మీరు సాయంకాలాల్లో సాక్ష్యమివ్వగలరా?
1. ఒక పండితుడు చెబుతున్నట్టు, అపొస్తలుడైన పౌలు ఇంటింటి పరిచర్య ఎప్పుడు చేసేవాడు?
1 అపొస్తలుడైన పౌలు సాధారణంగా “సాయంకాలం 4 గంటల నుండి చాలా రాత్రి వరకు” ఇంటింటి పరిచర్యలో గడిపేవాడని డైలీ లైఫ్ ఇన్ బైబిల్ టైమ్స్ పుస్తకాన్ని బట్టి తెలుస్తోంది. పౌలు కచ్చితంగా ఇలాగే చేసేవాడో కాదో మనకు తెలియదు కానీ, ‘సువార్తలో పాలివాడవడానికి సమస్తం చేసేందుకు’ ఆయన సుముఖంగా ఉండేవాడని మాత్రం మనకు తెలుసు. (1 కొరిం. 9:19-23) మంచి ఫలితాలు వచ్చే వేళల్లో ఇంటింటి పరిచర్య చేయడానికి ఆయన తన పనులను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చివుంటుంది.
2. పరిచర్య చేయడానికి సాయంకాలాలు ఎందుకు అనువుగా ఉంటాయి?
2 సాధారణంగా చాలా ప్రాంతాల్లోని ప్రచారకులు ఉదయం పూట ఇంటింటి పరిచర్య చేస్తుంటారు. మీ ప్రాంతంలో ఇప్పటికీ ఇది అనువైన సమయమేనా? ఒక పయినీరు తను పరిచర్య చేసే ప్రాంతం గురించి ఇలా చెబుతున్నాడు: “పగలు తక్కువమంది ఇంట్లో ఉంటారు. కానీ సాయంకాలాల్లో అయితే చాలామంది ఇంట్లోనే ఉంటారు.” సాయంకాలాల్లో సాక్ష్యమిస్తే, ప్రత్యేకంగా మగవాళ్లకు సువార్తను అందించవచ్చు. గృహస్థులు తీరుబడిగా ఉండి, మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. క్షేత్ర సేవా కూటాన్ని సాయంకాలాల్లో ఏర్పాటు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటే, పెద్దలు అలాగే ఏర్పాటు చేయాలి.
3. సాయంకాలాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు మనమెలా జాగ్రత్తగా ఉండవచ్చు?
3 జాగ్రత్తగా ఉండండి: సాయంకాలాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఉదాహరణకు, మీరు అనువుకాని సమయంలో అంటే గృహస్థులు భోంచేస్తున్నప్పుడు వెళితే తర్వాత వచ్చి కలుస్తానని చెప్పడం మంచిది. చీకటిపడితే, మీరు గృహస్థులకు కనిపించేలా గుమ్మం దగ్గర నిలబడండి, వెంటనే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, ఎందుకు వచ్చారో వివరించండి. ఇద్దరిద్దరిగా, లేదా దగ్గరదగ్గరగా పనిచేయడం కూడా మంచిది, ఒంటరిగా ఉండకుండా వీధి లైట్లు ఉన్నచోట నిలబడండి. మరీ ఆలస్యంగా అంటే గృహస్థులు నిద్రపోవడానికి సిద్ధమౌతున్న వేళల్లో వెళ్లకండి. (2 కొరిం. 6:3) ఏదైనా ఒక ప్రాంతంలో చీకటి పడిన తర్వాత ప్రకటించడం ప్రమాదం అనుకుంటే అలాంటి ప్రాంతంలో చీకటి పడక ముందే ప్రకటించండి.—సామె. 22:3.
4. సాయంకాలాల్లో సాక్ష్యమిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి?
4 ఆశీర్వాదాలు: మనం సాక్ష్యమివ్వగలిగితే పరిచర్యను ఎంతో ఆనందంగా చేయవచ్చు. మనం ఎంతెక్కువగా సాక్ష్యమివ్వగలిగితే, ‘రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము’ సంపాదించుకునేలా ప్రజలకు సహాయం చేసే అవకాశాలు అంతెక్కువగా దొరుకుతాయి. (1 తిమో. 2:3, 4) మీరు సాయంకాలాల్లో సాక్ష్యమివ్వడానికి వీలుగా సర్దుబాట్లు చేసుకోగలరా?