యెహోవా ఆరాధనాస్థలం ఎడల గౌరవాన్ని చూపండి
1 మనం ఎవరింట్లోనైనా అతిథులుగా ఉన్నప్పుడు, ఆ ఇంటివారి సొత్తును ఏ విధంగానూ పాడుచేయకుండా దాని ఎడల గౌరవాన్ని చూపిస్తాం, మరి ఆ ఇంటివారి క్రమబద్ధమైన దైనందిన కార్యక్రమాలకు అంతరాయాన్ని కల్గించం. మనం యెహోవా అతిథులుగా ఉన్నప్పుడు మరి ఇదింకెంత వాస్తవమై ఉండాలి! ఆయన ఇంటివారితో మనమెలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాల్సిందే. (కీర్త. 15:1; 1 తిమో. 3:15) మన క్రైస్తవ కూటాల్ని జరుపుకునేది రాజ్యమందిరంలోనైనా సరే, ఎవరో ఒకరి ఇంట్లోనైనా సరే, లేక ప్రజా వసతిలోనైనా సరే మన ఆరాధనాస్థలం ఎడల అంటే ఎవరి ‘ప్రభావమైతే భూమ్యాకాశాలకు పైగావుందో’ ఆ యెహోవా దేవుని మందిరమే అది అన్నట్టుగా దాని ఎడల మనలో అత్యధికులం ఎల్లవేళలా గౌరవాన్ని చూపిస్తాం.—కీర్త. 148:13.
2 కొంతమంది సహోదరులు చప్పుడు చేస్తూనో లేక ఇవ్వబడుతున్న ప్రసంగం అంత ప్రాముఖ్యమైనదికాదన్నట్టు ప్రవర్తిస్తూనో కూటాల ఎడల గౌరవలేమిని చూపిస్తున్నారు. కూటం జరుగుతుండగా వరండాలో, లిటరేచర్, మ్యాగజిన్ కౌంటర్ల చుట్టు ప్రక్కలా, టాయిలెట్లలో లేక రాజ్యమందిరానికి వెలుపల కొంతమంది వయోజనులైన వ్యక్తులు అనవసరమైన సంభాషణ కొనసాగిస్తారు. తమ్మున్నో చెల్లినో చూడమని అన్నకో అక్కకో అప్పగిస్తే కొన్నిసార్లు వాళ్లిద్దరూ కలిసి ఆడుకుంటూ, కార్యక్రమం నుండి పొందే ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. కొంతమంది పిల్లలు కూటాల తర్వాత రాజ్యమందిరానికి వెలుపల ఆడుకుంటూ, అమితంగా అల్లరిచేస్తూ, ఒకరిపై మరొకరు కరాటే ఫోజులు కొడుతూ కన్పించారు. మరి కొన్ని సందర్భాల్లోనైతే, వాళ్లు ఇరుగుపొరుగునున్న వారికి అంతరాయాన్ని కల్గించడమో లేక వీధిలో రాకపోకలకు అంతరాయాన్ని కల్గించడమో చేశారు.
3 గౌరవంలేనివారిగా ఉండకుండా ఎలా జాగ్రత్తపడగలం: మన ఆరాధన ప్రాముఖ్యతనూ, పవిత్రతనూ గుణగ్రహించినప్పుడు, మనం గుసగుసలాడుతూ, తింటూ, ఛూయింగ్ గమ్‌ను నములుతూ, కాగితాల్ని నలుపుతూ, టాయిలెట్లకు అనవసరంగా వెళ్తూ లేక కూటాలకు అలవాటుగా ఆలస్యంగా వస్తూ ఇతరులకు అంతరాయం కల్గించాలని కోరుకోం. రాజ్యమందిరంలో గానీ, పుస్తక పఠనం జరిగే ఇంటిలో గానీ నేలమీద చెత్తాచెదారాన్ని పారవేయడానికో లేక కుర్చీల్నిగానీ గోడల్నిగానీ మురికి చేయడానికో మర్యాదా మెప్పుదలలుగల తల్లిదండ్రులు తమ పిల్లల్ని అనుమతించరు. మన కూటాల్లో ఎటువంటి అవమానకరమైన ప్రవర్తనకూ, అవివేక సంభాషణలకూ లేక అసభ్యమైన పరిహాసాలకూ తావు లేదనే విషయాన్ని మనమంతా ఒప్పుకుంటామనడంలో సందేహం లేదు.—ఎఫె. 5:4.
4 మన క్రైస్తవ కూటాల ఉద్దేశాన్ని మనమన్ని వేళలా జ్ఞాపకముంచుకుంటే, మనమెక్కడ ‘ఉండాలని కోరుకున్నామో’ ఆ స్థలంలో యెహోవా ఆరాధన ఎడల తగిన గౌరవాన్ని మనమూ మన పిల్లలూ చూపించేలా నిశ్చయపర్చుకుందాం.—కీర్త. 84:10.