మనం బోధకులుగా ఉండవలసిన వారమై ఉన్నాము, కేవలం ప్రకటించువారమే కాదు
1 “యెహోవాసాక్షులు తమ సాక్ష్యంతో భూమిని అక్షరార్థంగానే నింపేశారు” అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇదెలా సాధ్యమైంది? మానవ బలంవలన లేక శక్తివలన కాదు, కానీ దేవుని ఆత్మ ఆయన సేవకులపై పనిచేస్తుండడం వలన సాధ్యమైంది, వారు తమ ప్రకటనా మరియు బోధనా నియామకాలను నెరవేర్చడానికి వివిధ ఏర్పాట్లను ఉపయోగించుకోవడం వలన సాధ్యమైంది.—జెక. 4:6; అపొ. 1:8.
2 మన ప్రకటనా పనిని నెరవేర్చడానికి ముద్రిత ప్రచురణలనేవి ఒక ప్రభావవంతమైన మాధ్యమంగా పనిచేశాయి. రాజ్య సువార్తను తెలియజేయడంలో సహాయపడేందుకు యెహోవాసాక్షులు ఎన్నో సంవత్సరాలుగా కోట్ల సంఖ్యలో పుస్తకాలు, బుక్లెట్లు, బ్రోషూర్లు, పత్రికలు, ట్రాక్టులు ముద్రించి పంపిణీ చేశారు. సాహిత్య ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని 1997 వార్షికపుస్తకము (ఆంగ్లం)లోని నివేదికలు చూపిస్తున్నాయి. నేటికి, తొమ్మిది కోట్లకుపైగా నూతన లోక అనువాదము ప్రతులు ముద్రించబడ్డాయి. ఒక్క సంవత్సరంలో అమెరికాలో ముద్రించబడిన కావలికోట, తేజరిల్లు! పత్రికల సంఖ్య 7.1 శాతం పెరిగింది. జర్మనీలో పత్రికల ఉత్పాదన 35 శాతం పెరిగింది. అక్కడ ముద్రితమయ్యే పత్రికల్లో మూడవ వంతు రష్యా ప్రాంతం కొరకే. ఇండియాలో, 1997 సేవా సంవత్సరంలో అందించిన పుస్తకాలు 1995 సేవా సంవత్సరం కన్నా 120 శాతం ఎక్కువ!
3 ఎందుకింత సాహిత్యం అవసరమౌతుంది? ప్రజలు ఎక్కడున్నా మనం వారికి సాక్ష్యమివ్వాలన్న ప్రోత్సాహానికి ప్రపంచవ్యాప్తంగా అమోఘమైన ప్రతిస్పందన లభించింది. మనమందరం మన సాక్ష్య పనిని—పబ్లిక్ స్థలాల్లో, వీధుల్లో, వ్యాపార ప్రాంతాల్లో—వ్యాప్తిచేస్తుండగా ఆసక్తి చూపించిన ప్రజలకు గొప్ప మొత్తంలో సాహిత్యాన్ని అందించడం జరిగింది. వీరిలో చాలామందికి ఇంతకు మునుపు రాజ్య సందేశాన్ని వినే అవకాశం అసలంటూ దొరికితే చాలా తక్కువగా దొరికింది. ఈ ఆవశ్యకతను తీర్చడానికిగాను, మనం చేసే పరిచర్యలోని అన్ని రంగాల్లో ఉపయోగించడానికి వివిధ రకాల ప్రచురణలను సంఘాలు అందుబాటులో ఉంచుకుంటాయి.
4 సాహిత్యాన్ని పంపిణీ చేయడంలో మన లక్ష్యం ఏమిటి? సాహిత్యాన్ని కేవలం అందించడమే మన లక్ష్యం కాదు. శిష్యుల్ని చేసే పనిలో రెండు అంశాలు ఉన్నాయి—ప్రకటించడం, బోధించడం. మొదటిగా, మనకు రాజ్య సువార్తను ప్రకటించే ఆధిక్యత, కేవలం ఆ రాజ్యమే మానవజాతికి ఏకైక నిరీక్షణ అని ప్రజలు తెలుసుకునేలా చేసే ఆధిక్యత ఉంది. (మత్త. 10:7; 24:14) మన బైబిలు-ఆధారిత సాహిత్యము కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది. ఆసక్తిని రేకెత్తించడానికీ రాజ్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికీ అది ప్రభావవంతమైన మాధ్యమము.
5 రెండవదిగా, మనం శిష్యుల్ని చేయాలంటే, యేసు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మనం బోధించాలి. (మత్త. 11:1; 28:19, 20) మళ్లీ ఇక్కడకూడా, సాహిత్యము ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం సత్యాన్ని విద్యార్థుల హృదయ లోతుల్లో నాటడంలోనూ, శిష్యులు కావడానికి వారికి సహాయం చేయడంలోనూ సాహిత్యం కీలకమైన పాత్రను వహిస్తుంది.
