మీ రాజ్యసేవా సంపత్తిని విస్తృతపర్చండి
1 యేసు, రాజ్య నిరీక్షణను అమూల్యమైన నిధికి పోల్చాడు. (మత్త. 13:44-46) యేసు చెప్పిన ఉపమానాల్లో, విలువైనదొకటి కొనడానికి తమకున్న ఆస్థినంతటిని అమ్మిన మనుష్యులను మనము పోలివున్నామా? అలాగైతే, దానిలో అసౌకర్యము, సుఖాది పరిత్యాగము యిమిడివున్నప్పటికి దేవుని రాజ్యానికి మనం ప్రథమస్థానం యిస్తాము.—మత్త. 6:19-22.
2 మన రాజ్య సేవ ఒక నిధి గనుక, దానిని విస్తృతపర్చడం మన కోరికయైయుండాలి. మన వ్యక్తిగత జీవిత విధానము ఏమి చూపెడుతుంది? మనం మన రాజ్య పనులను విస్తృతపరుస్తున్నామా? ఇంటింటి సేవ చేయడం, పునర్దర్శనాలు చేయడం, బైబిలు పఠనాలు నిర్వహించడం తటస్థ సాక్ష్యం చెప్పడంవంటి అనేక పద్ధతుల పరిచర్యలో పాల్గొనడంద్వారా మనమలా చేయవచ్చును.
3 ‘నా వంతును నేనెలా విస్తృతపర్చగలను?’ నూతన సేవా సంవత్సరారంభంతో, ప్రతి ఒక్కరూ ప్రాంతీయ సేవలో గడిపే సమయాన్ని వృద్ధిచేసుకోడానికి తామేమి చేయగలరో నిశ్చయించుకోడానికి తమ వ్యక్తిగత కార్యవిధానాన్ని పునఃసమీక్షించి యిలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘అప్పుడప్పుడు లేదా క్రమంగా సహాయ పయినీరు సేవచేయడానికి వీలుగా నా కార్యకలాపాలను సర్దుబాటుచేసుకోగలనా? కొన్ని మార్పులు చేసుకోవడంతో, నేను క్రమ పయినీరు సేవలో చేరగలనా?’ సెప్టెంబరు 1వ తారీఖులోపు చేరిన క్రొత్త పయినీర్లు తర్వాతి పయినీరు సేవా పాఠశాలకు హాజరుకావడానికి అర్హులు కాగలరు.
4 కొంతమంది ప్రచారకులు ఎక్కువగా తటస్థ సాక్ష్యమివ్వాలనే వ్యక్తిగత గురిని కల్గియున్నారు. తరచూ ఈ కార్యవిధానం అద్భుతమైన ఫలాన్నిస్తుంది. ఇతరులు ఫలవంతమగు పునర్దర్శనాలను లేదా కొత్త బైబిలు పఠనాలను ఆరంభించడంలో ఉన్నతిని సాధించాల్సిన అవసరత వుందని భావిస్తారు.
5 ఏదో రీతిలో మన పరిచర్య పరిమితం చేయబడిందనే అభిప్రాయానికొస్తే, దాన్ని విస్తృతం చేయడానికి మనమేం చేయగలం? ఉన్నతమైన గురులను విజయవంతంగా చేరుకున్నవారు సిఫారసు చేసేదేమంటే, ఏవిధంగానైనా రాజ్యాసక్తులను ముందుంచాలనే నిర్ణయానికి మనం రావాలి. (మత్త. 6:33) విశ్వాసము, యెహోవాపై పూర్తిగా ఆధారపడడమనేవి అవసరమైయున్నవి. (2 కొరిం. 4:7) యథార్థమైన, పట్టుదలతో కూడిన ప్రార్థనద్వారా ఆయన సహాయాన్ని వెదకండి. (లూకా 11:8, 9) ఆయన సేవలో మన వంతును వృద్ధిచేసుకోడానికి మనం చేసే యథార్థమైన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కల్గియుండగలం.—1 యోహాను 5:14.
6 తమ పరిచర్యను విజయవంతంగా విస్తృతపర్చిన యితర సహోదర సహోదరీలతో మాట్లాడండి. నిరుత్సాహపడకుండా అడ్డంకులను వారెలా అధిగమించగల్గారో వారిని అడగండి. మీ పరిచర్యను విస్తృతపర్చడం సాధ్యమేనని మీకు నచ్చజెప్పడానికి మీకు అవసరమైనదే వారి వ్యక్తిగత అనుభవం కావచ్చు.
7 కావలికోట లేదా మన రాజ్య పరిచరలో ప్రాంతీయ సేవను గూర్చి చర్చించే శీర్షికలను మీరు చదివినప్పుడు, ఆ సలహాలను మీ ప్రాంతీయ పరిచర్యలో మీరెలా అన్వయించుకోగలరో ప్రార్థనాపూర్వకంగా పరిశీలించండి. సంఘ కూటాలకు లేదా సమావేశాలకు హాజరౌతున్నప్పుడు కూడా ఆవిధంగానే చేయండి. ఈ శీర్షికలో యివ్వబడిన సలహాలు గత సంవత్సరపు ప్రాంతీయ సమావేశపు కార్యక్రమంలో భాగమైన చర్చపై ఆధారపడ్డాయి. మన పరిచర్యలో కొనసాగడానికి, ఆ కార్యక్రమంద్వారా అందించబడిన ప్రోత్సాహాన్ని అన్వయించుకొనుటలో సహాయపడడానికి ఏర్పాటుచేయబడిన శీర్షికల పరంపరలో యిది మొదటిది.
8 యేసు తన పరిచర్యకు ప్రప్రథమ శ్రద్ధనిస్తూ, దాన్ని చాలా గంభీరమైనదిగా దృష్టించాడు. ఆయన యిలా ప్రకటించాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) అలాగే మనమూ భావిస్తామా? మనమలా భావిస్తే, నిశ్చయంగా మనం మన కార్యవిధానాన్ని విస్తృతపర్చి, మన ధన నిధిలోనుండి “సద్విషయములను” యితరులతో పంచుకుంటాము.—మత్త. 12:35; లూకా 6:45.