బైబిలు నిరీక్షణను నడిపింపును ఇస్తుంది
1 “భూమిమీద సంతోషము—కేవలము కొద్దికాలమైనను దానిని అనుభవించు సాధ్యత కన్పించుటలేదు. రోగము, వృద్ధాప్యము, ఆకలి, నేరము—చెప్పుటకు కేవలము కొన్ని సమస్యలు మాత్రమే—తరచుగా జీవితమును దుఃఖదాయకము చేయును. కాబట్టి, భూమిమీద పరదైసులో జీవించుటనుగూర్చి మాట్లాడుట, సత్యము విషయమై కళ్లుమూసికొనుట అని మీరనవచ్చును. నిరంతరము జీవించుట కేవలము ఒక కల గనుక, దానిని గూర్చి మాట్లాడుట సమయమును వృథా చేయుటగా మీరు భావించవచ్చును.”
2 అలా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం మొదలౌతుంది. దాని ఉపోద్ఘాతం పద్నాలుగు సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రచురించినప్పటికంటే నేడు మరింత సబబుగా ఉంది. తమను వేధించే సమస్యలన్నింటి విషయంలో బైబిలు నడిపింపునిస్తుందని, వాటికో పరిష్కారముందని వాగ్దానం చేస్తోందని ప్రజలు తెలుసుకోవాలి. డిశంబరు నెలలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రజలకు అందించడం ద్వారా వారికి సహాయపడేందుకు మనం ప్రయత్నిస్తాము. అయితే, ఒక వ్యక్తికి ప్రచురణలిచ్చినంత మాత్రాన అతను రాజ్య నిరీక్షణను తప్పకుండా అంగీకరిస్తాడని కచ్చితంగా చెప్పలేమనుకోండి. బైబిలు పఠనాన్ని ప్రారంభించాలనే గురితో మనం పునర్దర్శనాలను చేయాలి. మనం అలాంటి ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా సహాయం లభిస్తుంది. (మత్త. 28:19, 20) అందించే విధానంలో ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి:
3 మీరు ఓ పెద్దమనిషిని కలిస్తే ఇలా మాట్లాడి చూడండి:
◼ “ఓ చిన్న ప్రశ్నండి: మీ చిన్నతనంలో మీ ప్రాంతంలోని ప్రజలు ఒకరితో ఒకరు ఎలా మసలుకునేవారంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, కాదంటారా? ఈ మార్పుకు కారణం ఏమైవుంటుందని మీరంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] నిజానికి మనం బైబిలులోని ఒక ప్రవచనం నెరవేర్పును చూస్తున్నాము. [2 తిమోతి 3:1-5 చదవండి.] నేడు లోకమున్న తీరును ఉన్నదివున్నట్లుగా వివరించడం మాత్రమే కాకుండా, సమీప భవిష్యత్తులో ఓ మంచి లోకం వస్తుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. బైబిలులోని అనేక ప్రవచనాలు నెరవేరాయి కనుక, భవిష్యత్తును గూర్చి అది చెప్పే విషయాలు కూడా నిజమౌతాయని మేము విశ్వసిస్తున్నాము. దేవుని నడిపింపు క్రింద ఉండే ఓ ప్రపంచ ప్రభుత్వం, బైబిలులో చేయబడిన అలాంటి వాగ్దానాల్లో ఒకటి.” నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 112వ పేజీకి త్రిప్పి 2వ పేరాను చదవండి. భవిష్యత్తు గూర్చి బైబిల్లో ఏ నిరీక్షణ ఉందో నేర్చుకునేందుకుగానూ ఈ పుస్తకాన్ని తీసుకోమని ఇంటివారిని ప్రోత్సహించండి.
4 “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని ఇచ్చిన ఆ పెద్దమనిషి దగ్గరకు తిరిగి వెళ్లినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితంవున్న జీవితంతో పోలిస్తే ఆధునిక సమాజం అనేక విషయాల్లో మరీ దారుణంగా తయారైందనే ఏకాభిప్రాయానికి మనం వచ్చాము. అయితే, భవిష్యత్తులో ఓ శ్రేష్ఠమైన లోకం వస్తుందనే ఉత్తరాపేక్షను బైబిలు అందిస్తోందని మీకు చూపాలని వచ్చాను. [ప్రకటన 21:3, 4 చదవండి.] మనమందరమూ మంచి పరిస్థితుల్లో జీవించాలని కోరుకుంటాము కనుక, ఈ విషయంపై బైబిలు ఇంకా ఏమీ చెబుతోందో మనం చూడాలి.” నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని 19వ అధ్యాయానికి త్రిప్పి 1-3 పేరాలను చదవండి. ఉచిత బైబిలు పఠనాన్ని నిర్వహిస్తామని చెప్పండి.