6 సాహిత్యాన్ని స్వీకరించేవారు ‘వాక్యమును వినువారై’ ఉండవచ్చు, కానీ వారి మానాన వారిని అలాగే విడిచిపెట్టేస్తే, వారు వాక్య ప్రకారం ప్రవర్తించేవారయ్యే అవకాశం తక్కువ. (యాకో. 1:22-25) ఎవరో ఒకరు త్రోవ చూపకపోతే శిష్యులయ్యే అవకాశం తక్కువ. (అపొ. 8:30, 31) లేఖనాల్లో ఉన్న సత్యాన్ని తమకు తాముగా సరిచూసి తెలుసుకోవడంలో వారికి సహాయపడేందుకు వారికి ఒక బోధకుడు అవసరం. (అపొ. 17:2, 3) సమర్పణ, బాప్తిస్మము వరకు ప్రగతి సాధించడానికి వారికి సహాయం చేయడమే మన లక్ష్యం. అందులో ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని పొందేలా వారికి శిక్షణనివ్వడం కూడా ఇమిడివుంది.—2 తిమో. 2:2.
7 మరింత ఎక్కువమంది బోధకుల అవసరతే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది: మనం ప్రకటిస్తున్నామంటే, మనం బహిరంగంగా సువార్తను వెల్లడిచేస్తున్నామని అర్థం. అయితే, బోధించడంలో ఒకరికి క్రమంగా ఉపదేశించడం ఇమిడివుంది. ప్రకటించడం రాజ్య సందేశాన్ని గురించి ఇతరులు తెలుసుకునేలా చేస్తే, బోధించడం ఆ సువార్తను స్వీకరించి దానికి అనుగుణ్యంగా చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. (లూకా 8:15) బోధకుడంటే అర్థం కేవలం ప్రకటనాపని చేసేవాడని మాత్రమే కాదు; ఆయన వివరిస్తాడు, చక్కని వాదనతో తర్కిస్తాడు, ఋజువులు చూపిస్తాడు, ఒప్పిస్తాడు.
8 సాధ్యమైనంత మట్టుకు మనలో అనేకులం బోధకులముగా ఉండవలసిన అవసరం ఉంది, కేవలం ప్రకటించువారముగానే కాదు. (హెబ్రీ. 5:12 ఎ) మనం చేసే పనిలో సాహిత్య పంపిణీ ఒక కీలకమైన భాగం, కానీ మన పరిచర్యలోని రెండవ లక్ష్యం సాధించడం బోధకులుగా మనం ఏమి చేస్తామన్న దానిపైనే చివరికి ఆధారపడి ఉంటుంది. మనం సాహిత్యాన్ని అందించగల్గినప్పుడు సంతృప్తిపడినప్పటికీ, మన పరిచర్యను సంపూర్ణముగా జరిగించాలంటే సాహిత్యాన్ని ఇవ్వడమే మన ఆఖరి లక్ష్యంగా దృష్టించకూడదు. (2 తిమో. 4:5) సాహిత్య అందింపులు సత్యాన్ని ఇతరులకు బోధించడానికి అవకాశాలను తెరిచే ప్రభావవంతమైన మాధ్యమాలు.
9 బైబిలు పఠనాలను ప్రారంభించడానికి పునర్దర్శనాలను చేయండి: బహుశ మనమందరము అనేక పుస్తకాలను, బ్రోషూర్లను, పత్రికలను అందించి పునర్దర్శనాల లిస్టును తయారుచేసి ఉంటాము. వారిలో ఆసక్తిని రేకెత్తించే ఉద్దేశంతో మనం వారిని తిరిగి కలుసుకోవడానికి ఒక క్రమమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తిరిగి వెళ్లడంలో మన ప్రధాన ఉద్దేశం కేవలం మరిన్ని సాహిత్యాల్ని వారికి ఇవ్వడం కాదు గాని, వారి దగ్గర అప్పటికే ఉన్నవాటిని చదివి వాటినుండి ప్రయోజనం పొందడానికి ప్రజల్ని ప్రోత్సహించడమే. గతంలో కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడంలో మనకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు మన దగ్గరికి మళ్లీ మళ్లీ రాకపోయివుండుంటే మనం మాత్రం ఎంత ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించేవాళ్లం?—యోహా. 17:3.
10 దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరులోనుండో లేకపోతే నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోనుండో బైబిలు పఠనం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆసక్తి చూపించిన ప్రతి చోటికి తిరిగి వెళ్లండి. ఈ రెండు ప్రచురణలు సులభంగా అర్థం చేసుకునే రీతిలో రాజ్య సందేశాన్ని అందిస్తాయి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులో బైబిలులోని ప్రాథమిక బోధలను చర్చించే ఒక సమగ్రమైన పఠన కోర్సు ఉంది. జ్ఞానము పుస్తకము సత్యాన్ని మరింత వివరముగా బోధించడానికి సహాయపడుతుంది, అంతేగాక సులభంగాను, స్పష్టంగాను, సంక్షిప్తంగాను ఉంటుందా పుస్తకం.
