ప్రశ్నా భాగము
◼ సహాయపయినీరుగా సేవచేయడాన్ని ఎలా దృష్టించాలి?
సహాయపయినీరు సేవను ఒక ఆధిక్యతగాను, గంభీరమైన బాధ్యతగాను దృష్టించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా వేలాదిమంది ప్రచారకులు సహాయపయినీర్లుగా సేవచేయడానికి నియమించబడుతున్నారు, కొంతమంది దానిలో కొనసాగుతున్నారు. సహాయపయినీర్లుగా పనిచేస్తున్న ప్రతినెలా ప్రాంతీయ సేవలో 60 గంటలు గడపడానికి తమ పరిస్థితులు అనుమతిస్తున్న ఈ ఆసక్తిగల ప్రచారకులను మనము మెచ్చుకొంటున్నాము. ఇలా సహాయపయినీర్లుగా సేవచేయడానికి దరఖాస్తుచేసేవారిని ఈ నియామకాన్ని గంభీరమైనదిగా ఎంచి తేలికభావంతో దీన్ని పరిగణించే దృక్పథాన్ని తీసివేసుకోవాలని పెద్దలూ ఇతరులూ ప్రోత్సహించాలి.
క్రమపయినీర్లవలెనె, సహాయపయినీర్లుగా ఒకనెల లేక అంతకంటె ఎక్కువగా చేయాలని స్వచ్ఛందగా ముందుకొచ్చేవారు మొదట దాని తగులుబడిని ఎంచిచూసుకోవాలి. (లూకా 14:28) ఇందులో వారు తమ ఇతర క్రైస్తవ బాధ్యతలను నిర్లక్ష్యంచేయకుండా కోరబడిన సమయాన్ని ప్రాంతీయపరిచర్యలో గడపగలరా అని ముందుగానే నిర్ణయించుకోవడం ఇమిడివుంది. ఒకడు తన వ్యక్తిగత పరిస్థితులను ప్రార్థనాపూర్వకంగా తలంచిన తరువాతనే సహాయపయినీరు సేవలో పాల్గొనాలనే తన నిర్ణయాన్ని వ్యక్తపర్చాలి. ఏదో ఇతరులు దానికి దరఖాస్తు చేస్తున్నారు గనుక నేనూ చేద్దామనే భావోద్రేకమునుండి అది పుట్టకూడదు. సహేతుకంగా తర్కించి, తప్పకచేయగల పనుల వ్రాతపూర్వక కాల పట్టికను వేసుకొన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తును జాగ్రత్తగా చదివి, ఒకని హృదయములో తాను యథార్థంగా వాటికి ఔను అని చెప్పడం ప్రాముఖ్యము.
నిజమే, అదనపు కృషికూడా ఇందులో ఇమిడివుంది. కొన్ని నెలలు సువార్త ప్రకటనపనిలో ‘ఎక్కువగా పాల్గొనడానికి’ అవకాశమిస్తాయి. (అపొ. 18:5, NW) వాటిలో జ్ఞాపకార్థ ఆచరణ కాలమైన మార్చి, ఏప్రిల్ నెలలు, ప్రాంతీయకాపరి సంఘాన్ని దర్శించే కాలం ఉన్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమ కాలములలో, తద్వారా లభించే ఆశీర్వాదములను గుణగ్రహించినవారై తరచు చాలామంది ప్రచారకులు ప్రాంతీయసేవలో అదనంగా పాల్గొనడానికి కొంత కఠినమైన కాల కార్యక్రమ పట్టికను అనుసరించగలుగునట్లు తమ్మును తాము క్రమశిక్షణలో పెట్టుకుంటారు. (2 కొరింథి. 9:6) చాలామంది ప్రచారకులు సెలవులున్న నెలలలో లేక అయిదు శని, ఆది వారములున్న నెలలలో పయినీరు సేవలో పాల్గొనడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారు సంతకము చేసేటప్పుడు, ‘మీ మాట అవునంటే అవును’ అనే సూత్రానికి హత్తుకొని ఉండవలసిన అవసరతను గుణగ్రహించినవారై, తాము సహాయపయినీరుగా సేవచేసే ప్రతినెలా 60 లేక అంతకంటె ఎక్కువగంటలు రిపోర్టుచేయుటకు తమ శక్తికొలది పనిచేయవలెను.—మత్తయి 5:37.
పయినీరు సేవచేయలేని ప్రచారకులు తాముకూడ సహాయ పయినీర్లతో కచ్చితమైన ఏర్పాట్లను చేసుకొని వారితో పనిచేయడానికి అందుబాటులో ఉంచుకొని సహాయపడవచ్చును. సాధ్యమైతే పయినీర్లతోపాటు సేవలో ఎక్కువ కాలం గడపడం కూడా ఎంతో సహాయకరం. ప్రచారకులు వారితోపాటు ఉదయంపూట పెందలకడనే, బాగా మధ్యాహ్నమైన వేళలో, సాయంకాలం మొదలయ్యే వేళల్లో తమతోపాటు పనిచేయడాన్ని పయినీర్లు ఎంతగానో మెచ్చుకుంటారు. ఇతరులతోపాటు పునర్దర్శనములో పనిచేయడానికి, గృహబైబిలు పఠనములను ప్రారంభించడంలో పనిచేయడానికి ఆహ్వానించబడితే సహాయ పయినీర్లు ఆనందిస్తారు. సహాయపయినీర్లకు మద్దతుగా పనిచేయగోరువారు నిశ్చయంగా ఇచ్చుటవలన కలిగే గొప్ప సంతోషమును పొందగలరు.—అపొ. 20:35.
సహాయపయినీర్లు శ్రద్ధతో పనిచేయడం ఎంతగానో మెచ్చుకొనబడుతుంది. వారితో కలిసి పనిచేయగలిగేవారికి విస్తారమైన దీవెనలు ప్రాప్తించగలవు. (సామె. 10:4) ఈసారి మీరు సహాయపయినీరు సేవలో పాల్గొని మీ సేవను వృద్ధిచేసుకొనడం ద్వారా కలిగే ఆనందాన్ని ఎప్పుడు పొందగలరు?