భద్రపరచుకోండి
క్షేత్రసేవలో ఉపయోగించగల ప్రతిపాదనలు
ఆయా నెలల కోసమైన సాహిత్య ప్రతిపాదనలకు సిద్ధపడేందుకు క్రింద ఇవ్వబడిన సూచనలను ఉపయోగించండి.
యెహోవాకు సన్నిహితమవండి
“దేవుణ్ణి నమ్మే చాలామంది ఆయనకు సన్నిహితమవ్వాలని కోరుకుంటారు. తనకు సన్నిహితమవమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడనే విషయం మీకు తెలుసా? [యాకోబు 4:8 చదవండి.] ప్రజలు తమ సొంత బైబిలును ఉపయోగించి దేవునికి సన్నిహితులవడానికి సహాయపడేందుకే ఈ పుస్తకం రూపొందించబడింది.” 16వ పేజీలోని 1వ పేరా చదవండి.
“నేడు అన్యాయం పెరిగిపోతోంది. అది సరిగ్గా ఇక్కడ వర్ణించినట్లే ఉంది. [ప్రసంగి 8:9బి చదవండి.] దేవుడు అసలు ఈ విషయాలను పట్టించుకుంటాడా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. [119వ పేజీలో 4వ పేరాలోని మొదటి రెండు వాక్యాలు చదవండి.] దేవుడు కొంతకాలంపాటు అన్యాయాన్ని ఎందుకు అనుమతించాడో ఈ అధ్యాయం వివరిస్తోంది.”
మీపట్ల శ్రద్ధ చూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం)
“మనకు ఎదురయ్యే అతి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి దోహదపడే శ్రేష్ఠమైన సలహాలను మనం ఎక్కడ కనుగొనవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత మత్తయి 7:28, 29 చదవండి.] ఈ వచనాలు, యేసు కొండమీది ప్రసంగానికి ప్రజలు ఎలా ప్రతిస్పందించారో వివరిస్తున్నాయి. ఇతరులు దాని గురించి ఏమన్నారో గమనించండి. [152వ పేజీలోని వ్యాఖ్యానాలను చూపించండి.] ఈ అధ్యాయం యేసు జీవితం గురించి, ఆయన బోధల గురించి చర్చిస్తోంది.”
“‘ఒకవేళ దేవుడుంటే, ఈ లోకంలోని బాధలనూ అన్యాయాన్నీ తొలగించేందుకు ఆయన ఎప్పటికైనా చర్య తీసుకుంటాడా’ అని మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత ప్రకటన 21:3, 4 చదవండి.] బాధలను, వాటి మూలకారణాన్ని తొలగించేందుకు దేవుడు ఏమి చేస్తాడనే విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తోంది.” 10వ అధ్యాయాన్ని చూపించండి.
అప్రమత్తంగా ఉండండి!
“నేడు సర్వసాధారణమైపోయిన గంభీరమైన సమస్యల గురించి, విభ్రాంతి కలుగజేసే సంఘటనల గురించి ఎంతోమంది చింతిస్తున్నారు. [స్థానికంగా తెలిసిన ఒక ఉదాహరణను పేర్కొనండి.] ఇలాంటి విషయాలు, త్వరలోనే దేవుని ప్రభుత్వం భూసంబంధమైన విషయాలను తన ఆధీనంలోకి తీసుకోబోతుందని చూపించే ప్రపంచవ్యాప్త సూచనలో ఒక భాగమని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత మత్తయి 24:3, 7, 8; లూకా 21:7, 10, 11; లేదా 2 తిమోతి 3:1-5 వంటి అనువైన లేఖనాలను చదవండి.] ఈ సంఘటనల ప్రాముఖ్యతను గుర్తించి ఇప్పుడు అప్రమత్తంగా ఉండడం ఎందుకు అవశ్యం అనే విషయం గురించి ఈ బ్రోషుర్ చర్చిస్తోంది.”
“నేడు చాలామంది విభ్రాంతి కలుగజేసే సంఘటనలవల్ల లేదా తీవ్రమైన వ్యక్తిగత నష్టాలవల్ల ఆందోళనకు గురౌతున్నారు. అలాంటివి జరగకుండా ఆపుచేసేందుకు దేవుడెందుకు జోక్యం చేసుకోవడం లేదు అని కొందరు ఆశ్చర్యపోతుంటారు. మానవజాతిని బాధలనుండి విడిపించడానికి త్వరలోనే దేవుడు చర్య తీసుకుంటాడని బైబిలు మనకు హామీ ఇస్తోంది. [ప్రకటన 14:6, 7 చదవండి.] దేవుడు తీర్పు తీర్చినప్పుడు మానవజాతికి ఏమి సంభవిస్తుందో గమనించండి. [2 పేతురు 3:10, 13 చదవండి.] ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి ఈ బ్రోషుర్‌లో మరింత సమాచారం ఉంది.”
