కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 ఆగస్టు పేజీలు 18-22
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం ఉదారతను చూపించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు
  • దేవుడు అప్పగించిన పనిని చేయండి
  • మనమెలా సంతోషంగా ఉండవచ్చు?
  • ఉదారతను చూపిస్తూ ఉండండి
  • యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఇచ్చే గుణం చూపించండి
    తేజరిల్లు!—2025
  • ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 ఆగస్టు పేజీలు 18-22
గాయపడిన యూదుని బాగోగులు చూసుకుంటున్న సమరయుడు

ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొ. 20:35.

పాటలు: 76, 110

మీరెలా జవాబిస్తారు?

  • మనుషులందరూ ఉదారతను చూపించగలరని ఎందుకు చెప్పవచ్చు?

  • ఉదారతకు, పరిచర్యలో పొందే సంతోషానికి ఎలాంటి సంబంధం ఉంది?

  • ఉదారతను చూపించడానికి ఎలాంటి కారణాలను బైబిల్లో చూస్తాం?

1. యెహోవా ఉదారతను చూపించాడని ఎలా చెప్పవచ్చు?

సృష్టిని చేయకముందు యెహోవా ఒక్కడే ఉనికిలో ఉండేవాడు. కానీ పరలోకంలో అలాగే భూమ్మీద ప్రాణుల్ని సృష్టించడం ద్వారా జీవాన్ని పంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇతరులకు మంచివాటిని ఇవ్వడమంటే ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాకు ఇష్టం. (1 తిమో. 1:11; యాకో. 1:17) మనం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టే ఉదారతను ఎలా చూపించాలో మనకు నేర్పిస్తున్నాడు.—రోమా. 1:20.

2, 3. (ఎ) ఉదారతను చూపిస్తే ఎందుకు సంతోషంగా ఉంటాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

2 యెహోవా మనుషుల్ని తన స్వరూపంలో సృష్టించాడు. (ఆది. 1:27) అంటే తనకున్న లాంటి లక్షణాలతో మనల్ని సృష్టించాడు. కాబట్టి నిజమైన సంతోషాన్ని, యెహోవా ఇచ్చే దీవెనల్ని పొందాలంటే మనం ఆయన్ని అనుకరించాలి. దానికోసం మనం ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించాలి, మనకున్న వాటిని ఉదారంగా ఇవ్వాలి. (ఫిలి. 2:3, 4; యాకో. 1:5) ఎందుకు? ఎందుకంటే ఆయన మనల్ని ఆ సామర్థ్యంతో సృష్టించాడు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ యెహోవాను అనుకరిస్తూ ఉదారతను చూపించవచ్చు.

3 ఉదారతకు సంబంధించి బైబిల్లో ఉన్న కొన్ని పాఠాల్ని ఇప్పుడు పరిశీలిస్తాం. మనం ఉదారతను చూపించినప్పుడు యెహోవా ఎందుకు సంతోషిస్తాడో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. యెహోవా ఇచ్చిన పనిని చేయడానికి ఉదారత అనే లక్షణం ఎలా సహాయం చేస్తుందో, ఆ లక్షణాన్ని చూపించడం ద్వారా మనమెలా సంతోషంగా ఉండవచ్చో కూడా నేర్చుకుంటాం. అంతేకాదు, ఉదారతను చూపిస్తూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో పరిశీలిస్తాం.

మనం ఉదారతను చూపించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు

4, 5. యెహోవా, యేసు ఎలా ఉదారతను చూపించారు? మనమెందుకు వాళ్లను అనుకరించాలి?

4 మనం తనను అనుకరించాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఉదారతను చూపిస్తే ఆయన సంతోషిస్తాడు. (ఎఫె. 5:1) ఆయన మనల్ని అద్భుతరీతిలో సృష్టించడం, భూమినీ దానిమీదున్న వాటన్నిటినీ మనకోసం తయారుచేయడం చూస్తే యెహోవా మనుషుల సంతోషాన్ని కూడా కోరుకుంటున్నాడని అర్థమౌతుంది. (కీర్త. 104:24; 139:13-16) అందుకే ఇతరుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించినప్పుడు మనం యెహోవాను ఘనపరుస్తాం.

