి. కాబట్టి, మనం నమ్మకంగా ఉండేలా ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆ విధంగా యెహోవా మనకు ఎన్నో సందర్భాల్లో తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాడు. ఆయన దాన్నెలా చేస్తాడో ఇప్పుడు చూద్దాం.
యెహోవా “మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.” (2 కొరిం. 1:3, 4) బైబిలు ద్వారా, పవిత్రశక్తి ద్వారా, నమ్మకమైన దాసుని ద్వారా ఆయన మన మనసుకు, హృదయానికి ప్రశాంతత ఇస్తాడు. అంతేకాదు భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి కూడా సహాయం చేస్తాడు.—మత్త. 24:45; యోహా. 14:16, అధస్సూచి; రోమా. 15:4.
యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి మనకు నిర్దేశాన్ని ఇస్తాడు. (యోహా. 14:26) మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే బైబిలు వృత్తాంతాల్ని, సూత్రాల్ని పవిత్రశక్తి మనకు గుర్తుచేస్తుంది.
యెహోవా తన దూతల్ని ఉపయోగించి మనకు సహాయం చేస్తాడు.—హెబ్రీ. 1:14.
యెహోవా మన తోటి సహోదరసహోదరీలను ఉపయోగించుకుంటాడు. వాళ్లు తమ మాటల ద్వారా, పనుల ద్వారా మనల్ని బలపర్చగలరు.—కొలొ. 4:11, అధస్సూచి.
కాబట్టి, 1 కొరింథీయులు 10:13 వచనంలో పౌలు చెప్పిన మాటల నుండి మనమేమి నేర్చుకున్నాం? మనం ఏ కష్టాలు అనుభవించాలో యెహోవా ముందే నిర్ణయించడు. కానీ మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే, ఏ కష్టాన్నైనా తట్టుకోగలమనే ధైర్యంతో ఉండవచ్చు. తనకు నమ్మకంగా ఉండేలా ఆయన ఎల్లప్పుడూ తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడని మనకు తెలుసు. అది మనకు ఎంత ఓదార్పును ఇస్తుందో కదా!
a “ప్రలోభం” అని అనువదించబడిన గ్రీకు మాటకు “శ్రమ” లేదా “కష్టం” అనే అర్థాలు కూడా ఉన్నాయి.