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
“ఇలాంటి అందమైన పరిసరాలలో జీవించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తే, మీరు ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తారా? [4-5 పేజీల్లోని చిత్రాన్ని చూపించి, ప్రతిస్పందించనివ్వండి.] ఇలాంటి జీవితాన్ని నిరంతరం ఆనందించడానికి మనమేమి చేయాలని దేవుని వాక్యం చెబుతుందో గమనించండి. [యోహాను 17:3 చదవండి.] మీరు నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఈ పుస్తకం సహాయం చేస్తుంది.” తిరిగి సందర్శించినప్పుడు 1వ అధ్యాయంలోని మొదటి ఐదు పేరాలు చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
188-9 పేజీలలో ఉన్న చిత్రం చూపించి అక్కడున్న మాటలను ఉపయోగించి గృహస్థుడిని ఇలా అడగండి: “దేవుని గురించిన జ్ఞానంతో ఈ భూమి నిండినప్పుడు మీరు పరదైసులో జీవించాలని నిరీక్షిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత యెషయా 11:9 చదవండి.] పరదైసు గురించి బైబిలు ఏమి చెబుతోంది, మనం దానిలో ఎలా స్థానం పొందవచ్చు అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది.” మళ్ళీ సందర్శించినప్పుడు మొదటి అధ్యాయంలోని 11-16 పేరాలు చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం)
“ప్రజలు ఈ సలహాను అనుసరించి జీవిస్తే ఈ లోకం ఇప్పటికంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? [మత్తయి 7:12ఎ చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] జీవించిన వారిలోకెల్లా గొప్ప బోధకుడు చెప్పిన అనేక పాఠాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.” 17వ అధ్యాయంలోని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.
“నేడు అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం ప్రాముఖ్యమని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 22:6 చదవండి.] పిల్లలకు చిన్నప్పటి నుండే శిక్షణనివ్వడం ప్రారంభించాలని తల్లిదండ్రులు ప్రోత్సహించబడ్డారని గమనించండి. అలా శిక్షణ ఇవ్వడానికి వారికి సహాయం చేయడానికి ఈ పుస్తకం రూపొందించబడింది.” 15వ లేదా 18వ అధ్యాయంలోని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.
“తమ పిల్లలు వేసే ప్రశ్నలనుబట్టి తల్లిదండ్రులు తరచూ ఆశ్చర్యపోతుంటారు. పిల్లలు వేసే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టంగా ఉంటుంది, కదా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ఎఫెసీయులు 6:4 చదవండి.] నేడు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఈ పుస్తకం సహాయకరంగా ఉంటుంది.” 11, 12 లేదా 34-36 అధ్యాయాల్లోని కొన్ని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.
జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం)
“మన ప్రాంతంలో జరుగుతున్న హింసా నేరాలు మనందరిని కలవరపరుస్తున్నాయి. ఈ సమస్యను ఎవరైనా నిజంగా పరిష్కరించగలరని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు పరిష్కరించగలడు.” 196వ పేజీ తెరచి, 19వ పేరాలో ఇవ్వబడిన సామెతలు 2:21, 22 వచనాలను చదివి, వాటి గురించి వ్యాఖ్యానించండి. 16వ అధ్యాయం శీర్షికను చూపించండి, తర్వాత పుస్తకాన్ని ప్రతిపాదించండి.
6వ పేజీ తెరచి ఈ విధంగా చెప్పండి: “మన అందమైన భూమి, దానిమీద ఉన్న జీవం యాదృచ్ఛికంగా వచ్చాయని అనేకమంది భావిస్తారు. భూమి ఎలా వచ్చిందనే విషయంలో ఏది సహేతుకమైన వివరణ అని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] సృష్టికర్త శక్తిమంతుడని, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పే బైబిలు మాటలను అనేక రుజువులు ధృవపరుస్తున్నాయి. ఆయనే నిజమైన దేవుడు, ఆయన పేరు యెహోవా.” కీర్తన 83:18 చదివి, భూమినంతా పరదైసుగా మార్చాలనే ఆయన సంకల్పం గురించి క్లుప్తంగా వివరించండి.
దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం)
“నేడు అనేక మతాలు ఉన్న కారణంగా, దేవుడు ఏ మతాన్ని ఆమోదిస్తున్నాడనే విషయాన్ని మనం ఎలా నిర్ధారించుకోవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” ప్రతిస్పందించిన తర్వాత, 377వ పేజీకి తిప్పండి. 7వ అంశాన్ని నొక్కిచెబుతూ, సత్య మతం అన్ని జాతులకు చెందిన మానవులను ఐక్యపరచాలనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నాడా అని గృహస్థుడిని అడగండి. ఉదహరించిన లేఖనాల్లో ఒకదానిని చదవండి, సమయము అనుమతిస్తే, పట్టికలోని ఇతర అంశాలను చర్చించండి. నిజమైన ఆసక్తి చూపించినట్లయితే పుస్తకాన్ని ప్రతిపాదించండి. అక్కడినుండి వెళ్లే ముందు మీరు ఇలా అడగవచ్చు, “సత్య మతం ఒక వ్యక్తి ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావం చూపాలి?” ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు పునర్ద్శనం కోసం ఏర్పాటు చేసుకోండి.
ఒక వ్యక్తి తాను ఒక ప్రముఖ మతానికి చెందిన సభ్యుణ్ణి అని చెబితే మీరు ఇలా అనవచ్చు: “వివిధ మతాలకు చెందినవారిని కలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. దేవుని కోసం మానవజాతి అనేక దిశలలో అన్వేషించింది. [సముచితమైతే, అపొస్తలుల కార్యములు 17:26, 27 చదవండి.] సాధారణంగా ప్రజలు తమ తల్లిదండ్రుల మతాన్ని అనుసరిస్తారు. [8వ పేజీలోని 12వ పేరాను చదవండి.] అయితే ఇతర మతాల గురించి ఎక్కువగా తెలుసుకోవడంవల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది, తెలియనివాటిని నేర్చుకోవచ్చు. ఈ పుస్తకం ప్రపంచంలోని ప్రముఖ మతాల ఆరంభం, వాటి ఆచారాలు, బోధల గురించి వివరిస్తోంది.” ఆ వ్యక్తి మతం గురించి పుస్తకంలోవున్న సమాచారాన్ని ఉదాహరణగా చూపించండి, ఆయా మతాల గురించి ఈ క్రింది పేజీల్లో ఉంది: సిక్కుల మతం (100-1); హిందూ మతం (116-17); బౌద్ధ మతం (141); టావోయిజమ్ (164-6); కన్‌ఫ్యూషియనిజమ్ (177); షింటో మతం (190-5); యూదా మతం (220-1); ఇస్లామ్ (289).
ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!
“[ఒక వార్తాంశాన్ని ప్రస్తావించండి] గురించి మీరు వినే ఉంటారు. విషాదకరమైన రీతిలో జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయినప్పుడు, బాధితుల కుటుంబాలకు ఎలాంటి ఓదార్పు ఇవ్వాలో అనేకులకు తెలియదు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు?” ప్రతిస్పందించనివ్వండి. తర్వాత 299వ పేజీ తెరిచి, అక్కడున్న పునరుత్థానం గురించిన చిత్రాన్ని చూపించండి. వెంటనే ఇలా చెప్పండి: “పరదైసు భూమిమీద జీవించేందుకు నీతిమంతులు, అనీతిమంతులు మళ్ళీ లేపబడతారని తెలుసుకొని అనేకులు ఆశ్చర్యచకితులౌతారు. [297వ పేజీలోని 17వ పేరాలో ఉల్లేఖించబడిన అపొస్తలుల కార్యములు 24:15 వ వచనాన్ని చదివి, 10వ పేరాలోని వివరణ ఇవ్వండి.] భవిష్యత్తు విషయంలో దేవుని సంకల్పం గురించి ఈ పుస్తకం ఇంకా అనేక ఆసక్తికరమైన వివరాలను చర్చిస్తోంది.”
బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం)
“మనం జీవిస్తున్న కాలంలో దాదాపు అందరూ గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది మార్గనిర్దేశం కోసం ఎంతోమంది సలహాదారుల దగ్గరకు వెళ్తారు. కొందరు సహాయం కోసం మాంత్రికుల దగ్గరకు వెళ్తారు. మనకు ప్రయోజనాన్ని చేకూర్చే మంచి సలహా ఎక్కడ దొరుకుతుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] మనమందరమూ గ్రహించవలసిన ఓ ప్రాముఖ్యమైన వాస్తవం గురించి బైబిలు చెబుతోంది. [2 తిమోతి 3: 16 చదవండి. తర్వాత 187వ పేజీ తెరిచి, 9వ పేరా చదవండి.] బైబిలు చెబుతున్న దానిని అనుసరించడంవల్ల ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన ఫలితాలు ఎలా లభిస్తాయో గ్రహించేందుకు ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది.”