5 ఉదారత విషయంలో పరిపూర్ణ ఆదర్శం ఉంచిన యేసును కూడా మనం అనుకరిస్తాం. ఆయనిలా అన్నాడు, “మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.” (మత్త. 20:28) అపొస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని ఇలా ప్రోత్సహించాడు, “క్రీస్తుయేసుకు ఉన్నలాంటి మనస్తత్వాన్నే మీరూ కలిగివుండండి. . . . ఆయన అన్నీ వదులుకొని, దాసునిలా మారి, మనిషిగా వచ్చాడు.” (ఫిలి. 2:5, 7) కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నేను యేసును ఇంకా ఏయే విధాలుగా అనుకరించవచ్చు?’—1 పేతురు 2:21 చదవండి.

6. యేసు చెప్పిన సమరయుడి కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 యెహోవా అలాగే యేసు ఉంచిన పరిపూర్ణ ఆదర్శాన్ని మనం అనుకరించినప్పుడు యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు. ప్రజల మీద నిజమైన శ్రద్ధ చూపించడం ద్వారా, వాళ్లకు సహాయం చేసే మార్గాల కోసం వెదకడం ద్వారా మనం యెహోవాను, యేసును అనుకరిస్తాం. ఉదారత చూపించడం ఎంత ప్రాముఖ్యమో యేసు మంచి సమరయుడి కథ ద్వారా వివరించాడు. (లూకా 10:29-37 చదవండి.) తన అనుచరులు అన్ని నేపథ్యాల వాళ్లకు సహాయం చేయాలని యేసు నేర్పించాడు. యేసు ఆ కథను ఏ సందర్భంలో చెప్పాడో గుర్తుందా? ఒక యూదుడు యేసు దగ్గరకు వచ్చి, “ఇంతకీ నా సాటిమనిషి ఎవరు?” అని అడిగాడు. అప్పుడు యేసు ఇచ్చిన జవాబును బట్టి, మనం యెహోవాను సంతోషపెట్టాలంటే ఆ సమరయుడిలా ఉదారతను చూపించాలని నేర్చుకోవచ్చు.

7. యెహోవా కోరేది చేయడమే మంచిదని నమ్ముతున్నట్లు ఎలా చూపిస్తాం?

7 ఉదారతను చూపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏదెను తోటలో, ఆదాముహవ్వలు యెహోవా మాట వినకుండా తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటే సంతోషంగా ఉంటారని సాతాను చెప్పాడు. హవ్వ స్వార్థంతో దేవునిలా అవ్వాలని కోరుకుంది. ఆదాము స్వార్థంగా ఆలోచించి దేవుని కంటే ఎక్కువగా హవ్వను సంతోషపెట్టాలని చూశాడు. (ఆది. 3:4-6) దానివల్ల ఘోరమైన పర్యవసానాలు వచ్చాయి. కాబట్టి స్వార్థపరులెవ్వరూ సంతోషంగా ఉండలేరన్నది స్పష్టమౌతుంది. మనం నిస్వార్థంగా, ఉదారంగా ఉంటే యెహోవా కోరేది చేయడమే మంచిదని నమ్ముతున్నట్లు చూపిస్తాం.

దేవుడు అప్పగించిన పనిని చేయండి

8. ఆదాముహవ్వలు ఇతరుల గురించి ఎందుకు ఆలోచించి ఉండాల్సింది?

8 ఏదెను తోటలో ఆదాముహవ్వలు మాత్రమే ఉన్నప్పటికీ, వాళ్లు ఇతరుల గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది. ఎందుకు? ఎందుకంటే యెహోవా వాళ్లకు ఒక పని అప్పగించాడు. అదేంటంటే, తమ పిల్లలతో భూమిని నింపి, దాన్ని పరదైసులా మార్చాలి. (ఆది. 1:28) భూమ్మీద ఉండే ప్రతీఒక్కరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకున్నట్లే, ఆదాముహవ్వలు కూడా తమ పిల్లల సంతోషాన్ని కోరుకొనివుంటే బాగుండేది. అప్పుడు భూమిని పరదైసుగా మార్చడానికి వాళ్లందరూ కలిసి పనిచేసి ఉండేవాళ్లు. అది నిజంగా ఒక పెద్ద పనే!