11 జూన్ 1996 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్లో వివరించబడిన సులభతరమైన బోధనా కార్యక్రమం, బోధకుడు ఉపదేశించడాన్నీ, విద్యార్థి నేర్చుకోవడాన్నీ సులభతరం చేస్తుంది. ఎంతో ప్రభావవంతంగా ఉన్నట్లు రుజువైన అందులోని బోధనా పద్ధతుల్నీ టెక్నిక్లనూ సమీక్షించడానికి ఆ ఇన్సర్ట్ని మీకు అందుబాటులో ఉంచుకోండి. విద్యార్థిలో యథార్థమైన వ్యక్తిగత ఆసక్తి ఎలా తీసుకోవచ్చు, ఒక్కసారికి ఎంత సమాచారాన్ని పూర్తిచేయవచ్చు, విషయానికి సంబంధించని ప్రశ్నలతో ఎలా వ్యవహరించవచ్చు, విద్యార్థీ బోధకుడూ ఇద్దరూ పఠనం కొరకు ఎలా సిద్ధపడవచ్చు, విద్యార్థిని యెహోవా సంస్థవైపుకి ఎలా మళ్లించవచ్చు అనే విషయాల్లో ఆ ఇన్సర్ట్ కొన్ని సలహాలను ఇస్తుంది. ఆ సలహాలను అనుసరిస్తూ మనమందరం క్రొత్తవారమైనా సరే పురోభివృద్ధికరమైన పఠనాల్ని నిర్వహించగల్గుతాము.
12 ఫీల్డ్ నుండి వచ్చిన చక్కని విజయాల నివేదికలు: దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు, జ్ఞానము పుస్తకము ఈ రెండూ శిష్యుల్ని చేసే పనిని వేగిరం చేసే ప్రక్రియలో విలువైన ఉపకరణాలుగా రుజువయ్యాయి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు చేతికి వచ్చిన తర్వాత బొలీవియాలోని ఒక సహోదరుడు వెంటనే ఒక వ్యక్తితో పఠనాన్ని ప్రారంభించడానికి దాన్ని ఉపయోగించాడు. ఈ విద్యార్థి నాలుగు నెలల తర్వాత జిల్లా సమావేశంలో బాప్తిస్మంపొందిన ఆనందభరితులైన వారిలో ఉన్నాడు!
13 జ్ఞానము పుస్తకంలో పఠనాన్ని ముగించిన తర్వాత యెహోవాకు తమ జీవితాల్ని సమర్పించుకోవడానికి చాలామంది ప్రేరేపించబడ్డారు. అంగోలాలోని ఒక సంఘంలోని ప్రాంతంలో జ్ఞానము పుస్తకం ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే ప్రచారకులు నిర్వహించే బైబిలు పఠనాల సంఖ్య 190 నుండి 260కి పెరిగింది, కూటాల హాజరు 180 నుండి 360కి పెరిగి రెండింతలైంది. అటుతర్వాత కొంతకాలానికే, మరో సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
14 జ్ఞానము పుస్తకంలో తన మొదటి పఠనాన్ని ప్రారంభించిన తర్వాత ఒక సహోదరుడు, “పఠన నిర్వాహకుడు కేవలం ప్రశ్నలను అడుగుతూ, అన్వయించదగ్గ కొన్ని లేఖనాల్ని చదువుతూ, విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడని నిశ్చయపర్చుకుంటూ” ఉంటే పఠనాన్ని నిర్వహించడం “సులభమని” చెప్పాడు. చాలా సమర్థులైన ప్రచారకులు మాత్రమే పురోభివృద్ధికరమైన పఠనాల్ని నిర్వహించగలరనీ తాను ఎన్నడూ అటువంటి పఠనాలు నిర్వహించలేడనీ తాను ఇంతకాలం భావించినప్పటికీ ఇప్పుడు తాను కూడా నిర్వహించగలడని గ్రహించి ఇలా అంటున్నాడు: “నేనే చేయగల్గుతున్నాను; కాబట్టి, ఎవరైనా చేయగలరు.”
15 మన పరిచర్యలో భాగంగా బైబిలు పఠనాలను నిర్వహించడం ద్వారానే మనం శిష్యుల్ని చేసే లక్ష్యాన్ని సాధించగలము. పరిచర్యలోని ఈ రంగంలో భాగం వహించడానికి తమ సామర్థ్యాన్ని పెంచుకున్నవారు అది నిజంగా సంతృప్తికరంగాను, చాలా ప్రతిఫలదాయకంగాను ఉన్నట్లు తెలుసుకున్నారు. అప్పుడు, మనం కూడా “పూర్ణధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచు” ఉన్నామని మన గురించి చెబుతారు.—అపొ. 28:31.