5 మీరు ఓ యువకునితో సంభాషిస్తుంటే, ఇలా చెప్పవచ్చు:
◼ “మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను: ఓ యౌవనుడిగా, భవిష్యత్తు విషయంలో ఆశాభావంతో ఉండేందుకు కారణాలున్నాయని మీరు భావిస్తున్నారా? భవిష్యత్తు మీకు ఎలా కనిపిస్తోందంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఓ మంచి విషయమేంటంటే, భవిష్యత్తు విషయంలో ఆశాభావంతో ఉండడానికి నిజమైన కారణం ఉంది. [కీర్తన 37:10, 11 చదవండి.] బైబిలూ దానిలోని విషయాల సంబంధంగా ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని మేము తెచ్చాము. బైబిలు చెబుతున్నవాటిని నమ్మేందుకు ఇది ఇచ్చే కారణాలను గమనించండి. [56వ పేజీలో ఉన్న 27వ పేరాలోని మొదటి మూడు లైన్లనూ 28వ పేరా మొత్తాన్ని చదవండి.] బైబిలు చెప్పేవాటిని మనం విశ్వసించవచ్చని నమ్మకం కుదిరితే, భవిష్యత్తును గూర్చి మనకు ఓ కచ్చితమైన నిరీక్షణ ఉంటుంది. మీరు ఈ పుస్తకాన్ని తీసుకుని చదవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.”
6 “నిరంతరము జీవించగలరు” పుస్తకాన్ని తీసుకున్న యువకుని దగ్గరకు మీరు తిరిగి వెళ్లినప్పుడు, ఇలా చెబుతూ ప్రారంభించవచ్చు:
◼ “భవిష్యత్తు గూర్చి మీకు ఎంత శ్రద్ధ ఉందో మీరు చెప్పింది విని నేను సంతోషించాను. ఓ ఆనందమయమైన మరియు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని మనకు వాగ్దానం చేసే ఓ బైబిలు వాక్యాన్ని నేను మీకు చూపించాను, జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ ఇంకొకటివుంది. [ప్రకటన 21:3, 4 చదవండి.] నేను మీకిచ్చి వెళ్లిన పుస్తకం బైబిలు దేవుడు ప్రేరేపించిన పరిశుద్ధ గ్రంథమనేందుకు ఒప్పింపజేసే రుజువునిస్తుంది. ఆ వాస్తవానికి అనేక రుజువులున్నాయి. అంటే దేవుని గూర్చి బైబిలు చెప్పేవాటిని అంగీకరించవచ్చని దాని భావం. [47వ పేజీలోని 1, 2 పేరాలను చదవండి.] మీకిష్టమైతే నేను మీతో ఉచితంగా బైబిలును పఠించాలనుకుంటున్నాను.” పఠనాన్ని అంగీకరిస్తే, అతని దగ్గర బైబిలు ఉందేమో కనుక్కోండి. లేకపోతే, నూతన లోక అనువాదము (ఆంగ్లం) బైబిలును గానీ లేక అతనికి కావల్సిన భాషలోని బైబిలును గానీ తీసుకువస్తామని చెప్పండి.
7 జీవిత సమస్యలను తాళుకునేందుకు అవసరమైన నడిపింపు ఎక్కడ దొరుకుతుందో తెలియనివారితో ఇలా మాట్లాడితే ప్రతిస్పందించవచ్చు:
◼ “ఇంచుమించు అందరూ గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటున్న కాలంలో మనం జీవిస్తున్నాము. నడిపింపుకొరకు అనేకులు అన్ని రకాల సలహాదారులవద్దకు వెళ్తారు. సహాయంకొరకు కొందరు మంత్రవాదుల దగ్గరకు వెళతారు. మనకు ప్రయోజనాన్ని చేకూర్చే మంచి సలహా ఎక్కడ దొరుకుతుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] అందరూ గ్రహించాల్సిన ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని గూర్చి బైబిలు చెబుతోంది.” యిర్మీయా 10:23 చదవండి. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 29వ అధ్యాయానికి తెరిచి 3వ పేరాను చదవండి. “బైబిలులో ఉన్న సూత్రాలను అనుసరించడం ద్వారా ఇప్పటి మన జీవితాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు, అంతేకాకుండా దేవుని రాజ్యం క్రింద మన సమస్యలన్నీ ఎలా తీసివేయబడతాయి అన్నవాటిని మీరు గ్రహించేందుకు ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. దీన్ని చదవడం మీకిష్టమేనా?” అంటూ ఆ పుస్తకాన్ని అందించండి.
8 మొదటి సందర్శనంలో మానవునికి నడిపింపు అవసరమన్న విషయాన్ని గూర్చి మీరు మాట్లాడినట్లైతే, పునర్దర్శనంలో ఇలా చెబుతూ మీరు మీ చర్చను కొనసాగించవచ్చు:
◼ “మొదట మనం కలిసినప్పుడు, మన జీవిత సమస్యలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు మనకు దేవుని నడిపింపు అవసరమన్న విషయాన్ని అంగీకరించాము. దాని విషయంలో, నేను మీకిచ్చిన పుస్తకంలోని చివరి వ్యాఖ్యానాలను మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. [నిరంతరము జీవించగలరు పుస్తకంలో 255 పేజీలోని 14-15 పేరాలను చదవండి.] మీకు ఉచిత బైబిలు పఠన కోర్సును ఇవ్వాలని నేననుకుంటున్నాను. దాన్ని ఎలా చేస్తారో ఇప్పుడే మీకు చూపిస్తాను.”
9 దేవుని వాక్య విలువను మన జీవితంలో దాని నడిపింపునూ గ్రహించేలా పెద్దలకూ పిన్నలకూ సహాయపడుతుండగా మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు.—కీర్త. 119:105.