9. భూమిని పరదైసుగా మార్చే పని మనుషులకు ఎందుకు ఆనందాన్ని ఇచ్చివుండేది?

9 పరిపూర్ణులైన మనుషులు భూమిని పరదైసుగా మార్చాలన్నా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్నా యెహోవాతో సన్నిహితంగా పని చేయాలి. ఆ విధంగా, వాళ్లు దేవుని విశ్రాంతిలో అడుగుపెడతారు. (హెబ్రీ. 4:11) ఆ పని ఎంత సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చివుండేదో ఊహించండి! ఆదాముహవ్వలు నిస్వార్థంగా ఇతరుల గురించి ఆలోచించివుంటే యెహోవా వాళ్లపై ఎన్నో దీవెనల్ని కుమ్మరించి ఉండేవాడు.

10, 11. ప్రకటించి, శిష్యుల్ని చేయడానికి మనకేది సహాయం చేస్తుంది?

10 నేడు, యెహోవా మనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు. మనం ప్రకటించి, శిష్యుల్ని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ పని చేయాలంటే మనకు ప్రజల మీద నిజమైన శ్రద్ధ ఉండాలి. నిజానికి మనకు యెహోవా మీద, ప్రజల మీద ప్రేమ ఉంటేనే ఈ పనిలో కొనసాగగలం.

11 తానూ, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులూ “దేవుని తోటి పనివాళ్లు” అని పౌలు అన్నాడు. ఎందుకంటే వాళ్లు మంచివార్త ప్రకటించారు, ప్రజలకు సత్యాన్ని నేర్పించారు. (1 కొరిం. 3:6, 9) నేడు మనం కూడా మన సమయాన్ని, శక్తిని, వస్తువులను దేవుడు అప్పగించిన ప్రకటనా పని కోసం వెచ్చించడం ద్వారా “దేవుని తోటి పనివాళ్లం” అవుతాం. అది ఒక గొప్ప గౌరవం!

బైబిలు స్టడీ చేస్తున్న ఇద్దరు సహోదరీలు

ఇతరులకు బైబిలు సత్యం నేర్పించినప్పుడు ఎంతో సంతోషం పొందుతాం (12వ పేరా చూడండి)

12, 13. శిష్యుల్ని చేయడం వల్ల ఎలాంటి దీవెనలు వస్తాయి?

12 మనం మన సమయాన్ని, శక్తిని మంచివార్త ప్రకటించడానికి, బోధించడానికి ఉదారంగా ఉపయోగించినప్పుడు ఎంతో సంతోషం పొందుతాం. బైబిలు స్టడీలు చేస్తున్న చాలామంది సహోదరసహోదరీలు అదే చెప్తున్నారు. బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో అర్థంచేసుకున్నప్పుడు విద్యార్థుల్లో కలిగే ఉత్సాహాన్ని చూసి మనమెంతో సంతోషిస్తాం. అంతేకాదు వాళ్లు విశ్వాసంలో బలపడడం, నేర్చుకున్నవాటికి తగ్గట్లు మార్పులు చేసుకోవడం, నేర్చుకుంటున్న విషయాల్ని ఇతరులకు చెప్పడం చూసి కూడా మనం సంతోషిస్తాం. 70 మంది శిష్యులు తమకు ఎదురైన మంచి అనుభవాల్ని బట్టి ‘ఆనందంగా తిరిగొచ్చినప్పుడు’ యేసు కూడా చాలా సంతోషించాడు.—లూకా 10:17-21.

