మీరు సాయంకాల సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించారా?
1 మన పనిలో ఫలవంతులైన వారిగా ఉండడంలో మనమందరం ఆహ్లాదాన్ని కనుగొంటాము. ఇంకొకవైపు, మనం అనుకూల ప్రతిఫలాలను చూడలేకపోయినప్పుడు, పని అలసట కలిగించేదిగాను, నిష్ప్రయోజనమైనదిగాను అవ్వగలదు. అర్థవంతమైన శ్రమ వ్యక్తిగతంగా ప్రతిఫలదాయకం, మరది ఒక ఆశీర్వాదం. (ప్రసంగి 3:10-13, పోల్చండి.) మనం ఈ సూత్రాన్ని మన ప్రకటన పనికి అన్వయించుకోగలము. ఇంటింటికి వెళ్లినప్పుడు, బైబిలు గురించి ప్రజలతో సంభాషించగలిగినప్పుడు మనం ఆత్మీయంగా నూతనోత్తేజం పొంది ఇంటికి తిరిగి వస్తామని అనుభవం ద్వారా మనకు తెలుసు. నిజంగా మనం ఏదో సాధించామని భావిస్తాము.
2 కొన్ని ప్రాంతాలలో దినంలోని కొన్ని ప్రత్యేక సమయాల్లో ప్రజలను వారి ఇండ్లవద్ద కనుగొనడం చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మనం ఉదయం సందర్శించినప్పుడు 50 శాతం కంటే ఎక్కువగా ప్రజలు ఇండ్లవద్ద ఉండడం లేదని నివేదికలు సూచిస్తున్నాయి. సాయంకాల సాక్ష్యం కొరకు ఏర్పాట్లు చేయడం ద్వారా చాలా సంఘాలు ఈ సమస్యతో వ్యవహరించాయి, మరి అవి మంచి విజయాన్ని సాధించాయి. తాము సాయంకాలం సందర్శించినప్పుడు, చాలామంది ప్రజలు ఇంటివద్ద ఉన్నారని, అంతేగాక సాధారణంగా ప్రజలు ఇంకా ఎక్కువగా సేదదీర్చుకొంటున్నట్లు, రాజ్య వర్తమానాన్ని వినడానికి ఎక్కువ సుముఖంగా ఉన్నట్లు ప్రచారకులు నివేదిస్తున్నారు. మీ ప్రాంతంలో సాయంకాల సాక్ష్యమివ్వడానికి మీరు ప్రయత్నించారా?—మార్కు 1:32-34 పోల్చండి.
3 పెద్దలు సాయంకాల సాక్ష్యపు పనిని సంస్థీకరిస్తారు: కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం తరువాత లేక సాయంకాలం జరిపే ప్రాంతీయ సేవ కొరకైన కూటాలకు చక్కగా మద్దతు లభించింది. మధ్యాహ్నం పాఠశాల వదిలి వచ్చే యౌవనులైన ప్రచారకులకు, అటుతరువాత తమ లౌకిక పనిని ముగించుకుని తిరిగి వచ్చే పెద్దవారికి పరిగణనివ్వవచ్చు. వారాంతంలో ప్రాంతీయ సేవకై బయటికి వెళ్లలేని కొంతమంది ప్రచారకులు ప్రకటనా పనిలో క్రమమైన భాగం కలిగివుండేందుకు వారంలోని మిగిలిన రోజుల్లో సాయంకాల సాక్ష్యపు పని చేయడం ఒక ఆచరణయోగ్యమైన మార్గమని కనుగొన్నారు.
4 సాయంకాల సాక్ష్యంలో మీరు పాల్గొనగలిగే వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంటింటా పత్రికలతో సాక్ష్యమివ్వవచ్చు లేక ఆ నెలకొరకైన సాహిత్య ప్రతిపాదనను ఉపయోగించవచ్చు. ఉదయం లేదా వారాంతాలలో ప్రచారకులు సందర్శించినప్పుడు ఇంట్లో లేని వ్యక్తులను సందర్శించడానికి సాయంకాలం ఒక చక్కని సమయం. పని నుండి ఇంటికివచ్చే ప్రజలను కలవడానికి మిమ్మల్ని అనుమతించేలా వీధి సాక్ష్యమివ్వడానికి కూడా చక్కని ప్రాంతం ఉండవచ్చు. ఆసక్తి చూపించిన వారిని పునర్దర్శించడానికి సాయంకాలం శ్రేష్ఠమైన సమయమని అనేకమంది కనుగొంటారు.
5 జాగ్రత్తగాను, వివేచనాత్మకంగాను ఉండండి: కొన్ని ప్రాంతాలలో ప్రొద్దుగ్రుంకినప్పుడు గానీ లేదా చీకటిపడినప్పుడు గాని బయటికి వెళ్లడం హానికరంగా ఉండవచ్చు. ఇద్దరిద్దరుగా లేక గుంపులుగా బాగా వెలుతురున్న వీధులలో ప్రయాణించడం, మీరు సురక్షితంగా ఉంటారని నమ్మకం ఉన్నప్పుడే ఇండ్లు లేక అపార్టుమెంటు బిల్డింగులను మాత్రమే సందర్శించడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. మీరు తలుపును తట్టినప్పుడు, మీరు కనబడే స్థలంలో నిల్చోండి, మీరెవరో స్పష్టంగా తెలియజేయండి. వివేచించేవారిగా ఉండండి. కుటుంబం కలిసి భోజనం చేస్తున్నటువంటి అననుకూల సమయాల్లో సందర్శించారని మీరు గమనించినప్పుడు, ఇంకొక సమయంలో సందర్శిస్తారని ప్రతిపాదించండి. ఇంటివారు బహుశ నిద్రకు ఉపక్రమించే సమయంలో చీకటిపడిన తరువాత సందర్శించే బదులు సాధారణంగా సాయంకాల సమయానికే మీరు సాక్ష్యమివ్వడాన్ని పరిమితం చేయడం శ్రేష్ఠం.
6 సుదీర్ఘంగా ఉండే వేసవి సాయంకాలాలు ప్రత్యేకంగా సాయంకాల సాక్ష్యానికి అనుకూలంగా ఉంటాయి. దేవునికి ‘రాత్రింబగళ్లు సేవ’ చేస్తుండగా, యెహోవా తప్పకుండా మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు.—ప్రక. 7:15.