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
“క్రిస్మస్ సెలవుల కాలంలో, చాలామంది యేసు గురించి ఆలోచిస్తుంటారు. అయితే లోకమంతటా ఎన్నో చెడు సంగతులు జరుగుతున్నాయి కాబట్టి, యేసుకు నిజంగా మనపట్ల శ్రద్ధ ఉందా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దాని గురించి మీరేమనుకుంటున్నారు?” జవాబివ్వనివ్వండి. 24వ అధ్యాయానికి తిప్పి, యేసు భూమ్మీదకు ఎందుకు వచ్చాడో క్లుప్తంగా చర్చించండి. తర్వాత యేసుకు ఇతరులపట్ల ఉన్న నిజమైన ప్రేమను నొక్కిచెబుతూ యోహాను 15:13 చదవండి.
“ఎవరైనా యేసుక్రీస్తును గురించి ప్రస్తావించినప్పుడు, చాలామంది ఆయనను ఒక బాలునిగా లేదా బాధను అనుభవిస్తూ చనిపోవడానికి సిద్ధంగావున్న వ్యక్తిగా ఊహించుకుంటారు. యేసు అనేసరికి వారికి ఆయన జనన మరణాలే గుర్తుకువస్తాయి. ఆయన తన జీవితకాలంలో చెప్పిన అద్భుతమైన విషయాలు, చేసిన ఆశ్చర్యకరమైన పనులు తరచూ గుర్తించబడకుండా పోతున్నాయి. ఆయన సాధించినది భూమ్మీద జీవించిన ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ఆయన మన కోసం చేసిన అద్భుతమైన విషయాలను మనము సాధ్యమైనంత ఎక్కువగా నేర్చుకోవడం ప్రాముఖ్యం.” యోహాను 17:3 చదవండి. ఉపోద్ఘాతం ఉన్న మొదటి పేజీని తెరిచి, నాలుగవ పేరాను చదవండి.
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
“మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నలాంటి సమస్యలతోనే జీవించాలన్నది దేవుని ఉద్దేశమని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత మత్తయి 6:9 చదవండి.] దేవుని రాజ్యం అంటే నిజంగా ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” 6వ పాఠం తెరిచి, ఆ పాఠం ప్రారంభంలో ఉన్న ప్రశ్నలను చదవండి. ఆ పాఠాన్ని చర్చించడం ప్రారంభించండి, లేదా తర్వాతి సందర్శనంలో చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
“ఆధునిక సమాజం ఎంత ప్రగతి సాధించినా, అనారోగ్యం, మరణం మానవజాతికి బాధను, దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. యేసు, అనారోగ్యంతో ఉన్నవారికి, వయసు పైబడినవారికి, చనిపోయినవారికి ఏమి చేస్తాడో మీకు తెలుసా?” ప్రతిస్పందించనివ్వండి. ఆ వ్యక్తి జవాబు తెలుసుకోవాలనుకుంటే, 5వ పాఠం తెరిచి, 5-6 పేరాల ప్రశ్నలను చదవండి. ఆ పేరాలను చర్చించండి, లేదా మళ్ళీ కలుసుకున్నప్పుడు చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
“జీవితపు ఒత్తిళ్ళతో వ్యవహరించడానికి సహాయం కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళవచ్చని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత రోమీయులు 15:4 చదవండి.] సమస్యలను సహించడానికి మనల్ని బలపరచగల ఉపదేశాన్ని, ఓదార్పును, నిరీక్షణను ప్రేరేపిత లేఖనాలు అందిస్తున్నాయని గమనించండి. బైబిలు చదవడంవల్ల మనం అధిక ప్రయోజనం ఎలా పొందవచ్చో తెలియజేసే సహాయకర సలహాలను ఈ పుస్తకం అందిస్తోంది.” 30వ పేజీలో పేర్కొనబడిన నాలుగు అంశాలను నొక్కిచెప్పండి.
“యేసు భూమ్మీద జీవించిన కాలం నుండి చాలామంది దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తున్నారు. ఆ రాజ్యం వచ్చినప్పుడు మానవజాతి ఎలాంటి మార్పులను చూస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత దానియేలు 2: 44 చదవండి.] దేవుని రాజ్యం అంటే ఏమిటి, అది ఏమి సాధిస్తుంది, దాని నీతియుక్తమైన పాలననుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు అనే విషయాలను ఈ పుస్తకం వివరిస్తోంది.” 92-3 పేజీల్లోని చిత్రాన్ని చూపించండి.