13 ప్రజలు బైబిలు సహాయంతో తమ జీవితాల్ని మెరుగుపర్చుకోవడం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలు ఎంతో సంతోషిస్తున్నారు. ఉదాహరణకు, యానa అనే పెళ్లికాని యువ సహోదరి గురించి పరిశీలించండి. ఆమె యెహోవా సేవలో ఎక్కువ సమయం వెచ్చించాలని కోరుకుంది. అందుకే అవసరం ఎక్కువున్న ప్రాంతమైన యూరప్‌కు వెళ్లింది. ఆమె ఇలా రాసింది: “ఇక్కడ క్షేత్రం బాగుంది, చాలా స్టడీలు దొరుకుతున్నాయి. ఈ సేవలో నేను చాలా ఆనందిస్తున్నాను. పరిచర్య నుండి ఇంటికి వెళ్లాక నా సమస్యల గురించి ఆలోచించే తీరికే ఉండట్లేదు. ఎందుకంటే నా బైబిలు విద్యార్థుల గురించి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు-ఆందోళనల గురించే ఆలోచిస్తున్నాను. వాళ్లను ప్రోత్సహించి, అవసరమైన సహాయం చేసే మార్గాల కోసం వెదుకుతున్నాను. దానివల్ల, ‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం’ ఉందని నాకు నమ్మకం కుదిరింది.”—అపొ. 20:35.

పరిచర్యలో ప్రతీ ఇంటికి వెళ్తున్న ఇద్దరు సహోదరీలు

మన క్షేత్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లడం ద్వారా ప్రజలకు రాజ్య సందేశాన్ని వినే అవకాశం ఇస్తున్నాం (14వ పేరా చూడండి)

14. ప్రజలు వినకపోయినా ప్రీచింగ్‌ని ఎలా ఆనందించవచ్చు?

14 మనం ప్రకటించినప్పుడు ప్రజలు వినకపోయినా, మనం సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే అలా ప్రకటించినప్పుడు మంచివార్త వినే అవకాశాన్ని వాళ్లకు ఇస్తున్నాం. యెహోవా యెహెజ్కేలుకు చెప్పిన పనినే మనం కూడా చేయాలని ఆశిస్తున్నాడు. యెహోవా ఇలా చెప్పాడు, “వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.” (యెహె. 2:7; యెష. 43:10) కాబట్టి ప్రజలు ఎలా స్పందించినా, మనం చేసే కృషిని యెహోవా విలువైనదిగా చూస్తాడని మనకు తెలుసు. (హెబ్రీయులు 6:10 చదవండి.) ఒక సహోదరుడు తన పరిచర్య గురించి ఇలా చెప్పాడు, “మేము నాటాం, నీళ్లు పోశాం, యెహోవా వాళ్ల ఆసక్తిని వృద్ధి చేస్తాడన్న నమ్మకంతో ప్రార్థించాం.”—1 కొరిం. 3:6.

మనమెలా సంతోషంగా ఉండవచ్చు?

15. ప్రజలు కృతజ్ఞత చూపిస్తేనే మనం ఉదారంగా ఉండాలా? వివరించండి.

15 మనం ఉదారతను చూపించాలని యేసు కోరుకుంటున్నాడు, ఎందుకంటే దానివల్ల మనం సంతోషంగా ఉంటాం. మనం ఉదారత చూపిస్తే, చాలామంది తిరిగి మనకు ఉదారత చూపిస్తారు. అందుకే ఆయనిలా ప్రోత్సహించాడు, “ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు. వాళ్లు మంచి కొలతతో మీ ఒళ్లో పోస్తారు; వాటిని అదిమి, కుదిపి, పొర్లిపోయేంతగా పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో, వాళ్లూ మీకు అదే కొలతతో కొలుస్తారు.” (లూకా 6:38) మీరు ఉదారంగా ఇచ్చినప్పుడు, అందరూ కృతజ్ఞత చూపించకపోవచ్చు. అయినప్పటికీ మీరు మాత్రం ఉదారతను చూపిస్తూనే ఉండండి. మీరు ఉదారతతో చేసే ఒక్క పని ఎంత మేలు చేస్తుందో మీకు తెలియకపోవచ్చు!

16. మనం ఎవరిపట్ల ఉదారతను చూపించాలి? ఎందుకు?

