యౌవనులారా—మీ ఆత్మీయ గమ్యాలు ఏమిటి?
1 అర్థవంతమైన పనీ, చేరుకోదగిన గమ్యాలూ సంతోషాన్ని తీసుకురావడంలో ఎంత ప్రాముఖ్యమైనవో యెహోవాకు తెలుసు. (ఆదికాండము 1:28; 2:15, 19 చూడండి.) నేడు, యెహోవా తన ప్రజలకు ప్రకటించి, బోధించే నియామకాన్ని ఇచ్చాడు. పరదైసులో నిత్యజీవాన్ని పొందే తుది గమ్యం కూడా మనకుంది. ఈలోగా, మన శక్తుల్నీ వనరుల్నీ ప్రక్కకు మళ్లించకుండా జాగ్రత్తపడాలంటే మనం పురోభివృద్ధికరమైన ఆత్మీయగమ్యాల్ని పెట్టుకోవాల్సిన అవసరముంది.—1 కొరిం. 9:26.
2 యౌవనస్థులకు వాస్తవిక గమ్యాలు: యౌవనస్థులు వాళ్లవాళ్ల వ్యక్తిగత సామర్థ్యాల్నిబట్టి చేరుకొనదగ్గ దైవపరిపాలనా గమ్యాల్ని పెట్టుకోవాలి. (1 తిమో. 4:15) కొంతమంది మరీ చిన్నపిల్లలు, చదవడం కూడా నేర్చుకోక మునుపే బైబిల్లోని పుస్తకాలపేర్లను కంఠతాపట్టే గమ్యాన్ని చేరుకున్నారు. పిల్లలు అర్థవంతమైన వ్యాఖ్యానాల్ని చేయాలనే, దైవపరిపాలనా పాఠశాలలో భాగం వహించాలనే గమ్యాల్ని చేరుకొనగలిగేలా, కుటుంబ పఠనంద్వారా కూటాలకు సిద్ధపడడం నేర్చుకున్నారు. తమ తల్లిదండ్రుల్తో పిల్లలు ప్రాంతీయసేవకు వెళ్లినప్పుడు, వాళ్లు సాక్ష్యమివ్వడంలో భాగం వహించడాన్ని నేర్చుకున్నారు, అలాగే బాప్తిస్మము పొందని ప్రచారకులయ్యే గమ్యంవైపు పురోభివృద్ధిని సాధిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుట సమర్పణా బాప్తిస్మాల్ని గూర్చిన గమ్యాన్ని ఉంచాలి.
3 మీరో టీనేజర్ అయితే, మీ ఆత్మీయ గమ్యాల్లో ఏవి చేరివున్నాయి? జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైన గమ్యాలపై కేంద్రీకరించడంద్వారా ఇప్పుడే “నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” (ప్రసం. 12:2; కీర్త. 71:17) స్కూలుకు సెలవులు ఇచ్చిన నెలల్లో సహాయ పయినీరు సేవను ఎందుకు చేయకూడదు? ఓ క్రమ పయినీరుగా, పూర్తికాల పరిచర్యను చేపట్టాలని మీరు యోచించారా? భవిష్యత్తులో మీ ప్రాంతంలోనో లేక మరోచోట ఉన్న పరభాషా గుంపుకు లేక సంఘానికి మద్దతు ఇవ్వగలిగేలా ఓ క్రొత్త భాషను నేర్చుకుంటే ఎలావుంటుంది? బేతేల్లోనో లేక ప్రయాణ పైవిచారణకర్తలుగానో లేక మిషనరీలుగానో ఇప్పుడు సేవచేస్తున్నవారిలో అనేకులు, వాళ్లు స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ప్రత్యేక పూర్తికాల సేవను, తమ గమ్యంగా పెట్టుకున్నారు. మీరుకూడా అదే ఎందుకు చేయకూడదు?
4 చిరుప్రాయంలోనే ఉన్నప్పటికీ యేసు మాదిరిని అనుకరించడానికి కృషి చేయండి. 12 ఏళ్ల బాల్యదశలో ఉన్నప్పుడు కూడా, ఆయన ఆత్మీయ విషయాల్ని నిస్సంకోచంగా మాట్లాడాడు. (లూకా 2:42-49, 52) వ్యక్తిగత పఠనం చేయాలనే, బైబిల్ని అనుదినమూ చదవాలనే, కూటాల్లోనూ, సేవలోనూ, పరిణతి చెందిన క్రైస్తవులతో క్రమంగా సహవసించాలనే ప్రయోజనకరమైన గమ్యాల్ని మీకుగా మీరే పెట్టుకోవడం యేసు బోధించినట్లుగా దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులకు బోధించడంలో నైపుణ్యాన్ని సంపాదించడానికి మీకు సహాయపడుతుంది.