ఇతరుల యెడల శ్రద్ధ చూపించండి—1వ భాగం
1 యెహోవా ప్రజల అభివృద్ధి ఫలితంగా సంఘాల సంఖ్య పెరగడాన్ని చూసి మనం సంతోషిస్తాము. కొన్ని నగరాల్లో అనేక సంఘాలు ఒకే రాజ్య మందిరాన్ని ఉపయోగించవలసి ఉంది. ఈ పరిస్థితి ఇమిడి ఉన్న అందరి అదనపు శ్రద్ధను కోరుతుంది.
2 రాజ్యమందిరాన్ని ఉపయోగించే ప్రతి సంఘం, తర్వాత వచ్చే సహోదరుల కొరకు దాన్ని శుభ్రంగాను, క్రమబద్ధంగాను ఉంచాలి. కుర్చీలను క్రమంగా ఉంచాలి, కౌంటరులో ఏదైనా సాహిత్యం ఉంటే తీసి పెట్టాలి, రాజ్యమందిరంలో అక్కడ యిక్కడ వ్యక్తిగతమైన వస్తువులేమైనా ఉంటే, వాటిని సేకరించాలి. సబ్బును, తువాళ్ళను, యితర వస్తువులను మరలా భర్తీ చేసి, చెత్త డబ్బాలను ఖాళీ చేసి, మరుగుదొడ్డిని శుభ్రంగా, పొందికగా ఉంచాలి. రాజ్య మందిరాన్ని ఒక సంఘం మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ, యీ విధంగా చేయడం మంచిది. అనేక సంఘాలు శుభ్రం చేసి పొందికపరచే పెద్ద పని అంతటినీ కూటాలు ముగిసిన తర్వాత చేసి, ఊడ్వడం, దుమ్ము దులపడం వంటి చిన్న పనులను మాత్రమే తర్వాతి కూటానికి ముందు చేయడానికి వదిలిపెట్టేలా పట్టిక వేయడానికి యిష్టపడతాయి. కూటం ఆరంభించడానికి ఇరవై నిమిషాల ముందే మందిరం చక్కగా ఉండేలా, ప్రతి ఒక్కరు ముందే వచ్చి సరిగ్గా శుభ్రం చేయలేరు గనుక, కూటాలకు ముందు శుభ్రపర్చే పెద్ద పనులకు పట్టిక వేయడం కన్నా పై విధంగా చేయడానికే యిష్టపడతారు. అంతేకాక, హాజరయ్యేవారు కూడా తాము శుభ్రంగా చక్కగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా వాళ్ళకు కార్యక్రమాల్లో భాగముంటే, కూటానికి ముందటి సమగ్ర పారిశుద్ధ్య పనిలో పాల్గొనడానికి యిష్టపడరు.
3 అలాగే, వెంటనే మరొక సంఘ కూటాన్ని ఆరంభించడానికి పట్టిక వేసినట్లయితే, తర్వాతి కూటపు సిద్ధపాట్లకు భంగం కలిగించేటట్లు, ముందు ముగిసిన కూటానికి చెందినవారు అనవసరంగా అక్కడ నిలిచి ఉండకూడదు. విస్తృతమైన సాంఘిక సంభాషణ వసారాలో జనసమ్మర్ధాన్ని అధికం చేస్తూ, సహోదరులు తరువాతి కూటం కొరకు అన్నింటినీ సంస్థీకరించడాన్ని ఆలస్యం చేస్తుంది. కొన్ని చోట్ల, రాజ్యమందిరపు చుట్టూ పార్కింగ్ స్థలాలు పరిమితంగా ఉండవచ్చు, కాబట్టి త్వరగా వెళ్ళిపోవడం దయ చూపించినట్లవుతుంది, అలా తర్వాత వచ్చేవారికి పార్క్ చేసుకోడానికి స్థలముంటుంది. మరొకవైపు, తర్వాతి కూటానికి హాజరగు వారు వసారాలో, దుస్తులు మార్చుకునే గదిలో మరియు పార్కింగ్ స్థలంలో అనవసరంగా క్రిక్కిరిసి ఉండేలా మరీ ముందుగా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
4 అనేక సంఘాలు చేరివున్నచోట, రాజ్యమందిర వారపు పారిశుద్ధ్య చర్యలకు ఏర్పాట్లు చేయడంలో మంచి సహకారమనేది ఎంతో అవసరం. సాధారణంగా, సంఘాలు నియుక్త సమయాల్లో వంతులు తీసుకుంటారు. మీ సంఘానికి ఆ బాధ్యత ఉన్నప్పుడు, పారిశుద్ధ్య పని చక్కగా, వెంటనే చేయబడిందని రూఢి చేసుకోండి. అప్పుడు ఆ విధంగా రాజ్యమందిరాన్ని ఉపయోగించుకునే యితర సంఘాలకు ఫిర్యాదు చేయడానికి కారణముండదు.
5 ప్రాంతీయ కాపరి సందర్శించేటప్పటిలా, అప్పుడప్పుడు సంఘ కూటాల సమయాల్లో మార్పులు తేవలసిన అవసరత ప్రతి సంఘానికి ఉంటుంది. మరొక సంఘం ప్రభావితమయ్యేటట్లయితే, పెద్దలు మరొక సంఘానికి చాలా ముందే చెప్పాలి, అలా వారు తమ ప్రచారకులకు సాధ్యమైనంత త్వరగా తెలపగలుగుతారు. అలాగే, పయినీరు సేవా పాఠశాల, ప్రాంతీయ పెద్దల కూటం, వివాహము వంటి ఆధికారికమైన కార్యక్రమాలు జరుగనున్నట్లయితే, ప్రభావితమయ్యే యితర సంఘాలు, వేరే ప్రాంతీయ కాపరులను ఎంతో ముందుగానే సంప్రదించాలి; ఆ విధంగా వారు ఆ సమయంలో రాజ్యమందిరాన్ని ఉపయోగించడానికి పట్టిక వేసుకోరు.
6 ఇతరుల యెడల ప్రేమపూర్వకమైన శ్రద్ధ, మంచి సంభాషణ, ఎంతో ముందుగా పథకం వేయడం, సహకారం సంఘముల మధ్య స్నేహ బంధాలను కాపాడుకోడానికి సహాయం చేస్తూ, ‘సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగడాన్ని‘ సాధ్యపరుస్తాయి.—1 కొరిం. 14:40.