16 మనస్ఫూర్తిగా ఉదారతను చూపించే వ్యక్తి ఇతరుల నుండి తిరిగి ఏదీ ఆశించడు. యేసు ఇలా చెప్పాడు, “నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు పేదవాళ్లను, వికలాంగుల్ని, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను ఆహ్వానించు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, నీకు తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు.” (లూకా 14:13, 14) బైబిలు ఇలా చెప్తుంది, ‘ఉదారంగా ఇచ్చేవాడు దీవించబడతాడు.’ అంతేకాదు, “బీదలను కటాక్షించువాడు ధన్యుడు” అని కూడా చెప్తుంది. (సామె. 22:9, NW; కీర్త. 41:1) మనం ఇతరులకు సహాయం చేయాలనుకుంటాం కాబట్టి ఉదారతను చూపించాలి.

17. మనం ఏమేమి చేయడంవల్ల సంతోషం పొందవచ్చు?

17 “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని యేసు చెప్పిన మాటల్ని పౌలు ప్రస్తావించినప్పుడు, వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే చెప్పలేదు. మనం ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు, బైబిలు నుండి సలహా ఇవ్వవచ్చు, అవసరమైన సహాయం కూడా చేయవచ్చు. (అపొ. 20:31-35) మన సమయాన్ని, శక్తిని, శ్రద్ధను, ప్రేమను ఇతరులకు ఉదారంగా ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో పౌలు తన మాటల ద్వారా, పనుల ద్వారా మనకు నేర్పించాడు.

18. ఉదారతను చూపించడం గురించి చాలామంది పరిశోధకులు ఏమి చెప్తున్నారు?

18 ఇవ్వడంలో సంతోషం ఉంటుందని, మనస్తత్వాల్ని అధ్యయనం చేసే పరిశోధకులు కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్లు రాసిన ఒక ఆర్టికల్‌లో ఇలా ఉంది, “ఇతరుల కోసం మంచి పనులు చేసినప్పుడు తమ సంతోషం రెట్టింపు అయిందని ఎంతోమంది చెప్పారు.” మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన జీవితానికి ఒక సంకల్పం, అర్థం ఉన్నట్లు భావిస్తామని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే స్వచ్ఛంద సేవచేయాలని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు. నిజమే, వాళ్లు చెప్పేది మనకు కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇవ్వడంలో సంతోషం ఉంటుందని మన ప్రేమగల సృష్టికర్త అయిన యెహోవా ఎప్పటినుండో చెప్తున్నాడు.—2 తిమో. 3:16, 17.

ఉదారతను చూపిస్తూ ఉండండి

19, 20. మీరెందుకు ఉదారతను చూపించాలని అనుకుంటున్నారు?

19 చుట్టూ స్వార్థపరులే ఉన్నప్పుడు మనం ఉదారతను చూపిస్తూ ఉండడం కష్టమవ్వవచ్చు. కానీ యేసు చెప్పిన రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటంటే: యెహోవాను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో, పూర్తి బలంతో ప్రేమించాలి; మనల్ని మనం ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి. (మార్కు 12:28-31) ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు యెహోవాను ప్రేమించేవాళ్లు ఆయన్ని అనుకరిస్తారు. యెహోవా, యేసు ఇద్దరూ ఉదారతను చూపించారు. మనం వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే అది మనకు నిజమైన సంతోషాన్నిస్తుంది. దేవుని కోసం, పొరుగువాళ్ల కోసం ఉదారంగా పనిచేసినప్పుడు యెహోవాను ఘనపరుస్తాం. అంతేకాదు మనకు మనం మేలు చేసుకుంటాం, ఇతరులకు మేలు చేసినవాళ్లమౌతాం.

20 ఉదారతను చూపించడానికి, ఇతరులకు ముఖ్యంగా తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి మీరు ఇప్పటికే చాలా కృషి చేస్తున్నారు. (గల. 6:10) మీరు ఉదారతను చూపిస్తూ ఉంటే ఇతరులు మీకు కృతజ్ఞత చూపిస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు. దానివల్ల మీరు కూడా సంతోషంగా ఉంటారు. “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును” అని బైబిలు చెప్తుంది. (సామె. 11:25) మన క్రైస్తవ జీవితంలో అలాగే పరిచర్యలో నిస్వార్థంగా ఇవ్వడానికి, దయను, ఉదారతను చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

a అసలు పేర్లు కావు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి